ఒక గుడ్డులోని తెల్లసొనను తీసుకుని దానికి 1/2 స్పూను నిమ్మరసం, 5 చుక్కల బాదం నూనె,5 చుక్కల తేనె కలిపి ముఖానికి రాయాలి.బ్రష్ తో రాస్తే మరీ మంచిది.1/4 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖం కడగాలి.ఇలా చేస్తే ముఖం మీద మచ్చలు మటుమాయమై ముఖం కాంతివంతంగా మారుతుంది.
Friday, 31 July 2015
Thursday, 30 July 2015
చెప్పులకు ప్రాధాన్యత
మహిళలు చీరలు ఎంత ఖరీదు పెట్టి కొనడానికి అయినా వెనుకాడరు కానీ కాళ్ళకు మాత్రం సరైన చెప్పులు వేసుకోరు.చీరకు తగినట్లు చెప్పులు వేసుకుంటే ఆ లుక్కే వేరు.అప్పుడప్పుడు కాళ్ళకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.చెప్పులకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల పాదాలు అందంగా ఉండటమే కాక మొత్తానికే అందంగా ఉన్నట్లు కనపడుతుంది..
తల్లిదండ్రులా?రాక్షసులా?
వర్ధని తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు.అటువంటిది పదవతరగతి అయిపోగానే తీసుకెళ్ళి పేరున్న కార్పోరేట్ కళాశాలలో హాస్టల్లో చేర్చారు.నాకు ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది.నేను ఇక్కడ ఉండలేక పోతున్నాను అని చెప్పినా వినకుండా చచ్చినా బతికినా అక్కడే ఉండాలని అన్నారు.ఒక వారాంతం ఇంటికి వచ్చినప్పుడు వర్ధని పేచీ పెట్టేసరికి గట్టిగా చివాట్లేసి పంపించి వచ్చారు.తర్వాత పిల్లలందరికీ ఇంటిమీద బెంగ ఉంటుందని ఒక పదిరోజులు శెలవులు ఇచ్చారు.అప్పుడు ఇంటికి వచ్చిన వర్ధని అక్కడి వాతావరణం,పద్ధతి నచ్చలేదని,ఇకమీదట వెళ్లనని,ఇంటిదగ్గర నుండి వేరే కళాశాలకు వెళ్తానని మొండిగా కూర్చుంది.వర్ధని చెప్తుంటే అర్ధం చేసుకోకుండా వెళ్ళాల్సిందేనంటూ తండ్రి వాతలు తేలేట్లు కొడుతుంటే తల్లి తిట్లదండకం మొదలెట్టి భర్తను రెచ్చగొట్టి ఇంకా కొట్టమంటుంది.వర్ధని వెళ్తే తిరిగి వచ్చేది లేదు చచ్చిపోతాను అంటే ఫర్వాలేదు నువ్వు పోతే ఇంకొక కూతురు మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని మాట్లాడారు. ఇదంతా చూస్తున్నవింటున్న అమ్మమ్మకు వీళ్ళసలు కన్నతల్లిదండ్రులా?లేక రాక్షసులా?అనిపించింది.మనవరాలి మొండితనమూ నచ్చలేదు.కూతురు,అల్లుడు మూర్ఖంగా ప్రవర్తించడం కూడా నచ్చలేదు.ముగ్గురూ వినే స్థితి దాటిపోయారు.
Tuesday, 28 July 2015
యాంటీబయాటిక్
సత్యవాణి మూడు నెలల నుండి విపరీతమైన దగ్గుతో బాధపడుతుంది.
వాడని మందు లేదు,పాటించని చిట్కా లేదు.ఎవరేమి చెబితే అది చేసింది.ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంది.అయినా ఏమీ ఉపయోగం లేకుండా పోయింది.సత్యవాణి ఎదురింటిలో ఉండే ఆమె ఎప్పటినుండో ఒక చిట్కా చెప్తుంటే ఈమె పట్టించుకోలేదు.చివరి ప్రయత్నంగా అది కూడా పాటించి చూద్దామని ఆమెను అడిగింది.ఆమె రాత్రిపూట నిద్రపోయే ముందు రోజూ ఒక గుడ్డును ఉడికించి దాన్ని నాలుగు భాగాలుగా చేసి వాటికి దట్టంగా మిరియాల పొడి పట్టించి తినమని చెప్పింది.తర్వాత నీళ్ళు కూడా తాగకుండా మంచం మీద ఎటూ కదలకుండా పడుకోమని చెప్పింది.అదే యాంటీబయాటిక్ నీకు దగ్గు తగ్గిపోతుందని చెప్పింది.అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సత్యవాణి రోజూ తిని కొద్దిగా దగ్గు తగ్గుతుంది అని అందరికీ చెప్పి తృప్తి పడుతుంది.
ఉబ్బసం వ్యాధి
రోజూ రాత్రిపూట నిద్రపోయేముందు 1 స్పూను తేనె,1/2 స్పూను దాల్చినచెక్కపొడి కలిపి తింటే ఉబ్బసం వ్యాధి అదుపులో ఉంటుంది.
