Friday, 28 April 2017

కోతికి ధన్యవాదాలు

                                                                              సరస్వతి చిన్ననాటి స్నేహితురాళ్ళతో కలిసి ఒక వారం రోజులు విహార యాత్రలకు వెళ్ళింది.ఆ నేపధ్యంలో దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అందరూ ఒకచోట కూర్చున్నారు.అక్కడ కోతులు బాగా ఉన్నాయి.ఒక కోతి అందరికన్నా వెనుకగా కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చి చేతికి తగిలించుకున్న సంచిపై చెయ్యి వేసి ఇవ్వమని సైగ చేస్తుంటే కోతి  ఎక్కడ తన సంచి పడేస్తుందో అన్న భయంతో ఇవ్వకుండా ఆమె నా దగ్గర ఏమీ లేవమ్మా!అని పదేపదే మాట్లాడుతుంటే ముందు కూర్చున్న వాళ్ళకి అర్ధం కాలేదు.వెనక్కి తిరిగి చూసేసరికి కోతి సంచి పట్టుకుని ఇవ్వమని భీష్మించుకుని కూర్చుంది.అందరూ సంచి ఇవ్వమనేసరికి ఆమె ఇచ్చేసింది.కోతి వైనంగా సంచిని తెరచి అందులో ఉన్నడబ్బు,చరవాణి తీసి పక్కన పడేసింది.ఆహారం కోసమో ఏమో?సంచి మొత్తం వెతికి ఏమీ లేకపోయేసరికి అక్కడ పడేసి వెళ్ళిపోయింది.సరస్వతి స్నేహితురాలు బ్రతుకు  జీవుడా!అనుకుంటూ తనను,తన సంచిని ఏమీ చేయనందుకు కోతికి ధన్యవాదాలు చెప్పింది.

ఓటి మోత

                                                            మనలో చాలా మందిది నిద్ర లేస్తూనే ఉరుకులు పరుగుల జీవితం.మనం మెలుకువగా ఉన్న సమయంలో సగం గంటలు ఎక్కడ పనిచేసినా దాదాపు కూర్చుని చేసే పని.శారీరకంగా ఏ మాత్రం శ్రమ ఉండదు.జీవితం హాయిగా ఉన్నట్లే ఉంటుంది.దీని వల్ల ఏదో ఒకరోజు హృదయం ఓటి మోత మోగుతుంది.అధిక రక్త ప్రసరణ,కొలెస్టరాల్ పెరగటం,మధుమేహం ఒక్కొక్కటిగా పలకరిస్తూ చివరకు గుండె పోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది.ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే పనిలోనే పని చేస్తూనే ఎవరికి వారే వాళ్ళకు అనుకూలంగా ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించుకోవాలి.రోజు మొత్తంలో ఒక అరగంట శ్రమ చేసినా గుండెను కాపాడుకోవచ్చు.విరామ సమయంలో కొద్ది దూరం నడవాలి.ప్రతి పనికి ఎదుటివారిపై ఆధారపడకుండా నాలుగు  అడుగులు వేసి స్వంతంగా పని చేసుకోటం,లిఫ్ట్మె ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి.ఇవన్నీ తూ.చ  తప్పకుండా పాటిస్తే ఓటి మోత లేకుండా గుండెతోపాటు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.

పార్శ్వ నొప్పికి....

                                                                                  రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు ద్రాక్షరసం తాగటం వల్ల పార్శ్వనొప్పి తగ్గుతుంది.రోజూ కొన్ని ద్రాక్ష పళ్ళు ఏదో ఒక సమయంలో నోట్లో వేసుకోవటం వలన నిద్రలేమి,తలనొప్పి వంటి వాటితోపాటు రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి.త్వరగా ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి.తినే ముందు ఉప్పునీటిలో వేసి ఒక అరగంట నానబెట్టి శుభ్రంగా కడగటం మాత్రం మరచిపోకండి.శుభ్రంగా కడిగిన ద్రాక్ష పళ్ళు మాత్రమే తినాలి.

