Sunday, 31 August 2014

ఐదు నిముషాలు

            శిశిర్ కి ఒక చెడ్డ అలవాటుంది.అదేమిటంటే ఎవరైనా ఎంత అవసరమై ఫోను చేసినా,ఎంత దూరంనుండి చేసినా నేను పనిలోముఖ్యమైన పనిలో ఉన్నాను.ఐదు ని.ల్లో మళ్ళీ చేస్తాను అంటాడు.అక్కడ అర్జెంటు పనీ ఉండదు.మళ్ళీ ఫోను చెయ్యడు.చేద్దామనుకున్నా కుదరలేదు అంటూ ఉంటాడు.అక్కడ అర్జంటు పనేమిటంటే
పదిమందిని వాకిట్లో కూర్చోబెట్టుకుని పనికిమాలిన కబుర్లు చెప్పటం.ఎవరైనా ఇంటికి వస్తే ఇప్పుడే వస్తాను కూర్చోండి అని లోపలకు వెళ్తాడు.అరగంట,గంటైనా రాడు కూర్చుని ఎదురు చూచేవాడికి శోష రావాల్సిందే.
     ఈమధ్యన ఇంకో క్రొత్త అలవాటు మొదలైంది.ఏదైనా పెళ్ళిలో శిశిర్ గురించి ఎవరైనా అడిగితే పిలుస్తుంటే
ఐదు ని.లు అంటూ వేళ్ళతో సైగలు చెయ్యటం మొదలుపెట్టాడు.అరగంటైనా సైగలుచేస్తూ రోజు ప్రక్కనేఉండే
 వాడితో సోది కబుర్లు.ఎదుటివాళ్ళు ఎవరైనా అలా ప్రవర్తిస్తే నేనంటే లెక్కలేదు,పట్టించుకోవట్లేదు అని వాపోతాడు.

వాతాపి జీర్ణం భజే

                        సురుచి చిన్నప్పటి నుండి అమ్మ,అమ్మమ్మల అతిగారాబంతో పెరిగింది.ఇద్దరూ కాసేపటికొకసారి తినటానికి,త్రాగటానికి ఏదో ఒకటి ఇస్తూఉండేవాళ్ళు.ఒక్కొక్కసారి వద్దన్నా వినకుండా బాగా తిని,చక్కగా ఆడుకుంటే ఏ రోగాలు రావు.చక్కటి ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉంటే బాగా చదువుకునే శక్తి ఉంటుంది అని చెప్పేవాళ్ళు.ఎప్పుడైనా భుక్తాయాసంతో ఉంటే"వాతాపి జీర్ణం భజే " అని మూడుసార్లు పొట్ట మీద గుండ్రంగా చేతితో అనుకుంటే త్వరగా అరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు.నిజంగానే అప్పటికప్పుడు తేలికగా జీర్ణమైపోయినట్లుగా ఫీలింగ్ కలిగేది. ఇప్పటికీ పెద్దవాళ్ళు అజీర్ణంతో ఇబ్బంది పడుతుంటే వాతాపి జీర్ణం భజే అనుకోరా అంటూ ఉంటారు.  

Saturday, 30 August 2014

వెలగ కాయ పచ్చడి

       వెలగ కాయ - 1 పెద్దది
       పచ్చి మిర్చి - 10
      చింతపండు - నిమ్మకాయ అంత
      జీరా - 1 టేబుల్ స్పూను
     వెల్లుల్లి రెబ్బలు - 5
    గడ్డ పెరుగు - ఒక గరిటెడు
    తాలింపు కోసం - ఎండుమిర్చి,దినుసులు,వెల్లుల్లి,కరివేపాకు,కొత్తిమీర
     ఉప్పు - తగినంత                                                                                                                                                                                           వెలగకాయ స్టవ్ పై కాల్చి గుజ్జు తీయవచ్చులేదా కాయ పగలకొట్టి గుజ్జు తీయవచ్చు.కాల్చిగుజ్జుతీస్తే వేయించనక్కరలేదు.పగలకొట్టి గుజ్జు తీస్తే కొంచెం నూనె వేసి వేయించాలి.పచ్చిమిర్చి కొంచెం నూనెలో వేయించి,వెలగకాయ గుజ్జు,చింతపండు జీరా,వెల్లుల్లి,ఉప్పు అన్నీవేసి రోటిలో కానీ,మిక్సీలోకానీ మెత్తగా చేసి గడ్డ పెరుగు కలపాలి.బాండీలో నూనె కొంచెం వేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి.రుచికరమైన వెలగ కాయ పచ్చడి రెడీ.ఇది వేడి అన్నంలో,ఇడ్లీ,దోసెకు చాలా రుచిగా ఉంటుంది.వెలగ పండు గుజ్జు  చాలా రుచిగా ఉంటుంది.ఎన్నో పోషకవిలువలు కలిగిన వెలగ కాయను ఏదో ఒక రూపంలో తీసుకోవటం మంచిది.  

Thursday, 28 August 2014

పాలతాళికలు

పాలు - 1 లీటరు
బెల్లం 1/2 కే.జి
బియ్యప్పిండి - 2 కప్పులు
యాలకులు - 6
సగ్గుబియ్యం - 1/2 కప్పు
జీడిపప్పు,కిస్ మిస్ - మన ఇష్టం
                                             కొద్దిగా పిండితో కొట్ర కాచి (కొంచెం నీళ్ళు మరిగించి దానిలో కొద్దిగా బియ్యప్పిండి వేసి త్రిప్పి పలుచగా చేసేదాన్ని కొట్ర అంటారు)బియ్యప్పిండిలో బెల్లం కొద్దిగా వేసి పిండి కలిపి జంతికల గిద్దలతో
చుట్లు మరిగే పాలల్లో వెయ్యాలి.కాసేపు కదపకుండా అడుగునుండి వెడల్పు గరిటెతో కదపాలి.పాలల్లో సగ్గుబియ్యం కూడా  వేసి ఉడికించాలి.బెల్లం చిక్కగా పాకం పట్టి చివరలో కలపాలి.యాలకుపొడి,నేతిలోవేయించిన జీడిపప్పు,కిస్ మిస్ వేయాలి.గరిటెతోవేగంగా కదిపితే చిన్నముక్కలు అవుతాయి.పాల తాళికలు కొద్దిగా పొడవుగా ఉంటేనే చూడటానికి బాగుంటాయి.  కనుక ఎక్కువసార్లు గరిటెతో త్రిప్పగూడదు.కొద్దిగా నెయ్యి వేసి చిక్కగా అయిన తర్వాత
స్టవ్ ఆపేసి దించాలి.నోరూరించే పాలతాళికలు రెడీ.
గమనిక : అడుగు మందంగా ఉన్న గిన్నెలోఒక్క పావుగ్లాసు నీళ్ళుపోసి చిక్కటి పాలు పోసి పాలతాళికలు చేస్తే
అడుగంటకుండా,రుచిగా ఉంటాయి.  

కుడుములు - ఉండ్రాళ్ళు

        బియ్యప్పిండి - 1/2 కే .జి
        బెల్లం - 1/4 కే.జి
పచ్చి శనగపప్పు - ఒక గుప్పెడు
              ఒక బేసిన్ లో బియ్యప్పిండి వేసి మధ్యలో గుంత చేసి తురిమిన బెల్లం ఉంచాలి.1/2 కప్పు నీళ్ళు మరిగించి  కొంచెం బియ్యప్పిండి వేసి త్రిప్పి బేసిన్లో బెల్లంపై పొయ్యాలి.నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసి మొత్తం గట్టిగా కలపాలి.చిన్నచిన్న గోళీలు కొన్నిచేసి,చిన్నచిన్నవి పలుచగా కుడుములు చేసి(గుండ్రంగా),ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి ఇడ్లీకుక్కర్లో 15 ని .లు ఆవిరిపై ఉడికించాలి.విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు,ఉండ్రాళ్ళు రెడీ.  

