Thursday 26 May 2022

ఉగ్గు గిన్నె - నేతి గిన్నె

                                    రామచంద్రయ్య గారు,సీతమ్మ గారు నడి వయసు దాటిన దంపతులు.ఆయన నవ్వకుండా ఎదుటివారిని నవ్విస్తూ వాళ్ళకు నచ్చినా నచ్చక పోయినా పిచ్చి జోకులు వేస్తుంటారు. పెద్దాయన కనుక నచ్చక పోయినా ఎవరూ ఏమీ అనరు.దానితో నోటికి మూత లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.ఆవిడ ఈయనకు పూర్తిగా వ్యతిరేకం.నెమ్మదిగా నిండు కుండ మాదిరిగా చిరునవ్వే సమాధానంగా హుందాగా ఉంటుంది.ఈ మధ్య ఒక పెళ్ళిలో కనిపించి మనవరాలిని పరిచయం చేసి అమెరికా వెళ్తుందని చెప్పి అమ్మ,అమ్మమ్మల చేతి వంట తింటుంటేనే సన్నగా ఉంది.రేపు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో? ఈ రోజుల్లో పిల్లలు ఉగ్గు గిన్నె - నేతి గిన్నె తిండేగా తినేది అనేశారు.ఆ తిండి ఎవరికీ సరిపోదు కదా!ఆ విధంగా ఉగ్గు గిన్నె-నేతి గిన్నెలను మర్చిపోకుండా అందరికీ గుర్తు చేశారన్నమాట.

Tuesday 10 May 2022

మొదటి ముద్ద

                                                               ఈ రోజుల్లో చిన్నపెద్ద అనే తేడా లేకుండా మనలో చాలా మందికి ఆకలి మందగించడం లేదా పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించడం సర్వసాధారణం అయిపొయింది.దీనికి అంతటికి కారణం జీర్ణశక్తి మందగించడమే.మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పొడి తయారుచేసుకుని మొదటి ముద్దలో రోజూ తినడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.దీని కోసం మనం శొంఠీ పొడి ఒక చెంచా పిప్పళ్ళ పొడి ఒక చెంచా,దోరగా వేయించి చేసిన వాము పొడి ఒక చెంచా,కరక్కాయ పొడి ఒక చెంచా,సైంధవ లవణం ఒక చెంచా అన్నీ కలిపి ఒక సీసాలో పోసుకుని రోజూ ఈ పొడి ఒక అర చెంచా,ఒక చెంచా మంచి నెయ్యి కలిపి మొదటి ముద్దలో తింటే ఎటువంటి ఆహారం తిన్నా త్వరగా  అరిగిపోతుంది.దీన్ని ఎవరైనా పది సంవత్సరాలు దాటిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పాటించవచ్చు.

Monday 2 May 2022

మళ్ళీ మళ్ళీ

                                                            గత రెండు మూడు సంవత్సరాల నుండి కరోనా పుణ్యమా అని ఒకరికొకరు కనిపించడం,మాట్లాడుకోవడం లాంటి వాటితోపాటు సంబంధ  బాంధవ్యాలు సరిగా లేకపోవడంతో మొహం వాచిపోయినట్లు కొన్నాళ్ళు అందరూ ఎంతో  ప్రేమ ఆప్యాయతలతో ఉన్నారు.పరిస్థితులు కొద్దిగా చక్కబడేసరికి కొంతమందికి మళ్ళీ తల పొగరు ఎక్కువై ఎదుటి వారంటే చులకన భావం,నిర్లక్ష్యం ఎక్కువైపోతున్నాయి.ఆకలి తీరిన తర్వాత అన్నాన్ని,అవసరం తీరిన తర్వాత మనుషుల్ని నిర్లక్ష్యం చేస్తే ఆపద వచ్చినప్పుడు ఏదీ అక్కరకు రాదు.ఒక్కొక్కసారి ఎంత డబ్బు ఉన్నా తినడానికి ఏమీ దొరకని పరిస్థితి ఎదురు కావచ్చు.మనుషులు కూడా అంతే. ఆకలి,ఎదుటి వారితో అవసరం మళ్ళీ మళ్ళీ వస్తాయి.అప్పుడు ఏమనుకుని ఏమి ప్రయోజనం?చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది.