పుట్టినరోజునాడు,పెళ్ళిరోజునాడు నాకు అసలు గుర్తుండదు.పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత నుండి వాళ్ళు శుభాకాంక్షలు తెలియచేస్తే అప్పుడు గుర్తువస్తుంది.ఈరోజు లాప్ టాప్,ఐపాడ్ తీసి గూగుల్ పేజి రాగానే స్వీట్లు,కేకు,కొవ్వొత్తులు,రవికలముక్క,పసుపు,కుంకుమ,గంధం,పువ్వు,పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ పంపినట్లుగా వచ్చినాయి.అంతకుముందే పిల్లలు శుభాకాంక్షలు చెప్పారు కనుక నాకోసం కాదుకదా!అయినా నాకు ఎందుకు వస్తుందిలే?ఈరోజు ఎవరి పుట్టినరోజో చూద్దామని చూచేసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంద్రాణి!అని వచ్చేసరికి ఆశ్చర్యం,ఆనందం రెండు ఒకేసారి ముప్పిరిగొనగా భలే!భలే!అని చిన్నపిల్లలా ఆశ్చర్యానందాలతో గెంతులు వేయాలనిపించింది.కాసేపటికి ఆశ్చర్యానందం నుండి తేరుకుని ఆనందోత్సహంతో దాన్ని ఫోటో తీసి గూగుల్ వాళ్ళు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్టారొహో!అని అమ్మకు,పిల్లలకు పంపాను.తర్వాత ముఖపుస్తకం తెరవగానే గాలిబుడగలతో పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంద్రాణి!అని వచ్చింది.చాలా సంతోషం అనిపించింది.ఏదిఏమైనా గూగుల్,ముఖపుస్తకం శుభాకాంక్షలు తెలియచెప్పడం ఈరోజు నాకు గొప్ప మధురానుభూతిని మిగిల్చింది.అందుకే నాబ్లాగ్ ద్వారా ఈవిధంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
No comments:
Post a Comment