Wednesday, 30 November 2016

ఆల్ ఇండియా రేడియో రాణి

                                                                                   సుదీప్తి పిన్నిని అందరూ ఆల్ ఇండియా రేడియో రాణి అని అంటారు.ఎందుకంటే ఆకాశ వాణి వార్తలు చదువుతున్నవారు రాణి అని రేడియోలో చెప్పినట్లు సుదీప్తి పిన్నికి ఒక వార్త తెలిసిందంటే ఆ వార్త ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరికీ  తెలిసినట్లే.బంధువులలో ఎవరికి ఏమి జరిగినా మంచి అయినా,చెడు అయినా ఆ వార్త దేశ విదేశాలలో ఎక్కడున్నా బంధువులు,స్నేహితులు,ఇరుగు పొరుగున ఉన్న అందరికీ తెలియాలంటే ఆమెకు చరవాణి ద్వారా ఒక్క మాట తెలియచేస్తే చాలు.ఆమె పనిగట్టుకుని ఎంత దూరంలో ఉన్న వాళ్లకయినా వార్త చేరవేసే వరకు నిద్రపోదు.వార్త ఎవరికయినా చరవాణి ద్వారా చేరకపోతే అవసరమైతే స్వంత ఖర్చులు పెట్టుకుని మరీ వెళ్ళి చెప్పి వస్తుంది.అందుకే ముందుగా ఎటువంటి కబురు అయినా ఆల్ ఇండియా రేడియో రాణికి చెప్పి అందరికీ తెలియ చెప్పమని  చెప్తుంటారు. 

Tuesday, 29 November 2016

పువ్వుల కోసం ఎగిరి....

                                                            కృష్ణ కుమారి తెల్లవారుఝామున పూజ కోసం పువ్వులు కోయడానికి ఇంటి ముందుకు వెళ్ళింది.ఒడి నిండా రకరకాల పువ్వులు కోసుకుని చిటారు కొమ్మన ఒక పువ్వుల గుత్తి అందంగా ఉందని దాన్ని అందుకోవడం కోసం ఒక్క ఎగురు ఎగిరింది.కొద్దిలో కొమ్మ అందలేదని ఈసారి ఎలాగయినా సరే కొమ్మను అందుకోవాలని  ఇంకాస్త పైకి ఎగిరింది.కొమ్మ అందకపోగా అదే వేగంతో నేల మీద పడిపోయింది.చేతి మీద శరీరం బరువు మొత్తం పడేసరికి చేతి ఎముక మూడు ముక్కలు అయింది.వామ్మో !నా చెయ్యి విరిగి పోయిందిరో దేముడో!అంటూ ఒక పొలికేక పెట్టేసరికి ఇంట్లో నిద్రపోయే వాళ్ళందరూ బయటకు పరుగెత్తుకుని వచ్చారు.వెంటనే అందరూ కలిసి కింద నుండి లేపి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.చేతి ఎముక మూడు చోట్ల విరిగింది ఎలా పడింది?అని వైద్యుడు అడిగితే కృష్ణ కుమారి భర్త పువ్వుల కోసం ఎగిరి క్రింద పడింది అని చెప్పాడు.పరామర్శించడానికి వచ్చిన వాళ్ళందరితో కూడా పువ్వుల కోసం ఎగిరి చెయ్యి విరగ్గొట్టుకుంది అని చెప్పడం మొదలెట్టాడు.పడి చెయ్యి విరిగిన బాధ కన్నా కృష్ణ కుమారికి  ఈ దెప్పిపొడుపుల గోల ఎక్కువైపోయింది.  

Monday, 28 November 2016

చిరునవ్వు

                                                                           ఒక చిన్న చిరునవ్వు మన జీవితకాలాన్ని పెంచుతుంది అంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.ఎవరైనా చిరునవ్వుతో పలకరిస్తే మనసుకు హాయిగా ఉంటుంది.మనం కూడా అదే చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించడం అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతతతోపాటు గుండె జబ్బులను కూడా అరికట్టవచ్చు.వీలయినప్పుడల్లా నవ్వు తెప్పించే అంశాలను వినడం,చదవడం,చూడటం అలవాటు చేసుకుంటే చాలా వరకు ఒత్తిడి తగ్గి ఏ అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. 

