Thursday, 24 August 2017

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                  ఏ పని మొదలు పెట్టినా విఘ్నాలు కలుగకుండా అన్నింటా విజయం చేకూర్చాలని సర్వదా విఘ్నేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరియందు ప్రసరించాలని ప్రార్ధిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.            
                    
                              

Tuesday, 22 August 2017

వజ్రాల పెట్టె

                                                          మనసు ఒక వజ్రాల పెట్టె. జాలి,దయ,ప్రేమ,శాంతం,సంతోషం వంటి మంచి భావాలతో మనసు నింపాలి.అంతే కానీ మనసులో కోపం,ద్వేషం,అసూయ వంటి పనికిమాలిన చెత్త నింపకూడదు.దీనివల్ల మనసు ప్రశాంతత కోల్పోయి మనసు అనే వజ్రాల పెట్టె అందవిహీనంగా మారిపోతుంది.మన మనసును బట్టే మన ముఖం కనబడుతుంది. కనుక మనసు మంచి భావాలతో నిండి ఉంటే ప్రశాంతంగా,సంతోషంగా,ఉత్సాహంగా ఉంటుంది.మనసు ప్రశాంతంగా,సంతోషంగా ఉంటే వజ్రలపెట్టె ధగధగ మెరిసినట్లు మన ముఖారవిందం కూడా రెట్టింపు అందంతో మెరిసిపోతుంది. 

Monday, 7 August 2017

భావావేశాలు

                                                                            ప్రస్తుత పరిస్థితులలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో ఎంతో కొంత ఒత్తిడికి లోనవడం జరుగుతుంది.ఒత్తిడితో అలసట,నిరుత్సాహంగా ఉండటమే కాక జీవితం నిస్సారంగా ఉంటుంది.దీనితో మానసికంగా,శారీరకంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.వీటి బారిన పడకుండా తప్పించుకోవాలంటే చీటికీమాటికీ కోపతాపాలు,ఉద్రేకం వంటి భావావేశాలను అదుపులో ఉంచుకోవటమే కాక ప్రతిరోజూ ఒక పావుగంట అయినా తప్పనిసరిగా ధ్యానం చేయాలి.ఈవిధంగా చేయడం వలన శరీరానికి అలసట లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

Tuesday, 1 August 2017

నాన్న స్పర్శ

                                                                               ద్విజ ఇద్దరు పిల్లల తల్లి.ద్విజ,భర్త ఇద్దరూ యంత్ర శాస్త్రంలో పట్టభద్రులు.ద్విజ ఉద్యోగ రీత్యా మొదటి స్థానంలో ఉంటుంది.ఒక బిడ్డకు తల్లి అయ్యే వరకు బాగానే ఉంది.భర్త రెండవ బిడ్డ కావాలంటే తనకు అంతగా ఇష్టం లేకపోయినా సరేనంది.ఒక పాప ఒక బాబు చీకు చింత లేని సంసారం.భర్త ఉద్యోగం చేస్తూనే వ్యాపారం మొదలెట్టి అదనపు డబ్బు సంపాదించడంతో సంతోషంగా రకరకాల వజ్రాలు,వైడూర్యాలు కొనుక్కునేది.రోజులు ఒకే విధంగా వుండవు కదా!భర్తకు వ్యాపారంలో నష్టం వచ్చేసరికి ద్విజ మానసికంగా కుంగిపోయి నన్ను,పిల్లలను నట్టేట ముంచావు అంటూ పెద్ద పెద్దగా ఏడవడం,అరవడం చేస్తుండేది.అమెరికాలో ఉండడంతో భర్త ఎంతో ఓర్పుతో ద్విజకు వైద్యం చేయించి చిన్న పిల్లలను బాధ్యతగా పెంచుతూ ఉద్యోగం చేసేవాడు.వ్యాపారంలో నష్టం వచ్చింది కనుక బిడ్డలకు,నాకు అన్యాయం చేశావు.అందుకే నీకు,నాకు సంబంధం లేదు అంటూ పిల్లలను కూడా తండ్రి దగ్గరకు రానీయకుండా పిచ్చి పనులు చేయడం మొదలెట్టింది.తండ్రి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ కనుక పిల్లలు తండ్రి దగ్గరకు వస్తే బలవంతంగా తీసుకెళ్ళి వేరే గదిలో పెట్టేది.పిల్లల ఏడుపు వినలేక భార్య మానసిక స్థితి సరిగా లేదు కనుక వైద్యుని సలహాతో వేరే ఊరిలో ఉద్యోగానికి వెళ్ళాడు.పిల్లను బాగానే చూస్తుంది కనుక మధ్య మధ్యలో ఇంటికి వచ్చినా ద్విజలో మార్పు రాలేదు. ద్విజ చిన్నప్పటి నుండి తన వైపు నుండే ఆలోచించి తప్పు అయినా ఒప్పు అయినా తనదే ఒప్పు అనేది.వ్యాపారంలో లాభాలు,నష్టాలు సర్వ సాధారణం.లాభాలు వచ్చినన్నాళ్ళు బాగానే ఉంది.నష్టం వచ్చేసరికి నువ్వు నాకొద్దు అంటూ పిల్లల గురించి ఆలోచించకుండా పిల్లలకు నాన్న స్పర్శ తెలియకుండా తనొక్కతే పెంచుదామనే నిర్ణయం తీసుకుంది.పిల్లలు,తండ్రి ఒకళ్ళను ఒక్కళ్ళు వదిలి ఉండలేని పరిస్థితి.తల్లి,తండ్రి అనురాగంతో,ఆనందంగా పెరగాల్సిన పిల్లలు దిగులుగా ఉంటే నాన్నమ్మ కడుపు తరుక్కుపోతోంది.ఏమీ చేయలేని పరిస్థితి.మేము చదువుకున్నాం కనుక మాకు అన్నీ తెలుసు ఎవరూ చెప్పాల్సిన పని లేదు అనే అహంకారం ఒకటి.దాంతో బంగారం లాంటి సంసారం చెడగొట్టుకుని విడిపోయే పరిస్థితి దాపురించింది.

