Saturday, 28 February 2015

జామకాయ పచ్చడి

                                 దోర జామకాయ - 1  
                                  పచ్చి మిర్చి - 10
                                  చింతపండు - నిమ్మకాయంత
                                  పసుపు - కొంచెం
                                  ఉప్పు - సరిపడా
                                  జీరా - 1 స్పూను
                                  వెల్లుల్లి పాయ - 1/4
                                  తాలింపుకు - అవసరమైనవి
                                                     జామకాయ ముక్కలు కోసి ఉప్పు,పసుపు వేసి ఉడికించాలి.కొంచెం నూనె వేసి పచ్చి మిర్చి వేయించాలి.ఇవన్నీ మిక్సీలో కానీ రోటిలో కానీ వేసి మెత్తగా అయిన తర్వాత చింతపండు, జీరా,వెల్లుల్లి కూడా వేయాలి.చివరగా తాలింపు పెట్టి కొత్తిమీర,కరివేపాకు కూడా వేయాలి.ఇది దోసెతో కానీ,అన్నంతో  కానీ తినవచ్చు.రుచిగా ఉంటుంది.   

తెల్లీశ్వరి

                                         ప్రీతమ్ స్నేహితుడికి ఒంగోలు గిత్తలను,జెర్సీ ఆవులను పెంచటం అలవాటు.ఒకసారి మాఇంటికి వచ్చి ఆవులను,గిత్తలను చూడమంటే స్నేహితులందరూ కలిసి వెళ్లారు.పొలాల్లో షెడ్లు వేసి ప్రత్యేకంగా మనుషులను పెట్టి చాలా బాగా చూస్తున్నారని అందరూ వాటిని చూచి ముచ్చటపడ్డారు. వీళ్ళు అందరూ అక్కడ  కూర్చోవటానికి అనువుగా ఏర్పాట్లు చేశారు.అక్కడ కూర్చుని ఉన్నప్పుడు కొన్ని మొక్కలు గుంపుగా షెడ్ల చుట్టురా పెట్టిఉన్నాయి.అవి అంత ముందెన్నడూ చూడలేదు.అవి ఏం మొక్కలోనని ఆరా తీయగా తెల్లీశ్వరి మొక్కలు అని చెప్పారు.పొలాల్లో పాములు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మొక్కలు పెట్టామని అవి ఎక్కడ ఉంటే అక్కడకు పాములు రావని చెప్పారు.వెళ్ళిన వాళ్ళందరికీ తలా ఒక మొక్కఇచ్చారు.సరే,చూద్దామని తెచ్చి వాకిట్లో   పెట్టుకున్నారు.  

Wednesday, 25 February 2015

పచ్చి బఠాణీ

                                           పచ్చి బఠాణీఏ కూరలో వేసినా,బిర్యానీ,ఫ్రైడ్ రైస్ లో వేసినా వాటికి అదనపు రుచి వస్తుంది.వీటిని తరచూ వాడటం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.ఎముకలు గుల్లబారకుండా చేస్తాయి.కంటిచూపు మెరుగుపడుతుంది.రక్తం త్వరగా గడ్డకట్టటానికి  ఉపయోగపడతాయి.  

బెల్లం టీ

                                                      లాలస ఇంటికి దూరపు బంధువు వచ్చింది.ఆవిడకు మర్యాద చెయ్యడం కోసం ముఖ్యమైన పనిమీద వెళ్తూ కూడా ఉల్లిపాయ పకోడీ వేసి టీ పెడదామనుకునే సరికి అమ్మాయ్ నేను బెల్లం టీ తప్ప తాగను నాకు బెల్లం టీ ఇవ్వమంది.సరేనని మిగతా అందరికీ పంచదార కలిపి ఆమెకు మాత్రం బెల్లం తురిమి టీ లో  వేసి కాచి ఇచ్చింది.మొదటిసారి పెట్టినా కానీ భలే పెట్టావు అంటూ నువ్వు కూడా రుచి చూడు ఎంత బాగుంటుందో ఒకసారి తాగితే వదిలిపెట్టవు అంటూ బలవంతపెట్టి తాగే వరకూ వదలలేదు.లాలసకు టీ తాగే  అలవాటులేదు.దానికి తోడు బెల్లం టీ తాగమని కూర్చుంది అని మనసులో తిట్టుకుంటూ కొంచెం తాగింది.రుచి ఫర్వాలేదనిపించింది.ఈ బెల్లం టీ గోల ఏమిటో?ఎదుటివాళ్ళను తాగమని బలవంతం చేయటమేమిటో?విచిత్రమైన బంధువు అనుకుని లాలస తన పనిమీద తను వెళ్ళింది.

Tuesday, 24 February 2015

గంటలుగంటలు చెయ్యక్కర్లా

                                                            వ్యాయామం అంటే గంటలుగంటలు చెయ్యక్కర్లా.రోజులో వీలయినప్పుడు
ఏదోఒకసమయంలో చేసినా చాలు.అయ్యో!నాకు సమయం లేదు వ్యాయామం చెయ్యలేకపోతున్నానే అని బాధ పడాల్సిన అవసరం లేదు.ఏ టి.వి చూసేటప్పుడో కాసేపు చేస్తే చాలు.గుండెజబ్బులు,పక్షవాతం లాంటివి రాకుండా  ఉంటాయి.అధిక రక్తపోటు,అధిక బరువు నియంత్రణలో ఉంటుంది.అదీకాక టి.వి చూసేటప్పుడు,సంగీతం వినేటప్పుడు అయితే ఆడుతూపాడుతూ చేసినట్లుండి సమయమే తెలియదు.పనిగట్టుకుని చేద్దామంటే అదొక పెద్దపనిగా అనిపిస్తుంది.అందుకని ఈ విధంగా ప్రయత్నించొచ్చు. 

ఫోటోలు అందంగా...

                                              ఫోటోలు అందంగా ఆకర్షణీయంగా రావాలంటే తలస్నానం చేస్తే వెంట్రుకలు నిగనిగలాడుతూ తలకట్టు అందంగా ఉంటుంది.ఉదయం ఫోటోలు తీయించుకుంటే రాత్రంతా విశ్రాంతి తీసుకోవటం
వల్ల ముఖం తాజాగా ఉంటుంది.ముదురు రంగు దుస్తులు వేసుకుంటే ఫోటోలు ఆకర్షణీయంగా,అందంగా వస్తాయి.
కళ్ళు అందంగా ఉంటే ముఖం అందంగా ఉంటుంది.ఫోటో కూడా అంతే.కళ్ళు అలసిపోయినప్పుడు ఫోటోలు తీయించుకోకపోవడమే మంచిది.అప్పటికప్పుడు తీయాల్సినప్పుడు కీరదోస ముక్కలు కళ్ళపై ఒక 10 ని.లు
పెట్టుకుంటే తాజాగా కనిపిస్తాయి.కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఉంటే బంగాళదుంప రసంరాసి 5ని.ల
తర్వాత కడిగేస్తే బాగుంటుంది లేదా కన్సీలర్ రాయాలి.  

తోడుదొంగలు

                                                            నేహ,స్నేహ అక్కచెల్లెళ్ళు.ఇద్దరూ హైస్కూల్లో చదువుతున్నారు.వీళ్ళ అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా ఎవరిపనులకు వాళ్ళు వెళ్తుంటారు.నానమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటుంది కనుక చరవాణి ఉంటుంది.అక్కచెల్లెళ్ళు పాఠశాలనుండి వచ్చినదగ్గరనుండి ఆపకుండా చరవాణితో స్నేహితులతో మాట్లాడటం మొదలుపెట్టారు.ఆవిషయం నాన్నకు అసలు తెలియదు.అమ్మకు తెలిసినా పట్టించుకోదు.ఆమె అత్తగారు ఎవరితో ఎంతసేపు మాట్లాడారో అని చరవాణిలో వెతుకుతుంది కానీ పిల్లలు ఏమిచేస్తున్నారో అనే ఆలోచన లేదు.ఒకరోజు ఎందుకో మెసేజ్ లు చూస్తుంటే పెద్ద అమ్మాయి స్నేహితురాలు నీ పుట్టినరోజుకు అన్నయ్యను పిలుస్తున్నావా?అంటూమెసేజ్ పంపింది.పెద్దమ్మాయిని అడిగితే తడబడింది.రేపటినుండి చరవాణి తీసుకుంటే ఊరుకోను అంటూ కోప్పడింది.ఇంతలో చిన్నమ్మాయి వచ్చిఅక్కను అడగటమేమిటి?ఆపిల్లకు టైపు చెయ్యటం రాక "అనన్య బదులు అన్నయ్య"అని పంపింది.ఈమాత్రం దానికి కోప్పడటమేమిటి అంటూ అమ్మమీద గయ్ మంటూ అరవటం మొదలెట్టింది.ముందు నువ్వునోరుముయ్యి ఇద్దరూ తోడుదొంగలు.నువ్వు వెనకేసుకురావాల్సిన అవసరమేమిటి?అంటూ మొదటిసారి తిట్టింది.ఇంతకీ వాళ్ళ నుండి అసలు విషయం రాబట్టలేకపోయింది.పదో తరగతి చదివే అమ్మాయికి టైపు చెయ్యటం రాదా?మొదటినుండి వదిలేసి ఇప్పుడు అనుకుని ప్రయోజనంఏమిటి?.తెలిసీ  తెలియని వయసు  పిల్లల ప్రవర్తన ఎలా వుంటుందో గమనించాల్సిన భాద్యత తల్లిదండ్రులది.ఈరోజుల్లో ఎంత డబ్బు కూడబెట్టి ఇచ్చామన్నది ముఖ్యం కాదు.పిల్లల్ని ఎంత మంచి పౌరులుగా,సంస్కారవంతులుగా తయారు చేశామన్నది ముఖ్యం.పిల్లలపై మరీ ఆంక్షలు పెట్టకుండా వాళ్ళని గమనిస్తుండాలి.     