Thursday, 27 April 2017

అందరిలో అందంగా

                                                             ముఖంపై చర్మం నిగనిగలాడాలంటే ఏదో ఒక క్రీమ్ రాసుకోవడం కాకుండా కొన్ని పద్దతులు తప్పనిసరిగా పాటించాలి.ఆహారంలో మార్పులతోపాటు సహజ సిద్దమైన పూతలు వేసుకుంటూ నీరెండలో నడక,వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ పరగడుపున కారట్,దానిమ్మ రసం తాగాలి.రోజూ తప్పనిసరిగా పది,పన్నెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి.ఉదయం,సాయంత్రం లేత ఎండలో కాసేపు ఉండాలి.మధ్యాహ్నం ఎండ చర్మాన్ని కాంతి విహీనం చేస్తుంది.తాజా పండ్లు,కూరగాయలు తినాలి.ఉదయం నిమ్మరసం కానీ గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోవాలి.ముఖానికి సహజ సిద్దమైన బొప్పాయి,కారట్,అరటి పండు,కమల,నారింజ వంటి పాక్స్ వేసుకోవాలి. వేసుకునే ముందు ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడగాలి లేదా ఐసుగడ్డలతో శుభ్రం చేయాలి.ఇలా చేస్తే ముఖం నిగనిగ లాడుతూ అందరిలో అందంగా కనిపించడం ఖాయం. 

Tuesday, 25 April 2017

చల్లని తల్లి

                                                                 వేసవిలో ఉల్లి చల్లని తల్లిలా ఆదుకుంటుంది.ముక్కలు తరిగేటప్పుడు ఏడిపించే ఉల్లిపాయ వ్యాధి నిరోధక శక్తిని పెంచి వేసవిలో వచ్చే అనేక సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది.రోజూ ఆహారంలో ఏరూపంలో తీసుకున్నా శరీరానికి చలువ చేసి ఆరోగ్యంతోపాటు వేసవిలో వడదెబ్బ నుండి సైతం రక్షిస్తుంది. 

చర్మం ఆరోగ్యంగా

                                                                     ఒక స్పూను దోసకాయ రసం,ఒక స్పూను నిమ్మ రసం,ఒక స్పూను గులాబీ నీళ్ళు అన్నీ కలిపి ముఖానికి రాసుకుని ఒక పది ని.ల తర్వాత చల్లటి నీటితో ముఖాన్నిశుభ్రంగా కడగాలి.వేసవిలో ఇలా చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Wednesday, 19 April 2017

గొప్ప మనసు

                                                                        పార్వతమ్మ గారికి 90 సంవత్సరాలు ఉంటాయి.తల్లిదండ్రులు లేని అనాధ బాలికలకు చదువు సంధ్యలు చెప్పించడానికి,వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వారి బాగోగులు చూడటానికి కొంత మంది పెద్దలు సమిష్టిగా సేవాభావంతో ముందుకు వచ్చి ఒక సమితిగా ఏర్పడి పూర్తిగా సేవకే అంకితమయ్యారని తెలిసింది.తనకు తానుగా వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనలేదు కనుక వారిని ఇంటికి పిలిపించి తన వంతుగా పిల్లలకు ఉపయోగించమని కొంత మొత్తాన్ని అందజేసింది.కొంత మంది రెండు చేతులా సంపాదించే వాళ్ళు కూడా ఎదుటి వారికి చేతనైన సహాయం చేద్దామని అనుకోని రోజులు.అటువంటిది పార్వతమ్మ గారు సహృద్భావంతో ఆలోచించి భవిష్యత్ప్రణాళికకు ఉపయోగపడే విధంగా ఇవ్వటంతో అందరూ ఆమె కల్మషం లేని మనసును వేనోళ్ళ కొనియాడారు.ఇంతే కాక ఆమె చనిపోయిన తర్వాత వైద్య విద్యార్ధులకు ఉపయోగపడేలా తన పార్ధివ దేహాన్ని వైద్య విద్యాలయానికి ఇస్తానని సంతకాలు పెట్టి ఇచ్చింది.అక్కడికి వచ్చిన వారందరూ అమ్మా!మీ జన్మ ధన్యమైంది.మీది గొప్ప మనసు అని పార్వతమ్మ గారిని మెచ్చుకున్నారు. 

