Friday 29 April 2016

ఎందుకు కన్నానా?

                                                        యుగంధర్ విదేశీమోజుతో అమెరికాలో ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుని భారతదేశం నుండి అమెరికా వెళ్ళాడు.అతను ఇంట్లో ఖాళీగా ఉండటమే కనుక ఏమి చేయాలో తోచక దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాడు.అక్కడ దైవదర్శనం అయిన తర్వాత ప్రసాదం పెట్టారు.ఆప్రసాదం అతనికి చాలా నచ్చి రోజూ గుడికి వెళ్ళడం మొదలుపెట్టాడు.అక్కడ ఒక పెద్దాయన ఒంటరిగా తనలో తనే మధనపడుతూ,ఏదో ఆలోచిస్తూఒక్కడే మౌనంగా కూర్చుని  కనిపించాడు.ఒకరోజు దగ్గరకు వెళ్ళి తనను తాను అక్కడికి కొత్తగా వచ్చినట్లు పరిచయం చేసుకున్నాడు.నేను అమెరికా వచ్చిచాలా సంవత్సరాలు అయిందని నేను కూడా భారతీయుడినేనని చెప్పాడు.ఒకరోజు యుగంధర్ మాటల్లో మిమ్మల్ని ఒకమాట అడగవచ్చా?అని అడిగాడు.ఆయన సరేననగానే అడగవచ్చో?లేదో?తెలియదు కానీ మీలో మీరే బాధపడుతున్నట్లున్నారు.మీకు ఏమీ అభ్యంతరం లేదనుకుంటే చెప్పమన్నాడు.అప్పుడు ఆయన నువ్వు ఊహించినది నిజమే అని చెప్పడం మొదలుపెట్టాడు.తాను డాలర్ల మోజులో డబ్బు సంపాదనే లక్ష్యంగా పిల్లలకు అన్నీ సమకూర్చుతున్నానని అనుకున్నాడేకానీ పిల్లాడు ఏమి చేస్తున్నాడని పట్టించుకోకపోవటంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అవకుండా  వ్యసనపరుడు అయినట్లు చెప్పాడు.మాదకద్రవ్యాలతో పాటు వాడికి అన్ని చెడ్డఅలవాట్లు ఉన్నాయని చెప్పాడు.అది తట్టుకోలేక మనశ్శాంతి కోసం గుడికి వస్తున్నట్లు చెప్పి వాడిని ఎందుకు కన్నానా?అని ఇప్పుడు బాధపడుతున్నట్లు చెప్పాడు.చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు ప్రయోజనం ఏముందని?వాడిని కాస్తయినా మార్చమని భగవంతుని వేడుకుంటున్నాను అని చెప్పి మనసుని కొంత తేలిక పరుచుకున్నాడు. 

Thursday 28 April 2016

విటమిన్ - సి ప్రాధాన్యం

                                                                  వయసుతో నిమిత్తం లేకుండా వచ్చే రకరకాల అనారోగ్యాల నుండి బయటపడాలంటే శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్-సి ఎక్కువగా ఉండే పండ్లు రోజూ ఆహారంతోపాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి.అవేమిటంటే కాలంతో పనిలేకుండా దొరికే నిమ్మ,జామ,బొప్పాయి ఇవేకాక కమలా,నారింజ వంటివి మార్కెట్లో వచ్చినప్పుడు ఏదోఒక రూపంలో ఎక్కువగా తీసుకోవాలి.విటమిన్-సి తగ్గటం వల్ల రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి మెదడుకు రక్త సరఫరా లేక పక్షవాతం వస్తుందని,ఇదే కాక గుండెజబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని నరాల వైద్యుల హెచ్చరిక.అందువల్ల విటమిన్-సి ప్రాధాన్యం తెలుసుకుని జామకాయ,బొప్పాయి కాయలు ఏమి తింటాము?అనుకోకుండా ఎంత ఎక్కువగా తింటే అంత ముప్పు తప్పుతుంది.

Tuesday 26 April 2016

ఎందుకీ సంపాదన?

