Thursday, 29 January 2015

మంచి అలవాట్లు

                                     పిల్లలు మైనపుముద్ద లాంటివారు.మనం ఎలా మలిస్తే అలాగే తయరవుతారు.చిన్నప్పటి నుండి వాళ్లకు మంచి అలవాట్లు నేర్పిస్తే పెద్దయిన తర్వాత వారికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి.పిల్లలు తినే చాక్లెట్,బిస్కట్ కాగితాలు,చిత్తు కాగితాలు,పెన్సిల్ పొట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తడబ్బాలో వేయటం
అలవాటు చేయాలి.పిల్లలకు నీళ్ళంటే చెప్పలేనంత ఇష్టం.వదిలేస్తే నీళ్ళతో ఎంతసేపైనా ఆడతారు.మొహం కడిగినా పళ్ళు తోముకుంటున్నా,స్నానం చేస్తున్నా వృధా చేయకుండా అవసరమైనన్ని మాత్రమే వాడుకోమని,నీళ్ళను పొదుపుగా వాడమని చెప్పాలి.అలాగే చెట్లు,మొక్కలు మనకు కాయలు,పండ్లు ఇవ్వటమేకాక,మంచి గాలితోపాటు పర్యావరణాన్ని కాపాడతాయి కనుక వాటికి రోజు నీళ్ళు పోయాలని సూచించాలి.ఇంటిదగ్గర స్థలం ఉంటే సరే లేకపోతే కుండీలలో వాళ్ళతో మొక్కల్నినాటించి నీళ్ళు పోయించాలి.అవి పెరిగి పెద్దయి పువ్వులు,పండ్లు ఇస్తే మనకు ఎంత సంతోషమో వారికీ అర్ధమవుతుంది.గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు,లైట్లు,టి.వి,కంప్యూటరు స్విచ్ తీసేయటం వంటివి నేర్పించాలి.కాగితం సంచులు,జనపనార సంచులు వాడటం అలవాటు చేయాలి.పెద్ద పిల్లలయితే ప్రతిదానికి బండి వేసుకెళ్ళకుండా సైకిల్ కానీ,నడిచికానీ వెళ్లేలా ప్రోత్సహించాలి.వీలయినంతవరకూ ఎవరిపనివారే చేసుకునేలా  ప్రోత్సహించాలి.బయటనుండి రాగానే శుభ్రంగాకాళ్ళు,చేతులు కడిగేలాచూడాలి.పెద్దలను గౌరవించాలని, ఎవరిని పడితే వారిని ఏది పడితే అది మాట్లాడి బాధ పెట్టకూడదని చెప్పాలి.క్రమంగా వాళ్ళే అలవాటుపడతారు.  

No comments:

Post a Comment