Monday, 31 December 2018

రైతుకు చేయూత

                                           నూతన సంవత్సరం వచ్చిందంటే అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకోవడంతోపాటు పెద్దలను కలిసేటప్పుడు ఎక్కువగా మిఠాయిలు,ఆపిల్ పండ్లు తీసుకెళ్లటం ఆనవాయితీగా వస్తుంది.మిఠాయిలు ఆరోగ్యానికి చేటు.ఆపిల్ పండ్లు విదేశీ పండ్లు.వీటిని దిగుమతి చేసుకోవడంతో డబ్బు విదేశాలకు చేరుతుంది.కనుక వీలైనంతవరకు ఈసారి మనదేశంలో,మన రైతులు పండించిన అరటి,చక్రకేళి,దానిమ్మ,బొప్పాయి,జామ వంటి రకరకాల పండ్లు శుభాకాంక్షల నిమిత్తం ఉపయోగించినట్లయితే మన రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.స్వదేశీ పండ్లను ఉపయోగించి రైతులకు చేయూత ఇచ్చినట్లయితే వ్యవసాయ కుటుంబాలు ఆర్ధికంగా మెరుగుపడడానికి సహాయపడినట్లు అవుతుంది.మిఠాయిలు,విదేశీ పండ్ల కన్నా స్వదేశీ పండ్లే ముద్దు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2019

                                                                            గత స్మృతులు నెమరవేసుకుంటూ,గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ,నూతనోత్సాహంతో,సరి కొత్త లక్ష్యాలతో, విజయపధంలో నడుస్తూ, అష్టైశ్వర్యాలను,భోగభాగ్యాలను చవిచుస్తూ,మీ జీవన ప్రయాణంలో మీరు,మీ కుటుంబసభ్యులు  సుఖసంతోషాలతో,ప్రశాంతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా అనుకున్న విధంగా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ  నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

అతి ప్రేమ

                                                                       అతి ప్రేమ వల్ల కొన్ని కొన్ని సార్లు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.ఈమధ్య విప్రకు అటువంటి పరిస్థితే ఎదురైంది.విప్ర స్నేహితురాళ్ళతో కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది.వాళ్ళింట్లో ఎప్పటి నుండో నిమ్మీ అనే కుక్క ఉంది.విప్ర కారు వెళ్ళి ఇంటి ముందు ఆగగానే నిమ్మీ పరుగెత్తుకుంటూ వచ్చింది.దానికి మాములుగా కారు తలుపు తీయగానే విప్ర మీద కాళ్ళు పెట్టేసే అలవాటు ఉంది.ముందుగా విప్ర స్నేహితురాళ్ళు దిగుతూ ఉండేసరికి కొత్తవాళ్ళను చూసి మీదపడి వాళ్ళని కరిచేలా పెద్దపెద్దగా అరిచింది.ఇంతలో విప్ర దిగేసరికి నిమ్మీ ఎంతో సంతోషంగా ఎగిరి విప్ర మెడ వరకు కాళ్ళు వేసింది.ఏయ్!ఏయ్! అంటూ విప్ర ఒక అడుగు వెనక్కి వేసేసరికి నిమ్మీ కూడా వెనక కాళ్ళపై నడిచి నాకడానికి ప్రయత్నించింది.అక్కడ పూల కుండీలు ఉండడంతో దభీమంటూ విప్ర మొక్కల్లో పడిపోయింది.వెంటనే తేరుకుని లేచింది విప్ర.నిమ్మీ అతి ప్రేమ వల్ల వేగంగా పడడంతో మెడ నరాలు అదిరి వాంతులు అయిపోయి ఒక రోజంతా పడుకునే ఉండవలసి వచ్చింది.ఇంకా నయం ఎక్కడా ఎముకలు విరగలేదు అని విప్ర సంతోషపడింది. 

Sunday, 23 December 2018

మాటిమాటికి నొప్పులా?

                                                            కొంతమందిని మాటిమాటికీ కాళ్ళ నొప్పులు,మెడనొప్పి,ఒళ్ళు నొప్పులు ఏదో ఒకటి వేధిస్తుంటాయి.నలభై దాటిన మహిళల్లో,సరైన ఆహారం తీసుకోని వాళ్ళల్లో కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి.ఇటువంటప్పుడు ఒకసారి కాల్షియం పరీక్ష చేయించుకుని వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.కాల్షియం సరిపడా ఉంటే ఎముకలు,దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.కండరాల పనితీరు మెరుగుపడుతుంది.ఎన్నో ఉపయోగాలున్న కాల్షియం పుష్కలంగా లభించే ఆహారం రోజువారీ వీలైనంత ఎక్కువగా ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.మునగ కాయలు పాలకూర,తోటకూర,గోంగూర,మునగాకు,చేమఆకు,పొన్నగంటి వంటి ఆకుకూరలు,క్యాబేజ్,ముల్లంగి,కాలీఫ్లవర్,సోయాబీన్స్,సెనగలు,పెసలు,రాజ్మ,బాదం,ఖర్జూరం,ఎండుద్రాక్ష,నువ్వులు,అవిసెలు,క్వినోవా,అంజీర్,చేపలు,గుడ్లు,పాలు,నువ్వులలడ్డు,తాటి బెల్లం వంటి వాటిల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.కాల్షియం తగ్గితే ఎముకలు బోలుగా తయారై ఊరికే విరిగిపోయే ప్రమాదం ఉంది.కనుక కాల్షియం మందు రూపంలో వేసుకునేకన్నా ఆహారం రూపంలో తీసుకోవడం ఉత్తమం.

Friday, 21 December 2018

బిర్యానీ పిచ్చికుక్క

                                                                      శర్మిష్ట ఒకరోజు కోడి కూర,కోడి బిర్యానీ చేసి పనిమనిషి శారద పిల్లల కోసం గిన్నెలో పెట్టి ఇచ్చింది.అది చూడగానే శారద సంతోషంగా నా కొడుక్కి బిర్యానీ అంటే పిచ్చి.బిర్యానీ చూస్తే చాలు పిచ్చికుక్క మాదిరి ఎగబడిపోతాడు.నా కొడుకుని ముద్దుగా బిర్యానీ పిచ్చికుక్క అంటాను అని చెప్పింది.అదేమి ప్రేమే తల్లీ?బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్తే వినడానికి బాగుంటుంది కానీ బిర్యానీ పిచ్చికుక్క అంటే ఏమి బాగుంటుంది?ఎంత పిల్లాడైనా అంది శర్మిష్ట.వాడు కిలకిలా నవ్వుకుంటాడు అమ్మా!నేను ఆమాట అనగానే అంది శారద.ఎవరి అలవాట్లు వాళ్ళవి.ఎవరి మాటతీరు వాళ్ళది.ఇది చిన్న విషయమే కావచ్చు.అయినా ఈమె అనే కాదు కొంతమంది తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటారు.నాలుగు అని చెప్పినా అదే నిజమైనా వాళ్ళ పద్ధతి మార్చుకోరు.మనకు నచ్చినట్లు మనం ఉండడం అంతే కానీ ఈ రోజుల్లో ఎదుటివారిని మార్చాలని అనుకోవడం అంత తెలివి తక్కువ తనం ఇంకొకటి లేదు అనుకుంది శర్మిష్ట.

ముప్పు తిప్పలు పెట్టిన చిట్టెలుక

                                                               భవ్య ఇంటి చుట్టూ బోలెడంత అంటే చాలా ఖాళీ స్థలం ఉంది.దానిలో రకరకాల పువ్వుల మొక్కలతోపాటు కూరగాయలు,ఆకుకూరలు పెట్టింది.భవ్య వరుసకు చెల్లెలు గవ్య డాబాపై కూరగాయలు పెంచుకోవటం ఎలా?అని ఉద్యానవన శాఖవారు పెట్టిన తరగతులకు హాజరైతే వాళ్ళు రకరకాల నమునా కూరగాయలు,ఆకుకూరల విత్తనాలు ఇచ్చారు.వాటిని తీసుకెళ్ళి మీ ఇంట్లో చాలా స్థలం ఉంది కదా! పెట్టమని భవ్యకు ఇచ్చింది.గవ్య వేరే ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా వాళ్ళు మొక్కలను కాపాడలేకపోయారు.భవ్య గింజలు భూమిలో పెట్టి మొక్కలు వచ్చిన తర్వాత జాగ్రత్తగా కాపాడింది.ఎలాగైతే కొన్ని రోజులు కాయలు బాగానే వచ్చాయి.చుట్టుపక్కల అందరికీ ఇచ్చింది.రుచి చాలా బాగుంది అని అందరు మెచ్చుకున్నారు కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది.ఈమధ్య తెల్లారేసరికి పందిరికి వేళ్ళాడే కాయలు,క్రింద ఉన్న పిందలన్నీ కొరికి ముక్కలు చేసి ఉంటున్నాయి.ఉదయం తోటలోకి వెళ్తే అప్పుడే కొరికినట్లుగా తెల్లగా ముక్కలు క్రింద పడి ఉంటున్నాయి.రాత్రిపూట ఏ పందికొక్కులు,ఎలుకలు తింటున్నాయో లేదా తెల్లవారుఝామున ఉడుతలు కొరికేస్తున్నాయో తెలియక భవ్య బుర్ర బద్దలుకొట్టుకునేది కాక గవ్య బుర్ర అదేపనిగా తినడం మొదలెట్టింది.పైన వాటికి కవర్లు చుట్టి,క్రింద ఉన్న వాటిపై గమేళాలు,బక్కెట్లు బోర్లించి నానా తిప్పలు పడితే గాలి తగలక పిందెలు కుళ్ళిపోతున్నాయి.భవ్యకు ఏడుపు వచ్చినంత పనై దొంగ మొహంది ఏది వచ్చి తింటుందో కానీ నాకైతే ప్రాణం ఉసూరుమంటుంది.ఎన్ని విధాలుగా కాయల్ని కాపాడదామని ప్రయత్నించినా కాపాడలేక,తినేవాటిని నియంత్రించలేక విసుగొచ్చి మందు పెట్టి చంపెయ్యాలన్నంత కచ్చి పుడుతుంది. నాకు నిద్రలో కూడా అదే ధ్యాసగా ఉంటుంది అంటూ కంఠ శోషగా చెప్పింది..ఒకటి,అర అయితే ఊరుకోవచ్చు కానీ ఈరోజు ఒకటి కొంచెం కొరికి మళ్ళీ తర్వాతి రోజు పక్కది కొరుకుతుంది అని చెప్పింది.భవ్య.ఎలుక అయ్యుంటుంది బోను పెట్టు అని సలహా ఇచ్చింది గవ్య.ఒక చిన్న పకోడీ పెట్టి బోను పెడితే చిట్టెలుక పడింది అంటూ తెల్లారేపాటికి ఉత్సాహంగా గజదొంగను పట్టుకున్నానని చెప్పింది.చిన్న ప్రాణే కానీ పాపం భవ్యను  ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది.

Tuesday, 18 December 2018

కేడి పెయ్య

                                                                           హైమ ఒకరోజు ఇంట్లోకి వస్తూనే చాటంత మొహంతో ఎంతో సంతోషంగా అమ్మా!ఊరిలో ఉన్న మా ఆవుకు కేడి పెయ్య పుట్టిందని మా అత్త చరవాణిలో  చెప్పింది అంది.కేడి పెయ్య అనే పదం మొదటిసారి వినడంతో అంటే ఏమిటి?అంది శ్రుతి.మగ దూడను కేడి పెయ్య అంటామని చెప్పింది హైమ.ఎవరైనా ఆవుకి కానీ,గేదేకి కానీ పెయ్య దూడ పుడితే సంతోషపడతారు కానీ విచిత్రంగా నువ్వు మాత్రం కేడి పెయ్య పుడితే సంతోషపడతావేంటి?అంది శ్రుతి.మా ఊరిలో అందరూ కేడి పెయ్య పుడితే సింహాద్రి అప్పన్న స్వామికి ఇస్తామని మొక్కుకుంటారు.మేము కూడా సింహాద్రి అప్పన్న స్వామికి కేడి పెయ్యను ఇస్తామని మొక్కుకున్నాము అని చెప్పింది హైమ.కేడి పెయ్య కొంచెం పెద్దయ్యాక స్వామికి మొక్కుబడి తీర్చేటప్పుడు కుటుంబం మొత్తం ఏ ఊరిలో ఉన్నా అందరము మా ఊరికి వెళ్ళిపెద్ద సంబరం చేసుకుంటాము.ఆరోజు కేడి పెయ్యతోసహా అందరము శుద్ధి స్నానాలు చేసి గుడికి వెళ్ళి గుడి చుట్టూ కేడి పెయ్యను కూడా తిప్పి అక్కడ ఇచ్చేస్తే దేవస్థానం వాళ్ళు పెంచి పోషిస్తారని హైమ ఎంతో సంబరంగా శ్రుతికి చెప్పింది. 

Monday, 10 December 2018

కసకస

                                                                          ఆదిత్య రామ్ ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు.ఒకసారి నగరం నుండి ఊరికి వచ్చినప్పుడు పిన్నిని,బాబాయిని చూడడానికి వాళ్ళింటికి వెళ్ళాడు.భోజనానంతరం మాటల మధ్యలో ఏరా నాన్నా!నీ ఉద్యోగం ఎలా ఉంది?అని అడిగింది పిన్ని.బాగానే ఉంది అని చెప్పి మా మానేజరు మంచివాడే కానీ అప్పుడప్పుడు కాస్త తిక్క వస్తుంటుంది.అప్పుడు ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళను సతాయించుతూ ఉంటాడు.అప్పుడు అతన్ని ఏమీ అనలేము కదా!అందుకే ఎప్పుడైనా మా మానేజరుపై కోపం వస్తే రైతుబజారు నుండి కారట్,క్యాబేజ్ కొనుక్కొచ్చి ఆ కోపం తగ్గేవరకు కసకస వాటిని కోసి కూర వండుకుని స్నేహితులందరము కలిసి తింటాము.అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండదు పిన్ని అని ఆదిత్య రామ్ చెప్పాడు.అక్కడ ఉన్న వాళ్ళందరు ఒకటే నవ్వులు.ఇదేదో బాగానే ఉందే అంది పిన్ని.ఎవరి మీదన్నా కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిపై కోపంతో విరుచుకు పడడం,వాళ్ళు బాధపడటం ఇవేమీ లేకుండా ఆ అసహనాన్ని కారట్,క్యాబేజ్ పై చూపించడం కాసేపటికి మామూలైపోవడం అన్న ఆదిత్య ఆలోచన నిజంగా బాగుంది.ఎవరికీ కష్టం,నష్టం లేని పని అని అక్కడ వింటున్న వారందరూ అనుకున్నారు.  

Thursday, 6 December 2018

అరటి ఆకులో భోజనం

                                                          ఇంతకు ముందు రోజుల్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు తప్పనిసరిగా నదీస్నానానికి వెళ్ళి అటునుండి అటే శివాలయానికి వెళ్ళి వత్తులు వెలిగించుకుని శివదర్శనం అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసం ఉండి సాయంత్రం మరల స్నానం చేసి శుచిగా వంట చేసుకుని పూజానంతరం నక్షత్ర,చంద్ర దర్శనం చేసుకుని తర్వాత తప్పనిసరిగా అరటి ఆకులో భోజనం చేసేవారు.రోజువారీ తినే పళ్ళేలలో రకరకాల ఆహారపదార్ధాలు తింటూ ఉంటారు కనుక ఉపవాసం ఉన్నప్పుడు అరటి ఆకులో భోజనం చేయడం మంచిదని పెద్దలు చెప్పేవారు.మాములుగా కూడా అరటి ఆకులో భోజనం చేయడం వలన ఆహారపదార్ధాల వేడికి ఆకులోని ఔషధ గుణాలు పదార్ధాలలో కలిసి ఆహారం మరింత రుచిగా ఉండడమే కాక జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని,ఆకలి కూడా పెరుగుతుందని ఆయుర్వేదం చెపుతుంది.అంతేకాక ప్రేగులలో ఉన్న చెడు క్రిములు నశిస్తాయని తద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందుకే అరటి ఆకులో భోజనం ఎంతో శ్రేష్టమని పెద్దల ఉవాచ.

