Sunday, 31 January 2016

చికెన్ కట్లెట్

మెత్తటి కోడిమాంసం - 1/2 కేజి
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లం తురుము - 1 టేబుల్ స్పూను
పచ్చిమిర్చి - మూడు
బంగాళదుంప - 1
మిరియాల పొడి - 1 స్పూను
మసాలా పొడి - 1 స్పూను
 బ్రెడ్ పొడి - 1 కప్పు
గుడ్లు - 2
ఉప్పు - తగినంత
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - వేయించడానికి సరిపడా
                                                             చికెన్ ఉడికించి సన్నగా కీమాలా తరగాలి.ఉల్లిపాయ సన్నగా తరిగి కొద్దిగా నూనెలో వేయించుకోవాలి.అల్లం తురుము,సన్నని పచ్చిమిర్చిముక్కలు,కరివేపాకు వేయాలి.తర్వాత చికెన్ వేసి ఉప్పు,మిరియాల పొడి,మసాలా పొడి వేసి కలపాలి.మొత్తం కలిపి కూరలాగా తయారయ్యాక దించి ఒకపక్కన పెట్టి చల్లబరచాలి.దీనిలో ఉడికించిన బంగాళ దుంప ముద్దను వేయాలి.మొత్తం కలిపి దీన్ని కట్లెట్ ఆకారంలో తయారు చేసుకోవాలి.బాండీలో నూనె పోసి కాగనివ్వాలి.గుడ్లు కొట్టి తెల్లసొన మాత్రమే గిన్నెలో వేసి కట్లెట్లు తెల్లసొనలో ముంచి,బ్రెడ్ పొడి అద్ది కాగుతున్న నూనెలో వేయాలి.ఎర్రగా వేగాక తీసి కాగితంపై వెయ్యాలి.మిగలినవన్నీకూడా అలాగే వేయించాలి.అంతే రుచికరమైన నోరూరించే కట్లెట్లు సిద్ధం.


జయించగలనన్న ధీమా

                                                                    రుద్ర భర్త,పిల్లలతో ఆనందంగా ఉన్న సమయంలో ఒక రోజు ఒంట్లో నలతగా ఉందని ఆసుపత్రికి వెళ్ళింది.నరకం అనుభవించినా బతుకుతారో లేదో తెలియని భయంకరమైన కాన్సర్ వచ్చిందని తెలిసింది.కనిపించిన వైద్యుని దగ్గరకల్లా వెళ్ళి మాట్లాడితే ఒకాయన నువ్వు ఒక సంవత్సరంన్నర్ర కన్నా బతకవని నేరుగా రుద్రకు చెప్పేశాడు.కొన్నాళ్ళు వైద్యం చేయించుకుని తట్టుకోలేకపోయింది.చావు అంచు వరకు వెళ్ళిన ఒకామె ప్రకృతి వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతురాలైందని తెలిసి ఆమె దగ్గరకు వెళ్ళి వివరాలు తెలుసుకుని భర్తను తీసుకుని అక్కడకు వెళ్ళి వచ్చింది.రుద్రను చూడటానికి అక్క వచ్చింది.మాటల్లో రుద్ర అక్కా!నేను ఎప్పుడూ సానుకూలధృక్పదంతోనే ఆలోచిస్తాను.ఎక్కువ రోజులు బ్రతకనని తేల్చి చెప్పినా నేను తప్పకుండా మళ్ళీ నా భర్త,పిల్లలతో హాయిగా,ఆనందంగా ఉండగలనన్న నమ్మకం నాకుందని ఆత్మవిశ్వాసంతో చెప్పింది.రుద్ర సానుకూలత మరియు ఆత్మవిశ్వాసం కలగలిపి చావుని కూడా జయించగలనన్న ధీమా వ్యక్తపరిచింది.ఆమె నమ్మకం వమ్ముకాకూడదని తప్పకుండా ఆమె కోలుకోవాలని,ఆనందంగా కుటుంబంతో గడపాలని ఆశిద్దాము.    

Friday, 29 January 2016

గోడలపై మరకలు పోవాలంటే.......

