Tuesday, 30 June 2015

చిరుధన్యాలతో సలాడ్

ఉడికించిన చిరుధాన్యాలు -  2 కప్పులు(అన్నీ కలిపి)
ఆలివ్ నూనె - 3 టేబుల్ స్పూనులు 
కమలా రసం - కాయలో సగం (ఎంత వస్తే అంత)
నిమ్మరసం - 2 టేబుల్ స్పూనులు 
జీరా పొడి - 2 టీ స్పూనులు 
ఉప్పు - సరిపడా 
మిరియాల పొడి - 1/2 టీ స్పూను 
తీపి మొక్కజొన్న గింజలు - 1 కప్పు 
టొమాటోలు - 4 లేదా చిన్న టొమాటోలు సలాడ్ లో వేసుకునేవి 10 
 పచ్చి మిర్చి ముక్కలు(సన్నగా తరిగినవి) - 1 టేబుల్ స్పూను
వెల్లుల్లి ముక్కలు  - 1 స్పూను (ఇష్టమైతే)
పుదీనా - కొద్దిగా 
కీరా ముక్కలు - 5(సన్నగా కోయాలి)
                                       రాగులు,జొన్నలు,సజ్జలు,కొర్రలు అన్నీ కలిపి మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి.నీళ్ళు పూర్తిగా వంచేయాలి.కమలారసం,నిమ్మరసం,జీరా పొడి,ఉప్పు,మిరియాల పొడి,స్వీట్ కార్న్,ఆలివ్ నూనె ఒకగిన్నెలో కలుపుకోవాలి.సలాడ్ టొమాటోలు కోయనక్కరలేదు.మాములు గట్టి టొమాటోలు(పండినవి కాకుండా)అయితే సన్నగా తరిగాలి.సన్నగా తరిగిన పుదీనా వేసి అన్నీ బాగా కలపాలి.కీరా కూడా ఒక ముక్కను నాలుగు భాగాలుగా కోసి కలపాలి.ఇది పోషకాల మయం.ఆరోగ్యకరం. 
  

Monday, 29 June 2015

అపోహ - నిజం

                                           మధుమేహం ఉన్నాసరే అన్ని రకాల పండ్లు మితంగా తినవచ్చు అని అనుకుంటారు కానీ ఇది నిజంగా అపోహ.మామిడి పండ్లు,అరటి పండు,సపోటా అసలు తినకూడదు.మిగతావి కూడా కొంచెం కొంచెం
తినవచ్చు కానీ మొత్తం తినకూడదు.ఇది నిజం.నేరేడు పండు తినడం చాలా మంచిది.నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని రోజుకి ఒకసారి తింటే చాలా మంచిది.ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

Thursday, 25 June 2015

ముఖం ఎంతో చాయగా........

                                     చిటికెడు పసుపు,ఒక స్పూను శనగపిండి,సరిపడా పెరుగు కలిపి ముఖానికి పట్టించి ఆరాక కొద్దిగా నీళ్ళు తీసుకుని చేతితో ముఖంపై వలయాకారంగా రుద్దుతూ ముఖాన్నికడగాలి.క్రమంగా ముఖం ఎంతో చాయగా కనిపిస్తుంది.

Tuesday, 23 June 2015

సెలవు వస్తే .....

                                              ఈశ్వరి హైస్కూలులో చదువుకొనేటప్పుడు తన స్నేహితురాళ్ళందరూ పొరుగూరి నుండి నడిచి వచ్చేవాళ్ళు.ఆ ఊరు వెళ్ళాలంటే రెండు మైళ్ళు నడిచి వెళ్ళాలి.అయినాసరే సెలవు వస్తే చాలు రెండు మైళ్ళు నడిచివెళ్ళి రోజంతా వాళ్ళతో ఆడుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్ళేది.వేసవికాలం వచ్చిందంటే ఈశ్వరి ఇంట్లో వాళ్లకు దొరికేది కాదు.స్నేహితురాళ్ళందరు వెళ్ళి ఈశ్వరి తల్లిదండ్రులను ఒప్పించి ఈశ్వరి మాఇంట్లో ఉండాలంటే మాఇంట్లో ఉండాలని పోటీపడి మరీ రోజుకొకరి ఇంట్లో అట్టేపెట్టుకునేవాళ్ళు.పెద్దవాళ్ళు కూడా వీళ్ళ స్నేహాన్ని చూచి ముచ్చట పడేవారు.

ఎంత సంతోషంగా ఉందో................

                                   నర్మద,తపస్వి బంధువుల పెళ్ళిలో పరిచయమై స్నేహితులయ్యారు.ఇద్దరూ ఎవరి పనిలో వారు తీరిక లేకుండా ఉంటారు.చాలా రోజుల తర్వాత తపస్వికి కొంచెం ఖాళీ సమయం దొరకటంతో నర్మద ఎలా ఉందో?ఒకసారి పలకరిద్దామని ఫోన్ చేసింది.నర్మద గత కొన్నిరోజుల విశేషాలన్నీ ఆపకుండా గంట కొట్టినట్లు ఒక గంట చెప్పింది.తపస్వీ నీతో మాట్లాడుతుంటే తొలకరి జల్లులా హాయిగా ఉంది.ఎంతో ఆత్మీయంగా,స్నేహంగా ఉండే నీ మాటలు వింటుంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పనలవి కాదు అంది నర్మద.అవునా!అని ఆశ్చర్యపోయింది తపస్వి.    

Monday, 22 June 2015

చేతులు నల్లగా అవకుండా...........

                                                                          బీట్ రూట్,పచ్చి అరటికాయలు కోసినప్పుడు చేతులు నల్లగా అవుతుంటాయి.ఒక రోజంతా ఎంతో కొంత నలుపుదనం ఉంటుంది.ముక్కలు కోసేముందు ఒకచుక్క వంటనూనె, కొద్దిగా ఉప్పు చేతులకు రాసుకుంటే నల్లగా అవకుండా ఉంటాయి. 

ముఖానికి ఎప్పుడూ...........

                                        ముఖానికి ఎప్పుడూ నల్ల ద్రాక్ష,బాగా మగ్గని బొప్పాయి,సపోటా,బెంగుళురు టొమాటో
అనాస పాక్స్ అసలు వేయకూడదు.ఇవి తప్ప వేరే ఏ ప్యాక్ వేసినా అరగంట వరకూ సబ్బు ఉపయోగించకూడదు.                    

ముఖం పై ముడతలు రాకుండా ......

                                                    ముఖం పై ముడతలు రాకుండా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా 8 నుండి 15 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి.

ముఖానికి ఏ ప్యాక్ వేసినా..........

                                                ముఖానికి ఏ ప్యాక్ వేయాలన్నాపలుచగానూ,గట్టిగా కాకుండా మధ్యస్తంగా కలుపుకోవాలి.ఒకవేళ త్వరగా ఆరిపోయి పట్టేస్తే నీళ్ళతో తడిపి కానీ,ఇంకొక సారి ప్యాక్  వేసి స్మ్మూత్ గా చేసి కానీ తీయాలి.గట్టిగా అయినదాన్ని అలాగే చేతితో గట్టిగా లాగేయకూడదు.ముఖం మీద   గీతలు(స్క్రాచెస్)పడతాయి.ప్యాక్ గట్టిగా అయితే మాట్లాడకూడదు.

Sunday, 21 June 2015

యోగా - సాధన

                                               ప్రతి సంవత్సరము జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించటం సంతోషకరమే కానీ ఈ ఒక్క రోజునే కాకుండా 365 రోజులు ప్రతి ఒక్కరు యోగా సాధన చేయగలిగితే శారీరకంగా,మానసికంగా ప్రశాంతంగా,ఆరోగ్యంగా,ఉత్సాహంగా,సంతోషంగా ఉండగలుగుతారు.ఆసనాలు వేయడం వల్ల శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరుగుతుంది.ఒక్కో ఆసనం వల్ల ఒక్కొక్క ప్రయోజనముంటుంది.ప్రాణాయామం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా ఉంటాయి.ధ్యానం వల్ల వ్యతిరేక ఆలోచనలు తొలగి సానుకూల దృక్పధం ఏర్పడుతుంది.ఒత్తిడి తగ్గుతుంది.ఇన్ని ప్రయోజనాలున్న యోగా రోజు ఒక గంట చేయడం వల్ల ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు అన్నట్లు ఆరోగ్యంతోపాటు అనేక లాభాలు పొందవచ్చు.  

