Thursday, 31 December 2015

నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                            నూతన సంవత్సరంలో అందరి ఆశయాలు,ఆశలు,లక్ష్యాలు విజయవంతంగా నెరవేరాలని,అందరూ సుఖ,సంతోషాలతో,ఆయురారోగ్యాలతో,ధన ధాన్యాలతో తులతూగాలని మనసారా భగవంతుని కోరుకుంటూ బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,శ్రేయోభిలాషులకు,మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.


Wednesday, 30 December 2015

పెంకులో ఉడకేసి......

                                                          సుబ్బలక్ష్మి గారికి అతి శుభ్రం.శుభ్రం శుభ్రం అంటూ చేసినపనే చేస్తూ ఉంటుంది.తను చేసేది కాక అందరినీ చేయమంటుంది.పనివాళ్ళు కూడా అమ్మో!ఆవిడ దగ్గర మేము పని చేయలేము అంటూ ఎప్పటికప్పుడు పారిపోతుంటారు.అమ్మ ఇబ్బంది పడుతుందని పిల్లలు,పెద్దావిడ పని చేసుకోలేకపోతుందని దగ్గర బంధువులు కొత్త పనివాళ్ళను వెతుక్కుని తీసుకురాలేక నానా అవస్థలు పడుతుంటారు.పిల్లలకు విసుగొచ్చి సుబ్బలక్ష్మి గారిని కూర్చోబెట్టి అమ్మా!ఇంక మావల్ల కాదు.నీకు పనివాళ్ళను తీసుకురావటం తీసుకొచ్చిన తెల్లారే సరిగా చేయటం లేదంటూ వాళ్ళను పోట్లాడి బయటకు పంపేయడం పరిపాటి అయింది.అయినా అతి శుభ్రం అంటూ గీకినదే గీకి,తోమినదే తోమి ఆరోగ్యం పాడుచేసుకోవడం తప్ప ఏమి ఉపయోగం?మేమందరమూ పనులు శుభ్రంగా చేసుకోక పెంకులో ఉడకేసి ఆకులో ఆరేసుకుంటున్నామా ఏంటి? అన్నారు.ఆవిడ మహా మొండిఘటం.మీరు ఏరకంగా చేసుకుంటున్నారో?నాకు అనవసరం.నేను మాత్రం నాజీవితం ఎల్లమారే వరకు ఇంతే మారేది లేదు.మీరు నన్ను మార్చాలని కూడా ప్రయత్నించవద్దు అంటూ ఖరాఖండిగా చెప్పేసింది.చేసేది లేక పిల్లలు ఒక నమస్కారం పెట్టి నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయారు.

Tuesday, 29 December 2015

ఎవరి మర్యాద వాళ్ళు .......

                                                           ఈరోజుల్లో కొంత మంది ఎదుటివాళ్ళు మనల్ని గౌరవించాలని,ఇంటికి రాగానే సకల మర్యాదలు చేయాలనుకుంటున్నారు కానీ ఎదుటివారికి మనం మర్యాదలు చేస్తున్నామా?వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామా?లేదా?అని ఆలోచించడం లేదు.ఎంతసేపూ మనల్ని పట్టించుకోవడం లేదు,ఇంకా మనకోసం ఏదో చేయలేదు అని అనుకోవటమే తప్ప మనం ఎదుటివారికి ఏమి చేస్తున్నాము?అని అనుకోవటం లేదు.వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు కూడా సంతోషపడాలని,వాళ్ళు భాధగా ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు కూడా వాళ్ళతోపాటు బాధపడాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ఈ విధంగాప్రవర్తించడం ఎంతవరకు సమంజసం?అనే ఆలోచన సుతరామూ కలగటం లేదు.ఒకసారో,రెండుసార్లో అయితే పోనీలే వాళ్లకి అదొక తృప్తి,చాదస్తం అని సరిపెట్టుకోవచ్చు. ఎంత కాదనుకున్నా ఇలా ప్రతీది ఎదుటి వారినుండి ఆశిస్తుంటే అనుబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.కనుక ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం మర్యాద.ఎవరి మర్యాద వాళ్ళు కాపాడుకోవడం ఉత్తమమైన పద్ధతి. 