                                                             వంట గదిలో చెత్త డబ్బాలో టీ వడపోసిన తర్వాత మిగిలిన టీపొడి పడేసేటప్పుడు కానీ,రసం వడపోయగా మిగిలిన పిప్పి వేసేటప్పుడు కానీ  ఎంత జాగ్రత్తగా వేసినా పక్కనే ఉన్న గోడపై ఏదో ఒక మరక పడుతూనే ఉంటుంది.అలా కొద్ది రోజులకు గోడంతా మరకలతో చూడటానికి బాగుండదు.అలా గోడపై పడిన మరకలు పోవాలంటే వంట పాత్రలు శుభ్రం చేసే ద్రావణంలో కొద్దిగా నీళ్ళు పోసి దానిలో మెత్తటి శుభ్రమైన వస్త్రం ముంచి గోడపై అప్పుడప్పుడు తుడుస్తుంటే మరకలు పోతాయి.

Tuesday, 26 January 2016

ఎండుటాకు మాదిరిగా.....

                                                      ప్రేమ లత ఉదయాన్నే తలుపు తెరవగానే వరండాలో ఒక మూలగా గుప్పెడు ఎండు వేపాకులు పక్కింటిలో నుండి గాలికి ఎగిరి వచ్చిచేరాయి.విసుగ్గా మొహం పెట్టి వాటిని చేత్తో తీసి చెత్త డబ్బాలో వేద్దామని పట్టుకుంది.ఇంతలో చేతిలో ఎండుటాకు  కదిలినట్లుగా అనిపించింది.ఉదయాన్నే ఏదో ధ్యాసలో ఉండి అలా అనిపించిందేమోలే అనుకుని చెత్తలో వేసింది.మళ్ళీ ఆకుల మధ్య కదలిక కనిపించేసరికి ఏంటా?అని చూచేసరికి అచ్చు ఎండుటాకు మాదిరిగానే అదే రంగులో ఉన్న కొంచెం రెక్క తెగిన సీతాకోక చిలుక నిదానంగా ఇవతలకు వస్తుంది.అయ్యో!పాపం సీతాకోక చిలుక ఎండుటాకుల్లో అదే రంగులో కలిసిపోవటం వల్ల చూడలేదనుకొని దాన్ని చెత్త డబ్బాలో నుండి తీసి బయటకు తీయగానే నిదానంగా ఎగిరి వెళ్ళిపోయింది.హమ్మయ్య!పొద్దున్నే ఒక ప్రాణిని కాపాడగలిగానని ప్రేమ లత సంతోషపడింది.

Monday, 25 January 2016

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

                                         భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
                                                                                                                                                                                                     

Sunday, 24 January 2016

ఎన్నో ప్రయోజనాల కర్బూజా

                                             నిద్ర బాగా పట్టాలంటే కర్బూజ పండు తినాల్సిందే.కర్బుజ తినడానికి అందరూ ఇష్టపడరు కానీ దీన్ని ఆహారంలో భాగం చేసుకొవడం వల్ల ఊబకాయం,మధుమేహంతో పాటు గుండెజబ్బులు రాకుండా ఉంటాయి.దీనిలో ఉండే కోలిన్ వల్ల బాగా నిద్ర పడుతుంది.జ్ఞాపక శక్తి పెరుగుతుంది.మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడవు.దీనిలో ఎక్కువగా పీచు,నీరు వల్ల డీహైడ్రేషన్ రాకుండా ఉండటమేకాక రక్త ప్రసరణ వేగం అదుపులో ఉంటుంది.దాంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉండదు వృద్ధాప్యంలో వచ్చే కంటి కండరాలు సన్నబడటాన్ని నిరోధిస్తుంది.ఒకటనేమిటి?ఇలా ఎన్నో ప్రయోజనాల కర్బూజా తినటం అన్నివిధాలా శ్రేయస్కరం.తినలేనివారు మొదటగా కొంచెం తేనె కానీ ,పంచదార కానీ కర్బూజా ముక్కపై వేసుకుని అలవాటు చేసుకుంటే క్రమంగా తినడం అలవాటవుతుంది.                        

Saturday, 23 January 2016

మిఠాయి లడ్డూ తేలికగా,రుచిగా .........