Monday, 23 February 2015

కంటినిండా నిద్ర

                                                హాయిగా కంటినిండా ప్రశాంతంగా నిద్రపోతే ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటాము.సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి అని శాస్త్రం.సమస్యలులేని జీవితం అసాధ్యం.ప్రతిదీ భూతద్దంలో నుండి చూడకూడదు.ఏ సమస్య ఉన్నాపడకగది బయటే ఆలోచనలన్నీ వదిలేసి,పడుకునే ముందుప్రశాంతంగా ఉండటానికి నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు.సంగీతం వినొచ్చు.ధ్యానం చేసుకోవచ్చు.హాయిగా నిద్రపడుతుంది.  తద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.కోపం,చికాకు తగ్గుతుంది.వ్యాధి నిరోధక శక్తి పెరిగి త్వరగా జలుబు,దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అధిక రక్తపోటు,అధికబరువు,గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.కంటి నిండా నిద్ర పోతే ఎన్ని లాభాలో?కదా!     

మట్టిని తాకితే .........

                                        మనకు ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండానే చికాకుగా ఉన్నట్లు,మనసుకు ప్రశాంతత         లేనట్లుగా అనిపిస్తుంటుంది.అటువంటప్పుడు పచ్చటి చెట్ల మధ్య కాసేపు తిరిగి మొక్కలకు పాదులు చేయటమో,
 నీళ్ళు పెట్టటమో చేస్తుంటే కాసేపటికి ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది.అసంకల్పితంగానో,పెద్దవాళ్ళు చెప్పటంవల్లో
మనం పైవిధంగా చేస్తుంటాము.నిజంగానే మట్టిని తాకి పనులు చేస్తుంటే మనసు తేలిక పడుతుందని,మట్టిలోఉండే సూక్ష్మజీవులవల్ల మనోల్లాసం కలుగుతుందని ఈరోజే పుస్తకపఠనం ద్వారా తెలిసింది.దిగులుగా ఉందా?అయితే మట్టిని తాకండి.ఒత్తిడితో ఉన్న చికాకు దానంతటదే పరారవుతుందని,మట్టి మనకు ప్రకృతి ప్రసాదించిన వరం అని, పొలం పనులు,తోట పనులు చేసేవాళ్ళు చీకు,చింత లేకుండా హాయిగా ఉండటానికి కారణం మట్టేనని దాని సారాంశం.   

Sunday, 22 February 2015

నడమంత్రపు సిరి

                                                                   ఆశారాణి కొడుకు పెళ్ళి.చెల్లెలి కూతుర్ని అమ్మా!ఊళ్ళో వాళ్లకు బొట్టు పెట్టి భోజనాలకు రమ్మని చెప్పాలి.ఉదయమే వచ్చేయండి అనిచెప్పింది.నాకు ఊళ్ళోకి వెళ్ళి పిలవాలంటే మహా చిరాకు.దుమ్ము,ధూళి ఉంటుంది..వేరే ప్రదేశాలకు వెళ్ళి స్నేహితులతో కలిసి ఊళ్ళు చూడటం సరదా అంతేకానీ ఊళ్ళోకి నేను రాలేను అని నిర్మొహమాటంగా చెప్పేసింది.సరే,రాకపోతే రాకపోయావు గానీ అన్నయ్య పెళ్ళి కనుక పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకురాఅని చెప్పింది.నాకు పట్టుచీర కట్టుకోవాలన్నా,నగలుమెడ నిండా  పెట్టుకోవాలన్నా చికాకు.నాకు సౌకర్యంగా ఉండే బట్టలే వేసుకుంటాను అని చెప్పింది.విదేశీ వనితలే మన సంప్రదాయాన్నిగౌరవించి ఎంతో మక్కువతో చీరకట్టు,నగలు ధరిస్తున్నారు.పల్లెలో పుట్టి పెరిగి నడమంత్రపు సిరి లాగా పట్నంలో కాపురమున్నంత మాత్రాన చిన్నచిన్న బట్టలు వేసుకోవటం ఏం పద్ధతి? అని పెద్దమ్మ నాలుగు చివాట్లు వేసింది.  
  

కొబ్బరి పాలు

                                                               చిక్కటి కొబ్బరి పాలు తీసి కొంచెం ఫ్రైడ్ రైస్ లో పోస్తే చాలా రుచిగా  ఉంటుంది.వెజ్,నాన్ వెజ్ కూరల్లో కొద్దిగా అంటే 2,3 స్పూనులు దించే ముందు పోస్తే కూరలకు అదనపు రుచి వస్తుంది.కొబ్బరి పాలు వంటల్లోనే కాక అందానికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడతాయి.అప్పుడప్పుడు కొబ్బరి పాలల్లో ఒక స్పూను ఓట్స్,అరస్పూను కొబ్బరినూనె కలిపి శరీరానికి రాసి 2,3 ని.లు అలాగే వదిలేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మెరుస్తూ ఉంటుంది.కొబ్బరి పాలల్లో ఒక స్పూను నిమ్మరసం
కలిపి ముఖానికి రాస్తే సహజ క్లెన్సర్ లా పనిచేసి చర్మం శుభ్రపడుతుంది.  

Saturday, 21 February 2015

ఊరికే వస్తే ........

                                             నమ్రత ఇంటికి ఒక తెలిసినావిడ వచ్చింది.ఆమె వచ్చేటప్పటికి నమ్రత ఫోనులో మాట్లాడుతుంది.అవతలి ఆమె ఇక ఉంటాను,రేపు మాట్లాడదాము అన్నా వినిపించుకోకుండా మాట్లాడుతూనే ఉంది.ఎలాగైతే ఆవిడ వచ్చిన తర్వాత కూడా అరగంటకు కానీ వదలలేదు.అంతకు ముందు గంట నుండి మాట్లాడుతూనే ఉంది.మీ ఇంటి దగ్గరలో ఉండే స్నేహితురాలు అని నమ్రత ఆవిడతో చెప్పింది.2 ని.లు ఏమీ మాట్లాడకుండా మీరు ఏమీ అనుకోకుండా ఉంటానంటే  నేను ఒకమాట చెపుతాను అంది.సరే అనగానే ఫోనులో మాట్లాడిన ఆమె ఊరికే వస్తే ఫినాయిలు కూడా తాగే రకమని మారోడ్డులో అందరూ అనుకుంటారు.ఆవిడ సొమ్ము కాకపోతే ఎదుటి వాళ్ళతో ఎంతైనా ఖర్చుపెట్టిస్తుంది.తను చెయ్యదు కానీ ఎదుటివాళ్ళు చేస్తే ఫోనులో అలుపు సలుపు లేకుండా ఎంత సేపైనా మాట్లాడుతుంది.మీ స్నేహితురాలి గురించి ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు అని సమాధానం కూడా ఆశించకుండా  చక్కా పోయింది.  

కళ్ళు

                                                                కళ్ళు అందంగా ఉంటే ముఖం మెరిసిపోతుంది.కళ్ళచుట్టూ నల్లటి వలయాలు,కళ్ళ క్రింద నలుపుదనం ఉన్నా ముఖం ఎంత అందంగా ఉన్నా ఏదో లోపం ఉన్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.పెళ్ళికో,పుట్టినరోజు పార్టీకో వెళ్ళాలంటే అప్పటికప్పుడు ఆప్రదేశంలో చర్మం రంగులో ఉండే కన్సీలర్ రాస్తే సరిపోతుంది.దీనికి రసాయనాలు ఉపయోగించని సహజసిద్ధమైన పరిష్కార మార్గం ఏమిటంటే వేపాకుల పొడి అందుబాటులో ఉంటే కొంచెం చేతిలో వేసుకుని సరిపడా నీళ్ళు పోసి దాన్ని కళ్ళచుట్టూ రాసి ఒక పదిహేను ని.ల తర్వాత కడిగేయాలి.లేదంటే ఒక బంగాళదుంప ముక్కను మెత్తగా తురిమి రసం పిండి ఆరసాన్ని కళ్ళ చుట్టూ  రాస్తుంటే  క్రమంగా నలుపు తగ్గిపోతుంది.     

శుభ్రత ముఖ్యం

                                             ఎప్పుడూ తలలో చుండ్రు సమస్య లేకుండా చూచుకోవాలి.తలలో చుండ్రు ఉంటే జుట్టు రాలిపోతుంటుంది.హడావిడిలో మురికి వదలకుండా తలస్నానం చేయడం,జుట్టు ఆరకుండానే నూనె రాసుకోవటం లాంటి వాటివల్ల కూడా చుండ్రు సమస్య వస్తుంది.పాఠశాలకు వెళ్ళే పిల్లలకైతే ఒక్కొక్కసారి పేల సమస్య కూడా ఉంటుంది.ముందు వాటిని వదిలించాలి.షాంపూతో తలస్నానం చేసిన తర్వాత వేపాకులను నీళ్ళల్లో వేసి బాగా మరిగించిన నీటిని కొంచెం చల్లార్చి జుట్టుకు రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి.ఇలా చుండ్రు ఉన్నా లేకపోయినా వీలయినప్పుడు చేస్తుంటే జుట్టు శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా పెరుగుతుంది.   