Monday, 28 December 2015

మధుమేహం దరిచేరకుండా.....

                                                                      మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవాళ్ళు ఆహారపుటలవాట్లు మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం దరిచేరకుండా ఉంటుంది.అవేంటంటే ముడిబియ్యం ఓట్స్,మెంతులు,మెంతుకూర,కాకరకాయలు,ఆలివ్ నూనె వంటివి ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి.కలబంద రసం తాగటం లేక గుజ్జు తినగలిగితే మంచిది.మొదట్లో పాటించటం కష్టంగా ఉన్నా క్రమంగా అలవాటైపోతుంది.ఎంచక్కా మందులు,ఇంజెక్షన్ తో పని లేకుండా ఆహార నియమాలతోనే మధుమేహం దరిచేరకుండా అదుపులో ఉంచుకోవచ్చు.   

కొజ్జిది

                                                                              ప్రజ్వల ఎదుట చిన్నప్పుడు ఎవరైనా తన గురించి కానీ,తన కుటుంబం గురించి కానీ అభూతకల్పనలు మాట్లాడారంటే సివంగి లాగా పోట్లాడేది.ప్రజ్వలకు వరుసకు నాయనమ్మ  వీళ్ళ మీద వాళ్ళకు,వాళ్ళ మీద వీళ్ళకు చెప్పి తగువులు పెట్టేది.చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఆమె సంగతి తెలియక ఆవిడ మాటలు విని పోట్లాడుకునేవాళ్ళు లేకపోతే మాట్లాడుకోవటం మానేసేవాళ్ళు.ఒకసారి ప్రజ్వల ఎదురుగానే ప్రజ్వల గురించి ఈ పిల్ల కొజ్జిది అని దూరపు బంధువుకు చెప్పింది.నాగురించి ఆవిధంగా చెప్పటం ఏమిటి?అంటూ ప్రజ్వల ఆవిడ మీదపడి కొట్టినంతపని చేసింది.అప్పుడు నేను నీ గురించి అనలేదు అంటూ తప్పించుకోలేక మనవరాలివని నవ్వుతూ చెప్పానులే అంటూ సర్దిచెప్పింది.ఆమె బుద్దిలోపంతో అందరి గురించి చెప్పటం తప్పు కాదు కానీ నువ్వు చెప్పటం ఏమిటి?అంటే కొజ్జిది అని ప్రచారం మొదలెట్టింది.హతోస్మి!ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి సుమీ.

Saturday, 26 December 2015

తీపి తినాలనిపించినప్పుడు ......

                                                              కొంతమంది తెలియకుండానే  ఒత్తిడిగా ఉన్నప్పుడు చాక్లెట్లు,స్వీట్లు తింటూ ఉంటారు.అటువంటప్పుడు తీపి తినకుండా ఉడికించిన లేదా కాల్చిన చిలకడదుంపలపై కొద్దిగా తేనె,దాల్చిన చెక్క పొడి వేసుకుని తింటే ఒత్తిడి తగ్గటమే కాక ఏ విటమిన్ తోపాటు పోషకాలు అందుతాయి. 

చలికాలంలో చర్మం పొడిబారకుండా....

                                                         చలికాలంలో గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.స్నానం చేసే నీటిలో ఆలివ్ నూనె ఒక స్పూను వేసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.సబ్బు ఎక్కువగా వాడకూడదు.వీలయితే వారానికి ఒకసారి నువ్వుల నూనె శరీరానికి మర్దన చేసి శనగ పిండితో కానీ సుగంధ ద్రవ్యాలు కలిపిన సున్నిపిండితో కానీ  నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.వేపుళ్ళు తినకుండా తేలికపాటి ఆహరం తినాలి.మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి.పండ్లు,కూరగాయలు ఎక్కువగా తినాలి.వ్యాయామం తప్పనిసరి.ఆయిల్ ఇన్ వాటర్ బేస్ మాయిశ్చరైజర్లు వాడుకోవటం మంచిది.ఈ విధంగా చేస్తే చలికాలంలో చర్మం మృదువుగా అందంగా,ఆరోగ్యంగా ఉంటుంది. 

కళ్ళ వాపు,దురద తగ్గాలంటే....

