సాగర్ ఒకరోజు పుస్తకం కోసం అలమరపై వెదుకుతుండగా మూడు చిన్నచిన్న మైనపు సంచుల్లో పసుపు కుంకుమ అద్దిన చేప తల నుండి తోక వరకు ఉన్న ముళ్ళు కనిపించాయి.అసలే సాగర్ కి అనుమానాలు ఎక్కువ.వాటి గురించి తెలిసిన వాళ్ళకు ఫోను చేస్తే నిన్ను దెబ్బ తీయడానికి చేతబడి చేశారు అని చెప్పి వాటిని ఎక్కడో ఒక చోట బయటపెట్టి ఉంచితే వచ్చి వాటిని పట్టుకెళ్ళి బాగు చేస్తామని చెప్పారు.దానికితోడు సాగర్ కాలుజారి కిందపడటంతో ఆరు వారాలు మంచంపై నుండి కదలకుండా ముఖ్యమైన పనులకు మాత్రమే లేస్తూ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.ఇంకేముంది?నాకు చేతబడి చేశారంటూ వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం మొదలు పెట్టాడు. వాళ్ళల్లో కొంతమంది సాగర్ ను చూడటానికి వచ్చి తానంటే తందాన అంటూ అవును చేతబడి అయి ఉంటుంది.చేప ముళ్ళుతో పసుపు కుంకుమతో ఇంట్లో వేశారంటే అదే అంటూ మాట్లాడుతున్నారు.ఈరోజుల్లో కూడా చేతబడులు చేసేవాళ్ళు ఉన్నారంటే నమ్మటం,నమ్మకపోవటం తర్వాత సంగతి కానీ ప్రస్తుతం అందరికీ ఇదొక కాలక్షేపం అయిపోయింది.
Wednesday, 14 September 2016
Tuesday, 13 September 2016
శాశ్వతం కాదని
లక్ష్మీ దేవి ఒక్క రోజులో వాడిపోయే కలువ పూవులోఎందుకు దర్శనం ఇస్తుందో తెలుసా?అంత లోతుగా ఆలోచించే తీరిక,ఓపిక మనందరికీ ఉండక పోవచ్చు.తెలిస్తే మనలో చాలా మంది డబ్బు కోసం అదేపనిగా వెంపర్లాడి తరతరాలు కూర్చుని తినేంత సంపాదించాలని అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళని కూడా లేకుండా వెన్నుపోటు పొడవటం,స్నేహితులను,కనిపించిన వాళ్ళను అడ్డంగా మోసగించడం,డబ్బు కోసం అవినీతికి పాల్పడడం చేయరు.ఎందు కంటే ధనం శాశ్వతం కాదని ఏదో ఒక రోజు మాయమై పోవచ్చని అంటే కలువ పూవులా ఈరోజు ఉంటుంది రేపు పోతుందని తెలియచెప్పడానికే లక్మీదేవి కలువ పువ్వులోదర్శనం ఇస్తుంది.జీవితం శాశ్వతం కాదు డబ్బు అంతకన్నాశాశ్వతం కాదు అన్న పరమార్ధం అర్ధం చేసుకుని సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తూ డబ్బే లోకంగా అడ్డదారులు తొక్కకుండా ఉండడం మంచిది.
Monday, 12 September 2016
అతి తెలివి తక్కువ చేష్టలు
అనకాపల్లి వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఏ వస్తువు దొరకనిదంటూ లేదు.కాకపోతే అమెరికాలో కొంచెం ఖరీదు ఉండొచ్చు.తెలిసో తెలియకో కొంతమంది నిత్యావసర వస్తువులు వంటి ఇడ్లీ రవ్వ,పిండి,పప్పులు,జీలకర్ర,కరివేపాకు,రకరకాల పచ్చళ్ళు,స్వీట్లు అన్నీ చుట్టబెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు.అమెరికా విమానాశ్రయంలో చెకింగ్ చేసేటప్పుడు కొంత మంది ఉద్యోగులు నవ్వుకుని చూసీ చూడనట్లు వదిలేస్తారు.ఈమధ్య ఒకాయన కోడలు తెమ్మని చెప్పిందని కోడి మాంసం,రొయ్యలు పచ్చళ్ళు తీసుకెళ్ళి అవి మామూలు పచ్చళ్ళు అని బుకాయించేసరికి 150 డాలర్లు జరిమానా వేశాడు.అయినా వాదిస్తుంటే అక్కడి ఉద్యోగికి ఒళ్ళు మండి ఒక గంట పక్కన నిలబెట్టి పాకెట్ తెరిచి చూచి 500 డాలర్లు కట్టి వెళ్ళమన్నాడు.చచ్చినట్లు నోరుమూసుకుని డబ్బు కట్టి బ్రతుకు జీవుడా!