మట్టి వినాయకుడు

                                   స్వప్నిక ఇంట్లో మూడుతరాల ముందునుండి మట్టి వినాయకుడినే పూజిస్తారు.వాళ్ళింట్లో చిన్నవాళ్ళు,పెద్దవాళ్ళు కూడా ఊరిలో ఉన్నా,సిటీలో ఉన్నా అదే పద్ధతి పాటిస్తారు.ఇప్పటికీ స్వప్నిక స్వంతఊరిలో అందరికీ ఒక కుటుంబం తరతరాలుగా మట్టితో విఘ్నేశ్వరులను తయారుచేసి ఇంటింటికీ వచ్చి ఇచ్చివెళ్ళే సంప్రదాయం కొనసాగుతుంది.కొంతమంది ముచ్చటపడి సహజరంగులద్దిన విగ్రహాలను తెచ్చుకున్నాముందుగా
ఊరిలో తయారుచేసిన మట్టివినాయకుడిని విధిగా పూజించిన తర్వాతే ఏదైనా చేస్తారు.1,3,5,9 రోజులు ఎవరివీలుని
బట్టి వాళ్ళు పూజలు చేసి తర్వాత మట్టి వినాయకుడ్నిపంటలు బాగా పండుతాయనే నమ్మకంతో పెద్దవాళ్ళు  పొలాల్లో పెట్టివస్తారు.21 రకాలపత్రి పారుదల నీళ్ళల్లో వదిలేస్తారు.ఊరిలో అయితే పెద్దవాళ్ళు పిల్లలకు ఏపత్రి ఏదని
తెలియటానికి పెరటిలో ఉన్నవి,బయటనుండి సేకరించి  ఇంటికి తీసుకురమ్మనేవాళ్ళు.పిల్లలు కూడా ఉత్సాహంగా
కాయలతోసహా కొమ్మలు తెచ్చేవాళ్ళు.వినాయక చవితి వచ్చిందంటే ఊరంతా సందడే సందడి.సాయంత్రమైతే
ఆడవాళ్ళందరూ కలిసి ఒక ఇంటినుండి బయలుదేరి అందరి ఇళ్ళకు వెళ్ళి దైవదర్శనం చేసుకుని తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు.వదినామరదళ్ళయితే పల్లేరుకాయలు(ముళ్ళుతేలికగా గుచ్చుకుంటాయి)నడిచేదారిలోవేసి దురదగుండాకు(తగిలితే దురద వస్తుంది) తెచ్చి ఒకరినొకరు ఆటపట్టించుకునేవాళ్ళు.
                                     ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తెచ్చి పూజించి నదుల్లో వదిలేస్తే నీళ్ళు కలుషితమవటమే కాక,చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అనారోగ్యాలబారిన పడుతున్నారు.కనుక పర్యావరణ పరిరక్షణ కోసం మనందరమూ మట్టి వినాయకుడిని పూజించి తరిద్దాం.ఎంత పెద్ద విగ్రహం పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత భక్తితో పూజ చేశామన్నది ముఖ్యం.అందుకని మనం కూడా మనవంతుగా మంచిపని కోసం ఒక చెయ్యేద్దాము.

  

Wednesday, 27 August 2014

ఆహ్వానం

                                         మనఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటే మనదగ్గర బంధువులను,స్నేహితులను ఇరుగుపొరుగు వాళ్ళను,తెలిసినవాళ్ళను అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాము.పిలవటంలో కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.కొంతమంది శుభలేఖ కానీ,ఏదైనా ఆహ్వాన పత్రికకానీ ఇచ్చివచ్చేస్తుంటారు.కొంతమంది బొట్టుపెట్టి ఇచ్చినా కూడా వివరంగా చెప్పకుండా వచ్చేస్తారు.ఏశుభకార్యం మొదలుపెట్టినా సరైన పిలుపులు అనేది ఒకపెద్ద ప్రహసనం.అదికూడా ఒకకళ.ఊరిలో ఒకళ్ళో,ఇద్దరో ఉంటే వాళ్ళను వెంటబెట్టుకుని వెళ్తే వాళ్ళు వివరంగా ఎవరిని ఎలా పిలవాలో అలా పిలిచేవాళ్ళు.దగ్గరివాళ్ళను ఎప్పుడెప్పుడు రావాలోచెప్పేవాళ్ళు.బొట్టుపెట్టి కార్డు ఇచ్చి వివరంగా చెప్పి తప్పకుండా రావాలి అని చెప్పాలి.లేని పక్షంలో కార్డు పోస్టులో,కొరియర్ లో పంపించి ఫోనులో చెప్పాలి.ఇప్పటికీ ఊరిలో ఈరోజు ఫలానావారి ఇంట్లో వంట చేసుకోకుండా భోజనాలు అనీ,మగవాళ్ళకు మాత్రమే అనీ వివరంగా ఒకతనితో చెప్పిస్తుంటారు.పిలుపులో ఏదైనా లోపమున్నామళ్ళీ చెప్పిస్తే వస్తారని ఉద్దేశ్యం.సరైన పద్దతిలో పిలవకపోతే,స్త్రీలకు ప్రయాణం అని కార్డులో లేకపోతే ఇప్పటికీ రానివాళ్ళు ఎంతోమంది ఉన్నారు.                                                                                         పిలవటం ఒకఎత్తైతే వచ్చిన అతిధులను సాదరంగా లోపలకు ఆహ్వానించి కుర్చోబెట్టడం,ఆప్యాయంగా పలకరించటం,భోజనం చేయమని తీసుకు వెళ్ళటం ఒక ఎత్తు. మన సంప్రదాయం ప్రకారం వచ్చిన అతిధులకు ఏలోటు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనది.మనం స్టేజిమీద చేయవలసిన కార్యక్రమాలు ఉంటే మన దగ్గరివాళ్ళకు ఆపని పురమాయించాలి.రాగానే ఎవరూ మాట్లాడకుండా,పట్టించుకోకుండా ఉంటే వచ్చినవాళ్ళ మనసు నొచ్చుకుని అయ్యో!అనవసరంగా ఎందుకు వచ్చామా? అనుకోకూడదు కదా!
               అందుకని అక్కచెల్లెళ్ళకో,అన్నదమ్ములకో,బంధువులకో చక్కగా మాట్లాడగల స్నేహితులకో ఆభాద్యత అప్పగించాలి.ఇక మిగిలినది భోజనాల దగ్గర అన్నీ అందరకూ అందుబాటులో ఉన్నాయా,లేదా? అనేది పర్యవేక్షించే బాధ్యత కొంతమంది దగ్గరివాళ్ళకు అప్పగించాలి.గిఫ్టులు ఇవ్వదలిస్తే అందరికీ  అందుతున్నాయా?లేదా?చూడటానికి ఇంకొంతమందిని పెట్టాలి.ఆహ్వానించగానే సరికాదు అన్నీ సక్రమంగా జరిగేలా చూడాలి అని పెద్దలు చెప్పేవాళ్ళు.అలాగే ఆహ్వానించటం ఒక్కటే కాదు ముందుగానే పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఏలోటు జరగకుండా అతిధులకు,మనకుకూడా సంతృప్తికరంగా ఉంటుంది.  

గవ్వలు

  మైదా - 1/2 కే.జి
 బెల్లం - 1/4 కే .జి
 వెన్న - కొద్దిగా
నూనె - వేయించడానికి సరిపడా                                                                                                                                                            మైదాపిండిలో కొద్దిగా వెన్న వేసి చేతితో కలపాలి.తర్వాత సరిపడా నీళ్ళుపోసి గట్టిగా చపాతీ పిండిలాగా మర్దన చేసి కలపాలి.ఒక పలుచటి క్లాత్ తడిపి కలిపిన పిండిపై కప్పాలి.ఒక అరగంట తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి గవ్వల చెక్కపై ఉండను పెట్టి బ్రొటన వ్రేలితోనొక్కి ముందుకు ఒకసారి జరిపితే గవ్వ ఆకారం వస్తుంది.చాల తేలికగా,వేగంగా చేసేయవచ్చు.కొన్నికొన్ని చేసుకుంటూ బాండీలో నూనె వేయించడానికి సరిపడా పోసి కాగిన తర్వాత గవ్వలు వేసి కరకరలాడేలా వేయించుకోవాలి.పిండి మొత్తం అలాగే  గవ్వలు చేసి  వేయించుకుంటూ  ఉండగానే ప్రక్కన తురిమిన బెల్లంలో కొంచెం నీళ్ళు పోసి కరిగినతర్వాత వడపోసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి పాకం రానివ్వాలి.ఉడుకుతున్న పాకం నీళ్ళల్లో వేస్తే ఉండగా దగ్గరకు వస్తున్నప్పుడు వేయించి పెట్టుకున్న గవ్వలు వేసి బాగా త్రిప్పితే గవ్వలకు సమానంగా పాకం పడుతుంది.వీటిని ఒక పెద్ద ప్లేటులో ఆరబెట్టాలి.ఆరిన తర్వాత ఒక డబ్బాలో సర్దుకోవాలి.అంతే తినటానికి నోరూరించే గవ్వలు రెడీ.ఇవి వారం రోజులు నిల్వ ఉంటాయి.