తెలుగు లెస్స

                               దేశ భాషలందు తెలుగు లెస్సఅని ప్రాచీన కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.అన్ని భాషల్లోను తెలుగు భాష లెస్స అనేది నేటి మాట.భాషలన్నింటిలోనూ తెలుగు భాష నేర్చుకోవటం చాలా తేలిక.  ఇతర భాషల వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి,తేలిగ్గా నేర్చుకుంటున్నారు.తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా  అందరూ  ఒక్కటే.తెలుగు రచయితలు,భాషాభిమానులతోపాటు ప్రపంచ దేశాలనుండి ఎంతోమంది  అభిమానంతో నేటి నుండి విజయవాడలో జరిగే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యారు.అంతర్జాలంలో తెలుగు సాహిత్యం,తెలుగు లిపి విస్తృతస్థాయిలో గూగుల్ సంస్థ సహకారంతో అందుబాటులోకి వచ్చింది.అందుకు గూగుల్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 

Friday, 20 February 2015

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మాతృభాష మీది మమకారంతో,ఎంతో అభిమానంతో  నా బ్లాగ్ వీక్షించ వచ్చే తెలుగు వారందరికీ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.


పిల్లలతో సరదాగా

                                                        పిల్లలకు కొంత సమయం కేటాయించి వాళ్ళతో సరదాగా గడపటం బాగానే ఉంటుంది కానీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికీ ఒకే సమయం కేటాయించడం వల్ల ఇద్దరితో సరదాగా గడిపినట్లు ఉండదు.అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్కరికి కొంత సమయం కేటాయించడం వల్ల పిల్లలు ఇద్దరూ ఆనందంగా ఉంటారు.వారితో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది.ఏ విషయాన్నయినా చనువుగా,దాపరికంలేకుండా స్నేహితులతో మాట్లాడినట్లుగా పెద్దవాళ్ళతో చర్చించటానికి సంకోచించరు.  

వెంట్రుకలు పొడిబారకుండా .....

                                                   వెంట్రుకలకు తగినంత తేమ అందకపోయినా పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది.
గుడ్డులోని తెల్లసొన,పెరుగు,నిమ్మకాయ కలిపి బాగా గిలకొట్టి తలకు పట్టించాలి.ఇరవై ని.ల తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తుంటే జుట్టుకు తగినంత తేమ అంది అందంగా ఉంటుంది.

మెత్తటి జుట్టుకి .....

                                                       వెంట్రుకలు బిరుసుగా ఉన్నప్పుడు సొరకాయ రసాన్ని తలకు పట్టించి ఒక అరగంటాగి గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి.ఆతరువాత షాంపూతో తలస్నానం చేయాలి.అప్పుడప్పుడు ఇలా చేస్తే
క్రమంగా జుట్టు మెత్తగా మారుతుంది.

బరువు తగ్గటం సులువే

                                                   తీసుకునే ఆహారంలో,జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే బరువు తగ్గటం సులువే.పూర్తిగా అన్నం తినకుండా పండ్లు,కూరగాయలు,మొలకెత్తిన గింజలు సలాడ్ల రూపంలోకానీ లేదా మనకు నచ్చినరీతిలో ఎక్కువగా తినాలి.వెన్నతీసిన పాలుతాగాలి.గుడ్డులోని తెల్లసొన తినాలి.అరగటానికి ఎక్కువ సమయం పట్టే ముడిబియ్యంలో అన్నిరకాల కూరగాయలు వేసి నూనె లేకుండా వండిన అన్నం ,గోధుమరవ్వ,మల్టీ గ్రెయిన్  రవ్వతో చేసిన ఉప్మా,కిచిడీ వంటివి తినాలి.ఇవన్నీ పాటిస్తూనే రోజులో ఒక గంట ఏదో ఒక వ్యాయామం చేయటం మొదలుపెట్టి,కొంతకాలం క్రమం తప్పకుండా ఆచరిస్తే సులువుగా బరువు తగ్గుతారు.    

Thursday, 19 February 2015

కళ్ళు ఎర్రబారితే....

                                            ఒంట్లో వేడి చేసినప్పుడు  లేదా మరే ఇతర కారణం వల్ల కానీ ఒక్కొక్కసారి కళ్ళు మంటలతో పాటు,ఎర్రబారుతుంటాయి.అలాంటప్పుడు నందివర్ధన పువ్వులు కళ్ళ పైన పెట్టుకుంటే వెంటనే పది ని.ల్లో ఎరుపుదనం తగ్గి,కళ్ళు మంటలు తగ్గుతాయి. 

కళ్ళు అలసినప్పుడు...

                                      సరిగా నిద్ర లేకపోయినా,ఎక్కువసేపు టి.వి.ముందు కానీ,కంప్యూటరు ముందు కానీ కూర్చున్నా కళ్ళు అలసిపోతాయి.కీరదోసను చక్రాల్లా తరిగి కళ్ళు మూసుకుని ఒక పది ని.లు పెట్టుకుంటే తక్కువ సమయంలో అలసిన కళ్ళకు స్వాంతన లభించి తాజాగా మారతాయి.

Wednesday, 18 February 2015

అప్పటివరకు ఉంటానో లేదో

                                                     వెంకటేశ్వర రావు గారికి ఎనభై తొమ్మిది సంవత్సరాలు.ప్రభుత్వ ఇంజనీరుగా
చేసి పదవీ  విరమణ చేశారు.ముగ్గురు ఆడపిల్లలు.అందరూ వైద్యవృత్తిలో ఉన్నారు.భార్య లేకపోయినా ఆయన ఎవరిమీద ఆధారపడకుండా పనివాళ్ళను పెట్టుకుని ప్రశాంతంగా వుంటున్నారు.చిన్న కూతురు విదేశాలలో ఉన్నా  తండ్రిని చూడటానికి సంవత్సరానికి రెండుసార్లు వస్తుంటుంది.కూతురు మళ్ళీ వచ్చేవరకు బ్రతుకుతానో లేదో అనే అనుమానం వచ్చింది.ఇంకా రెండు రోజుల్లో కూతురి ప్రయాణం ఉందనగాఅమ్మా!అప్పటివరకు ఉంటానో,లేదో అని   నువ్వు వెళ్ళటానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి అంటూ పూటపూటకి లెక్కలు వేయటం మొదలెట్టారు.ఏమీ కాదులే నాన్నగారూ అవేమీ ఆలోచించకండి అంటూ ధైర్యం చెప్పినా వయసైపోయింది తప్పదు అంటూ బెంగగా మాట్లాడుతుంటే కూతురికి చాల భాదగా ఉంది.వెళ్ళక తప్పదు బాధపడుతూనే దగ్గర ఉన్నవాళ్ళను జాగ్రత్తగా చూచుకోమని చెప్పి బయలుదేరింది.      

లొంగా

                                                                           మంజూష చిన్నప్పుడే తల్లిదండ్రులు విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు కానీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి సందర్భంగా స్నేహితుల పిల్లలకు బట్టలు కుట్టిద్దామని వెళ్ళింది.ఇప్పుడు చాల రకాలు వచ్చినాయి కదా.అక్కడకు వెళ్ళి లొంగా కుట్టాలి అని అడుగుతుంటే వాళ్లకు అర్ధం కాలేదు.ఇంతలో అక్కడకు మంజూష  స్నేహితురాలు వచ్చింది.కుశలప్రశ్నలు అయ్యాక లొంగా కుట్టిద్దామని వచ్చానని చెప్పింది.పిల్లలకు లంగా అంటే పరికిణీ కుట్టిద్దామని వచ్చావా అని వాళ్ళకు ఎలా కుట్టాలో చెప్పింది.హమ్మయ్య నువ్వు కనక రాకపోతే వాళ్ళకు,నాకు కూడా ఇబ్బంది అయ్యేది అని హాయిగా ఊపిరి పీల్చుకుంది మంజూష.ఒక్క అక్షరం తేడాతో ఎంత గందరగోళం సృస్టించావో చూడు నాకు ముందే చెపితే వచ్చేదాన్నిఇంత ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండేది కాదుకదా అంది స్నేహితురాలు.   

చిటుక్కున

                                               విశాలమ్మ ఏడాది మనుమరాలి చేతికున్నగాజులు ఎవరో దొంగిలించారు.విశాలమ్మ తోడుకోడలికి చెయ్యి ఆడింపు అంటే దొంగతనం చేసే అలవాటుంది.ఎవరూ ఆమె తీసేటప్పుడు చూడలేదు కనుకఆమె మీద  అనుమానమున్నా మాట్లాడలేని పరిస్థితి.ఒకరోజు విశాలమ్మ తోడుకోడలితో పాటు అందరూ కూర్చుని ఉండగా ప్రక్కింటి ఆమె అక్కా మనుమరాలి గాజులు పోయినయ్యంటగా?అనేసరికి విశాలమ్మ కడుపుమండిపోయి అవును ఎవరూ తీసారో పసిపిల్ల గాజులు ఆళ్ళ చేతులు విరిగిపోను ,ఆళ్ళ నోరు పడిపోను అంటూ తిట్ల దండకం మొదలెట్టింది.  విశాలమ్మ తిట్లు మొదలెట్టగానే తోడుకోడలు చిటుక్కున అక్కడనుండి లేచి బయటకు వెళ్ళిపోయింది.ఎవరింట్లో ఏదైనా పోయినా ఆమె పనే అని అనుకున్నట్లుగానే ఆమే గాజులు తీసిందని అర్ధమైపోయింది.     