Saturday, 26 November 2016

సంధ్య వేళ

                                                                కల్పన సంధ్య వేళ తులసి మొక్క దగ్గర దీపం పెట్టి ఒక రెండు గంటల తర్వాత పూజా సామగ్రి తీసుకురావటానికి వెళ్ళింది.దీపం ఇంకా దేదీప్యమానంగా  వెలుగుతూనే ఉంది.మిగతావన్నీ తీసుకుని వెనుతిరుగుతుండగా ఎండి పోయిన వేపాకు వంపు తిరిగినట్లుగా ఉంటే వేపాకు అనుకుని నివేదన పెట్టిన కమలా ఫలంతోపాటుగా చేతితో పట్టుకుని లాగింది.అది చిన్నగా కదిలి దీపారాధన పళ్ళెం ముందుకు వచ్చింది.ఏంటా?అని పరీక్షగా చూచే సరికి ఎండు వేపాకు రంగులో ఉన్న బల్లి ఉంది.చీకట్లో ఎలా పడితే అలా వెళ్ళిపోయి  ఏది పడితే అది పట్టుకుంటే అదే బల్లి కనుక సరిపోయింది.ఏ తేలు పిల్లో అయితే ఒత్తిడి తగలగానే చేతిని కుట్టేసేది.అప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉండేది.ఇంకా నయం లేచిన వేళ మంచిదయింది అనుకుంది కల్పన.

Tuesday, 22 November 2016

చలికాలంలో చర్మం

                                                              చలికాలంలో మా సబ్బు వాడితే మీ చర్మం ఎంతో నునుపుగా ఉంటుంది అంటూ బుల్లితెరపై వచ్చే ప్రకటనలు చూచి మోసపోయి ఆ సబ్బులు కొనుక్కుని వాడుకున్నాఇంకా చర్మం కాంతి విహీనంగా,తెల్లగా పొట్టు రాలిపోతున్నట్లు ఉంటుంటే ఏమి చేయాలో తెలియక బాధపడిపోతూ ఉంటాము.దానికి బదులుగా మన ఇంట్లోనే సహజంగా వాడుకునే  పండ్లు,కూరగాయలు,పెరుగు,పాలు,కొబ్బరినూనె,తేనెతో ఒకదానితో ఒకటి కలిపి రకరకాల పూతలతో చర్మాన్ని నునుపుగా ఉండేలా చేయవచ్చు.అదెలా అంటే పాలపై ఉన్న పల్చటి మీగడ తీసి రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి,మెడకు,చేతులకు రాసి ఒక పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో కడిగితే చర్మం నునుపుగా ఉంటుంది.పెరుగు,తేనె కలిపి ఒకసారి,బాగా మగ్గిన అరటిపండు మెత్తగా చేసి ఒక స్పూనుతో తీసుకుని ఒక పావు స్పూను తేనె కలిపి మరొకసారి,కమలా రసం తేనె కలిపి ఇంకొకసారి పూతలా వేసి ఒక పది ని.లు ఉంచి కడిగేయాలి.అలా ఒక పది ని.లు రోజుకొకసారి చేస్తే చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉంటుంది.అలాగే కారట్ తురిమి లేదా మిక్సీలో వేసి కొద్దిగా గుజ్జులో తేనె కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.రోజూ చలికాలంలో రాత్రి పడుకునే ముందు పెదవులకు మీగడ,నెయ్యి లేదా కొబ్బరి నూనె రాసుకుంటే మృదువుగా ఉంటాయి.తేనె అప్పుడప్పుడు రాస్తే పెదవుల నలుపుదనం తగ్గుతుంది.  

Monday, 21 November 2016

ఎల్లి బద్ద

                                                                      చెన్నమ్మ అత్తారింటికి కాపురానికి వెళ్ళినప్పుడు నాలుగు నిట్టాళ్ళ పాక ఉండేది.దాన్నేనాలుగు గదులుగా చేసి అత్త,బావ,చెన్నమ్మ,మరిది తలా ఒక గదిలో ఉండేవారు.కొన్నాళ్ళకు పాకకు ఉండే వెన్ను బద్ద  విరిగిపోయింది.చెన్నమ్మ మేనమామ వచ్చి వెన్ను బద్ద విరిగిన ఇంట్లో ఉంటే ఎవరో ఒకళ్ళ ప్రాణానికి ముప్పు వెంటనే తీసేసి మరొకటి వేయించుకోవాలి అని చెప్పాడు.ఆ విషయం చెన్నమ్మ అత్తతో చెప్పగానే గయ్,గయ్ మంటూ కోడలిపై ఒంటి కాలి మీద లేచి నువ్వు తెచ్చిన డబ్బు కట్టలు కట్టలు ఇక్కడ మూలుగుతూ ఉన్నదని ఎల్లి బద్ద కొత్తది వేయించమంటావా?ఎవరు చనిపోయినా సరే కొత్తది వేయించేది లేదు అంది.మంచిది కాదని తెలిసినా బిక్కుబిక్కు మంటూ అందరితోపాటు ఉంది చెన్నమ్మ.ఇంతలో రెండు నెలలకే చెన్నమ్మ మామ,బావ కూడా చనిపోయారు.మరిదికి కూడా జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉన్నాడు.అప్పుడు కానీ చెన్నమ్మ అత్తలో మార్పూ రాలేదు.చెన్నమ్మను పిలిచి నువ్వు చెప్పింది నిజంగానే జరిగింది.కొత్త ఎల్లి బద్ద కొనుక్కొచ్చి రేపు వేద్దాము అని చెప్పింది.ఆ మాట వినగానే చెన్నమ్మకు ఎక్కడి లేని ఉత్సాహము వచ్చి చిన్నపిల్లలా గెంతులు వేసినంత పని చేసింది.

