Friday, 3 July 2020

దెబ్బ మీద దెబ్బ

                                                                          సీత కష్టాలు సీతవి.పీత కష్టాలు పీతవి అన్నట్లు ఈ నిర్భంధ సమయంలో (లాక్ డౌన్) అందరికీ చిన్నవో,పెద్దవో ఏదో ఒక ఇబ్బందులు ఎదురౌతూనే ఉన్నాయి.అందులో కష్టపడి పని చేసుకునే జానకి అప్పోసప్పో చేసయినా కూతురు జమున పెళ్ళి ఘనంగా చేయాలని చేసింది.పెళ్ళి  బాగా జరిగిందని అందరూ సంతోషపడుతున్న సమయంలో ఎవరూ ఊహించని ఎదురు దెబ్బ తగిలి బొక్క బోర్లా పడిపోయింది.దొరికిన చోటల్లా అప్పులు చేసి మంచి సంబంధం ఉద్యోగస్తుడయితే  పిల్ల సుఖపడుతుందని చదువుకుంటున్న అమ్మాయికి పెళ్ళి చేసింది.పెళ్ళయిన తెల్లారి నుండే మీ వాళ్ళందరిని వదిలెయ్యాలి లేకపోతే నీకు విడాకులు ఇస్తానంటూ పాట పాడడం మొదలెట్టాడు.మా వాళ్ళను వదిలెయ్యడం ఏమిటి?అని ఎదురు ప్రశ్న వేస్తే కొట్టడం మొదలెట్టాడు.దీనికి తోడు మద్యపానం,ధూమపానం,గంజాయి బిళ్ళలు తీసుకోవడం దీనివల్ల నరాల బలహీనత,అవయవాలు పనిచేయకపోవడంతో  దానికోసం మందులు వాడడం ఇవ్వన్నీ  తెలియకుండా కప్పి పుచ్చుకోవడానికి జమునను కొట్టడం,బూతులు తిట్టడం పరిపాటి అయిపోయింది.జమున తెలివిగలది కనుక కొట్టిన దెబ్బలు ఫోటో తీసి,బూతులు తిట్టినప్పుడు రికార్డ్ చేసి చరవాణిలో రహస్య ఫైలులో దాచి పెట్టినది.దరిద్రుడికి 64 కళలు అన్నట్లు చరవాణి తనిఖీ చేయడంతో ఎందుకైనా మంచిదని శ్రేయోభిలాషికి,అన్నయ్యకు అన్ని ఆధారాలు పంపింది.వాడిలో లోపం కప్పి పుచ్చుకోవడానికి మీ అమ్మాయి సంసారానికి పనికి రాదు అని జానకి వాళ్ళకు,బంధువులకు అబద్దాలు చెప్పడం మొదలెట్టాడు.ఎవరిలో లోపం ఉందో వెళ్ళి ఆసుపత్రిలో తేల్చుకుందాము అని జమున గట్టిగా అనడంతో వీరావేశంతో కొట్టి చరవాణి లాక్కుని నేలకేసి కొట్టడంతో పగిలిపోయింది.జానకి,భర్త ఊరిలో లేకపోవడంతో ఇప్పుడు మీ అమ్మా,నాన్న కూడా ఊరిలో లేరు  నిన్ను చంపేస్తే  ఏమి చేస్తావు?అంటూ తాగి వెకిలిగా మాట్లాడడంతో ప్రాణభయంతో తెలిసినవాళ్ళకు చంపేస్తున్నాడని సమాచారం అందించడంతో జమున అన్నయ్య ఆగమేఘాలమీద వెళ్ళి ఇంటికి తీసుకువచ్చాడు. ఇదంతా పెళ్ళయిన వారంలోపే జరిగింది.పెళ్ళి మాట దేముడెరుగు కూతురు బతికుంటే చాలు అనుకుని పంచాయితీ పెట్టి విడాకులు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు.అన్ని ఆధారాలు ఉండడంతో తప్పు ఒప్పుకుని నష్టపరిహారం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.కూతురికి పెళ్ళి చేసి లేని కష్టాలు కొని తెచ్చుకున్నామనే బాధలో ఉండగానే  జానకి కొడుకు రోషన్ కు కడుపునొప్పి వచ్చి అప్పటికప్పుడు శస్త్ర చికిత్స చేయవలసి వచ్చింది.కరోనా గోలతో 40,000 /- కడితేనే వైద్యం అనడంతో మళ్ళీ అప్పు చేయవలసి వచ్చింది.ఏమంటా ఈ పెళ్ళి చేశామో దెబ్బ మీద దెబ్బ అని జానకి లబోదిబోమని ఏడవడం మొదలెట్టింది.ఏడవకు జానకి కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో  ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కుంటే అవే కాలానుగుణంగా సర్దుకుంటాయి అని అందరు చెప్పడంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది.