Friday, 23 November 2018

కార్తీక పున్నమి

                                                                          ఏ పౌర్ణమి ప్రత్యేకత ఆ పౌర్ణమికే ఉన్నా అన్నింటిలో  కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకతే వేరు.తెల్లవారుఝామునే నిద్ర లేచి నదీస్నానానికి వెళ్లి అభిషేకాలు,పూజలు దానితోపాటు రోజంతా ఉపవాసం ఉండి నేతిబీరకాయ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుని ఎలాగైనా సంపాదించి నేతి బీరకాయ పచ్చడి చేసి దానితోపాటు  రకరకాల వంటలు చేసుకుని చలిమిడి,వడపప్పు,జామ కాయలతో గుడికి వెళ్లి ఆవునేతితో 366 వత్తులు వెలిగించి మారేడు,ఉసిరి,జమ్మి వృక్షాలను పూజించి ఇంటికి వచ్చి తులసికోట వద్ద దీపాలు పెట్టడం,ప్రత్యేకంగా ఈరోజున చంద్రుడిని వరిపిండితో ముగ్గు రూపంలో వేసి పసుపు,కుంకుమ,గంధం,పూలు అలంకరించి దీపాలు  వెలిగించి వెండి గిన్నెలో పాయసం నివేదన పెట్టి పూజచేసే పద్ధతి,ఆ హడావిడి ఆ సంతోషం చెప్పనలవి కానిది.చంద్రుడు మంచి భర్తను మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడని చిన్నప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు.అందుకే అందరూ నిండు మనసుతో,నిండు పున్నమిలో నిండుగా దీపాలు పెట్టి నిండు నూరేళ్ళు కార్తీక పున్నమి చంద్రుని దయవల్ల చల్లగా,ప్రశాంతంగా,సంతోషంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ కార్తీక పున్నమి శుభాకాంక్షలు.

Wednesday, 21 November 2018

366 వత్తులు

                                                 పౌర్ణమి తిధి రెండు రోజులు రావడంతో 366 వత్తులు ఎప్పుడు వెలిగించాలి అనే సందిగ్ధత చాలామందిలో నెలకొంది.వత్తులు వెలిగించాలి అంటే ఉపవాసం ఉండి రాత్రి గల పౌర్ణమి అంటే గురువారం నాడు వెలిగించాలి.అభిషేకాలు చేయించుకోవాలి అంటే సూర్యోదయం పౌర్ణమి తిధి ఉన్నప్పుడు అంటే శుక్రవారం తెల్లవారుఝాము నుండి చేయించుకోవాలి అని పండితుల ఉవాచ.

Tuesday, 6 November 2018

దీపావళి శుభాకాంక్షలు

                                            నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు ఈ దీపావళి దివ్య కాంతుల వేళ శ్రీ మహాలక్ష్మి దయవల్ల మీకు,మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, సిరిసంపదలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు సమృద్ధిగా ఎల్లప్పుడూ వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.



Tuesday, 30 October 2018

దొండ .....అండ

                                                           బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని,దొండకాయ తింటే మందబుద్ది వస్తుందని ఒకప్పుడు ప్రచారం జరిగింది.ఏ కూరగాయ అయినా దేనికుండే ప్రయోజనం దానికి వుంటుంది.దొండ రెండు రకాలు.ఒకటి చేదు,ఒకటి తియ్యనిది.చేదు దొండని కాకి దొండ అంటారు.కానీ దీని ఆకులు కామెర్ల వ్యాధి నివారణకు వాడతారు.తియ్య దొండ మనం కూరగాయగా వాడతాము.దొండకాయలోను,ఆకుల్లోను ఉన్న ఔషధ విలువలు తెలియక,వేపుడు చాలా సమయం పడుతుంది కనుక చాలామంది ఉపయోగించరు.పులుసు కూరల్లో ఇది చాలా బాగుంటుంది.దొండకాయలో పీచు ఎక్కువ.జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పరుస్తుంది.ఇనుము శాతము ఎక్కువ.దొండకాయలో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు వల్ల నాడీ సంబంధ వ్యాధులు,మతిమరుపు,శ్వాసకోశ వ్యాధులు,క్యాన్సర్లు రావని నిపుణులు అంటున్నారు.రోజుకి ఒక పెద్ద చెంచా దొండకాయల రసాన్నితాగినట్లయితే  మధుమేహం అదుపులో ఉంటుందట.పచ్చి దొండకాయ నమిలితే నోటి పుండ్లు తగ్గుతాయట.దొండకాయలు ఎక్కువ తినేవాళ్లల్లో మూత్రపిండాల్లో  రాళ్ళు కూడా ఏర్పడవట.ఇన్ని ప్రయోజనాలున్న దొండ మన ఆరోగ్యానికి ఎంతో అండగా ఉంటుంది.కనుక మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

Thursday, 25 October 2018

బద్దకంగా ....

                                                               పనీ పాటా లేకుండా బద్దకంగా పొద్దస్తమానము నిద్రపోయే వాళ్ళల్లోను,కాసేపటికొకసారి నిద్రపోతూ లేస్తూ ఉండే వాళ్ళల్లోను కష్టపడి పనిచేసే వాళ్ళకన్నా మూడురెట్లు అధికంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.రాత్రివేళ ప్రశాంతంగా కంటి నిండా సరిపడా నిద్రపోయే వాళ్ళకి మతిమరుపు వచ్చే అవకాశం చాలా తక్కువని ఎన్నో ఏళ్ళు పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు.అందుకే సాధ్యమైనంత వరకు రాత్రిపూట ఎక్కువ సమయం మేలుకుని ఉండకుండా నిద్రపోవటం ఉత్తమం. 

Tuesday, 23 October 2018

పుట్ట మట్టితో.....

                                                       నాగుల చవితికో,సుబ్రమణ్య షష్టికో పుట్టలో పాలు పోసి పుట్ట మట్టిని చెవులకి,కళ్ళపైన రాసుకుంటారని తెలుసు కానీ తలకు కూడా రాసుకుంటారని ఇప్పుడే తెలిసి రక్షిత ఆశ్చర్యపోయింది రక్షిత. రజని,రక్షిత మంచి స్నేహితులే కాక ఇరుగు పొరుగు. పక్కపక్క ఇళ్ళల్లో ఉండడంతో పనులు త్వరగా పూర్తి చేసుకుని గంటల తరబడి లోకాభిరామాయణం చెప్పుకుంటారు.ఒకరోజు మాటల సందర్భంలో రజని వాళ్ళమ్మ పుట్టమట్టి తెచ్చి తలక పోసుకునేదని,అందుకే ఆమె జుట్టు తెల్లబడలేదని చెప్పింది.మా అమ్మకు  అరవై ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పటికీ జుట్టు వత్తుగా నల్లగా నిగనిగ లాడుతుంది.మనకు ఇప్పటికే దాదాపు తలంతా తెల్ల వెంట్రుకలే కదా!అంది.ఆరోజుల్లో మా ఊరిలో ఎక్కువ మంది పుట్ట మట్టిలో సరిపడా నీళ్ళు కలిపి పలుచగా చేసి దానితో తల రుద్దుకునేవాళ్లట.అందుకే తెల్ల వెంట్రుకలు లేవని అమ్మ చెప్పింది అంది. 

Sunday, 21 October 2018

కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఎలుకల పాలు

                                                                     ధన,అరవై సంవత్సరాల వాళ్ళ అమ్మ కూడా పొద్దస్తమానము కష్టపడి చుట్టుపక్కల ఇళ్ళల్లో గిన్నెలు తోమి,ఇంట్లోపనులు చేస్తుంటారు.చీటీలు కట్టగా మిగిలిన డబ్బు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని సజ్జ మీదున్న వాడని పెద్ద గిన్నెల్లో వేసేది.ఒకరోజు పక్కింటామె పిండి వంటకు పెద్ద గిన్నె కావాలని అడిగింది.అంత పెద్ద గిన్నె దింపడం కష్టం కనుక నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి గిన్నె తీద్దామని చూసేసరికి దానిలో ఎలుకలు కొట్టేసి ముక్కలు చేసిన 2000,500,100,200 రూపాయల నోట్లు ఉన్నాయి.గిన్నె కిందికి దించేటప్పుడు ధన అక్క కూడా అక్కడే వుంది.అదేమిటి ధన?నేను అవసరానికి డబ్బులు అడిగితే లేవు అన్నావు.ఇప్పుడేమో ఆరుగాలము కష్టపడి కూడబెట్టిన సొమ్ము అంతా ఎలుకల పాలుచేశావు.నీదే కాకుండా పెద్దమ్మ కష్టార్జితం కూడా పాడు చేశావు అంది.ధన కుక్కిన పేనులా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అమ్మకు అవసరమైతే ఉపయోగపడతాయని దాచాను.నేను కూడా పట్టీలు కొనుక్కుందామని అనుకున్నాను.దానిలో ఎప్పుడు వేశానో కూడా గుర్తులేదు. ఎలుకలు కొట్టేస్తాయని అనుకోలేదు అని నసిగింది.లెక్కపెడితే మొత్తం పదివేల రూపాయలు ఉన్నాయి.2000 రూ.నోటు ఎలుకలు చాలా చోట్ల కోరికటంతో అసలు పనికి రాలేదు.ఎలుకలు మిగతావి కొంచెం కొంచెం కొట్టేసినాయి.వాటిని ధన అక్క బ్యాంకులో మార్పించింది.పాపం ధన!అందరూ తలొక మాట అంటుంటే ముఖం చిన్నబుచ్చుకుంది.మనసులో బాధపడటం తప్ప పైకి ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి.ధన అమ్మ మాత్రం పోతేపోయినయిలే మనకు అంతవరకే ప్రాప్తి.ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది?అంది.మాట అయితే అన్నది కానీ తన డబ్బు మాత్రం దాచి పెట్టమని ధనకు ఇవ్వకుండా పనిచేసే ఆమె దగ్గరే దాచుకోవడం మొదలు పెట్టింది.           

Saturday, 20 October 2018

మికిరీ

                                                   శుభశ్రీ ఇంట్లో పనిమనిషి శ్రీలక్ష్మి అమ్మా నేను సాయంత్రం పనికి రావటంలేదు అని చెప్పి మావాళ్ళది ఒక మికిరీ ఉంది.అక్కడికి వెళ్ళాలని చెప్పింది.మికిరీ అనే పదం శుభశ్రీ మొదటగా వినడంతో అంటే ఏమిటి?అని అడిగింది.మికిరీ అంటే ఒక తగువు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అందరినీ పిలిచి పంచాయితీ పెడతారు.అప్పుడు అక్కడికి గొడవ పడిన  ఇరుపక్షాల వాళ్ళు పంచాయితీకి వస్తారు.వాళ్ళు ఇద్దరూ చెప్పింది విని నిజానిజాలు తెలుసుకుని ఆ సమస్యకు సరైన తీర్పు చెప్పి తగువు తీర్చడాన్నే మేము మికిరీ అంటాము అని చెప్పింది.మికిరీ అన్న చిన్న పదానికి ఇంత అర్ధం ఉందన్నమాట అని శుభశ్రీ ఆశ్చర్యపోయింది.

Friday, 19 October 2018

త్వరగా స్పందించే గుణం

                                                                      ఎవరైనా ఎక్కడైనా ఎదుటివారి సమస్యలకి త్వరగా స్పందించి సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచగలరని నిపుణులు కూడా అంటున్నారు.ప్రేమగా పెంచడం అంటే అడిగిందల్లా కొని ఇచ్చి అతి గారాబంతో చెడగొట్టడం కాదు.పిల్లలతో ప్రేమగా ఉంటూనే ఎదుటివారితో ఎవరిదగ్గర ఎలా మాట్లాడాలో,ఎలా ప్రవర్తించాలో,ఎవరితో ఎలా ఒక పద్దతి ప్రకారం  మెలగాలో,ఆపద వచ్చినప్పుడు వాళ్ళను వాళ్ళు ఎలా రక్షించుకోవాలో,అవసరమైనవారికి ఎలా సహాయపడాలో చెప్పీ చెప్పకనే తెలియచెప్పి సంస్కారవంతంగా పెంచితే విద్య దానంతట అదే వస్తుంది.పదే పదే చదవమని చెప్పనవసరం లేకుండా వాళ్ళే చదువుకుంటారు.అందరికీ సహాయం చేసే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు.వాళ్ళకు మంచి అమ్మానాన్నలు మళ్ళీ వాళ్ళు  మంచి అమ్మనాన్నలుగా ఉంటారన్నది జీవితసత్యం.

Thursday, 18 October 2018

దొరకని వస్తువంటూ......

                                                           ఇంటర్ నెట్ పుణ్యమా అని ఆన్ లైన్ లో దొరకని వస్తువంటూ లేదు.ఈరోజుల్లో దేనికీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు.కొత్త పోకడ వస్తువులే కాకుండా పూజలు,హోమాలకు అవసరమైన సామాగ్రితోపాటు ఆశ్చర్యంగా పిడకలు,పేడ కూడా అందుబాటులోకి వచ్చేశాయి.ఆర్డర్ పెట్టగానే ఇంట్లో నుండి కాలు కదపనవసరం లేకుండా నిత్యావసర వస్తువులతోపాటు మందులు,పళ్ళు,కూరగాయలతో సహా అన్నీ తాజాగా ఇంటికే తెచ్చి ఇస్తున్నారు.దీనితో డబ్బుకి డబ్బు,సమయం కూడా ఆదా అవుతుంది.ఎవరికి వాళ్ళు హడావిడి పడి ప్రతి చిన్నదానికి కొట్టుకు పరుగెత్తకుండా ఇంటికే అందుబాటులోకి రావడం  నిజంగా  సంతోషించదగ్గ పరిణామమే.భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలతో సతమతమయ్యే ఈరోజుల్లో అలసిసొలసి ఇంటికొచ్చాక అదిలేదు ఇదిలేదు అనుకోకుండా ఏది తినాలంటే అది తినడానికి కూడా ఆర్డరు చేసిన నిమిషాల్లో తెచ్చి వేడిగా ఇవ్వడంతో సామాన్య ప్రజలు కూడా ఆన్ లైన్ లో  కొనడానికే మొగ్గు చూపుతున్నారు.

