అనగనగా ఒక అమ్మ.ఆ అమ్మకు ఇద్దరు బిడ్డలు.ఒక కూతురు,ఒక కొడుకు.ఇద్దరినీ ఎంతో ప్రేమగా తన సుఖసంతోషాలను లెక్కచేయకుండా అందరికన్నా మిన్నగా ఇద్దరినీ సమానంగా పెంచింది.అయినా నీకు కూతురు అంటేనే ఇష్టం,నువ్వు కూతురునే బాగా చూచుకున్నావు అంటూ ఒకటే సతాయింపు.కూతురు ఇది కావాలి,అది కావాలి అని ఏనాడూ నోరు తెరిచి అడిగేది కాదు.కొడుకు చిన్నతనం నుండే చదువుకోకుండా పెంకిగా మోటారుసైకిల్ కావాలి,కారు కావాలి అంటూ అప్పోసోప్పో చేసి అయినా కొనిచ్చేదాకా మారం చేసి కొనిపించుకునేవాడు.అయినా తృప్తి లేదు.కాలక్రమంలో ఇద్దరికీ పెళ్ళిళ్ళయినాయి.కొడుకు వెధవ బుద్ధికి తగినట్లే తల్లి లేని చుప్పనాతి శూర్పణక ఇంటికి కోడలయ్యింది.తల్లి,బిడ్డ ఫోనులో మాట్లాడుకున్నా ఓర్చుకోలేక కూతురు ఫోను రాకుండా ఫోనునంబరు బ్లాక్ లిస్టులో పెట్టింది.అది తెలిసినా తెలియనట్లు కొడుకేమో భార్యావ్యామోహంతో కళ్ళకు పొరలు కమ్మి కళ్ళు మూసుకుపోయి నిజం తెలుసుకోలేని మూర్ఖుడు.వయసు మీద పడుతున్నాఇంటి భాధ్యత తెలియని మనుషుల మధ్య చాకిరీ తప్పని పరిస్థితి.ఎప్పుడైనా కూతురు దగ్గర నాలుగు రోజులుండి వద్దామనుకుంటే అమ్మ ఆస్థి రాసేస్తుందేమో అని భయం.భార్యాభర్త కలిసి తల్లిని ఎక్కడికీ వెళ్ళనివ్వరు.ఎవరైనా పెళ్ళికి అమ్మ రాలేదేమిటి? అని అడిగితే ఆరోగ్యం బాగోలేదు అని అబద్ధాలు.తెల్లారి లేస్తే ఇంటెడు చాకిరీ అమ్మే చేస్తుందని అందరికీ తెలుసు.తృప్తి లేని కొడుకు ఒకపక్క,తల్లి లేని పిల్ల అని కోడల్ని తన కూతురు కన్నాఎక్కువగా చూసినా తల్లి ప్రేమ తెలియక పాషాణంలాంటి కోడలు ఒకపక్క,చివరికి తన కూతురికి తల్లి ఉండీ లేని పరిస్థితిగా ఉందని ఆ తల్లి ఆవేదన చెందని రోజు లేదు.ఒకవేళ కూతురు అమ్మను ఇంటికి తీసుకెళదామంటే ఆస్థి దోచుకుతినడానికి తీసుకెళ్ళిందని దుష్ప్రచారాలు.ఈ తల్లి,కూతుళ్ళ ఆవేదన ఎప్పటికి తీరేనో?ఈరోజుల్లో ఇటువంటి మూర్ఖులు ఎక్కువైపోయి స్వశక్తితో సంపాదించుకోవటం చేతకాక పెద్దవాళ్ళను,తోడబుట్టిన వాళ్ళను నానా ఇబ్బంది పెడుతున్నారు.
No comments:
Post a Comment