                                            ఇంతకు ముందు మిఠాయి లడ్డూ చెయ్యాలంటే పూస మొత్తం దూసిన తర్వాత పంచదార పాకం పట్టి దానిలో పూస మొత్తం పోసి కలిపి వేడిగా ఉన్నప్పుడు చేతులు ఎర్రగా కందినా ఆరిపోతే లడ్డూ రాకుండా విరిగిపోతుందని ఇబ్బంది పడి చేసేవాళ్ళు.ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ముందుగా పాకం పట్టి  ఒక ప్రక్కన పెట్టుకుని పూస దూసింది దూసినట్లుగా పాకంలో వేసి ఎప్పటికప్పుడు గరిటెతో తిప్పుతుండాలి.మిఠాయి పూస పూర్తిగావండటం ఐపోయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి కొంచెం కొంచెం తాపీగా ఆరిన తర్వాత లడ్డూ చుట్టుకోవచ్చు.ఇది మొదటి దానికన్నా రుచిగా ఉండటమే కాక తేలికగా అయిపోతుంది.

Friday, 22 January 2016

అతి అనర్ధదాయకం

                                                              రోజంతా ఏ సమయానికి తినే ఆహారం ఆ సమయానికి తింటూ ఏ పనీ చేయకుండా కూర్చునే వారికి నడుము నొప్పి,వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అలాగని రోజంతా అతిగా శక్తికి మించి కష్టపడి పని చేసినా వెన్ను నొప్పి,నడుము నొప్పి మెడ నొప్పులు  వస్తాయి.అధిక బరువు కూడా ఎత్తకూడదు.అతి అనర్ధదాయకం కనుక సరైన సమయానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉదయమో, సాయంత్రమో తగినంత వ్యాయామం చేస్తూ ఎవరి శక్త్యానుసారం వాళ్ళు పని చేసుకుంటూ ఉండాలి.అలా కాని పక్షంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.

Thursday, 21 January 2016

అరమీటరే ఎక్కువ

                                                                  మధుమతి,సావిత్రి పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవారు.సావిత్రి పెద్ద ఎచ్చులకోరు.ప్రతి దాంట్లో మీ అందరి కన్నా నేనే గొప్పఅని స్వంత డబ్బాకొట్టుకునేది.ఆఖరుకు తను వేసుకునే జాకెట్టు కూడా మీ అందరి వాటి కన్నాగొప్పదనేది.మీ అందరికీ ముప్పాతిక మీటరు పడితే నాకు అర మీటరే ఎక్కువ అని చెప్పేది.అది ఎలాగంటే అర మీటరు జాకెట్టు ముక్క తెచ్చుకుని గట్టిగా బిగదీసి వేసుకున్నట్లుగా తనే స్వయంగా కుట్టుకునేది.సావిత్రి కుటుంబం మొత్తం అనుకోకుండా స్వంత ఊరు వెళ్ళిపోయారు.ఒక పది సంవత్సరాల తర్వాత సావిత్రి మధుమతి ఇంటికి వచ్చింది.అప్పుడు మధుమతి కూతురు చిన్నది.ఆంటీ గుర్తున్నారా?అని అడిగితే ఎందుకు గుర్తుండరు?టైట్ జాకెట్ల ఆంటీ కదా!లొడలోడా మాట్లాడేవాళ్ళు ఎదుటివాళ్ళను కూరలో కరివేపాకు లాగా ఏరి పారేసేది అనేసింది,ఆ మాటలకు మదిమతి ముఖం.వెలా తెలా పోయింది.సావిత్రి ముఖం తెల్లగా పాలిపోయింది.

Wednesday, 20 January 2016

అసంకల్పిత చర్య

                                                       సోమేష్ నిద్రపోయేటప్పుడు లేపితే ఒక పట్టాన లేవడు.ఒకవేళ లేచినా కూడా ఏదైనా ముఖ్యమైన పని చెప్పినా ఆ విషయం నిద్ర లేచిన తర్వాత గుర్తు ఉండదు.నువ్వు నాకెప్పుడు చెప్పావు?అంటాడు.సోమేష్ నిద్రపోయే గదిలో ఏదైనా పని ఉండి ఎవరైనా లైటు వేస్తే మాత్రం గభాల్న లేచి మొహంచిట్లించుకుని నిండా ముఖం మీదకు కూడా దుప్పటి ముసుగు వేసుకుని నిద్రపోతాడు.అప్పుడు కుడా అతను తనకు తెలిసి చేసిన పని కాదు.అసంకల్పిత చర్య అన్నమాట.అన్న మాటేమిటి?ఉన్నమాటే.