Tuesday, 26 August 2014

బొంబాయి రవ్వ హల్వా

     బొంబాయి రవ్వ - 1 కప్పు
     పాలు,నీళ్ళు - 3 కప్పులు (2:1)
     యాలకుల పొడి  - 2 చిటికెలు (1,3 వ్రేళ్ళతో కలిపి తీస్తే ఎంతపొడి వస్తుందో దాన్ని చిటికెడు అంటారు.)
     అలంకరణకు - జీడిపప్పు,కిస్ మిస్
     పంచదార - 2 కప్పులు                      
     నెయ్యి - 4 టేబుల్ స్పూనులు                                                                                                  
                        పాలు,నీళ్ళు కలిపి పొంగు రానిచ్చి దానిలో బొంబాయి రవ్వ నిదానంగా పోస్తుంటే ఉండకట్టకుండా ఉంటుంది.కొంచెం ఉడికినతర్వాత పంచదార,యాలకుల పొడి,నెయ్యి కూడావేసి బాగా త్రిప్పి ముద్దలాగా
వచ్చినప్పుడు ప్లేటుకి నెయ్యి రాసి పెట్టుకుని దానిలో ఈముద్దను వేసి సమానంగా పలుచగా చెయ్యాలి.కొద్దిగా ఆరినతర్వాత మనకు నచ్చిన షేప్ లో ముక్కలు కట్ చెయ్యాలి.అలంకరణ కోసం వేయించిన జీడిపప్పు,కిస్ మిస్
అతికించాలి.నోరూరించే,రుచికరమైన బొంబాయి రవ్వ హల్వా రెడీ.ఒక్కొక్కసారి పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా కావాలని పేచీ పెడుతుంటారు.అలాంటప్పుడు బయటనుండి తేచ్చేకన్నా ఇంట్లో పది ని.ల్లో తేలికగా అయిపోయే      
రుచికరమైన వంటకం.కావాలంటే ఆరంజ్,గ్రీన్ ఫుడ్ కలర్స్ కొంచెం కొంచెం కలిపి కొంత తెల్లగానే ఉంచి ఒకదానిపై ఒకటి పలుచగా సమానంగా చేసి కట్ చేస్తే కంటికి ఇంపుగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు.                

గప్ చిప్ లు

          పంచదార  - 1 కప్పు
          మైదా - 2 కప్పులు
         నూనె - వేయించడానికి సరిపడా
                    పంచదారలో నీళ్ళు పోసి కొంచెం కరిగినతర్వాత మైదా వేసి ఉండలు లేకుండా గరిటె జారుగా కలపాలి.
ఒక పది ని.లు నాననివ్వాలి.బాండీలో నూనెపోసి కాగిన తర్వాత చిన్నసైజులో కావాలంటే స్పూనుతో పిండి నూనెలో వెయ్యాలి.పెద్దగా కావాలంటే గరిటెతో పిండి వెయ్యాలి. నూనెలో పిండి వెయ్యగానే పొంగుతుంది.బంగారు వర్ణంలోకి రాగానే ఇంకోవైపు త్రిప్పి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేటులో పేపర్ వేసి పెట్టాలి.తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పంచదార వేసుకోవచ్చు.అన్నీఅలాగే వేయించుకోవాలి.నోరూరించే గప్ చిప్ లు రెడీ.తింటుంటే మెత్తగా ఏమాత్రం
శబ్దం రాకుండా గప్ చిప్ గా తినేయవచ్చు.పిల్లలు,పెద్దలు ఇష్టపడే తేలికైన వంటకం.   

Monday, 25 August 2014

దోసకాయ - కొబ్బరి పచ్చడి

దోసకాయ -1 పెద్దది
కొబ్బరి - 5 టేబుల్ స్పూనులు
పచ్చిమిర్చి - 15
చింతపండు - నిమ్మకాయంత
జీరా - 1 స్పూను
నూనె .- 4 స్పూనులు
తాలింపుకు - దినుసులు,వెల్లుల్లి,కరివేపాకు,కొత్తిమీర
 టమోటా -1 పెద్దది                      
                  నూనె వేసి పచ్చిమిర్చి వేయించి ఒకప్లేటులో పెట్టుకోవాలి.దోసకాయ ముక్కలు వేయించాలి.దానిలో టమోటా ముక్కలు కూడా వేసి మగ్గించాలి.కొబ్బరి నూనె లేకుండా వేయించాలి.అన్నీ కలిపి రోట్లో కానీ,మిక్సీలో కానీ మరీ మెత్తగా కాకుండా చేయాలి.ఒక బాండీలో తాలింపుకి సరిపడా నూనెవేసి ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు,
దినుసులు,కరివేపాకుతోపాటు,కొత్తిమీర,పచ్చడి వేసి కలపాలి.నోరూరించే ఘుమఘుమలాడే దోసకాయ కొబ్బరి పచ్చడి రెడీ.ఇది వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.

పనస తొనలు

        మైదా  - 1/2 కే.జి
       పంచదార - 1/4 కే.జి
       వెన్న లేక నెయ్యి -  100 గ్రా
      నూనె - వేయించటానికి సరిపడా
                            మైదాలో వెన్న లేక నెయ్యి వేసి నీళ్ళుపోసి గట్టిగా కలపాలి.పిండిపై ఒక క్లాత్ తడిపి వేసి అరగంట నాననివ్వాలి.తర్వాత కొంచెం పిండిని గుండ్రంగా చేసి పూరీలాగా వత్తి చాకుతోగానీ,చక్రంఉన్న స్పూనుతోగానీ మధ్యలో నిలువుగా కట్ చేసి అటు చివర ఇటు చివర పూరీని పట్టుకుని ఒకసారి మెలిత్రిప్పాలి.అప్పుడు పనసకాయ
ఆకారం వచ్చి లోపల తొనలు ఉన్నట్లుగా కట్ చేసినవి విడివిడిగా వస్తాయి.అటు ఇటు మెలిత్రిప్పటం వలన కాయలోపల తొనల్లాగా ఉంటుంది.బాండీలో నూనె పోసి కాగినతర్వాత కొన్నికొన్ని వేసివేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
ఈలోపు పంచదారలో కొంచెం నీరుపోసి ఉండ పాకం దగ్గర పడేటప్పుడు వేయించిన పనసతొనలు వెయ్యాలి.అవన్నీ తీసి ఒకప్లేటులో పెట్టుకోవాలి.నోరూరించే,రుచికరమైన పనసతోనలు రెడీ.ఇవి పదిరోజులు నిల్వ ఉంటాయి.కంటికి
ఇంపుగా కూడా ఉంటాయి.   

వెన్న ఉండలు

        మైదా - 1/2 కే .జి
       వెన్న - 200 గ్రా.
      బెల్లం - 1/4 కే. జి
      నూనె - వేయించటానికి సరిపడా
                   మైదా జల్లించి ఒక గిన్నెలో వెయ్యాలి.వెన్న కొంచెం కరిగించి మైదాలో వెయ్యాలి.(వెన్న డైరెక్ట్ గా కలిపితే ఎక్కడైనా చిన్న గడ్డలుగా ఉండి నూనెలో వేసినప్పుడు  పేలతాయి.అందుకని కొంచెం కరిగించాలి.)బెల్లం కొంచెం నీళ్ళుపోసి కరిగించి వడకట్టాలి.మైదా,వెన్న,నీళ్ళు కలిపి గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.పల్చటి క్లాత్ తడిపి పిండిపై వెయ్యాలి.ఒక అరగంట తర్వాత ఒకసారి పిండిని మర్దనచేసి చిన్నచిన్న ఉండలు చెయ్యాలి.బాండీలో నూనె పోసి కాగిన తర్వాత కొన్నికొన్ని వేసి కరకరలాడేలా వేయించుకోవాలి.ఈలోపు బెల్లం పాకం పట్టాలి.చిన్న ప్లేటులో
నీళ్ళు పోసి ఉడుకుతున్న పాకం నీళ్ళల్లో వేస్తే దగ్గరకు వచ్చినప్పుడు వేయించిన ఉండలు వేసి త్రిప్పాలి. నాలుగైదుసార్లు త్రిప్పి ఒక పెద్ద ప్లేటులో పోసి వేడి తగ్గేవరకూఆరనివ్వాలి.నోరూరించే రుచికరమైన వెన్న ఉండలు రెడీ.ఇవి వారంరోజులు నిల్వ ఉంటాయి.పిల్లలు,పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే వంటకం.

