Friday, 31 January 2014

ఎన్ని వ్యాపకాలో?

       ఆరతికి,ఆర్తికి,కొద్దిపాటి పరిచయమే అయినా ఆర్తి గురించి తనకే పూర్తిగా తెలిసినట్లుగా అందరికీ చెప్తూఉంటుంది.ఆర్తి ఎవరిగురించీ పెద్దగా పట్టించుకోదు.తనపనేదో తనుచేసుకుంటూ చేతనైతే ఎవరికైనా
సహాయంచేస్తూ ఉంటుంది.ఆర్తి సహాయం పొందికూడా అదిమర్చిపోయి వెనుక ఏదోఒకటి మాట్లాడేవాళ్ళు ఉన్నారు.అదివాళ్ళ బుద్దిలోపం అనుకుంటుంది.ఆరతి కూడా ఎన్నోసార్లు చిన్నా చితకాసాయం పొందేది.వెనుక ఆవిడఅలా,ఈవిడ ఇలాఅంటూ మాట్లాడుతుందని ఎవరోఒకళ్ళు ఆర్తికి చెప్తుండేవాళ్ళు.అయినా పట్టించుకునేది
కాదు.ఆర్తి స్నేహితులు,చుట్టాలు ఏదయినా సలహాకోసం ఫోన్లుచేసి అడిగేవాళ్ళు.ఒకరోజు ఆరతి అందరిముందు
ఆర్తిగురించి తనఎదుటే ఆవిడకు ఎన్ని వ్యాపకాలో?ఎప్పుడూమాట్లాడటమేపని అనేసింది.ఆవిషయాన్నిఆర్తి
ఖండించనూలేదు,ఆరతికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదుఅనుకొని ఊరుకుంది.మనసులో మాత్రం
చదువుకుని కనీసము ఇంగితజ్ఞానమన్నా లేకుండా ఎదుటివాళ్ళ గురించి ఏమి తెలుసని మాట్లాడుతుంది
అనుకుంది.ఇలాటివాళ్ళు ఎప్పుడు మారతారో ఏంటో?ఆదేముడికే తెలియాలి.     

Thursday, 30 January 2014

వేలం వెఱ్ఱి

     జనం ఎంత వేలం వెఱ్ఱిగా ఉంటున్నారంటే చవగ్గా వస్తే చాలు అది పనికివచ్చినా రాకపోయినా ఫర్వాలేదుఅని
అనుకొంటున్నారు.ఇందుకునిదర్శనం నుమాయిష్ డ్వాక్రా బజారు.ఇసుకవేస్తేరాలనంతజనం.పొదుపుసంఘాల
వాళ్లకు ఉచితంగాస్టాలు ఇస్తే వాళ్ళు వేరేవాళ్ళకు అమ్ముకొంటారు.కొనుక్కున్నవాళ్లు ఎక్కడ చవగ్గా వస్తే అక్కడ
కొనుక్కొచ్చి ఇంట్లోతయారుచేశామనిచెప్పి ఎక్కువరేట్లకు అమ్మేస్తుంటే పిచ్చిజనాలు డ్వాక్రాలో చవగ్గాఉన్నాయి
అనుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు.తీరా ఇంటికి వెళ్ళాక చూస్తే పాడయిన వాసన వచ్చే నాసిరకం సరుకు ఉప్పగాఉన్నపచ్చళ్ళు,నిల్వఉన్నకారాలు వాసనవచ్చిన తినుబండారాలు అప్పటికిగానీ అర్దంకాదు.మార్కెట్ రేటుకన్నా చవగ్గాఎలా ఇవ్వగలరు?అనుకొంటే అలా నాణ్యతలేని వస్తువులు,మూతలులేని తినుబండారాలు
వేలం వెర్రిగా కొనరు.మంచి ఆహారం తినగలిగినవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మూతలు లేకుండా బేసిన్లో ఉన్న
ఆహారం ప్లేట్లల్లో తెచ్చుకుని గొప్పగా తిరుగుతూ తింటున్నారు.    

