రంగారావు గారికి భగవంతుని సన్నిధిలో చనిపోవాలనే ఒక విచిత్రమైన కోరిక ఉండేది.భగవంతుని సంకల్పంతో ఆయన కోరిక తీరింది.అదెలాగంటే భార్యాభర్తలిద్దరూ ఈమధ్య మనుమరాలి మొదటి పుట్టినరోజుకి అమెరికా వెళ్ళి వచ్చారు.వచ్చిన తర్వాత బాబా జీవిత చరిత్ర పారాయణం చేసుకుని ఆఖరి రోజు బాబాని దర్శనం చేసుకుని ఇద్దరూ తిరుపతి వేంకటేశ్వరుని దర్శనార్ధం ఉదయమే బయలుదేరి వెళ్లారు.వెళ్ళిన తర్వాత రంగారావు గారికి తిరుపతి వెళ్ళిన ప్రతిసారి మెట్లెక్కి శ్రీవారి పాదాలను దర్శనం చేసుకుని కొండమీదికి వెళ్ళటం అలవాటు.ఈసారి కూడా అలాగే వెళ్దామంటే భార్య నడవలేనంది.సరే నువ్వు బస్సులో వెళ్ళమని తిరుమలకు బస్సు ఎక్కించి తాను మాత్రం నడిచే వస్తానని చెప్పారు.ఆమె రెండుసార్లు ఫోను చేస్తే మాట్లాడారు కానీ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోను రింగు అవుతుంది కానీ భర్త మాట్లాడక పోయేసరికి కంగారు పడింది.చెయ్యగా చెయ్యగా మెట్లదారిలో కొండపైకి నడిచి వెళ్ళేవాళ్ళు చూచి ఎవరో మెట్ల మీద పడిపోయున్నారు ఫోను అదేపనిగా రింగవుతుందని చూచేసరికే ప్రాణం పోయింది.అదే విషయం ఫోనులో భార్యకు చెప్పారు.ఆమె ఏడ్చుకుంటూ అంత బాధలో ఉండి కూడా ధైర్యంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని భర్త శవాన్ని తిరుపతి నుండి స్వగ్రామానికి తీసుకొచ్చింది.ఉదయం సంతోషంగా భార్యాభర్తలిద్దరూ వెళ్ళి అర్ధరాత్రికి ఆవిధంగా ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇరుగుపొరుగువారు,బంధువులు కూడా మ్రాన్పడిపోయారు.భగవంతుని సన్నిధిలో చనిపోవాలనే రంగారావుగారి చిరకాల వాంఛ తీరిందనుకోవాలో లేక ఆవిధంగా జరిగినందుకు బాధపడాలో అకస్మాత్తుగా నిద్రలో మేల్కొన్న వాళ్ళకు ఒక్క క్షణం అర్ధంకాలేదు.
No comments:
Post a Comment