సుశ్రుత ఊరిలో లేని సమయంలో ఎదురింటి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందనీ,కారులో నలుగురున్నారనీ,కారు తిరగబడిందనీ,నలుగురూ పాణాలతో ఉన్నారనీ ఫోను వస్తే ఏడుస్తూ ఆసుపత్రికి వెళ్ళారనీ
కాపలాదారు పరుగెత్తుకుంటూ వచ్చి వగరుస్తూ చెప్పాడు.ఎదురింటి ఆమె ఉదయమే పువ్వులుకోస్తూ కనిపించింది. సుశ్రుత బాబు ఎలా ఉన్నాడు?అంటూ పరామర్శించటానికి వెళ్ళింది.ఇప్పుడు బానే ఉన్నాడు.అమ్మవారి దయవల్ల పెద్ద గండం గడిచింది.నలుగురు స్నేహితులు పార్టీకి వెళ్ళి తిరిగి వస్తుంటే మాఅబ్బాయికి నిద్రవచ్చి స్నేహితుడిని డ్రైవ్ చెయ్యమన్నాడట.అతను 140కి.మీ స్పీడుతో వెళ్తుండగా బైక్ అడ్డువచ్చిందట.వీడు,వాడు కూడా కంగారుపడి
ఒకరికొకరు ఒకేవైపు ఎదురురావటం వల్ల తప్పించబోయి చెట్టుకి గుద్దాడట.చెట్టు కూలిపోయింది.ఈలోగా మా అబ్బాయి కంగారుపడి హ్యాండ్ బ్రేక్ వెయ్యటంతో కారు 12 అడుగుల ఎత్తు ఎగిరి తిరగబడిందనీ చెప్పింది.ఒకతనికి
స్ప్లీన్ తీసేశారని,అందరికీ వెన్నెముకకు ఎక్కడో ఒకచోట దెబ్బతగిలిందనీ,అందరూ 18 సంవత్సరాలవాళ్ళేననీ,మా
అబ్బాయికి వెన్నెముక దగ్గర ఒక ఎముక ప్రక్కకు తొలగిందని,చిన్నవయసు కనుక ఆపరేషన్ చెయ్యలా?ఇంకా ఏదైనా మార్గముందా?అని పెద్దడాక్టర్ల సలహా తీసుకుంటున్నామని చెప్పింది.సుశ్రుతకు ఏమి మాట్లాడాలో అర్ధం కాక నోట మాట రాలేదు.18 సంవత్సరాల పిల్లలు అర్ధరాత్రి పార్టీలంటూ వెళ్ళి 140 కి.మీ వేగంతో వెళ్ళటం ఏంటో?
యాక్సిడెంట్ అవటం ఏంటో? ఆనలుగురు భూమి మీద నూకలుండి బ్రతికడమే అనుకోవాలి.అంతే కాకుండా ఈ
సంఘటను బట్టి తల్లిదండ్రులుగా మనమందరమూ కూడా ఆలోచించాల్సిన విషయం.పిల్లలకు తెలిసీతెలియని
వయసు.మరీ కట్టడి చేయకుండా పిల్లలతో స్నేహభావంతో ఉంటూ ఏది మంచి,ఏది చెడు అని తెలుసుకోగలిగేలా,
స్నేహితులు వత్తిడి చేసినా ఆలోచించి అడుగు వేయటం,ఆంక్షలు పెడుతున్నామని ఫీల్ అవకుండా నేర్పించాలి.
మనకు ఎన్నిపనులున్నా కొంతసమయం వాళ్ళకు కేటాయించాలి.ఆడ పిల్లలయినా,మగ పిల్లలయినా వాళ్ళ భావాలు మనతో పంచుకోగలిగేలా చిన్నప్పటినుండి తల్లిదండ్రులుగానే కాక,స్నేహితుల్లా మెలగాలి.ఈవయసులో
నీకు చదువు ముఖ్యమా?పార్టీలు ముఖ్యమా? అని అరిస్తే ఎదురు తిరగటమో,ఇంట్లో తెలియకుండా వెళ్ళటమో చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.అందుకని మనమూ నేర్పరితనం అలవర్చుకోవాలి.పిల్లలు కాదోయ్ పిడుగులు అన్నట్లు ఉంటున్నారు.అందుకని పిల్లల్ని ఒక కంట గమనిస్తూ ఉండాలి.ఆ విషయం వాళ్ళకి కూడా తెలియకుండా మనమే తెలివిగా నడుచుకోవాలి.చదువుతోపాటు,మంచి బుద్ధులు అలవడేలా చూడాల్సిన బాధ్యత మనదే.