Friday, 18 November 2016

బొట్టు

                                              నుదుట గుండ్రని బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం.ఆడవాళ్ళు,మగవాళ్ళు పూర్వం నుదుట బొట్టు లేకుండా ఉండేవారు కాదు.మగవాళ్ళ మాట దేముడెరుగు నేడు చాలామంది ఆడవాళ్ళు కూడా నుదుట బొట్టు పెట్టుకోవడం లేదు.పెద్దవాళ్ళు చెప్పినా చాదస్తం అనుకునే రోజులు.కలికాలం కదా!ఎవరినీ ఏమీ అనకూడని రోజులు.ఎవరి ఇష్టం వారిదన్నట్లు చూసీ చూడకుండా వదిలేయడమే అని అనుకున్నా చూస్తూ వదిలేయలేము బొట్టు నుదుటికి అందం తీసుకురావడమే కాకుండా బొట్టు పెట్టుకుంటే ఎదుటి వారి దృష్టి ముందుగా కొట్టొచ్చినట్లు కనిపించే బొట్టుపై పడుతుంది.నరుడి కంటికి నల్లరాయి నుగ్గయి (బద్దలై)పోతుందని పెద్దల మాట.మన బంధువులైనా,స్నేహితులైనా,ఇరుగు పొరుగు,ఇంకా వేరే ఎవరైనా సరే ఒక్కొక్కరి చూపు ఒక్కొక్కలాగా ఉంటుంది.తెలిసీ తెలియకుండానే అసూయ ఉండవచ్చు.అందువల్ల నుదుట బొట్టు ఉంటే కొంతవరకు నర దృష్టి కొట్టుకు పోతుంది.అంతేకాక రెండు కనుబొమల మధ్య కుంకుమ పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని లలాట భాగంలో  అంటే నుదుట బొట్టు పెట్టుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుందని పెద్దల ఉవాచ.

Thursday, 17 November 2016

కళ్ళకు కట్టినట్లుగా

                                                   తొంభై సంవత్సరాల వయసు ఉన్నవకుళ పెద్దమ్మ చాలా తెలివి కలది.ఎంత దూరమైనా బస్సులో ఒక్కటే ప్రయాణం చేసి ఎవరు భోజనానికి పిలిచినా తరతమ భేదం లేకుండా వెళ్ళి వచ్చేది.అటువంటిది మోకాలు నొప్పిగా ఉందని శస్త్ర చికిత్స చేయించుకుంటే కళ్ళు కనిపించకుండా పోయాయి.చాలా దగ్గరగా కొంచెం చూపు కనిపిస్తుంటుంది.అయినా విసుగు,విరామం లేకుండా బుల్లితెరపై వచ్చే ధారావాహికలన్నీ క్రమం తప్పకుండా చూస్తూ ఉంటుంది.చూడటమే కాకుండా ఎవరు ఇంటికి వచ్చినా,ఫోను చేసినా అమ్మాయ్!బుల్లి తెరపై ఈరోజు వచ్చిన ఫలానా ధారావాహిక చూశావా?అంటూ మొదలుపెట్టి తనకు నచ్చిన అన్నిధారావాహికలు అనర్గళంగా ఫలానా దాంట్లో అలా చేసింది ఇలా చేసింది అంటూ తిడుతూ,పొగుడుతూ చెపుతూ ఉంటుంది.కళ్ళు బాగా కనిపించే వాళ్ళన్నా అంత చక్కగా కళ్ళకు కట్టినట్లు వినసొంపుగా చెప్పలేరు.పైగా చెప్పే విధానం కూడా అక్షరం పొల్లు పోకుండా తనదైన శైలిలో చక్కగా చెపుతూ ఉంటుంది.ఇప్పుడు చూసినది కాసేపటికి మర్చిపోయే రోజులు.ఆమె జ్ఞాపక శక్తికి అందరూ అబ్బురపడతారు.