కుదాత్తం

                   సువర్ణ కొడుకు ఆనంద్ కి పన్నెండు సంవత్సరాలు.రోజు స్కూలు నుండి ఇంటికి వచ్చేటప్పటికి సువర్ణ
స్నేహితురాలు పద్మప్రియ ఇంట్లో ఉండేది.పెద్దపెద్దగా నవ్వుతూ ఆపకుండా గలగలా మాట్లాడుతూ ఉండేది.ఇది ఆనంద్ కి ఇబ్బందికరంగా ఉండేది.అమ్మను తన పనులు చూడకుండా చేయటమేకాక,చదువుకు ఆటంకము కలిగిస్తుందని పద్మప్రియ అంటే ఆనంద్ మనసులో కోపంగా ఉండేది.ఒక పదిరోజులు నుండి పద్మప్రియ సువర్ణ ఇంటికి రావటం మానేసింది.హమ్మయ్య!ఇప్పుడు ఇల్లంతా ప్రశాంతంగా ఉందని మనసులో అనుకున్నదే తడవుగా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా!మీస్నేహితురాలు రాకపోవటంవల్ల కుదాత్తంగా ఉంది అన్నాడు.అంటే ఏంటి?అని అడిగితే ఆమె మాట్లాడుతుంటే నిద్రపోయేవాళ్ళు మేల్కొంటారు.చిన్నపిల్లలు దడుచుకునేట్లుగా పెద్దగా మాట్లాడుతుంది.ఆమె రాకపోతే హాయిగా ఉంది అందుకే అలా అన్నాను అన్నాడు.'ఓరి నీ ఇల్లు బంగారం కానూ' ఈ రోజు క్రొత్త పదం నేర్చుకుని ఉపయోగించావన్న మాటఅని సువర్ణ ఆనంద్ ని మురిపెంగా చూసింది.      

Tuesday, 12 August 2014

మొక్కజొన్న వడ

                 పచ్చి మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
                 బియ్యప్పిండి - ఒక గుప్పెడు
                 అల్లం తురుము - 1/2 టీ స్పూను
                 పచ్చిమిర్చి- 10
                 ఉల్లిపాయ - 1
                 నూనె - వేయించడానికి సరిపడా
                 కొత్తిమీర  - కొద్దిగా
                 కరివేపాకు - కొద్దిగా
                 ఉప్పు - సరిపడా
                                                మొక్కజొన్న గింజలు మెత్తగా రుబ్బాలి.దానిలో బియ్యప్పిండి,ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,ఉప్పు,సన్నగా తరిగిన కొత్తిమీర,కరివేపాకు,అల్లం తురుము వేసి కలపాలి.
స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి కాగిన తర్వాత పిండిని చిన్నచిన్న వడలుగా చేసి నూనెలో ఎర్రగా వేయించాలి.
నోరూరించే మొక్కజొన్నవడలు రెడీ.వీటిని మనకిష్టమైన చట్నీతో కానీ,టొమాటో సాస్ తో కానీ తినవచ్చు.

బియ్యంతో రసగుల్లాలు

           పచ్చి బియ్యం - 1 కప్పు
          అటుకులు - 1/4 కప్పు
          కొబ్బరికోరు - 1/2 కప్పు
         పాలు - 2 కప్పులు
         పంచదార - 2 కప్పులు
         రోజ్ ఎసెన్స్ - కొంచెం
         సోడాఉప్పు - చిటికెడు
         కిస్మిస్,ఖర్జూరం - ముక్కలు  తగినన్ని
                             రెండు కప్పుల పాలు ఒకగిన్నెలో పోసి 1/4 కప్పుఅయ్యేవరకు మరిగించాలి.బియ్యం,అటుకులు
కలిపి వేడిపాలల్లో వేసి పది ని.లు నాననివ్వాలి.చల్లారాక కొబ్బరికోరు కలిపి ఈమిశ్రమాన్ని మెత్తగా వెన్నలా మిక్సీలో  రుబ్బుకోవాలి.ఒకగిన్నెలో రెండుకప్పుల పంచదారలో నాలుగు కప్పుల నీళ్ళుపోసిమరగనివ్వాలి.
       మరిగేటప్పుడు కొద్దిచుక్కలపాలు చల్లితే అందులో నలకలు ఉంటే పైకి తేలతాయి.అవి తీసేయ్యాలి.ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ ఒకకప్పు నీళ్ళు పోసి మరగనివ్వాలి.రుబ్బిఉంచుకున్న బియ్యంలో వంటసోడా కలపాలి.
        కొబ్బరిపాలు,అటుకులు ఉండటంవల్ల ఉండలు రాకపోవచ్చు.అందుకని రెండు స్పూనుల నెయ్యివేసి కలిపి ఐదుని.లు ఉంచి అప్పుడు ఉండలు కట్టాలి.ఈమిశ్రమాన్ని ఉసిరికాయ సైజులో చిన్నచిన్న ఉండలుచేసుకోవాలి.
వీటిలో వేలుతో చిన్నరంద్రం చేసి అందులో కిస్మిస్,ఖర్జూరం ముక్కలు పెట్టి మూసెయ్యాలి.
            ఈఉండలు ముందుగా చేసి ఉంచుకున్న పాకంలో వెయ్యాలి.ఉడుకుతున్న పాకంలో వేసిన తర్వాత అవి పైకి తేలతాయి.వీటన్నింటినీ విడిగా తీసి పెట్టుకోవాలి.తర్వాత ఈపాకంలో 1/4 కప్పు పంచదార కలిపి అది ఉడికి లేతపాకం వచ్చిన తర్వాత దించాలి.పాకం జిగురుగా లేకుండా ఉండటానికి నీరు పొయ్యాలి.తర్వాత రోజ్ ఎసెన్స్ కలిపి వేయించిన ఉండలు వేసి ఉడికించాలి.వీటిని దించి చల్లారిన తర్వాత సర్వ్ చెయ్యాలి.చాలా రుచిగా ఉంటాయి.
గమనిక :పచ్చిబియ్యం అంటే పంట చేతికొచ్చేముందు కొద్దిగా ఇంటికి తెచ్చి వడ్లుకొట్టి రోట్లో వేసి దంచి బియ్యం చేస్తారు.వాటితో పొంగలి పెట్టి దేము(వు)డికి నివేదన చేస్తారు.ఈబియ్యంతో రసగుల్లాలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పటికీ ఊరినుండి పెద్దవాళ్ళు కార్తీకమాసంలో కొత్త బియ్యం నివేదనలకు పంపిస్తారు.  
 
        

Monday, 11 August 2014

కజ్జి కాయలు

        బొంబాయిరవ్వ - 1 కే.జి
        పుట్నాల పప్పు - 1/2 కే.జి
        ఎండు కొబ్బరి - 1/4 కే.జి
        పంచదార - 2 1/2కే .జిలు
        గోధుమ పిండి - 1/2 కే .జి
       మైదా - 1/2 కే.జి
       నెయ్యి - తగినంత
      యాలకుల పొడి - తగినంత
                     బొంబాయి రవ్వ  నెయ్యి వేసి దోరగా వేయించాలి.పుట్నాలపప్పు రవ్వగా ఉండేలాగా మిక్సీలో చెయ్యాలి.ఎండుకొబ్బరి తురుముకుని ఉంచాలి.వీటన్నీ కలిపి ఎంత బరువు ఉంటే అంత పంచదార వెయ్యాలి.
పై పిండి అంటే మైదా,గోధుమ పిండిలో నెయ్యివేసి కొంచెంసేపు నాననివ్వాలి.కొంచెం పిండిని పూరీలాగా చేసి
కజ్జికాయల చెక్కకు నూనె రాసి దానిలో పూరీపెట్టి రెండు స్పూనుల పిండివేసి పూరీకి పైన నొక్కే చోట నీళ్ళు రాయాలి.చెక్కను నొక్కి ఎక్కువ ఉన్న పూరీ తీసేయ్యాలి.కజ్జికాయ ఆకారంలో వస్తుంది.దీన్ని తీసి ఒక పేపరుపై   వేసుకోవాలి.చెక్కకు ప్రతిసారీ నూనె రాయాలి.అన్నీచేసి పెట్టుకుని బాండీలో నూనె తగినంత పోసి కాగాక ఒక్కొక్కటి
వేయించి పేపరు మీద పెట్టుకుని ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి.పదిరోజులు నిల్వ ఉంటాయి.పై కొలతలలో మనకు కావలసినంత చేసుకోవచ్చు.ఇష్టమైన వాళ్ళునువ్వులు,గసాలు కూడా వేయించుకుని వేసుకోవచ్చు.కానీ
వారంతర్వాత నూనె వాసన రావచ్చు.జీడిపప్పు చిన్నముక్కలు వేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. 

