మాన్విత ఇంటిప్రక్కన అందమైన డిజైనుతో పొందికగా చిన్నచిన్న మెట్లు స్పైరల్ గా మేడ పైకి వెళ్ళటానికి అమర్చుకున్నారు.మాన్విత ఒకరోజు హాల్లో కూర్చుని బంధువులతో మాట్లాడుతుండగా కిటికీలోనుండి కనిపించిన దృశ్యం వింతగా అనిపించింది.నాలుగైదు కాకులు వరుసగా మెట్లెక్కుతున్నాయి.ఒక్క క్షణం అవి ఎలా ఎక్కుతున్నాయో అర్ధం కాలేదు.పరీక్షగా చూస్తే అవి చకచకా ఒకమెట్టు మీద నుండిఇంకొక మెట్టు మీదకు గెంతుతూ ఎక్కుతుంటే తోక విచిత్రంగా కదులుతుంది.కాకులు ఎగరటమో,ఆహారం తినేటప్పుడు నడవటమో చేస్తాయి కానీ మెట్లెక్కి వెళ్ళటం మాన్వితకు,బంధువులకు కూడా వింతగా అనిపించింది.అవి ఒక్కరోజు కాకుండా ప్రతిరోజూ మెట్లెక్కి మధ్యాహ్నం,సాయంత్రము వెళ్తున్నాయి.బహుశా వాటికి అక్కడ తినడానికి ఏమైనా ఆహారం ఉండి ఉండొచ్చు.పిల్లలు ఆదృశ్యం చూచి కాకులకు ఎగరటం విసుగొచ్చి,సరదాగా మెట్లెక్కి వెళుతున్నాయని ఒకటే నవ్వులు.నిజం చెప్పాలంటే కాకులు ఒకదాని తర్వాత ఒకటి గెంతుతూ మెట్లెక్కి తోకత్రిప్పుకుంటూ ఒకే లైనులో వెళ్ళటం భలే విచిత్రంగా అనిపించింది.
No comments:
Post a Comment