Wednesday, 16 November 2016

చిటికెడు బెల్లం

                                                                             ముఖ్యమైన పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిటికెడు బెల్లం నోట్లో వేసుకుని వెళితే అనుకున్నపని పూర్తవుతుందని మన పూర్వీకుల నమ్మకం.అలాగే భోజనం తర్వాత కూడా చిన్న ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు ఉండవని చెబుతుంటారు.ఈ చలికాలంలో పంచదార బదులు బెల్లం వేసుకుంటే జలుబు,దగ్గు రాకుండా ఉంటాయని,వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పెద్దవాళ్ళు సూచిస్తారు.ఏ రూపంలో తిన్నా పల్లీలు తినగానే చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే త్వరగా జీర్ణమవుతాయని తప్పకుండా తినాలని పిల్లలకు పెట్టి పెద్దవాళ్ళు కూడా తింటారు.పాయసంలో కూడా బెల్లం వేస్తే ఆ రుచే వేరు.అటుకులు,బెల్లం కలిపి పెడితే శ్రీ కృష్ణ పరమాత్ముడు అంతటి వాడికి కూడా ఎంతో ఇష్టం.ఇక మనమెంత?పంచదార కన్నా బెల్లం తినడం ఎంతో శ్రేష్టం.బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి సహజమైన ఔషధం.బెల్లంతో చేసిన ఏ పదార్ధమైనా ఎంతో రుచిగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు.

Tuesday, 15 November 2016

ఆరోగ్య పరిరక్షణ

                                                  ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తిని కడుపు నిండింది అని అనుకోకుండా కాస్త శ్రద్ధ పెట్టి పోషక విలువలతో కూడిన సమతులాహారం సమయానికి తీసుకుంటూ ఉండాలి.శరీరానికి తగినంత శ్రమ ఉండేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.పని తక్కువగా ఉందని అవసరానికి మించి నిద్రపోకుండా తగినంత నిద్ర పోతుండాలి.రోజూ కాసేపు వీలయితే ధ్యానం లేదా యోగా వంటివి చేస్తూ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలిగితే 
ఆరోగ్య పరిరక్షణ సాధ్యపడి సంపూర్ణ ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.

Monday, 14 November 2016

అయోమయం

                                             నాగార్జున కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కొంతమంది స్నేహితులతో కలిసి ఒక నాట్యప్రదర్శనలో పాల్గోవటానికి పేరు నమోదు చేసుకున్నాడు.నాట్యాన్ని అభ్యసించే క్రమంలో కొంతమంది ఒకవైపు ఒక రకం మరో కొంతమంది వేరొకవైపు మరోరకం నాట్యం చేయాలి.ఈ క్రమంలో చేసేటప్పుడు అందరూ కలిసి చేసినామద్యలో ఎవరి గ్రూపు వాళ్ళు విడిపోవాలి.నాగార్జున ఎన్నిసార్లు చెప్పినా అయోమయం జగన్నాధం లాగా వేరే గ్రూపులో కలిసిపోయి మళ్ళీ నాలుక కరుచుకుని ఒక్కడే రంగస్థలంపై అటు నుండి ఇటు పరుగెత్తుకుని వస్తుంటాడు.అరె!అందరికి కనిపించేలా అడ్డంగా పరుగెత్తుకు రావద్దురా బాబూ!అంటే వినడు.వాడలా పరుగెత్తుకు రావటం అందరూ గొల్లుమంటు నవ్వడం అలవాటైపోయింది.చెప్పగా చెప్పగా ఎలాగైతే చివరకు సరిగ్గా చేసి స్నేహితుల పరువు,కళాశాల పరువు కూడా దక్కించి అందరి మన్నలు పొందాడు                            