బేవార్స్

   
మమత కంపెనీ తరఫున ప్రదర్శనలో పెట్టిన స్టాళ్ళను రోజుకొకసారి చూచి వస్తుంటుంది.బాదంమిల్క్ అడిగి
 రోజు త్రాగటం మొదలుపెట్టింది.మొదటిరోజు డబ్బులు వద్దులే అన్నారు.ఇకఅదేపనిగా రోజు ఇవ్వమని
డబ్బులు ఇవ్వకుండా త్రాగుతుంది.స్టాలువాళ్లకు ఉచితంగా రోజు ఇవ్వటం ఇష్టంలేదు.ఒకరోజు చూడనట్లుగా
ఊరుకున్నారు.ఏమిటి?నాకు బాదంమిల్క్ ఇవ్వరా?అని అడిగేసింది.ఇలా అడుగుతున్దేమిటి?అని స్టాలువాళ్ళు
మ్రాన్పడిపోయి త్రాగటానికి ఇచ్చారు.ఇలా బేవార్స్ లాగా రోజు త్రాగటం ఏమిబావుంటుంది?ఎప్పుడైనా ఒకసారి
అయితే ఫర్వాలేదు కానీ అనుకొన్నారు.
           ఇంకొకామె మాదగ్గర ఇది దొరకటంలేదు కానీ డబ్బులుఇస్తాను మీరు తెచ్చిపెట్టండి అంటుంది.ఎలాగూ
డబ్బులు వద్దులే అంటారుకదా.ఇస్తాను అంటుంది వద్దులే అంటారు ఇక అంతే.ఇప్పుడు ఇలాటివాళ్ళు ఎక్కువ
మంది వుంటున్నారు.వాళ్ళ డబ్బు అయితే ఒకరకం ఎదుటివాళ్ళది ఒకరకం.ఇలావుంది వ్యవహారం.

Tuesday, 28 January 2014

జనారణ్యంలో పాములు

         పుట్టలను త్రవ్వి,పొలాలలో ఇళ్ళుకట్టి జనావాసాలుగా మార్చేస్తుంటే పాములు ఎక్కడఉండాలో తెలియక
 ఇళ్ళల్లోకి వస్తుంటాయి.సరిగ్గా ఒకకాలనిలోఅలాగే జరిగింది.కాలనీ ఏర్పడి చాలాసంవత్సరాలయినా కొంచెంఅవతల పొలాలు ఉండటంతో పాములు ఇళ్ళల్లోకి వచ్చేయికాదు.  ఆపొలాల్లో కూడా ఇళ్ళు కట్టటం వలన
పాములు ఇళ్ళల్లోకివచ్చిచెట్లక్రింద,మెట్లమీద విశ్రాంతితీసుకుని వెళ్తున్నాయి.దాంతో కాలనీలోఅందరూభయపడి
పాములు పట్టేవాళ్ళకోసం,ఇసుక మంత్రించేవాళ్ళ కోసం వెతుక్కుంటున్నారు.పూర్వం పాము ఇంటి ఆవరణలో
కనిపించితే ఇంట్లోకిరాకుండా పాముమంత్రం పెట్టేవాళ్ళదగ్గర ఇసుక ఒకమానికలో మంత్రించి తెచ్చుకుని ఇంట్లో,
ఇంటిచుట్టూ చల్లుకునేవాళ్ళు.అలాచేస్తే పాము ఇంట్లోకి రాదని నమ్మకం.అప్పటివాళ్ళు ఇప్పుడులేరు కనుక ఎప్పుడు ఎక్కడ పాము ఉంటుందోనని భయపడి కాలనీలో వాళ్ళందరూ తలలు పట్టుకొంటున్నారు.

Friday, 24 January 2014

గుమ్మడికాయల దొంగ

           ప్రియాంక కాలనీలోవర్ధని ఉండేది.నలుగురు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఏది మాట్లాడినా నాగురించే
మాట్లాడుతున్నారు అనేది.ఎవరైనా నవ్వుతూ కన్పించినా నన్ను చూచి నవ్వుతున్నారు అని చెప్పేది.అందరూ
సాయంత్రం అరుగులమీద కూర్చుని బాతాఖానీ అంటే కాలక్షేపం కబుర్లు చెప్పుకొనేవారు. కాసేపటికి ఒకసారి
అటూ ఇటూ తిరుగుతూ ఏమిటి నాగురించే మాట్లాడుతున్నారా?అనేది.అందరికీ ఫోన్లు చేసి మరీ ఆవిడ మాటలు పట్టించుకోకండి మీరు మాఇంటికి రండి అనేది. అసలు విషయం ఏమిటంటే ఆమె గురిచి ఎవరూ పట్టించుకోరు.
ఈరోజుల్లో ఎవరి విషయాలు వాళ్ళకే అన్నీ పట్టించుకునేంత తీరిక ఉండటంలేదు ఈవిడ గురించి మాట్లాడటానికి
తీరిక ఎక్కడ ఉంటుంది?అందరికీ ఆమెలాగ అందరి స్వవిషయాలు అడిగి తెలుసుకునేంత చవకబారు బుద్ది
ఉండదు కదా.తనలాగే అందరూ ఉంటారని అనుకొని అందరికీ ఫోన్లుచేసి,ఇంటికివచ్చినవాళ్ళను నాగురించి ఏమనుకొంటున్నారు?అని అడిగేది.అమెసంగతి తెలిసినవాళ్ళు ఎవరూ ఆమెదగ్గరకు వెళ్లరు.అందుకే క్రొత్తవాళ్ళను పట్టుకుంటూ ఉంటుంది.ఇటువంటి వాళ్ళను గుమ్మడికాయల దొంగలాగా భుజాలు తడుముకుంటుంది అంటారు.