Sunday, 23 July 2017

ఒళ్ళు విరుచుకోవడం

                                                                ఒకప్పుడు ఎవరైనా ఒళ్ళు విరుచుకోవడం చూస్తే పెద్దవాళ్ళు ఒళ్ళు విరుచుకుంటే దరిద్రం అంటూ చివాట్లు పెట్టేవారు.లేదంటే వాడికి దిష్టి తగిలింది దిష్టి తీయండిరా అనేవాళ్ళు. ఎవరైనా ఏకబిగిన పనిచేసేకన్నా ప్రతి గంటకు ఒకసారి లేచి ఒళ్ళు విరుచుకుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చని ఇప్పుడు పెద్దలు చెబుతున్నారు.ఏది ఏమైనా ఇది మాత్రం నిజం.మీరూ ఒకసారి ప్రయత్నించండి.

Friday, 21 July 2017

వ్యాధుల నివారిణి - పొట్లకాయ

                                                              స్నిగ్ధ కొత్తగా పెళ్ళయి అత్తగారింట్లో అడుగు పెట్టింది.ఇంటి చుట్టూ ఖాళీ స్థలం.దానిలో పద్దతిగా పెంచిన పూలమొక్కలు,కూరగాయలు,ఆకుకూరలు,ఇంకా రకరకాల పండ్ల మొక్కలు చూడటానికి ముచ్చటగా ఉంది.ఇంట్లో అడుగు పెట్టగానే హాయిగా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.రసాయన రహిత కూరగాయలతో చేసిన వంట కనుక భోజనం ఎంతో రుచిగా ఉంది.స్నిగ్ధ అత్తగారు ఒకరోజు స్నిగ్ధను పిలిచి అమ్మాయ్ పెరట్లో ఉన్న పిచ్చిక పొట్లకాయ కోసి తీసుకురా! అంటూ పిలిచారు.ఆవిడ అలా పిలవగానే స్నిగ్ధకు గుండెల్లో రాయి పడినట్లయింది.ఎందుకంటే  చిన్నప్పటి నుండి స్నిగ్ధకు పొట్లకాయ వాసన పడదు.కూర కూడా తినదు.అసలు కాయను కూడా పట్టుకోదు.ఆ విషయం చెప్పలేక ముక్కు మూసుకుని పొట్లకాయ కోసి తెచ్చింది.కోడలు అవస్థ గమనించి నీకు ఇష్టం వుండదా!అని అడగ్గానే ముక్కు మూసుకునే తల అడ్డంగా తిప్పింది.ఆవిడ కోడల్నిప్రక్కన కూచోబెట్టుకుని ఓపిగ్గా అమ్మా!పొట్లకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది.రక్త ప్రసరణ సాఫీగా జరగటమే కాక అనేక వ్యాధుల నివారిణి.వాంతులు,విరేచనాలు,జ్వరం వచ్చినప్పుడు,మధుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాలు,మూత్రాశయం పనితీరు మెరుగు పరుస్తుంది.గొంతులోని కఫం తగ్గించి శ్వాసకోశ పనితీరు బాగుండేలా చేస్తుందిఅని పొట్లకాయ గురించి కబుర్లు చెప్పి ఒకసారి రుచి చూడమని పొట్లకాయ,పెసరపప్పు కూర చేసి పెట్టారు.స్నిగ్ధ మొదట అయిష్టంగానే తిన్నాఎంతో రుచిగా వుండేసరికి మళ్ళీ అడిగి మరీ పెట్టించుకుని తినేసింది.చెపితే తప్ప అది పొట్లకాయ కూర అని తెలియనంత రుచిగా ఉంది.దీనితో బరువు కూడా తగ్గటమే కాక వర్షాకాలంలో వచ్చే ఎన్నో వ్యాధుల నివారిణి అని తెలియటంతో స్నిగ్ధకు పొట్లకాయ అంటే ఉన్న అయిష్టత తొలగిపోయింది.

Tuesday, 18 July 2017

పంటి నొప్పి

                                                                              ఏ నొప్పి అయినా భరించగలం కానీ పంటి నొప్పి భరించడం చాలా కష్టం.అర్ధరాత్రి,అపరాత్రి నొప్పి వస్తే కష్టం కదా!వైద్యుని దగ్గరకు వెళ్ళేవరకు తాత్కాలికంగా నొప్పి తగ్గాలంటే పచ్చి ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ మెత్తగా చేసి నొప్పి ఉన్న పంటిపై కాసేపు ఉంచితే నొప్పి తగ్గుతుంది.