Wednesday, 17 October 2018

దసరా శుభాకాంక్షలు

                                                         దశహర అనే సంస్కృత పదమే క్రమంగా దసరా పండుగగా  మారింది.మనలోని పది అవగుణాలను హరించేదే దసరా పండుగ.ఆ పది ఏమిటి?అంటే కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్య,అహంకార,అమానవత్వ,స్వార్ధం,అన్యాయం అనేవాటిని పారద్రోలి వాటిపై విజయాన్ని సాధించే శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుడ్ని  వేడుకుంటే  అమ్మ దయతో ప్రసాదించడంతో దసరా పండుగే విజయదశమి అయింది.విజయదశమి అంటేనే విజయాన్ని చేకూర్చేది.కనుక ఈ పది అవ లక్షణాలను విజయవంతంగా జయించి నిండు నూరేళ్ళు అందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  
       

శతాబ్దపు సూపరు పండు

                                                     ఒకప్పుడు కొండల్లో,గుట్టల్లో పెరిగి కాయలు కాసి రోడ్డు పక్క బుట్టల్లో మాత్రమే కనిపించే ఆకుపచ్చని కొండ ఫలం అంటే సీతాఫలం నేడు ఎన్నో వర్ణాల్లో సూపర్ మార్కెట్లలో కనువిందు చేస్తుంది.వేసవిలో మామిడి పండు కోసం ఎదురు చూచినట్లు శీతాకాలంలో సీతాఫలం కోసం ఎదురు చూచేవాళ్ళు నాలాగా ఎంతోమంది ఉన్నారు.సీతాఫలం రుచితోపాటు ఔషధ గుణాలు కలిగి ఉండడంతో ఒత్తిడి,ఆందోళన మాయమవటమే కాక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.రామా,లక్ష్మణ,హనుమాన్ ఫలాల్లో గుజ్జుతోపాటు కాన్సర్ ని నివారించే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో వీటిని ఇప్పుడిప్పుడు తినటానికి అలవాటు పడుతున్నారు.ఇవి మార్కెట్లో అందుబాటులో ఉండవు  కనుక పెరటిలోనే మొక్కలు తెచ్చి  పెంచుకుంటున్నారు.ఏది ఏమైనా సీతాఫలం రుచి అమోఘం.అందుకే ఈ శతాబ్దపు సూపరు పండుగా ఎంపిక అయింది.దీనితో రైతులు దానిమ్మ,బొప్పాయి,జామ తోటలు సాగు చేసినట్లే సీతాఫలాలు కూడా రకరాల రంగుల్లో పండిస్తున్నారు.   

Thursday, 11 October 2018

నెత్తినెక్కి పిండి కొట్టి .....

                                                                ఈరోజుల్లో దాదాపుగా పరిచయాలు,బంధాలు అనేవి అవసరం ఉన్నంతవరకే కానీ తర్వాత ఎవరికీ ఎవరూ ఏమీ కారు.అసలు అన్నీ అవసరాల ప్రేమలే కానీ అసలు నిజమైన ప్రేమలు,ఆప్యాయతలు ఎక్కడా కనబడడం లేదు.ఒకప్పటి ప్రేమలు, ఆప్యాయతలు,అనురాగాలు చూద్దామన్నా కనుచూపు మేరలో మచ్చుకైనా కనిపించడం లేదు.ఒకవేళ అతి కొద్దిమంది ఆప్యాయంగా ఉన్నా వాళ్ళని పిచ్చివాళ్ళ క్రింద జమకట్టి వాళ్ళ నెత్తినెక్కి పిండి కొట్టి రొట్టె చేసుకుందామన్నట్లుగా ఉంటుంది ఇప్పటి పరిస్థితి.దానివల్ల జమకట్టిన  వాళ్ళకి ఒరిగేది,వీళ్ళకు పోయేది ఏమీ లేకపోయినా అదో రకం పైత్యం.

Tuesday, 9 October 2018

జాంపండు

                                                                        స్నిగ్ద కళాశాలలో డిగ్రీ చదువుకునే రోజుల్లో మొదటి సంవత్సరం సెలవుల అనంతరం కళాశాల తెరిచిన మొదటి రోజు అది.రెండవ సంవత్సరంలో ఒకళ్ళు ఇద్దరు కొత్త మొహాలు తప్ప అందరూ పాతవాళ్ళే.చాలా రోజుల విరామం తర్వాత అందరూ ఎవరి స్నేహితులతో వాళ్ళు సంబరంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా తెల్లగా,గుండ్రంగా,అందంగా అప్పుడే చెట్టు నుండి తెంపిన నిగనిగలాడే మగ్గిన జాంపండు లాగా ఉన్నఅమ్మాయి బెరుకుగా తరగతి గదిలోనికి ప్రవేశించింది.అందరూ ఒక్కసారిగా కబుర్లు ఆపి ఆశ్చర్యంగా ఆమెవైపు ఒకసారి చూసి మళ్ళీ ఎవరి మచ్చట్లలో వాళ్ళు మునిగిపోయారు.ఎవరితో కూర్చోవాలో,ఎక్కడ కూర్చోవాలో తెలియక ఆమె బెదురు చూపులు చూస్తుంది.ఇంతలో స్నిగ్ధ ఆమెను తన స్నేహబృందం లోనికి ఆహ్వానించింది.ఒకరికొకరు పరిచయాల అనంతరం తన పేరు అరుణ అని తనకు ఒక నెల రోజుల క్రితమే పెళ్ళి అయిందని,అత్తగారిల్లు కళాశాలకు దగ్గరలోనే కనుక ఇక్కడ చేరానని చెప్పింది.తనకు చదువు అంటే ఎంతో ఇష్టం అని చెప్పటంతో భర్త,అత్తమామలు చదువుకోమని ప్రోత్సహించారని ఆనందంగా చెప్పింది.పెళ్ళైపోయింది కనుక ఇంట్లోనే కూర్చో అంటారేమోనని తన చదువు ఎక్కడ ఆగిపోతుందోనని మొదట భయపడ్డానని కానీ ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళని సంతోషంగా చెప్పింది.అలా జాంపండు స్నిగ్దకి ప్రాణ స్నేహితురాలయింది. 

హృదయపూర్వకంగా

                                                      మనలో కొంతమంది మన తోటివారు విజయం సాధించినప్పుడు అంత త్వరగా జీర్ణించుకోలేరు.వారిని మనస్పూర్తిగా అభినందించనూలేరు.ఈర్ష్యతోనో మరే ఇతర కారణం వల్ల కానీ కనీసం సంతోషాన్ని కూడా వ్యక్తం చేయరు.మనం బాగుండాలని అనుకోవడం సహజం.మనం ఒక్కళ్ళం మాత్రమే బాగుండాలని అనుకోవడం స్వార్ధం.అదే మనతోపాటు ఎదుటివాళ్ళు కూడా బాగుండాలని  అనుకోవడం సంస్కారంతో కూడిన మంచితనం.అలాగే మనం ఓడిపోయినా కూడా ఎదుటివారు విజయం సాధించినప్పుడు హృదయపూర్వకంగా అభినందించేవారు ధన్యులు.అతి కొద్దిమంది మాత్రమే అలా అభినందించగలరు.ఆవిధంగా చేయగలిగినప్పుడే మన జీవితం కూడా బాగుంటుంది.

Saturday, 6 October 2018

దారిలో ముళ్ళు

                                                        నడిచే దారిలో ముళ్ళు ఉన్నాయని నడవడం ఆపితే మనం  చేరుకోవలసిన గమ్యం చేరుకోలేము.అలాగే వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే అనుకున్నది సాధించలేము.మనం ఏ విధంగా ఉన్నామో అని ముందుకు,వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎదుటివారిని అవహేళన చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో వాళ్ళ విమర్శలనే మనం  ఆశీర్వాదాలుగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని త్వరగా  చేరుకోగలము.విజయం మన స్వంతమైనప్పుడు వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతిని నోట మాట రాక తల వేళ్ళాడేసి మన కళ్ళల్లోకి నేరుగా చూడలేక నేల చూపులు చూస్తారు.

Thursday, 4 October 2018

ప్రచారాలు

                                                                  నువ్వు విన్నది త్వరగా నమ్మకు.ఎప్పుడైనా నిజం కన్నా అబద్దానికే ప్రచారం ఎక్కువ.నమ్మితే అపార్ధాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది.కొన్ని సార్లు బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది.అసలు నిజం తెలియకుండా కొంతమంది అబద్దాన్ని తమ భుజాలపై వేసుకుని ప్రచారం చేస్తూ ఉంటారు.ఇంకొంతమంది ఆ అబద్దాన్నే నిజమని నమ్మి అసలు నిజం చెప్పినా నమ్మే స్థితిలో ఉండరు.అబద్దపు ప్రచారం వల్ల ఎదుటి వారిని మానసికంగా  బలహీనుల్ని చేశామని సంతోషపడుతుంటారు.కానీ ప్రచారకర్తలే అసలు మానసిక బలహీనులమని తెలుసుకోరు.అబద్దమయినా,నిజమే అయినా ఒకరిమీద ఇంకొకరికి చెప్పకపోవటం తెలివిగల లక్షణం.ఇంకొంతమంది ఎదుటివారికి వినటం ఇష్టం లేకపోయినా చెవిలో జోరీగ లాగా మోత చేస్తుంటారు.ఆపు మహాప్రభో! అన్నా వాళ్ళ ధోరణికి అడ్డుకట్ట ఉండదు.అడ్డుకట్ట వేద్దామని ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాస.అసలు పుకార్లు,ప్రచారాలు వినకపోవటం ఉత్తమ లక్షణం.కాలక్షేపానికి వినడం మధ్యమ లక్షణం.విని ప్రచారం చెయ్యడం అధమ లక్షణం.మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఇటువంటివాటికి దూరంగా ఉండడం మంచిది.

Wednesday, 3 October 2018

స్వాంతన

                                                                         మనకు ఒక పని చేస్తున్నప్పుడు విసుగు అనిపిస్తే వేరొక పని మొదలుపెట్టి హుషారుగా రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేస్తాము.ఆ విధంగా చెయ్యకపోతే జీవితమే నిస్సారంగా ఉన్నట్లు అనిపిస్తుంది.ఎప్పటికప్పుడు కొత్తకొత్త పనులు చేస్తుంటే మనసుకు ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటుంది.జీవితంలో మార్పు అనేది మనిషికి మానసికంగా స్వాంతన చేకూరుస్తుంది.మానసికంగా సంతోషంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.జీవితమనే ఇరుసులో ఇదంతా ఒకదాని వెనుక ఒకటి వరుసగా తిరుగుతూ ఉంటాయి.అదే జీవితచక్రంలో ఇమిడివున్న రహస్యం.ఒకే పని చేస్తూ బద్దకంగా,హుషారు అనేది లేకుండా గడుపుతుంటే మనిషికి సోమరితనం అబ్బుతుంది.ఏ పని చెయ్యబుద్ది కాదు.ఇటువంటివాళ్ళు వాళ్ళు  సంతోషంగా ఉండరు.ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్వలేరు.అంతెందుకు?అసలు సోమరితనం మనిషి లక్షణం కాదు.జీవితంలో సోమరితనం లేనివాళ్ళ జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుంది.కొంతమంది బద్దకంగా ఉండటంతో ఇరవైల్లోనే ఎనభైల్లా కనపడుతున్నారు.ఎనభైల్లో కూడా ఎవరి పని వారు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న బామ్మలు,తాతయ్యలు ఎంతమందో?నిజంగా వాళ్ళను చూస్తుంటే ఎంత ముచ్చట వేస్తుందో?వాళ్ళతో పరిచయం ఉన్నా లేకపోయినా చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది.

Monday, 1 October 2018

బుజ్జి మేక

                                                       సత్యశ్రీ స్నేహితురాలు చిలుక తో చరవాణిలో మాట్లాడుతూ బుజ్జి మేక కొడుకు పెళ్ళికి పిలవటానికి వచ్చాడు కానీ నేను మళ్ళీ ఫోను చేస్తాను అంది.కాసేపటి తర్వాత బుజ్జి మేక ఇప్పుడే వెళ్ళాడు.అందుకే నీతో మాట్లాడదామని చేశాను అంటూ సత్యశ్రీ చిలుకకు ఫోను చేసింది.బుజ్జి మేక ఎవరే?అనగానే మనము అందరము కలిసి చిన్నప్పుడు పాఠశాలలో ఆడుకునేటప్పుడు సన్నగా,తెల్లగా,రివటలా చెంగు చెంగున ఎగురుతూ మనకు ఆటలో దొరక్కుండా పారిపోతుంటే వెంటబడేవాళ్ళం గుర్తుందా?అని అడిగింది.ఆ....ఆ గుర్తొచ్చింది అంటూ రొప్పుతూ రోజుతూ పరుగెత్తి చివరికి ఎలాగైతే పట్టుకునేవాళ్ళంగా!అంది చిలుక.అవును వాడు నాకు పిన్ని కొడుకు అని చెప్పింది సత్యశ్రీ.వాడు చిన్నప్పుడు మాములుగా నడవకుండా చెంగు చెంగున ఎగురుతూ ఉండేవాడు.వాడు మా అందరికన్నా చిన్నోడు.అందుకే మేము వాడిని బుజ్జి మేక అని ఆట పట్టించేవాళ్ళం.నువ్వు కూడా చిన్నప్పుడు చిలుక కొట్టినట్లు దోర జామకాయల్ని చెట్టెక్కి మరీ అన్నీ కొరికి రుచి చూచే దానివి కదా!అందుకే నీ అసలు పేరు వదిలేసి చిలుక అన్నట్లే వాడి పేరు బుజ్జి మేకగా స్థిరపడి పోయింది అని సత్యశ్రీ ఉత్సాహంగా చిన్నప్పటి కబుర్లు చెప్తుంటే ఇద్దరూ  కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చేలా పడీపడీ నవ్వుకున్నారు.ఎంతైనా చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు కదా!

Sunday, 30 September 2018

నిత్య కళ్యాణి

                                                                కొంచెం నీళ్ళు పోస్తే చాలు ఎక్కడైనా ఇట్టే పెరిగి నిండుగా పువ్వులు పూస్తుంది.పద్మాల్లా అందంగా నిండుగా ఏడాది పొడుగునా రంగు రంగుల పువ్వులు పూసే అందమైన బిళ్ళ గన్నేరు మొక్కే నిత్యకల్యాణి.ఈ పువ్వులు పూజకు పనికిరావని ఒకప్పుడు అంత శ్రద్దగా పెంచేవాళ్ళు కాదు.తాజాగా ఈ మొక్క మొత్తంలో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసి ప్రత్యేకంగా పెంచుతున్నారు.ఆకులు,కాండంలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర వహిస్తున్నాయి.ఆకుల్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిచేసి రోజూ ఒక గ్లాసు నీళ్ళల్లో కొద్దిగా వేసి సగం అయ్యే వరకు మరిగించి తాగితే అధిక రక్తపీడనం అదుపులో ఉంటుంది.పరగడుపున నాలుగు ఆకుల్ని నమిలినా,నీళ్ళల్లో మరిగించి తాగినా మధుమేహం అదుపులో ఉంటుంది.ఆకులు నూరి పసుపు కలిపి గాయాలకు పూస్తే త్వరగా తగ్గుతాయి. వైద్యంలో ఆకులు,పువ్వులు మాత్రమే వాడాలి.వేళ్ళు,కాండం వాడాలంటే నిపుణుల సలహాతో  తీసుకోవాలి.ఏది ఏమైనా నిత్య కల్యాణి అందానికి అందంతోపాటు వైద్యానికి కూడా ఎంతో ఉపయోగకరం.