ఏకకాలంలో పదిపనులు

        సునంద బంధువులలో ఒకామె అందరికన్నా నేనే గొప్పదాన్ని మీరెవరూ నాకు దేనిలోనూసాటిరారు అని
గొప్పలు చెప్తుంటుంది.ఒకసారి సునంద పనిటైములో ఫోను రావటంవలన వంటచేస్తూ ఫోను మాట్లాడాల్సి
 వచ్చింది అనిచెప్పింది.దానితో బంధువులామె నువ్వు ఒకేసారి రెండుపనులు మాత్రమే చేస్తున్నావేమో
 నేనైతే మైండ్,చేతులు ఉపయోగించి ఏకకాలంలో పదిపనులు చేయగలను అని చెప్పింది.అప్పుడు సునంద
ఒకేసారి అసంపూర్తిగా పనులు చేసేకన్నా సకాలంలో పనిపూర్తిచేసి చేస్తానని చెప్పిన దానికి పూర్తి న్యాయం
చేయగలగటం గొప్ప,మనగురించి మనం గొప్ప చెప్పుకునేకన్నా మనగురించి పదిమంది గొప్పగా చెప్పుకోనేట్లు
చేయటం గొప్ప అని మనసులో అనుకొంది.

Thursday, 23 January 2014

అబ్బాయని పొరపడి

       ధరణి కూతురు నాలుగు సంవత్సరాలది.మహా మొండిది.అందరూ పిల్లలతో కలిసిమెలసి ఆడుకోదు.
ఒకరోజు వాళ్ళింటికి చుట్టాలు వచ్చారు.వాళ్ళల్లో ఒకామె కూతురుకు ప్యాంటు,షర్టు వేసింది.జుట్టు కూడా
మగపిల్లవాడిలాగా కట్ చేయించింది.బొట్టు పెట్టలేదు.అకస్మాత్తుగా చూస్తే అబ్బాయనే అనుకొంటారు.
ధరణి కూతురు ఆపిల్లను అబ్బాయని పొరపడి నేను అబ్బాయితో ఆడను అని పేచీ పెట్టుకుని కూర్చుంది.
అమ్మాయని ఎంతమంది చెప్పినా వినకుండా ఆఅబ్బాయిని ఇంటికి వెళ్ళమని చెప్పులేదంటే నేను టేబులు
క్రింద కూర్చుంటానని బెదిరించి కూర్చుంది.ధరణికి ఎవరికి ఏమిచెప్పాలో తెలియని అయోమయంలో
పడిపోయింది.

తెలివితక్కువ వాడైనా మగాడే గొప్ప

          సూరయ్యకు ఇద్దరు కొడుకులు.పెద్దకొడుక్కి మొదటిసారి కూతురు పుట్టింది.చిన్నకొడుక్కి కొడుకు
పుట్టాడు.పెద్దకొడుకు కూతురు తెలివితేటలతో అందంగా ఉండేది.చిన్నకొడుకు కొడుకు మానసికంగా
ఎదుగుదల లేక అమాయకంగా ఉండేవాడు.తెలివితేటలు ఉన్నా ఆడపిల్ల ఆడపిల్లే,తెలివితక్కువవాడైనా
పిచ్చివాడైనా మగాడే గొప్ప అని సూరయ్య అందరికీ చెప్పేవాడు.అయినా పెద్దకొడుకు ఏమీమాట్లాడేవాడుకాదు.
చివరికి చిన్నకొడుకు కొడుకు అలాగే ఉన్నాడు.పెద్దకొడుకు కూతురు డాక్టరు అయింది.తర్వాత సూరయ్య ప్లేటు
ఫిరాయించి నా మనుమరాలు తెలివిగలది కనుక డాక్టరు అయింది అని అందరికీ గొప్ప చెప్పేవాడు.   

