Friday, 31 October 2014

అడ్డమైన చాకిరి

                                                     వేణి పట్టణానికి దగ్గరలో ఉండటం వలన చిన్నాన్నపిల్లలు,మేనమామ పిల్లలు చదువుకోవటానికి ఊరునుండి  వచ్చి వేణి ఇంట్లోనుండి కళాశాలకు వెళ్ళి వస్తుండేవారు.పిల్లలు ఉంటున్నారు కనుక పెద్దవాళ్ళు వేణికి ఊరునుండి కూరగాయలు పప్పులు,బియ్యంతో సహా అన్నీపంపిస్తుండేవారు.అయినా వేణి మగ
పిల్లలు,ఆడపిల్లలని తేడా లేకుండా అందరితో ఇంట్లో అడ్డమైన చాకిరి చేయించుకునేది.ఆఖరికి వాకిలి,మెట్లు కూడా
కడిగించేది.చిన్నాన్నకొడుకు కొంచెం అమాయకంగా ఉంటాడు కనుక బట్టలు మడతపెట్టించుకుంటుందని,వాకిలి కడిగిస్తుందని అందరూ అనుకునేవాళ్లు.కానీ మేనమామ కొడుకు ఇంజనీరింగు చదివే అబ్బాయితో కూడా అదే పని చేయిస్తుంది.హతవిధీ!దీనికేమైంది?ఎవరుంటే వాళ్ళతో ఆరకంగా అడ్డమైన చాకిరి చేయించుకోకపోతే ఏం పోతుంది?
పనివాళ్ళను పెట్టుకునేదానికి,చదువుకోటానికి వచ్చిన పిల్లలను ఇబ్బంది పెట్టకపోతే అని చుట్టుప్రక్కల వాళ్ళు
అనుకోవటం మామూలైపోయింది.కానీ ఆమెలో మాత్రం మార్పురాదు.పిల్లల తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రం
 వాళ్ళతో పూచిక పుల్లంత పనికూడా చేయించటంలేదని తనే పనంతా కష్టపడి చేసుకుంటున్నట్లు చెపుతుంటుంది.
 వాళ్ళేమో అదంతా నిజమని నమ్ముతుంటారు.పిల్లలు చదువే లోకంగా చదువుకుంటున్నారు కాబోలు అని
సంతోషపడుతుంటారు.

అదృష్టవంతుడు

                              జానకిరామయ్య గారికి తొంభైఆరు సంవత్సరాలు.అయినా పూర్తి ఆరోగ్యంతో తనపనులు తాను చేసుకుంటూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాయంత్రం పార్కువరకు వెళ్ళి అక్కడ పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పి వారి ఆటలు చూస్తూ సరదాగా వారితో కాలక్షేపం చేసి ఇంటికి రావటం అలవాటు.ఆయనకు ఒక్కతే కూతురు.ప్రతిరోజూ పార్కు నుండి వచ్చిన తర్వాత కూతురితో మనుమరాలు,మునిమనుమళ్ళ ముచ్చట్లు చెప్పటం ఆయనకు అలవాటు.మాటల మధ్యలో అమ్మాయ్!ఈరోజు బుధవారం.నేను పుట్టినరోజు కూడా బుధవారమే.ఏరోజు పుడితే అదే రోజు చనిపోతారని మా తాతలు చెప్పేవాళ్ళు నేను కూడా అంతే చనిపోతానని అనిపిస్తుంది అన్నారు.అలా ఏమీ కాదులే నాన్నా!లోపలకు రండి అంటూ ఆమె లోపలకు వెళ్ళింది.ఆయన ఎంతసేపటికీ లోపలకు రాకపోయేసరికి మళ్ళీబయటకు వచ్చి నాన్నాఅంటూ చెయ్యి పట్టుకునేసరికి ప్రక్కకు వాలిపోయారు.ఆమెకు ఏమీ అర్ధంకాక వైద్యునికి ఫోను చేసింది.ఆయన వచ్చిమీనాన్నగారు  చనిపోయరనేసరికి ఒక్కసారిగా గొల్లుమంది.చుట్టుప్రక్కల వాళ్ళందరూ ఆయన ఎంతో అదృష్టవంతుడు తిరుగుతూ తిరుగుతూ ఎవరితో చాకిరీ చేయించుకోకుండా పోయాడు అని కూతుర్ని ఓదార్చారు.ఈలోపు మనుమరాలికి ఫోనుచేస్తే విదేశానుండి హుటాహుటీన కుటుంబంతో వచ్చింది.అందరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అంత్యక్రియలు పూర్తిచేశారు.

Thursday, 30 October 2014

బొప్పాయి వేపుడు

పచ్చి బొప్పాయి కాయ -1 చిన్నది
కంది పప్పు - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
వేపుడు కారం - 2 స్పూనులు
 వెల్లుల్లి - 6 రెబ్బలు
                              బొప్పాయి చెక్కుతీసి గింజలు,తెల్లటి పొర తీసేసి సన్నటి ముక్కలు కోసి మెత్తగా కాకుండా ఉడికించాలి.ముక్కలు నీరు లేకుండా పిండి ప్రక్కన పెట్టుకోవాలి.కందిపప్పు కొంచెం ఉడికించాలి.నీరు వంచేయాలి.
బాండీలో నూనె వేసి కాగాక తాలింపు దినుసులు,కరివేపాకు వేసి బొప్పాయి ముక్కలు వేసి కొంచెం వేగాక,ఉప్పు,
కందిపప్పు వేసి వేయించాలి.వెల్లుల్లి కొట్టి వేసి,వేపుడుకారం వేసి,మంచి వాసన వచ్చిన తర్వాత దించేయాలి.ఇది
వేడివేడి అన్నంతో చాలా రుచిగా బాగుంటుంది.ఎప్పుడూ ఒకే కూరలు చేసే కన్నా వెరైటీగా చేస్తే బాగుంటుంది.మరి
మీరూ ప్రయత్నించండి.