Sunday, 16 April 2017

పప్పీ భోజనాలు

                                                         రోహిణి ఇంటినిండా బంధువులు.నిమిషం తీరిక లేదు.అసలే ఆదివారం.వంట ఇంటి నిండా గిన్నెలు.పనిమనిషి లక్ష్మి ఎగనామం.తాపీగా తర్వాత రోజు ఉదయం పనికి వచ్చింది.లక్ష్మీ చుట్టాలు వస్తారని తెలుసు కదా!నిన్నంతా పనికి రాలేదే?అని అడిగితే వద్దామనే అనుకున్నాను అమ్మా! కొద్ది దూరం రాగానే మావాళ్ళందరు రాములోరి కళ్యాణం జరిగింది కదా!అక్కడ పప్పీ భోజనాలు పెడుతున్నారు వెళదాం రమ్మని తీసుకుని వెళ్లారు.అక్కడ చాలామంది ఉండటంతో ఆలస్యం అయిపోయింది అందుకే రాలేకపోయాను అని చెప్పింది.కొత్తగా ఈ పప్పీ భోజనాలు ఏంటి?అంటే టేబులు,కుర్చీలు వేసి పెట్టే భోజనాలని మేము పప్పీ భోజనాలు అంటాము అని చెప్పింది.నిలబడి తినాలంటే కష్టం కదమ్మా అందుకే పప్పీ భోజనాలనగానే నేను కూడా వెళ్ళాను.నిమిషంలో పని అంతా చక్కబెట్టేస్తాను.మీరు కంగారు పడకండి అని తేలిగ్గా చెప్పేసింది.రోహిణి కూడా లక్ష్మి చెప్పిన తీరుకి నవ్వుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకుంది.  

Wednesday, 12 April 2017

వినుడు వినుడు

విను వినుడు శ్రీ చరితము ఆలకించిన ఆచరించిన ధన్యులమయ్యెదము అంటూ జయంతమ్మ భక్తితో వ్రాసుకున్న
                                                       సాయినాధ సంకీర్తనా కుసుమం 
                                                        జై సాయి రాం జై జై సాయి రాం  
                                       వినుడు వినుడు శ్రీ సాయి చరితము వినుడీ జనులారా 
                                       ఆలకించిన ఆచరించిన ఐశ్వర్యములనొసగే సాయి చరిత "వి"
                                        కలియుగమందున కులమతమ్ముల కుమ్ములాట పెరిగే
                                         సిరికి చెప్పి ఆ హరియే స్వయముగా భువికి తానేవచ్చే"భు" "వి"
                                                 పెళ్ళి బృందంతో బాలునివలె ఆ షిరిడీ పురి చేరే
                                                 గుర్తించిన ఆ మహాల్సాపతి సాయీ అని పిలిచే "సా" "వి" 
                                                 అన్ని మతమ్ముల సారమొక్కటని ఆచరించి చూపే 
                                                  ఆపన్నులను ఆదుకొనుటకై ధుని నుండి ఊదీ నిచ్చే "ధు" 
                                                     వెలిగించెను ఆ పావనమూర్తి నీటితో జ్యోతులను 
                                                    అచ్చెరువొంది ఆ పురజనులు దైవముగ కొలిచే "దై" "వి"
                                                   తన దరి చేరిన ప్రజలందరికీ సుఖశాంతుల నొసగే 
                                                      చక్రధారియై వెలిగే తానే సాధు రూపుదాల్చే"సా"  
                                                  ధర్మ మార్గమున నడిపించుటకై సద్గురినిగా మారే 
                                                       జీవకోటిలో తేజము తానై జగములెల్ల నిండే"జ" "వి"  
                                                  
                                             
                                           

Monday, 10 April 2017

హెచ్చరికలు

                                                           మన శరీరం కంప్యూటర్ ని మించిన మహాయంత్రం.మనమే అనవసరంగా మితిమీరిన పనులు వేళాపాళా లేకుండా చేస్తూ శరీరాన్ని అతిగా కష్టపెడుతూ ఉంటాము.అయినా మన శరీరం అప్రమత్తంగా ఉంటూ మనకు హాని చేసే ప్రతిదాన్ని మన మనసు,మెదడు తిరస్కరిస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది.మనకు నిద్ర చాలకపోతే నిద్ర వస్తున్నట్లుగా ఉండడం,అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలని అనిపించడం వంటివి.అయినా మనం ఆ హెచ్చరికలు పట్టించుకోక తిరుగుతూ ఇబ్బందుల్లో పడుతూ ఉంటాము.అందుకే ఒత్తిడి ఎక్కువై దిగులు,అందోళన పడుతూ లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటూ ఉంటాము.సానుకూల ధృక్పదంతో చేయగలిగినంత పనిచేస్తూ వుంటే ఒత్తిడి దరిచేరకుండా ఉండటమే కాక ఆత్మస్థైర్యం పెరిగి అభివృద్ది దానంతట అదే వస్తుంది.సరిపడా పోషకాహారం తీసుకుంటూ హాయిగా ఏ ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోతుంటే అప్పుడు శరీరం అనే మహాయంత్రం మన మాట విని శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము.  

Friday, 7 April 2017

గుర్తుందా?