Friday, 11 November 2016

ఏడుపు

                                                                  ఈమధ్య పెంపుడు జంతువులను ఇంటికి తెచ్చి పెంచితే అవి చేసే చేష్టలు,చూపే ప్రేమతో చాలావరకు ఒత్తిడి దూరమైపోతుందని తద్వారా ప్రశాంతత దొరుకుతుందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.అందుకే సావిత్రమ్మ కూడా ముద్దుగా,బొద్దుగా ఉన్న ఒక బుల్లి తెల్ల కుక్కపిల్లను తెచ్చుకుని పెంచుకుంటుంది.దాని చేష్టలతో మురిసిపోతూ ఉండగానే సావిత్రమ్మకు మనవడు పుట్టాడు.అందరూ కుక్క పిల్లను ఎవరో ఒకరికి పెంపకానికి ఇవ్వమన్నా నేను కావాలని తెచ్చుకున్నాను కనుక ఎవరికీ ఇవ్వను అని సావిత్రమ్మ తెగేసి చెప్పింది.సావిత్రమ్మ శాఖాహారి.మనవడు పుట్టక ముందు కుక్కపిల్ల కోడికూర తప్ప తినేది కాదు.రోజూ దానికోసం కూర కొనుక్కొచ్చి మరీ పెట్టేవాళ్ళు.దానికి తెచ్చిన కూర ఎవరైనా పట్టుకున్నా అరిచేది.ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు.వాళ్ళల్లో ఒక పిల్లాడు  కోడికూర వేస్తేనే అన్నం తింటానని మారాం చేయడం మొదలు పెట్టాడు.కుక్కపిల్లకు వేడిగా కూర తెచ్చారు కదా!అని కొంచెం కూర బాబుకు పెట్టింది.ఇంతలో కుక్కపిల్ల దానికి తెచ్చిన కూర పెట్టడం ఏమిటని ఒకటే ఏడుపు.ఆ పిల్లాడి పళ్ళెంలో ఉన్న కోడికూర తీసి దాని పళ్ళెంలో పెట్టేవరకు ఏడుపు ఆపలేదు.మిగతా వాళ్ళకు విచిత్రంగా అనిపించినా సావిత్రమ్మకు దాని తత్వం తెలుసు కనుక మారు మాట్లాడకుండా మళ్ళీ కూర తెప్పించి ఆ పిల్లాడికి పెట్టింది.

Thursday, 10 November 2016

బరువు అదుపులో

                                                                             శరీర బరువు అదుపులో ఉండాలంటే వీలయినంత వరకు పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు తినడంతో పాటు అన్ని రకముల   ఆకుకూరలు,పండ్లు తింటూ ఉండాలి.ఏదో ఒక ఆకుకూర తోపాటు రెండు,మూడు రకముల కూరగాయలు కలిపి లేదా విడివిడిగా కానీ తప్పని సరిగా రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి.బెండ,దొండ,సొర,మునగ,చిక్కుడు,కాకర,బీర,ఉల్లిపాయ,పెద్దమిరప(కాప్సికం),పచ్చి బొప్పాయి కాయ తెల్ల ముల్లంగి,క్యాబేజీ,గుమ్మడి,కాలిఫ్లవర్,బూడిద గుమ్మడి,టొమాటో,వంకాయ మొదలగు వాటిలో పీచు ఎక్కువ ఉండటంతో బరువు పెరగకుండా ఉండటమే కాక అధిక బరువు క్రమంగా అదుపులోకి వస్తుంది.దుంప కూరలు తగ్గించాలి.ఆహారం ఒకేసారి తినకుండా కొంచెం కొంచెం తీసుకోవడం మంచిది.

Wednesday, 9 November 2016

శారీరక వ్యాయామం

                                           శారీరక వ్యాయామం ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మంచిది.శరీరానికి చెమట పట్టేలా వేగంగా నడవడం,సైకిలు తొక్కడం,తోటపని చేయడం,పరుగెత్తడం వంటి వ్యాయామం ఎవరు చేయగలిగింది వారు రోజూ క్రమం తప్పకుండా చేయగలిగితే అనేక రోగాలను అరికట్టవచ్చు.ముఖ్యంగా మధుమేహం వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.ఇవేమీ చేయలేనప్పుడు కనీసం కూర్చున్నచోటే చేతులు కాళ్ళు కదిలిస్తూ శరీరాన్ని వంచుతూ వ్యాయామం చేస్తే మంచిది.రోజు బుల్లితెరలో  ధారావాహికలు చూచేటప్పుడు కదలకుండా కూర్చునే బదులు ప్రకటనలు వచ్చిన సమయంలో లేచి అటూ ఇటూ తిరగడం,జాగింగ్ చేయడం చేస్తే కొంతలో కొంత శారీరక శ్రమ చేసినట్లవుతుంది.ఏ వయసు వారికయినా ఎంతో కొంత శారీరక శ్రమ చేస్తుంటే శరీరం ఎటు అంటే అటు తేలికగా వంగుతుంది.దాంతో ఊబకాయం రాకుండా ఉంటుంది. 