బొప్పాయి కోఫ్తా

పచ్చి బొప్పాయి కాయ - 1(మీడియం సైజుది)
కారం - 3/4 స్పూను
 శనగ పిండి - 2 స్పూనులు
ధనియాలపొడి - 2 స్పూనులు
జీరా - 1/2 స్పూను
టొమాటోలు - 4
పసుపు - కొంచెం
ఉప్పు - తగినంత
నూనె -వేయించడానికి  సరిపడా
       మసాలా
ఉల్లిపాయలు - 3
వెల్లుల్లి - 10
గసాలు - 1 స్పూను
లవంగాలు - 3
దాల్చిన చెక్క - కొంచెం  (ఇవన్నీ కలిపి మెత్తగా చేసుకోవాలి)
                                       బొప్పాయికాయ కోసి గింజలు తీసి సన్నగా తురిమి నీరు పిండి శనగపిండి,ఉప్పు వేసి బాగా కలపాలి.కొంచెం నూనెలో ఈకోరుని పకోడీల మాదిరిగా వేయించాలి.ఒకగిన్నెలో 4 స్పూనుల నూనె వేసి జీరా,
రుబ్బిన మసాలా,ఉప్పు,కారం,పసుపు,ధనియాల పొడి,టమోటా ముక్కలు వేసి వేయించి 1 కప్పు నీళ్ళుపోసి 10ని.లు మరగనివ్వాలి.తర్వాత పకోడీని అందులో వేసి మూతపెట్టి 10 ని.లు సిమ్ లో ఉడకనిచ్చి కొత్తిమీర చల్లి దించాలి.ఇది చపాతీ,పూరీ,రైస్ తో చాలా బాగుంటుంది.

కూరగాయలు,గ్రుడ్డుతో విభిన్నంగా ......

బంగాళదుంపలు  - 400 గ్రా.
సేమ్యా - 50 గ్రా.
కాప్సికం - 1
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 2
కోడిగ్రుడ్డు - 1
కొత్తిమీర - కొంచెం
నిమ్మరసం - 1 స్పూను
బఠాణీ - 100 గ్రా.
కాబేజీ ఆకులు - కొన్ని
నూనె - వేయించడానికి సరిపడా
                                                       కొంచెం నూనెలో తరిగిన ఉల్లిపాయలు,కాప్సికం వేయించుకోవాలి.కొత్తిమీర,
ఉప్పు వేసి,ఉడికించి మెత్తగా చేసిన బంగాళదుంపలు కలిపి,నిమ్మరసం పిండి గుండ్రంగా చేసి వాటి మధ్య ఉడికించిన బఠాణీలు పెట్టి కోడిగ్రుడ్డు ఆకారంలో చేయాలి.వీటిని గిలకొట్టిన కోడిగ్రుడ్డులోముంచి,సేమ్యాలో దొర్లించి, నూనెలో వేయించి,కాబేజి ఆకుల్లో ఉంచి సర్వ్ చేయాలి.

బ్రెడ్ పుడ్డింగ్

బ్రెడ్ స్లైసెస్  - 6
పాలు - 1 కప్పు
పంచదార -75 గ్రా.
చెర్రీస్  - 6
 వెనీలా ఎసెన్స్ - 1 స్పూను
 కోడిగ్రుడ్లు - 2                                                                                                                                                                                                           బ్రెడ్ చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.ఒక గిన్నెకి నెయ్యి రాసి అందులో ఇవివేసి వీటిపై పాలుపోసి ప్రక్కన పెట్టాలి.కోడిగ్రుడ్లు,పంచదార,వెనీలా ఎసెన్స్ బాగా కలిపి బ్రెడ్ పైన
పోసి టిష్యూ పేపరుతో కవర్ చెయ్యాలి.కుక్కర్లో ఈ గిన్నె పెట్టి సిమ్ లో 20 ని.లు ఉడికించాలి.దించి ఒక ప్లేటులో
వేసి చెర్రీస్ తో అలంకరిస్తే బ్రెడ్ పుడ్డింగ్ రెడీ.                         

అరటిపండ్లతో స్వీటు

అరటిపండ్ల గుజ్జు - 2 కప్పులు
మీగడ - 1/2 కప్పు
పంచదార - 2 స్పూన్లు
సన్నగా తరిగిన జీడిపప్పు - 3 స్పూన్లు
వెన్న - 2 స్పూన్లు
యాలకులపొడి - కొంచెం
వెనీలా ఎసెన్స్ - 1/4 స్పూను
                                               వెన్న వేడిచేసి దానిలో అరటిపండ్ల గుజ్జు,మీగడ,పంచదార,యాలకులపొడి వేసి
అంటుకోకుండా ఉండేటట్లు త్రిప్పుతూ  వెనీలా ఎసెన్స్ కలిపి ప్లేటుకి నెయ్యిరాసి దానిపై వేసి జీడిపప్పు చల్లి ఆరిన తర్వాత నచ్చిన షేప్ లో ముక్కలు కట్ చేసుకోవాలి.