                                                           నీళ్ళు మరిగించి దానిలో గ్రీ టీ బాగ్  వేసి ఆనీళ్ళు చల్లారాక ఆనీటితో కళ్ళు కడగాలి.ఇలా తరచూ చేయడం వల్ల కళ్ళ వాపు,దురద తగ్గటమే కాక చక్కటి నిద్ర మన సొంతమవుతుంది.

మాతృ భాషాభిమానం

                                                      ప్రజ్వల కు 11 రకాల భాషలు మాట్లాడటం వచ్చు.ఎన్ని భాషలు మాట్లాడినా తన మాతృ భాష తెలుగు అంటే ఎంతో మమకారం.విదేశాలలో పుట్టి పెరిగినా మాతృ భాషాభిమానంతో తన పిల్లలను తెలుగు తరగతులకు పంపించి మరీ తెలుగు నేర్పించింది.దానికి తోడు పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకుని చక్కగా మాట్లాడతారు.పిల్లలు స్వచ్చమైన తెలుగు మాట్లాడటమే కాక తెలుగు ఎక్సలెన్సీఅవార్డు గెలుచుకున్నారు.ఈ విషయం తెలిసి ప్రజ్వల అమ్మమ్మ ఎంతో సంతోషించి స్వదేశంలో ఉన్నవాళ్ళే స్వచ్చమైన భాష మాట్లాడటం లేదు.విదేశాలలో ఉన్న నువ్వు మాతృ భాషాభిమానంతో పిల్లలకు నేర్పించడమే కాక బహుమతి గెలుచుకునేలా చేశావు.శభాష్ మనవరాలా!నీలాగ అందరూ మాతృ భాష గురించి ఆలోచించితే ఎంత బాగుంటుందో అంటూ అభినందించింది. 

కాలి ఫ్లవర్ మెంతి కూర

కాలి ఫ్లవర్  - 1 (మధ్యరకం)
మెంతి కూర - 2 కట్టలు (పెద్దవి)
పచ్చి బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు 
తురిమిన కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు 
 కారట్ - 1 పెద్దది 
ఉల్లిపాయ - 1మధ్యరకం 
పచ్చి మిర్చి - 4  
నూనె - 3 టేబుల్ స్పూన్లు 
పసుపు - 1/4 స్పూను 
ఉప్పు - తగినంత 
వేపుడు కారం - 2 స్పూన్లు 
మసాలా పొడి - 1/4 స్పూను
తాలింపు కోసం :ఎండు మిర్చి-1,అన్నీ కలిపిన దినుసులు- 1 స్పూను,కరివేపాకు - కొంచెం
                                               కాలి ఫ్లవర్ తుంచి గోరువెచ్చటి నీళ్ళు,పసుపు,ఉప్పులో వేసి ఒక 10 ని.ల తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలు కోయాలి.మెంతు కూర శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.కారట్ చెక్కు తీసి తురమాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి పచ్చి మిర్చినిలువుగా చీల్చాలి.ఒక బాండీలో నూనె వేసి కాగిన తర్వాత తాలింపు వేసి ఉల్లిపాయ,పచ్చి మిర్చి,కాలి ఫ్లవర్ ముక్కలు,ఉప్పు,పసుపు,పచ్చి బఠాణీ వేసి మూతపెట్టి మధ్యమద్యలో తిప్పుతూ వేయించాలి.మగ్గి సగంపైన వేగాక తరిగిన మెంతికూర వేసి తిప్పాలి.కారట్,కొబ్బరి తురుము కూడా వేసి ఒక 5 ని.లు తిప్పి వేపుడు కారం వేసి తిప్పాలి.చివరగా మసాలా పొడి వేసి 2 ని.లు తిప్పి దించేయాలి.అంతే రుచికరమైన కాలి ఫ్లవర్ మెంతి కూర తయారయినట్లే.ఇది అన్నం,చపాతీల్లో చాలా బాగుంటుంది.