Tuesday, 8 November 2016

మధుర స్మృతులు

                                                                         శారద,శ్రావణికి చరవాణి ద్వారా మధుర స్మృతులు అనే వీడియో పంపించింది.ఆ వీడియో చూడగానే శ్రావణికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఒక్కసారిగా తన మధురమైన బాల్యంలోకి వెళ్ళిపోయింది.కల్మషంలేని స్నేహం,ఆ ఆప్యాయతలు,అందరూ కలిసి కట్టుగా ఆటలు,అల్లరి పనులు,కోతి
కొమ్మచ్చి ఆటలు,తొక్కుడు బిళ్ళ,గోలీలాట,అందరూ బాదం చెట్ల దగ్గర చేరి పెద్ద కంకర రాయితో బాదం కాయలు కొట్టి పప్పులు తినటం,సీమ తుమ్మకాయలు కొయ్యటానికి పెద్ద వాసం తెచ్చి కొంకి కట్టి కష్టపడి కాయలు కోసి అందరూ పంచుకుని  తినడం,తాటి కాయలు కోయించి ముంజెలు తినడం,రేగు కాయలు,ఇంట్లో నుండి ఎవరూ చూడకుండా కారం,ఉప్పు తెచ్చి పుల్లటి ఉసిరి కాయలు తినడం,చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగటం,చెట్లు ఎక్కగలవా?గుట్టలు ఎక్కగలవా?అంటూ పోటితో చెట్లు ఎక్కి చిటారు కొమ్మకు చేరడం,అరమగ్గిన,చిలక్కొట్టిన జామకాయలు ఎవరి దొడ్లో ఉంటే వాళ్ళింట్లో పిల్లలందరూ పొలోమంటూ వెళ్ళి నిశ్శబ్దంగా కాయలు దులిపెయ్యడం,పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఏమీ తెలియనట్లు నంగనాచి తుంగ బుర్రల్లా కూర్చోవడం,పుస్తకాలు పట్టుకుని తెగ చదివేస్తున్నట్లు నటించడం వాళ్లటు వెళ్ళగానే ఒకళ్ళను చూచి ఒకళ్ళు ముసిముసి నవ్వుకోవడం అన్నీఒకదాని వెనుక ఒకటి సినిమా రీలులా గిర్రున తిరిగాయి.ఒకటే బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి అంటూ స్నేహితురాలు శారద పంపిన వీడియో చూసి అవి ఎన్నటికీ మరిచిపోలేని మధుర స్మృతులు అని శ్రావణి సంతోషంగా ముఖం పెట్టి చరవాణి ద్వారా సమాచారం పంపింది.

                           

Monday, 7 November 2016

వెన్నంటే

                                                           లాలిత్య,లాస్య అక్క చెల్లెళ్ళు.లాలిత్య పెళ్ళయిన వెంటనే భర్తతో విదేశాలకు వెళ్ళింది.తర్వాత కొన్ని రోజులకు లాస్య పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళింది.లాస్య అప్పుడప్పుడు అక్క ఇంటికి వెళ్తూ ఉంటుంది.లాలిత్య ఒక కుక్కను ఎంతో అపురూపంగా పెంచుకుంటుంది.లాస్య అక్క ఇంటికి వెళ్ళినప్పుడు అది లాస్య ఎక్కడికి వెళ్తే అక్కడకి వెళ్ళి లాస్య వైపే చూస్తూ ఎటూ కదలటం లేదు.వంటగదిలోకి వెళ్తే లాస్య బయటకు వచ్చేవరకు కాపలా కాస్తున్నట్లు అక్కడే కూర్చుంటుంది.లాస్యకు విసుగు వచ్చి అక్కా!మీ ఇంటికి నేను ఇంకొకసారి రాను.మీ కుక్క నా వెన్నంటే తిరుగుతూ నన్ను అనుమానంగా దొంగను చూచినట్లుగా చూస్తూ కాపలా కాస్తుంది అని చెప్పింది.అదేమీ కాదు నువ్వు రోజూ కనిపించవు కదా అందుకే ఆ విధంగా చేస్తుంది అని అక్క నచ్చచెప్పినా ఆ సమాధానం లాస్యకు అంతగా రుచించ లేదు.కుక్క చూపులో కూడా మార్పు లేదు.