Sunday, 26 July 2015
చిలుక జ్యోతిష్యం
మండు వేసవికాలంలో ఒక మిట్టమధ్యాహ్నం వేళ ఒకతను చిలకా జ్యోతిషం చెపుతానమ్మా!అంటూ దీర్ఘం తీస్తూ రోడ్డు వెంట అరుస్తూ వెళ్తున్నాడు.పట్టుపంచె కట్టుకుని చక్కగా తయారై ఒక చిలుకను బోనులో పెట్టుకుని తీసుకొచ్చాడు.పల్లవి నిద్రపోయేదల్లా గభాల్న లేచి పరుగెత్తుకుంటూ వరండాలోకొచ్చి అబ్బాయ్!గేటు తీసుకుని లోపలి రమ్మని పిలిచింది.పల్లవికి చిలుక జ్యోతిష్యం పిచ్చి.ఆహా!ఈరోజు మంచి కాలక్షేపం దొరికింది అనుకుంది.ఈలోపల తన స్నేహితురాళ్ళను తన ఇంటికి రమ్మని కబురు పంపింది.అందరూ ఒక పదిమంది సమావేశమై మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకూ వాడ్ని కూర్చోబెట్టుకుని చిలుకను కార్డు తియ్యమనడం,వాడు ఏదోఒకటి నోటికొచ్చింది చెప్పడంతో కాలక్షేపం సరిపోయింది.వీళ్ళ కాలక్షేపం కోసం ఎవరైనా ఊరికే చెప్పరు కదా!వాళ్ళు బ్రతకటానికి ఎన్నో అబద్దాలు చెప్తుంటారు.పైగా విదేశాలలో చదువుకుంటున్న పల్లవి కూతురు కూడా హాయిగా వాళ్ళతో పాటు కూర్చుంది.వీళ్ళు ఎంత డబ్బు వదిలించుకున్నారో తెలియదు కానీ తర్వాత పక్కింటి వాళ్ళు వాడ్ని పిలిచి మరో రెండు గంటలు కూర్చోబెట్టుకుని కాలక్షేపం చేశారు.పొద్దున్నే నక్కను తొక్కి వచ్చినట్లున్నాడు.వాడి పంట పండి జేబునిండా డబ్బుతో ఇంటికి వెళ్ళాడు.
Saturday, 25 July 2015
కుడితిలో పడ్డ ఎలుక
ప్రతీక చిన్నప్పటి నుండి నలుగురికి ఉపయోగపడే విధంగా తనకు లాభదాయకంగా ఏదైనా వ్యాపారం చేద్దామని ఆలోచిస్తూ ఉండేది.ఉద్యోగం చేస్తూ వ్యాపారం గురించి ఆలోచించే తీరిక ఉండటంలేదని లక్షల జీతం వచ్చే బంగారం లాంటి ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఏది మొదలెడదామన్నాఎత్తుభారం మొత్తుకోళ్ళు.ఒక పక్క ప్రశాంతంగా చేసుకునే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నందుకు ఇంట్లోవాళ్ళ అక్షింతలు.తనకు నచ్చిన వ్యాపారం చేద్దామంటే అనువుగా లేని వాతావరణ పరిస్థితులు.మనసుకు నచ్చని వ్యాపారం చేయలేని పరిస్థితి.ప్రస్తుతం ప్రతీక పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా ఉంది.ప్రతీక ఆలోచన మంచిదే కానీ ఆచరణలో సాధ్యం కావాలంటే కొన్నాళ్ళు కష్టపడక తప్పదు.ప్రతీక పట్టుదల ముందు పరిస్థితులు తలొగ్గి తను అనుకున్నది త్వరలో తప్పక సాధించగలదని ఇంట్లో అందరి నమ్మకం.
తెల్లవెంట్రుకలు తగ్గేందుకు............
కారణం ఏదైనా కానీ కొంతమందికి చిన్నవయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి.
అలాంటప్పుడు కొంచెం కొబ్బరినూనె తీసుకుని దానిలో ఒక నిమ్మకాయ రసం పిండి ఈ రెండు కలిపి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించాలి.ఒక గంట తర్వాత తలస్నానం చెయ్యాలి.ఈవిధంగా వారానికి ఒకసారి చేస్తుంటే తెల్ల వెంట్రుకలు రావటం తగ్గుతుంది.
Friday, 24 July 2015
అంతా దుమ్మే.......
నితీష్ ఎప్పుడూ ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి విమర్శిస్తుంటాడు.లేకపోతే నిద్రపట్టదు.
ఒకసారి వరుసకు చెల్లెలు అయిన నీరజాక్షి ఇంటికి వచ్చాడు.సోఫాలో కూర్చుని కొంచెంసేపు పిచ్చా పాటీ మాట్లాడుకుంటూ ఫలహారాదులు పూర్తిచేసిన తర్వాత ఇదుగో సోఫాలోఅంతా దుమ్మే ఉంది అన్నాడు.అసలే నీరజాక్షికి శుభ్రత ఎక్కువ.అదేమిటి?ఉదయమే కదా!పనిమనిషి సోఫాలు తుడిచింది.కోద్దె గొప్పో గాలికి ఏమైనా పడిందేమో!అంది నీరజాక్షి.నేను రోజూతుడిపిస్తాను.మీ ఇంట్లో అసలు తుడవరు కదా!అనేసింది నీరజాక్షి.అదేమిటి అలా మాట్లాడావు?అని భర్త అంటే అంతే కదా!వాళ్ళిల్లు శుభ్రంగా వుంటే ఎదుటివాళ్ళను అన్నాఅదోరకం.వాళ్ళిల్లు ఎప్పుడూ చూసినా ఇంత ఎత్తున దుమ్ముతో నిండి ఉంటుంది.ఎదుటివాళ్లను మాత్రం విమర్సిస్తూ ఉంటాడు.మనం ఏమీ అనకపోతే అసలు తెలియటంలేదు అంది నీరజాక్షి.
నోటిలో చిన్న చిన్న అల్సర్లు
బాగా వేడిచేసినప్పుడో లేదా ఏ కారణంతోనైనా ఒక్కొక్కసారి నోటిలో చిన్నచిన్న బొబ్బల్లా అల్సర్లు వస్తుంటాయి.అప్పుడు కొద్దిగా తేనె,కొంచెం పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని అల్సర్ ఉన్నచోట రాసి కాసేపయ్యాక పుక్కిలించి ఊసేయ్యాలి.ఈవిధంగా తగ్గేవరకు చెయ్యాలి.