Tuesday, 19 January 2016

బరువులు ఎత్తేటప్పుడు......

                                                     బరువులు ఎత్తేటప్పుడు ముందుగా మోకాళ్లను వంచి ఎత్తాలి.మోకాళ్ళు వంచకుండా వెన్నును ముందుకు వంచి  బరువులు ఎత్తటం వల్ల వెన్ను,మెడనొప్పులు వచ్చే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కనుక తప్పనిసరిగా మోకాళ్ళు వంచి బరువులు ఎత్తాలి.                   

మెడనొప్పి వేధించకుండా.......

                                                                         గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుని పని చేయటం వలన కానీ,నిద్రపోయేటప్పుడు సరయిన భంగిమలో  పడుకోకపోయినా కానీ, తలగడ సరిగా లేకపోయినా మెడనొప్పి వేధిస్తుంటుంది.అటువంటప్పుడు కుర్చుని కానీ,నిలబడి కానీ చేయగలిగే ఈ చిన్నచిన్న యోగాసనాలు ఎంతగానో పనిచేస్తాయి.అవి ఎలా చేయాలంటే ముందుగా 1)వెన్నును నిటారుగా ఉంచి గాలి బయటకు వదులుతూ తలను కుడివైపు తిప్పాలి.గాలి లోపలి తీసుకుంటూ యధాస్థితికి రావాలి.తిరిగి గాలి వదులుతూ ఎడమవైపు తిప్పాలి.మరల గాలి లోపలకు తీసుకుంటూ యధాస్థితికి రావాలి.2)గాలి బయటకు వదులుతూ తల కిందికి వంచాలి.గాలి పీల్చుతూ పైకెత్తాలి.3)గాలి వదులుతూ తలను కుడివైపు వంచాలి.గాలి లోపలకు పీల్చుతూ తలను మధ్యకు తేవాలి.ఇలాగే ఎడమ వైపు కూడా చెయ్యాలి. 4)తలను కొద్దిగా వంచి కుడి నుండి ఎడమకు,ఎడమ నుండి కుడికి గుండ్రంగా తిప్పాలి.ఈ విధంగా రోజు ఒక్క 10 ని.లు చేస్తుంటే మెడనొప్పి వేధించకుండా ఉంటుంది.

Wednesday, 13 January 2016

సంక్రాంతి శుభాకాంక్షలు

                                                           భోగ భాగ్యాలతో,పాడి పంటలతో,సకల సిరి సంపదలతో,ఆయురారోగ్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,నాతోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరికీ భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు.

Tuesday, 12 January 2016

చచ్చేంత భయం

                                                              పద్మలతకు పాములంటే చచ్చేంత భయం.ఆ భయం ఏర్పడటానికి వెనుక ఒక భయంకరమైన అనుభవం ఉంది.అదేంటంటే పద్మలత పెళ్ళైన కొత్తలో అత్తగారి ఊరిలో కొన్ని రోజులు ఉంది.అప్పుడు గుడికి వెళ్ళి వస్తుంటే చీకటిలో కాలికి ఏదో మెత్తగా తగిలింది.ఇంతలో ఇంకో అడుగు చెప్పుతో  సహా పడిపోయింది.ఆవిషయం అంతటితో మర్చిపోయింది.ఇంటికి వచ్చిన తర్వాత రోజు నుండి పద్మలత పేరుపెట్టి ఎవరైనా పిలిస్తే చాలు పాము వేగంగా ఎక్కడున్నాబయటకు వచ్చేస్తుంది.ఈవిషయం పద్మలత కనిపెట్టి ఇంట్లోవాళ్ళకు చెప్పింది.ఇలా నాలుగురోజులు గడిచిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాము ఒకరోజు నేరుగా పడక గదిలోకి వచ్చింది.భయంతో పద్మలత అరిచేసరికి పక్కింటి ఆమె వచ్చి సాయంత్రం వరకు తోడుగా ఉంది.ఇంతలో పాము స్నానాలగదిలో దాక్కుంది.భర్త,మిగతావాళ్ళు రాగానే విషయం తెలిసి పామును చంపేశారు.అది వయసులో ఉన్న గోధుమ వన్నె త్రాచు మెడపై చూడక పద్మలత కాలితో తొక్కినచోట కమిలిపోయి ఉంది.పద్మలతకు చచ్చేంత భయంతోపాటు అయ్యో!చూడక తొక్కటం వల్ల ఎంతపని జరిగింది అని జాలివేసింది.అంతకు ముందు పాములు పగ 
పడతాయంటే నమ్మేదికాదు.కానీ అప్పటినుండి నమ్మక తప్పింది కాదు.   