                                                    శంకర శాస్త్రి గారికి ఎనమండుగురు సంతానం.అందులో నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు.వీళ్ళందరినీ పోషించడం కష్టమై పొట్ట చేతపట్టుకుని కుటుంబంతో సహా శంకర శాస్త్రి గారు వేరే రాష్ట్రం తరలి వెళ్లారు.వెళ్ళారన్న మాటే కానీ ఏపని చేసినా అందరి పోషణ కష్టమైపోయింది.పొరుగింటి రామయ్య తను పనిచేసే చోట గ్రానైట్ రాళ్ళు గ్రేడ్ చేసే విధానం నేర్చుకోమని తీసుకెళ్ళాడు.కొన్నాళ్ళకు తనే స్వంతంగా వ్యాపారం ప్రారంభించి తెలివితేటలతో గ్రానైట్ రాళ్ళు విదేశాలకు ఎగుమతి చేయటం మొదలుపెట్టారు.రాత్రి,పగలు కష్టపడి వ్యాపారాన్నివృద్ధి చేసి విపరీతంగా సంపాదించారు.ఈలోగా పిల్లలందరి పెళ్ళిళ్ళు చేశారు.శంకర శాస్త్రి గారు సంపాదనతో పాటు దానధర్మాలు కూడా విరివిగా చేయటంవల్ల ఆయన అందరికీ సుపరిచితం.పెద్ద వయసు రావటంతో ఆయన విశ్రాంతి తీసుకుందామనుకునే సమయంలో పిల్లలు ఆస్తులకోసం గొడవలు పడి కోర్టుకు వెళ్ళే స్థాయికి ఎదిగారు.తండ్రి రేయనక,పగలనక కష్టపడి వృద్దిచేసిన వ్యాపారాన్నినిలబెట్టాలనే జ్ఞానం లేని పిల్లల తగువులు చూసి ఆయన హృదయం తల్లడిల్లిపోయింది.తిండి తినీ,తినక కష్టపడి సంపాదించింది కష్టం విలువ,అనుబంధాల విలువ తెలియని వీళ్ళకోసమా?ఎందుకీ సంపాదన?అని శంకర శాస్త్రిగారు విరక్తిగా ఎందుకు సంపాదించానా?అని చివరి దశలోమనశ్శాంతి లేక బాధపడుతున్నారు.

Sunday 24 April 2016

పంచదార లేని కాఫీ,టీ

                                                           కొంతమంది పంచదార ఎక్కువ వేసుకుని కాఫీ,టీ తాగేస్తుంటారు.నాకు తీపి ఎక్కువ వేసుకుంటే తప్ప కాఫీ,టీ తాగినట్లుగా ఉండదు అంటూ అదేదో గొప్ప విషయం అన్నట్లు కబుర్లు చెప్తూ ఉంటారు.పంచదార ఎక్కువ వేసుకోవటం వల్ల బరువు పెరగటమేకాక మధుమేహం చేతులారా కొని తెచ్చుకోవటం అన్నమాట.కొంచెం కొంచెం మోతాదు తగ్గించుకుంటూ క్రమేపీ పంచదార అసలు వేసుకోకుండా కాఫీ,టీ తాగటం అలవాటు చేసుకుంటే మధుమేహం వంటివి రాకుండా ఉండటమే కాక అధిక బరువువల్ల వచ్చే అనేక రోగాల బారినుండి మనల్ని మనమే కాపాడుకున్నవాళ్ళం అవుతాము.మొదట కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా క్రమేపీ అదే అలవాటైపోతుంది.పంచదార వేసిన కాఫీ,టీ,స్వీట్లు తినకపోవడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

Friday 22 April 2016

ధరిత్రి దినోత్సవం

                                                                   పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరికి చేతనైనంతలో వారు మొక్కలు నాటడం,సాధ్యమైనంతవరకు దగ్గర అయితే వాహనం వాడకుండా నడచి వెళ్ళడం లేదా సైకిలుపై వెళ్ళడం వంటి పనులు చేస్తుండాలి.వీలైనంత వరకు చేతి సంచులు వాడుతూ మైనపుసంచుల వాడకం తగ్గించాలి.ఇలా చేయటం వలన కొంతవరకు పుడమి తల్లిని కాపాడినట్లవుతుంది.ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఒక మొక్క అయినా నాటితే బాగుంటుంది.
 