Tuesday, 21 January 2014

చపాతీ

         పిండి కలిపి చపాతీ చేసుకోనక్కరలేకుండా  ఇప్పుడు కొన్ని సూపర్ మార్కెట్లలో చేసిన చపాతీ పాకెట్లు

దొరుకుతున్నాయి.వారంరోజుల లోపల వాడుకోవచ్చు.ఇంటికి తీసుకెళ్ళి కొంచెం వేడిచేస్తే సరిపోతుంది.అయితే

ఒకామె కొనుక్కోవటానికి వచ్చి ఇవి విజయవాడలో 30రూపాయలకే దొరుకుతున్నాయి.ఇక్కడ ఎక్కువరేటు

ఉంది అన్నది.ఇక్కడనుండి విజయవాడ వెళ్ళాలంటే ఎంత సమయము పడుతుంది?ఎంతడబ్బు అవుతుంది?

అని ఆలోచిస్తే అలా మాట్లాడదు.సరే విజయవాడ వెళ్లి కొనుక్కోండి అని ఆమె స్నేహితులు ఆట పట్టించారు. 

జొన్న రొట్టెలు

జొన్నరొట్టెలు రుచిగా చేయటం అనేది ఒక కళ.అవి అందరికీ చేయటం రాదు.ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో పెళ్ళి

 కుదుర్చుకొనే ముందు పెళ్ళికూతురుని నీకు జొన్నరొట్టెలు చేయటం వచ్చా?అని అడుగుతారట.వచ్చు అని

సమాధానం చెప్పినట్లయితే పెళ్లి ఖాయపర్చుకుంటారట.లేకపోతే జొన్నరొట్టెలు చేయటం రానప్పుడు సంసారం

ఏమి చక్కదిద్దుకోగలదు?అని వెళ్ళిపోతారట.అందుకని ప్రతి ఆడపిల్ల జొన్నరొట్టెలు చేయటం నేర్చుకుంటుందట.

Monday, 20 January 2014

మంచి ఉద్యోగం

          కీర్తన వాళ్ళ దగ్గర శ్రీకాంత్ 5సంవత్సరాలనుండి డ్రైవరుగా పనిచేస్తున్నాడు.నమ్మకస్తుడు.డబ్బులు

అవసరమైనచోట ఇవ్వటం ,బ్యాంకులోవేయటము అన్నిపనులు నమ్మకంగా చేసేవాడు.కీర్తనవాళ్ళుకూడా

అతన్ని,అతనికుటుంబాన్ని బాగా చూసేవాళ్ళు.కుటుంబంలో సమస్యల వల్ల అతను స్వంత ఊరు వెళ్ళవలసి

 వచ్చింది.మంచి ఉద్యోగం వదులుకోవటం అతనికి చాలా భాద కలిగింది.ఊరు వెళ్ళేటప్పుడు అతనికి కళ్ళవెంట

 నీళ్ళు వచ్చేసినాయి.మళ్ళీ సిటీకి వస్తే మీదగ్గరకు వచ్చి పనిచేస్తాను అని చెప్పి వెళ్ళాడు.

పొదుపు

సౌమ్య కాసేపు కాలక్షేపానికి ఎక్జిబిషన్ గ్రౌండుకు వెళ్ళింది.అక్కడ ఒకకుటుంబం 20రూపాయలు పెట్టి జున్ను

కొనుక్కుని ఒకస్పూనుతో నలుగురు తిన్నారు.ఇంకొక కుటుంబం 10రూపాయలు పెట్టి లాలి పాప్ కొనుక్కుని

పెద్దవాళ్ళుఇద్దరు,పిల్లలుఇద్దరు ఒకళ్ళతర్వాతఒకళ్ళు నోట్లోపెట్టుకుని చీకుతున్నారు.మరొకళ్ళు 15రూపాయల

 బాదంపాలు తీసుకుని 4గురు ఒకే కప్పుతో త్రాగుతున్నారు.సౌమ్యకు ఇదంతా విచిత్రంగా ఉంది.ఇంతపొదుపు


మనదేశంలో ఎప్పటినుండి పాటిస్తున్నారు?అందరూ ఇంత పొదుపు పాటిస్తే మనదేశం అప్పులపాలవదు కదా

అన్పించింది.అసలు పాటించవలసినవాటిల్లో పొదుపు పాటిస్తే బావుంటుంది.పైన చెప్పినవన్నీ చూడటానికి

ఎబ్బెట్టుగా వుంటాయి.

జెర్రిగొడ్డు

 త్రాచుపాముల్లో మగపాముని జెర్రిగొడ్డు అంటారు.ఇది పిరికిది.ఆడపాము చాలా ధైర్యంగా వేగంగా ఉంటుంది.

చరణ్ స్నేహితుడు పొలంలోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు.ఒకరోజు ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్లారు.ఇంటికి

వచ్చేటప్పటికి భోజనాల టేబులు మీదివన్నీ క్రిందపడిపోయినవి.పిల్లి వచ్చినది కాబోలు అనుకున్నారు.రెండు

రోజుల తర్వాత చరణ్ భార్య అటక మీది సామాన్లు పాలేరుతో సర్దిద్దామని తీసేసరికి పెద్దపాము కన్పించింది.