Monday, 11 January 2016

ఊరకరారు మహానుభావులు

                                                      ఈమధ్య ఒక కొత్త ఒరవడి మొదలయ్యింది.అదేమిటంటే చుట్టరికాన్ని కూడా వ్యాపార దృష్టితో చూడటం.బంధువుల ఇంటికి వెళ్ళినా వాళ్ళ నుండి మనకు ఎంత లాభం ఉంటుంది అనే చెత్త ఆలోచనతోనే వెళ్తున్నారు,వస్తున్నారు.ఎదుటి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళటమే తప్ప వాళ్ళ ఇంటికి రమ్మంటే ఎక్కడ కప్పు కాఫీ దండగ అయిపోతుందనే ఆలోచన తప్ప ఏ భావం లేకుండా వెళ్ళి వాళ్ళింట్లో అన్నిసార్లు తిని,తాగి రావటం ఎంత వరకు సమంజసము అనే ఆలోచనే రావటం లేదు.ఆలోచన రాకపోతే పోయే తాము ఎదుటివాళ్ళ ఇంటికి వెళ్తేనే ఎదుటి వాళ్ళ జన్మ ధన్య మై పోయినట్లు వెధవ ఫీలింగ్ ముఖంలో ప్రతి ఫలింపచేయటం ఒకటి.ఈ వెధవ వేషాలు చూడలేక ఎదుటివాళ్ళకు  కిందపడి గిలగిల కొట్టుకోవాలన్నంత చికాకు వచ్చేస్తుంది.వీళ్ళు వస్తున్నారంటే చాలు ఊరకరారు మహానుభావులు అని మనసులో అనుకుంటూ దొడ్డిదారిన బయటకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Thursday, 7 January 2016

స్పైడర్ కలెక్టర్

                                                                    స్టీవ్ ఒక స్పైడర్ కలెక్టర్ అంటే అందంగా,అరుదుగా ఉండే రకరకాల సాలెపురుగులు దేశ విదేశాలలో ఉన్న వాటిని సేకరించడం అతని అలవాటు.అతను,అతని భార్య రీనాకు కూడా సరదా వ్యాపకం.ఇద్దరు కలిసి అరుదుగా దొరికే వాటిని డబ్బిచ్చి కొని వాటిని టి.వి లో,స్టేజి మీద ప్రదర్శనలు ఇస్తుంటారు.ఆ నేపధ్యంలో అప్పుడప్పుడు వాళ్ళను సాలెపురుగులు కుడుతూ ఉంటాయి.ఎప్పుడూ అంతగా ఇబ్బంది కలగలేదు. ఈసారి ఎక్కువ డబ్బు పెట్టి అందంగా ఉన్నమూడు నెలల అరుదైన సాలెపురుగుని విదేశం నుండి తెప్పించుకున్నాడు.అది మూడు నెలలకే అరచేయి అంత ఉంది.గొప్పగా స్నేహితుడికి చేతిమీద పెట్టుకుని చూపిస్తూ ఉండగా దాని మీదకు పెంపుడు కుక్క వచ్చి అరిచింది.ఈలోపు సాలెపురుగు భయపడి స్టీవ్ ను గట్టిగా ఒక నిమిషం పాటు కుట్టింది.అదే తగ్గిపోతుందిలే అనుకుని ఉద్యోగానికి వెళ్ళాడు.వెళ్ళిన దగ్గరనుండి చెయ్యి బాగా నొప్పి, వాపు వచ్చింది.తర్వాత కండరాలు,కీళ్ళు పట్టేసి నడవలేక పోతున్నాడు.ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ సాలెపురుగు విషానికి ఇంతవరకు విరుగుడు మందు లేదు కనుక మామూలు యాంటీబయాటిక్ వాడుతూ ఎప్పటికప్పుడు పరీక్ష చేస్తూ జాగ్రత్తగా చూడటమే మార్గమని ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేస్తున్నారు.అంత కుట్టినా,బాధను అనుభవిస్తున్నా మురిపెంగా మూడు నెలల బేబీ స్పైడర్  విషం ఇంతగా ఇబ్బంది పెట్టడం ఇదే ప్రధమమని ఇది చాలా పెద్దగా,అందంగా తయారవుతుందని గొప్పగా చెపుతున్నాడు.ఎవరి పిచ్చి వారికి ఆనందం.వింటున్న వాళ్ళు భయంగా,విచిత్రంగా స్పైడర్ కలెక్టర్ స్టీవ్ ని చూస్తున్నారు. 

