Sunday, 27 August 2017

గులాబీ జామ

                                                                                     చిన్నప్పుడు స్రవంతి అమ్మమ్మ వాళ్ళింట్లో తెలుపు,ఎరుపు,గులాబీ జామచెట్లు ఉండేవి.కానీ స్రవంతికి తెలుపు,ఎరుపు జామకాయల కంటే దోర గులాబీ జామకాయ అంటే మహా ఇష్టం.పెద్దయ్యాక నోటికి రుచి,కంటికి ఇంపు మాత్రమే కాక పండు కన్నా పచ్చి,దోరకాయలు తినడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిసి అన్ని రకాలు ఇష్టంగా తినడం మొదలెట్టింది.తను తినడమే కాక స్నేహితులకు కూడా చెప్పి తినేలా ప్రోత్సహిస్తుంది.జామకాయ చర్మ సౌందర్యాన్నిరెట్టింపు చేయడమే కాక రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది.థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పని చేసేలాగా చేస్తుంది.మధుమేహం,బి.పి,గుండె జబ్బు,తరచు జలుబు,దగ్గుతో బాధపడేవాళ్ళకు జామ ఎంతో మంచిదని తెలిసి కుండీలోనే విరగకాసే జామమొక్కలు తెచ్చి స్రవంతి ఇంటి ముంగిట పెట్టింది.తనకు ఎంతో ఇష్టమైన గులాబీ జామలో రామములగ(టొమాటో)లో కన్నా రెట్టింపు లైకోపిన్ ఉండటంతో పర్యవరణ కాలుష్యం నుండి శరీరాన్ని కాపాడుతుందని తెలియడంతో 20 కి.మీ దూరంలో ఉన్న నర్సరీ నుండి తెప్పించి కుండీలో పెట్టింది.ఒక జామ కాయ పది యాపిల్ కాయలతో సమానమని స్రవంతి అమ్మమ్మ చెప్పేది.జామకాయలే కాక జామాకు కూడా దంత సంరక్షణకు ఉపయోగపడుతుంది.పెద్దపెద్ద  ఖాళీ స్థలాల్లో మాత్రమే జామచెట్లు పెంచగలము అనే అపోహను తొలగించి ఆసక్తి ఉంటే చిన్నకుండీలో  కూడా ఏమొక్క అయినా పెంచుకోవచ్చని స్రవంతి స్నేహితులకు చెప్పింది. 

Thursday, 24 August 2017

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                  ఏ పని మొదలు పెట్టినా విఘ్నాలు కలుగకుండా అన్నింటా విజయం చేకూర్చాలని సర్వదా విఘ్నేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరియందు ప్రసరించాలని ప్రార్ధిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.            
                    
                              

Tuesday, 22 August 2017

వజ్రాల పెట్టె

                                                          మనసు ఒక వజ్రాల పెట్టె. జాలి,దయ,ప్రేమ,శాంతం,సంతోషం వంటి మంచి భావాలతో మనసు నింపాలి.అంతే కానీ మనసులో కోపం,ద్వేషం,అసూయ వంటి పనికిమాలిన చెత్త నింపకూడదు.దీనివల్ల మనసు ప్రశాంతత కోల్పోయి మనసు అనే వజ్రాల పెట్టె అందవిహీనంగా మారిపోతుంది.మన మనసును బట్టే మన ముఖం కనబడుతుంది. కనుక మనసు మంచి భావాలతో నిండి ఉంటే ప్రశాంతంగా,సంతోషంగా,ఉత్సాహంగా ఉంటుంది.మనసు ప్రశాంతంగా,సంతోషంగా ఉంటే వజ్రలపెట్టె ధగధగ మెరిసినట్లు మన ముఖారవిందం కూడా రెట్టింపు అందంతో మెరిసిపోతుంది. 