అని బయట పడ్డాడు. ఇంకొక ఆమె కరివేపాకు,జీరా,వేరుసెనగ పప్పులు నానా చెత్త చెదారం మూటకట్టి సూట్ కేసులో పెట్టుకుంది.ఇవ్వన్నీఇక్కడకు తీసుకు రాకూడదు అని అమాయకురాలు అనుకుని 100 డాలర్లు జరిమానా కట్టమన్నాడు.నా దగ్గర డబ్బులు లేవు నేను కట్టను అని మాట్లాడేసరికి స్కాన్ చేసినప్పుడు డబ్బులు ఉన్న విషయం కనిపిస్తుంది కదా!అబద్దం చెపుతుందని బాగ్ తెరిపించి 350 డాలర్లు వేశాడు.పై ఇద్దరు కూడా తప్పు ఒప్పుకుని మొదటే కడితే సరిపోయేది కదా!చేసేది తప్పు కాక అబద్దాలు,వాదనలు.వాదించడానికి కూడా అర్ధం ఉండాలి.అతి తెలివి కలవాళ్ళం అనుకునే తెలివి తక్కువ చేష్టలు.ఇలాంటివన్నీ అతి తెలివి తక్కువ చేష్టలు అన్నమాట.ఒకాయన ఆమధ్య దుబాయ్ కొడుకు దగ్గరకు వెళ్తూ సోంపు గింజలు తెలియక తీసుకెళ్ళి జైలు పాలయ్యాడు.బయటకు తీసుకురావటం చాలా కష్టం అయింది.వెళ్ళేముందు ఒక్కసారి అతర్జాలంలో ఏ దేశానికి ఏమేమి వస్తువులు తీసుకెళ్ళవచ్చో అనేది తెలుస్తుంది.అప్పుడు ఏ సమస్యా ఉండదు.
కూర్చో,నిల్చో
మనందరినీ చిన్నప్పుడు కూర్చో,నిల్చో అంటూ ఏకాగ్రత కోసం తరగతి గదిలో ఉపాధ్యాయులు వ్యాయామం చేయించేవాళ్ళు.చాదస్తం కాకపోతే పాఠాలు చెప్పకుండా ఇంతసేపు పిల్లల్ని ఇబ్బంది పెట్టి చేయించాలా?అంటూ తిట్టుకునేవాళ్ళం.అది ఒక మంచి వ్యాయామం కూడా అని మనకు అప్పుడు తెలియదు.ఇప్పుడు చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ పెద్దవాళ్ళు రోజు ఉదయం,సాయంత్రం కాసేపు కూర్చోవటం,నిల్చోవడం చేస్తుంటే బరువు పెరగకుండా ఉంటారని నిపుణుల సూచన.దీనితో పాటు చేతులు,కాళ్ళు కదిలించుతూ చిన్నచిన్న వ్యాయామాలు చేస్తుంటే బరువు అదుపులో ఉండి సంపూర్ణ ఆరోగ్యం స్వంతమవుతుంది.
బొజ్జ పెరిగితే....
బొజ్జ పెరిగితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని మనందరికీ తెలుసు.అయినా మన అలవాట్లు అంత త్వరగా మార్చుకోలేము.నూనె తగ్గించి కూర వండితే నోటికి రుచిగా ఉండదనే అపోహతో తగ్గిద్దామని మనసులో ఉన్నా అలవాటులో పొరపాటు అన్నట్లు తెలియకుండానే ఎక్కువ నూనె వేసి అవసరం లేకున్నా గుజ్జు కూరలకు కూడా వేస్తుంటాము.వేపుళ్ళు అయితే చెప్పనవసరం లేదు.దీనికి తోడు తీపి పదార్ధాలు,అప్పడాలు,వడియాలు,పచ్చళ్ళు,ఐస్ క్రీమ్ ఇలా షడ్రుచులతో రోజూ భోజనం చేసి వెంటనే పగలు రాత్రి కూడా నిద్ర పోతుంటాము.మాంసాహారం అయితే చెప్పనక్కరలేదు.ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటలైనా నిద్ర పోకూడదు.వెంటనే నిద్ర పోవటంతో పొట్ట పెరిగి క్రమంగా రోగాల బారిన పడవలసి వస్తుంది.ఒక్కసారి పొట్ట పెరిగిందంటే తగ్గటం కష్టం.తగ్గించుకోవటానికి కూడా చాలా కష్టపడవలసి వస్తుంది.బొజ్జ పెరిగిందంటే ముందుగా వచ్చేది మధుమేహం.తర్వాత వరుసగా గుండె,మూత్రపిండాల సమస్యలు,పక్షవాతం,కాన్సర్,ఒక్కటేమిటి? అన్నీ చుట్టుముట్టవచ్చు.అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ,మితంగా తింటూ బొజ్జ పెరగకుండా ముందే జాగ్రత్త పడటం మంచిది.దీనితో పాటు బత్తాయి,నిమ్మ,నారింజ,కమలా పండ్లు వంటివి ఎక్కువగా తినాలి.ఇవి బరువుని నియంత్రిస్తాయి.