Thursday, 23 July 2015
ఆ ఇద్దరు
రక్షిత మొక్కలు,కుండీలు కొనటానికి నర్సరీకి వెళ్ళింది.మొక్కలు నచ్చినవి పక్కన పెట్టిస్తుండగా ఇద్దరు ఆడవాళ్ళు పెద్దపెద్దగా మాట్లాడుతూ తెగ బేరాలాడుతున్నారు.నర్సరీ మొత్తం కలియతిరగటం తప్ప కొనేదీ లేదు వెళ్ళేదీ లేదని అక్కడివాళ్లు తిట్టుకుంటున్నారు.ఇంతలో రక్షితకు వీళ్ళను ఎక్కడో చూసినట్లుందని అనిపించింది.చాలా సంవత్సరాల క్రితం చూడటం వలన వెంటనే గుర్తురాలేదు.అదీకాక అతిసాదాసీదా బట్టలు వేసుకునేసరికి ఒక 10 ని.ల తర్వాత కానీ ఫలానా అని తెలియలేదు.ఇంతకీ వాళ్ళిద్దరూ ఒకరు ప్రముఖ కాలేజీలో అధ్యాపకుని భార్య.ఒకరు ప్రముఖ వైద్యుని భార్య.ఆ ఇద్దరూ అమ్మాకూతుళ్ళు.ఇద్దరి భర్తలకు ఎదుటి వాళ్ళనుండి డబ్బు గుంజటమే తెలుసు కానీ ఇవ్వటం తెలియదు.పరమ పిసినారులు.అంతసేపు విసిగించి ఒక్క మొక్కైనా కొనకుండానే వెళ్ళారు.
జలుబు,దగ్గుతో పాటు.......
ఒకగ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకుని దానిలో చిటికెడు పసుపు,ఒక స్పూను తేనె
కలిపి తాగితే జలుబు,దగ్గుతో పాటు గొంతు నొప్పి,ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి.
కలిపి తాగితే జలుబు,దగ్గుతో పాటు గొంతు నొప్పి,ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి.
ఎక్కడైనా నొప్పి పడితే.......
మనకు తెలియకుండానే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట పట్టేసి నొప్పి అనిపిస్తుంటుంది.అలాంటప్పుడు సమయానికి ఇంట్లో మన దగ్గర నొప్పి తగ్గించడానికి రాసే మందు ఉండక పోవచ్చు.
కొంచెం కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం మెత్తగా చేసి ఒక 5 ని.లు వేడి చేసి చల్లార్చాలి.తర్వాత చల్లార్చిన నూనెను
నొప్పి ఉన్నచోట రాయాలి. రోజుకు 2,3 సార్లు రాస్తే నొప్పి తగ్గుతుంది.
Wednesday, 22 July 2015
రంపల రాకాసి
సుశాంతికి విదేశాలలో పెద్దవాళ్ళు కూడా ఎంతో హుషారుగా ఎవరిపని వారే చేసుకోవటం చూచి మనం ఎంత సోమరిపోతులుగా ఉన్నామో?అనిపించింది.పనివాళ్ళతో కూర్చుని అన్నిపనులు చేయించుకోవటం వల్ల శరీరానికి తగిన వ్యాయామం లేక బరువు పెరిగి అక్కడనొప్పి,ఇక్కడనొప్పి అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తుందని అనుకుంది.అయినా అంత పెద్దవాళ్ళు ఎవరిపనులు వాళ్ళు చేసుకోగాలేనిది నేను చేసుకోలేనా ఏమిటి?అని ఒకపెద్ద నిర్ణయం తీసుకుంది.అలవాటు లేని పనులు చేసుకోవటం కష్టం అని ఇంట్లోవాళ్ళు చెప్పినా వినకుండా నేను చేసుకోగలను అని ప్రగల్భాలు పలికింది.నగరంలో ఎక్కడ ఉన్నాయో అంతర్జాలంలో వెదికి ఇంటి పనులకు ఉపయోగపడే అన్నిరకాల సరికొత్త మోడల్ యంత్రాలను తెప్పించింది.అదే ఇంట్లో వాళ్ళు గానీ,మరెవరైనా చేయమంటే నన్ను పని చేయమంటారా?అంటూ రంపల రాకాసి లాగా మీదపడేది.ఒక్కరోజు పనిమనిషి రాకపోతే వేరేవాళ్ళు వచ్చి చెయ్యాల్సిందే తప్ప ఇటుగిన్నెఅటుపెట్టేది కాదు.సుశాంతి తనకుగా తను స్వనిర్ణయం తీసుకోవటం వల్ల ఏ బాధా లేకుండా సంతోషంగా చేసుకుంటుంది.
పొగడ పువ్వుల పరిమళం
తన్మయి ఊరిలో ఒక పెద్ద గ్రంధాలయం ఉండేది.ఆ గ్రంధాలయంలో రెండు పెద్దపెద్ద పొగడ చెట్లు ఉండేవి.ఆచెట్లచుట్టూ గుండ్రంగా కూర్చోవటానికి వీలుగా సిమెంటు చప్టా కట్టారు.ఊరిలో పెద్దలు,పిల్లలు రోజూ సాయంత్రం కాసేపు గ్రంధాలయానికి వచ్చితమకు నచ్చిన పుస్తకాలు ఆచప్టాపై కూర్చుని చదువుకునేవారు.తన్మయి తాతగారికి పుస్తకాలంటే చాలా ఇష్టం.ఈ పుస్తకం,ఆపుస్తకం అనే తేడా లేకుండా అన్ని పుస్తకాలు చదివేవారు.రోజూ గ్రంధాలయానికి వెళ్తూ మనుమరాలిని తన వెంట తీసుకెళ్ళేవారు.ముందు తన్మయికి పొగడ పువ్వులన్నా ఆ పువ్వుల పరిమళం అన్నాఎంతో ఇష్టం.దానికి తోడు వాళ్ళ తాతగారు పొగడచెట్టు చుట్టూ ఉన్న చప్టాపై కూర్చోబెట్టి చల్లటిగాలిలో పొగడ పువ్వుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఏపుస్తకం చదివినా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పేవారు.చందమామ,బొమ్మరిల్లు,బాలమిత్ర వంటి పుస్తకాలు ఇచ్చి చదవటం అలవాటుచేశారు.పెద్దయిన తర్వాత కూడా అదే అలవాటుతో ఏదైనా పుస్తకం పట్టుకుంటే అది పూర్తిగా చదివే వరకూ వదలదు.తన్మయి తాతగారికి ఎనభై సంవత్సరాలు వచ్చినా రోజూ ఏదో ఒక కొత్త పుస్తకం చదవాల్సిందే.లేకపోతే నిద్ర పట్టదు.ఇంకో సంగతండోయ్!తన్మయికి పొగడచెట్టు చుట్టూ రాలిన పువ్వులు ఏరుకోవడమంటే మరీ ఇష్టం.ఆపువ్వులను తెచ్చి పుస్తకాల అలమరలో,తన బట్టల బీరువాలో వేసేది.ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే పొగడ పువ్వులు వేస్తే మంచి సువాసనతోపాటు చిన్నచిన్న పుస్తకాల పురుగులు,బట్టల పురుగులు రాకుండా ఉంటాయనితెలిసింది.అదీకాక పుస్తకపఠనం మంచి అలవాటు కదా!అందరూ ఎవరికి వీలయినప్పుడు వాళ్ళు కొద్దిసేపైనా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే మంచిది.