సొరకాయ - ఓట్స్ వడ

లేత సొరకాయ తురుము - 2 కప్పులు
వేయించిన ఓట్స్ పొడి - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1/2 కప్పు
అల్లం,వెల్లుల్లు పేస్ట్ - 2 స్పూన్లు
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
గరం మసాలా - 1 స్పూను
ఉప్పు - తగినంత
పచ్చి మిర్చి - 2 (సన్నగా తరగాలి)
కరివేపాకు - కొంచెం
నిమ్మరసం - టేబుల్ స్పూను
నూనె  - వేయించడానికి సరిపడా
                                                సొరకాయ తురుములో కొద్దిగా ఉప్పు వేసి కలిపి 10 ని.ల తర్వాత గట్టిగా పిండి దానిలో ఓట్స్ పొడి,బొంబాయి రవ్వ,అల్లం,వెల్లుల్లి పేస్ట్,సగం కొత్తిమీర,సరిపడా ఉప్పు,పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని వడల్లాగా చేసి ఆవిరి మీద 10 ని.లు ఉడికించి  తీయాలి. బాండీలో నూనె పోసి కాగిన తర్వాత ఉడికించిన వడల్నివేసి వేయించుకోవాలి.వేయించిన వడలపై మిగిలిన కొత్తిమీర వేసి,గరం మసాలా పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి.అంతే రుచికరమైన సొరకాయ-ఓట్స్ వడలు తయారయినట్లే.ఏ చట్నీతోనయినా వేడిగా తింటే బాగుంటాయి.    

Saturday, 20 June 2015

గోరింటాకు

                                                          ఆషాడమాసం వచ్చిందంటే గోరింటాకు హడావిడి.ఆషాడంలో తప్పనిసరిగా
గోరింటాకు పెట్టుకోవాలని అంటారు పెద్దలు.ఇంతకు ముందు రోజుల్లో గోరింటాకు చెట్టునుండి కోసి రోట్లో వేసి మెత్తగా రుబ్బిపిల్లలకు కాళ్ళకు,చేతులకు పెట్టేవాళ్ళు.ఆ వాసన నాలుగు రోజులవరకు ఎంత బాగుంటుందో!ఎవరికి ఎంత బాగా ఎర్రగా పండితే అంత గొప్ప.ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవటానికి కోన్ లు,పెట్టటానికి డిజైనర్లు వచ్చినా అంతా చెట్టు గోరింటాకు ముందు దిగదుడుపే.అందుకే ఇప్పటికీ గోరింటాకు రుబ్బి పెట్టుకోవటాన్నేఇష్టపడుతుంటారు చాలామంది.

ఆషాడ మాసాన........

                                     ఆషాడ మాసాన.. చినుకు పడే సమయాన.. మునగాకు తింటే శరీరానికి ఎంతో మంచిదని చెప్తుంటారు పెద్దలు.చూడటానికి చిన్నగా ఉన్నా ఈ ఆకులు పోషకాల గని.శారీరక ధృడత్వానికి,ఎముకల పటుత్వానికి దోహదం చేసే ప్రోటీన్లు ఇనుము,కాల్షియం,పుష్కలంగా ఉంటాయి.రోజూ రెండు స్పూనులు  మునగాకు నూరి తింటే పోషకాహార లోపంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.మునగాకు ఏదో ఒక రూపంలో రోజూ తింటే మధుమేహం ఉంటే అదుపులో ఉంటుంది.ముందు జాగ్రత్తగా తింటే రాకుండా ఉంటుంది.దీనితో రకరకాల వంటలు చేసుకోవచ్చు.అవి ఎలా చేయాలో తెలుసుకోవాలంటే పాత పోస్టుల్లో చూడొచ్చు.ఆరోగ్యంతోపాటు చాల రుచిగా కూడా ఉంటాయి.

Friday, 19 June 2015

ఏట్లో దూకమను

                                                    శిరీష్ ,భార్య  కూతుర్ని గొప్ప చదువులు చదివించాలని చిన్నప్పుడే రెసిడెన్సియల్ స్కూల్లో పెట్టారు.స్కూల్లో ఒకటే ఏడుస్తుందని చూడటానికి ఒకసారి రమ్మని స్కూలు యాజమాన్యం కబురు పెట్టారు.చచ్చినా,బతికినా అక్కడ ఉండి చదువుకోవాల్సిందే మేము వెళ్ళము నువ్వు వెళ్తే వెళ్ళమని తాతయ్యకు చెప్పారు.తాతయ్య చూడటానికి వెళ్తే మనవరాలు నేను ఉండనని ఇంటికి వచ్చేస్తానని ఒకటే ఏడుపు.పిల్ల ఏడుస్తుంటే బాధగా ఉంది రెండు రోజులు ఇంటికి తీసుకొస్తానని అన్నాడు తాతయ్య.ఉండకపోతే ఏట్లోదూకమను అంతేకానీ ఇంటికి తీసుకురావటానికి వీల్లేదన్నారు కొడుకు,కోడలు.తీసుకురానంటే దూకేట్లే ఉంది అన్నాడు తాతయ్య.అయినా ఫర్వాలేదు నువ్వు వచ్చెయ్యమన్నారు.అమ్మా!రేపు వచ్చి తీసుకెళ్తాను ఇప్పుడు వేరే పనిమీద వెళ్తున్నానని పిల్లకు నచ్చచెప్పి ఎలాగో ఇంటికి వచ్చాడు.కొడుకు,కోడలు మూర్ఖత్వానికి విసుగు చెంది ఏడ్చే పిల్లలు పక్కనే ఉంటే మిగతావాళ్ళు ఏడుస్తారని యాజమాన్యం ఇంటికి పంపిస్తే కానీ వీళ్ళకు తెలియదు అని మిన్నకున్నాడు తాతయ్య.   

చిరుధాన్యాల దోశ(మల్టీ మిల్లెట్ దోశ)

రాగులు - 1 కప్పు
సజ్జలు - 1 కప్పు
తెల్ల జొన్నలు - 1 కప్పు
కొర్రలు - 1 కప్పు
 మినప్పప్పు - 1 కప్పు
ముడి బియ్యం - 2 కప్పులు
మెంతులు - 1 1/2 స్పూను
ఉప్పు - తగినంత
                                               అన్నీ విడివిడిగా కడిగి 5 లేక 6 గం.లు నానబెట్టుకోవాలి.మినప్పప్పు,మెంతులు బియ్యం కలిపి మిక్సీలో కానీ గ్రైండర్ లో కానీ వెయ్యొచ్చు.మిగతా చిరుధాన్యాలన్నీ కలిపి రుబ్బుకోవచ్చు.మినప్పిండిలో మిగతా పిండి,ఉప్పు కూడా కలిపి 8 గం.లు బయట ఉంచితే పిండి పొంగుతుంది.తర్వాత దోశ వేసుకుంటే రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం.ఏ చట్నీతోనయినా రుచిగా ఉంటుంది.పిండి మాములు దోశ పిండి లాగానే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. 

Thursday, 18 June 2015

అరటికాయ వడ

అరటికాయలు - 2
ఉల్లిపాయ - 1
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
జీడిపప్పు పేస్ట్ - 1 స్పూను
పచ్చి మిర్చి - 3
కరివేపాకు తరిగినది - 1/4 కప్పు
మొక్కజొన్న పిండి - 2 స్పూనులు
బియ్యప్పిండి - 1 స్పూను
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - 2 స్పూనులు
గరం మసాలా - 1 /2 స్పూను
                                                    అరటికాయలు చెక్కు తీసి ముక్కలుగా కోసి కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి.ఉల్లిపాయ,పచ్చిమిర్చిసన్నగా తరగాలి.అరటికాయముక్కలు ఒక గిన్నెలో వేసి వేడిగా ఉండగానే మెత్తగా చేయాలి.మిగతా పదార్ధాలన్నీ కూడావేసి బాగా కలపి ఒక 5 ని.లు పక్కన పెట్టాలి.ఈలోగా బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి కాగినతర్వాత పై మిశ్రమాన్ని వడలుగా చేసి ఎర్రగా వేగాక తీసేయాలి.ఇవి వేడిగా చాలా రుచిగా ఉంటాయి.చట్నీ,సాంబారు,సాస్ దేనితోనయినా తింటే చాలా బాగుంటుంది.