Wednesday, 6 January 2016

ఇల్లు అద్దం లాగా మెరిస్తే......

                                                                         శర్మిష్ట ఇంటిని అద్దం లాగా మెరిపిస్తూ ఉంటుంది.తనకు అలాగే ఇష్టం.పనివాళ్ళు ఉన్నా సరే తను కూడా శుభ్రం చేస్తుంటుంది.అందుకే ఇల్లు శుభ్రంగా ఉంచాలంటే శర్మిష్ట తర్వాతే ఎవరైనా అంటారు బంధువులు,స్నేహితులు.అయితే ఒకరోజు శర్మిష్ట ఇంటికి పిన్ని వచ్చి రెండురోజులు ఇంట్లో ఉంది.ఒకరోజు శర్మిష్ట ను గమనించి రెండో రోజు అమ్మా శర్మిష్టా!పనివాళ్ళున్నా సరే అంతగా కష్టపడడం అంత అవసరమా?ఎప్పుడైనా ఇల్లు అద్దం లాగా మెరిస్తే మనం అద్దం లాగా ఉండలేము.కనుక మరీ అంత కష్టపడకు అని చెప్పింది.అంటే ఆమె అర్ధం ఆరోగ్యంగా అందంగా అద్దం లాగా మెరవాలంటే పని తగ్గించుకో!అని నర్మగర్భంగా చెప్పిందన్న మాట.

Tuesday, 5 January 2016

మొక్కను పెడితే......

                                                                అపార్టుమెంటులలో ఇంటి ముఖద్వారం పొడవైన కారిడార్ చివర ఉన్నట్లయితే అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది.ఈ విధంగాఉంటే ఆర్ధిక పెట్టుబడులపై ప్రభావం చూపి ఇబ్బందులు కలుగుతాయి.ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక పక్కగా ఒక మొక్కను పెడితే ఆ ప్రభావం తగ్గుతుంది. 

చర్మం పొడిబారి తెల్లగా ఉంటే.........

                                                                 చలి ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారి తెల్లగా ఉంటుంది.అలా ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆలివ్ నూనె కానీ లేదా 1/4 కప్పు పాలు కానీ కలిపి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాటిమాటికి మోచేతులు,మోకాళ్ళ వద్ద చర్మం పొడిబారి తెల్లగా కనిపిస్తుంటే కొద్దిగా పంచదార,తేనెలో కలిపి ఆ ప్రదేశంలో  సున్నితంగా రాయాలి.మృదువుగా తయారవుతుంది.పాదాలకు,చేతులకు వీలయినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే గరుకుదనం తగ్గి చర్మం పొడిబార కుండా, పగుళ్ళు రాకుండా ఉంటుంది.

Monday, 4 January 2016

ఓరి నీ దుంప తెగ!