Monday, 7 August 2017

భావావేశాలు

                                                                            ప్రస్తుత పరిస్థితులలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో ఎంతో కొంత ఒత్తిడికి లోనవడం జరుగుతుంది.ఒత్తిడితో అలసట,నిరుత్సాహంగా ఉండటమే కాక జీవితం నిస్సారంగా ఉంటుంది.దీనితో మానసికంగా,శారీరకంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.వీటి బారిన పడకుండా తప్పించుకోవాలంటే చీటికీమాటికీ కోపతాపాలు,ఉద్రేకం వంటి భావావేశాలను అదుపులో ఉంచుకోవటమే కాక ప్రతిరోజూ ఒక పావుగంట అయినా తప్పనిసరిగా ధ్యానం చేయాలి.ఈవిధంగా చేయడం వలన శరీరానికి అలసట లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

Tuesday, 1 August 2017

నాన్న స్పర్శ

                                                                               ద్విజ ఇద్దరు పిల్లల తల్లి.ద్విజ,భర్త ఇద్దరూ యంత్ర శాస్త్రంలో పట్టభద్రులు.ద్విజ ఉద్యోగ రీత్యా మొదటి స్థానంలో ఉంటుంది.ఒక బిడ్డకు తల్లి అయ్యే వరకు బాగానే ఉంది.భర్త రెండవ బిడ్డ కావాలంటే తనకు అంతగా ఇష్టం లేకపోయినా సరేనంది.ఒక పాప ఒక బాబు చీకు చింత లేని సంసారం.భర్త ఉద్యోగం చేస్తూనే వ్యాపారం మొదలెట్టి అదనపు డబ్బు సంపాదించడంతో సంతోషంగా రకరకాల వజ్రాలు,వైడూర్యాలు కొనుక్కునేది.రోజులు ఒకే విధంగా వుండవు కదా!భర్తకు వ్యాపారంలో నష్టం వచ్చేసరికి ద్విజ మానసికంగా కుంగిపోయి నన్ను,పిల్లలను నట్టేట ముంచావు అంటూ పెద్ద పెద్దగా ఏడవడం,అరవడం చేస్తుండేది.అమెరికాలో ఉండడంతో భర్త ఎంతో ఓర్పుతో ద్విజకు వైద్యం చేయించి చిన్న పిల్లలను బాధ్యతగా పెంచుతూ ఉద్యోగం చేసేవాడు.వ్యాపారంలో నష్టం వచ్చింది కనుక బిడ్డలకు,నాకు అన్యాయం చేశావు.అందుకే నీకు,నాకు సంబంధం లేదు అంటూ పిల్లలను కూడా తండ్రి దగ్గరకు రానీయకుండా పిచ్చి పనులు చేయడం మొదలెట్టింది.తండ్రి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ కనుక పిల్లలు తండ్రి దగ్గరకు వస్తే బలవంతంగా తీసుకెళ్ళి వేరే గదిలో పెట్టేది.పిల్లల ఏడుపు వినలేక భార్య మానసిక స్థితి సరిగా లేదు కనుక వైద్యుని సలహాతో వేరే ఊరిలో ఉద్యోగానికి వెళ్ళాడు.పిల్లను బాగానే చూస్తుంది కనుక మధ్య మధ్యలో ఇంటికి వచ్చినా ద్విజలో మార్పు రాలేదు. ద్విజ చిన్నప్పటి నుండి తన వైపు నుండే ఆలోచించి తప్పు అయినా ఒప్పు అయినా తనదే ఒప్పు అనేది.వ్యాపారంలో లాభాలు,నష్టాలు సర్వ సాధారణం.లాభాలు వచ్చినన్నాళ్ళు బాగానే ఉంది.నష్టం వచ్చేసరికి నువ్వు నాకొద్దు అంటూ పిల్లల గురించి ఆలోచించకుండా పిల్లలకు నాన్న స్పర్శ తెలియకుండా తనొక్కతే పెంచుదామనే నిర్ణయం తీసుకుంది.పిల్లలు,తండ్రి ఒకళ్ళను ఒక్కళ్ళు వదిలి ఉండలేని పరిస్థితి.తల్లి,తండ్రి అనురాగంతో,ఆనందంగా పెరగాల్సిన పిల్లలు దిగులుగా ఉంటే నాన్నమ్మ కడుపు తరుక్కుపోతోంది.ఏమీ చేయలేని పరిస్థితి.మేము చదువుకున్నాం కనుక మాకు అన్నీ తెలుసు ఎవరూ చెప్పాల్సిన పని లేదు అనే అహంకారం ఒకటి.దాంతో బంగారం లాంటి సంసారం చెడగొట్టుకుని విడిపోయే పరిస్థితి దాపురించింది.