Wednesday, 17 June 2015

జైలు

                                                               మాన్సి తల్లిదండ్రుల కోరిక మేరకు తనకు ఇష్టం లేకపోయినా ఇంటర్ లో బై.పి.సి తీసుకుంటానని చెప్పింది.హాస్టల్ లో ఉండి పొద్దస్తమానం చదివి వైద్యవిద్య అభ్యసించటానికి సీటు సంపాదించమని ఆదేశించారు.సరేనని వెళ్ళింది.ఎప్పుడూ ఎక్కడా ఉండకపోవటం వలన ఒక్కసారిగా హాస్టల్ లో ఉండటం కష్టమైపోయింది.రెండు రోజులు ఉండి మూడవరోజు నేను ఉండనని ఒకటే ఏడుపు.ఉదయం 5 గం.ల నుండి  రాత్రి 10 గం.ల వరకు ఏకధాటిగా ఒకటే చదువు.ఆడుతూపాడుతూ చదువంటే శ్రద్దగా ఇష్టంతో చదవాలి అంతే కానీ బందించినట్లుగా రోజంతా అదేపనిగా చదవమంటే ఎవరికైనా ఏడుపే.తెలిసినా తెలియక పోయినా ఎవరు వెళ్తే వాళ్ళను ఫోను అడిగి తీసుకుని తల్లిదండ్రులకు ఫోను చేసి పిల్లలు కంటికి కడివెడుగా ఒకటే ఏడుపు.మాన్సి అమ్మ కూడా నువ్వు చదువుకోవాలంటే ఉండు లేకపోతే చంక నాకి పో అంటుంది.అది చూడటానికి జైలు లాగా ఉంది.నేను ఉండలేను అని చెప్పేసింది మాన్సి.అక్కడ ఉంటే చదివినా చదవకపోయినా సీటువచ్చినంత సంబరం పెద్దవాళ్ళకు అందుకే లక్షలు లక్షలు డబ్బు కట్టి తృప్తి పడతారు.పిల్లలకేమో జైల్లో ఉంచారనే అభిప్రాయం.చూసేవాళ్ళకు పిల్లల్నిఅంత ఇబ్బంది పెట్టటం అవసరమా?అనిపిస్తుంది,ఆ విషయం తల్లిదండ్రులు అర్ధం చేసుకోవాలి.ఇంత చేసి 1700 మందిలో 100 సీట్లు రావటం కూడా గగనమే.

Tuesday, 16 June 2015

ఓట్స్ దోశ

మినప్పప్పు - 1 కప్పు
 బియ్యం - 1కప్పు
ఓట్స్ - 1 కప్పు
మెంతులు - 1 స్పూను
                                                                 మినప్పప్పు,బియ్యం,మెంతులు విడివిడిగా 4,5 గం.లు నానబెట్టాలి.
శుభ్రంగా కడిగి వీటిని మిక్సీలో వేసి మెత్తగా చెయ్యాలి.ఓట్స్ కొంచెం నీళ్ళతో రెండు సార్లు కడిగి 5 ని.లు నాననిచ్చి రుబ్బిన పిండిలో వేసి మరొక్కసారి 1 ని.ఆన్ చేసి తీసేయ్యాలి.దీన్ని ఒక గిన్నెలో వేసి 10 గ.లు నాననిచ్చి దోశ వేసుకోవచ్చు.ఉల్లిపాయ,పచ్చి మిర్చి,కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవచ్చు.మెత్తగా.రుచిగా ఉంటుంది. 

ముక్కు దిబ్బడగా ఉంటే........

                   జలుబు వచ్చేటప్పుడు,ఘాటైన వాసనలు పీల్చినప్పుడు ముక్కు దిబ్బడగా ఉండి గాలి పీల్చుకోవటం కష్టంగా అనిపిస్తుంది.అటువంటప్పుడు పల్చటి రుమాలులో కొంచెం మద్ద కర్పూరం వేసి ముడివెయ్యాలి.దాన్ని చేతితో నలిపి ముక్కు దగ్గరగా పెట్టి వాసన చూస్తే అప్పటికప్పుడు ముక్కు దిబ్బడ తగ్గి చక్కగా గాలి పీల్చుకోగలుగుతారు.

కాప్సికం టొమాటో కూర

ఆకుపచ్చ కాప్సికం - 1/2
పసుపు కాప్సికం - 1/2
ఎరుపు కాప్సికం - 1/2
టొమాటోలు - 4 పెద్దవి
ఉల్లిపాయలు  - 2
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
ఉప్పు - తగినంత
కారం - 1 టేబుల్ స్పూను
గరం మసాలా - 1/2 స్పూను
నూనె - సరిపడా
 కరివేపాకు,కొత్తిమీర  -  కొంచెం
                                                            ఉల్లిపాయలు,టొమాటోలు,కాప్సికం అన్నీ చిన్నముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.నాన్ స్టిక్ పాన్ లో నూనెవేసి తాలింపు వేయాలి.ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించి అల్లం,వెల్లుల్లి పేస్ట్, కాప్సికం ముక్కలు వేసి కొద్దిగా వేయించి టొమాటో ముక్కలు వేయాలి.ఉప్పు,కారం వేసి ఉడకనివ్వాలి.దగ్గర పడుతుండగా గరం మసాలా వేసి తిప్పి చివరలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దింపేయాలి.అంతే టొమాటో కాప్సికం కూర తయారయినట్లే.ఇది చపాతీ,నాన్,అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.  

తాజా ధోరణి

                                                                       దగ్గరి బందువులనో,స్నేహితులనో వ్యాపారంలో భాగస్వాములుగా చేసుకుంటే కొన్నాళ్ళ తర్వాత ఇద్దరిమధ్యా తేడావచ్చి విడిపోవడమో లేక నష్టపోవడమో జరుగుతుంది.అలా కాకుండా తన జీవితభాగస్వామే వ్యాపార భాగస్వామి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.అందుకని చాలామంది భార్యాభర్తలు కలిసి వ్యాపారం మొదలుపెడుతున్నారు.ఇద్దరూ కలిసే ప్రణాళికతో ఏ పనైనా చేస్తారు కనుక సమస్య ఉండదు.డబ్బు ఏమైపోతుందో అన్న బెంగ ఉండదు.ఇంటా బయటా నిశ్చింత. గడప దాటితే వ్యాపార భాగస్వాములు.ఇంటికొస్తే జీవిత భాగస్వాములు.ఇది నేటి తాజా ధోరణి. 

అంతా ఆమే

                                                                  శ్యామ్ ప్రసాద్ వృత్తిరీత్యా వైద్యుడు.అయినప్పటికీ వ్యాపారమంటే మక్కువ.కొంచెంసేపు కూడా ఖాళీగా ఉండే తత్వం కాకకపోవడం వల్ల సమయాన్నిచక్కగా సద్వినియోగం  చేసుకుంటాడు.వైద్య వృత్తి చేస్తూనే రకరకాల వ్యాపారాలు చేస్తుంటాడు.భార్య తెలివికలదే అయినా మొదట పిల్లలను చూడటంతోనే సరిపోయేది.మిగతా విషయాలు అంతగా తెలిసేవి కాదు.ఆమెకు ఖాళీ సమయంలో శ్యామ్ ప్రసాద్ తనే స్వయంగా శిక్షణ ఇచ్చి అన్నీ నేర్పించాడు.అసలే తెలివికలది కనుక అన్నీ త్వరగా నేర్చుకుంది.ఇప్పుడు ఇంటాబయటా డబ్బు వ్యవహారమంతా ఆమే చూస్తుంది. డబ్బుసంపాదించడం వరకే నా పని.నాభార్య స్వతహాగా పొదుపరి.డబ్బు వృధా చేయదు.ఖర్చుపెట్టడం,పొదుపు చేయడం వంటి డబ్బు వ్యవహారమంతా ఆమే చూస్తుంది అని శ్యామ్ ప్రసాద్ అందరికీ గర్వంగా చెపుతుంటాడు.

Monday, 15 June 2015

తేలికగా వంట

                                                                  మధులత,మధురిమ స్నేహితురాళ్ళు.మధులత ఎప్పుడూ ఖాళీగా
ఉండేది.మధురిమ ఎప్పుడూహడావిడిగా ఉండేది.పనివాళ్ళు ఉన్నా నాకెప్పుడూ పని సరిపోతుంది.నీకు పనివాళ్ళు లేకపోయినా ఖాళీ సమయం ఎలా ఉంటుంది?అని మధురిమ స్నేహితురాలిని అడిగింది.నేను వంట చాలా తేలికగా చేసేస్తాను.అన్ని కూరలు ఆవిరిమీద వండుతాను.ఏ కూర వండినా ముక్కలు కోసివెయ్యటం ఆలస్యం రెండు ని.లలో అయిపోతుంది.వేపుడయినా ముందుగా ముక్కలు ఉడికించి తర్వాత తక్కువ నూనెతో వేయించుతాను.రుచితో పాటు పోషకపదార్ధాలు నశించకుండా ఉంటాయి,త్వరగా పని అయిపోతుంది అని చెప్పింది.ఇంతకీ మధురిమకు ఖాళీ లేకుండా వంటగదిలోనే ఎందుకు సమయం గడిచిపోయేదంటే పచ్చిముక్కలు డైరెక్టుగా వేయించడం వల్ల,అవిరివాసన వస్తుందనే అపోహతో మామూలు గిన్నెల్లో వండటంతో సమయం వృధాఅయ్యేది.మధులత చెప్పిన తర్వాత నుండి తనుకూడా చాలా తేలికగా వంటచేయటం మొదలుపెట్టింది.  