Wednesday, 1 July 2020

సర్వేజనా సుఖినోభవంతు

                                     అందరికి నమస్తే.చాలా రోజుల తర్వాత తెలుగు వారి బ్లాగుకు స్వాగతం.ఈ కరోనా హంగామాతో అందరు ఇంటికే పరిమితమైనా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండి ఉంటారని ఆశిస్తున్నాను.అందరూ ఎవరికి తోచినది వారు చేసే ఉండి ఉంటారు.కాకపోతే నేను ఉడతా భక్తిగా ఏమి చేశానంటే? ఇన్ని రోజులు నేను నాకు  సాధ్యమైనంతలో ఇతరులకు సహాయం అందిస్తూ మేము,మీరు,మన అందరితోపాటు సర్వేజనా సుఖినోభవంతు,సమస్తా లోకా సుఖినోభవంతు అంటూ అందరూ బాగుండాలని సూర్యోదయానికి,సూర్యాస్తమయానికి ముందుగా దీపాలు వెలిగించి పూజలు,పారాయణాలు చేస్తూ భగవంతుని ప్రార్ధించడం దినచర్యలో భాగం అయిపోయింది.దీనితో ఎటువంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది.కళ్ళు మూసి తెరిచినట్లుగా నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి.అకస్మాత్తుగా రోజువారీ  అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.ఏ పని చేయాలని అనిపించేది కాదు.ఆ తర్వాత మనసుకు ఒక్కసారిగా స్తబ్దత ఆవరించినట్లు రోజంతా నిద్ర.అలసటతో శరీరమంతా బద్ధకం.ఒక పది రోజులు గడిచిపోయినాయి.ఎందుకు ఇలా ?దీని నుండి ఎలాగైనా బయటపడాలని బాబాకి నమస్కారం చేసుకుని చరవాణి చేతిలోకి తీసుకుని సానుకూల దృక్పధం అని నొక్కగానే సాయి సర్వస్వంలో  బాబా సానుకూల దృక్పధం చైతన్య క్రియ చూచి ఆచరించడంతో ఆశ్చర్యంగా మనసుకు  ఆవరించిన స్తబ్దత ఒక్కసారిగా దుమ్ము దులిపినట్లు తొలగిపోయింది.ఇది నిజంగా మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.మనకు సహాయం చేసినవారికి ధన్యవాదములు తెలియచేయడం  మన సంస్కారం.బాబాకు,సాయి సర్వస్వం వారికి ధన్యవాదములు.రోజూ మీ అందరితో ఎన్నెన్నో ఊసులు,కొత్తకొత్త కబుర్లు చెప్పాలని ప్రయత్నించడం బద్దకంతో అక్కడ నుండి వెళ్ళిపోవడం నిజంగా నాకే విచిత్రంగా ఉండేది.ఇక ముందు వీలయినప్పుడల్లా తప్పకుండా కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను.మరి ఎప్పటిలా నా కబుర్లు ఆసక్తిగా చదువుతారు కదూ.       

Friday, 28 February 2020

వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే

                                                            వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక ....... నీతిపరుడు మహిలో సుమతీ అని చిన్నప్పుడు సుమతీ శతకంలో నేర్చుకున్నాము కదా ! ఈ రోజుల్లో  చాలామంది  అడిగినా అడగకపోయినా అనేక రకాల మాటలు నిజమైనా అబద్దమైనా నిజమే అన్నట్లు మాట్లాడుతుంటారు.అవన్నీ విన్న వెంటనే ఆవేశపడి నిర్ణయాలు  తీసుకోవటం లేదా నీ సోది ఆపు అన్నట్లుగా ప్రవర్తించకూడదు.అది మంచి పద్ధతి కాదు.దానివల్ల  ఒక్కొక్కసారి కొన్ని లేనిపోని  సమస్యలు రావచ్చు. అటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా సాలోచనగా అన్నీ విని అందులో నిజమెంత ? అబద్దమెంత ? అందులో మనకు పనికి వచ్చేది ఎంత ?ఒకవేళ ఏమైనా ఉంటే మనకు తోచిన విధంగా దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళే నిజమైన తెలివితేటలు కలవాళ్ళు.ఇంకా కొంత మంది పెద్దవాళ్ళు ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు.అందులో కొన్ని మనకు ఉపయోగపడే విధంగా కూడా ఉండొచ్చు.అందుకే ఎవరు చెప్పినా మనకు ఇబ్బంది కలగనంత వరకు వినడంలో తప్పు లేదు.ముఖ్యంగా మన మంచి కోరే పెద్దవాళ్ళు చెప్పినవి చాదస్తం అనుకోకుండా ఓపికగా కొద్దిసేపు వినడం వలన  లాభమే కానీ నష్టం వాటిల్లదు.