ఆమె భయంతో క్రిందికి దూకేసింది.తర్వాత అందరినీ పిలిచి పాములవాళ్ళను రప్పించారు.వాళ్ళు పామును

 పట్టుకొని దూరంగా చేలల్లో వదిలేశారు. 

పెద్ద పెద్ద ఎలుకలు

ఒక ప్రదర్శనలో ఒక సంస్థ తరఫున కొన్ని స్టాల్స్ సంస్థసభ్యులకు ఇచ్చారు.మొత్తానికి ఒకకాపలాదారుని పెట్టారు.
కొన్ని తినుబండారాలు,దుస్తులు,పానీయాలు కనిపించకుండా పోవటం మొదలెట్టాయి.ఒకామె అనుమానంతో కాపలాదారుని నిలదీసి సంస్థ మేనేజరుకు చెప్పింది.ఆమె గట్టిగా అడిగేసరికి పెద్ద పెద్ద ఎలుకలు ఉన్నాయమ్మా
అవి తినేసినవి అని చెప్పాడు.ఎలుక ఎంత పెద్దదయినా తిన్నన్ని తిని కొరికి వదిలేస్తాయి గానీ 1/2 కే జి పాకెట్
తీసుకెళ్తుందా?జ్యూస్ సీసా తీసుకువెళ్లగలదా?అబద్దాలుచెప్పకు ఇంకొకసారి ఇలాజరిగిందంటే ఉద్యోగంలోనుండి తీసేయాల్సివస్తుంది అని చివాట్లు పెట్టారు.  

Saturday, 18 January 2014

బాదం పాలు

రుక్మిణి,రోహిణి స్నేహితులు.ఇద్దరూ కలిసి ఒకబ్రాండ్ పేరుతో  బాదం పాలు మార్కెట్లో ప్రవేశ పెట్టదలిచి
ప్రజల అభిప్రాయం తెలుసుకోవటానికి ఒకప్రదర్శనలో స్టాల్ పెట్టారు.1,2 రోజులు క్రొత్త బ్రాండు కనుక  అంతగా
ప్రజలు త్రాగలేదు కానీ తరువాతనుండి త్రాగటం మొదలుపెట్టారు.ఒకవారం అయ్యేటప్పటికి ఆస్టాల్ ముందు
 గుమికూడి మరీ అందరూబాదం పాలు కావాలంటున్నారు.చాలా రుచిగా ఉన్నాయి అని ఒక్కొక్కళ్ళు రెండు
త్రాగుతున్నారు.రుక్మిణి,రోహిణి  మనం అనుకున్నది సాధించగలిగామని సంతోషపడ్డారు.వీళ్ళ ఎదురుగా ఉన్న
స్టాలు అతను మొదటిరోజు బాదం పాలంటే అలా వుండాలి,ఇలావుండాలని విమర్శించాడు.4రోజుల తర్వాత
అందరూ బావున్నాయి అనుకోవటం విని వాడే వచ్చి ఒకటి త్రాగి చాలా బావున్నాయి ఇంకొకటి ఇవ్వండి అని
అడిగాడు.విమర్శించిన నోటితోనే చాలా రుచిగా ఉన్నాయి అని చెప్పి వెళ్ళాడు.

స్వార్ధం

మనుషుల్లో కొంతమందికి నిలువెల్లా స్వార్ధం ఉంటుంది.రమేష్ అటువంటికోవకే చెందుతాడు.రమేష్,రాకేశ్
అన్నదమ్ములు.రాకేశ్ ఉద్యోగరీత్యా వేరేఊరిలోఉంటాడు.ఆస్తిపంపకాలప్పుడు నేను అంతా చుస్తానులే నువ్వు
 సెలవు పెట్టుకోవడం ఎందుకు?అంటే నిజమేననుకున్నాడు రాకేశ్.కానీ ఒకేపొలం తండ్రితో రమేష్ తనకు
  రాయించుకుని,ముక్కలుగా ఉన్నవన్నీఅన్నకు రాయించాడు.దక్షిణం పెద్దకొడుక్కి,ఉత్తరం చిన్నకొడుక్కి
రాయాలని తెలిసికూడా తండ్రి ఉత్తరం పెద్దకొడుక్కి,దక్షిణం చిన్నకొడుక్కి రాశాడు.తండ్రి,తమ్ముడి కుట్ర రాకేశ్
చాలారోజులకు తెలుసుకున్నాడు.అడిగితే ఇద్దరు ఏమీ సమాధానం చెప్పకుండా తలదించుకున్నారు.తర్వాత
తల్లిదండ్రుల ఆస్తి అన్న విదేశాలకు వెళ్ళిన సమయం చూసి నేను మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను
అని చెప్పి ముప్పాతికభాగం తను రాయించుకుని పాతికభాగం మేనల్లుడికి రాయించాడు.ఇద్దరూ కలిసి
పెద్దవాళ్ళను రాకేశ్ ఇంట్లో అర్దరాత్రి వదిలి వెళ్ళిపోయారు.పెద్దవాళ్ళు కంటికి కడివెడుగా ఏడుస్తుంటే తల్లిదండ్రుల
మీదఉన్న ప్రేమతో కంటికిరెప్పలా చూసుకుంటున్నాడు.అతిస్వార్ధంతో ఎంత ఎదిగామని అనుకొన్నాఅంతగాక్రిందికి దిగజారతారు.    