Tuesday, 21 July 2015
పట్టువదలని విక్రమార్కుడు
శ్వేతాదేవి గారికి డెబ్భై సంవత్సరాలు.విదేశాలలో ఉన్న తనవాళ్ళను చూడటానికి కుటుంబసమేతంగా వెళ్లారు.మేనమామ కొడుకు తనింటికిరావాల్సిందిగా అందరినీ ఆహ్వానించాడు.వాతావరణం సరిగాలేని కారణంగా విమానం చేరుకోవాల్సిన ప్రదేశం కన్నా ముందే దించేశాడు.కాస్త ఇబ్బందిపడి ఎట్టకేలకు శ్వేతాదేవిగారు ఏడుగంటల అనంతరం అసలు విమానాశ్రయానికి చేరుకున్నారు.అనుకున్న ప్రకారం మేనమామ కొడుకు వర్షంలోనే విమానాశ్రయానికి చేరుకున్నాడు.ఏడుగంటలు నిరీక్షించి అర్థరాత్రి వర్షంలోనే ఇంటికి తీసుకెళ్ళాడు.భార్యాభర్తలిద్దరూ ఎంతో ప్రేమగా అన్నివసతులు ఏర్పాటు చేసి దగ్గరుండి మరీ చూడవలసిన ప్రదేశాలన్నీ చూపెట్టారు.ప్రణాళిక ప్రకారం అన్నీ చూపించలేక పోతున్నానని బాధపడి వీలయినవన్నీతిప్పిచూపించి చివరకు నగరం మొత్తం కనిపించే విధంగా నదీవిహారానికి తీసుకెళ్ళాడు.బయట విపరీతమైన చలి.వద్దన్నా వినకుండా నదీవిహారం చేస్తూ దీపాల కాంతిలో నగరాన్నివీక్షించడం చాలా అద్భుతంగా ఉంటుందని మేనత్తకూతురికి ఎలాగైనా దాన్ని చూపించాలని ఆమె కార్ పార్కింగ్ నుండి నడవటం కష్టమని బోటు ఎక్కవలసిన ప్రదేశం వరకు దారి కనుక్కుని పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు.శ్వేతాదేవిగారు తనకు శ్రమ కలగకుండా తీసుకెళ్ళడానికి పడ్డ కష్టానికి తగినట్లుగానే నదీవిహారం చేస్తూ నగరం మొత్తాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉందని మేనమామ కొడుకుని మెచ్చుకున్నారు.
Monday, 20 July 2015
పారిజాతం విశేషాలు
పారిజాతం మొక్క ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో పెంచుతున్నారు.ఈ పువ్వులు రోజూ రాత్రిపూట పూసి ఉదయానికి క్రింద రాలిపోతుంటాయి.పారిజాతం దేవతావృక్షం కనుక ఆ పువ్వులతో భగవంతునికి పూజ చెయ్యటం మంచిది కనుక రాత్రిపూట ఈ మొక్క చుట్టూ ఒక పలుచటి వస్త్రాన్ని పరిచి ఉంచితే ఉదయానికి పువ్వులు రాలిపోయి ఉంటాయి కనుక తేలికగా సేకరించవచ్చు.పారిజాతం పువ్వులు పూజ చేసిన తర్వాత చెత్తలో ఎక్కడంటే అక్కడ పడెయ్యకూడదు.ఒక సంచిలో వేసి నీళ్ళల్లో వెయ్యాలి లేదా మొక్కల మొదలులోవెయ్యాలి. పువ్వులు కాళ్ళతో తొక్కకూడదు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Sunday, 19 July 2015
యంత్రాలను నమ్ముకో
ధన్య ఒక 20 రోజుల క్రితంవరకు తనకు పనిమనుషులు లేకపోతే ఇంట్లో చాలా
ఇబ్బంది అనుకుని అందరికన్నా ఎక్కువ జీతం ఇచ్చి మరీ ముప్పొద్దులా తినటానికి వేడివేడిగా విందుభోజనంలాగా అన్నీపెట్టేది.ఉద్యోగరీత్యా వేరేవేరే నగరాల్లో ఉన్నప్పుడు కూడా పనివాళ్ళతో ఏఇబ్బందీ లేదు.అలాంటిది ఈ మధ్య స్వంతఊరిలో పాత పనివాళ్ళు వయసురీత్యా పెద్దవాళ్ళవటంతో కొత్త పని వాళ్ళను మాట్లాడుకోవటంతో చుక్కలు చూపెట్టారు.పనిమనిషి రాగానే అమ్మా!టీ పెట్టండమ్మా!టీ తాగకపోతే పనిచెయ్యలేను అనేది.గమనిస్తారనుకుంటే ఒక రకంగా గమనించకపోతే ఒకరకంగా పని చేసేది.బట్టలు ఉతకటానికి వచ్చిన అమ్మాయి అమ్మా!నాకు ఆకలి వేస్తుంది తినటానికి టిఫిన్ పెట్టండమ్మా!మీరు తప్ప ఎవరూ పెట్టరు అనేది.పోనీ పని ఏమన్నా శుభ్రంగా చేస్తారా!అంటే అదేమీ లేదు.మేడపైకి తీసికెళ్ళి బట్టలు ఉతకకుండా మంచి వాసన వచ్చే ద్రవం వేసి నీళ్ళల్లో ముంచి ఆరేసేది.ఇద్దరూ మొదట అనుకున్న సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు.పని ఉండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సమయానికి రాకపోవటం వల్ల ఇబ్బందిగా ఉండేది. ఈ ఇద్దరితో విసిగిపోయిన ధన్యకు పనివాళ్ళంటేనే విసుగు వచ్చేసింది.వీళ్ళకు నేను చాకిరి చేసి అన్నీపెట్టి,డబ్బిచ్చి,రోజూ వీళ్ళకోసం ఎదురు చూడటం విసుగ్గా ఉందనుకుని ఎవరి పని వాళ్ళు చేసుకోవటం అంత ఉత్తమం రెండోది లేదనుకుని ధన్య ఇద్దరికీ స్వస్తి పలికి బట్టలకు,గిన్నెలకు,ఇల్లు శుభ్రం చేయటానికి యంత్రాలు తెచ్చుకుంది.ఎన్నో సంవత్సరాలుగా పనివాళ్ళు లేకపోతే పొద్దు గడవదు అనుకునేది.ఇప్పుడు వాళ్ళు లేకపోతే హాయిగా ఉంది.ఎప్పటి నుండో ధన్య కూతురు అమ్మా!మనుషులకన్నా యంత్రాలను నమ్ముకో సౌకర్యంగా ఉంటుంది అంటుంటే ఇద్దరు మనుషులకు పని కల్పించనట్లవుతుందిలే అనేది ధన్య. ధన్యకు ఇప్పుడు కూతురు చెప్పినదే నిజం అనిపిస్తుంది.వీలయినప్పుడు యంత్రాలలో వేస్తే వాటిపని అవి చేస్తున్నాయి. పనివాళ్ళ కన్నా చాలా బాగా శుభ్రంగా చేస్తున్నాయి.ఇప్పుడు ధన్యకు చాలా సౌకర్యంగా ఉంది.