Sunday, 6 November 2016

కోటి సోమవారాలు

                                                      కార్తీకమాసం అంటేనే ఎంతో విశిష్టమైనది.అందులో ఈ సోమవారం మరీ ప్రత్యేకమైనది.కార్తీక మాసంలో సోమవారం,సప్తమి తిధి,శ్రవణానక్షత్రం మూడు కలిసి రావటం చాలా అరుదు.ఈరోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా మిగతా అన్ని రోజులకన్నాఎంతో మంచిది.ఈ సోమవారం శివుడికి ఇష్టమైన అభిషేకం చేయించినా,ఉపవాసం ఉన్నా కోటి సోమవారాలు చేసినంత ఫలితం.అందుకే దీన్ని కోటి సోమవారం అంటారు.ఈ కార్తీకమాసంలో వచ్చిన  ఐదు సోమవారాలు చేయలేకపోయినా ఈ ఒక్క సోమవారం చేయగలిగితే  కోటి సోమవారాల పుణ్యం మూట కట్టుకోవచ్చు.పైన చెప్పినట్లు ఏమీ చేయలేకపోయినా కనీసం దర్శనం చేసుకున్నాశుభప్రదం.
                                                   
                                                             
                                      

Saturday, 5 November 2016

మూడు పేర్లు పిల్ల

                                                      విజయ లక్ష్మి కుమారి  ఊరిలో ఒక పెద్దాయన ఆయన వయసుకు తగిన పనులు ఏదో ఒకటి చేసుకోగలిగినా సోమరితనంగా ఊరికే రచ్చబండ దగ్గర కూర్చునేవాడు.తను ఖాళీగా కూర్చునేది కాక దారిలో వెళ్ళే వచ్చే వాళ్ళను పలకరించి అబ్బాయ్ కాసేపు వచ్చి కూర్చో అని పిలిచేవాడు.ఒకటి రెండుసార్లు వెళ్ళినా ఈయన ధోరణికి విసుగు వచ్చి వినపడనట్లు వెళ్తుంటే వచ్చేవరకు పెద్దగా అరచి పిలవడం మొదలు పెట్టాడు.ఈయన ధాటికి తట్టుకోలేక అందరూ వేరేదారిలో వెళ్ళటం మొదలు పెట్టారు.ఎవరూ ఈయన సొద వినటం లేదని ఆడుకునే పిల్లలను పిలిచి మీ అమ్మా నాన్నా పోట్లాడుకుంటారా?అంటూ చెత్త ప్రశ్నలు వేసేవాడు.ఒకరోజు విజయలక్ష్మికుమారి ఇంటికి బంధువులు వచ్చారు.వాళ్ళను రచ్చబండ మీదుగా ఇంకొక చుట్టాలింటికి తీసుకుని వెళ్తూ పెద్దాయన కంట పడింది.వాళ్ళందరి ముందు మూడు పేర్లు పిల్లా!ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు అంటూ పిలిచాడు. చిన్నపిల్ల అయినా అసలే ఆమెకు రోషం ఎక్కువ.బంధువుల పిల్లలు నిన్నుఅలా పిలుస్తున్నాడు ఏమిటి?అంటూ దీర్ఘం తీశారు.అసలే కోపం వచ్చింది దానికి తోడు వాళ్ళు కూడా మాట్లాడేసరికి ముఖం కందగడ్డలా పెట్టి తాతా!నా పేరులో మూడు పేర్లు కలిసి ఉన్నంత మాత్రాన నువ్వు నన్ను మూడు పేర్లు పిల్ల అని పిలిచావంటే మాత్రం ఊరుకోను అంటూ గట్టిగా కొత్త వాళ్ళందరి ముందు అరిచేసరికి అవాక్కయ్యాడు.తాతా!వింటున్నావా?అంటూ చేతులు పట్టుకుని గట్టిగా మనిషిని ఊపేస్తూ సరే ఎప్పుడూ అనను అనేవరకు వదలలేదు.దాంతో పెద్దాయన కొత్తవాళ్ళు ఉన్నారని కిక్కురుమనకుండా అవతలకు వెళ్ళిపోయాడు.హమ్మయ్య!ఈ దెబ్బతో ఈయన బెడద వదిలింది లేకపోతే అందరినీ ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటూ ఊరిలో పిల్లలు అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Friday, 4 November 2016