Saturday, 29 September 2018

గుండె లయ

                                                                      ఇంతకు ముందు రోజుల్లో అరవై ఏళ్ళు పైబడిన వారిలో గుండె లయ తప్పి మరణాలు సంభవించేవి.ఈ రోజుల్లో ముప్పై ఏళ్లకే గుండె లయ తప్పుతోంది.గుండె పోటు మరణాల్లో ఎక్కువ శాతం మన స్వయంకృతాపరాధమే.దీనికి మనలో అవగాహనా రాహిత్యమే కారణం.ఛాతీనొప్పి అనిపించగానే పొట్ట ఉబ్బరమేమో అనుకోకుండా వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదిస్తే యాబై శాతం మరణాలు అరికట్టవచ్చు.సంవత్సరానికి ఒకసారైనా గుండెకు సంబంధించి అన్ని పరీక్షలు చేయించుకోవాలి.శరీరం మొత్తం చేయించుకోగలిగితే మరీ మంచిది.చాలామంది సన్నగా ఉన్నామని కొలెస్టరాల్ పరీక్షలు మాకు అవసరం లేదు అనుకుంటారు.కానీ ముప్పై ఏళ్ళు పైబడిన దగ్గర నుండి కొలెస్టరాల్ తోపాటు బి.పి కూడా పరీక్ష చేయించుకోవాలి.మహిళలకు గుండె నొప్పి రాదు పురుషులకు మాత్రమే వస్తుంది అనుకుంటారు.అది కేవలం  అపోహ  మాత్రమే.గుండె ఎవరికైనా ఒకటే.దవడల నొప్పి,వెన్ను నొప్పి,ఆయాసం,పొట్టలో నొప్పి ఇవన్నీ గుండె నొప్పి లక్షణాలు.వీటిని అశ్రద్ద చేయడంతో గుండె లయ తప్పి మరణం సంభవిస్తుంది.గుండె పదిలంగా ఉండాలంటే చేపలు,గింజలు,తృణధాన్యాలు,ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటుంది.అవగాహనతో అప్రమత్తంగా ఉంటే ఎనభై శాతం మరణాలను అరికట్టవచ్చు.అద్దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకొంటామో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా గుండెను కాపాడుకోవాలి.అప్పుడు మనవళ్ళు,మనవరాళ్ళతో కూడా హాయిగా ఆడుకోవచ్చు.                      

జీవనశైలిలో మార్పులు

                                                                 ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల కొంతైనా అవగాహన ఉండాలి.
ఈరోజుల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో అందరూ కూడా ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు ఉంటున్నారు.దీనితో ఊబకాయం,అధిక రక్తపోటు,మధుమేహం,కొలెస్టరాల్,గుండె జబ్బులు పిలవకుండానే చిన్న వయసులోనే వరుస కట్టేస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి మన జీవితంలో భాగమై పోయింది.ఒత్తిడి లేని జీవితం కష్టం కనుక మనమే జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలావరకు వ్యాధులకు దూరంగా బ్రతకవచ్చు.బద్దకించకుండా తప్పనిసరిగా అనునిత్యం  వ్యాయామం చేయాల్సిందే.రోజువారీ పనులు చేస్తూనే ఉన్నాం కదా అదే సరిపోతుందిలే అని మాకు తగినంత సమయం లేదు అని అనుకోకుండా ఎంతోకొంత సమయం అంటే కనీసం ఒక్క పావుగంట చేసినా చేసినట్లే.ఖచ్చితమైన సమయపాలన,చక్కటి కుటుంబ జీవితం,ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి  చేసుకోవడం వలన ఒత్తిడిని జయించవచ్చు.యోగా,ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఆహారంలో నూనె పదార్ధాలు తగ్గించి పండ్లు,కూరగాయలు,గింజలు,తృణ ధాన్యాలు తీసుకున్నట్లయితే  బరువు కూడా అదుపులో ఉంటుంది.కొద్దిపాటి శ్రద్ధ పెడితే ఇవ్వన్నీ పాటించదగిన అంశాలే.ముఖ్యంగా మహిళలు ఇంటిల్లపాది అందరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు కానీ తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టరు.ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు కళకళలాడుతుంది.అందుకే కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ ఏ కొంచెం తేడా ఉన్నా వైద్యుల సలహా తీసుకుంటుంటే చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడకుండా అందరూ ఆనందంగా ఆరోగ్యకరమైన జీవితం గడపొచ్చు.

Friday, 28 September 2018

సమస్యలు

                                                             ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్లు ఎవరికి తగిన సమస్యలు వారికి ఉంటాయి.కొంతమంది వాటిని భూతద్దంలో చూసి భయపడి చిన్నవాటిని పెద్దవి చేసి ఇబ్బంది పడుతుంటారు.కొంతమంది తెలివితేటలతో తేలిగ్గా సమస్యల నుండి బయటపడి హాయిగా చీకుచింత లేకుండా జీవనాన్ని సాగిస్తుంటారు.ఏది ఏమైనా మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే చిరునవ్వు,మౌనం మాత్రమే పరిష్కారాలు.చిరునవ్వు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది.మౌనం అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.ఈ జీవిత సత్యం తెలుసుకుంటే ఎవరైనా హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేయవచ్చు.

Tuesday, 25 September 2018

లోకంతీరు

                                                                 నా బ్లాగ్ అంటేనే స్వతంత్రంగా నా మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఒక వేదిక.లోకం తీరు ఎలా ఉందో దాని వల్ల నాకు ఎదురయ్యే అనుభవాలు మంచి చెడు ఏదైనా మనసుకు తోచినది అందరికీ తెలియచెప్పడమే నా ప్రధాన ఉద్దేశ్యం.అంతే కానీ ఎవరినీ ఉద్దేశించి రాసేవి కావు.మంచి వుంటే గ్రహించాలి.చెడు ఏదైనా ఉంటే ఇలా కూడా ఉంటారు కాబోలు అని అర్ధం చేసుకోవాలి.చేతనైతే అభినందించ వచ్చు లేదా ఈ విధంగా రాస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వవచ్చు.కొంతమంది వాళ్ళ మనస్తత్వానికి దగ్గరగా ఒక పాత్ర ఉందని వాళ్లకు అన్వయించుకుని  ఇంకో పాత్ర నీదే అంటూ ఎదుటి వాళ్ళకు ఆపాదించడం సబబు కాదు.నన్నే అన్నారని వ్యక్తిగత సందేశాలు పంపడం సంకుచిత స్వభావానికి నిదర్శనం.అది సభ్యత,సంస్కారం కూడా కాదు.నా బ్లాగ్ చదవకపోయినా నాకు ఇబ్బంది లేదు.చెడు ఏదైనా ఉంటే విమర్శించినా,మంచి ఉంటే అభినందించినా ఏదైనా బ్లాగ్ ద్వారా మాత్రమే చేయాలి.నా ప్రశాంతతను భగ్నం చేసే హక్కు ఎవరికీ లేదు.ఇక్కడ వ్యక్తిగత విమర్శలకు తావులేదు.వ్యక్తిగత సందేశాలు కూడా పంపవద్దు.దయచేసి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

తగిన శాస్తి

                                                                 ఉత్తరప్రదేశ్ లో రైతులు అధికారులు లంచం అడిగినందుకు ఒక మూటలో చాలా పాములను పట్టుకొచ్చి కార్యాలయంలో లంచం అడిగిన అధికారుల గదిలో వదిలి పెట్టి తలుపు గడియ పెట్టారట.అప్పుడు అధికారులు భయంతో బిక్కు బిక్కు మంటూ ఇప్పుడే కాదు జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరినీ లంచం అడగము.దయచేసి తలుపులు తీయండి అని వేడుకున్నారట.లంచం అడిగి ఇచ్చేవరకు పనిచేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పి జలగల మాదిరి ప్రజలను పీడించుకుని తినే అధికారులకు రైతులు తగిన శాస్తి చేసి బుద్ది వచ్చేలా చేశారు.మన పని అయిపోవడం ముఖ్యం అని ఎవరికి వాళ్ళు చూసి చూడనట్లు అడిగినంత సమర్పించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడినంత కాలం లంచ గొండులు పుట్టగొడుగుల మాదిరిగా తయారవుతూనే ఉంటారు.ఒక్కళ్ళు ఎదిరించినా అతనికే నష్టం.ఉపయోగం ఉండదు.అందరూ కలిసి సమిష్టిగా చేసినప్పుడే ఏ పనైనా సాధ్యపడుతుంది.రైతులందరూ సమిష్టిగా ఎదిరించడం వల్లే అధికారులకు వాళ్ళ తప్పు తెలిసి వచ్చింది.

చిరుగుల పోకడ

                                                                   ఒకప్పుడు పెద్దవాళ్ళు,పిల్లలు కూడా వస్త్రం ఎక్కడైనా చిరిగితే ఆ చిరుగులు బయటకు కనబడకుండా సూది దారంతో కుట్టి వేసుకునేవాళ్ళు.నేటి తరం పిల్లలు ఆడపిల్లలు,మగపిల్లలు తేడా లేకుండా ప్యాంటుకు ఎంత ఎక్కువ చిరుగులు ఉంటే అంత గొప్ప సోకు అనుకుంటున్నారు.ఒకరోజు విరాట్ తమ్ముడి ఇంటికి వెళ్ళాడు.ఒక అరగంట కూర్చుంటే కూర్చున్నంతసేపు వాళ్ళ పిల్లలు రెండు భుజాల నిండుగా చున్నీలు కప్పుకుని అవి జారిపోతుంటే మాటిమాటికీ సర్దుకుంటున్నారు.వాళ్ళు ఎందుకు ఆవిధంగా ప్రవర్తిస్తున్నారో మొదట అర్ధం కాలేదు.కాసేపటికి చిన్న పాప చున్నీ నేల మీద పడిపోయింది.అనుకోకుండా అటు చూసిన విరాట్ కంట పాప భుజం పైన పెద్ద చిరుగు కనపడింది.పిల్లలు ఆధునిక దుస్తులు వేసుకున్నారు కాబోలు అనుకుని అర్ధం చేసుకుని ఊరుకున్నాడు.తర్వాత రోజు విరాట్ గుడికి వెళ్ళాడు.అక్కడ ఒక కళాశాల అమ్మాయి కూడా అలాగే రెండు భుజాల మీద చిరుగులు ఉన్న దుస్తులు వేసుకుని గుడికి వచ్చింది.ఒక పెద్దాయన పాపా!గుడికి వస్తూ చిరిగిపోయిన దుస్తులు వేసుకున్నావు.చూడకుండా వేసుకున్నావేమోనమ్మా?అంటూ బాధగా మొహం పెట్టాడు.ఆ అమ్మాయి ఏమి చెప్పాలో తెలియక ఊ ఊ అంటూ నట్లు కొడుతూ ఊరు వెళ్ళటానికి వేసుకున్నాను అంది.పెద్దాయనకు నేటి ఆధునిక పోకడ గురించి తెలియక వేసుకునే ముందు చూచి వేసుకోవాల్సిందమ్మా!అన్నాడు.ఆ అమ్మాయి ఏమీ సమాధానం చెప్పకుండా వేగంగా వెళ్ళిపోయింది.ఇదంతా చూస్తున్న విరాట్ అది చిరగటం కాదు తాతగారూ!నేటి ఆధునిక పోకడ అని చెప్పాడు.గుడికి సంప్రదాయబద్దంగా రావాలి కానీ చిరుగులు ఉన్న దుస్తులు వేసుకుని రావడం ఆధునిక పోకడ ఏంటో?ఈ కాలం పిల్లలకు ఏమి సోకులో?ఎక్కడికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలో పెద్దలు చెప్పరు.చెప్పేవాళ్ళు లేక పిల్లలికి తెలియదు.ఈ చిరుగుల పోకడ గోల ఏంటో? అంటూ ఆ పెద్దాయన బుర్ర గోక్కున్నాడు.

Tuesday, 18 September 2018

అతి గారాబంతో పెద్దలే ........

                                                                 మనీష్,మీనాక్షిలకు  ఇద్దరు కూతుళ్ళు.పిల్లల్ని చిన్నప్పటి నుండి అతి గారాబం చేసి పెద్ద అమ్మాయిని పాఠశాలలో సకాలంలో చేర్చకుండా చిన్న అమ్మాయిని చేర్పించే వరకు వదిలేసేసరికి చుట్టుపక్కల తనకన్నా చిన్న పిల్లల్ని పోగేసి వాళ్ళతో ఆటలు ఆడుకోవడం నేర్చుకుంది.వాళ్ళందరిపై అజమాయిషీ చేస్తూ అందరి కన్నా పెద్దది కనుక తనే వాళ్లకి బాస్ లా అనుకునేది.పెద్దైన తర్వాత తల్లి,చెల్లి,తండ్రితో సహా నేను చెప్పిందే వినాలనే స్థాయికి ఎదిగింది.చిన్నప్పటినుండి పాఠశాలకు పంపినా కూడా ఎక్కువగా ఏదో ఒక వంకతో ఇంట్లోనే ఉండిపోయి చిన్నపిల్లలతో ఆటలాడుకోవడానికి ఇష్టపడేది.దానికి తోడు పెద్దయితే తనే చదువుకుంటుందిలే అంటూ తల్లి వత్తాసు.పెద్దైనా ఆ పిల్ల ఆ అలవాటు మాత్రం మార్చుకోలేదు.కళాశాలకు వచ్చినా అదే పద్ధతి.దీనితో చదువులో బాగా రాణించలేక అత్తెసరు మార్కులతో పాసవడం మొదలెట్టింది.తాను చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు చెల్లిని కూడా ఎప్పుడూ ఏమి చదువు? చరవాణిలో ఆటలు,బుల్లితెరపై చలన చిత్రాలు చూద్దామంటూ ప్రోత్సహించేది.ఇద్దరూ చెరొక చరవాణి పట్టుకుని ఆడుకునేవాళ్ళు.దీనితో ఇద్దరూ దొందు దొందే అన్నట్లు తయారయ్యారు. వీళ్ళతోపాటు తల్లి కూడా పిల్లల్ని చదువుకోమని చెప్పకుండా వాళ్ళతో పాటు ఆటలు ఆడుకోవడమో లేదా ఇంకో చరవాణిలో ఆటలు ఆడుకుంటూ కూర్చునేది.దీనితో పిల్లలు చదువులో వెనకబడి విశ్వవిద్యాలయంలో సీటు సాధించలేక రెండు సంవత్సరాలు పెద్దమ్మాయికి,ఒక సంవత్సరం చిన్నమ్మాయికీ వృధా అయిపోయింది.తోటి అమ్మ తొడ కోసుకుందని మనం మెడ కోసుకుందాం అన్నట్లు పక్క వాళ్ళ పిల్లలు వైద్యవిద్య చదివారని తల్లిదండ్రులు పిల్లలు కష్టపడకుండా దొడ్డిదారుల్లో సీట్లు సాధిద్దామని ప్రయత్నాలు చేస్తుంటే ఏ పిల్లలు చదువుతారు?దానికి తోడు వీళ్ళకు అసలే ఒళ్ళు వంగదు.తల్లిదండ్రులు పిల్లల్ని వెనకేసుకుని మా పిల్లలు తెలివిగలవాళ్ళు.చదవాలని చదివితే సంవత్సరమంతా చదివేది ఒక్క నెలలోనే  చదివేయగలరు అనడం మొదలెట్టేసరికి వాళ్ళు అదే నిజమనుకుని వయసు పెరిగినా సరిగా పరిణతి లేక నూతిలో కప్పల్లా బయటి ప్రపంచం తెలియకుండా మాకు తెలిసిందే వేదం అన్నట్లు ఉంటున్నారు.ఒక్క నెలలో చదివేట్లయితే ఉన్నచోటే ఉండడం ఎందుకు? మిగతా పిల్లలు అందరూ కస్టపడి  సంవత్సరమంతా చదవడం ఎందుకో మరి?వినడానికి హాస్యాస్పదంగా ఉంటుందని తెలిసినా ప్రగల్భాలు పోతుంటారు.అతి గారాబంతో పెద్దలే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు.వీళ్ళే కాదు వీళ్ళలా ఎంతో మంది మా పిల్లల్ని అందరికన్నా బాగా బాగా  పెంచుతున్నాము అనుకుని ఏమి చేసినా చూసి చూడనట్లు వదిలేసి పిల్లల్ని చెడగొడుతున్నారు.చిన్నప్పటి నుండి పిల్లలకు లోక జ్ఞానం తోపాటు మంచి బుద్ధులు,క్రమశిక్షణతో కూడిన విలువలు నేర్పడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర.ప్రేమ అందరికీ ఉంటుంది.కానీ పిల్లల భవిష్యత్తు బాగుండి మానవతా విలువలతో కూడిన మంచి పౌరులుగా తయారవ్వాలంటే ప్రేమగా ఉంటూనే సరైన ప్రణాళికతో,క్రమశిక్షణతో సరైన దారిలో నడిచేలా పెంచాలి. భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బంది ఉండదు.వాళ్ళ వల్ల తోటి వారికీ ఇబ్బంది ఉండదు. 