Sunday, 10 August 2014

తనదాకా వస్తే కానీ.....

                 సందేశ్,భార్య ఇద్దరిదీ స్వార్ధపూరిత మనస్తత్వం.ఎంతసేపూ వాళ్ళ పబ్బం గడుపుకోవటం,వాళ్ళ స్వార్ధం తప్ప ఎదుటివాళ్ళకు ఇబ్బంది అనే ఆలోచన ఉండదు.సందేశ్ అక్కఇల్లు సందేశ్ ఇంటికీ,సందేశ్ పిల్లల స్కూలుకు మధ్యలో ఉంటుంది.ప్రొద్దున పిల్లలను తీసుకొచ్చి,సాయంత్రం స్కూలు అయిపోయిన తర్వాత రాత్రికి కూడా భోజనం చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు.వాళ్ళతోపాటు మందీమార్బలము,పాలేళ్ళు కూడా అక్క ఇంట్లోనే భోజనానికి ఉండేవాళ్ళు.
అక్కపిల్లలకు పబ్లిక్ పరీక్షలప్పుడు కూడా ఇదే తంతు.సందేశ్ఎవరూ ఏమీ అనకుండానే పబ్లిక్ పరీక్షలయితే ఏమయింది? అంత ఇల్లుంది పిల్లలు ఏదో ఒక గదిలో కూర్చుని చదువుకోవాలి గానీ ఇంటికి చుట్టాలు రాకుండా ఉంటారా? అనేవాడు.తన పిల్లల మాములు పరీక్షలకు కూడా సందేశ్ భార్య హంగామా చేసి ఇంటికి ఎవరూ రాకూడదు అంటుంది.ఇక కూతురుకి పబ్లిక్ పరీక్షలని సంవత్సరమంతా బంధువులు ఎవరూ మాఇంటికి రావద్దు అని నిర్మొహమాటంగా ఒక ఫంక్షన్లో ప్రకటించింది.సందేశ్ కూడా ఏమీ మాట్లాడలేదంటే అతని ఉద్దేశ్యం కూడా అదే
కనుక తనదాకా వస్తే కానీ తెలియలేదా?పిల్లల పరీక్షలప్పుడు కూడా అక్క ఇంట్లో భార్యాపిల్లలతో కూర్చునేవాడు.
ఎదుటివాళ్లకు ఇబ్బంది అనే ఆలోచన రాదు ఇప్పుడు వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి వెధవ ఓవర్ యాక్షన్లు
అని బంధువులందరికీ విచిత్రంగా ఉంది.

సన్నబిల్లి

                   మహాలక్ష్మమ్మ గారిది జాలిహృదయం.అమ్మా!ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని ఎవరైనా వస్తే లేదు అనకుండా పెడుతుంటుంది.పనిలేక పస్తులుంటున్నాం ఏదైనాపని ఇప్పించండి అంటే ఏదో ఒకపని ఇప్పిస్తుంటుంది.
ఒకరోజు తెలిసినవాళ్లు పని ఏదైనా ఉంటే ఇప్పించమని ఒకఅమ్మాయిని పంపించారు.ఆఅమ్మాయి మహాలక్షమ్మ
గారి దగ్గరకు వచ్చి అమ్మా! నాకు ఒక "సన్నబిల్లి"ఉంది.పనిలేక ఇబ్బందిగా ఉంది.సన్నబిల్లిని సాకటటం కష్టంగా
ఉంది అని చెప్పింది.సన్నబిల్లికి ఐదునెలలు అంది.ఇంతకీ సన్నబిల్లి అంటే "చంటి పిల్ల".

రక్షాబంధన్ శుభాకాంక్షలు


                                             సోదర,సోదరీమణులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు.

Saturday, 9 August 2014

ఇంట్లో తయారుచేసుకునే సాంబారుపొడి

             ధనియాలు - 1 కప్పు
             పచ్చి శనగపప్పు  - 1 కప్పు
            మెంతులు - 1/4 కప్పులో సగం
            జీరా - 1/4 కప్పు
            మిరియాలు - 10 గింజలు
            ఎండుమిర్చి - 12
                   వీటన్నింటినీ నూనె లేకుండా విడివిడిగా సిమ్ లో వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని కొంచెం ఆరిన తర్వాత ఒక సీసాలో లేక గాలి చొరబడని డబ్బాలో పొయ్యాలి.మనం తయారుచేసుకునే
సాంబారు బట్టి చివరలో ఒకస్పూను లేక రెండు స్పూనులు పొడివేసి మరగనిచ్చి తాలింపుపెడితే మంచిసువాసనతో కూడిన సాంబారు రెడీ.

మొరమొరలాడే కారప్పూస

             బియ్యం - 1 1/4కే.జి
             మినప్పప్పు - 1 కప్పు
             శనగపప్పు - 1 కప్పు
             సగ్గుబియ్యం - కొంచెం
                             బియ్యం కడిగి క్లాత్ మీద ఎండలో ఆరబెట్టాలి.ఆరినతర్వాత దానిలో మినప్పప్పు,శనగపప్పు
కొంచెం సగ్గుబియ్యం వేసి మరపట్టించాలి.సగ్గుబియ్యం ఎక్కువ వేస్తే జిగిరు ఎక్కువై గట్టిగా వస్తాయి అందుకని
నాలుగు వేళ్ళమీద నిలిచినన్ని మాత్రమే వెయ్యాలి.ఈపిండి ఒక డబ్బాలో పోసుకుని మనకు కావలసినంత ఒకగిన్నెలో వేసుకుని కొంచెం వెన్న,వాము,ఉప్పు,కొంచెం వేపుడు కారం వేసి సరిపడా నీళ్ళు పోసి కలుపుకోవాలి.
ఆపిండిని కారప్పూస గిద్దలతో కాగిన నూనెలో వత్తాలి.ఒకసారి ఇటూ,అటూ తిరగేసి బంగారువర్ణంలోనే తీసేయ్యాలి.
బోలుగా మొరమొరలాడే కారప్పూస రెడీ.అంటే నోట్లో వేసుకుని నములుతూ ఉంటే కరకర శబ్దం రాకుండా చిన్న శబ్దంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగాఉంటుంది.ఇంట్లో ఈ కారప్పూస చేసుకుని తింటే బయట ఎక్కడా తినలేమన్నట్లుగా ఉంటుంది.

Friday, 8 August 2014

పూర్ణాలు

        పూర్ణాలు (పూర్ణం బూరెలు) శ్రావణ మాసం ప్రత్యేక వంటకం.పూర్ణాలు లోపలి పదార్ధం బయటకు రాకుండా గుండ్రంగా వెయ్యటం ఒక కళ.ఇవి ఎలా వెయ్యాలో చూద్దామా.
                     
