శర్వాణి నగరం నుండి వీలయినప్పుడల్లా ఇప్పటికీ నెలకి ఒకసారైనా పల్లె అందాలు ఆస్వాదించడం కోసం వాటిని పిల్లలకు చూపించి పల్లెల గొప్పతనం పిల్లలకు తెలియచెప్పడానికి కుటుంబంతో కలిసి పల్లెకు హుషారుగా వెళ్తూ ఉంటుంది.శర్వాణికి తను పుట్టి పెరిగిన పల్లెలన్నా,ఆవాతావరణమన్నా ఎంతో ఇష్టం.ఆవాతావరణం,కొండలు,కోనలు,నదులు,కాలువలు,పంట కాలువలు,పొలాలు అవన్నీ చూస్తుంటే చిన్నప్పటి ఆటలు,కాలువ దాటటానికి బోదెలపై నిదానంగా ఒకరి భుజంపై ఒకరు చెయ్యేసుకుని జాగ్రత్తగా దాటటానికి,చెట్లెక్కి కాయలు కోయటానికి చేసిన ప్రయత్నాలు జ్ఞప్తికి వచ్చి నగరంలో రణగొణధ్వనుల మధ్య పడ్డ మానసిక ఆందోళన పోయి మనసు ప్రశాంతంగా హాయిగాఉంటుంది.ఎడ్లబళ్ళు,ఆవులు,గేదెలు,మేకలు,గొర్రెలు,ఊరపిచ్చుకలు,రకరకాలపక్షులు,గిన్నెకోళ్ళు,జెముడు కాకులు,కోయిలలు,జామచెట్ల మీద దోర జామ కాయలను తినటానికి వచ్చే చిలుకలు,ఒకటేమిటి అవన్నీ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి."పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు".లేత మొక్కజొన్నపొత్తులు,వేరుశనగ కాయలు,లేత తాటి ముంజలు,కంది కాయలు,సీమతుమ్మ కాయలు,మామిడి కాయలు,చెరుకు గడలు,తంపటి వేసిన వేరుశనక్కాయలు,తేగలు,బాదం కాయలు,పండు తాటికాయలు నగరంలో తినాలన్నా,ఎంత డబ్బు పెట్టినా దొరకనివి పల్లెల్లో ఎన్నో.శార్వాణి చిన్నతనంలో వీధి మొత్తం బంధువులే ఉండేవారు.పొలాల్లో పండిన పంటలను ఇళ్ళ ముందు రాసులుగా పోసేవారు.పిల్లలు ఆ రాసులమీద ఎక్కి పైనుండి క్రిందికి జారుతూ ఆటలాడేవారు.ఇళ్ళముందు పెద్దపెద్ద పురులు కట్టి వడ్లు పోసి నిల్వ చేసేవాళ్ళు.అంతకు ముందు రోజుల్లో పాతర అంటే చాలా పెద్దగుంట బాదంకాయ ఆకారంలోకానీ,గుండ్రంగాకానీ తీసి మందంగా వరిగడ్డి పరిచి చాపలు వేసి వడ్లు,పసుపు నిల్వ చేసేవాళ్ళు.వేరుశనగ మొక్కలు,మొక్కజొన్న కండెలు రాసులుగా పోసేవాళ్ళు.ఆడవాళ్ళందరూ భోజనాలు చేసి మధ్యాహ్నం పూట పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ వేరుశనగ కాయలు,మొక్కజొన్న కండెలు వలిచేవాళ్ళు.పిండివంటలు కూడా బంధువులు అందరూ కలిసి ఒకచోట వండుకునేవాళ్ళు.ఎప్పుడూ ఆ వీధి వీధి సందడి సందడిగా ఉండేది.ఇప్పటికీ అలాగే సందడిగా ఉంటుంది.శర్వాణికి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవి.ప్రశాంతంగా ఉండాలన్నా,ప్రకృతిని ఆస్వాదించాలన్నా పల్లెకు వీలయినప్పుడల్లా పిల్లలను కూడా తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్లకు కూడా ప్రకృతి అందాలను తిలకించటం అలవాటవుతుంది.నగరంలో తినే ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా పల్లెటూరి రుచులు అలవాటు చేస్తే సెలవులు వచ్చినప్పుడు పిల్లలు కూడా పల్లెకు పోదాం చలోచలో అంటారు.
No comments:
Post a Comment