Monday, 17 September 2018

కాలువలో తోసేస్తా

                                                                 నీలావతమ్మ అశ్వితకు వరుసకు నానమ్మ.నీలావతమ్మకు  అశ్విత అంటే చాలా ఇష్టం.ఆవిడ బాగా తిరిగే రోజుల్లో వారానికి ఒకసారైనా అశ్వితను చూడడానికి వచ్చేది.ఆశ్వితా నిన్ను,మనవడిని,ముని మనవడ్ని చూడాలనిపిస్తుంది.ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి అని కబురు పంపితే నానమ్మను చూద్ధామని వచ్చింది.అశ్విత కుటుంబం వచ్చిందన్న ఆనందంలో నీలావతమ్మ తన చిన్ననాటి కబుర్ల నుండి నేటి రాజకీయాల వరకు అనర్గళంగా మాట్లాడుతూనే ఉంది.ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఆగుతుంది.కానీ నీలావతమ్మ మాటల ప్రవాహానికి ఎవరు అడ్డుకట్ట వేసినా ఊరుకోదు.అందుకే ఎవరూ ఆ సాహసం చేయరు.నాకు మోకాలి శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది.అప్పుడు అనుకోకుండా అమెరికా నుండి నా మేనల్లుడు నన్ను చూసి పోదామని  వచ్చాడు.అతను వైద్యుడు కావడంతో సకాలంలో వైద్యం అందుబాటులో ఉండడమేకాక నాకు భూమి మీద ఇంకా నూకలు ఉండబట్టి  నేను బతికి బట్ట కట్టాను కానీ కంటిచూపు పోయింది.అప్పుడు పొరుగింటి ఆమె పరామర్శించడానికి వచ్చి మా వేలు విడిచిన మేనమామకు  కూడా ఇలాగే మోకాళ్ళ శస్త్ర చికిత్స జరిగి మంచాన పడ్డాడు మామ్మా!నువ్వు అదృష్టవంతురాలివి కనుక కంటిచూపు పోయినా ఆరోగ్యంగా నీపని నువ్వు చేసుకుంటూ తిరగగలుగుతున్నావు అంది అని గుర్తుచేసుకుంది నీలావతమ్మ.ఆ విషయం అక్కడ ఉన్నవారికి  అశ్వితకు చెప్తుండగా రయ్ మంటూ ఎక్కడినుండో కూతురు పరుగెత్తుకుని వచ్చి గయ్ గయ్ మంది.నువ్వు మంచాన పడితే ఎవరు చూస్తారు? నావల్ల కాని పని.నేను నిన్ను కాలువలోకి తోసేస్తా!అంది.అవును నిజంగానే ఆ పరిస్థితి వస్తే నేను తనని కాలువలోకి తోసేసేదాన్ని అంది. అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టి గుడ్లప్పగించి చోద్యం చూస్తున్నారు.కడుపున పుట్టిన కూతురు కన్నతల్లిని అంత మాట అనేసరికి వింటున్న ఎవరికీ నోట మాట రాలేదు.పాపం ఆ కన్న తల్లికి సరిగా వినిపించక అశ్వితా నా కూతురు ఏమంటుందమ్మా?అంది.ఏమీలేదులే  నానమ్మా!ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతుంది అనేసింది.అమ్మో!ఇలాంటి కూతురు కూడా లోకంలో ఉంటుందా?అనుకుని నానమ్మకు కూతురు అన్నమాట వినిపించితే ఆ తల్లిమనసు ఎంత క్షోభ పడేదో కదా!వినిపించకపోవడం నానమ్మ అదృష్టం అనుకుంది అశ్విత.నీలావతమ్మ కొడుకు విదేశాల్లో ఉండడం వల్ల అల్లుడు చనిపోతే పనివాళ్ళు ఉన్నా నువ్వు అమ్మ దగ్గర ఉండి అమ్మను జాగ్రత్తగా చూడమ్మా!అని చెల్లికి కూడా తనే డబ్బు పంపుతూ మూడు నెలలకు ఒకసారి వచ్చి రెండు వారాలు ఉండి వెళ్తుంటాడు.అన్న వచ్చినప్పుడు మంచిగా ఉంటూ మిగతా రోజుల్లో ఇలా నోరు పారేసుకుంటూ ఉంటుంది నీలావతమ్మ కూతురు.పెద్దావిడ ఉన్నన్నాళ్ళు చక్కగా చూసి ఆమె శేషజీవితాన్ని ప్రశాంతంగా వెళ్ళమారిస్తే ఎంత బాగుంటుంది అనుకుంది అశ్విత.ఎన్ని తిట్టినా కూతురు అంటే నీలావతమ్మకు అమిత ప్రేమ.కాసేపు కూతురు ఎక్కడికయినా వెళ్తే అందరికీ ఫోన్లు చేసి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా?అంటూ అడుగుతూ ఉంటుంది.కూతురు కూడా అమ్మకు అన్నీ చేస్తుంది కానీ తిక్క వచ్చినప్పుడు మాత్రం నోటికి అడ్డు అదుపు  ఉండదు.ఎవరినైనా సరే ఎంత మాట పడితే అంత మాట అంటుంది.ఎవరైనా చెప్పినా వినదు.

Saturday, 15 September 2018

స్థిత ప్రజ్ఞులు

                                                                   పసిపిల్లలు,కల్లాకపటం లేనివారు ఆనందంగా ఉంటారు.
పిచ్చివాళ్ళు తమదైన ప్రపంచంలో ఆనందంగా ఉంటారు.స్థిత ప్రజ్ఞులకు ఆనందం తమ వెంటే ఉంటుంది.కనిపించే ప్రతి ప్రతికూలతలో కూడా ఒక అనుకులాంశం నిగూఢముగా దాగి ఉంటుంది.కొంతమంది ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా నిబ్బరంగా ఉంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతారు.ఆ విధంగా జీవించే ప్రతి మనిషి ఆనంద స్వరూపులే.వారే స్థిత ప్రజ్ఞులు.గొంతెమ్మ కోరికలు తీర్చుకోవటం కోసం జీవితమంతా పరుగులు తీసి అలసిపోయి అవి తీరినవారి కంటే అతి కోరికలు త్యజించిన వారు,ఉన్నదానితో సంతృప్తి పడేవారే ఎక్కువ ఆనందమయ జీవితాన్ని గడపగలరు .

Wednesday, 12 September 2018

వినాయకచవితి శుభాకాంక్షలు

                                                        నా బ్లాగ్ వీక్షకులకు,పాఠకులకు,తోటి బ్లాగర్లకు,నా శ్రేయోభిలాషులకు,విమర్శకులకు,ప్రపంచంలో ఏ దేశంలో స్థిరపడినా కానీ  మన భారతదేశపు ముద్దుబిడ్డలందరికి   వినాయకచవితి శుభాకాంక్షలు.ఆ వినాయకస్వామి దయవల్ల ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగుతూ అన్నింటా విజయాన్ని సాధించాలని,అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో  తులతూగుతూ,చేతనైనంతవరకు మంచిపనులు చేస్తూ,తోటివారికి సహాయపడుతూ  ఆనందంగా జీవించాలని,ఆస్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంకుంటూ అందరికీ మరోసారి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 
                                      

Sunday, 9 September 2018

ఉచిడీ

                                                               శస్త్ర చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు వద్దన్న పనే చేస్తూ తిక్క చేష్టలు చేస్తుండేది.బంధువులు,కొత్తవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే మరీ ఎ(హె)చ్చుగా చేసేది.వచ్చిన వాళ్ళు తనని మెచ్చుకోవాలనే తపనతో ఒకటి చెయ్యబోయి ఇంకొకటి చేసేది.వాళ్ళకు మంచినీళ్ళు,తినుబండారాలు నేనే తీసుకెళ్తానని మొండిపట్టు పట్టి అవి మోయలేక ఒక్కొక్కసారి దారిలో పడేసేది.నువ్వు తీసుకెళ్ళలేవు శస్త్రా!అని అమ్మ,అమ్మమ్మ అంటే వినకుండా నేనే ఇస్తానంటూ తయారయ్యేది.వచ్చిన వాళ్ళేమో పోనీలెండి నెమ్మదిగా తనే నేర్చుకుంటుంది అని శస్త్రను వెనకేసుకుని వచ్చేవాళ్ళు.అదుగో చూశారా!మీరే నన్ను ఏపనీ చెయ్యనివ్వడంలేదు.వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు అంటూ వాళ్ళ ఎదుటే ఏడుపు లంకించుకునేది.అదే అలవాటు పెళ్ళయి పిల్లలు పుట్టినా ఇప్పటికీ పోలేదు.ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నా ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే అవే తింగరి వేషాలు.భర్త నీకెందుకు శ్రమ పనివాళ్ళు చూసుకుంటారు కదా శస్త్రా!అంటే ఒక పట్టాన ఉన్నచోట ఉండదు.ఒకచోట కూర్చోదు.బొంగరంలా గిరగిరా తిరుగుతూనే ఉంటుంది.తర్వాత ఉష్....అష్.....అంటూ ఆపసోపాలు పడుతూ ఉంటుంది.ఒకరోజు స్నేహితురాలు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ హుషారుగా ఉండే శస్త్ర కాస్త నీరసంగా కనిపించింది.ఏమిటి అలా ఉన్నావు?అని అడిగింది స్నేహితురాలు.నాకు చిన్నప్పటి నుండి ఉచిడీ ఎక్కువని నీకు తెలుసుగా!అంది. అంటే?ఏముంది చిన్నప్పటి నుండి ఇంటికి ఎవరైనా వచ్చారంటే నాకు ఎ(హె)చ్చు ఎక్కువ కదా!  అవసరమున్నా,లేకున్నా ఏదో చెయ్యాలనే తాపత్రయంతో అటుఇటు తిరగటం వలన ఈ తిప్పలు అంది.అప్పుడంటే చిన్నతనం ఇప్పుడు వయసు మీదపడుతోంది కదా! అంది శస్త్ర.  

Saturday, 8 September 2018

విషపుగాయ

                                                       పాముకు కోరల్లో తేలుకు కొండిలో మాత్రమే విషం వుంటుంది కానీ మనిషికి నిలువెల్లా విషమే ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనమే అన్విత్.ఎంతసేపు తన స్వార్ధమే తప్ప వేరే ఆలోచన ఉండదు.దాని కోసం ఏమి చెయ్యడానికైనా చివరికి తోడబుట్టిన వాళ్ళని నష్ట పెట్టడానికి కూడా వెనుక ముందు ఆలోచించడు.అతను అతని భార్య,పిల్లలు ఇద్దరూ మాత్రమే ఒక కుటుంబమని మేము అంటూ అమ్మ,నాన్న,ఇతర కుటుంబసభ్యులతో (అంటే అన్న,చెల్లి కుటుంబ సభ్యులు) కూడా మాట్లాడుతుంటాడు.పోనీ మిగతా వాళ్ళందరితో అనుకూలంగా ఉండకపోయినా తను తన కుటుంబం అన్నా సంతోషంగా ఉన్నారా?అంటే అదేమీలేదు.ఎంతవరకు అన్విత్  భార్యాబిడ్డలు అని ప్రాకులాడడమే తప్ప వాళ్ళు మాత్రం సుతిమతి లేనట్లు ఉంటారు.వాళ్ళల్లో వాళ్ళకే ఒకరికంటే ఒకరు మేమే గొప్ప అని,మా మాటే నెగ్గాలని పోటీ పడుతుంటారు.అతి గారాబంతో పిల్లలు కూడా మొండిగా ఎవరన్నా లెక్కలేకుండా నిర్లక్ష్యంగా తయారయ్యారు.చదువుకోకుండా ఐ పాడ్,లాప్ టాప్ ముందేసుకుని సినిమాలు చూడటమే పనిగా పెట్టుకుని కళాశాలకు కూడా సరిగా వెళ్ళకుండా పరీక్షలు పాసవకుండానే పాసయ్యామని అబద్దాలు చెప్పడం నేర్చుకున్నారు.వాళ్ళను  అమ్మ వెనకేసుకుని పిల్లల్ని ఒక్క మాట అననివ్వదు.అమ్మ వాళ్ళను సరిగా చదువుకోమని కానీ పద్దతిగా ఉండమని కానీ చెప్పదు.అన్విత్ తన వాళ్ళకు బుద్దులు చెప్పి సరైన దారిలో పెట్టుకోకుండా అన్న పిల్లలు,చెల్లి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని అన్న,చెల్లివాళ్ళన్నా,వాళ్ళ పిల్లలన్నా ఈర్ష్య పడుతుంటాడు.బంధువుల పెళ్ళికి అన్విత్ చెల్లి,పిన్ని,అత్త వాళ్ళు కలిసి వెళ్లారు.ఏమ్మా!మీ అన్న చిన్నప్పటినుండి విషపుగాయ.తోటి పిల్లలు తన కన్నా బాగున్నా,బాగా చదివినా ఓర్చుకునేవాడు కాదు.ఇప్పుడు మరీ ఎక్కువై పొయిందటగా!వాళ్ళ పిల్లలు చదువుకోకుండా మీ పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారని మీ పైనే కాకుండా మీ పిల్లలమీద కూడా విషం కక్కుతున్నాడటగా!అని అడిగింది.వాడు మారడు.ఎప్పటికీ అంతే అంది.అన్విత్ చెల్లి తన అన్నను అందరిలో చులకన చెయ్యడం బాగోదు కనుక ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది.