బహుళ ప్రయోజనకారి

                                                  కలబంద మనకు ప్రకృతి ప్రసాదించిన అత్త్యుత్తమమైన మొక్క.ఇది బహుళ ప్రయోజనకారి. మనం ఇంటికి కొత్తగా రంగులు వేసినప్పుడు రంగుల తాలూకు వాసనలు చాలా రోజులవరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అటువంటప్పుడు కలబంద మొక్కలను కుండీలలో పెట్టి అక్కడక్కడ గదుల్లో ఉంచితే  గాలిలో ఉండే హానికారక రసాయనాలను శుద్ధి చేస్తుంది.రంగుల వాసన త్వరగా పోతుంది.ఇది రాత్రిపూట కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది.అందువల్ల దీన్ని  పడకగదిలో పెట్టుకుంటే మంచిది.కలబంద వంటగదిలో కూడా ఉండాల్సిన మొక్క.కూరగాయలు కోసేటప్పుడు ఎక్కడైనా తెగినా,వంట చేసేటప్పుడు కాలినా వెంటనే కలబంద చిన్న ముక్క కోసి దానిలోపల ఉన్న జిగురు పదార్ధాన్ని రాస్తే రక్తం ఆగిపోతుంది,కాలినప్పుడు బొబ్బ రాకుండా ఉంటుంది.రోజు కలబంద చిన్నముక్క తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.ఇవేకాక ఇంకా చాలా ఉపయోగాలున్నాయి.మొత్తం మీద ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగకరం.    

Sunday, 14 June 2015

బోన్సాయ్ మొక్కల దొంగతనం

                                         నీరజకు బోన్సాయ్ మొక్కలంటే చెప్పలేనంత ఇష్టం.ఎక్కడ మొక్కల ప్రదర్శన పెడితే  అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళిబోన్సాయ్ మొక్కలు తీసుకొచ్చేది.దానికి తోడు రకరకాల పింగాణీ కుండీలలో  అందంగా పెట్టేది.పాతఇల్లు స్థానంలో కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో దగ్గరలో ఉన్న అపార్టుమెంటుకు వెళ్లారు. అక్కడి వాళ్ళకు మొక్కలన్నీ తెచ్చిపెట్టడం ఇష్టం లేదు.పైకి తీసుకెళ్ళి పెట్టుకోమని చెప్పారు.పైకి వెళ్ళి రోజూ నీళ్ళు పొయ్యాలంటే ఇబ్బందయినా  పోనీలే నాలుగురోజులు ఎలాగో కష్టపడవచ్చులే అనుకుంది.ఇంతలో మనవడు పుడితే అమెరికా వెళ్ళాల్సి వచ్చింది.వెళ్ళి వచ్చేటప్పటికి ఒక్క మొక్క కూడా లేదు.దొంగతనం జరిగితే డబ్బో,నగలో తీసుకెళ్తారుగానీ ఈరకంగా బోన్సాయ్ మొక్కలు దొంగతనం జరగటమేమిటని ఎవరినడిగినా మాకు తెలియదంటున్నారు.నీరజ వెళ్ళేటప్పుడు  వాచ్ మెన్ కి డబ్బులిచ్చి మొక్కలకు నీళ్ళు పొయ్యమని చెప్పింది.వాచ్ మెన్ కూడా కనిపించలేదు.నాలుగురోజుల  తర్వాత బజార్లో వాచ్ మెన్ కనిపించి మొక్కలన్నీఎక్కడికో తరలించారని,నేను మీతో చెప్తానని నన్ను పనిలోంచి  తీసేశారని చెప్పాడు.హవ్వ!ఇదేమి పోయేకాలం?ఇష్టం లేకపోతే మొదటే వద్దని చెప్పాలి కానీ మొక్కలపై కక్ష  కట్టినట్లు పిచ్చిపనులు ఏమిటి?ఛీ!భూమి మీద ఇటువంటి విచిత్రమైన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట    అనిపించింది.  

Friday, 12 June 2015

5 ని.ల్లో అరటికాయ వేపుడు

పచ్చి అరటికాయలు  - 2
ఉప్పు - సరిపడా
వేపుడుకారం - 1 టేబుల్ స్పూను
నూనె - కొంచెం
పసుపు - 1/4 స్పూనులో సగం
వెల్లుల్లి - 4 రెబ్బలు
                                                  అరటికాయలు కడిగి ఒక్కొక్కటి మూడు ముక్కలుగా కోసి ప్రెషర్ కుక్కర్ లో కొద్దిగా నీళ్ళు పోసి రెండు విజిల్స్ రానివ్వాలి.మూత రాగానే నీళ్ళు వంపి ఒకప్లేటులో ఆరనివ్వాలి.పై తోలు తీసి చేతితో చిన్నముక్కలుగా చేయాలి.బాండీలో కొంచెం నూనె వేసి తాలింపు పెట్టి దానిలో పసుపు,అరటికాయ చిన్నముక్కలు వేయాలి. కొంచెం వేగనిచ్చి ఉప్పు,వేపుడుకారం,వెల్లుల్లి దంచి వేయాలి.అంతే చాల తేలికగా 5 ని.ల్లో అరటికాయ కూర తయారవుతుంది.రుచిగా ఉంటుంది. 

సేమ్యా పాయసం చిక్కగా ఉండాలంటే ........

                                     సేమ్యా పాయసం చిక్కగా ఉండాలంటే పాయసం తయారయిన తర్వాత కొంచెం జీడిపప్పు దోరగా వేయించి పొడి చేసి కలిపితే చిక్కదనంతోపాటు,రుచిగా ఉంటుంది.

జ్ఞాపకశక్తి పెరగాలంటే ...........

                                          వయసు పెరుగుతున్నకొద్దీ మతిమరుపు రావడం సహజం.కాబులీ శనగలు,కాలీఫ్లవర్ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే వయసుతో వచ్చే మతిమరుపు తగ్గుతుంది.వీటితో పాటు వాల్ నట్లు రోజు కొంచెం తింటే మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.ఖాళీ సమయంలో పజిల్స్,సుడొకు,మెదడుకు మేత పదవినోదం వంటి వాటిని పూర్తి చేస్తుంటే మెదడుకు పదును పెట్టినట్లుగా ఉంటుంది.

Thursday, 11 June 2015

కలలో కూడా .........

                                               లలితాదేవి గారికి డెబ్బై సంవత్సరాలు.కొంచెం నడునొప్పి సమస్య ఉంది.ఎక్కువ దూరం ప్రయాణం చెయ్యలేనేమోనని భయం.అలాంటిది కూతురు,మనుమరాలు కలిసి చెప్పాపెట్టకుండా ఏకంగా అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.మొదట రాలేను అన్నాకానీ తమ్ముడు,మరదలు,మనుమరాలు,అందరూ పట్టుబట్టి రావాల్సిందే నువ్వు ప్రయాణం చెయ్యగలవు అని చెప్పేసరికి ఉత్సాహంగా బయలుదేరారు.వెళ్లేముందు సంతోషంగా ఈ వయసులో విమానం ఎక్కుతానని కలలో కూడా   అనుకోలేదని లలితాదేవి గారు చెప్పారు. అమ్మ,అమ్మమ్మ సంతోషం చూచి చెప్పకుండా టిక్కెట్లు కొనేసి మంచిపని చేశామని కూతురు,మనుమరాలు అనుకున్నారు.అనుకున్నట్లుగానే ఉత్సాహంగా నెలరోజులు ఓపిగ్గా కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా అమెరికాలో దాదాపుగా ముఖ్యమైన ప్రదేశాలన్నీచూశారు.   

స్నేహభావం

                                                    పక్కింటి వాళ్ళు ఎక్కడైనా కనిపించినా పలకరించకుండా పట్టించుకోని రోజులు.
అలాంటిది దేశం కానీ దేశంలో చీరకట్టు చూచి మన భారతీయులని గుర్తించి స్నేహభావంతో పిల్లలు,పెద్దలు కూడా
పెద్దవాళ్ళనయితే నమస్తే మామీ అని నవ్వుతూ పలకరించి వెళతారు.మామూలుగా అయితే హాయ్ అంటూ నవ్వుతూ పలకరిస్తారు.అమెరికన్లకు భారతీయులంటే గౌరవం.