Friday, 17 January 2014

జున్ను

జున్ను అనగానే స్వంత ఊరు గుర్తొస్తుంది.ఊరిలో ఆవుకానీ,గేదెకానీ ఈనగానే మొదట ఇచ్చేపాలతో గడ్డజున్ను
చేస్తారు.చేయగానే గ్రామదేవతకు ఇంట్లోనే పెట్టి పాడి,పంటలను,కుటుంబాన్ని చల్లగా చూడమని నమస్కరిస్తారు.
ఆజున్నురుచే జన్మలో మర్చిపోలేనిది.తర్వాత 2,3రోజుల జున్నుకూడా కొంచెం పలుచగావున్నాచాలా రుచిగా
ఉంటుంది.అయితే ఇక్కడ ఎలా తయారుచేస్తారంటే పాలల్లో బెల్లం,కోడిగ్రుడ్డు,మిరియాలపొడి యాలకులపొడి వేస్తారు.అది నీచువాసనతో బావుండదు.అయినా సిటీలో దొరికేది అదేకనుక అసలు నిజమైన జున్ను రుచి
ఎప్పుడూ చూడలేదు కనుక బానేవుందని తింటారు.నుమాయిష్ లో ఒకతను జున్ను అమ్ముతున్నాడు.
అక్కడ జనాలు గుమికూడి మరీ తింటున్నారు.అసలైన జున్ను తినేవాళ్ళకు వాళ్ళను చూస్తే విచిత్రంగా
ఉంటుంది.

మూడుతరాల 'రా'బందువులు

వాగ్దేవి తల్లిదండ్రులు,అన్నదమ్ములు,అక్క అందరూ ఒకేఊరిలోఉంటారు.చిన్నీ నీచేతి కాఫీ చాలారుచిగా ఉంటుంది
అని ఎప్పుడంటే అప్పుడు వచ్చి తాగేవాళ్లు.అన్నకుటుంబమైతే మరీ విసిగించేవాళ్ళు.ఒదిన పది,ఇరవైరోజులు
ఊరు వెళ్ళేది.చిన్నీ బయటకు వెళ్ళాలి భోజనం వడ్డించు అనేవాడు.ఇంట్లో అందరికీ సరిపడా కూరలు చేస్తే
మొత్తం తనే తినేసేవాడు.మళ్ళీ వండుకోవాల్సి వచ్చేది.ఎప్పుడైనా అయితే సంతోషమే ఎవరికైనా రోజు అలాగే  అయితే కష్టం.
నెలకు ఇరవైఅయిదు రోజులు ఇలాగే జరిగేది.చెల్లి కనుక కష్టంగాఉన్నాసర్దుకునేది.చెల్లి చనిపోయింది.తర్వాత
చెల్లి కూతురు మేనకోడలు దగ్గరకు వచ్చివార్షికా మీఅత్తయ్య  ఊరిలో లేదు అమ్మాయి దగ్గరకు వెళ్ళింది  భోజనం వడ్డించు అనేవాడు.కూరలు రుచిగా ఉన్నాయి నేను కూర ఎక్కువ తింటాను ఇంకా వెయ్యి అని చెప్పి
 మొత్తం తినేసేవాడు.మేనమామ అని ఏమీఅనలేక ఇంట్లో వాళ్లకు మళ్ళీవంట చేయాల్సి వచ్చేది.ముందు చెప్పకుండా భోజనము టైముకి వచ్చి తినేసి వెళ్తే అప్పుడు వంటచేసి ఇంట్లోవాళ్లకు పెట్టాలంటే ఎంతఇబ్బంది.
వార్షిక కూతురు వర్ష సిటీలోఉంటుంది.సిటీ వెళ్ళినప్పుడల్లా ఈయనే కాక కూతురు కుటుంబంకూడా వెళ్లి వర్ష ఇంటికిచెప్పకుండా భోజనంటైముకి వెళ్ళేవాళ్ళు.ఫోనుచేస్తే వంటచేసేదాన్నికదాఅంటే ఏమీమాట్లాడేవాళ్ళుకాదు.
ఇలా ఒక్క రోజు కాదు 365రోజుల్లో 300రోజులు ఇదే పరిస్థితి.అల్లుడు కూడా అంతకన్నా ఎక్కువ.ఎదుటివాళ్లకు ఇబ్బంది అనేఆలోచనే ఉండదు.ఇలా ఇబ్బందిపెట్టేదికాక వాళ్ళింట్లో తింటున్నాము అనికూడాఅనరు.ఎక్కడన్నా
కనిపించినా ఎవరో తెలియనట్లు నటిస్తారు.ఆయన మనుమరాలు,కూతురు బట్టలుతెచ్చుకోకుండా వర్ష ,వాళ్ళ
పాపబట్టలు వేసుకుని 4రోజులు ఉండేవాళ్ళు.పొట్టివాళ్ళయినా వీళ్ళ పొడవు బట్టలు ఇబ్బందిపడి మరీ వేసుకునేవాళ్ళు.ఇలా మూడుతరాల వాళ్ళను 'రాబందుల్లా'పీక్కుని తినేవాళ్ళు.