                                                         నిర్మల తమ్ముడు మన ఊరిలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో  పాల్గొంటున్నాము.మీరిద్దరూ తప్పకుండా రావాలి అని చెప్పగానే పుట్టిన ఊరు,చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి కొంగొత్త  ఉత్సాహంతో తయారయి భర్తతో కలిసి వెళ్ళింది.చిన్ననాటి స్నేహితులు,ఇరుగుపొరుగు,ఊరి వారందరు ఎంతో ఆప్యాయంగా పలుకరించారు.ఇంతలో ఒకతను వచ్చి నువ్వు నిమ్మీ కదూ!పోలికలను బట్టి నువ్వేనని పలుకరిద్దామని వచ్చాను.నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పి ముప్పై సంవత్సరాల క్రితం మనం ఒకే గొడుగులో వెళ్ళాము గుర్తుందా?అని అడిగాడు.అంత చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్యం అనిపించినా ఒక ని. నిర్మల బిత్తరపోయి ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టేసరికి నువ్వు అప్పుడు చిన్నపిల్లవి గుర్తుండక పోవచ్చులే అన్నాడు.కాసేపు కుశల పశ్నలు వేసి ఎంత హడావిడిగా వచ్చాడో అంతే హడావిడిగా వెళ్ళిపోయాడు.         

Thursday, 6 April 2017

కుక్కరులో పెద్ద మంట

                                                                          చారుమతి పొయ్యమీద కుక్కరు పెట్టి కొద్దిగా నూనె వేసి ఎవరో పిలిచినట్లుంటే వరండాలోకి వెళ్ళింది.2 ని.ల్లోనే వంటగదిలోకి వచ్చేటప్పటికి కుక్కరులో నుండి అడుగు ఎత్తున పెద్ద మంట వస్తుంది.మంట ఉన్న కొద్దీ పెరుగుతుందే కానీ తగ్గటం లేదు.అసలు ఎందుకు అలా వస్తుందో అర్ధంకాక ఏమి చేయాలో తోచక  ధైర్యం చేసి గభాల్న కుక్కరు పిడి పట్టుకుని సింకులో  నీళ్ళ గిన్నె వుంటే దానిలో కుక్కరును బోర్లించి నీళ్ళల్లో ముంచేసింది.కుక్కరు బాగా వేడెక్కి ఉండటంతో నీళ్ళల్లో వేసిన కొద్ది సేపటికి కానీ మంట తగ్గలేదు.పొయ్యి పక్కనే చెక్కతో చేసిన అలమర ఉంది.పొయ్యి కట్టేసి వెళ్తే ఈ తిప్పలు తప్పేవి కదా!కొద్దిగా ఆలస్యం జరిగినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.కొంతలో కొంత నయం.హమ్మయ్య!ఈ రోజు పెద్ద గండం గడిచింది అని చారుమతి సంతోషపడింది. 
సూచన:వంట చేసేటప్పుడు ఎవరయినా వచ్చినా పొయ్యి కట్టేసి వెళ్తే పదార్ధాలు మాడిపోకుండా ఉండటమే కాక పైన
చెప్పినటువంటి ప్రమాదానికి దారి తీసే పరిస్థితులు రాకుండా వుంటాయి. 

Wednesday, 5 April 2017

పుల్ల ఐసు

                                                                           మనలో చాలామంది పుల్ల ఐసు అంటే ఇష్టపడనివారు అంటూ ఉండరు.తులసికి అయితే చెప్పలేనంత ఇష్టం.తులసి అంటే నలుగురు మగపిల్లల తర్వాత లేకలేక ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులతోపాటు అన్నదమ్ములకు కూడా చెల్లెలంటే ప్రాణం.అన్నలతో పాటు వాళ్ళ భార్యలకు కూడా ఆడపడుచు అంటే మహా ఇష్టం.స్వగ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆడపడుచుకు ఒంట్లో వేడిని హరించి శరీరాన్ని చల్లబరిచే  సబ్జా గింజలు చల్లిన పుల్ల ఐసు అంటే మరీ ఇష్టమని పక్క ఊరినుండి ప్రత్యేకంగా తెప్పిస్తూ ఉంటారు.తులసితోపాటు ఒదినలు ఇరుగు పొరుగు అందరూ అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటూ నీరు కారిపోకుండా మధ్యమధ్యలో పుల్ల ఐసు నోట్లో పెట్టి ఆ ఐసు గొంతు దిగుతుంటే శరీరమంతా చల్లచల్లగా అయిపోతుంటే ఎంతో హాయిగా వేసవి సాయంకాలాలు గడిపేస్తూ ఉంటారు.పుల్ల ఐసు అంటే ఇష్టమైన వాళ్ళకు మాత్రమే ఆ రుచి అందులో ఉండే మజా తెలుస్తుంది.   

