Thursday, 5 November 2020

లక్షల చెట్లు

                                                                          ఒక చిన్న ప్రాణి ఉడుత వలన సంవత్సరానికి కొన్ని లక్షల  చెట్లు పెరుగుతాయన్న విషయం మనం కలలోనైనా ఊహించగలమా ? నిజానికి నేను కూడా మొదట ఈ విషయం వినగానే చాలా ఆశ్చర్యపోయాను.ఉడుత మనకు చేసే మేలు దాని  మతిమరుపు వలన చెట్లు పెరుగుతాయన్న విషయం చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పడం వలన తెలుసు.కానీ కొన్ని లక్షల చెట్లు పెరగడానికి ఉడుత దోహదపడుతుందన్న విషయం ఒక టి.వి లో వచ్చే కార్యక్రమం ద్వారా తెలిసింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఉడుత ఆహారం సేకరించే సమయంలో తర్వాత తినొచ్చు అన్న ఉద్దేశ్యంతో కొన్ని గింజలను భూమిలో చిన్న చిన్న గుంటలు తవ్వి దాచిపెడుతుంటుంది.తర్వాత వాటిని ఎక్కడ పెట్టిందో మర్చిపోతుంది.వర్షం వచ్చినప్పుడు ఆ గింజలు మొలకెత్తుతాయి. ఈ క్రమంలో ఉడుతలన్నీ 365 రోజులు రోజూ అదే పని చేయడంతో సంవత్సరం తిరిగేటప్పటికి  కొన్ని లక్షల చెట్లు పెరుగుతాయట.ఎంత ఆశ్చర్యం.నిజంగా పర్యావరణానికి ఇంత మేలు చేస్తున్న ఉడుతలకు,వాటి ద్వారా మొలకెత్తి ఎవరూ పెంచి పెద్ద చేయక పోయినా భగవంతుని దయ వలన వట వృక్షాలై మనకు ఎంతో మేలు చేసే చెట్లకు,మనకు ప్రత్యక్షంగా కనిపించకుండా వీటన్నింటినీ పరోక్షంగా చేస్తూ మనల్ని కాపాడుతున్న భగవంతునికి  మనందరం ఎంతో రుణపడి ఉన్నాము.ఎవరైనా మనకు ఏ చిన్న సహాయం చేసినా ,మేలు చేసినా ధన్యవాదాలు తెలియచెయడం మన పెద్దలు నేర్పిన సంస్కారం.అలాగే మనందరికీ ఇంత మేలు చేస్తున్న ఉడుతలకు,వృక్షాలకు,మనందరినీ చల్లగా కాపాడే భగవంతునికి మీ మా తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. 

మతిమరుపు

                                                                      ఈ రోజుల్లో చాలామందికి మతిమరుపు అనేది పెద్ద సమస్య అయిపోయింది.రంజిత కూడా అదే కోవలోకి వస్తుంది.ఏ వస్తువు అయినా అవసరమైనప్పుడు  ఉపయోగపడుతుందని చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది.కానీ అవసరమైనప్పుడు దాన్ని ఎక్కడ దాచిపెట్టిందో మర్చిపోవడంతో అది కనిపించకుండా పోయిన సందర్భాలెన్నో.మళ్ళీ క్రొత్త వస్తువు కొనుక్కోవడం కొన్నాళ్ళ  తర్వాత పాతది కనిపించినప్పుడు అయ్యో !ఎదురుగానే పెట్టి ఊరంతా వెతుక్కున్నాను అని బాధ పడిపోవడం పరిపాటి అయిపోయింది.ఒకసారి కళ్ళజోడు కనిపించలేదని ఇల్లంతా వెదికి ఉసూరుమంటూ కూర్చుంది. భర్త  కార్యాలయం నుండి వచ్చిన తర్వాత కళ్ళజోడు విషయం చెప్పింది.అదేంటి?నీ ముఖానే ఉందిగా !అనేసరికి అవాక్కయ్యింది.అప్పటివరకు పడిన శ్రమ అంతా మర్చిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుని పడీపడీ నవ్వేసింది.వెనుకటికి చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఉంది నా పరిస్థితి అనుకుంది రంజిత.

                                                 ఎవరికైనా ఇలా మతిమరుపు వస్తుంది అని సందేహం వచ్చినప్పుడు చిన్నప్పటినుండి మన జీవితంలో జరిగిన మంచి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ,మనసారా నవ్వుకుంటూ,నవ్వు తెప్పించే సంఘటనలను నలుగురితో పంచుకుంటూ మనసును ఉల్లాసంగా ఉంచేందుకు  ప్రయత్నిస్తే మతిమరుపు అనేది మనజోలికి రాకుండా ఉంటుంది.