                     పచ్చి శనగపప్పు - 1/4 కే .జి
                     బెల్లం - 1/4 కే .జి
                     యాలకులపొడి - కొంచెం
                    మినప్పప్పు - 1/2 కప్పు
                    బియ్యం - 1 కప్పు
                   నూనె - వేయించడానికి సరిపడా
                                  బియ్యం,మినప్పప్పు నాలుగు గంటలు నానబెట్టి గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి.మిక్సీలో అయితే ఒకపూట ముందుగా రుబ్బుకోవాలి.అప్పటికప్పుడయితే పైన గట్టిగా వస్తాయి.మెత్తగా ఉంటే బాగుంటాయి.
పచ్చిశనగపప్పుకడిగి కుక్కర్లో 5,6 విజిల్స్ రానిచ్చి సిమ్ లో 2 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడుకుతుంది.పప్పులో నీరు అసలు లేకుండా ఇగరపెట్టుకోవాలి.పప్పు పూర్తిగా ఉడికినతర్వాత తరిగిన బెల్లం వెయ్యాలి.బెల్లం కరిగిన తర్వాత పూర్తిగా దగ్గరకు రానివ్వాలి.దించేముందు కొంచెం యాలకుల పొడి వేసి త్రిప్పి ఒక ప్లేటులో ఆరబెట్టుకుని గుండ్రంగా  చిన్న చిన్నఉండలు చెయ్యాలి.బాండీలో నూనె కాగిన తర్వాత ఒక్కొక్క ఉండను రుబ్బి పెట్టుకున్న పిండిలో ముంచి తీసి వేసే ముందు వేళ్ళ గుర్తులు రాకుండా గుండ్రంగా నిదానంగా నూనెలో జార విడచాలి.వేసిన వెంటనే
కదపకూడదు.లోపలి పప్పు బయటకు వస్తుంది.మీడియం మంటమీద వండుకోవాలి.ఒకటి తిరగేసిన తర్వాత ఇంకొకటి వెయ్యాలి.ఇక గుండ్రంగా,రుచిగా,చూడగానే తినాలనిపించే పూర్ణాలు వెయ్యటం మీకూ వచ్చేసినట్లే.

మూర్తి గారింట్లో వరలక్ష్మీ వ్రత సందడి

                మూర్తిగారి భార్య లక్ష్మీదేవి.పేరుకు తగ్గట్లే లక్ష్మీదేవిలా కళకళలాడుతూ మెడనిండా నగలతో,ఎప్పుడూ పట్టుచీర ధరించి కనిపించిన వాళ్ళను నవ్వుతూ నోటారా పలకరిస్తూ సందడిగా ఉంటుంది.వీళ్ళకు ముగ్గురు ఆడపిల్లలు,ఒక మగపిల్లవాడు.అందరికీ పెళ్ళిళ్ళయి విదేశాలలో పిల్లాపాపలతో సుఖంగా,సంతోషంగా ఉన్నారు. మనవళ్ళు,మనవరాళ్ళు పుట్టినప్పుడల్లా విదేశాలకు వెళ్ళివస్తూ పెద్దవాళ్ళు సంతోషంగా ఉన్నారు.ప్రతిసంవత్సరం
శ్రావణ మాసం వచ్చిందంటే వీళ్ళింట్లో సందడే సందడి.ముగ్గురు ఆడపిల్లలు,కోడలు,లక్ష్మీదేవిగారు అందరూ బ్రాహ్మణుడ్ని పిలిచి శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం చేయించుకుంటారు.బంధుమిత్రులందరినీ పిలిచి విందుభోజనాలు
ఏర్పాటు చేస్తారు.వరలక్ష్మీ వ్రతం చేసుకోవటానికి ప్రతిసంవత్సరం విదేశాల నుండి కూతుళ్ళు,కోడలు తప్పనిసరిగా వస్తారు.పెద్దవాళ్ళు ఉన్నంతవరకు భారతదేశంలోనే చేసుకోవాలని లక్ష్మీదేవి,మూర్తిగార్ల కోరిక.అదే పిల్లలు తు చ
తప్పకుండా పాటిస్తున్నారు.పండుగ వచ్చినా నలుగురు పిల్లలు విదేశాలలో ఉన్నా ఎవరో ఒకరి ఇంట్లో అందరూ కలిసి జరుపుకుంటారు.

శ్రావణ శోభ

                      శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మీ వ్రతకాలం.శ్రావణ మాసంలో అన్నిశుక్రవారాలు వేరు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ప్రాధాన్యత వేరు.లక్ష్మీదేవి వరాలు ప్రసాదించే తల్లి కాబట్టి ఈరోజు వరలక్ష్మీదేవిగా కొలిచి
వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాము.లక్ష్మీ అనే మాటలోనే అద్భుతభావాలున్నాయి.అందరినీ చల్లగాచూచే తల్లి,అందరికీ లక్ష్యమైన ఐశ్వర్యం,ఆనందాల రూపమే లక్ష్మీదేవి.స్త్రీలందరూ లక్ష్మీ స్వరుపులే.అందుకే స్త్రీ ప్రాధాన్యం కలిగిన పర్వం.
ఈరోజు గృహాలు,గృహిణులు,గృహలక్ష్మీ కళతో శోభిల్లుతూ వరలక్ష్మీవ్రతం చేసుకొనటం సంప్రదాయం.ఈరోజు స్త్రీలు   ఇరుగు,పొరుగు,ఒకరినొకరు లక్ష్మీరూపులుగా భావిస్తూ వాయనాలు అందిచడం,పసుపు,కుంకుమలు ఒకరికొకరు పంచుకోవడం దివ్యానుబంధాలను పటిష్టంచేస్తాయి.ఈరోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ప్రత్యేకం.మిగిలిన నైవేద్యాలు ఎన్నిచేసినా తొమ్మిది పూర్ణాల వాయనం ముఖ్యమైనది.తొమ్మిది ముడులతో వేసిన తోరము అమ్మవారి దగ్గర పెట్టి కట్టుకోవటం ప్రత్యేకమైనది.క్రొత్తగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన ఇళ్ళల్లో వియ్యాలవారినీ,బంధువులందరినీ పిలిచి ఈ
వ్రతం చేస్తారు కనుక సందడే సందడి.మామిడితోరణాలు,పసుపు,కుంకుమతో గడపలు,రకరకాల పువ్వులతో అమ్మవారి అలంకరణ చూడటానికి రెండుకళ్ళు చాలవన్నట్లు ఉంటుంది.పట్టుచీరెల రెపరెపలు,రకరకాల నగలతో నిండుగాఉన్న ముత్తైదువల హడావిడి పూర్తి శ్రావణ శోభను సూచిస్తుంది.ఈపూజకు చామంతిపువ్వులు ప్రత్యేకం.                                                                              మిత్రులందరికీ,గృహిణులకు వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు. నాబ్లాగ్  వీక్షకులందరికీ ఆయురారోగ్యాలను,ఐశ్వర్యాన్ని ప్రసాదించమని ఆ వరలక్ష్మీ దేవిని మనసారా  ప్రార్ధిస్తున్నాను.  

గోరుమిట్టాలు

        మైదా - 3 గ్లాసులు
       బోంబే రవ్వ - 1/2 గ్లాసు 
       నెయ్యి - 1 కప్పు
       ఉప్పు - చిటికెడు
      పంచదార - 1/2 గ్లాసు 
      సోడా ఉప్పు - చిటికెడు 
                           మైదా,రవ్వ,నెయ్యి,చిటికెడు సోడా ఉప్పు వేసి బాగా కలిపి కొంచెము నీరుపోసి గట్టిగ కలిపి పెట్టుకుని పైన తడి క్లాత్ కప్పి 2 గం.లు నాననివ్వాలి.తర్వాత కొంచెం పిండి తీసుకుని బొటనవ్రేలి గోరుపై పెట్టి 
నొక్కుతూ పైన గీతలు వచ్చేలా గవ్వ షేపులోచెయ్యాలి.పిండి మొత్తం అలాగే చేసుకుని నూనెలో కరకరలాడేలా
 వండి ప్రక్కన పెట్టుకోవాలి.పంచదారలో కొంచెంనీళ్ళు పోసి లేత పాకం రానిచ్చి గోరుమిట్టాలు వేసి బాగా కలియ
 త్రిప్పాలి. కొంచెం ఆరిన తర్వాత డబ్బాలో పెట్టాలి. వారం రోజులు నిల్వ ఉంటాయి.  
   