బంగారు కుంకుమ భరిణె

                                                        విద్యావతి కోడలికి పెళ్ళిలో ముప్పైరెండు గ్రాముల బంగారు కుంకుమ భరిణె పెట్టింది.విద్యావతికి మనవడు పుట్టిన ఆనందంలో బంధువులందరినీ పిలిచి భారీగా విందుభోజనాలు ఏర్పాటు చేసింది.వచ్చిన ఆడవాళ్ళకు బొట్టుపెట్టటానికి గొప్పగా బంగారు కుంకుమ భరిణె బయటపెట్టింది.ఎవరి వీలును బట్టి వాళ్ళు వస్తుంటారు కనుక కొంతమందికి బొట్టు పెట్టిన తర్వాత మనవడు ఏడుస్తుంటే కుంకుమ భరిణె వదిలేసి అత్తాకోడళ్ళు లోపలకు వెళ్లారు.మళ్ళీ వచ్చేసరికి కుంకుమ భరిణె మాయమైంది.ఆ సమయంలో పనివాళ్ళు కూడా అక్కడ లేరు.అందరూ బంధువులే.ఎవరినీ ఏమీ అడగలేని పరిస్థితి.ఏమి చేయాలో,ఏమి మాట్లాడాలో తోచని అయోమయంలో పడిపోయారు.కుంకుమ భరిణె పోయిందని కూడా చెప్పుకోలేక,పిలిచి దొంగతనం అంటగట్టారని తిడతారని కక్కలేక,మింగలేక అన్నట్లు విద్యావతి,కోడలు మిన్నకుండిపోయారు.  

దవడ కండరం బిగించి మింగేసేలా ......(పదకొండవ భాగం)

                                                     ఆశకు హద్దు లేదు.ఆశపడటంలో తప్పులేదు కానీ అత్యాశ పడటం మంచిది కాదు.అది మనకు ఎదుటివారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది.ఇప్పుడు వాళ్ళ స్వార్ధం తప్ప ఎదుటివారి ఇబ్బంది గురించి చాలామంది ఆలోచించటంలేదు.ఆమె ఎవరో తెలియక రాణీ మాలినీ దేవిని పెళ్ళి చేసుకుందామని అనుకున్న ప్లీడరు ఆమె ఎవరో తెలిసి అది సాధ్యపడదని అర్ధం చేసుకుని పెళ్ళి చేసుకున్నాడు.గతం గతః అని వదిలేయకుండా తగుదునమ్మా!అంటూ రాణీ మాలినీ దేవి దంపతులను చూడటానికి వచ్చాడు.వచ్చినవాడు చూచి వెళ్ళిపోతే ఈకథ రాయాల్సిన అవసరమూ ఉండేది కాదు.అతని విచిత్రమైన ప్రవర్తనకు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితీ ఉండేది కాదు.విపరీతమైన కోపంతో,ఈర్ష్యతో దవడ కండరం బిగించి మింగేసేలా చూడటం అతని సంస్కార రాహిత్యనికి చిహ్నం.ఇంటికి వచ్చిన తర్వాత రోజూ అలవాటు ప్రకారం అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా ఈవిషయం చర్చకు వచ్చింది.అక్కడే నాతో చెపితే సరిపోయేది కదా అన్నారు ఆమె భర్త.గోటితో పోయేది గొడ్డలి వరకూ ఎందుకు?అని చెప్పలేదు అంది రాణీ మాలినీ దేవి.జమిందారు గారి కోరిక మేరకు రాణీ మాలినీ దేవి పిల్లలు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు కనుక వాళ్ళు అతనికి జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల వల్ల మానసికంగా తేడా ఉండి అలా ప్రవర్తించి ఉంటాడు అని తీర్మానించారు.అయ్యో!పాపం అని జాలిపడి  ఈవిషయాన్ని తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి రాణీ మాలినీ దేవిది.ఎందుకంటే మానసిక రోగి అయినాసరే 35 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుపెట్టుకుని ఆమెపై,ఆమె భర్తపై  కోపంతో రగిలిపోతున్నాడంటే అటువంటి వాళ్ళు ఎప్పుడూ ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కనుక తగుజాగ్రత్తలో ఉండాలని రాణీ మాలినీ దేవి కుటుంబం నిర్ణయించుకుంది.
                                                                            (సమాప్తం) 
        

Tuesday, 17 February 2015

అతి తక్కువ సమయంలో .............

                                    అతి తక్కువ సమయంలో చర్మం తాజాగా,నిగారింపుగా ఉండాలంటే ఒక కోడిగుడ్డులోని తెల్లసొన,ఒక స్పూను తేనె,రెండు స్పూనుల మొక్కజొన్న పిండి కలిపి ముఖానికి పూతలా వేయాలి.పది ని.లు ఆరనిచ్చి చల్లటి నీటితో ముఖం కడగాలి.వెంటనే చర్మం తాజాగా,మెరుస్తూ కనిపిస్తుంది.

మహా శివరాత్రి శుభాకాంక్షలు

                                                                  నా బ్లాగ్ వీక్షించవచ్చిన వీక్షకులకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు
మహా శివరాత్రి శుభాకాంక్షలు.మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నదీ స్నానానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని.ఉపవాసంతో కూడిన జాగరణ చేయగలిగితే ఎంతో మంచిది.అలా వీలుపడని పక్షంలో శివదర్శనం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.గుడికి వెళ్ళటం కూడా కుదరకపోతే మన దైనందిన కార్యక్రమాలతో పాటు ప్రశాంతంగా భగవధ్యానం చేసుకోవటం ఉత్తమం.

Monday, 16 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా ........(పదవ భాగం)

                                                రాణీ మాలినీ దేవి ఇతన్ని ఎక్కడో చూచినట్లుగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంది.ఇతనితో మనకు శత్రుత్వం ఏమీ లేదే అలా  చూడాల్సిన అవసరం ఏముంది?అనుకుని అంతకుముందే
రాణీ విజయలక్ష్మీ దేవి గారు ప్లీడరు గురించి చెప్పి అతని తమ్ముడిని చూపించడం అకస్మాత్తుగా గుర్తొచ్చింది.ఓహో
ఇతను ప్లీడరు అయ్యుంటాడు అనుకుంది.35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కనిపించాడు.ఈసారి కోపంగా దవడ కండరం బిగించి మింగేసేలా రాణీ మాలినీ దేవి భర్త వైపు చూస్తున్నాడు.ఇదంతా తెలియని ఆయన ప్రక్కనేకూర్చున్న తెలిసినాయన మాట్లాడుతుంటే వింటూ భోజనం చేస్తున్నారు.రాణీ మాలినీ దేవి భోజనం చేయడం ఆపేసి మరీ అతన్ని కోపంగా చూస్తుండేసరికి అతని తమ్ముడు ఆవిడ చూస్తుంది అని చెప్పేసరికి తల వంచుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.చదువుకునే రోజుల్లో కూడా ఎవరైనా తన వైపు చూస్తుంటే రాణీ మాలినీ దేవి అలాగే కోపంగా మొహం చిట్లించి చూస్తే తల దించుకుని వెళ్ళిపోయేవారు.ఆ చూపుల్లో సూటిదనం నోటితో మాట్లాడకుండానే ఎదుటివాళ్ళ తప్పుని సరిదిద్దుకునేలా చేసేది.
                                      (ముగింపు తదుపరి పోస్టులో)    

కొబ్బరి తురుము తాజాగా

                              కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి తురిమి నూనె వెయ్యకుండా బాండీలో వేసి
తక్కువ మంట పై అడుగంటకుండా కలుపుతూ నీరు లేకుండా వేయించాలి.చల్లారిన తర్వాత దాన్ని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే నెలరోజులు తాజాగా ఉంటుంది.ఎప్పుడూ కావాలంటే అప్పుడు వేపుళ్ళలో కానీ,కూరల్లో కానీ వేసుకోవచ్చు.  

నాగేంద్ర ప్రదక్షిణ

                                                 వారిజ ఇంటి దగ్గరలో వెంకటేశ్వరస్వామి గుడి ఉంది.ఎంతో మహిమాన్వితమైనది. ఆచుట్టుప్రక్కల వాళ్ళేకాక ఎక్కడెక్కడినుండో స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు.ఆగుడిలో ఒక పెద్దపుట్ట ఉంది.ఆ పుట్టలో నుండి నాగేంద్రుడు రోజు ఉదయం,సాయంత్రం బయటకు వచ్చి గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి పుట్టలోకి అందరూ చూస్తుండగానే వెళ్తుంటారు.మొదట్లో కొంతమందికి ఈవిషయం తెలియక భయంతో కకావికలుగా పాము వచ్చిందంటు ఎటుబడితే అటు పరుగెత్తేవారు.గుడి కట్టినప్పటి నుండి పెద్దపూజారి రోజు చూస్తుండటం వలన భయపడకండి గుడి ఆవరణలోని నాగేంద్రుడే స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి పుట్టలోకి వెళ్తుంటారు.ఒకప్రక్కన నిలబడి నిశ్శబ్ధంగా చూడండి అని చెప్పారు.అప్పటినుండి భయం తగ్గి ఆనోటా ఆనోటా అందరికీ తెలిసి కొంతమంది ఆ సమయానికి చూడటానికి వస్తూ ఉంటారు.  