కోపం

                                                                        విహిత  బహు కోపిష్టి.ముక్కు మీద కోపం ఉంటుంది.ప్రతి చిన్నదానికి అందరి మీద అరుస్తూ ఉంటుంది.ఏ చిన్న తప్పు చేసినా ఎదుటివారిని చీల్చి చెండాడినంత పని చేస్తుంది.దానితో ఎదుటివారు బిక్క చచ్చిపోవల్సిందే.అయితే మిగతా విషయాల్లో విహిత చాలా మంచిది.ఎదుటి వారి కష్టం,బాధ చూచి అసలు తట్టుకోలేదు.వెంటనే ఇదిగో నేనున్నానంటూ ఆగమేఘాలమీద వారికి  సహాయం చేస్తుంది.ఎంత మంచితనం ఉన్నా కోపం ఎక్కువ ఉండడంతో అందరికీ విహిత అంటే భయం.చనువుగా మాట్లాడలేరు.ఒకసారి విహిత ఇంటికి మనవరాలిని చూచి పోదామని అమ్మమ్మ వచ్చింది.రెండు రోజులు విహితను గమనించిన తర్వాత మనవరాలిలో ఉన్న కోపం అనే దుర్గుణాన్ని ఎలాగయినా పోగొట్టాలని ఖాళీగా ఉన్నప్పుడు ఆ కబురు ఈ కబురు చెబుతూ ఈ రోజు కూరలో కాస్త ఉప్పు ఎక్కువైంది అమ్మా!తినలేకపోయాను.కూరలో ఉప్పు ఎక్కువైనా తినలేము.అలాగని కాస్త తక్కువైనా తినలేము కదా! అలాగే మనకున్న కోపం కూడా ఉప్పులాంటిదే.ఎక్కువ అయితే ఎంత మంచితనం ఉన్నా విలువ ఉండదు.తక్కువ అయితే మర్యాద ఉండదు.కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని ఉప్పులా అవసరమైనంత మేరకు మాత్రమే వాడాలని సున్నితంగా తెలియచేసింది అమ్మమ్మ.అమ్మమ్మ చెప్పిన విధానానికి విహిత మారు మాట్లాడలేకపోయింది.ఇది విన్న విహిత కొద్దిసేపు నిశ్శబ్ధంగా కూర్చుని తర్వాత నెమ్మదిగా నా పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అమ్మమ్మా అని చెప్పింది.చెప్పే రీతిలో నచ్చే విధంగా చెప్తే ఎంతటి  మొండివారైనా తప్పకుండా మాట వింటారు.

Saturday, 24 October 2020

విజయదశమి శుభాకాంక్షలు

                                                        విజయ దశమి లోనే విజయం ఉంది.గత ఎనిమిది మాసాలుగా మనం అందరమూ కూడా భయాందోళనల మధ్య అశాంతితో ఎన్నో సమస్యలతో సతమతమైనా సాయిబాబా మరియు అమ్మవారి  దయ వలన వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగాము.ఇక ముందు కూడా అంతకన్నా ఎక్కువ ఆత్మస్థైర్యంతో,మానసిక,శారీరక ధృడత్వంతోపాటు ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునే బుద్ధి కుశలతను,మనశ్శాంతితోపాటు మనందరికీ సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించమని అమ్మను,బాబాను మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మన తెలుగువారందరికీ,నా తోటి బ్లాగర్లకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.సర్వేజనా సుఖినోభవంతు.

                                         


                             
                       
                                                     

                  

                    


                                                                 

Tuesday, 20 October 2020

ప్రేయస్సు - శ్రేయస్సు

                                                             మనం ఉదయం లేచిన దగ్గర నుండి మనకు నచ్చిన విధంగా భగవంతుడిని ఎన్నో రకరకాల కోరికలు కోరుకుని అవి తీర్చమని విసిగిస్తూ ఉంటాము.అందులో కొన్ని ధర్మబద్ధమైనవి,కొన్ని స్వార్ధపూరితమైనవి కూడా ఉంటాయి.ఏది ఏమైనా ఈ విధంగా ప్రియమైన వాటిని కావాలనుకోవడాన్నే ప్రేయస్సు అంటారు.కానీ భగవంతుడు ధర్మబద్ధమైనవి,మనకు ఏది అవసరమో, ఏది మంచిదో అది మాత్రమే ఇస్తాడు.దీనినే శ్రేయస్సు అంటారు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్న చందాన మనకు నచ్చినా నచ్చకపోయినా ఏది జరిగినా మన మంచికే అనుకుని సానుకూల దృక్పధంతో ఆలోచిస్తూ మనకు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడి ప్రశాంతంగా జీవించడం అలవరచుకోగలిగితే జీవితం ఆనందదాయకంగా  ఉంటుంది.