పాదచారులంటే గౌరవం

                                                   అమెరికాలో ప్రతి పది ని.ల కొకసారి రోడ్డు దాటి వెళ్ళేవాళ్ళ కోసం సిగ్నల్  వస్తుంది.ఒకవేళ సిగ్నల్ లేనిచోట కూడా రోడ్డుదాటి ఎవరైనా వెళ్తుంటే వాహనాలు ఆపేసి అందరూ వెళ్ళిన తర్వాత మాత్రమే వెళతారు.సుష్మ బంధువులు ఇక్కడ మనదేశంలో లాగా కాదు.నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే జీవితాంతం జైల్లో శిక్ష అనుభవించాల్సిందే.తప్పించుకోవటానికి కుదరదు.ఈవిషయంలో గవర్నమెంటు చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు.ఇక్కడి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ చక్కగా పాటిస్తారు.ఎంతటి వాళ్లయినా వాహనాలను ఒకచోట పెట్టి అవసరమైన చోటకు నడిచి వెళ్ళాల్సిందే.నడిచి వెళ్ళేవాళ్ళకు ముందు ప్రాముఖ్యతనిస్తారు.గజిబిజి లేకుండా అన్ని వాహనాలు వెళ్తున్నాఏ శబ్దాలు లేకుండా, అమ్మో!రోడ్డు దాటుతుంటే ఉంటామో,పోతామో అనే భయం లేకుండా ప్రశాంతంగా ఉంది.సుష్మకు ఎప్పటికైనా మన దేశంలో కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది. 

నిర్లక్ష్యం - ప్రాణాలతో చెలగాటం

                                       అతి వేగం ప్రమాదకరమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి వాళ్ళతో పాటు ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.తుషార బంధువులలో ఒక పెద్దాయన ఉదయమే పనిమీద బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతున్నాడు.అంతే వేగంగా మోటర్ సైకిల్ వాడు ఆయన్ని గుద్దేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు.అదే ఊరు కనుక ఎవరో చూసి ఇంట్లో వాళ్ళకు కబురు పెడితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు.పన్ను విరిగి,తలకు గట్టి దెబ్బ తగలటం వల్ల రక్తం చాలా పోవటమే కాక మెదడులో రక్తం గడ్డకట్టి చావు,బతుకులతో పోరాడుతున్నాడు.వేరే ఎక్కడో అయితే ఆయన ఎవరో ఎవరికీ తెలియదు.వెంటనే వైద్యం అంధక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది.ఇంట్లో వాళ్ళు ఆయన ఇంకా ఇంటికి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు.అతి వేగంగా రావటం ఒక తప్పు.మనుషుల్ని కూడా పట్టించుకోకుండా గుద్దేయటం రెండో తప్పు.గాలికి వదిలేసి వెళ్ళిపోవటం అనేది క్షమించరాని తప్పు.ప్రస్తుతానికి తప్పించుకున్నా అంతరాత్మకు తప్పు చేశాననే భావన ఉండాలి కదా!మనస్సాక్షి అనేది ఉంటే ఈవిధంగా జరగదు కదా!ఎదుటి వారి ప్రాణం అన్నాలెక్కలేదు.అంతటా నిర్లక్ష్యం.    

Wednesday, 10 June 2015

అక్కడివాళ్ళకు భయం

                                                                     వినీల అమెరికాలో ఉంటుంది.వాళ్ళ ఇంట్లో పనిచేయటానికి ఇద్దరు అక్కచెల్లెళ్ళు కలిసి వచ్చేవాళ్ళు.వాళ్ళు వచ్చే సమయానికి ఒక్కొక్కసారి వినీల వంట చేస్తుండేది.అప్పట్లో ప్రెషర్ర్ కుక్కర్ అమెరికాలో దొరికేది కాదు.అందుకని ఇంటికి వచ్చినప్పుడు బారతదేశం నుండి ఒకటి తీసుకెళ్ళింది.అక్కడి వాళ్ళకు ఆవిరి బయటకు రావటం,ఆ విజిల్ శబ్దానికి భయపడేవాళ్ళు.వినీలా  ముందు నువ్వు అది తీసెయ్.మేము వెళ్ళిన తర్వాత చేసుకో.మాకు భయం వేస్తుంది అనేవాళ్ళు.వీళ్ళ భయం తగలెట్ట అనుకుని స్టవ్ ఆపేసేది. 

ప్రెషర్ కుక్కర్ తెచ్చిన తంటా

                                                    చంద్రమతికి ఒక మనుమడు,ఒక మనుమరాలు.చిన్నప్పుడు ఒకసారి ఇద్దరూ ఒకేసారిగట్టిగా ఏడవటం మొదలెట్టారు.ఎందుకు ఏడుస్తున్నారో అర్ధం కాలేదు.మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే ఏడుపు ఆపేశారు.రెండు మూడు సార్లు వెంట వెంటనే అలా జరిగింది.వాళ్ళు ఆడుకునేచోట కానీ,ఇంకెక్కడా ఏ తేడాలేదు. చంద్రమతి భర్త పిల్లల వైద్యుడు .ఆయన రాగానే పరీక్ష చేసి పిల్లలకు ఆరోగ్యరీత్యా ఏతేడా లేదని చెప్పారు.చివరికి వంట గదిలో నుండి ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడల్లా గట్టిగా ఏడుస్తున్నారని,అది ఆగిపోయినప్పుడల్లా వాళ్ళు ఏడుపు ఆపేస్తున్నారని అర్ధమైంది.ఈ విషయం అర్ధమయ్యే లోపల చిన్నపిల్లలు నోరు విప్పి చెప్పలేరు కనుక ఎందుకు ఏడుస్తున్నారో తెలియక సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చంద్రమతి హడలిపోయింది.హమ్మయ్య!ఇది ప్రెషర్ కుక్కర్ తెచ్చిన తంటా అన్నమాట అనుకుంది చంద్రమతి. 

Tuesday, 9 June 2015

సముద్రంలో చాలా నీరు

                                               హరిశ్చంద్ర ప్రసాద్ గారి మనుమడు చాలా తెలివికలవాడు.ఐదేళ్లుంటాయి.ఒకసారి మంచినీళ్ళు కొంచెం తాగి మిగతావి క్రింద పారబోస్తున్నాడు.మంచినీళ్ళు వృధాగా క్రింద పోయకూడదు.కొన్నాళ్ళకు మనకు తాగటానికి మంచి నీళ్ళు దొరకవు అని చెప్పారు.అదేమిటి?సముద్రంలో చాలా నీళ్ళున్నాయి కదా!అన్నాడు.
సముద్రంలో నీళ్ళు ఉప్పగా ఉండి తాగటానికి ఉపయోగపడవు.అందువల్ల తాగలేము అని చెప్పారు.కనుక మనం మంచినీళ్ళను వృధా చేయకూడదు అని చెప్పగానే సరే ఇంకెప్పుడు పారబోయనులే అని చెప్పాడు.ఎక్కువగా చెప్పినా చిన్ని బుర్రకు అర్ధం కాదు కదా!    

ముప్పై రోజులు మూడు రోజుల్లా ..........

                                       ఇందులేఖ తనవారితో సరదాగా,సంతోషంగా గడపడానికి కుటుంబంతో కలిసి అమ్మను వెంటబెట్టుకుని భారతదేశం నుండి అమెరికా వెళ్ళింది.అమెరికా నుండి వాళ్ళు స్వదేశానికి వచ్చినా హడావిడిగా పనులు చూచుకొని అటు ఇటూ వచ్చినా ఎవరిదగ్గరా సరిగా ఉన్నట్లు ఉండేది కాదు.ఈసారి మీరు రావాల్సిందే అని పట్టు పట్టేసరికి ఒక నెల రోజుల ప్రణాళికతో వెళ్ళారు.వెళ్ళిన దగ్గరనుండి ఎంత పనులు ఒత్తిడిలో ఉన్నాతీరిక చేసుకుని అక్కడి కుటుంబం,ఇక్కడి కుటుంబం కలిసి మొత్తం పన్నెండు మంది కుటుంబ సభ్యులు నాలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నిటికీ వెళ్ళి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారు.అదనంగా పిల్లలు ఇంకో రెండు రాష్ట్రాలల్లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను చుట్టి వచ్చారు.నెల రోజుల్లోనే చక్కగా అందరూ కలిసి ఉల్లాసంగా,ఉత్సాహంగా అన్నీచూశారు.పెద్దావిడ అయినా ఇందులేఖ అమ్మ కూడా అవసరాన్ని బట్టి అక్కడి ఆహారం కూడా ఇబ్బంది లేకుండా తీసుకుంటూ ఉత్సాహంగా తిరిగారు.మేము వచ్చినా మీతో ఎక్కువ సమయం గడిపినట్లు ఉండేదికాదని మీరు రావటం వల్ల అందరూ కలిసి ఉన్నామని చాలా సంతోషించారు.ఇందులేఖ కుటుంబానికి కూడా అందరూ కలిసి నెలరోజులు ఉండటం గొప్ప మధురానుభూతినిచ్చింది.ముప్పై రోజులు మూడురోజుల్లా చాలా త్వరగా గడిచిపోయాయని అందరికీ అనిపించింది.      