Friday, 17 July 2015
ఆడంబరాలకు పోయి...........
నిర్గుణకు ముగ్గురు పిల్లలు.పిల్లలు అందరూ చక్కగా చదువుకుని స్థిరపడ్డారు.ఎదురింటి వాళ్ళకన్నా,పక్కింటి వాళ్ళకన్నా మనమే గొప్పగా కనిపించాలనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ పిల్లలకు అతి ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసింది.ఎంత ఖర్చు పెట్టి చేసినా నాలుగు రోజులు బాగా చేశారనుకుంటారు.తర్వాత యధా రాజా తధా ప్రజా అన్నట్లుగా ఉంటుంది.దాని భాగ్యానికి అప్పులు చేస్తే పోయినంత పొడుగూ తీర్చలేక ఇబ్బంది.తిన్ననోటితోనే గొప్పలు పోవటం ఎందుకు?అప్పులు చేయటంఎందుకు?అని మాట్లాడతారు. కనుక ఆడంబరాలకు పోయి అప్పుల పాలు కావద్దు.ఎవరికి తగినట్లు వాళ్ళు ఖర్చు పెట్టుకోవటం ఉత్తమం.ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా బ్రతకవచ్చు.
Thursday, 16 July 2015
బెండకాయలు తాజాగా.........
బెండకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే రెండువైపులా చివరలు కోసి కవర్లో పెట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
కాళ్ళు,మడమలు ఆరోగ్యంగా..............
కదలకుండా ఒకేచోట కూర్చుని పనిచేయటం లేకపోతే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం వల్ల కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టడం,కాళ్ళ కండరాలు పట్టేయటం వంటివి జరుగుతుంటాయి.కనుక కూర్చున్నప్పుడు పాదాలు పూర్తిగా నేలకు ఆనించి కూర్చోవటం మంచిది.మధ్యమధ్యలో లేచి ఒక 5 ని.లు అటూఇటూ నడవాలి.రోజూ ఒక అరగంట ఉదయం,సాయంత్రం నడవటం మంచి వ్యాయామం.అప్పుడప్పుడు చెప్పులు లేకుండా గడ్డిలో నడవటం వల్ల పాదాలకు మంచిది.వారానికి ఒకసారైనా గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి ఒక 10 ని.లు పెడితే అలసిన పాదాలకు విశ్రాంతి ఇచ్చినట్లవుతుంది.పాదాలు,మడమల నొప్పులు వంటివి రాకుండా ఉంటాయి.రోజుకొకసారైనా కాళ్ళకు,పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుంటే నునుపుగా,అందంగా ఉంటాయి.ఎత్తు చెప్పులు,సూదిమొన లాంటి చెప్పులు వేసుకుంటే మడమల నొప్పులు వస్తాయి కనుక వేసుకోకపోవటం మంచిది.
Tuesday, 14 July 2015
శ్వాస సంబంధ సమస్యలకు ...........
ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూను అల్లం రసం,ఒక స్పూను తేనె,ఒక స్పూను
నానబెట్టిన సబ్జా గింజలు కలిపి తాగాలి.ఈవిధంగా చేస్తే శ్వాసకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
నానబెట్టిన సబ్జా గింజలు కలిపి తాగాలి.ఈవిధంగా చేస్తే శ్వాసకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
తీర్చలేని ఒక తల్లి బాధ
తార మేనత్త భర్తకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తీసుకుని వెళ్తే తలలో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారు.వెంటనే తీసుకురావటం వల్ల త్వరగానే కోలుకుంటాడని చెప్పారు.ఇంతలో కొడుక్కి రోడ్డు ప్రమాదం జరిగింది.ఆప్రమాదంలో కొడుకు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.ఇటు కొడుకు గురించి భర్తకు చెప్పలేని పరిస్థితి.చెపితే భర్త తట్టుకోలేడని భయం.అసలే ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగా లేదన్నా విపరీతమైన ఆందోళన పడుతుంటాడు.ఆయన ఎదుట కొడుకుని తలుచుకుని బాధగా ఉండి ఏడుపు వచ్చినా ఏడవలేని ఇబ్బందికరమైన పరిస్థితి.బంధువులు ఎవరైనా భర్తను చూడటానికి వస్తే ఆసుపత్రిలో ఉన్న కొడుకు గురించి భర్త చూడకుండా చిన్నగా చెప్పి చీర కొంగు అడ్డు పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంటే వెళ్ళిన వాళ్లకు కూడా ఎంతో బాధగా ఉంటుంది.ఎంత బాధగా ఉన్నా ఆ తల్లి బాధను ఎవరు తీర్చగలరు?అది ఎవరి వల్లా సాధ్యం కాని పని.అయ్యో!ఎంత కష్టం వచ్చిందని బాధ పడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.
