Thursday, 4 June 2015

అమ్మ కుండ - అత్త కుండ

                                                  వేదవతి చిన్నప్పుడు కోతికి శిక్షణ ఇచ్చి ఇంటింటికి డబ్బులకోసం వచ్చేవాళ్ళు. శిక్షకుడు అడిగినవాటికి రకరకాల  హావభావాలు ముఖంపై చూపిస్తూ సైగలద్వారా కోతి ఏది చేయమంటే అది చేసేది.
పిల్లలు,పెద్దలు అది చేసే పనులను చూచి ముచ్చటపడి తోచినంత ఇచ్చేవాళ్ళు.అందులో భాగంగా రెండు చిన్నచిన్న మట్టికుండల్లో  కొద్దిగా నీళ్ళుపోసి కోతికిచ్చి ఇది అమ్మ కుండ,ఇది అత్త కుండతీసికెళ్ళి అక్కడ పెట్టి రమ్మంటే నెత్తి మీద పెట్టుకుని అమ్మ కుండ జాగ్రత్తగా తీసికెళ్ళి గోడపక్కన పెట్టేది.అత్త కుండను కొద్ది దూరం తీసికెళ్ళి క్రింద పడేసేది.వేదవతికి కోడలు పనులు చూస్తుంటే చిన్నప్పుడు తను చూచిన కోతి చేసిన పనులే గుర్తొస్తున్నాయి.ఎందుకంటే కోడలు తన మూడ్ ని బట్టి వంటైనా,మరేదైనా చేస్తుంది.ఒక్కొక్కసారి అక్కరలేని వాళ్ళను నెత్తినపెట్టుకుని తెగ మర్యాదలుచేసి,అవసరమైన వాళ్ళను అసలు పట్టించుకోకుండా చూడనట్లు నాటకమాడి తాగటానికి నీళ్ళు,తినటానికి తిండి కూడా పెట్టదు.అమ్మవైపు బంధువుల ఇళ్ళకు వెళ్ళేటప్పుడు డాబుసరిగా వెళ్ళి,అత్తవైపు బంధువుల ఇళ్ళకు సాదాసీదాగా వెళ్తుంది.ఈమధ్య విసుగొచ్చినవ్వుతూ అన్నట్లు  కోతి చేసినట్లు అమ్మ కుండ - అత్త కుండ లాగా చేస్తున్నావు అంటే నవ్వుకుంటుంది తప్ప తను మారదు.  

No comments:

Post a Comment