జుట్టు విపరీతంగా రాలుతుంటే......

                                    ఒక్కొక్కసారి జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.అలాంటప్పుడు రాత్రిపూట తలకు ముందుగా బాదం నూనె కొంచెం రాసి తర్వాత ఆముదం కొంచెం తీసుకుని కుదుళ్ళకు పట్టించి బాగా మర్దన చేయాలి.చిక్కగా ఉండటం వల్ల ఎక్కువసేపు మర్దన చేయాలి.జిడ్డు త్వరగా వదలదు కనుక ఆముదం రాసే ముందు బాదం నూనె తలకు రాసి ఆముదం  రాసుకుంటే జిడ్డు త్వరగా వదులుతుంది.ఉదయాన్నే షాంపూతోనో,కుంకుడు రసంతోనో తలస్నానం చేయవచ్చు.ఇలా చేయడంవల్ల రక్తప్రసరణ బాగా జరిగి జుట్టుకి తగిన పోషకాలు అంది జుట్టు ఆరోగ్యంగా,పట్టుకుచ్చులా మెరిసిపోవటమే కాక రాలకుండా ఉంటుంది.

కోటలో పిచ్చుక హంగామా

                                                                     అదొక అందమైన కోట.చుట్టూ అందమైన చెట్లు,వాటర్ ఫాల్స్, అందమైన శిల్పాలతో ఒకదానిలో నుండి నీళ్ళు ఒకదానిలో పడేట్లుగా నీళ్ళ ఫౌంటెన్లు.పాలరాతితో అందమైన అధునాతనమైన నగిషీలతో పైకప్పులు,కళాత్మకంగా చెక్కిన శిల్పాలతో గోడలు అద్భుతంగా ఉంటుంది.ఎవరైనా ఇంట్లో అడుగు పెట్టాలన్నా గేట్లు ఒక మైలున్నర దూరాన ఉంటాయి. ఇంట్లో వాళ్ళ అనుమతితో ఇంట్లోనుండి గేట్లు తెరిస్తేనే లోపలి అడుగు పెట్టగలరు.వాళ్ళు అడుగు లోపల పెట్టగానే ఆటోమాటిక్ గా మూసుకుపోతాయి.ఒకరకంగా చెప్పాలంటే దుర్భేధ్యమైన కోట.కట్టటానికి 5 సంవత్సరాలు పట్టింది. అలాంటి కోటలోకి ఎలా వచ్చిందో దారితప్పి పిచ్చుక లోపలికి వచ్చింది.ఆసమయంలో ఇంటి నిండా బంధువులు,మనవళ్ళు,మనుమరాళ్ళు ఉన్నారు.హాలులో మొక్క ఆకులు కదులుతుంటే పిల్లలు ఆడుకుంటూ దాక్కున్నరేమో అనుకున్నారు.తీరా చూస్తే పిచ్చుక ఎగిరింది.పిల్లలు,పెద్దలు ఒకటే హడావిడి.మనుషులకే ఏ గదిలోనుండి ఏ గదిలోకి రావాలో తెలియని పరిస్థితి.పాపం పిచ్చుకకు ఏమి తెలుస్తుంది?కంగారుపడి రెట్టవేసి,ఈకలు రాల్చి అటుఇటు పరుగెడుతుంది.పైకప్పు చాలా ఎత్తుగా ఉండటం వల్ల దేనితోనైనా తరుముదామన్నా వీలుకాని పరిస్థితి.పైన పిచ్చుకకు,కింద మనుషులకు పరుగెత్తి ఆయాసం వచ్చింది.చివరకు పిల్లలు ఆడుకునే తేలికపాటి బంతి ఎగురవేసేసరికి పై అంతస్తులో గదిలోకి వెళ్ళింది.ఏ గదిలోకి వెళ్లిందో తెలియదు చివరకు కనిపించింది.ఆగదికి వరండా ఉండటంతో తలుపు తెరిచేసరికి బయటకు తుర్రుమంటూ ఎగిరిపోయింది.అందరూ ఒక గంట హైరానా పడ్డ తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.     

Monday, 8 June 2015

చిరుధాన్యాలతో ఇడ్లీ

మినపగుళ్ళు లేక పప్పు - 1 కప్పు
చిరుధాన్యాల రవ్వ - 2 కప్పులు
ఉప్పు - సరిపడా
                                              మినపగుళ్ళు కానీ పప్పు కానీ శుభ్రంగా కడిగి 5 గం.లు నానబెట్టాలి.తర్వాత మళ్ళీ 
ఒకసారి కడిగి సరిపడా ఉప్పువేసి మెత్తగా ఇడ్లీ పిండికన్నాకొద్దిగాపలుచగా రుబ్బాలి.ఈలోగా చిరుధన్యాల  రవ్వ అంటే రాగులు,సజ్జలు,జొన్నలు,ఉప్పుడు బియ్యంతో తయారుచేసిన రవ్వ కొత్తగా మార్కెట్లోదొరుకుతుంది.దీన్నిశుభ్రంగా కడిగి ఒక్క పది ని.లు నాననిచ్చి బాగా పిండి మినపపిండిలో కలుపుకోవాలి.ఇలా తయారుచేసిన పిండిని 10 -12 గం.లు బయటపెడితే పిండి పొంగి ఇడ్లీ మెత్తగా వస్తాయి.ఇడ్లీప్లేట్లకు పలుచగా నెయ్యిరాసి పిండిని పెట్టి ఇడ్లీ కుక్కర్ లో 10 ని.లు ఇడ్లీ మాదిరిగానే వండాలి.ఏ పచ్చడితోనయినా తినవచ్చు.పండుమిరపకాయ పచ్చడిలో పెరుగు కలిపినా చాలా రుచిగా ఉంటుంది.చిరుధన్యాలరవ్వతో చేసినవి తినటం వలన బరువు పెరగకుండా ఉంటారు.త్వరగా ఆకలి అనిపించదు. 

అమ్మయితే వేడిగా.......

                                                  బిందు అమ్మానాన్నలకు ఒక్కతే కూతురు.అతి గారాబంగా ఎంతో అపురూపంగా పెంచారు.చదువు నిమిత్తం బిందు విదేశాలకు వెళ్ళింది.వెళ్ళేముందు కొంచెం కొంచెం వంట చేయడం నేర్చుకుంది.అక్కడకు వెళ్ళిన తర్వాత వండుకోవటానికి కూడా సమయం లేక ఒకరోజు వండుకుని రెండు రోజులు తినొచ్చులే అనుకుంది.అయితే రెండవ రోజు దాన్ని వేడిచేసుకుని ప్లేటులో పెట్టుకుని తినలేక ఏడుపు వచ్చేసింది.అదే అమ్మయితే వేడి వేడిగా ఏది కావాలంటే అది నిమిషాల మీద చేసిపెట్టేది అని మనసులో అనుకుని ఏడుపు ఆగలేదు. కళ్ళ వెంట నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి.కాసేపటికి తమాయించుకుని ఆకలి వేస్తుంది కనుక తప్పక అదే తినేసింది.ఈ విషయం అమ్మతో చెబితే బాధపడుతుందని చెప్పకుండా వాళ్ళ అక్క వరుస అయ్యే ఆమెకు చెప్పింది.ఏమి చేస్తాం?మొదట్లో నాకూ అలాగే అనిపించింది.అయినా తప్పదు కదా!మనం ఇంతదూరం చదువుకోవడానికి వచ్చాము కనుక ముందు చదువుకే ప్రాముఖ్యత ఇవ్వాలి.తర్వాతే మిగతావన్నీ.క్రమంగా అదే అలవాటైపోతుందిలే బాధపడకు అని చెల్లిని సముదాయించింది.  

పది నిమిషాల్లో తాజాగా......

                                                              వేసవిలో కూరగాయలు,ఆకుకూరలు త్వరగా వడిలిపోతుంటాయి.ఒక్క వేసవి అనే కాదు ఏ కాలంలోనయినా కోసే ముందు ఒక్క పది నిముషాలు ఉప్పు నీటిలో నానబెడితే అప్పటికప్పుడు తాజాగా తయారవుతాయి.క్రిమిసంహారక మందుల అవశేషాలు కూడా తొలగిపోతాయి.

Sunday, 7 June 2015

ఆకలి తగ్గాలంటే .......

                                       భోజనానికి ముందు ఒక గ్లాసు టొమాటో రసం తాగితే ఆకలి తగ్గి బరువు తగ్గుతారు.
బరువు తగ్గటమేకాక ఎన్నో ఉపయోగాలున్నాయి.టొమాటోలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్టరాల్ దరిచేరదు.విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల యాంటి ఆక్సిడెంట్ గా పనిచేసి కాన్సర్ కారకాలతో పోరాడుతుంది.
చర్మాన్ని ముడతలు పడకుండా ఉంచుతుంది.పచ్చి టొమాటోలు ఏదో ఒక రూపంలో రోజూ తినడం అలవాటు 
చేసుకుంటే కంటి చూపు మెరుగుపడి జుట్టు కూడా పెరుగుతుంది.   