Monday, 13 July 2015
పొట్ట తగ్గాలంటే ........
మంచినీళ్ళు - 6 కప్పులు
తురిమిన అల్లం - 1 టేబుల్ స్పూను
కీరా - 1
నిమ్మకాయ - 1
పుదీనా ఆకులు -1/4 కప్పు
ముందుగా నీళ్ళు ఒక జగ్ లో పోసి గుండ్రంగా కోసిన కీరా,నిమ్మకాయ ముక్కలు,పుదీనా ఆకులు,తురిమిన అల్లం అన్నీ కలిపి రాత్రంతా ఉంచి తర్వాత రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు తాగాలి.ఇలా చేస్తుంటే క్రమంగా పొట్ట తగ్గుతుంది.
తురిమిన అల్లం - 1 టేబుల్ స్పూను
కీరా - 1
నిమ్మకాయ - 1
పుదీనా ఆకులు -1/4 కప్పు
ముందుగా నీళ్ళు ఒక జగ్ లో పోసి గుండ్రంగా కోసిన కీరా,నిమ్మకాయ ముక్కలు,పుదీనా ఆకులు,తురిమిన అల్లం అన్నీ కలిపి రాత్రంతా ఉంచి తర్వాత రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు తాగాలి.ఇలా చేస్తుంటే క్రమంగా పొట్ట తగ్గుతుంది.
Sunday, 12 July 2015
నిలువుదోపిడీ
భారతి కొంచెం ఎడమచేయి లాగుతుందని ఎందుకైనా మంచిది అని
గుండె వైద్యుని దగ్గరకు వెళ్ళి అన్ని పరిక్షలు చేయించుకుంటే బాగుంటుందని వెళ్ళింది.గుండె నొప్పి లేదు కనుక అది మామూలు నొప్పి అంటూనే అన్ని పరిక్షలు చేయించమని చాంతాడంత పట్టిక రాసిచ్చాడు.అది తీసుకుని కొన్నివేల రూపాయలు సమర్పించి వెళ్తే అక్కడ చేసే నిపుణులు లేరన్నారు.ఒకటి చేసి ఒకటి చెయ్యకుండానే చెయ్యవలసినవి ఇంతే అని చెప్పారు.ఎంతోకొంత తెలుసు కనుక అన్ని పరిక్షలు చెయ్యలేదేమిటి?అంటే దానిలోనే అంతా తెలుస్తుంది అన్నారు.దానిలోనే తెలిసేట్లయితే విడిగా ఎందుకు డబ్బు తీసుకోవటం జనాలను దోచుకుతినటం కాకపోతే. వైద్యుడ్ని అమాయకంగా అడిగినట్లుగా ఫలానా పరిక్ష ఇంకో దానిలో తెలుస్తుందని చెప్పి చెయ్యలేదు అని అంటే అవునవును దీనిలోనే తెలుస్తుంది అంటూ ఆయన కూడా తప్పు కప్పిపుచ్చాడు.ఇది వేరు అదివేరు అన్న విషయం వీళ్ళకు తెలుసు.అంతకన్నాగట్టిగా మాట్లాడినా ప్రయోజనం ఉండదు కనుక అడగలేదు..అన్ని ఆసుపత్రుల పరిస్థితీ అదే.చివరకు ఏమీలేదు రోజూ వ్యాయామం చెయ్యండి అని సలహా ఇచ్చాడు.ఆమాట మొదటే చెప్తే డబ్బు రాదుగా!అందుకే సగం పిండిన తర్వాత చెప్పటం.ఇంకానయం ఇతను కొంతలో కొంత మెరుగు.బుట్టెడు మందులు రాయలేదు అందుకు సంతోషపడాలి.అవసరం ఉన్నా లేకున్నా మందులు రాయటం ఈనాటి ఫ్యాషన్.అవి మింగి లేనిపోని రోగాలు కొనితెచ్చుకోవటం.ఖర్మ కాలి గుండెకు ఏదైనా తేడా ఉందా!వాళ్ళ పని అయిపోయినట్లే.ఆసుపత్రిలో నిలువు దోపిడీనే.ఇది ఈనాటి పరిస్థితి.
Saturday, 11 July 2015
పడిపోయాక పంపుతావా?
బిందు మాధవి పిన్నికి జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది.అక్కడ వైద్యుడు మంచివాడని అందరూ వెళ్తారు కానీ సరయిన పర్యవేక్షణ లేదు.అందుకని అక్కడి నర్సులు వరుసగా అందరినీ పిలుస్తున్నారు.చాలామంది గుంపుగా ఉన్నారని మళ్ళీ వెళ్ళి కూర్చోమంటున్నారు.అందులోఒకతనికి విపరీతమైన దగ్గు వస్తుంది.అటువంటి వాళ్ళను వైద్యుని వద్దకు అందరికన్నాముందు పంపాల్సిందిపోయి నేను పంపిస్తాను కదా!మీరు వెళ్ళి కూర్చోండి అంటూ అటూఇటూ తిప్పేసరికి అతనికి విపరీతమైన కోపం వచ్చింది.ఏంటి?క్రింద పడిపోయాక పంపుతావా?అని ఒక్క అరుపు అరిచేసరికి గబాల్నఅతన్ని వైద్యుని దగ్గరకు పంపింది.