Wednesday 20 April 2016

బాన పొట్ట

                                                         ఈరోజుల్లో పొట్ట లేని వాళ్ళు చాలా అరుదు.సాధారణ పొట్ట కంటే బాన పొట్ట ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు.అందుకే బాన పొట్ట తగ్గాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ క్రింది విధంగా జ్యూస్ చేసుకుని తాగాలి.అవేమిటో.ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.
దోసకాయ - 1
నిమ్మకాయ - 1
తురిమిన అల్లం - 1 టేబుల్ స్పూను
కలబంద గుజ్జు - 1 టేబుల్ స్పూను
చిన్న కట్ట - కొత్తిమీర
మంచి  నీళ్ళు - 1/2 గ్లాసు
                                             పైవన్నీ కలిపి మిక్సీలో వేసి వడకట్టి ఆ రసాన్ని రోజు రాత్రి పడుకునే ముందు తాగాలి.ఇలా రోజూ చేస్తుంటే కొద్ది రోజులకు బాన  పొట్ట తగ్గిపోతుంది.

Thursday 14 April 2016

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

                                                           నా బ్లాగు వీక్షకులకు, నా తోటి బ్లాగర్లకు, మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ఏ దేశంలో ఉన్నా,ఏ రాష్ట్రంలో ఉన్నా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల కరుణాకటాక్షాలు లభించాలని కోరుకుంటూ మన తెలుగు వారందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

Wednesday 13 April 2016

శిరస్త్రాణము ధరించి ఉంటే........

                                                                   ద్విచక్ర వాహనంపై  వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తలపై శిరస్త్రాణము పెట్టుకోవాలని తెలిసినా ఇప్పుడే వస్తాము కదా!అని కొందరు,తలపై బరువు అని కొందరు,జుట్టు అణిగిపోతుందని కొందరు మొత్తం మీద ఏ కారణమైనా కానీ 75 శాతం మంది అసలు ఉపయోగించరు.ప్రభుత్వం తప్పనిసరిగా ధరించాలని నిబంధన పెట్టినా,మన రక్షణ కోసమే అని తెలిసినా,జరిమానా కట్టటానికి సిద్ధమే కానీ,దానివల్ల ఒక్కొక్కసారి ప్రాణాన్ని ఫణంగా పెట్టాల్సోస్తుందనే ఆలోచన రాదు.చిన్ననిర్లక్ష్యం ఫలితం కుటుంబం మొత్తానికి భాధ.
                                                         సత్యప్రకాష్ స్వతహాగా చాలా మంచి వ్యక్తి.ఈ మధ్యనే దైవ సేవలో ఎక్కువ
సమయం గడుపుదామని నిర్ణయించుకున్నాడు.శ్రీరామ నవమి సందర్భంగా గుడి వద్ద ఏర్పాట్లు చూస్తుండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది.ఇప్పుడే వస్తానని అక్కడి వాళ్ళకు చెప్పి వెళ్ళాడు.ఒక అరగంట లోపే ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా మద్యం సేవించి ముగ్గురు కుర్రాళ్ళు మోటారు సైకిలు మీద వస్తూ సత్యప్రకాష్ వాహనాన్నివేగంగా డీ కొట్టారు.కన్ను మూసి తెరిచే లోపల సత్యప్రకాష్ క్రిందపడి తలకు దెబ్బ తగిలి ముక్కు,చెవులు,నోటిలో నుండి రక్తం రావటమే కాక కాళ్ళు రెండు విరిగిపోయాయి.ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన కొద్దిసేపటికి చనిపోయాడు.కాళ్ళు విరిగితే శస్త్రచికిత్స చేస్తే కొద్దిరోజులకు మాములుగా తిరిగేవాడు.అదే శిరస్త్రాణము ధరించి ఉంటే తలకు దెబ్బ తగిలేది కాదు.ప్రాణం దక్కేది.ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు,భార్యాపిల్లలకు ఈవార్త తెలిసేసరికి గుండెలు పగిలిపోయాయి.వాళ్ళకే కాదు అందరికీ పెద్ద షాక్.ఆ కుటుంబం భాధ ఎవరు తీర్చగలరు.ఎంతమంది ఉన్నా అతను లేని లోటు ఎలా పూడ్చగలరు?రోడ్డు మీద మనం సరిగా వెళ్ళినా పక్కవాళ్ళు వచ్చి మీద పడినా మనకే ప్రమాదం కనుక ఎవరికి వారే రక్షణ ఏర్పాటు చేసుకోవాలి.శిరస్త్రాణము ధరించితే ప్రాణహాని తప్పుతుంది.  