Sunday, 15 February 2015

చిన్నిచిన్ని పాద ముద్రలు

                                                                         సుప్రీత్ ముచ్చటపడి క్రొత్తగా మార్కెట్ లోకి వచ్చిన స్పోర్ట్స్ బైక్ కొనుక్కున్నాడు.దాన్ని వాళ్ళింటి లోపల పార్కింగు స్థలంలో పెట్టాడు.ఉదయం వచ్చి చూచేసరికి సీటుపైన గీతలుపడి ఉన్నాయి.అక్కడే వడ్రంగి పనులు చేస్తున్న కుర్రాళ్ళని సీటుపైన ఏమి పెట్టారు?గీతలు పడినయి అని గట్టిగా గదమాయించేసరికి మేము ఏమీ పెట్టలేదు.కావాలంటే చూడండి ఇక్కడ చిన్నిచిన్ని పాద ముద్రలు ఉన్నాయి.ఇది పిల్లి పనే.పిల్లి దీనిపైన పడుకుని కాళ్ళతో గీరింది.అందుకే గీతలు పడినాయి అని చెప్పారు.వాళ్ళకు తెలుగు రాదు.వాళ్ళు చెప్పే విధానానికి సుప్రీత్ కి నవ్వొచ్చి సరే మీపనులు మీరు చూచుకోండి అని చెప్పి పిల్లికి కూడా నచ్చింది కాబోలు అనుకున్నాడు.

Friday, 13 February 2015

కుటుంబానికి ప్రాధాన్యత

                                              ఆడవాళ్ళైనా,మగవాళ్ళైనా ఉద్యోగంలో కానీ,వ్యాపారంలో కానీ తీరిక లేకుండా ఉంటున్నారా?అయితే చిన్నచిన్న మార్పులు చేసుకుని కొంత సమయాన్ని కుటుంబానికి  కేటాయించండి. తప్పనిసరిగా రాత్రిపూట అందరూ కలిసి భోజనం చేసేలా ప్రణాళిక సిద్దం చేసుకోండి.అలా వీలుపడకపోతే కనీసం వారంలో రెండు,మూడు రోజులైనా ప్రయత్నించండి.అదీ కుదరకపోతే వారంలో ఒకరోజు మిగతా పనులన్నీ ప్రక్కన పెట్టి పూర్తిగా కుటుంబంతో సరదాగా,సంతోషంగా గడపాలని నిర్ణయించుకుని తప్పని సరిగా   పాటించండి.మీకు,కుటుంబానికి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది.మనసు ప్రశాంతంగా ఉంటుంది. రెట్టింపు ఉత్సాహంతో వారం అంతా పనిచేసుకోగలుగుతారు.సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా కుటుంబం అందరూ కలిసి ఏదోఒక ప్రదేశానికి వెళ్ళి ఒక వారం రోజులు సరదాగా గడిపితే మనసుకి హాయిగా,ప్రశాంతంగా   ఉంటుంది.అత్తమామలు.తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నట్లయితే వీలయినప్పుడల్లా వారితో మాట్లాడుతూ క్షేమ సమచారాలు తెలుసుకుంటూ ఉంటే వాళ్ళకు పిల్లలు దగ్గరలో లేరు అనే బాధ లేకుండా హాయిగా,ప్రశాంతంగా సంతోషంతో ఆరోగ్యంగా ఉంటారు.సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు.అందరికీ అదే వర్తిస్తుంది.   
   

దవడ కండరం బిగించి మింగేసేలా..........(తొమ్మిదో భాగం)

                                మాఘమాసంలో వెంకటేశ్వరస్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు జరిగాయి.జమిందారుగారి కుటుంబాన్ని బ్రహ్మోత్సవాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.మిగిలిన అన్ని రోజులు వీలుపడకపోయినా  మహామాఘి రోజున జరిగే కళ్యాణమహోత్సవంలో తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పటం వలన రాణీ మాలినీ దేవి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.స్వామి,అమ్మవార్ల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది.ఇసుక వేస్తే రాలదేమో అన్నట్లుగా భక్తులు కల్యాణానికి హాజరయ్యారు.ఆసందర్భంగా భక్తులందరికీ భోజన ఏర్పాట్లు చేశారు.
                           కల్యాణంలో పాల్గొన్నదంపతులు తప్పనిసరిగా భోజనం చేయాలి కనుక రాణీ మాలినీ దేవి దంపతులు భోజనం చేయటానికి వెళ్లారు.కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు.స్వామివారిసేవ చేయటానికి అంటే భోజన ఏర్పాట్లు పర్యవేక్షించటానికి,వడ్డన కార్యక్రమాలు లాంటివి ఎవరైనా చేయవచ్చు కనుక ప్లీడరు తమ్ముడు అంతకు ముందే రాణీ మాలినీ దేవిని చూచి ఉండటంవల్ల తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వస్తారని అన్నకు చెప్పి తీసుకువచ్చాడు కాబోలు.రాణీ మాలినీ దేవి దంపతులు ప్రక్కప్రక్కనే కూర్చుని భోజనం చేస్తున్నారు.మధ్యలో తలపైకెత్తేసరికి కొంచెం దూరంలో వీళ్ళిద్దరినీ మార్చిమార్చి చూస్తూ ఇద్దరు కనిపించారు. అందులో ఒకతను చాలాకోపంగా చూస్తూ కనిపించాడు.
                      (తరువాయి భాగం రేపటి పోస్టులో)    

బజ్జీల పిండి మిగిలితే .........

                                            మనం అరటికాయ బజ్జీలు ,బంగాళదుంప బజ్జీలు వేయటానికి పిండి కలిపినప్పుడు బజ్జీలు వేసిన తరువాత ఎంతో కొంత మిగులుతుంటుంది.మిగిలిన పిండిని సహజంగా కడిగేస్తుంటాము.అలా వృధాచేయకుండా దానిలో కరివేపాకు వేసి నూనెలో వేయించితే చాలా రుచిగా ఉంటాయి. 

Wednesday, 11 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా.........(ఎనిమిదవ భాగం)

                                                    రాణీ మాలినీ దేవి అని తెలియక తమ ఇంటి కోడలిని చేసుకుందామని వచ్చిన తల్లిదండ్రులు కానీ,పెళ్ళి చేసుకుందామని కబురు పెట్టిన అబ్బాయిలు కానీ ఎక్కడైనా ఎదురుపడినా పెద్దలైతే మాట్లాడించడంకానీ,వాళ్ళ అబ్బాయిలైతే తల దించుకుని ప్రక్కకు వెళ్ళిపోతుంటారు.అలాంటిది పొట్టివాళ్ళకు పుట్టెడు బుద్దులని ప్లీడరు తమ్ముడు రాణీ మాలినీ దేవి కనిపించిన విషయం తీసుకెళ్ళి వాళ్ళ అన్నకు ఊదినట్లున్నాడు. ఈ ప్లీడరు అందరికన్నా నిదానం, నోట్లో నాలుకలేదని మొదట అనుకున్నారు.ఇతడు మాత్రం తక్కువ ఏముంది?
                             (తరువాయి భాగం రేపటి పోస్టులో)  

ఆస్తమా అదుపులో.....

                                           చలికాలం వచ్చిందంటే చాలు ఆస్తమా ఉన్నవాళ్ళు ఊపిరి ఆడక  పిల్లికూతలు ఎక్కువై ఆయాసపడుతుంటారు.రోజూ రాత్రి పడుకునే ముందు టేబుల్ స్పూను తేనెలో అరస్పూను దాల్చినచెక్క పొడి కలిపి తీసుకుంటే ఆయాసం తగ్గి ఆస్తమా అదుపులో ఉంటుంది. 

Tuesday, 10 February 2015

గుర్తుపట్టలేదయ్యా!

                                                      నితీష్ బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళాడు.అక్కడ ఒక పెద్దావిడ కనిపించి అయ్యా!మొన్న మీ తమ్ముడు మా ఇంటికి వచ్చాడు.చాలాసేపు కూర్చుని తాతగారితో మాట్లాడాడు.మాదగ్గరలోనే ఉన్నారు అని చెప్పింది.అప్పుడు నితీష్ మాతమ్ముడు కాదండీ నేనే వచ్చాను అని చెప్పేసరికి అయ్యో!నేను గుర్తుపట్టలేదయ్యా!ఈమధ్య కంటిచూపు తగ్గింది.ఏమీ అనుకోకు అని చెప్పింది.ఫరవాలేదులెండి. పెద్దవారు ఇందులో అనుకునేదేముంది అన్నాడు నితీష్. 

దవడ కండరం బిగించి మింగేసేలా............(ఏడవ భాగం)

                                                                జమిందారు గారు ఉన్నప్పుడు జీర్ణోద్ధారణలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మించేటప్పుడు,క్రొత్తగా కట్టే ఆలయాలకు ధన రూపేణా,వస్తు రూపేణా ఇచ్చేవారు.ఆయనకు దైవభక్తి ఎక్కువ.రాణీ మాలినీ దేవి కుటుంబం చాలాసంవత్సరాల తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చారు కనుక దైవదర్శనం చేసుకోవటానికి ఆలయాలకు వెళ్ళారు.ఆక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు.ఆలయంలో ఏ పూజ  జరిగినా వీళ్ళ కుటుంబం తప్పనిసరిగా పాల్గొనేది కనుక మీరు ఇక్కడలేని వెలితి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అని కార్తీక మాసంలో ఫలానా రోజు సత్యన్నారాయణ స్వామి వ్రతంలో తప్పనిసరిగా పాల్గొనాలని పట్టుబట్టారు.సరేనని రాణీ మాలినీ దేవి దంపతులు వ్రతంలో పాల్గొన్నారు.వ్రతంలో పాల్గొన్న వారికి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు.భోజనం చేయకుండా రాకూడదు కనుక రాణీ మాలినీ దేవి కుటుంబం భోజనానికి కూర్చున్నారు.ఇంతలో అక్కడ ప్లీడరు తమ్ముడు రాణీ మాలినీ దేవి కనిపించేసరికి ఆమె అవునో కాదో సరిగా గుర్తుపట్టక నాలుగైదు సార్లు కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరిగి రాణీ విజయలక్ష్మి గారితో మాట్లాడుతుండగా చూచి ఆమేనని నిర్ధారణకు వచ్చి మొహం వేలాడేసుకుని ఒకప్రక్కన కూర్చున్నాడు.ఎందుకో అంత బాధ? 
                  (తరువాయి భాగం రేపటి పోస్టులో)   

ముఖంపై నలుపుదనం పోవాలంటే..........