Thursday, 7 August 2014

కొత్తిమీర పప్పు

    1) కందిపప్పు - 1 కప్పు              2 )పెసరపప్పు - 1 కప్పు
        కొత్తిమీర - 1 పెద్ద కట్ట                  కొత్తిమీర - 4 కట్టలు
        టొమాటోలు - 4                         నిమ్మకాయ - 1
        ఉల్లిపాయ -1                              పచ్చిమిర్చి -4
       పచ్చిమిర్చి - 5
      చింతపండు - కొంచెం
   
                                           1)కందిపప్పు కడిగి దానిలో తరిగిన ఉల్లిపాయ ,కొత్తిమీర,టొమాటోలు, పచ్చిమిర్చి  చింతపండు,ఉప్పు,కారం అన్నీవేసి సరిపడా నీళ్ళు పోసి కుక్కర్లో మూడు విజిల్స్ రానిచ్చి మూత వచ్చిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇది అన్నంలోకి,చపాతీలోకి బాగుంటుంది.మనం చెప్తే తప్ప కొత్తిమీర పప్పు అని తెలియదు.
చాల రుచిగా ఉంటుంది.
                                          2)పెసరపప్పు కడిగి తగినంత నీరుపోసి రెండు పొంగులు రాగానే కొత్తిమీర ,పచ్చి మిర్చి సన్నగా తరిగి సిమ్ లో ఉడికించాలి.ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసి నిమ్మరసం పిండి దించేయాలి.
 తర్వాత తాలింపు పెట్టాలి.ఇది అన్నంలోకి,చపాతీలోకి బాగుంటుంది.              

కొత్తిమీర చట్నీ

      కొత్తిమీర - 6 కట్టలు
     పచ్చిమిర్చి - 5
     ఉప్పు - తగినంత
    నిమ్మకాయ - 1
                                 ముందుగా కొత్తిమీర కడిగి ,పచ్చిమిర్చి ,కొత్తిమీర రోట్లో వేసి నూరాలి.తరువాత నిమ్మరసం పిండి గిన్నెలోకి తీసి తాలింపు పెట్టాలి.ఇది ఇడ్లీలోకి,దోసెలోకి బాగుంటుంది.

కొత్తిమీర గారెలు

     మినప్పప్పు - 1/4 కే.జి
    కొత్తిమీర  - చిన్న కట్టలు 10
    అల్లం - కొంచెం
   పచ్చి మిర్చి  - 5
                                                  మినప్పప్పు నానిన తర్వాత అల్లం,పచ్చి మిర్చి వేసి గారెల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి.చివరలో కొత్తిమీర కడిగి పిండిలో వేసి రుబ్బాలి.దానిలో జీరా వేసి కలిపి గారెలు వేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.ఆరోగ్యానికి మంచిది కూడా.దీన్ని కారట్ పచ్చడితో గానీ,అల్లం,పచ్చి మిర్చి పచ్చడితో గానీ,అల్లం నిల్వ పచ్చడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.

పకోడీ వంకాయ కూర


   వంకాయముక్కలు చీలికలుగా కోసి నూనెలో వేసి వేగనిచ్చి తీసేయ్యాలి.ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు నూరిన అల్లము,శనగపిండి,నెయ్యి కొంచెము వేసి పకోడీ పిండిగా కలిపి పకోడీ వండుకోవాలి.తాలింపు పెట్టి,కరివేపాకు  జీడిపప్పు,ఉల్లిపాయ,పచ్చిమిర్చిముక్కలు వేయించి అల్లం,వెల్లుల్లి,జీరా,నూరిన ముద్ద వేసి వంకాయ వేగిన ముక్కలు,పకోడీ కొబ్బరికోరు వేసి మ్రగ్గనిచ్చి గరం మసాలా చల్లి దించేయాలి.నోరూరించే వంకాయ పకోడీ కూర రెడీ.
గమనిక:మనకు అవసరమైనంత సుమారుగా వేసుకుని కూర వండుకోవాలి.

గుత్తి వంకాయ కూర

     లేత వంకాయలు - 1/4 కే.జి
     నూనె - 1/4 కే.జి
    పచ్చి లేక ఎండు కొబ్బరికోరు - 1/4 చిప్ప
    ఎండు మిర్చి - 15 -20
    జీరా - 1/2 టేబుల్ స్పూను
    మెంతులు - 1/4 టేబుల్ స్పూను
    ధనియాలు -2 టేబుల్ స్పూన్లు
    వేరుశనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు
    నువ్వుపప్పు - 2 టేబుల్ స్పూన్లు, గసాలు - 1 టేబుల్ స్పూను
    ఉప్పు - 2 టేబుల్  స్పూన్లు
    పసుపు - కొంచెం ,చింతపండు - చిన్న నిమ్మకాయంత
    ఉల్లిపాయ - 1 పెద్దది
              ఎండుమిర్చి,జీరా,మెంతులు,ధనియాలు,వేరుశనగపప్పు,నువ్వుపప్పు,విడిగా వేయించి మిక్సీలో పొడి చేసుకోవాలి.గసాలు కూడా వేయించి,కొబ్బరి,గసాలు కలిపి మెత్తగా చేసి చింతపండు పులుసు చిక్కగా పిండుకుని
ఒక ప్రక్కన పెట్టుకోవాలి.ఉల్లిపాయముక్కలు కొద్దిగా పసుపు,ఉప్పు వేసి వేయించిమెత్తగాచేసి ,పొడులన్నీకలిపి
 వంకాయలు పొట్ట చీల్చి దానిలో పట్టినంత నింపి నూనెలో చిన్నమంటమీద మ్రగ్గనివ్వాలి.కొంచెం ఉప్పు కలిపి
చింత పండు,గసాలు,కొబ్బరి మిశ్రమం మ్రగ్గుతున్న వంకాయల మీద పోసి ఉడకనిచ్చి దగ్గరపడుతుండగా గ్రేవీలాగా
ఉండగా తీసేస్తే నోరూరించే గుత్తి వంకాయ కూర రెడీ.
       

పాల ముంజిలు

 కొబ్బరికాయలు - 2
 పాలు - 1/2 లీటరు
బియ్యప్పిండి - 1/2 కే .జి
 పంచదార - 1 కప్పు
బెల్లం - 3/4 కే.జి
 నూనె  - వేయించటానికి సరిపడా
              కొబ్బరి తురుముకుని,బెల్లం తరిగి రెండు కలిపి ఒక మందపాటి గిన్నెలో వేసి 1/2కప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి లౌజు తయారు చేసుకోవాలి.అంటే బర్ఫీ అయ్యేకన్నా కాస్త ముందుగా దింపి చల్లారక నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి.వేరేపాత్రలో పాలు,పంచదార వేసి కలిపి స్టవ్ మీద పెట్టి బియ్యప్పిండి పోస్తూ త్రిప్పాలి.గట్టిపడిన తర్వాత 2 స్పూనుల  నెయ్యివేసి ఉండలు లేకుండా కలిపి దించాలి.చల్లారాక పెద్ద నిమ్మకాయంత ఉండ తీసుకుని చేతికి నూనె రాసుకుని పలుచగా వత్తి మధ్యలో కొబ్బరి ఉండ పెట్టి చుట్టూ ముయ్యాలి.అన్నీ అలాగే చేసి పెట్టుకుని బాండీలో నూనె పోసి కాగాక నాలుగైదు ఉండలు చొప్పున వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించి తియ్యాలి.కొంచెం ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేస్తే నాలుగు రోజులు నిల్వ ఉంటాయి.కంటికి ఇంపుగాను,నోటికి రుచిగానూ,కడుపు నిండే తేలికైన వంటకం.

విమర్శించటం అవసరమా?

                      రుక్మాంగద బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళింది.పెళ్లికొడుక్కి వయసు ఎక్కువే ఉన్నా చిన్నపిల్లల మనస్తత్వం.పెళ్ళికూతురు మరీ చిన్నవయసు కాకపోయినా పల్లెలో పెరిగిన పిల్ల.వీళ్ళ ఇద్దరికీ ఎప్పుడు ఎలా  నవ్వాలో,ఎప్పుడు నమస్కారం చెయ్యాలో కూడా తెలియటం లేదంటూ వచ్చిన బంధువులు చూచి ఊరుకోక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అనేకన్నా విమర్శిస్తున్నారని అనుకోవాలి.పాపం ఇలాంటి పిల్లలకు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారో బొమ్మల పెళ్ళిళ్ళ మాదిరిగా అంటూ నవ్వుకుంటున్నారు.వింటున్న రుక్మాంగదకు కళ్యాణ మండపంలో ఇవన్నీ మాట్లాడుకోవటం అంత అవసరమా?అనిపించింది.ఇటు పెద్దలు,అటు పెద్దలు ఇష్టమయ్యే ఆపెళ్ళి చేస్తున్నారు.అటువంటప్పుడు మనకు ఎందుకు?అన్నట్లు వీళ్ళందరికీ విమర్శించటం అవసరమా?
సంతోషంగా పెళ్ళికి ఆహ్వానించారు.భోజనం చేసి నాలుగు అక్షింతలు వేసి ఇవతలకు వచ్చేదానికి అక్కడే తిన్నది అరిగిపోయే వరకూ విమర్శనాస్త్రాలు గుప్పించటం ఈరోజుల్లో పరిపాటి అయింది.