అల్ప సంతోషి

కల్పన అల్ప సంతోషి అంటే చిన్నచిన్న విషయాలకే ఎక్కువ సంతోష పడుతుంటుంది.చూడటానికి అందంగా
లేకపోయినా తెలివితో తన బ్రతుకు తను బ్రతుకుతుంది.భర్త ఎప్పుడన్నా వస్తాడు వేరే పెళ్లి చేసుకున్నాడు అని
చెప్పింది.తల్లిదండ్రులు,చెల్లెలు ఎవరి అండ తనకు లేదని,తనే కష్టపడిపనులు చేసుకోవాలని చెప్పింది.
నుమాయిష్ లోజనపనారతో అందమైనబ్యాగులు,కాటన్ తువ్వాళ్ళు ,డ్రెస్సులు స్టాలులోపెట్టింది.భర్తను,సవతిని
రమ్మని చెప్పింది.వాళ్ళువచ్చి బాగా అమ్ముడుపోతున్నాయని డబ్బుకోసమని ఈమెను మాయచేస్తున్నారు.
భర్త,సవతి చెరొక ప్రక్కన కూర్చుని గంటగంటకు తాగటానికి,తినటానికి ఏదోఒకటిఇస్తున్నారు.సవతి,భర్తను
కూడా త్యాగంచేసి ఈమెదగ్గర నాలుగురోజులు ఉండనిచ్చింది.డబ్బుకోసం ఇలా ప్రేమ నటిస్తున్నారని ఇది
నిజమైన ప్రేమకాదని తెలిసినా కల్పన అతిగా సంతోషపడుతుంది.అందుకే అంత తేలిగ్గా వాళ్ళు మాయ
చేస్తున్నారు.  

Tuesday, 14 January 2014

సంక్రాంతి శుభాకాంక్షలు

                            నా బ్లాగ్ వీక్షించ వచ్చిన తెలుగు వారందరికి  మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
                                                

                                 

Wednesday, 8 January 2014

వంచన

రోహిణి తన స్నేహితురాలితో కలిసి వ్యాపారం చేద్దామనుకుంది.ఈలోపు ఇంకొకామె నాకుకూడా మీతోపాటు వాటా ఇవ్వమని అడిగింది.కొద్దిపాటి పరిచయమే అయినా సరేనంది.వచ్చినప్పటినుండి తనవాటాడబ్బుపూర్తిగా
ఇవ్వకుండా వీళ్ళఇద్దరిడబ్బుతో వ్యాపారం చేద్దామని చూసింది.వీళ్ళను సంప్రదించకుండానే సరుకుఆర్డరుపెట్టాను
డబ్బు ఇవ్వమంటుంది.నువ్వు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వమంటే ఇవ్వకుండా గొడవపెట్టుకుంది.కాష్ పెట్టేలోడబ్బు
ఇచ్చి నాడబ్బుఇచ్చాను అనిఅబద్దం చెప్పి ఈడబ్బు,ఆమె ఇచ్చిన డబ్బు మొత్తం ఇచ్చేయండి లేదా మీ ఇద్దరు
తప్పుకోండి అంటుంది.మద్యలో వచ్చింది ఆమె అసలు మొదలు పెట్టింది వీళ్ళు.ఇదొక గుణపాఠం అనుకొని వీళ్ళిద్దరూ చెరిసగం పెట్టుబడి పెట్టి ఎక్కువ ఇచ్చాను అన్నడబ్బురోహిణి నష్టపోవాల్సి వచ్చింది.ఎందుకంటే ఆ
సమయంలో స్నేహితురాలు లేదు కనుక పద్దతికాదని తనే నష్టపోయింది.ఈమెతో ఇబ్బంది పడటం ఇష్టంలేక
వీళ్ళ పెట్టుబడి కాక ఆమెది కూడా వీళ్ళే భరించాల్సి వచ్చింది.నడి మధ్యలో వ్యాపారంలో అనుకున్నలాభంరాదేమో
అని వంచనతో డబ్బు తీసుకుని వెళ్లిపోయింది.   