అన్నీ మూట కట్టి.....

                                                            రితీషకు ఇప్పుడు పదేళ్ళు.బంధువులామె రితీషను మూడేళ్ళప్పుడు చూశానని చెప్పింది.మళ్ళీ ఇప్పుడు కనిపించేసరికి చిన్నప్పుడు మాఇంటికి వచ్చి అది చేసేది,ఇది చేసేది అంటూ ఏకరువు పెట్టడం మొదలెట్టింది.వాళ్ళింట్లో ఒక వంగ మొక్క ఉండేదనీ,ఎవరూ లేనప్పుడు వంకాయలన్నీ కోసి ఒక పెద్ద రుమాలులో మూట కట్టేదని చెప్పింది.వాళ్ళ నాన్న కాయలు కొయ్యకూడదు అన్నా వినకుండా వంకాయలన్నీతుంచేసేదని చెప్పింది.వింటున్నఇంకొక ఆమె కూడా ఎప్పుడు ఇంటికి వచ్చినా పిల్లల బొమ్మలన్నీపెద్ద రుమాలు క్రింద పరిచేసి చిన్నపిల్లైనా చాకలి బట్టలు మూట కట్టినట్లు కట్టేసే విషయం గుర్తొచ్చింది.మా దగ్గరే అనుకున్నాను అందరి దగ్గర ఇంతేనన్నమాట అనుకుంది.ఇప్పటికీ ఆఅలవాటు పోలేదు.పిన్ని ఇంటికి వెళితే నీకు నచ్చిన గోళ్ళ రంగులు కొన్ని తీసుకోమని పెద్ద పెట్టె పెడితే ముప్పావు వంతు పెట్టె ఖాళీ చేసి దాదాపు అన్నీ మూట కట్టుకుంది.అదేమిటే?అన్నీ తీసుకున్నావు?అక్కకు కావాలి కదా!అంటే విననట్లు ఊరుకుని చక్కగా పట్టుకుపోయింది.  

Saturday, 6 June 2015

ఏదైనా పొడి చేయాలంటే.....

                                    ఏదైనా పొడి చేయాలంటే ముందుగా బాండీలో పోసి గోరువెచ్చగా అయ్యేవరకు నూనె లేకుండా వేయించాలి.ఆతర్వాత పొడి చేస్తే పొడి బరకగా రాకుండా మెత్తగా వస్తుంది.పచ్చివి పొడి చేయాలంటే ఎండలో పెట్టి మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది.

తేనెను కొలవాలంటే......

                                   తేనె దేనిలోనైన వేయటానికి కొలవాలంటే స్పూనుకు అతుక్కుని ఒకపట్టాన వదలదు.కొలత సరిగా ఉండదు.అటువంటప్పుడు స్పూనుకు పలుచగా వంట నూనె కానీ నెయ్యి కానీ రాసి కొలిస్తే తేనె స్పూనుకు అంటకుండా కొలత సరిగ్గా వస్తుంది.

యోగం లేదు

                                            సంపూర్ణమ్మకు 60 ఏళ్ళు.వయస్సు మీద పడినా జ్ఞానం మాత్రం లేదు.కొంత మందికి నోటికి అడ్డు,అదుపు ఉండధన్నట్లు ఎదుటివాళ్ళను ఏదిపడితే అది మాట్లాడుతుంది.ఆమె ఇంటిపక్కన అందమైన ఇల్లుంది.ఆ ఇల్లు కట్టటం మొదలుపెట్టినప్పటి నుండి భూమిలో బోల్డంత డబ్బు తగలెట్టారు అనేది.పునాదుల్లో బలంగా ఉండటానికి చాలా డబ్బు ఖర్చుపెట్టారని అంత ఎందుకు అని ఆమె ఉద్దేశ్యం అన్నమాట.తర్వాత ఇంటికి డబ్బు గుమ్మరించారనేది.ఇల్లు ఏరకంగా ఉన్నా ఎల్లమారిపోద్ది దాని భాగ్యానికి అంత డబ్బు పెట్టాలా?అని ఎదురుగానే మాట్లాడేది.ఇల్లు కట్టించుకున్న వాళ్లకు లేని బాధ ఈమెకి ఎంధుకు? ఇంతా ఇల్లు కట్టించుకున్నాక ఉద్యోగరీత్యా బదిలీ రావటం వల్ల అద్దెకు ఇచ్చారు.పది సంవత్సరాల్లో అద్దెకు వచ్చిన వాళ్ళు ఇంటిని పోల్చుకోలేనంతగా ఆశుభ్రంగా ఉంచారు.మొన్నామధ్య పెళ్ళిలో కనిపించి ఇదుగో అమ్మాయ్ (అందరినీ అమ్మాయ్ అని పిలుస్తుందిలే) ఇంతా బోల్డు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నావు. కానీ అద్దెకి వచ్చినవాళ్ళేమో   ఇల్లంతా చండాలం చేశారు.అద్దె మాటేమోగానీ ఆ ఇంట్లో ఉండే యోగం నీకు లేనట్టుంది ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నావు అనేసింది.సంపూర్ణమ్మ ధాటికి ఇల్లు కట్టుకున్నామె ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండదు కనుక నిశ్శబ్దంగా కూర్చుంది.    

Thursday, 4 June 2015

కాబేజి పెరుగు పచ్చడి

కాబేజి - 1 (మధ్యరకంది)
పచ్చిమిర్చి - 12
చింతపండు - కొంచెం 
జీర -1 స్పూను వెల్లుల్లి - 1 పాయ 
ఉప్పు - తగినంత 
పసుపు - 1/4 స్పూను 
నూనె - 1/2 గరిటెడు
ఉప్పు - తగినంత  
పెరుగు - 2 గరిటెలు 
                                          కాబేజి సన్నగా తరగాలి.కొంచెం నూనె బాండీలో వేసి పచ్చిమిర్చి మధ్యకు చీల్చి వేయించాలి.ఒక గుప్పెడు ముక్కలు ప్రక్కన పెట్టుకోవాలి.అదే నూనెలోకాబేజి వేయించాలి.కొంచెం ఆరినతర్వాత పచ్చిమిర్చి,జీర,వెల్లుల్లి,ఉప్పు,చింతపండు వేసి నలిగిన తర్వాత  కాబే జి వేసి మెత్తగా అయినతర్వాత ముందే తీసి ఉంచిన   ఒకగుప్పెడు పచ్చి కాబేజీ ముక్కలువేసి కొంచెం నలగనివ్వాలి.బాండీలో కొంచెం నూనె వేసి తాలింపు వేయాలి.స్టవ్ కట్టేసి పెరుగు వెయ్యాలి.దానిలో మెత్తగా చేసిన కాబేజీపచ్చిమిర్చి వేసి కలపాలి.అంతే కాబేజీ పెరుగు పచ్చడి తయరయినట్లేఇది అన్నంతో తింటే కరకరలాడుతూ బాగుంటుంది.తాలింపు వేసేటప్పుడు పెరుగులో 1/4 స్పూను పంచదార వేస్తే కాబేజి వాసన రాకుండా ఉంటుంది. 

అమ్మ కుండ - అత్త కుండ

                                                  వేదవతి చిన్నప్పుడు కోతికి శిక్షణ ఇచ్చి ఇంటింటికి డబ్బులకోసం వచ్చేవాళ్ళు. శిక్షకుడు అడిగినవాటికి రకరకాల  హావభావాలు ముఖంపై చూపిస్తూ సైగలద్వారా కోతి ఏది చేయమంటే అది చేసేది.
పిల్లలు,పెద్దలు అది చేసే పనులను చూచి ముచ్చటపడి తోచినంత ఇచ్చేవాళ్ళు.అందులో భాగంగా రెండు చిన్నచిన్న మట్టికుండల్లో  కొద్దిగా నీళ్ళుపోసి కోతికిచ్చి ఇది అమ్మ కుండ,ఇది అత్త కుండతీసికెళ్ళి అక్కడ పెట్టి రమ్మంటే నెత్తి మీద పెట్టుకుని అమ్మ కుండ జాగ్రత్తగా తీసికెళ్ళి గోడపక్కన పెట్టేది.అత్త కుండను కొద్ది దూరం తీసికెళ్ళి క్రింద పడేసేది.వేదవతికి కోడలు పనులు చూస్తుంటే చిన్నప్పుడు తను చూచిన కోతి చేసిన పనులే గుర్తొస్తున్నాయి.ఎందుకంటే కోడలు తన మూడ్ ని బట్టి వంటైనా,మరేదైనా చేస్తుంది.ఒక్కొక్కసారి అక్కరలేని వాళ్ళను నెత్తినపెట్టుకుని తెగ మర్యాదలుచేసి,అవసరమైన వాళ్ళను అసలు పట్టించుకోకుండా చూడనట్లు నాటకమాడి తాగటానికి నీళ్ళు,తినటానికి తిండి కూడా పెట్టదు.అమ్మవైపు బంధువుల ఇళ్ళకు వెళ్ళేటప్పుడు డాబుసరిగా వెళ్ళి,అత్తవైపు బంధువుల ఇళ్ళకు సాదాసీదాగా వెళ్తుంది.ఈమధ్య విసుగొచ్చినవ్వుతూ అన్నట్లు  కోతి చేసినట్లు అమ్మ కుండ - అత్త కుండ లాగా చేస్తున్నావు అంటే నవ్వుకుంటుంది తప్ప తను మారదు.  