తాతయ్య చెప్పిన అరటిపండు కబుర్లు

                                                         ఒకసారి శృతిలయ తాతయ్యతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళింది.ఆ ఇంట్లో ఒకచోట తాడు కట్టి ఆ తాడుకు అరటిపళ్ళు వేలాడతీసి ఉన్నాయి.ఆ అరటిపళ్ళ మీద పొగాకు రంగు,నల్లటి చుక్కలు ఉన్నాయి.శృతిలయ వాటిని చూడగానే  ఛీ!పాడైపోయిన అరటిపళ్ళు అలా తాడుకు  వేలాడేసుకున్నారేమిటి తాతయ్యా?అని  అడిగింది.అరటిపళ్ళు పాడైపోలేదు.పసుపుగా ఉన్నప్పుడు కన్నా నల్లటి చుక్కలు వచ్చినప్పుడు తింటే వాటిలో పోషకాలు రెట్టింపు ఉండి ఆరోగ్యం బాగుంటుందని,అదీకాక అన్నీ సమంగా పండుతాయని అలా వేలాడదీశారు.బాగా పండిన పండు తింటే త్వరగా జీర్ణమవటమే కాక మలబద్దకం లేకుండా చేస్తుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచి గుండె జబ్బుల బారిన పడకుండా చేస్తుంది.నల్లటి మచ్చలు వచ్చిన పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటంతో కాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.రోజు ఒక అరటిపండు తింటే శరీరం కూడా నునుపుగా తయారై మెరుస్తూ ఉంటుంది.తాతయ్య చెప్పిన అరటిపండు కబుర్లు విని శృతిలయ నేను కూడా అలాగే తింటానని తాతయ్యకు మాట ఇచ్చింది. మనందరమూ కూడా పసుపు రంగులో ఉన్నప్పుడు మాత్రమే తిని ఏమాత్రం మచ్చలు వచ్చినా చెత్తలో పడేస్తూ ఉంటాము.ఇప్పటి నుండి మనం కూడా బాగా మగ్గి అక్కడక్కడా మచ్చలు వచ్చిన అరటిపళ్ళు చెత్తలో పడేయకుండా  తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

Wednesday, 2 November 2016

మొలకలు వస్తే .....

                                                    ఉల్లి,వెల్లుల్లి పాయలకు మొలకలు వస్తే వాటిలో సారం ఉండదని పైగా వాటిని తింటే కడుపులో నొప్పి వస్తుందని అపోహతో చెత్తలో పడేస్తూ ఉంటాము.లేత పాయలు,ముదిరిన పాయల కన్నా ఇలా మొలకలు వచ్చిన పాయల్లో గింజల మొలకల్లో ఉండే మెటాబొలైట్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇవి అద్భుత యాంటీ ఆక్సిడెంట్లు మాదిరిగా పనిచేసి గుండెకు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.మాములుగానే వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కొలెస్టరాల్,బి.పిని అదుపులో ఉంచుతుంది.తాజాగా ఉల్లి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు.
గమనిక:ఉల్లి కాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాక దేనిలో వేసినా రుచితో పాటు రకరకాల వంటలు చేసుకోవచ్చు.ఇష్టమైతే అవి నా పాత పోస్టుల్లో చూడవచ్చు.

Tuesday, 1 November 2016

అమూల్యం

                                                                                    అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది.అటువంటి మహోత్కృష్టమైన ఈ జీవితంలో కాలం విలువ ఎంతో అమూల్యం.సోమరితనంతోను,అతి నిద్రతోను.అనవసరమైన సంభాషణలతోను,ఉపయోగం లేని పనులతోనూ కాలాన్ని వృధా చేయకూడదు.ప్రతి ఒక్కరూ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేస్తూ జీవిత లక్ష్యాలను చేరుకొనేందుకు పట్టుదలతో కృషి చెయ్యాలి.గడిచిపోయిన సమయం తిరిగి రాదు.కనుక దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి అన్నట్లు ఉన్నత లక్ష్యాలను చేరుకుంటూనే సేవాభావంతోపాటు మంచి ఆలోచనలతో పదిమందికి ఉపయోగపడే పనులు చేయాలి.పర్యావరణ పరిరక్షణ చేయడం ద్వారా భూమాతను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు సమయం వృధా చెయ్యకుండా అమూల్యమైన కాలాన్నిఉపయోగించుకోవాలి.కాలాన్ని జయించిన వాడు కాలుడ్ని(మృత్యువును)జయించినట్లే అన్నది నానుడి.

ఓ కన్నేసి.....

                                                                    ప్రతి ఒక్కళ్ళు ఏభై సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంపై ఓ కన్నేసి  ఉంచాలి.ఊబకాయం పెరగకుండా జాగ్రత్త పడాలి.శరీరంలో జీవక్రియా వేగం తగ్గి కొవ్వు పెరగటంతో రకరకాల సమస్యలతోపాటు రక్తంలో చక్కర నిల్వలు పెరిగటంతో మధుమేహం వచ్చే అవకాశం ఉంది.అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారం తింటూ నిత్యం వ్యాయామం చేయటంతో చాలా వరకు సమస్యల నుండి గట్టెక్కవచ్చు.దీనితోపాటు ప్రతి సంవత్సరం తీరిక చేసుకుని అన్ని పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందుగానే రాబోయే ఆపద నుండి బయట పడవచ్చు.