Thursday, 20 February 2020

మహా శివరాత్రి

                                                                        మహా శివరాత్రి రోజు చేసే అభిషేకాలకు,పూజలకు విశేష ఫలితం ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.శివుడు భక్త సులభుడు కనుక అవేమీ చేయకపోయినా ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా లేదా ఒక మారేడు దళము పెట్టి ఒక చెంబుడు నీళ్ళు పోసినా  కోరిన కోర్కెలు వెంటనే తీర్చేస్వామి.అసలు భక్తి ఉన్నా లేకపోయినా సంవత్సరమంతా పూజలు చేయకపోయినా ఈరోజు ఏ విధంగా పూజించినా అప్రయత్నంగా ఉపవాసము,జాగరణ చేసినా కోటి జన్మల పుణ్యఫలం లభించి శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణేతిహాసాలు తెలియచేస్తున్నాయి.కనుక ఎవరి వీలును బట్టి వాళ్ళు ఈ పర్వదినాన్ని సంతోషంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని,పార్వతీ పరమేశ్వరుల దయవల్ల అందరూఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో,భోగభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.నాబ్లాగ్ వీక్షకులకు ,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు మరియు మీ కుటుంబసభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.  
        
                                                     

Tuesday, 14 January 2020

మకర సంక్రాంతి

                                                                      మకర సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవిరకరకాలముగ్గులు,గొబ్బెమ్మలు,హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, కోడిపందేలు, గాలిపటాలు, చెరుకు గడలు, రేగిపళ్ళు, తేగలు, నువ్వులతో చేసిన అరిసెలు, రకరకాల పిండి వంటలు ఒకటేమిటి నెల రోజులు సందడే సందడి. తెల్లవారుఝామున లేచి ఆకాశంలో చుక్కలు ఉండగానే తులసి మొక్క  వద్ద తిరుప్పావై పాసురాలు చదువుతూ చేసే పూజలు ఒక ఎత్తైతే చివరగా గోదాదేవి రంగనాధుల కళ్యాణం, గోపూజలతో ముగుస్తాయి. ముఖ్యంగా ఈ చివరి మూడు రోజుల పండుగ మరీ ప్రత్యేకం. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు పెద్దవాళ్ళతో స్వంత ఊరిలో సరదాగా గడపడం కోసం పిల్లలు ఎంత దూరంలో ఉన్నా సరే రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఎక్కడెక్కడో ఉన్న మన తెలుగు వారందరికీ, పిల్లలకు, పెద్దలకు, నా బ్లాగు వీక్షకులకు, తోటిబ్లాగర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భోగి, మకరసంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మనందరికీ భోగి భోగ భాగ్యాలను, మకర సంక్రాంతి సుఖ సంతోషాలను, కనుమ కష్టాలను తొలగించి కమ్మని అనుభూతులను మిగల్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
                                             
                                                 

Tuesday, 31 December 2019

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

                                     నా బ్లాగ్ వీక్షకులకు, తోటి బ్లాగర్లకు,మిత్రులకు,  శ్రేయోభిలాషులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.ఇంకొద్ది నిమిషాలలో మనందరికీ ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను వదిలిపెట్టి,మరెన్నో పాఠాలను నేర్పి వెళ్తున్న పాత  సంవత్సరానికి  వీడ్కోలు పలుకుతూ మరింత ఆనందోత్సాహలతో,పిల్లలు,పెద్దలు కేరింతలతో నూతన  సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా కొంగ్రొత్త ఆశలు,ఆశయాలు అనుకున్నవన్నీ నెరవేరాలని,అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు,సకల భోగభాగ్యాలు,ధన కనక వస్తు వాహనాలు అమరాలని మనస్పూర్తిగా  కోరుకుంటున్నాను. 





Sunday, 22 December 2019

ఏమాంచి

                                                             శివ కు పెళ్ళయిన చాలా సంవత్సరాలకు అమ్మాయి పుట్టింది.ఎంతో ముచ్చటపడి శివ,భార్య,చెల్లెలు ఆ పాపకు హేమాన్షి అని పేరు పెట్టారు.ఒక రోజు శివ బాబాయి మనవరాలిని చూడడానికి ఊరు నుండి వచ్చాడు.పాప ముద్దుగా ఉందని ఎత్తుకుని మురిసిపోతూ పేరు ఏమి పెట్టారు అని అడిగాడు.హేమాన్షి అని చెప్పగానే మంచి పేరు బాగుంది అంటూనే ఏమాంచి,ఏమాంచి అంటూ బిగ్గరగా పిలిచాడు.అక్కడే ఉన్న శివ చెల్లెలు,భార్య తెల్లబోయారు.ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూచుకుని శివ చెల్లెలు ఏడుపు ముఖంతో అదేంటి బాబాయ్? అంత మంచి పేరుని అలా ఖూనీ చేసేశావు అన్నది.సరిగా నేర్చుకుందామని అనుకోకుండా మొండిగా మరి ఏమి చెయ్యమంటావు? నాకు అసలు నోరు తిరగకుండా మీరు పేరు పెట్టారు.అందుకే నేను ఏమాంచి అనే పిలుత్తాను అన్నాడు.పెద్దాయన కదా!ఇంక ఎవరూ ఏమీ మాట్లాడలేదు.అదండీ సంగతి.కామంచి అన్నట్లు హేమాన్షి పేరు  సరిగా పలకడం రాక అలా రూపాంతరం చెంది ఏమాంచి అని స్థిరపడిపోయింది.