Monday, 19 October 2020

నిర్మల తటాకం

                                                          పెద్దలకు నా నమస్కారం.పిన్నలకు నా శుభాశ్సీసులు.పండుగకు ఇల్లు శుభ్రం చేసుకోవడం అయిపోయిందా అండీ ?నవరాత్రి,విజయదశమి సందర్భంగా అమ్మవారి పూజలతో హడావిడిగా ఉన్నారా ? ప్రత్యక్షంగా పూజలు చేయలేని వారు మనసులో నైనా  ప్రార్ధించవచ్చు.దీనికి సమయ నియమం లేదు.మనకు ఎన్ని పనులున్నా ఆ పనులు చేసుకుంటూనే మనసులో అమ్మవారిని తలచుకోవచ్చు.దీనితో మానసిక ఒత్తిడులన్నీ తొలగిపోయి మనసులో ప్రశాంతత గూడు కట్టుకుంటుంది.ఎటువంటి మానసిక ఆందోళన లేకపోవడంతో మనసు నిర్మల తటాకం అవుతుంది.మనకోసం మాత్రమే  కాకుండా సమస్త మానవాళి కోసం  సర్వేజనా సుఖినోభవంతు అంటూ రాగద్వేషాలకు అతీతంగా లోక కళ్యాణం కోసం ప్రార్ధించడం చాలా మంచిది.అప్పుడు మన మనసులు కూడా మంచితనంతో, ప్రేమానురాగాలతో నిండి ఉంటాయి.  మనసారా ప్రార్ధిస్తే ఎలాంటి సమస్యలు అయినా ఇట్టే తొలగిపోతాయని,సమస్యకు సరైన పరిష్కార మార్గం లభిస్తుందని మన పెద్దల మాట.ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఏవిధంగా పూజ చేసినా అమ్మవారి కృపాకరుణాకటాక్షవీక్షణాలు మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ నవరాత్రి ,విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 

Friday, 16 October 2020

అనుకోని అతిథి

                                                                            ఒకరోజు మధ్యాహ్నం యుతిక హాలులో సోఫాలో కూర్చుని ప్రక్కన  ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా స్నేహితురాలితో చరవాణి లో బాతాఖానీ కొడుతోంది.చిన్ననాటి కబుర్లతో పాటు పాత స్నేహితురాళ్ళు,కొత్త స్నేహితురాళ్ళ  గురించి గుక్క తిప్పుకోకుండా  రెండు గంటలపాటు సంభాషణ అలా అలా సాగిపోయింది.ఈ లోపు ప్రధాన ద్వారపు మెష్  తలుపు తీసి ఉండడంతో ఒక ఉడుత హడావిడిగా లోపలికి వచ్చి క్రింద పడిన గింజలు ఏరుకుని తిని ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అనే వెతుకులాటలో యుతిక కూర్చున్న సోఫా క్రిందికి వచ్చినప్పుడు అనుకోకుండా ఉడుత తోక యుతిక చీరకు తగలడంతో ఏమి వచ్చిందో ? అని కంగారుపడి యుతిక సంభాషణ ఆపి క్రిందకు చూసేసరికి ఉడుత తోక కనబడింది.మళ్ళీ ఫోను చేస్తాను అని స్నేహితురాలికి చెప్పి ఎటు వెళ్లిందో చూద్దామనుకుంటే కన్ను మూసి తెరిచే లోపే ప్రక్కింటి చెట్టు మీద పరుగెత్తుతూ కనిపించింది.ఇంతకీ అదెలా వెళ్ళింది అంటే వాకిలి ముందున్న  వేప చెట్టు కొమ్మలు యుతిక వరండాలోకి రావడంతో వాటి మీదుగా ప్రక్కింట్లో ఉన్నచెట్టుమీదికి దూకిందన్నమాట.రోజూ యుతిక తులసి మొక్కకు పూజ చేసి లోపలకు రావడం ఆలస్యం ప్రసాదం,అక్షింతలు తినడం ఉడుత దినచర్య.మొదట్లో యుతిక పిట్టలు తింటున్నాయేమో అని  అనుకుంది.ఒకరోజు యుతిక కాపలా కాసి మరీ ఈ విషయాన్ని కనిపెట్టింది.ఇంతకుముందు చరవాణి లో సంభాషణ ఆగిపోయింది కదా! మళ్ళీ చేసి స్నేహితురాలికి మా ఇంటికి ఈరోజు ఒక అనుకోని అతిథి వచ్చిందోచ్  అంటూ  కాసేపు ఉడుత కబుర్లు చెప్పింది.