రోట్లో తల పెట్టి రోకటిపోటుకు..........

                   అమీలిత చిన్నాన్న కొడుకు పెళ్ళి.వీళ్ళ కుటుంబంలో పెళ్ళిసమయంలో పెళ్ళికొడుకు  లగ్నంమీద (పెళ్ళిపీటలమీద) కూర్చునేటప్పుడు వేసుకునే బట్టలు ఆడపడుచు తీసుకురావటం సంప్రదాయం.అమీలిత విదేశాలలో ఉన్నందువలన తల్లిదండ్రులను పెళ్ళికొడుక్కి నచ్చిన సూటు తీసుకోమని చెప్పింది.చిన్నాన్నకొడుకును
షాపింగ్ మాల్ కి రమ్మంటే చిన్నాన్న నేను వస్తానన్నాడు.చిన్నాన్న మనస్తత్వం ఏమిటంటే తను కొనాలంటే తక్కువరకంలో తీసుకుని ఎవరైనా కొంటారని అనుకుంటే అన్నిటికన్నా ఖరీదుకలది వాళ్లకు నప్పకపోయినా కొనుక్కునే తత్వం.సరే,"రోట్లో తల పెట్టిన తర్వాత రోకటి పోటుకు వెరవకూడదు కదా"అన్నట్లు మనం అనుకున్న
దానికన్నా రెట్టింపు అవుతుంది అంతకన్నా ఏముందిలే అని అమీలిత తల్లిదండ్రులు అనుకున్నారు.  

Wednesday, 6 August 2014

రేసింగ్

                 రేసింగ్ అంటే కార్ రేసింగో,బైక్ రేసింగో అనుకుని పొరపాటు పడతాము.కానీ ఇది వేరు.కొన్ని దేశాలలో వాళ్ళ చుట్టు ప్రక్కల దేశాలనుండి ఉద్యోగాలకో,చదువుకోవడానికో వచ్చినవాళ్ళను పరిక్షించటానికి ఒకపని చెప్తారు.
వీళ్ళకు తెలియదు కదా!కొంతమంది చేస్తారు.కొంతమంది అది నాపని కాదని నేనెందుకు చేయాలి? అని ఎదురు ప్రశ్నిస్తారు.ఇక అప్పటినుండి ఎదురు చెప్పిన వాళ్ళను చిన్నపని,పెద్దపని చెప్తూ సతాయించటం మొదలుపెడతారు.
అదెలా ఉంటుందంటే ఎందుకొచ్చిన ఖర్మరా బాబూఅనుకునేలా ఉంటుంది.మీరు విదేశీయులు కదా!అందుకే అలా   కొంతమంది ప్రవర్తిస్తుంటారని తోటివాళ్ళు చెప్తుంటారు.దీన్నే అక్కడివాళ్లు రేసింగ్ అంటారు. 

మామా గైయింగ్

            కొంతమందికి ఎదుటివారితో పనులు చేయించుకోవటం బాగా తెలుసు.చేసేవాళ్ళు కూడా నయనో,భయానో
చేసిపెడుతుంటారు.ఇంకొంతమంది కాకాపట్టి పైఆఫీసర్లతో పనులు చేయించుకుంటారు.షబనా తన క్రింది వాళ్ళతో పైవాళ్ళతో కూడా పనులు బాగా చేయించుకుంటుంది.ఎలాగంటే శుభోదయంతో మొదలుపెట్టి కుశల ప్రశ్నలతో 
 సాగదీసి తనకు చేయవలసిన పనితో ముగింపు పలుకుతుంది.నవ్వుతూ నచ్చేవిధంగా మాట్లాడేసరికి ఎవరైనా కాదనలేని పరిస్థితి.చక్కగా పనులు జరిగిపోతాయి.ఆవిడ నవ్వుతూ మాట్లాడటమే ఎక్కువ.ఎంతటి మొండి ఘటాలైనా చేస్తారు.అది సర్,ఇది మేడం అంటూ కూడా కూడా తిరిగి వాళ్ళ పనులన్నీ చేసి తమ ప్రోమోషన్లను కొట్టేస్తుంటారు ఇంకొంతమంది ప్రబుద్దులు.మనదేశంలో కాకా పట్టడం అనటాన్నేవిదేశాల్లో,చుట్టుప్రక్కల ఐలాండ్స్అన్నింటిలో
"మామా గైయింగ్ "అంటారు.
  

Monday, 4 August 2014

కాబేజి పకోడీలు

             కాబేజి  - చిన్నది
             ఉల్లిపాయలు - 2 పెద్దవి
            పచ్చి మిర్చి - 6 పెద్దవి
           అల్లం - చిన్న ముక్క
           కరివేపాకు - కొంచెం
           వెన్న లేక వేడి నూనె - కొంచెం
          నూనె  - వేయించడానికి సరిపడా ,ఉప్పు - సరిపడా
          బేసన్  - 1/4 కే.జి
           రైస్పిఫ్లోర్ - ఒక గుప్పెడు                                                                                                                                                                                                                                                                                                              ముందుగా ఫుడ్ ప్రోసెసర్ లో కాబేజి,ఉల్లిపాయలు సన్నగా,పొడవుగా చేసుకోవాలి.అల్లం,పచ్చిమిర్చి  నూరుకోవాలి.కరివేపాకు,ఉప్పు,వెన్న లేక వేడి నూనె వేసి బాగాకలిపి
బేసన్,రైస్ ఫ్లోర్,అల్లం,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి సరిపడా నీళ్ళు పోసి నూనెలో జారేట్లుగా కలుపుకోవాలి.బాండీలో నూనె పోసి స్టవ్ వెలిగించి నూనె కాగిన తర్వాత ఈపిండిని నూనెలో సన్నగా పడేట్లుగా వేసి వేయించి ఒక పేపర్ మీద వేయాలి.ఒక నిమిషం తర్వాత బౌల్ లో వేసుకోవాలి.నోరూరించే కాబేజీ పకోడీ రెడీ.ఇవి కరకరలాడుతూ చాలారుచిగా  వెరైటీగా ఉంటాయి.ఇదే పిండితో వడలు మాదిరిగా కూడా వేసుకోవచ్చు.
గమనిక:ఈపిండిని కలిపిన తర్వాత ఎక్కువ సేపు నిల్వ పెడితే పలుచగా అవుతుంది.అప్పుడు పిండి కొంచెం వేసి కపుకోవచ్చు కానీ అప్పుడు సన్నగా రాకుండా కాబేజీ పకోడీలు లావుగా వస్తాయి.   

కాపత్తి,చాపత్తి

                               చమేలి ఇంటికి బంధువులు వస్తూ వెంట ఒకామెను తీసుకొచ్చారు.ఆమె సాయంత్రం కాసేపు కాలక్షేపానికి ఇల్లంతా తిరుగుతూ వంటగదిలోకి వచ్చింది.అక్కడే ఉన్న కాఫీపొడిని చూచి దీన్నిమాభాషలో"కాపత్తి"
అంటాము అంది.మీరు ఏభాషలో మాట్లాడతారు?అంటే తెలుగు మాట్లాడతాము.కానీ మాఊరిలోఅలాగే మాట్లాడతాం అంది.చమేలి ఆప్రస్తావన అంతటితో వదిలేసింది.తర్వాత టీ తీసుకోమంటే "చాపత్తి" ఎక్కువైంది కొంచెం తెల్లగా అంటే
లైట్ గా కావాలి అని చెప్పింది.ఇంటికి వచ్చిన వాళ్ళను అది అంటే ఏమిటి?ఇది అంటే ఏమిటి?అంటూ యక్షప్రశ్నలు
వెయ్యకూడదు కదా!అందుకని కాపత్తి అంటే కాఫీపొడి,చాపత్తి అంటే టీపొడి అని చమేలి అర్ధం చేసుకుంది.ఒకే భాష
అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా మాట్లాడతారు కాబోలు అని మనసులో అనుకుంది.చమేలి ఇంట్లో ఉన్న
నాలుగు రోజులు వసపిట్టలాగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది.