ఈరోజుల్లో కొంత మంది ఎదుటివాళ్ళు మనల్ని గౌరవించాలని,ఇంటికి రాగానే సకల మర్యాదలు చేయాలనుకుంటున్నారు కానీ ఎదుటివారికి మనం మర్యాదలు చేస్తున్నామా?వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామా?లేదా?అని ఆలోచించడం లేదు.ఎంతసేపూ మనల్ని పట్టించుకోవడం లేదు,ఇంకా మనకోసం ఏదో చేయలేదు అని అనుకోవటమే తప్ప మనం ఎదుటివారికి ఏమి చేస్తున్నాము?అని అనుకోవటం లేదు.వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు కూడా సంతోషపడాలని,వాళ్ళు భాధగా ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు కూడా వాళ్ళతోపాటు బాధపడాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ఈ విధంగాప్రవర్తించడం ఎంతవరకు సమంజసం?అనే ఆలోచన సుతరామూ కలగటం లేదు.ఒకసారో,రెండుసార్లో అయితే పోనీలే వాళ్లకి అదొక తృప్తి,చాదస్తం అని సరిపెట్టుకోవచ్చు. ఎంత కాదనుకున్నా ఇలా ప్రతీది ఎదుటి వారినుండి ఆశిస్తుంటే అనుబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.కనుక ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం మర్యాద.ఎవరి మర్యాద వాళ్ళు కాపాడుకోవడం ఉత్తమమైన పద్ధతి.
No comments:
Post a Comment