Wednesday, 3 June 2015

అభిరుచి

                                                   మోక్ష కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసి పదవీవిరమణ చేసింది.మోక్షకు ప్రకృతి అంటే చాలా ఇష్టం.శేష జీవితాన్ని తన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంది.నగరంలో ఏకొద్ది స్థలం
ఉన్నా భవనాలు కట్టి అద్దెకు ఇద్దామనే పరిస్థితి.ఈపరిస్థితిలో సృజనాత్మకంగా ఎలా తోటను పెంచాలా అని ఆలోచించి తన ఇంటిపైన తోటను పెంచటం మొదలుపెట్టింది.మట్టి కుండీలలో,టెర్రకోట బొమ్మలు,పాలరాతితో చేసిన రకరకాల బొమ్మలమధ్య ఒక నీటి కొలను,వాటర్ ఫాల్ అన్నీ అమర్చుకుంది.ఎండకు తట్టుకొని మొక్కల కోసం ప్రత్యేకంగా ఒక షీట్ తో గుడారంలాగా తయారుచేయించింది.కూరగాయలు,ఆకుకూరలు,రకరకాల పువ్వులు మొత్తం 250 మొక్కలు పెంచింది.మొక్కల మధ్య తిరుగుతుంటే సంతోషంతోపాటు ప్రత్యేకించి వ్యాయామం చేసే పనిలేకుండా వాటి పోషణతో సమయం తెలియకుండా గడిచిపోతుందంటుంది.రసాయనాలు ఉపయోగించని కూరగాయలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాక తన అభిరుచికి తగినట్లుగా చేయటంవల్ల ఎంతో సంతృప్తి కలుగుతుందని సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది.మోక్షను తప్పకుండా అభినందించవలసిందే.  

బల్లి పడేసింది

                                 శ్రీనిజ మిగతా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటుంది.కానీ బల్లంటే చాలా భయం.ఒకరోజు కార్యాలయం నుండి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆలస్యమైంది.తలుపు తీయగానే అకస్మాత్తుగా బల్లి క్రింద పడింది.దాన్ని చూచి కెవ్వు,కెవ్వు అంటూ కేకలు పెడుతూ తను కూడా క్రింద పడిపోయింది.అసలే బొద్దుగా ఉంటుందేమో రెండు చేతులమీద బరువు పడి చేతులు,నడుము అయితే విరగలేదు కానీ వేళ్ళ ఎముక ఒకటి చిట్లి కట్టు వేశారు.ఇంకొక చేతికి గట్టి దెబ్బ తగిలింది.వృత్తిరీత్యా కుడి చేతితో పని చేయాలి కనుక కట్టు మధ్యలోనే తీసేసింది.అందువల్ల నొప్పి తగ్గలేదు.వారిజ వెళ్ళేటప్పటికి పనిఅమ్మాయితో చెయ్యి నొక్కించుకుంటుంది.ఏమైదని అడిగితే బల్లిని చూచి భయం వేసి క్రింద పడ్డాను అని చెప్పి కాదు కాదు బల్లి నన్ను క్రింద  పడేసిందని చెప్పింది.

Tuesday, 2 June 2015

గోంగూర మటన్

 మటన్ ముక్కలు - 1/2 కె.జి (మధ్యరకం ముక్కలు)
ఉల్లిపాయలు - 1/4 కె.జి
కారం - ఒకటిన్నర టేబుల్  స్పూను
ఉప్పు - తగినంత
అల్లంవెల్లుల్లి - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - 1 కట్ట
పుల్ల గోంగూర - 6 కట్టలు
సోయా కూర - 1 కట్ట సన్నది
 పచ్చిమిర్చి - 6
నూనె - గుంట గరిటెడు
                                                    కుక్కర్ లో నూనె వేసి రెండు యాలకులు,మూడు లవంగాలు,ఒక దాల్చిన చెక్క మధ్యరకంది,కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,కారం,ఉప్పు,అల్లంవెల్లుల్లి వేసి కలిపి ఒక పావులీటరు నీళ్ళు పోసి నాలుగు విజిల్స్ రానివ్వాలి.బాండీలో సోయా కూర వేసి నీరంతా ఇగిరిపోయేవరకు వేయించాలి.తర్వాత ఉడికించిన మటన్ ముక్కలు వేసి వేయిస్తూ ఉండాలి.మరో బాండీలో గోంగూర ఆకులు వేసి ఉడికించి ముద్దలా అయినతర్వాత వేగుతున్న మటన్ లో వేసి పది ని.లు ఉడికించి చివరగా కొత్తిమీర తురుము వేయాలి.అంతే రుచికరమైన గోంగూర మటన్ తయారయినట్లే.ఇంకా పుల్లగా కావాలనుకుంటే గోంగూర మరికాస్త వేసుకోవాలి.
గమనిక :ఇదే విధంగా గోంగూర,సోయా కూర బదులు చిన్నమెంతు కూర ఒక గుప్పెడు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 

Monday, 1 June 2015

రాగిజుట్టు నల్లగా మారాలంటే .........

                                               1/4 కప్పు కొబ్బరినూనెలో 3 టేబుల్ స్పూన్ల ఒంటి రెక్క ఎరుపు మందార రేకల పొడి వేసి సగం అయ్యేవరకు మరగనివ్వాలి.దానికి రెండు స్పూన్ల ఆముదం కలిపి అవసరమైనంత తలకు రాసుకుని మర్నాడు తలస్నానం చేయాలి.ఇలా చేస్తే క్రమంగా రాగిజుట్టు నలుపురంగులోకి వస్తుంది.

కొలిమిలో పడ్డట్లు ........

                                                   రామతులశమ్మ గారికి అరవై  తొమ్మిదేళ్ళు.మనుమరాలు,మనవడు,తమ్ముడి కుటుంబాన్ని చూద్దామని విదేశాల్లో ఉన్న తమ్ముడింటికి వెళ్లారు.అక్కడ ఉన్నన్ని రోజులు అందరికంటే ఎంతో ఉత్సాహంగా నాలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూచి వచ్చారు.స్వదేశానికి వచ్చేటప్పుడు అబుదాబీలో మిట్టమధ్యాహ్నం విమానం దిగారు.చల్లటి ప్రదేశం నుండి వచ్చి దిగీదిగగానే భానుడి ప్రతాపానికి తట్టుకోలేక ఒక్కసారిగా కొలిమిలో పడ్డట్లు అనుభూతి కలిగి విలవిలలాడారు.స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విపరీతమైన ఎండలవలన వారం రోజులు మూసినకన్ను తెరవకుండా మంచానికి అతుక్కుపోయి సమయానికి కొంచెం తినడానికి,తాగటానికి లేవటం తప్ప చల్లదనంలో నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.నా జీవితకాలంలో ఎండ దెబ్బ అంటే ఏమిటో ఇప్పుడే అనుభవమైంది అని చెప్పారు. 

మేఘాలు అడ్డొచ్చి ......

                                               అరవింద ఒకసారి విమానంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పెద్ద కుదుపుతో విమానం రెండుసార్లు అటూఇటూ ఊగింది.ఆసమయంలో అందరూ కాఫీ,టీ,ద్రవపదార్ధాలు ఎవరికి నచ్చినవి వారు తాగుతున్నారు.ఆ కుదుపులకు అందరి చేతుల్లో నుండి గ్లాసులు,కప్పులు ఎగిరి క్రింద మీద పడిపోయినాయి.ఏమి జరుగుతుందో ఆక్షణంలో ఎవరికీ అర్ధం కాలేదు.మేఘాలు అకస్మాత్తుగా అడ్డువచ్చి క్రిందికి దించడం వల్ల  అలా జరిగింది.ఎవరూ కంగారు పడొద్దు అని చెప్పారు.హమ్మయ్య!అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.