Tuesday 12 April 2016

ఆకాశంలో పందిరి

                                                               మాన్విత,మనస్విని అక్కచెల్లెళ్ళు.ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు.కాస్త సమయం దొరికితే చాలు ఎక్కడ లేని కబుర్లు.ఇద్దరూ చదువు పూర్తి చేసి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి కొంతమందికి ఉపాధి కల్పించాలని ఎడతెగని ఆలోచనలు చేస్తుంటారు.ఆ నేపధ్యంలో వివిధ రకాల వ్యాపారాల గురించి చర్చిస్తూ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు.ఏదైనా ఒకటి మొదలు పెట్టే ముందు ఎదురయ్యే సమస్యలు,కష్టనష్టాల గురించి చర్చించుకోవటం ఎంతైనా అవసరం.వీళ్ళు దానితోపాటు సంస్థను లాభాల బాటలోకి నడిపించి ఆకాశంలో పందిరి వేస్తారన్నమాట.దీంతో ఎంత సమయం గడిచిందో కూడా తెలియదు.ఈలోపు వాళ్ళ  అమ్మ వచ్చి మీకు ఏకాస్త సమయం దొరికినా నిచ్చెన అవసరం లేకుండా ఆకాశంలో పందిళ్ళు వేసేస్తుంటారు అనేసరికి ఆ చర్చా సారాంశం వాళ్ళ అమ్మకు కూడా చెప్పి ముగ్గురూ కాసేపు పగలబడి నవ్వుకుంటారు.అది కూడా ఒక నైపుణ్యమే.

Thursday 7 April 2016

ఉగాది శుభాకాంక్షలు

                                నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,తెలుగు వారందరికీ సంవత్సరం పొడవునా ఆయురారోగ్య ఐశ్వర్యాలు,సకల విజయాలు చేకూరాలని మనసారా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.షడ్రుచులతో తయారుచేసే ఉగాది పచ్చడి లాగానే మనిషి జీవితం కూడా ఎటువంటి వారికయినా తీపి,చేదు,కష్టం,సుఖం,గెలుపు,ఓటములతో కలగలిసి ఉంటుంది.అన్నింటినీ సమానంగా తీసుకోవాలన్నసందేశాన్ని ఇస్తుంది ఉగాది పచ్చడి.ఉగాది రోజు ఆరోగ్యానికి మంచి చేసే వేపపువ్వు కలిపిన ఉగాది పచ్చడి తినటం తెలుగు వారి ప్రత్యేక సంప్రదాయం.
                        

Wednesday 6 April 2016

వేసవిలో చర్మానికి రక్ష

                                                                         వేసవిలో ఎండలో వెళ్ళటం వల్ల చెమటతోపాటు దుమ్ము,ధూళి కలిసి చర్మంపై మృత కణాలు పేరుకుపోయి ఉన్న వయసుకన్నాఎక్కువగా కనపడుతుంది.దీనికి చక్కటి పరిష్కారం టొమాటో గుజ్జు .బాగా పండిన టొమాటోలు తీసుకుని గోరు వెచ్చటి నీళ్ళల్లో వేస్తే పై పొర చక్కగా వస్తుంది.అప్పుడు గుజ్జు తీసి ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్ లో పెట్టాలి.ఎండలో నుండి రాగానే టొమాటో ఐస్ క్యూబ్ తీసుకుని మృదువుగా మర్దన చేస్తే చర్మంపై మురికి తొలగిపోయి చక్కటి రంగు వస్తుంది.అంతే కాకుండా ఎండ ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది.ఇదే కాకుండా టొమాటో పంచదార,టొమాటో నిమ్మరసం కలిపి వేసవిలో ఉపయోగించటం వల్ల చర్మానికి తగిన  రక్షణ లభిస్తుంది.

Tuesday 5 April 2016

కష్టమైనా....

                                                         ఎంత కష్టమైనా ఇష్టంతో మనస్పూర్తిగా చేసిన పని తప్పక విజయవంతం అవుతుంది.

భయం వీడు .......

                                                                     గతం గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవటం,భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అతిగా ఆలోచించడం,దాని గురించి భయపడటం అనవసరం.తలనొప్పి తప్ప ప్రయోజనం లేదు.అందుకే వర్తమానంలో ఈర్ష్య,అసూయలకు చోటు ఇవ్వకుండా సంతోషంగా, మనశ్శాంతితో బ్రతకటం అలవాటు చేసుకుంటే జీవితం సుఖంగా,హాయిగా సాగిపోతుంది.