Thursday, 9 July 2015
పైత్యకారి
రిధిమ ఇంటికి ఎవరైనా వెళ్తే ప్రక్కనే ఒక కుర్చీ వేసుకుని వెళ్ళిన వాళ్ళముఖంలో ముఖం పెట్టి అదేపనిగా చూస్తూ కూర్చుంటుంది.వాళ్లకు మంచినీళ్ళిచ్చికాఫీకానీ,టీ కానీ ఇచ్చి మర్యాదచేద్దామని అసలు ఉండదుఏమీ ఎరగనట్లుగా కూర్చుంటుంది.ఎవరింటికైనా భోజనసమయానికి వచ్చి సుష్టుగా తినేసి వెళ్ళిపోతుంది.సరిగా సమయానికి అన్నీ అమర్చక పోయారో ఇంటికి వెళ్ళి పిచ్చి తిట్లతో తూర్పారబడుతుంది.తన ఇంటికి వస్తే మర్యాదచేద్దామని అనుకోదు కానీ ఎదుటి వాళ్ళింటికి వెళ్తే సకల మర్యాదలు జరపాలనుకోవటం తెలివితక్కువతనంతో కూడిన స్వార్ధం.ఎవరైనా ఒకసారి,రెండుసార్లు మర్యాద చేస్తారు అంతేకానీ ఎల్లప్పుడూ చెయ్యలేరు కదా!పైత్యకారి వస్తుందని పక్కకు తప్పుకుంటారు.
Wednesday, 8 July 2015
సంపూర్ణ ఆరోగ్యం కోసం వెళ్తే ...........
సులోచన ఆరోగ్యంగానే ఉన్నాముందుముందు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో
ఉండటం కోసం యోగా దినోత్సవం సందర్భంగా తరగతులు పెడితే యోగాసనాలు నేర్చుకుందామని వెళ్ళింది.మొదటి రోజునే నేర్పటానికి వచ్చిన యోగా గురువు అన్ని ఆసనాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే వేయించారు.ఇంటికి వచ్చిన తర్వాత సులోచన రోజంతా నిద్రపోతూనే ఉంది.సాయంత్రం అయ్యేటప్పటికి ఎడమచెయ్యి భుజం దగ్గరనుండి మోచేతి మధ్యలో మెలితిప్పినట్లు నొప్పిగా ఉంది.నొప్పి తగ్గటానికి నొప్పి మందు వేసుకుంది.పదిరోజులైనా తగ్గలేదు .చెయ్యి మొత్తంనొప్పి వచ్చింది.వైద్యులు కండరం బెణకటం వల్ల నొప్పివచ్చిందని చెప్పారు.పరిక్షలకుగానీ,మందులకుగానీ నాలుగువేలు వదిలించుకుని సులోచన ఇంటికి వెళ్ళింది.15 రోజులతర్వాత కూడా తగ్గకపోతే వేరే పరీక్ష చెయ్యాలని చెప్పారు.యోగా మాట దేముడెరుగు అప్పటినుండి ఇప్పటికి నానా తిప్పలు పడాల్సి వస్తుందని సులోచన బాధపడింది.
సూచన:శరీరానికి అసలు వ్యాయామం లేనివాళ్ళు మొదట నిదానంగా నేర్చుకోవాలి కానీ హడావిడిగా ఒక్క రోజులో ఏదో చేద్దామని వెళ్ళకూడదు.సులోచన లాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది.జాగ్రత్త సుమా!పగటి కునుకు
ఏకారణం వల్లనైనా ఒకవేళ రాత్రిపూట నిద్ర పట్టకపోయినా లేదా మెలుకువగా ఉండాల్సి వచ్చినా తర్వాత రోజు పగలు కాసేపు నిద్రపోగలిగితే ముందు రోజు నిద్రలేని ప్రభావం అంతగా తెలియకుండా ఉంటుంది.అలాగని రోజూ భోజనం చేయగానే నిద్రకు అలవాటు పడితే పొట్ట పెరిగి బరువు పెరుగుతారు.
Tuesday, 7 July 2015
భోజనానికి వచ్చి.........
నిమ్మీ తమ్ముడు నరేష్ అక్క ఇంటికి ఎప్పుడంటే అప్పుడు వేళ కాని వేళలో వస్తే పాపం ఎంతో శ్రమపడి హడావిడిగా వంటచేసి భోజనం పెడుతుంటుంది.వాళ్ళ భోజనాలైన తర్వాత తనకు ఇబ్బందైనా తమ్ముడు వచ్చాడని అప్పటికప్పుడు పరుగెత్తుతూ వంటచేసి పెడితే తిన్నంతసేపు అన్నీ బాగానే ఉన్నాఇది అలా ఉంది,అది ఇలాఉంది అంటూ భోజనం చేస్తున్నంతసేపూ గొణుగుతూనే ఉంటాడు.ఇంతకుముందు విసుగు వచ్చేది కాదు కానీ ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేస్తుంది నిమ్మీకి.కావాలని ఎప్పుడంటే అప్పుడు రావడమెందుకు?భోజనానికి వచ్చిపనికట్టుకుని వండిపెడితే తిన్నంతసేపు గొణగడమేమిటి?తిక్కపనులు కాకపోతే?వెళ్తూ వెళ్తూ ఏదోకటి అక్క బాధపడేలా కుంటిమాటలు మాట్లాడి వెళ్తుంటాడు.అదేమి విచిత్రమో?వండించుకుని తిని మరీ అక్కను బాధ పెట్టి వెళ్ళటం ఏమి సంస్కారం?పిచ్చి వెధవ.సహనానికి కూడా హద్డుంటుంది కదా!నిమ్మీ చేసి పెట్టినందుకు బాధపడదు కానీ కుంటి మాటలవల్ల బాధపడాల్సి వస్తుంటే మాత్రం తమ్ముడు రాకపోవటమే మంచిదని ఈమధ్యనే భావిస్తుంది.ఎవరు చెప్పినా ఇన్నిరోజులు అర్ధం కాలేదు పోనీలే!ఇప్పటికైనా అర్ధమైంది చేసేది కాక అడ్డమైన మాటలు పడటం అని వింటున్న స్నేహితురాళ్ళు అనుకున్నారు.
Monday, 6 July 2015
చిన్న మెదడు చితికి.......