Tuesday, 4 September 2018

మా ఊరి పిల్ల

                                                                        కృష్ణవేణి మనుమరాలు యుక్తాన్వితకు ఓణీలు అంటే నూతన వస్త్రాలంకరణ వేడుక ఆడంబరంగా చేద్దామని నెలరోజుల ముందు నుండే బంధువులు అందరినీ పిలిచే పనిలో హడావిడిగా ఉంది.నీలవేణి,కృష్ణవేణి కన్నా వయసులో చిన్నదైనా ఒకే ఊరివాళ్ళు కనుక స్నేహంగా ఉండేవాళ్ళు.నీలవేణి భర్త ఉద్యోగరీత్యా వేరే నగరంలో ఉండడంతో చిరునామా కానీ చరవాణి నంబరు కానీ సరిగా తెలియకపోవడంతో ఎలాగైనా నీలవేణిని పిలవాలని చెల్లెలు ద్వారా రేపు ఉదయం వేడుక అనగా ఈరోజు సాయంత్రం ఫోను చేయించి మాట్లాడింది.అప్పుడు కృష్ణవేణి అమ్మా!ఇప్పుడు పిలిచానని అనుకోకుండా మనవరాలికి ఓణీలు ఇస్తున్నాము నువ్వు తప్పకుండా రావాలి నీలవేణీ అని చెప్పింది.చక్కగా గుర్తుపెట్టుకుని పిలిచిందని నీలవేణి ఎంతో సంతోషపడింది.అంతవరకు బాగానే ఉంది.మీ వీధికి అనుకోకుండా తెలిసిన వాళ్ళను పిలవటానికి వచ్చాము.సరిగా చిరునామా తెలియదు కనుక మా ఊరి పిల్ల ఇక్కడే ఎక్కడో ఉండాలి అని ఆమెను అడిగితే నాకు తెలియదు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాము అంది.ఎంతో ప్రయాసపడి ప్రేమతో కావాలని పిలిచినా మా ఊరి పిల్ల అని అడిగాను అనేసరికి నీలవేణి మనసు చివుక్కుమంది.చిన్న పిల్లలు కాదుగా యాభై సంవత్సరాల ఆమెను పట్టుకుని మా ఊరి పిల్ల అని అడిగింది సరే మళ్ళీ వచ్చి అంత స్నేహంగా ఉండేదల్లా అదే మాట నీలవేణికి చెప్పడం వల్ల బాధ అనిపించి  వెళ్ళాలని అనిపించక వేడుకకు వెళ్ళడం మానేసింది.పెద్దావిడ కదా!పోనీలే అని సరిపెట్టుకుని వెళదామని అనుకున్నా మనసు అంగీకరించలేదు.అడిగితే అడిగింది మళ్ళీ వచ్చి అదే మాట ఇలా అన్నాను అని చెప్పకుండా ఉండి ఉంటే పిలిచిందని ఎంతో సంతోషంగా పిలిచినందుకు మాట దక్కించి వెళ్ళి వచ్చేదాన్ని కదా!అని  నీలవేణి మనసులో బాధపడింది.మాట్లాడే విధానం చక్కగా ఉంటే అందరికీ ఎంతో సంతోషంగా బాగుంటుంది.ఈ విషయం అనే కాదు కొంతమందికి ఎంత వయసు పెరిగినా మాట్లాడే విధానం చేతకాక లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు.

Sunday, 2 September 2018

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

                                                     మన మనసును చైతన్యవంతంగా నిత్యనూతనంగా మహాదానంద భరితంగా ఎలా మలచుకోవాలో,ప్రతి పనిలో ఆనందాన్ని ఎలా వెదుక్కోవాలో యుగాలనాడే చేసి చూపాడు కృష్ణస్వామి.సమస్య  ఎదురైనా అదే చిరునవ్వు,గెలిచినా అదే చిరునవ్వు.కష్టాలు ఎదురైనా సంతోష సాగరంలో ఎలా మునకలు వేయాలో  సులువుగా చూపడమే శ్రీకృష్ణ తత్వం.ఆ కృష్ణతత్వాన్ని మనసావాచా మననం చేసుకుంటూ మనమందరమూ కూడా ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

Saturday, 1 September 2018

కొర్రబియ్యం పులిహోర

కొర్రబియ్యం - 2 కప్పులు
నీళ్ళు - 3 కప్పులు
కారట్ తురుము 1/2 కప్పు
నిమ్మకాయలు - 2
అల్లం - 2 అంగుళాల ముక్క
పచ్చిమిర్చి - 4
ఉప్పు - సరిపడా
కొత్తమీర తురుము - 1 కప్పు
వేరుశనగ పప్పు - 1/2 కప్పు
తాలింపు కోసం :
ఆవాలు - 2 చెంచాలు
శనగపప్పు -2 చెంచాలు 
పసుపు -2 చెంచాలు
మినప్పప్పు -2  చెంచాలు
కరివేపాకు - 1/2 కప్పు 
నువ్వుల నూనె - చిన్న గరిటెడు
                                        ముందుగా ఒక కుక్కర్లో కొర్ర బియ్యం శుభ్రంగా కడిగి నీళ్ళు వంపి మూడు కప్పుల నీళ్ళు పోసి రెండు గం.ల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి.ఆ తర్వాత పొడిగా ఉండేలా వండి ఒక పక్కన పెట్టుకోవాలి.పొయ్యి వెలిగించి ఒక బాండీలో నూనె  వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు,అల్లం,పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగపప్పు,కరివేపాకు,పసుపు అన్నీ వేసి దోరగా వేయించాలి.తర్వాత కారట్ తురుము వేసి కొద్దిగా వేగాక కొర్రబియ్యం అన్నంతోపాటు ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి చిన్న మంటపై కొద్దిసేపు ఉంచాలి.ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం చల్లి కొత్తిమీర వేసి బాగా కలియ తిప్పి దించేయాలి.అంతే రుచికరమైన కొర్ర బియ్యం పులిహోర తయారయినట్లే.వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

ఆరోగ్య చేతన

                                              ఒకప్పుడు తృణ ధాన్యాల వాడకం ఎక్కువగా ఉండేది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కష్టపడి  పనిచేయడం వలన కూడా అధిక బరువు పెరగకుండా చురుకుగా ఆరోగ్యంగా  ఉండేవారు.మధ్యలో తృణ ధాన్యాలు బాగుచేసి వండడం కూడా కష్టం కనుక సులువుగా బియ్యంతో తయారు చేసిన పదార్ధాలు వండడం తినడం అలవాటయింది. అందు వలన చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ దాన్ని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ దాని నిమిత్తం అధిక డబ్బు ఖర్చుపెడుతూ,కొంతమంది శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ నానా తంటాలు పడుతున్నారు.దీనితో ఏది ఏమైనా పాతది బంగారం అన్న నిజం తెలుసుకుని మరల తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపడం మొదలెట్టారు.వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని,దీనితో అధిక బరువు తగ్గడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుందని పెద్దలు శాస్త్రవేత్తలు చెప్పడంతో మరల అందరూ ఆచరించడం మొదలు పెట్టారు.అదీ కాక రసాయన రహిత తృణ ధాన్యాలు,కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు శుభ్రం చేసినవి బజారులో అమ్ముతున్నారు. కనుక వండడం కూడా తేలికగా ఉంటుంది.అధిక బరువు ఉండడం వలన వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యపరంగా అనేక గడ్డు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.అందువల్ల ఈమధ్య బరువును అదుపులో ఉంచుకోవాలనే ఆలోచన అందరిలోనూ రావడంతో ఆరోగ్యచేతన(హెల్త్ కాన్షస్) ప్రారంభమైంది.ఇది చాలా శుభ పరిణామం.                

Friday, 3 August 2018

పెదవులు మృదువుగా

                                                                  ఋతువులు మారినప్పుడల్లా శరీరం,ముఖంతో పాటు పెదవులు మృదువుగా,అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే  బజారులో ఎన్నో రకాల పైపూతలు దొరుకుతున్నాయి.కానీ వీటిని మనమే స్వయంగా మన ఇంట్లోనే వంటింట్లో అందుబాటులో ఉన్న వాటితోనే తయారు చేసుకుని సహజ సిద్ధంగా వాడుకోవడం మేలు.దీని కోసం ఒక అర చెంచా తేనె,ఒక అర చెంచా కొబ్బరి నూనె,ఒక చెంచా పంచదార,ఒక చెంచా గోరువెచ్చటి నీళ్ళు కలిపి పెదవులపై పూతలావేసి రెండు మూడు ని.ల పాటు మృదువుగా రుద్ది తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో కడిగేయాలి.ఈ విధంగా వీలయినప్పుడల్లా చేస్తుంటే పెదవులు పొడిబారి,పగిలి పైపొర చిన్న చిన్న  పెచ్చులు పెచ్చులుగా లేవకుండా మెత్తగా,అందంగా పెదవులు మృదువుగా ఉంటాయి.రోజుకొకసారి కలబంద గుజ్జు కొద్దిగా తీసుకుని పెదవులపై రాస్తుంటే కూడా పెదవులు మృదువుగా ఉంటాయి.

Thursday, 2 August 2018

చర్మానికి తేమ

                                                              కాలం మారిందంటే చాలు వాతావరణంలో మార్పుల వల్ల చర్మంలో తేమ శాతం తగ్గి చర్మం పొడిబారుతుంది.ముందస్తు ప్రభావం ముఖం,మెడ చర్మంపై పడుతుంది.దీన్ని అధిగమించాలంటే ఒక చెంచా నారింజ తొక్కల పొడి,ఒక 1/2 చెంచా తేనె,ఒక అర చెంచా ఓట్స్ పొడి వేసి ఒకసారి కలిపి మళ్ళీ దానికి సరిపడా నీళ్ళు పోసి పూత వేయడానికి వీలుగా అంటే పలుచన,మరీ ముద్దలా కాకుండా కలుపుకోవాలి.దీన్నిముఖానికి,మెడకు పూత వేసి ఒక 15 ని.ల తర్వాత కడగాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మానికి తేమ అంది చర్మం నిగనిగలాడుతుంది.

Tuesday, 24 July 2018

మౌనమే మనకు శ్రీరామరక్ష

                                                        ఈమధ్య చదువుకున్న పిల్లలు కూడా చిన్నచిన్న వాటికి గొడవ పడి విడాకులు వరకు వెళ్లి కాపురాలు కూల్చేసుకుంటున్నారు.దానికి తోడు పెద్దల వత్తాసు.వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళను రెచ్చగొట్టడం అంత అవసరమా?మన కాపురం బాగుండాలి.మన స్వార్ధం కోసం పిల్లల కాపురం చెడిపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఉంటున్నారు కొంతమంది.ఓపిక ఉండగానే కష్టపడకుండా పిల్లల మీద వాలిపోయి గొడవలు సృష్టిస్తున్నారు. మారోజుల్లో నేను మీఅమ్మను కొట్టాను.నువ్వు కూడా నీభార్యను కొట్టు అనడం సమంజసమా? ఇంత చేసి చెప్పిన వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు అరవై ఏళ్ళు వచ్చినా ఒక్కపూట కూడా విడిగా ఉండలేరు.వినేవాళ్ళు ఉంటే చెప్పుడు మాటలు కొంతమంది మంచిచెడు ఆలోచించకుండా చెప్తూనే ఉంటారు.పిల్లలు ఏదన్నా  తెలిసో తెలియకో గొడవ పడి  మాట మాట పెరిగి పోట్లాడుకుంటే సర్దిచెప్పి వాళ్ళ కాపురం చక్కదిద్దాల్సింది పోయి గొడవ పెద్దది చెయ్యడం సంస్కారమేనా?ఎంతవరకు సబబు?నేనే గొప్ప నాకన్నీ  తెలుసు అనుకోవటం తప్ప అక్కడ ఏమీలేదు.ఈరోజుల్లో కూడా బయట ఉద్యోగం చేసి,ఇంటెడు పని చేసి ఇంటిల్లిపాదికీ సపర్యలు చేయాలంటే కష్టం కదా!అందరూ కలసి మెలసి తలా ఒక పని చేసుకుంటేనే సంసారం చూడ ముచ్చటగా ఉంటుంది.కాపురం అన్న తర్వాత ఒకరికొకరు సర్దుకుని ఒకరిమాట ఒకరు వింటుంటే,భార్యాభర్తలు ఇద్దరి మధ్య వేలు కూడా పెట్టలేనంతగా వివాహబంధం గట్టిగా ఉన్నప్పుడు ఎవరెన్ని గొడవలు పెడదామనుకున్నా ఎవరూ ఏమీ చేయలేరు.అసలు చెప్పుడు మాటలు వినటమంత తెలివి తక్కువ తనం మరొకటి ఉండదని అర్ధం చేసుకోవాలి.వాటివల్ల లేనిపోని తలనొప్పి తెచ్చుకోవటమేకానీ,లాభం ఏమీ ఉండదని,మంచి మాటలు తప్ప ఏది ఎవరు చెప్పినా అందులో మంచి,చెడు ఆలోచించకుండా  చెప్పినవన్నీ విని గొడవలు పడకూడదని తెలుసుకోవాలి.తమ స్వంత తెలివితేటలను ఉపయోగించి  స్వతంత్రంగా ఆలోచించి తమ పండంటి సంసారాన్ని పచ్చగా ఎలా  నిలబెట్టుకోవాలో ఎవరికి వారే నేర్చుకోవాలి.భార్య,పిల్లలుతల్లిదండ్రులు,అత్తమామలు,అక్కచెల్లెళ్ళు,బావమరుదులు,అన్నవదినలు,ఎవరికిచ్చే ప్రాముఖ్యత వారికి ఇచ్చి గుడ్డిప్రేమతో ఎదుటి వారి మాటలు వినకుండా మన సూటీన మనం పోతే ఆ సంసారం హుందాగా,చూడ చక్కగా ఉంటుంది.మాటామాటా పెరిగినప్పుడు ఒకరి కొకరు వాదించుకుని ఆ మాటలు మనసును గాయపరిచి తర్వాత బాధపడేకన్నా ఆసమయంలో కాసేపు మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు.అప్పుడు ఆ మౌనమే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది.మౌనంగా ఉన్నంత మాత్రాన ఎదుటివారికి తలొగ్గినట్లు కాదు.మౌనంగా గుడ్లు మిటకరించి చూస్తావేమిటి?అనేవాళ్ళు ఉన్నారు.ఆవేశంలో మాట తూలడం సహజం.ఆ మాటను మరల వెనక్కు తీసుకోవడం కష్టం.కనుక ఒకరికొకరు అరుచుకుని గొడవ పెద్దది చేసుకుని నీదే తప్పు అంటే నీదే తప్పు అనుకునే కన్నామౌనంగా ఉండడంఇద్దరికీ,అందరికీ కూడా మంచిది.ఎవరి వారు ఎదుటి వాళ్ళదే తప్పుగా కనపడొచ్చు.కానీ ఇద్దరిలో ఎంతో కొంత తేడా ఉంటేనే గొడవ మొదలవుతుంది.వీరావేశం తగ్గిన తర్వాత గొడవ ఎందుకు వచ్చింది?ఎవరిదీ లోపం అనే దాని గురించి ఆలోచించి విపులంగా మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేసి విడాకుల వరకు వెళ్ళకుండా వాళ్ళవాళ్ళ లోపాలు సరిదిద్దుకుంటే సంసారాలు పచ్చగా ఉంటాయి.ఇల్లు,సంసారం,మనసు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి.ఇంతకీ చాలాసార్లు అసలు కారణం అంటూ ఏమీ లేకుండానే చిన్నచిన్న వాటినే పెద్దది చేసుకుంటారు.తీరిగ్గా ఆలోచిస్తే ఏమీ ఉండదు.వడ్ల గింజలో బియ్యపు గింజ తప్ప.ఇప్పటి తరం కాస్త కోపం,తొందరపాటుతనం తగ్గించుకుని  చెప్పుడు మాటలు వినకుండా ఉంటే సంసారాలు పచ్చగా బాగుంటాయి.