Friday, 9 September 2016
అతి పెద్ద ఆయుధాలు
ప్రపంచంలో అతి పెద్ద ఆయుధాలు రెండే రెండు.అవి ఏంటయ్యా!అంటే ఒకటి మౌనం,రెండు మందహాసం.మౌనం ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు.మందహాసం ఎన్నో ప్రశ్నలను దగ్గరకు
రానివ్వదు.ఈ రెండు మన దగ్గర ఉంటే మనం ధన్యులం.ఎవరూ మనల్నిప్రశ్నించే సాహసం చెయ్యరు.వేలెత్తి చూపే ఆస్కారం అంతకన్నా ఉండదు.ప్రశాంతమైన జీవితం మన స్వంతం.
ఎవరి గౌరవం వాళ్ళు
లక్ష్మణ్,లక్షణ ఇద్దరు భార్యాభర్తలు.ఎక్కడకు వెళ్ళినా ఇద్దరూ ఎప్పుడూ జంట పక్షుల మాదిరిగా కలిసే వెళ్తారు.వాళ్ళకు ఇద్దరు పిల్లలు.పిల్లలు చిన్న వాళ్ళయినా అబ్బాయిని మంచి స్కూల్లో చదివించాలని ఊహ తెలిసినప్పటి నుండి హాస్టల్లో పెట్టారు.అమ్మాయిని అమ్మ దగ్గరో,అత్త దగ్గరో వదిలేసి ఎక్కడంటే అక్కడకు వెళ్ళిపోయేవాళ్ళు.అందుకే ఇద్దరు బాగానే చదువుకున్నాపిల్లలకు,పెద్దలకు ప్రేమాభిమానాలు ఉన్నా అంతగా బలపడలేదు.అబ్బాయి విదేశాలలో ఉన్నాడు.అనుకోకుండా అమ్మాయి విదేశాలకు వెళ్ళింది.ఇక్కడ ఉన్నప్పుడే ఒక బిడ్డ పుట్టాడు.అక్కడకు వెళ్ళాక ఇంకో బిడ్డకు జన్మనివ్వడంతో సమస్య మొదలయింది.నాన్నకు రావడానికి వీలుపడదు అని చెప్పినా సరే అమ్మను తన వద్దకు రావాల్సిందేనని పిల్లలతో ఇబ్బందిగా ఉందని ఆరు నెలలు తన దగ్గర ఉండాలని మంకు పట్టు పట్టుకుని కూర్చుంది.ఒకసారి వాయిదా వేసినా రెండోసారి లక్షణకు వెళ్ళక తప్పింది కాదు.వెళ్ళే సమయం దగ్గర పడుతున్న కొద్దీ భర్త తీరిక దొరకగానే వస్తానని ఎంతగా నచ్చచెప్పినా ఇటు భర్తను వదిలి ఉండలేక,ఒంటరిగా వెళ్ళడం ఇష్టంలేక దిగులుతో నాలుగురోజుల ముందు నుండి అన్నం కూడా తినడం మానేసింది.కాలం ఆగదు కదా!వెళ్ళే రోజు రానే వచ్చింది.విమానాశ్రయం లోపలకు వెళ్ళేవరకు భర్తను అంటిపెట్టుకుని అతని చేతిని వదలకుండా చివరకు ఏడ్చేసింది.భార్య ఏడుపు చూచి భర్తకు కూడా ఏడుపు వచ్చేసింది.మిగతా వాళ్ళకు విషయం అర్ధం కాకపోయినా వీళ్ళతో వచ్చిన వాళ్ళకు మాత్రం ఈ జంట పక్షులు నడివయసు వచ్చినా ప్రేమపక్షుల మాదిరిగా ఒకరినొకరు వదిలలేనట్లుగా వెళ్తుంటే వీళ్ళు విడివిడిగా అన్ని రోజులు ఎలా ఉండగలరో ఏంటో?అనిపించింది.పిల్లలు కూడా వాళ్ళ అవసరమే ముఖ్యం అనుకోకుండా పెద్దల మనోభావాలు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.పెద్దలు కూడా పిల్లల అవసరాలు గుర్తించి మసులుకుంటే సమస్యలు ఉండవు.సాధ్యమైనంత వరకు పెద్దలైనా,పిల్లలైనా ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోనేలా ఉంటే ఎవరి గౌరవం వాళ్ళు దక్కించుకున్నట్లు అవుతుంది.
Subscribe to:
Posts (Atom)