                                              ఎండలు బాగా ఉన్నా,చలిఎక్కువగా ఉన్నాఆ ప్రభావం ముఖంపై పడటం వలన
చర్మం నలుపుదనాన్ని సంతరించుకుంటుంది.ముఖంపై ఉన్న నలుపుదనం పోవాలంటే ఒక కమలా పండు రసంలో
ఒక కారట్ రసం.పెద్ద స్పూను శనగ పిండి కలిపి దాన్ని ముఖానికి,మెడకు పూతలా వెయ్యాలి.ఒక10 ని.ల తర్వాత
చల్లటి నీళ్ళతో కడగాలి.ఇలా రోజు చేస్తుంటే చర్మంపైనున్న నలుపు తగ్గిపోతుంది.

Monday, 9 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా ............(ఆరవ భాగం)

                                                    సంతోషంగా కాలం గడిచిపోతున్న సమయంలో జమిందారు గారికి అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు వచ్చి ఆసుపత్రికి వెళ్ళే సమయం కూడా లేకపోవడంతో పరమపదించారు.ఈ హఠాత్పరిణామనికి అందరూ నివ్వెరపోయారు.అందరి మధ్య సంతోషంగా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాయన ఇక లేరు అనుకునేసరికి బాధతో అందరి హృదయాలు బరువెక్కాయి.రాణీ విజయలక్ష్మీ దేవిగారి సంగతి చెప్పనవసరం లేదు.ఆమె ఈ విషయాన్ని జీర్ణించుకోలేక సతమతమై చిక్కిశల్యమయ్యారు.రాణీ మాలినీ దేవికి బాధగా ఉన్నా తల్లిని కూడా ఆబాధ నుండి బయట పడెయ్యాలి కనుక గుండె దిటవు చేసుకుని అమ్మ గారికి స్వాంతన వచనాలతో ధైర్యం చెప్పటం మొదలు పెట్టింది.మనుమడు,మనుమరాలు వైద్య వృత్తి చేపట్టి ప్రత్యేకంగా పేదప్రజలకు కూడా సేవచేయాలని జమిందారుగారి సత్సంకల్పం.అందుకని ఆయన కోరిక మేరకు వైద్య వృత్తిని స్వీకరించి జమిందారుగారి సంకల్పం నెరవేర్చాలనే ప్రయత్నంలో ఉన్నారు.జమిందారు గారి జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో స్థల మార్పిడి కోసం రాణీ విజయలక్ష్మీ దేవిగారిని తీసుకుని అందరూ విదేశాలకు వెళ్లారు. మరల ఒక పది సంవత్సరాల తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చారు.జమిందారుగారు లేని లోటు తీర్చలేక పోయినా తిరిగి ఆ ఇంట పూర్వపు వైభవం చోటుచేసు కున్నందుకు అందరూ సంతోషించారు.
                   
              (తరువాయి భాగం రేపటి పోస్టులో)




కళ్ళు పొడిబారకుండా ...........

                                                శీతాకాలంలో చలికి కళ్ళు పొడిబారినట్లు అనిపిస్తుంటాయి.చాలామంది చల్లగా ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువగా త్రాగరు.ఏ కాలమైనా ముఖ్యంగా చలికాలంలో తగిన నీటిని తీసుకోవాలి.తరచూ కళ్ళు
కడుగుతూ ఉండాలి.కొబ్బరినీళ్ళల్లో ముంచిన దూదితో మూసిన కనురెప్పలపై అద్దాలి.5 ని.ల తరువాత చల్లటి నీళ్ళతో కడిగితే కళ్ళు పొడిబారకుండ ఉంటాయి.

Saturday, 7 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా.........(ఐదవ భాగం)

                                                          రాణీ మాలినీ దేవి చదువు పూర్తయ్యేటప్పటికి జమిందారుగారు పెళ్ళి సంబంధాల వేటలో పడ్డారు.ఆయన ఎంత అపురూపంగా పెంచుకున్నారో అదే విధంగా వచ్చే అల్లుడు కూడా  చూచుకోవాలనే  ఉద్దేశ్యంతో చుట్టుప్రక్కల ఊళ్ళన్నీ జల్లెడ పట్టి గాలించిన విధంగా వెదికి,ఎన్నోరకాలుగా పరీక్షించి ఎట్టకేలకు ఒక సంబంధం కుదుర్చుకున్నారు.ఎలాగైతేనేం ఆయన అనుకున్న విధంగానే మంచి వరుడు దొరికాడు.జమిందారుగారు రంగరంగ వైభవంగా రాణీ మాలినీ దేవి వివాహం జరిపించారు.ఏ తల్లిదండ్రులైనా తామెంత అపురూపంగా పెంచామో అంతకన్నా బాగా చూచుకోగలిగే భర్త కూతురికి లభించాలని కోరుకుంటారు.అలాగే జమిందారుగారు ముందుగా అనుకున్నట్లుగానే రాణీ మాలినీదేవికి మంచి భర్త లభించాడు.అనతికాలంలో ఆఇంట బుల్లి రాణీ,బుల్లి రాజావచ్చి వాళ్ళ ముద్దుమురిపాలతో,ఆటపాటలతో ఇల్లంతా సందడి చేస్తుండగా అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు.
                     (తరువాయి భాగం రేపటి పోస్టులో )
 

ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశమే తేలిక

                                        ఈశ్వరరావు డిగ్రీ చదువుకున్న మోతుబరి రైతు.వ్యవసాయం గురించి,రాజకీయాల గురించి,చదువులు గురించి ఏవిషయం మీదైనా అనర్గళంగా మాట్లాడతాడు.ఎదుటివారు అతనివల్ల  ఏదైనా సహాయం కావాలంటే ఆపని పూర్తయ్యే వరకూ ఉండి మరీ చేసి పెడతాడు.కూలీలు కావాలన్నా,డబ్బు అప్పు కావాలన్నా నిమిషాల మీద ఏర్పాటు చేస్తాడు.పైపనులు (బూజు దులపటం,ఇల్లు శుభ్రం చేయడం లాంటివి)  చేయటానికి ఇద్దరు కూలీలు కావాలని ఫోను చేశారు.అప్పుడు ఆయన ఈరోజుల్లో ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సంపాదించడమే తేలిక.పై మనుషులు దొరకటం చాలా కష్టంగా ఉంది అని చెప్పాడు.

అరటిపండుతో కీళ్ళనొప్పులు మాయం

                                               ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా కీళ్ళనొప్పులు వస్తున్నాయి.అరటిపండు కీళ్లనొప్పుల్నీ,మంటల్నీ తగ్గిస్తుంది.ఈసమస్యతో బాధపడేవారు అరటిపండు ఎక్కువగా తింటే కీళ్ళనొప్పులు మాయమౌతాయి.మధుమేహం ఉన్నవారు మాత్రం అరటిపండు తినగూడదు.లేనివాళ్ళు వయసు పైబడుతున్న కొద్దీ అరటిపండు ఎంత తింటే అంత మంచిది.మలబద్దకం లేకుండా చేస్తుంది.అనారోగ్యాల బారిన పడకుండా చూస్తుంది. 

Friday, 6 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా.........(నాలుగవ భాగం)

                                  వీళ్ళే కాక జమిందారుగారి దగ్గరకు 4,5 గురు మగపిల్లల తల్లిదండ్రులు వచ్చి అడిగితే మొదటివాళ్ళకు చెప్పిన సమాధానమే మిగతావాళ్ళకు చెప్పారు.నొప్పించక తానొవ్వక అన్నట్లుగా వచ్చిన అందరికీ
బాధ కలుగకుండా ఉండే విధంగా చక్కగా వివరించి చెప్పారు.
                                     ఈలోపు మొదటగా కబురు పంపించిన ప్లీడరు తల్లిదండ్రులు కొడుకుకు  నచ్చచెప్పి  చుట్టాల్లో అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశారు.దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల తర్వాత అనారోగ్యంతో ప్లీడరు భార్య చనిపోయింది.వీళ్ళకు పిల్లలు కూడా కలగలేదు.కూతురు చనిపోయిన దుఖంలో నుండి బయటపడటం కష్టంగా ఉండి అల్లుడిని వాళ్ళదగ్గరే ఉండాలని కోరటం వల్ల అత్తారింట్లో ఉండిపోయాడు.అత్త చెల్లెలి కూతుర్నిమాట్లాడి అల్లుడికి రెండవ పెళ్ళి చేశారు.కాలక్రమంలో ఇద్దరు పిల్లలు కలిగి బాగానే ఉన్నారు.చెల్లెలి కూతుర్లో తన కూతుర్ని చూచుకుని ఆపిల్లల ఆలనా పాలనా చూస్తూ అందరూ కలిసిమెలిసి ఉన్నారు.
               (తరువాయి భాగం రేపటి పోస్టులో)     