తృణ ధాన్యాలు-ఆరోగ్యం

తృణ ధాన్యాలు అంటే రాగులు,జొన్నలు,సజ్జలు,యవ్వలు,కొర్రలు,సామలు.ఒకప్పుడు ఈచిరుధాన్యాలతో చేసిన
పదార్ధాలు ఎక్కువగా తినేవాళ్ళు కనుక ఆరోగ్యంగా ఉండేవారు.ఇప్పుడు తెల్లబియ్యం,ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటంవలన స్థూలకాయము,మధుమేహం,గుండెజబ్బులు,రక్తపోటుఒకటనేముంది?ఎన్నోరకాలజబ్బులతో
ఇబ్బంది పడుతున్నారు.అయినాప్రజలలో మార్పు రావటం లేదు.60ఏళ్లవాళ్ళు కూడా వీటితో తయారు చేసిన
పదార్థాలు తింటే మంచిదిఅని తెలిసికూడా తినటానికి ఇష్టపడటం లేదు.షణ్ముఖి ప్రజలలో వీటిపట్ల అవగాహన
కల్పించటం కోసం ప్రత్యేకించి ప్రదర్శన శాలలో చిరుధాన్యాల ఉత్పత్తులకు సంబంధించి ఒకవిక్రయశాల పెట్టింది.
ఇంతకుముందు ఇంట్లో తయారు చేసుకున్నవాళ్ళు మాత్రమే తినగలిగేవాళ్ళు.వింత ఏమిటంటే చిన్నవాళ్ళు
పెద్దవాళ్ళను అమ్మా,అత్తయ్యా ఇవితీసుకోండి అంటే మాకువద్దు అంటున్నారు.రాగిమాల్ట్,జొన్నరవ్వ,జొన్నపిండి,
జొన్ననూడిల్స్,జొన్నసేమ్యా,జొన్నపాస్తా,జొన్నబిస్కట్లు,4రకాలు,జొన్అటుకులు,మల్టిగ్రెయన్పిండిఎన్నోరకాలు
షణ్ముఖి తనస్టాలులో పెట్టింది.ఇలా పెట్టటంవలన తనకులాభం ఏమీవుండదు కానీకొంతమందికి అయినావీటిపట్ల
అవగాహన కలిగి వీటితో చేసిన ఆహారంతిని  ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆశ.తృణ ధాన్యాలతో చేసిన ఆహారం
తినండి.ఆరోగ్యంగా ఉండండి.

     

Saturday, 4 January 2014

పీచు మిఠాయి

సెంట్రల్ అమెరికాలోని ఒక అందమయిన ద్వీపంలో ఆస్పత్రిలో చేరితేచాలు మొత్తం భోజనంతోసహా ఉచితం. ఒక
పేషెంట్  భోజనం చేసి,మందులు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి రాత్రి చెట్టులో నుండి దూకి రావటం మొదలు పెట్టాడు.నర్సులు అతను చెట్టు ఎక్కి కూర్చుంటున్నాడని అనుకుని ఫిర్యాదు చేశారు.డాక్టరు ఇలా చేస్తే ఇక్కడ
నుండి పంపించేస్తాను అని కోప్పడేసరికి ప్లీజ్ వద్దు డాక్ నేను నిజం చెప్తాను.నేను బయటకు వెళ్లి కాటన్ కాన్డీలు
అంటే పీచు మిఠాయి అమ్ముకుని తిరిగి రాత్రికి భోజనము,మందులు ఇచ్చే టైముకి ఆస్పత్రికి వస్తున్నానుఅని చెప్పాడట. డబ్బుకోసం ఇలా చేస్తున్నాను అన్నాడట.

Wednesday, 1 January 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నా బ్లాగ్ వీక్షించ వచ్చిన తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఎన్నో కొంగ్రొత్త  ఆశలతో నూతన
సంవత్సరంలోనికి అడుగిడిన సందర్భంగా అవన్నీ సంపూర్ణంగా నెరవేరాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.