Tuesday, 4 April 2017

శ్రవణం స్మరణం కీర్తన

                                                                 ఓం సాయి రాం
       ప్రతి నిత్యం శ్రవణం స్మరణం భక్తితో కీర్తన చేయమంటూ జయంతమ్మ వ్రాసుకున్ననవవిధసంకీర్తనా కుసుమం
                                                    శ్రవణం చేయుము గురుచరితం
                                                      స్మరణం చేయుము ఓంకారం
                                                       కీర్తన చేయుము హరినామం
                                                      పూజలు చేయుము ప్రతినిత్యం
                                                      వందనమర్పించుము సూర్యునికి
                                                          దాసుడవే ఎప్పుడు దేవునికి
                                                       పాదసేవలు చేయుము గురువులకు
                                                          సఖ్యము చేయుము కృష్ణునితో
                                                    ఆత్మ నివేదన చేయుము పరమాత్మునికి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

                                                నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నామన దేశవాసులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.శ్రీ సీతారామ లక్ష్మణ అంజనేయ స్వాముల దయామృత కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై విరివిగా ప్రసరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
                                        

Monday, 3 April 2017

కత్తి తెచ్చిన తంటా

                                                                   అచ్చమ్మ,లచ్చమ్మ అక్కచెల్లెళ్ళు.వీళ్ళిద్దరి ఇంటి పక్కనే యాదమ్మ నివాసం.ఒక రోజు అచ్చమ్మ యాదమ్మ వద్ద కట్టెలు కొట్టే కత్తి తీసుకుని ఎన్నిరోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో యాదమ్మ వెళ్ళి కత్తి తిరిగి ఇవ్వమని అడిగింది.కత్తి తిరిగి ఇవ్వకపోగా నేను తిరిగి ఇచ్చేవరకు నువ్వు ఆగకుండా నన్ను అడగటం ఏమిటి?అంటూ పోట్లాడటం మొదలెట్టింది.ఇంతలో లచ్చమ్మ అక్కకు వంత పాడుతూ గొడవకు దిగింది.మాటా మాటా పెరిగి అచ్చమ్మ,లచ్చమ్మ కలిసి యాదమ్మను పెద్ద వయసు అనికూడా చూడకుండా విపరీతంగా కొట్టారు.అర్ధరాత్రి కనుక చుట్టుపక్కల వాళ్ళకు అందరికీ తెలియదు.కత్తి తీసుకుని తిరిగి ఇవ్వకపోగా కొట్టారని ఉదయానే అక్కాచెల్లెళ్ళపై యాదమ్మ కేసు పెట్టింది.పోలీసులు వచ్చి అక్కాచెల్లెళ్ళను స్టేషనుకు తీసుకుని వెళ్ళారు.ఏమి జరిగిందో అర్ధం కాక చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కత్తికోసం కుస్తీ పట్లు పట్టి స్టేషనుకు వెళ్ళేవరకు వచ్చిన వ్యవహారాన్నితెలుసుకుని కత్తి తెచ్చిన తంటా ఇదంతా అనుకుంటూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు నెమ్మదిగా జారుకున్నారు. 

శరణు అందాం

ఓం సాయి శ్రీ సాయి అంటూ సాయి చరణాలకు శరణు అందాం అని భక్తితో జయతమ్మ వ్రాసుకున్నసాయి సంకీర్తన
                                                                      ఓం సాయి రాం
                                                       ఓం సాయి శ్రీ సాయి అందాం అందాం
                                                      ఆ సాయి రూపాలు కందాం కందాం"ఓం"
                                                     షిరిడీకి మనమంతా వెళదాం వెళదాం
                                                        బాబాకు సేవలు చేద్దాం చేద్దాం "ఓం"
                                                           అందరం అభిషేకం చేద్దాం చేద్దాం
                                                   స్వామి అలంకరణ మనం చూద్దాం చూద్దాం"ఓం"
                                                       పూల హారాలు మనము వేద్దాం వేద్దాం
                                                       ధూప దీప హారతులిద్దాం యిద్దాం"ఓం"
                                                       నిత్య పూజలు మనము చేద్దాం చేద్దాం
                                                   సాయి చరణాలకు శరణు అందాం అందాం"ఓం"