హరనాధ్ పిల్లల చదువులకోసం నగరానికి వచ్చాడు.కొడుకు కుటుంబాన్ని చూచి వెళ్దామని తండ్రి ఊరు నుండి వచ్చాడు.నాలుగు రోజులు ఉండేటప్పటికి పెద్దాయన జ్వరంతో, వాంతులతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చేర్చారు.తండ్రికి భోజనం తీసుకుని హరనాద్ ఆసుపత్రికి బయలుదేరాడు.దారిలో రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా ఆటోవాడు వచ్చి కొట్టేసరికి హరనాద్ డివైడర్ మీద పడి తలకు గట్టిదెబ్బ తగిలింది.తండ్రి ఉన్న ఆసుపత్రిలోనే కొడుకును కూడా చేర్చారు.వైద్యులు స్కానింగ్ తీసి చిన్న మెదడు పూర్తిగా చితికిపోయింది కనుక వెంటనే ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు.మనిషి బ్రతికున్నా ఇంతకు ముందు లాగా ఉండడు అని చెప్పారు.మనిషి బ్రతికితే చాల్లే అనుకుని ఇంట్లోవాళ్ళు సరేనన్నారు.ఈవిషయం తండ్రికి తెలియదు.ఏ నిమిషం ఏమి జరుగుతుందో అన్నట్లు తండ్రికోసం వెళ్ళి చావుబతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉన్నాడు.బ్రతకొచ్చు లేదా బ్రతకక పోవచ్చు చెప్పలేని పరిస్థితి.నిర్లక్ష్యంతో కూడిన అతివేగం మనిషి ప్రాణాలమీద కొచ్చింది.పిల్లలు చిన్నపిల్లలు.తండ్రి లేని పిల్లలైపోతారేమోనని కుటుంబ సభ్యులు,బంధువుల బాధ.
Saturday, 4 July 2015
రోజుకో కప్పు
రోజుకో కప్పు టొమాటో రసంలో ఒక స్పూను నిమ్మరసం కలిపి తాగితే బరువు తగ్గుతారు.అలాగే మనకు అప్పుడప్పుడు నిద్రలో ఎక్కడో ఒకచోట కండరాలు పట్టేస్తుంటాయి.అలాంటప్పుడు ఒక కప్పు తాజా టొమాటో రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.
రోజుకో రెండు
ఖర్జూరాల్లో ఒకప్పుడు పండువి,ఎండువి మాత్రమే దొరికేవి.అబ్బో!ఇప్పుడు రకరకాల ఖర్జూరాలు మార్కెట్లో దొరుకుతున్నాయి.ఏరకానికి చెందినవైనా రోజుకో రెండు తింటే వాటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.కాన్సర్,ఆస్టియోపొరాసిస్ వంటివి దరిచేరకుండా ఉంచుతాయి.కళ్ళకు,దంతాలకు ఎంతో మంచిది.దీనిలో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత బారిన పడకుండా ఉంటాము.ఖర్జూరం తిన్న వెంటనే అలసట,నీరసం తగ్గి వెంటనే శక్తి వస్తుంది.ఎండు ఖర్జూరాలు నీళ్ళల్లో రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటే కొలెస్టరాల్ అదుపులో ఉంటుంది.గుండెకు కూడా మంచిది.ఖర్జూరాలు తినటం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా తయారయి జుట్టు రాలకుండా ఉంటుంది.
Friday, 3 July 2015
ఈగలు,దోమలు రాకుండా ఉండాలంటే..........
ఈగలు,దోమలు రాకుండా ఉండాలంటే ఇంటిలో,వరండాలో అక్కడక్కడా కుండీలలో
బంతి,పుదీనా,తులసి మొక్కలు పెట్టాలి.వీటి ఆకుల వాసనకు దోమలు,ఈగలు పారిపోతాయి కనుక మనం వాటి బెడద లేకుండా హాయిగా,ప్రశాంతంగా ఉండొచ్చు.
బంతి,పుదీనా,తులసి మొక్కలు పెట్టాలి.వీటి ఆకుల వాసనకు దోమలు,ఈగలు పారిపోతాయి కనుక మనం వాటి బెడద లేకుండా హాయిగా,ప్రశాంతంగా ఉండొచ్చు.
బాబోయ్ ఈగలు
ఆషాడం వచ్చిందంటేనే ఈగలు,దోమలు అధికంగా వృద్ది చెందుతాయి.విందు భోజనాల దగ్గరైతే చెప్పనక్కరలేదు.అలోక్ బంధువులు మనుమడి పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేశారు.కానీ ఈగలు గురించి పట్టించుకోలేదు.తగిన శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల చాలా ఈగలు అక్కడక్కడే ఆహారపదార్ధాల మీద వాలుతున్నాయి.ఇదంతా చూస్తున్న అలోక్ కి చాలా చిరాకుగా అనిపించింది.అలోక్ ఇంట్లో అసలు ఈగ అన్నమాట ఉండదు.ఇంట్లోనే కాదు బయట కూడా ఉండవు.అలోక్ భార్య ఈగలు ఇంటి లోపలికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎప్పుడైనా ఒకటి వచ్చిందా దానికి నూకలు చెల్లినట్లే.ఎవరోఒకరు దాన్ని చంపేస్తారు.మన ఇంటితోపాటు,పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచితే ఈగలు,దోమలు రాకుండా ఉంటాయి. అలోక్ కాసేపు ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చుని భోజనం చేయకపోతే బాధ పడతారని తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో భోజనం చేశాననిపించి బయట పడ్డాడు.
చిట్కా:ఎక్కువగా ఈగలు ఉన్నప్పుడు కలరా ఉండలు కానీ కర్పూరం కానీ పొడిచేసి అక్కడక్కడా చల్లితే ఈగలు రాకుండా ఉంటాయి.
చిట్కా:ఎక్కువగా ఈగలు ఉన్నప్పుడు కలరా ఉండలు కానీ కర్పూరం కానీ పొడిచేసి అక్కడక్కడా చల్లితే ఈగలు రాకుండా ఉంటాయి.
Subscribe to:
Posts (Atom)