Monday, 23 July 2018

బామ్మ చెప్పిన కాకర కాయ కబుర్లు

                                               కాకర కాయ పేరు చెప్పగానే చాలామంది ముఖం చిట్లించి చేదు పుట్ట మేము అసలు తినము అంటూ ఉంటారు.కాకరకాయ చేదు అన్నమాటే కానీ పోషక విలువల పరంగా ఎన్నో ప్రయోజనాలున్న అమృత తుల్యమైన కాయ.చాట భారతం ఎందుకని అన్నీ  చెప్పటం లేదు.వర్షాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే కాకర కాయ తప్పనిసరిగా తినాలి. కాకర కాయతో చేదు తెలియకుండా రకరకాల వంటలు చేయవచ్చు.కాకరకాయ అంటే నా కెంతో ఇష్టం అంటూ బామ్మ చెప్పిన కాకరకాయ కబుర్లు.అఖిల ఒకరోజు బామ్మ క్షేమ సమాచారాలు తెలుసుకుందామని టెలిఫోను చేసింది.కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఏమి కూరలు  వండావు మనవరాలా?అంది బామ్మ.నీకు ఇష్టమైన కాకరకాయ చేశాను బామ్మా!అనగానే ఎంతో సంతోషంగా తనకు ఎంత ఇష్టమో చెప్పడం మొదలుపెట్టింది బామ్మ.నా చిన్నప్పుడు మాకు కాకర తోటలు ఉండేవి.వాటితో మా అమ్మ కాకర కాయ బెల్లం వేసిన అంట(చిక్కటి)పులుసు,ఇగురు,కొద్దిగా ఉడికించి ఎండలో పెట్టి చేసిన వేపుడు,పప్పుల పొడులు దట్టించి చేసిన కాయ కూర,వెల్లుల్లి,ఎండు మిరపకాయలు నూరి చేసిన కూరలు ఇష్టం అని రోజూ కాకరకాయ కూర లేనిదే ముద్ద దిగేది కాదని చెప్పింది.ఆఖరికి ఆకుల మీద కూర్చున్నప్పుడు కూడా పేచీ పెట్టి కాకరకాయ కూర పెడితేనే ఏదైనా తింటానంటే తప్పక మా అమ్మ పెట్టింది.నాకు ఇష్టం అనే కాదమ్మా!ఎవరైనా కాకరకాయ సరిగ్గా వండుకుని తింటే ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి ఎంతో మంచిది.నేను ఈరోజు ఇంత గట్టిగా ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా,ఎనభై అయిదు ఏళ్ళు ఉన్నా నాపని నేను చేసుకుంటున్నానంటే అదే కారణం.అన్నట్లు మీ ఆయనకు,పిల్లలకు కూడా కాకరకాయ తినడం అలవాటు చెయ్యి అని బామ్మ అఖిలతో చెప్పింది.తప్పకుండా చేస్తాను.ఉంటాను బామ్మా అంటూ అఖిల ఫోను పెట్టేసింది.

Sunday, 22 July 2018

తొలి ఏకాదశి శుభాకాంక్షలు

                                           నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,మన తెలుగు వారందరికీ ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు,పాడిపంటలు సమృద్దిగా సమకూరాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.


                                             




డి విటమిన్ సమృద్దిగా .......

                                                                          ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ సరిపడా ఉండాలి.ఎముకలు విరగకుండా ఉండాలంటే ఉదయం,సాయంత్రం ఎండలో కాసేపు ఉండవోయ్!అంటూ మిత్రులు సలహాలు ఇచ్చేస్తుంటారు.సలహా ఇచ్చారని కాదుగానీ నిజంగానే లేలేత ఎండ మన శరీరానికి చాలా మంచిది.సూర్య కిరణాలు మన శరీరానికి తగలగానే చర్మం దానంతటదే డి  విటమిన్ తయారు చేసుకుంటుంది.దీనితోపాటు డి విటమిన్ సమృద్దిగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి.పాలు,చేపలు,గుడ్లు,పుట్టగొడుగులు,వెన్న మన  ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకోవాలి.విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండడమే కాక పేగుకాన్సర్ బారి నుండి కూడా తప్పించుకోవచ్చు. 

Tuesday, 17 July 2018

కాలక్షేపంతోపాటు ఆరోగ్యం

                                                                               బుల్లితెర చూస్తూ కాలక్షేపం చేసేటప్పుడు ఖాళీగా కూర్చోకుండా పనిలో పనిగా చిన్న చిన్న వ్యాయామాలు కాళ్ళు,చేతులు ఉపయోగించి చేసేవి చేసుకుంటే రెండు విధాలా వినోదం,ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.నవ్వుతున్నట్లుగా పెదవుల్ని సాగదీసి రెండు చేతులతో బుగ్గలను కింది నుండి పైకి కళ్ళ వైపు తోస్తున్నట్లుగా చేయాలి.ఇలా ఏడు,ఎనిమిది సార్లు చేస్తుంటే చర్మం బిగుతుగా మారి బుగ్గలపై ముడతలు రాకుండా ఉన్న వయసు కన్నా తక్కువగా కనిపిస్తారు.కుర్చీలోనో,సోఫాలోనో కూర్చునే కాళ్ళు,చేతులు ముందుకు చాపి వెనక్కు మడవటం,గుండ్రంగా తిప్పడం,గుప్పిట మూయడం,తెరవడం చేస్తుంటే చేతి వేళ్ళ కండరాలకు కూడా వ్యాయామం చేసినట్లవుతుంది.మెడ,కళ్ళు,నోరు ఇలా ఎవరి వీలుని బట్టి వాళ్ళు తోచిన విధంగా అన్ని రకాల వ్యాయామాలు చేయవచ్చు.కాలక్షేపంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

దంతాలు శుభ్రంగా......

                                                                   మనం రోజూ సబ్బుతో శుభ్రంగా స్నానం చేసినా సరే  అప్పుడప్పుడు నలుగు పెట్టుకోనిదే మురికి వదలనట్లుగా పళ్ళు,దంతాలు రోజు పేస్ట్ తో బాగా రుద్ది కడిగినా కానీ పళ్ళపై ఎంతో కొంత మనకు తెలియకుండానే పాచి ఉంటుంది.అందుకే రోజూ  పళ్ళు తోముకునేటప్పుడు పేస్ట్ తోపాటు కొంచెం కలబంద గుజ్జు వేసుకుని రుద్దుకుంటే పళ్ళు,దంతాలు శుభ్రంగా ఉంటాయి. 

Thursday, 12 July 2018

చుబుకం కింద కొవ్వు కరగాలంటే ......

                                                               మనలో చాలామందికి చుబుకం కింద కొవ్వు పేరుకుని మందంగా లేదా చర్మం వేలాడుతూ ఉంటుంది.ఈ కొవ్వు కరగాలంటే మనం నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించిన విధంగా నీళ్ళు లేకుండా గాలితోనే బుగ్గలను అటూ ఇటూమార్చిమార్చి ఒక నిమిషం పాటు చేసి కాస్త విరామంతో మళ్ళీ చేయాలి.ఇలా నాలుగైదు సార్లు చేయాలి.దీనితో పాటు మెడ దగ్గర రెండుచేతులు పెట్టి కింద నుండి పైకి  గడ్డం వరకు ఒకదాని తర్వాత ఒకటి పైకి అంటూ చేయగలిగినన్ని సార్లు చేస్తూ ఉంటే వేలాడే చర్మం బిగుతుగా మారుతుంది.చూడటానికి మెడ దగ్గర లావుగా కానీ గంగడోలు మాదిరిగా వేలాడుతూ కానీ లేకుండా ముఖం,మెడ  అందంగా ఉంటుంది.

Wednesday, 11 July 2018

ఘన నివాళి

                                                                                     ఆడపిల్ల అన్నాక కూసింత అక్షరజ్ఞానం ఉండాలి అనేది రామతులశమ్మ గారి వాదన.ఇది యాభై సంవత్సరాల క్రితం మాట.ఆశ్చర్యంగా ఉంది కదూ!ఇది నిజం.ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు,ఇద్దరు మగ పిల్లలు.ఆమెకు చదువంటే చాలా ఇష్టం.మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను కూడా చదివించాలని కోరిక.ఆ రోజుల్లో వాళ్ళ ఊరికి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు.బడికి పంపాలంటే చాలా దూరం నడిచి వెళ్ళాలి.లేదంటే నగరంలోని బడికి పంపి వసతిగృహాల్లో పెట్టాల్సిందే.రామతులశమ్మ గారు పిల్లలు నడిచి వెళ్ళడం కష్టం కనుక రెండో దానివైపు మొగ్గి భర్తను ఒప్పించి నగరంలో పేరుమోసిన పాఠశాలలో చేర్చారు.అప్పటికి ఒప్పుకుని పిల్లలను నగరంలోని బడిలో చేర్చినా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక భర్త తరపు కుటుంబీకులు ఆడపిల్లలను నగరంలో చదివించడం అవసరమా?అంటూ భర్తను ఒత్తిడి చేసేసరికి ఆయన కొంచెం మెత్తబడేవారు.తులసీ అంత డబ్బు ఖర్చు పెట్టి ఆడ పిల్లలను అంత దూరం పంపించడం ఎందుకు?ఇంటికి తీసుకొచ్చేద్దాము అనేవారు.రామతులశమ్మ గారు పిల్లలను ఎలాగైనా చదివించాలనే పట్టుదలతో తనకు పుట్టింటివారు ఇచ్చిన పొలం కౌలు డబ్బులు తనకోసం ఖర్చుపెట్టుకోకుండా పిల్లల చదువుల కోసం వెచ్చించి చదివించింది.అమ్మా!మీరు బాగా చదువుకుని మీకున్న అక్షరాజ్ఞానాన్ని నలుగురికీ పంచాలి అని తల్లి చెప్పటంతో పిల్లలు కష్టపడి చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు.చిన్నమ్మాయి బాగా తెలివి కలది, చురుకైనది.ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే బడికి వచ్చే వారికి మాత్రమే పాఠాలు చెప్పగలము అని సామాజిక సేవ చేయాలనే ఉద్దేశ్యంతో తన చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే వారికి చదువు ప్రాధాన్యతను వివరించి ప్రభుత్వం తరఫున ఉన్న పధకాల గురించి అనేకసార్లు తల్లిదండ్రులకు  చెప్పి ఒప్పించి ఎలాగైనా పిల్లలను చదివించేలా ప్రోత్సహిస్తుంది.ముఖ్యంగా ఆడవాళ్లకు పొదుపు పధకాల గురించి చెప్పి వాటివల్ల పొందే లాభాలు,వాటిని సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి అని వివరించి,వారికి చేతివృత్తులు నేర్పించి ఆదాయమార్గాన్ని సూచిస్తుంది.ఇంతటితో ఊరుకోక ప్రభుత్వం నుండి కూడా వారికి అన్నీ సక్రమంగా  అందేలాగా చూస్తుంది.ఇదంతా చెయ్యడానికి చాలా కష్టపడినా ఇప్పుడు అందరికీ ఆమె ఆరాధ్య దైవం.నేను ఈరకంగా మాట్లాడి ఇవన్నీ చేస్తున్నానంటే అమ్మ ప్రసాదించిన అక్షరజ్ఞానం.ఇదంతా అమ్మ చలవ అంటుంది చిన్నమ్మాయి సునీత.అమ్మ చనిపోయిన సందర్భంగా స్నేహితుల వద్ద బాధపడుతూ ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పాటు చదువుకుని ఉద్యోగం చేసి తమకంటూ ఆదాయం సమకూర్చుకోవాలన్న తపనను  గుర్తుచేసుకుని  కన్నీళ్ళు పెట్టుకుంది.అనుకోకుండా చిన్నకొడుకు విదేశాలకు వెళ్ళడంతో ఆ అవకాశం సునీతకు దక్కింది.తర్వాత కొడుకు అయ్యో అమ్మా!నేను సమయానికి దగ్గర లేకపోయనే అంటూ ఉన్నపళానా పరుగెత్తుకుని వచ్చాడు.ఎంతో బాగా చూసుకునే కొడుకు దగ్గర లేడనే బాధ తప్ప చివరి పదిరోజులు పనివాళ్ళు ఉన్నా చిన్నకూతురు సమక్షంలో,కూతురి సేవలతో తృప్తిగా కన్ను మూసింది.అదే అమ్మ ఆత్మకు శాంతి.అమ్మ ఋణం ఎవరూ తీర్చుకో  లేనిది.కూతురుగా సునీత అమ్మకు సేవచేసి అమ్మ ఋణం కొంతైనా తీర్చుకుంది.సునీత మాత్రమే కాదు.చివరి రోజుల్లో ఎంత మంది ఉన్నా పిల్లలు దగ్గర ఉన్న దారి వేరు.సాధ్యమైనంతవరకు మనమందరమూ కూడా తల్లిదండ్రుల ఋణం కొంతైనా తీర్చుకుంటే మనకు పెద్దవాళ్ళకు కూడా సంతృప్తిగా ఉంటుంది.అదే ఘన నివాళి.తర్వాతి కార్యక్రమాలు ఎంత ఘనంగా చేశామన్నది ముఖ్యం కాదు.

Monday, 9 July 2018

స్వల్ప ప్రయత్నం

                                                                  పునాది రాయి వేస్తేనే కదా!ఇల్లు కట్టగలిగేది.అలాగే ఏ పని చేయడానికైనా స్వంత ప్రయత్నం చేస్తేనే దేన్నైనా సాధించగలరు.అసలు ప్రయత్నమే చేయనప్పుడు ఎంత గొప్పవాడైనా,ఎన్ని తెలివితేటలు,ఎంత గొప్ప ఆలోచనలున్నా ఏమీ సాధించలేరు.ప్రయత్నానికి ఉన్న శక్తి చాలా గొప్పది.అమ్మో!ఈ పని మన వల్ల అవుతుందో లేదో? మనం చేయగలమో లేదో? అని ప్రతికూల ధృక్పదంతో ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పనీ చేయలేరు.ఏదీ అనుకున్నది సాధించలేరు.కనుక ధర్మబద్దమైన ఆలోచనలతో,సానుకూల దృక్పధంతో,పట్టుదలతో ప్రయత్నించి ఏ చిన్న పని తలపెట్టినా స్వల్ప ప్రయత్నంతో అది విజయవంతమై తాము కన్న కలల్ని సాకారం చేసుకుని అనుకున్నది సాధించగలరు. 

చిన్న సగ్గుబియ్యం పకోడి/బొండా

                                                             సగ్గుబియ్యం అనగానే సహజంగా సగ్గుబియ్యం పాయసం చటుక్కున గుర్తొస్తుంది.కానీ సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు.ప్రస్తుతం పకోడీ లేదా బొండా ఎలా తయారు చేసుకోవచ్చో,అందుకు ఏ పదార్ధాలు కావాలో  చూద్దాము.
         
               చిన్న సగ్గుబియ్యం - 1/2 కప్పు
                   చిక్కటి పెరుగు - 1/2 కప్పు
                   బొంబాయి రవ్వ - 1/2 కప్పు
                బియ్యప్పిండి - 1/2 కప్పు పైన 
                ఉల్లిపాయలు - 2 పెద్దవి
                అల్లం తురుము - 2  చెంచాలు
          పచ్చిమిర్చి తురుము - 4 చెంచాలు
                       ఉప్పు  - సరిపడా
          నూనె  -  వేయించడానికి సరిపడా
                                                                          ముందుగా పెరుగు గిలకొట్టి దానిలో సగ్గుబియ్యాన్ని  ఆరు గంటల పాటు నానబెట్టాలి.బాగా నానిన తర్వాత బియ్యప్పిండి,బొంబాయిరవ్వ,ఉల్లిపాయ
పకోడీకయితే పొడవుగా,బొండాలకయితే సన్నగా చిన్న ముక్కలు తరిగి అల్లం,పచ్చిమిర్చి తురుము,ఉప్పు వేసి పకోడీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.అవసరమయితే కొంచెం పెరుగు కలుపుకోవచ్చు.పొయ్యిమీద బాణలిలో తగినంత నూనె పోసి బాగా కాగిన తరాత దానిలో పిండిని పకోడీకయితే సన్నగా పొడవుగా బొండాలకయితే కొంచెం ఎక్కువ పిండితో గుండ్రంగా వేసుకోవాలి.బంగారు రంగు వచ్చేవరకు వేయించి వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ,టమోటా చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.