మెంతికూర మహిళలకు ఎంతో మంచిది

                                            మెంతికూర ఎవరైనా వారంలో కనీసం 4,5 సార్లన్నాతింటే ఎంతో మంచిది.ఇనుము అధికంగా ఉండటంతోపాటు,మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. ఎన్నో పోషకాలతో కూడిన మెంతికూర
మహిళలకు ఎంతో మంచి చేస్తుంది.నెలసరికి ముందు,తర్వాత వచ్చే కడుపునొప్పి ఇతరత్రా ఇబ్బందులు త్వరగా తగ్గిపోతాయి.గర్భిణులు ఎంత ఎక్కువగా తీసుకుంటే శిశువు ఎదుగుదలకు అంత మంచిది.బాలింతలు తింటే మంచిది.మెనోపాజ్ లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్దీకరిస్తుంది.ఒత్తిడిని దూరం చేస్తుంది.నీరసం పోగొట్టి తక్షణ శక్తిని అందిస్తుంది.ఇన్ని ఉపయోగాలున్న మెంతి కూర తినటంలో ఆలస్యమెందుకు?ఈరోజు నుండే మొదలుపెడితే ఎంతో మంచిది. 

Thursday, 5 February 2015

గోంగూర గుండెకు మేలు

                                            ఇనుము అత్యధికంగా ఉండే ఆకుకూరల్లో గోంగూర ఒకటి.ఇది ఎర్రరక్త కణాలను వృద్ధిచేసి రక్తహీనతను దూరం చేస్తుంది.ఇనుము అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేయటంలో కీలకపాత్ర పోషించి గుండెకు మేలు చేస్తుంది.సి విటమిన్ వుడటంవల్ల రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.శరీరంలోని నీటిశాతాన్ని క్రమబద్దీకరిస్తుంది.ఒత్తిడిని తగ్గిస్తుంది.గోంగూర తరచూ తీసుకోవటం వల్ల కంటి సమస్యలు రావు.గోంగూర ఏదోఒక
రూపంలో తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు  శరీరానికి అంది కాన్సర్ కారకాలతో పోరాడతాయి.మూత్రపిండాలు శుభ్రపడతాయి.రాళ్ళు ఉంటే వైద్యుని సలహాతో తీసుకోవాలి.రక్తపోటును నియంత్రిస్తుంది.మొత్తం మీద గోంగూర సకల పోషకాలగని. 

దవడ కండరం బిగించి మింగేసేలా.......(మూడవ భాగం)

                                           జమిందారుగారికి విపరీతమైన కోపంవచ్చి ఆవేశంతో ఊగిపోతూ మా అమ్మాయిని
ఇవ్వమని అడగటానికి ఎంత ధైర్యం?అంటూ అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు.మధ్యలో వచ్చిన పెద్ద మనిషి ఆయన్ను శాంతపరచే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది.మీరు అన్యధా భావించకండి.విషయం చెప్పి మీకు అభ్యంతరం లేకపోతే ఆలోచించి మీ అభిప్రాయం చెప్పమన్నారని చెప్పారు.ఆలోచించనవసరం లేదు.రాణీ మాలినీ దేవికి చదువు పూర్తయ్యే వరకూ వివాహం జరిపించే యోచనలేదని చెప్పండి.మీరు ఇక దయచేయవచ్చుఅని  జమిందారుగారు నిర్మొహమాటంగా,నిక్కచ్చిగా చెప్పారు. 
               (తరువాయి భాగం రేపటి పోస్టులో)

కడుపు ఉబ్బరంగా లేకుండా ఉండాలంటే ......

                                                                        కడుపు ఉబ్బరంగా లేకుండా ఉండాలంటే పీచు ఎక్కువగాఉండే పండ్లు,కూరగాయలు,పొట్టుధాన్యాలు,ద్రవపదార్ధాలుఎక్కువగా తీసుకోవాలి.రోజుకు కనీసం 2 లీ.మంచినీళ్ళు త్రాగాలి.
వారంలో 5 రోజులు 1/2 గంట వ్యాయామం చేయగలగాలి.చూయింగ్ గం నమలటం వల్ల పొట్టలోపలికి గ్యాస్ చేరి కడుపుబ్బరం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.సాద్యమైనంత వరకూ నమలకపోవటమే మంచిది.సమయానికి భోజనం చేయాలి.రోజు కనీసం 25 గ్రా.ల పీచు శరీరానికి అందేలాగా చూచుకొంటే కడుపుబ్బరం సమస్య రాకుండా ఉంటుంది. 

లెదర్ బాగ్ పై ఇంకు మరకలు పోవాలంటే.........

                                   లెదర్ బాగ్ పై ఇంకు మరకలు పడినప్పుడు వెనిగర్ లో కొంచెం వంటసోడా కలిపి మెత్తటి వస్త్రంతో మరకపై రుద్దాలి.ఆరాక ఆలివ్ నూనెలో ముంచిన దూదితో బాగ్ ను తుడిస్తే సరికొత్త దానిలాగా మెరుస్తుంది.

Wednesday, 4 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా.......(రెండవ భాగం)

                                రాణీ మాలినీ దేవి జమిందారుగారి అమ్మాయని తెలియగానే మనబ్బాయికి ఇవ్వమని అడగటం బాగుండదని చెప్పినా ఒకసారి వెళ్ళి మాట్లాడండి.మనం ఏవేవో ఉహాగానాలు చేసేకన్నా వాళ్ళింటికి వెళ్ళి మేము కబురు పంపినట్లుగా చెప్పమని చెప్పారు.ఏ సమాధానము వచ్చినా ఫరవాలేదు అని చెప్పారు.సరేనని భయపడుతూనే పెద్దాయన స్నేహితులను తీసుకుని వెళ్ళాడు.నసుగుతూనే ఉన్న విషయం చెప్పారు.అనుకున్నట్లుగానే చుక్కెదురైంది. 
               (తరువాయి భాగం రేపటి పోస్టులో)           

అద్భుతం

                                      ఈ సంవత్సరము అంటే 2015 లో ఫిబ్రవరి నెలలో 4 ఆదివారములు,4 సోమవారములు, 4 మంగళవారములు,4 బుధవారములు,4 గురువారములు,4 శుక్రవారములు,4 శనివారములు వచ్చాయి.ఇలా రావటం అద్భుతమైన విషయం.ప్రతి 823 సంవత్సరములకు ఒకసారి మాత్రమే ఇలా వస్తుంటాయట.

Tuesday, 3 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా......(మొదటి భాగం)

                                         ఇది నిజంగా 35సంవత్సరాల క్రితం జరిగిన యదార్ధ గాథ మరియు ప్రస్తుత సంఘటన.
రాణీ మాలినీదేవి పేరుకు తగినట్లుగానే అందమైన,జమిందారీ వంశానికి చెందిన ఏకైక గారాబు బిడ్డ.కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా తల్లిదండ్రులు,వాళ్ళ తల్లిదండ్రులు,పరివారము కూడా క్రింద దించే వాళ్ళు కాదు.రాణీ మాలినీ దేవి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ అందంతో పాటు తెలివికలది కనుక చదువులో కూడా రాణించటం మొదలెట్టింది.ఆమెను ఇంట్లోవాళ్ళేకాక ఊరివారందరు కూడాఎంతో ఇష్టపడేవాళ్ళు.కళాశాలకు చాలా నిరాడంబరంగా
ఫలానా అని తెలిసినవాళ్ళెవరయినా చెబితే తప్ప తెలియనంత సాదాసీదాగా వెళ్ళి వస్తుండేది.ఎందుకంటే రాణీమాలినీ దేవి తల్లి రాణీ విజయలక్ష్మీ దేవికి తన అందమైన కూతుర్నిఎవరైనా మోహిస్తారేమోనని భయం.
                                    అనుకున్నట్లుగానే ఒకసారి ప్రక్క ఊరి ప్రెసిడెంటుగారబ్బాయి ప్లీడరు చూచి మామూలు అమ్మాయనుకుని ఇష్టపడి ఫలానా ఊరిలో అమ్మాయి నచ్చింది.మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం జరిపించమని అమ్మానాన్నలకు చెప్పాడు.మా అబ్బాయికి ఇన్నాళ్ళకు నచ్చినమ్మాయి దొరికింది కదా అనుకుని సంబరపడి వీళ్ళఊరివాళ్ళు కనిపిస్తే మీఊరిలో అందమైన అమ్మాయి చదువుకోవటానికి రోజు కళాశాలకు వెళ్తుందట.కొంచెం ఎవరో కనుక్కుని మా అబ్బాయికి పెళ్ళి సంబంధం కుదర్చమని చెప్పారట.మొదట వాళ్ళకు అర్ధంకాలేదు.అందరినీ అడగ్గా అడగ్గా చివరికి ఫలానా జమిందారుగారమ్మాయని తెలిసింది.
                                                                                                (తరువాయి భాగం రేపటి పోస్టులో)

మొగుడికి కూడు పెడతన్నావా?