Monday 4 April 2016

నేటి సంస్కృతి

                                                                 ఒకప్పుడు అత్తలు కూర్చుని ఆజ్ఞలు జారీచేస్తూ కోడళ్ళతో అడ్డమైన చాకిరి  చేయించేవాళ్ళు అని అపోహ పడేవాళ్ళు.నిజానికి కుటుంబం కోసం అందరూ కష్టపడేవాళ్ళు.అప్పట్లో ఖాళీగా ఎవరూ కూర్చునేవాళ్ళు కాదు.అత్తలు కూడా ఏదోఒక పని రోజంతా చేస్తూనే ఉండేవాళ్ళు.అయినా అత్త అంటే రాక్షసి అని కొత్త కోడలి మనసులో ముద్రపడేలా కథలు చెప్పేవాళ్ళు.ఇప్పడు కోడళ్ళు కూర్చుని డెబ్భై సంవత్సరాలు వచ్చిన అత్తలతో ఇంటెడు చాకిరి చేయించుతున్నారు.ఏమన్నా కోడళ్ళు అందరూ ఉద్యోగాలు చేసి పొద్దస్తమానం కష్టపడి ఊళ్ళు ఏలుతున్నారా?అంటే అదీ లేదు.లేచింది మొదలు టి.వి ఎదురుగా కూర్చుని కాలక్షేపానికి ఒక చేత్తో రిమోట్,ఒక చేత్తో చిప్స్ తింటూ కుర్చీలో నుండి కదలకుండా ఏ ప్రోగ్రాం బీరుపోకుండా చూస్తూ లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.ఎప్పుడూ కుర్చీకి అతుక్కుపోయి కూర్చున్నా ఊబకాయంతోపాటు మధుమేహాన్నిస్వయంగా ఆహ్వనించినట్లే.నేటి అత్తలకు తన పిల్లల బరువు,బాధ్యతలు తీరాయి కదా!ఇకపై విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాకొడుకు పిల్లల బరువు,బాధ్యతలు కూడా వయసుతోపాటు ఓపిక ఉన్నా,లేకున్నా మోయక తప్పటం లేదు.ఇదే నేటి సంసృతి.

ప్రశాంతత

                                                             ఎల్లప్పుడూ ఎదుటివారిలో ఉన్న మంచి మనసును చూడగలిగిన వాళ్ళకు  మాత్రమే మనసుకు ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది.

Friday 1 April 2016

గొప్పతనం

                                                                         ఖరీదు గల బట్టలు,నగలు వేసుకుని కారులో తిరిగి రోజుకొక ఊరు తిరుగుతూ పోసుకోలు కబుర్లు చెప్పినంత మాత్రాన గొప్పవాళ్ళు అనిపించుకోరు.మనల్ని చూడగానే ఎక్కడ ఉన్నా ఎదుటివాళ్ళు ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయంగా వచ్చి మాట్లాడతారో వాళ్ళు గొప్పవాళ్ళని చూచేవాళ్ళు తెలుసుకోవాలన్నమాట.అలా ఎంత ఎక్కువమంది చేస్తే అంత గొప్ప.ఎదుటివారి గొప్పదనాన్ని ఒప్పుకోగలిగితే ఒత్తిడి అనే పదం మన నిఘంటువులో ఉండదు.ఈర్ష్య,అసూయ అన్న పదాలు దరిచేరవు.అంతా సంతోషమే.                         

మధుమేహం,మొటిమలు అదుపులో.....

                                                                           మధుమేహం,మొటిమలు,కొలెస్టరాల్ మొదలైనవి అదుపులో ఉంచడంలో దాల్చిన చెక్క,తేనె చక్కగా ఉపయోగపడతాయి.ఉదయం పరగడుపున చిటికెడు దాల్చినచెక్క పొడిలో సరిపడా తేనె వేసి కలిపి తింటే మధుమేహం,కొలెస్టరాల్ అదుపులో ఉంటాయి.అలాగే రాత్రి పడుకునే ముందు పైన చెప్పినట్లుగా కలిపి మొటిమలు ఉన్నచోట రాసి ఉదయం శుభ్రంగా కడగాలి.ఈవిధంగా ఒక పదిరోజులు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.రోజూ టీ తయారుచేసేటప్పుడు ఒక చిన్న దాల్చినచెక్క వేసి చేస్తే మంచి రుచితో పాటు జీర్ణశక్తి మెరుగుపడుతుంది.