Thursday, 5 July 2018

మెదడు చురుగ్గా

                                                                 అల్పహరంతో పాటు చిన్న కప్పు హిమ క్రీము అదేనండీ ఐస్ క్రీమ్ తింటే మెదడు చురుగ్గా పని చేస్తుందట.హిమ క్రీము ఇష్టమైన వాళ్ళు పిల్లలు,పెద్దలుకూడా ఇప్పటి నుండి నిరభ్యంతరంగా తినవచ్చు.  

Tuesday, 3 July 2018

నమిలే జిగురు(చూయింగ్ గమ్)

                                                                              ఇంతకుముందు రోజుల్లో అయితే పిల్లలు,పెద్దలు కూడా కాలక్షేపం కోసం మధ్యాహ్నం,సాయంత్రం బఠాణీలు,వేయించిన శనగలు,మరమరాలు నములుతూ ఉండేవాళ్ళు.ఇప్పుడయితే పిల్లలు,పెద్దలు కూడా నమిలే జిగురు(చూయింగ్ గమ్)నములుతూ కనిపిస్తున్నారు.విదేశాలలో అయితే దాదాపు అందరూ చూయింగ్ గమ్ ఎప్పుడూ  నములుతూనే కనిపిస్తుంటారు.వాళ్ళు కాలక్షేపం కోసం నమిలినప్పటికీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు కూడా చెప్తున్నారు.నమిలేదేదో చక్కర లేని చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి మంచిది.దీన్ని నమలడం వల్ల దంతాలపై ఉండే పాచి పోవడమే కాక ఒత్తిడి తగ్గి మెదడు నరాలకు రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.నడక వేగం పెంచితే గుండె వేగం పెరుగుతుంది.కనుక వృద్దులు మరీ వేగంగా నడవక పోవడమే మంచిది.ఏదైనా నమిలే జిగురు నములుతూ నడవడంతో నడక వేగం కూడా పెరిగి తెలియకుండానే ఎక్కువ దూరం నడవగలుగుతారు.దీనితో అదనపు బరువు అదుపులో ఉండి మానసికంగా,శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది.మధ్య వయస్కులు చక్కెర లేని నమిలే జిగురు నమలడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే

                                                            మన రోజువారీ ఆహారంలో భాగంగా తాజా కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.కాలానుగుణంగా లభించే వాటిని తాజాగా వీలయితే ఇంట్లోనే పండించుకుని తినగలిగితే మనకు సరిపడా పోషక పదార్ధాలు సమకూరి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లో వుంటుంది.దీనికోసం మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు.మనకు ఉన్నంత స్థలంలోనే నేలమెడ కానీ కుండీలలో కానీ,సంచుల్లో కానీ ఎప్పటికప్పుడు ఆకుకూరల విత్తనాలు చల్లుకోవచ్చు.చిన్న కుండీలో కూరగాయల విత్తనాలు చల్లి కొద్దిగా పెద్ద అయిన తర్వాత పెద్ద కుండీలలో పెట్టుకోవచ్చు.పండ్ల మొక్కలు తక్కువ ఎత్తులో విరివిగా కాసేవి తెచ్చి పెంచుకోవచ్చు.సొర,బీర,పొట్ల,కాకర వంటి తీగ జాతి మొక్కలను తొట్టిలో విత్తనాలు పెట్టి కాస్త తీగ వచ్చిన తర్వాత తాడుకట్టి పైకి పాకించవచ్చు.తెగుళ్ళు రాకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న   వేప కాషాయం, వెల్లుల్లి కాషాయం,లవంగాల కషాయం వంటివి చల్లుకుంటే పురుగుల బెడద లేకుండా ఉంటుంది.రసాయనాలు చల్లకుండా రసాయన రహిత తాజా ఇంటి పంట మన స్వంతం అవుతుంది.రుచికరమైన ఆకుకూరలు,కాయగూరలు,పండ్లు వాడుకోవచ్చు.దీనితోపాటు రోజు ఉదయం,సాయంత్రం ఒక అరగంట మొక్కలలో తిరిగితే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.స్వంతంగా మన చేతి మీదుగా మొక్కలను పెంచి,పోషించి  అవి మనకు అందించిన ఆకులు,కాయలు,పండ్లు కోస్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషం.ఆ రుచి,ఆ సంతృప్తి ఎంతో విలువైనది.వీటితోపాటు పువ్వుల మొక్కలు వేసుకుంటే తోట అందంగా ఉంటుంది.సంవత్సరం పొడుగునా వాడుకోవటానికి వీలుగా  విత్తనాలు ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.

దానిమ్మ తొక్కల ఉపయోగం

                                                                 మనం సహజంగా దానిమ్మకాయ వలిచినప్పుడు గింజలు తినేసి తొక్కలు పారేస్తుంటాము.ఇక ముందు అలా చెత్తలో పడేయకండి.దానిమ్మ తొక్కలను ఒక పళ్ళెంలో పలుచగా పేర్చి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి.బాగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకుని మూత గట్టిగా ఉన్నసీసాలో పోసి పెట్టుకోవాలి.ఒక చెంచా పొడి లో కొద్దిగా నిమ్మ రసం పిండి ముఖానికి రాసుకుని 20 ని.ల తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం మీదున్న మొటిమలు,మచ్చలు మాయమైపోతాయి.మరికొంత మందికి చిన్న వయసులోనే ముఖంపై ముడుతలు వచ్చి ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తుంటారు.అలాంటప్పుడు ఒక చెంచా పొడిలో కొద్దిగా పాలు కలిపి ముఖానికి పట్టించి 20 ని.ల తర్వాత ముఖం కడగాలి.ఇలా తరచుగా చేస్తుంటే ముడతలు మాయమై దానితోపాటు ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది.దానిమ్మ పొడి వాడడం వలన ఎండ వేడి,కాలుష్యం వలన చర్మంపై వచ్చే ఇతర సమస్యల నుండి కూడా తప్పించుకోవచ్చు.  

Friday, 1 June 2018

పుర్రెకు తెగులు

                                           ఈమధ్య కొంత మంది అవసరం ఉన్నా లేకున్నా తమను తాము పొగుడుకుంటూ ఎదుటివారి కన్న మేమే గొప్ప అని చెప్పటం మొదలుపెట్టారు.ఇంకొంత మంది ఎదుటి వారిని కించ పరుస్తూ తమను తాము పొగుడుకుంటున్నారు.ఈ తరహా పోకడ ఇంతకు ముుందు అతి  కొంత మందిలో మాత్రమే కనిపించేది.ఇప్పుడు ఎక్కువమంది ఇదే బాటలో నడుస్తున్నారు.ఈ పోకడ మంచిది కాదని వాళ్ళకు తెలియదు. ఎదుటి వారు చెప్పినా అర్ధం చేసుకోలేని పరిస్థితి.మొక్కకు తెగులు వస్తే అంతవరకు తీసేసి ఇతర మొక్కలకు దూరంగా పెడతాము.పురెకు తెగులు వచ్చినట్లు ఏ మాట పడితే ఆ మాట ఎదుటి వారిని మాట్లాడితే ఎదుటి వారు మౌనంగా ఉండేది వాళ్ళకు మాటలు రాక కాదు. లేక మాట్లాడే వాళ్ళ గొప్ప చూచి కాదు. అటువంటి వాళ్ళతో మాట్లాడటం వృధా ప్రయాస అనుకున్నారని అర్ధం చేసుకుంటే మంచిది.మనుషులు కనుక మానవ సంబంధాల దృష్ట్యా ఇటువంటి కొంత మందిని భరించక తప్పని పరిస్థితి.



Tuesday, 29 May 2018

పిల్ల పిత్తరి

                                        ముఖేేష్ చిన్నప్పటి నుండి వాగుడు కాయ.పెద్దవాడు అయినప్పటికీ ఆ అలవాటు పోలేదు.నలుగురూ కూర్చుని మాట్లాడుకుంటుండగా నాకే అన్ని తెలుసు అన్న విధంగా మధ్యలో కల్పించుకుని తగుదునమ్మా అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.అది మంచి పద్ధతి కాదని చెప్పినా ఆ అలవాటు మానుకోేలేకపోతున్నాడు.చివరకు అందరూ నువ్వు పిల్ల పిత్తరి గాడివి నోరుమూసుకో! అనడం మొదలుపెట్టారు.ఆ దెబ్బతో దాదాపుగా ఆ అలవాటు మానుకున్నాడు.

Monday, 28 May 2018

దోసె పెనం కి అంటుకోకుండా ఉండాలంటే

                     దోసె పెనం కి అంటుకోకుండా ఉండాలంటే ముందు రోజు రాత్రి పెనం కి నూనె రాసి ఉదయం దోసె వేసుకుంటే ఏ విథంగా కావాలంటే ఆ విధంగా వస్తుంది. 

Thursday, 24 May 2018

ధూమ శకటం

                                                             నరేశ్ చిన్నప్పుడు పాఠశాలలో చదువుకునే రోజుల్లో తెలుగు ఉపాధ్యాయుడు ఒకరు పిల్లలను అచ్చ తెలుగులో మాట్లాడని వాళ్ళని గోడ కుర్చీ వేయమని చెప్పేవారు.వాళ్ళ ఊ రికి ఆ రోజుల్లో ఒక పొగ బండి మాత్రమే వచ్చేది.పొగ బండి(రైలు బండి) అంటే ధూమ శకటం అనాలని, స్టేషన్ అంటే ధూమ శకట విరామ స్థలం అనాల్సిందేనని గట్టిగా చెప్పేవారు.కొంత మందికి నోరు తిరిగేది  కాదు.అయినప్పటికీ పిల్లలందరికీ వచ్చేవరకు గట్టి పట్టు పట్టి  చెప్పించేవారు.ఇంతకీ ధూమ శకటం అంటే రైలు బండి.

Sunday, 11 February 2018

ఓరుగత్తె

                                సుజన చిన్ననాటి స్నేహితురాలు సంజన విదేశాలలో స్థిరపడింది.స్వదేశానికి వచ్చి 40 సంవత్సరాల తర్వాత ఎలాగో సుజన చిరునామా తెలుసుకుని నేరుగా సుజన ఇంటికి వచ్చింది.ఆ సమయంలో సుజన తోటలో మొక్కలకు పాదులు చేయిస్తుంది.సుజనా,సుజనా అంటూ తోటలోకి వచ్చేసరికి ఆశ్చర్యపోయిన సుజన ఒక్క నిమిషం తర్వాత తేరుకుని సంజనను సాదరంగా ఆహ్వానించింది.వయసు పెరగటం తప్ప ఇద్దరూ చిన్నప్పటి మాదిరిగానే నువ్వు ఉన్నావు ఏమీ మారలేదు అని ఒకరికొకరు అనుకుని నవ్వుకున్నారు.సుజన ఇంటి లోపలకు వెళదామని అనుకుంటే సంజన తోటలో చల్లగా,హాయిగా ఉంది.ఇక్కడే కాసేపు కుర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది.అక్కడే ఇద్దరూ గడ్డి మీద చతికిలపడి చిన్ననాటి ముచ్చట్లు పాఠశాల,కళాశాలలోని స్నేహితుల కబుర్లు,చేసిన అల్లరి పనులు,ఆడిన ఆటలు అన్నీగుర్తుకు తెచ్చుకుని కళ్ళ వెంట నీళ్ళు వచ్చేంత వరకు,పొట్ట చెక్కలయ్యేలాగా పడీ పడీ నవ్వుకున్నారు.ఈలోగా సమయం గంటలు నిమిషాల్లా గడిచి పోయింది.చీకటి పడేసరికి ఇంట్లోకి వెళ్లి కాస్త ఫలహారాదులు తీసుకున్న తర్వాత సంజనకు  ఇంట్లో ఎక్కడ చూసినా మొక్కలు అందంగా కనబడేసరికి ఇల్లంతా కలియతిరిగి మిద్దెతోటకు వెళ్ళింది.అక్కడ రకరాల,పువ్వులు,పండ్లు,కూరగాయలు చూచి ఆశ్చర్యపోయింది.సంజన ఎంతో సంతోషంగా చాలా బాగుంది అని మెచ్చుకుంటూనే చిన్నప్పుడు ఎక్కడ కొత్త మొక్క కనబడితే అక్కడ నుండి తెచ్చేదానివి అంటూ గుర్తుచేసుకుంది.ఆ అలవాటుని ఇప్పటివరకు కొనసాగించి నీ అభిరుచికి తగ్గట్లు తోటను తీర్చిదిద్ధావు అంటూ అభినందించింది.చిన్నప్పటి నుండి నువ్వు మా అందరికన్నా ఓరుగత్తెవి కదా!అంది.సుజనకు అర్ధం కానట్లు ముఖం పెట్టేసరికి ఓరుగత్తె అంటే వివరగత్తె.చిన్నప్పటి నుండి ఏ పనైనా వివరంగా చేసే వాళ్ళను ఆ విధంగా అంటారు అని చెప్పింది.నువ్వేమో కనిపించిన వాళ్ళకు పేర్లు పెట్టేదానివిగా!అంటూ ఒకరికొకరు గుర్తుచేసుని హాయిగా నవ్వుకున్నారు. 

Tuesday, 23 January 2018

అందుబాటులో ఉన్న వాటితోనే అందంగా

                                                           అందంగా కనిపించాలని అనుకోవడం మానవ సహజ లక్షణం.ఈ శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాము.అందుకే మన ఇంటిలో అందుబాటులో ఉన్న వాటితోనే  చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడం ఎలాగంటే?ఒక స్పూను కలబంద గుజ్జు,ఒక స్పూను మెత్తటి అరటిపండు,ఒక స్పూను పెరుగు ఒక అర స్పూను నువ్వులనూనె,ఒక అర స్పూను బాదం నూనె,ఒక అర స్పూను ఆలివ్ నూనె,ఒక అర స్పూను తేనె అన్నీ కలిపి ముఖానికి పట్టించి ఆరిపోయిన తర్వాత కడిగేయాలి.ఈ విధంగా చేస్తుంటే చర్మం అందంగా,కాంతివంతంగా మెరిసిపోతుంది.సమయం ఉంటే వారానికి ఒకరోజు శరీరం మొత్తం పట్టించవచ్చు.పై పూత ఒక్కటే కాకుండా ఈ కాలంలో లభించే అన్ని రకాల పండ్లు,కూరగాయలు తినాలి.చల్లగా ఉంది కదా అని అశ్రద్ద చేయకుండా మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటే చలికాలంలో కూడా అందంగా కనిపించవచ్చు.

Sunday, 14 January 2018

సంక్రాంతి

                                                      ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సంస్కృతి,సంప్రదాయాలు చక్కగా పాటిస్తూ తోటివారికి కూడా వాటిని పరిచయం చేస్తూ,కమ్మటి పిండి వంటలు అందరికీ రుచి చూపిస్తూ ఆటలు,పాటలతో సందడి చేస్తూ మనమే కాక మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా  ఉండాలని అనుకునే మన తెలుగు వారందరికీ అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ.నా బ్లాగు వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు.ఎల్లప్పుడూ భోగ భాగ్యాలతో,సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

           

Tuesday, 2 January 2018

పొడి దగ్గు

                                                                 చలికాలంలో చలితోపాటు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేనంతగా  పొడి దగ్గు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.అటువంటప్పుడు చిన్న కరక్కాయ ముక్క నోట్లో వేసుకుని కాసేపు బుగ్గన  పెట్టుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.