                                                            కొంతమందికి కొన్ని ఊతపదాలు మాట్లాడటం అలవాటు.అలాగే విక్రాంత్ వాళ్ళ తాతల కాలం నుండి ఇంట్లో అందరికీ అదే ఊత పదం ఓరి నీ దుంప తెగ! అనటం అలవాటు.వెనుకటి తరం వాళ్ళు ఎలా మాట్లాడినా సరే కానీ విక్రాంత్ చదువుకుని విదేశాలలో వైద్య వృత్తిలో ఉండి కూడా అలాగే అంటూ ఉంటాడు.స్వంత ఊరికి వచ్చినప్పుడు అందరి గురించి యోగ క్షేమాలు అడుగి తెలుసుకుంటూ పక్కనే కూర్చుని మధ్యమధ్యలో ఓరి నీ దుంప తెగ! అంటూ తన కన్నా చిన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే వింటూ అప్పుడప్పుడు వీపు మీదో,తొడ మీదో ఒక్కొక్క చరుపు చరుస్తూ హ్హ హ్హ హ్హా అంటూ పెద్దగా నవ్వుతూ ఉంటాడు.


Sunday, 3 January 2016

ఉదయం నిద్రలేవగానే.......

                                                                     ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేర స్థానం చూచినట్లవుతుంది.దీనివలన ధనాదాయం పెరుగుతుంది.పడకపై నుండి దిగగానే తూర్పు వైపుకు నడవాలి.ఇలా చేయడం వలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయి మంచి లాభాలు పొందుతారు.            

నీ బొంద - దీర్ఘాయుష్మాన్ భవ

                                                        ఆర్యేష్ పదేళ్ళ వాగుడుకాయ.వాడికి ఎవరన్నాభయం,భక్తి లేవు.పెద్దా చిన్నా లేకుండా మాట్లాడేస్తుంటాడు.ఎవరిని పడితే వాళ్ళను ఏది పడితే అది అనకూడదురా!అని పదే పదే చెప్పినా అర్ధం కాదు.అల్లరి ఎక్కువై చదువులో వెనకబడ్డాడని సాయంత్రం ఇంటికి వచ్చి చదువు చెప్పేలాగా ఒక మాస్టారును పెట్టారు.ఆయన ఉండేది ఒక రెండు గంటలు.ఒక గంటన్నర ఆర్యేష్ ఏదో ఒకటి అది ఏమిటి సార్?ఇదేంటి సార్?అంటూ కాలక్షేపం చేసేస్తుంటాడు.ఆర్యేష్ వాళ్ళ నాన్న అయ్యప్ప మాల వేసుకుంటూ ఆర్యేష్ కి కూడా వేయించాడు.ఒక రోజు 
అలవాటులో పొరపాటుగా మాస్టారుతో మాట్లాడుతూ మాస్టారుని కూడా నీ బొంద అనేశాడు.మాస్టారు ఖంగు తిని అయ్యప్ప మాల వేసుకున్నావు కనుక కోపం వచ్చి ఇప్పుడు నీకు తొడపాశం పెట్టాలనిపించినా ఏమీ అనటం లేదు అన్నాడు.చేసేదేమీ లేక ఇకముందు నిన్ను అదుపులో పెట్టాల్సిందే అంటూ మాస్టారు వెళ్తుంటే మాస్టారుకు వచ్చిన కోపం తగ్గించడానికి ఆర్యేష్ సాక్షాత్తు అయ్యప్ప స్వామి దీవించినట్లుగా పోజు పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు.

Saturday, 2 January 2016

సంపద పెరగాలంటే........

                                                                    సంపద పెరగాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా ఒక చిన్నఫౌంటెన్  ఇంట్లో పెట్టుకోవాలి.నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.వాటర్ ఫౌంటెన్ లాగా డబ్బును,సంపదను ఆకర్షించే శక్తి మరి దేనికీ లేదు.ఇంట్లో ఎక్కడ అయినా పెట్టుకోవచ్చు.అందంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. 

Friday, 1 January 2016

ఆదాయాన్ని మించి ఖర్చు ఉంటే....

                                                            ఆదాయాన్ని మించి ఖర్చు ఎక్కువగా ఉంటే మొక్కను కానీ విత్తనాలు కానీ బాత్రూమ్ లో ఉంచాలి.మొక్క బాత్ రూమ్ లోని గాలిని శుద్ధి చేయటంతో పాటు అధిక ఖర్చును అరికడుతుంది. ఎదిగే మొక్కలైనా,విత్తనాలైనా నీటి శక్తిని పీల్చుకుని తిరిగి రీసైకిల్ చేస్తుంటాయి కనుక ఇవి డబ్బు వృధా కావడాన్ని అడ్డుకుంటాయి.