                                            యవనిక పెళ్ళయి రెండున్నరేళ్ళు అయింది.అయినా వంట చేసుకోకుండా ఏదో ఒకటి తను తిని భర్తకు కూడా అలాగే పెట్టేది.భోజనం చేద్దామనిపించినప్పుడు స్నేహితులఇంటికో,బంధువులఇంటికో ముందుగా వస్తున్నామని చెప్పకుండా ఆసమయానికి వెళ్ళేవాళ్ళు.అలా వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా  అలవాటు.ఒకసారి అమ్మమ్మ ఇంటికి వచ్చింది.తనకు నచ్చనిది ప్లేటులో పెట్టిందని అమ్మతో పెద్దగా పోట్లాట వేసుకుంది.ఇంతలో అమ్మమ్మ ఏమే ఇప్పుడైనా నీ మొగుడికి కూడు పెడతన్నావా?లేదా?అని అడిగింది.తోక తొక్కిన తాచుపాములా  లేచి బుసలు కొడుతూ నీకు నన్ను అడిగే అర్హత లేదు.నా మొగుడికి కూడు పెట్టేది,లేనిదీ నాకు సంబందించిన విషయం అంటూ పెద్దగా అరవటం మొదలుపెట్టింది.అమ్మ,అమ్మమ్మ చేష్టలుడిగి ఏమి మాట్లాడాలో తెలియక  గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.ఇంతకీ ఆపిల్ల పెళ్ళి చేసిందే అమ్మమ్మ.హతోస్మి.   

ఎక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలో ........

                                    పల్లెలకు వెళ్ళినప్పుడు అచ్చు వాళ్ళలా బట్టలు వేసుకోకపోయినా పొందికగా,ఎబ్బెట్టుగా లేకుండా వేసుకుంటే ఎదుటి వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.కొంతమందికి ఎప్పుడు,ఎక్కడ,ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తెలియదు.ఒకవేళ తెలిసినా కావాలని అలా వేసుకుంటారేమో మనకు తెలియదు.రవళిక పెళ్ళయి భర్త ఉద్యోగరీత్యా బొంబాయిలో ఉంటుంది.మొదటిసారి పుట్టింటికి పల్లెకు వచ్చినప్పుడు పగలు,రాత్రి కూడా చిన్నచిన్న నిక్కర్లు,పలుచగా ఉన్నచొక్కాలు వేసుకుని రోడ్లన్నీతిరిగింది.దారిన పోయేవాళ్ళందరూ ఆగి మరీ విచిత్రంగా చూస్తున్నారు.ఎవరినైనా అయితే అమ్మాకూతుళ్ళు 32పళ్ళు బయటబెట్టి మరీ పెద్దగా నవ్వేవాళ్ళు. మేనమామ,భార్య విదేశాల నుండి వస్తే చూడటానికి వచ్చింది.వాళ్ళ ఎదుట జానెడు నిక్కరు,జానాబెత్తెడు చేతులు లేని టీషర్టు వేసుకుంటే వాళ్ళు కూడా వింతగా ఎటు వెళ్తే అటే చూస్తున్నారు.వాళ్ళను చూచి వెళ్దామని వచ్చేవాళ్ళకు కూడా వినోదం,కాలక్షేపం.అంత అవసరమా?ఏంటో?కలికాలం.  

ఈకాలం ఆకాలం అనే భేదం లేకుండానే ........

                                           చలికాలంలో కాళ్ళు,చేతులు పగలటం సర్వ సాధారణం.ఈకాలం ఆకాలం అనే భేదం లేకుండానే కొందరికి కాళ్ళు పగిలి ఇబ్బంది పెడుతుంటాయి.అటువంటప్పుడు బాగా పండిన బొప్పాయి గుజ్జులో
ఒక స్పూను తేనె,ఒకస్పూను వేపాకులపొడి కలిపి దాన్ని పాదాలకు పూతలా వేయాలి.15 ని.ల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడిగేయాలి.ఇలా చేస్తుంటే పాదాలు నునుపుగా తయారవుతాయి.   

Monday, 2 February 2015

వేపాకుతో చుండ్రు మాయం

                                                  వేపాకులోని ఔషధ  గుణాలు  జుట్టు సంరక్షణకు ఎంతో ఉపయోగ పడతాయి. చుండ్రు సమస్య ఈకాలంలో చాలామందిలో కనిపిస్తుంటుంది.వేపాకులపొడిలోసరిపడా పాలు కలిపి ఒక 5 ని.లు నానబెట్టాలి.దాన్ని తలకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు త్వరగా  మాయమౌతుంది.ఇలా రోజు విడిచి రోజు చేస్తే చుండ్రు సమస్య దూరమౌతుంది.
గమనిక :వేపాకుల పొడి ఇంట్లో స్వంతంగా తయారు చేసుకోవాలంటే వేపాకులు తెచ్చి తడిలేకుండా నీడలో ఆరబెట్టాలి.ఆకు గలగలమంటూ ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.ఇలా తాజా వేపాకు పొడి ఇంట్లోనే  తయారుచేసుకోవచ్చు.

చొత్తు కూర

                                                     సుశీల ఇంటికి వాళ్ళ ఆడపడుచు పిల్లలను తీసుకుని రెండు రోజులు ఉండి వెళదామని వచ్చింది.ఉద్యోగ రీత్యా బదిలీపై వాళ్ళు చాలా దూరప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది.తెలుగు భాష మాట్లాడినా కొన్ని మాటలు అర్ధం చేసుకోలేమని సుశీలకు చెప్పింది.ఆక్రమంలోనే ఒకామె చపాతీలోకి చొత్తు కూర చేశాననని చాలా బాగుంటుందని చెప్పింది.అది ఎలా చేస్తారో చెప్పమనగానే ఈ క్రింది విధంగా చెప్పటం మొదలెట్టింది.
                 ముల్లంగి -3,టొమాటో - 5,ఉల్లిపాయలు - రెండు,పచ్చిమిర్చి - 5,ఉప్పు - సరిపడా,కారం-2 లేక 3 స్పూన్లు,చింతపండు  - కొంచెం,బెల్లం - కొంచెం,నూనె -కూరకు సరిపడా ,తాలింపు దినుసులు,కరివేపాకు,కొత్తిమీర
                                         ముందుగా చిన్న కుక్కర్ లో నూనె వేసి, తాలింపు దినుసులు కరివేపాకు వేసి వేగాక
ఉల్లి,పచ్చిమిర్చి,ముల్లంగి ముక్కలు వెయ్యాలి.కొంచెం వేగాక టొమాటో ముక్కలు,ఉప్పు,కారం వేసి కొంచెం వేగిన తర్వాత చింతపండు చిక్కగా పులుసు పిండి,బెల్లం కూడా వేసి మూతపెట్టి మూడు కూతలు రానివ్వాలి.స్టవ్ కట్టేసి మూత వచ్చిన తర్వాత 2 ని.లు ఇగరనిచ్చి దించేయాలి అని చెప్పింది.అందరికీ నచ్చాలని లేదు.మాకూ చాలా ఇష్టం
అని చెప్పింది.ఒకసారి ప్రయత్నించి నచ్చితే వండుకోవచ్చు.మనం దీన్ని ముల్లంగి,టొమాటో కూర అంటాము.వాళ్ళు చొత్తు కూర అంటున్నారు అంతే తేడా.

Sunday, 1 February 2015

అగస్త వార్త

                                                  రంగమ్మ రేఖ ఇంట్లో పనిమనిషి.ఈమధ్య ఎక్కువగా మానేయటం   మొదలెట్టింది.ఏంటి ఎక్కువగా పనికి రావట్లేదని అడిగితే ఊరు వెళ్ళాను అనిచెప్పి ఇకనుండి మాననమ్మా మాఊరు నుండి ఏదన్నా అగస్త వార్త వచ్చి తప్పనిసరయితే తప్ప వెళ్ళను అని చెప్పింది.అంటే ఏమిటయ్యా అంటే ఎవరైనా చనిపోయారన్నవార్తను వాళ్ళలా అంటారట.విచిత్రం. 

తియ్య కందో,దురద కందో

                                                 రాధిక ప్రక్కింటి పెరటిలో కందమొక్క మొలిచి పెద్ద దుంప అయింది.దాన్ని త్రవ్వి తలా కొంచెం ఇరుగుపొరుగు వాళ్ళకు ఇచ్చారు.ఆమె రాధికకు ఇచ్చేటప్పుడు అమ్మా ఇది తియ్య కందో,దురద కందో
తెలియదు చూచి వండుకోమని  చెప్పింది.రాధికకు అది ఎలా వండాలో కూడా తెలియదు.అప్పటికీ ఇచ్చినామెను ఎలా వండుకోవాలి అని అడిగితే నాకు కూడా తెలియదని చెప్పింది.కంద పులుసు ఎప్పుడో ఒకసారి తిన్నట్లు గుర్తు.చాలా బాగుందని వండుదామని అది తియ్యగా ఉందో లేదో చూద్దామని కొంచెం నోట్లో వేసుకుంది.అది నోట్లో వేసుకోకూడదన్న విషయం కూడా తెలియదు.నోరంతా ఎర్రగా పొక్కిపోయి మాట కూడా రాలేదు.సమయానికి ఎవరూ ఇంట్లో లేరు.మజ్జిగ తాగమని ఎవరో చెబితే మజ్జిగ తాగినా తగ్గలేదు.భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్తే చాంతాడంత మందుల చీటీ చేతిలో పెట్టారు.వారం రోజులకు గానీ మాములు గొంతు రాలేదు.హమ్మయ్య,ఈమె కంద మాట దేముడెరుగు చాలా ఇబ్బంది పడ్డాను.ఇంకెప్పుడు తెలిసీతెలియని పనులు చేయకూడదని నిర్ణయించుకుంది.