Thursday, 24 December 2015

పచ్చి బఠాణీ పచ్చదనం

                                                                              ఒకరోజు ఆర్యన్ కూరగాయలు కొనటానికి రైతు బజారుకు వెళ్ళాడు.పచ్చి బఠాణీలు నిగనిగలాడుతూ కనిపించేసరికి తీసుకుందామని ఆగాడు.ఇంతలో పక్కన ఉన్నతను ఒకసారి ఇటురండి అంటూ పిలిచాడు.చూడటానికి హుందాగా ఉన్నాడు ఎందుకు పిలుస్తున్నాడోనని ఆర్యన్ వెళ్ళాడు.ఏమండీ!పచ్చి బఠాణీలు ఒలిచి సంచిలో ఉన్నవి ఎప్పుడూ కొనుక్కోవద్దు అని చెప్పాడు.పచ్చి బఠాణీలు మంచి రంగుతో నిగనిగలాడుతూ కనపడటానికి వాటిని ఆకుపచ్చ రంగులో వేసి ఆరబెట్టి సంచుల్లో వెయ్యడం నేను చూశాను.వాటిని  ఎంత ఉడికించినా పూర్తిగా ఉడకక పోవడమే కాక వాటిని తినడం వలన కాన్సర్ వస్తుందని చెప్పాడు.అమ్ముకునే అతని దగ్గర చెప్పడం ఎందుకని పక్కకు పిలిచానని కొంతమందినైనా కాన్సర్ బారినుండి కాపాడినట్లు అవుతుందని చెప్పానన్నాడు.మీరు కావాలంటే బఠాణీ కాయలు కొనుక్కుని వాడుకోవటం మంచిదని సలహా ఇచ్చాడు.ఆర్యన్ ఆయనకు మంచి సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు.ఆమె కూడా బఠాణీలు కడగటానికి నీళ్ళల్లో వెయ్యగానే నీళ్ళు ఆకుపచ్చగా మారుతున్నాయని చెప్పింది.
ప్రతి ఒక్కటి కల్తీయే వాళ్ళ లాభాలకోసం ఎదుటి వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. 

Wednesday, 23 December 2015

మొకిరి

                                                                         లక్మీరాజ్యం ఒక వారం రోజులు కూతురు దగ్గర ఉందామని ఊరు నుండి వచ్చింది.వచ్చిన దగ్గర నుండి పిల్లలు చెప్పినమాట వినకుండా కూతుర్ని చీటికీమాటికీ విసిగించడం గమనించింది.అమ్మమ్మ వచ్చినప్పటి నుండి తిడుతుందని పిల్లలు అభిప్రాయపడతారని నాలుగు రోజులు ఓపిక పట్టింది.ఈరోజుల్లో పిల్లలు మాట్లాడితే తిడుతున్నారనే భావనలో ఉంటున్నారు కదా!అందుకని ఒకరోజు పిల్లల్ని కూర్చోబెట్టి ఆమాట ఈమాట మాట్లాడుతూ ఏంటిరా?మరీ ఉన్నకొద్దీ మొకిరిగా తయారవుతున్నారు?అమ్మ చెప్పిన మాట వినటం లేదు.పోనీ బాగా చదువు కుంటున్నారులే అనుకోవటానికి చదువులోనూ మొకిరిగానే  ఉన్నారు అంటూ తిట్ల దండకం మొదలెట్టింది.ఆవిడ మొదలెట్టిందంటే ఎదుటివాళ్ళు దండం పెట్టి పారిపోవలసిందే.అలాగే పిల్లలు అమ్మమ్మా!ఇకనుండి అమ్మ చెప్పినమాట విని చక్కగా చదువుకుంటాము అని చెబితే కానీ వదలలేదు.

Saturday, 19 December 2015

అసలే బోర ఎక్కువ

                                               అనూరాధ ఎంతసేపు తను తన బంధువులు గొప్పని ఎదుటివాళ్ళు ఎందుకూ కొరగారు అన్నట్లు మాట్లాడుతుంటుంది.ఒకరోజు స్నేహితురాలి ఇంటికి కొంచెంసేపు కూర్చుని కాసిని గొప్పలు చెప్పటానికి వచ్చింది.మాటల్లో మా బావగారి అమ్మాయి పెళ్ళి కుదిరింది అని చెప్పింది.బావ కూతురు వైద్యవిద్య చదువుతుంది.పెళ్ళికొడుకు డిగ్రీ మాత్రమే చదివాడు.పెళ్ళికూతురు వైద్యురాలు కదా!డిగ్రీ చదివిన అబ్బాయికి ఇవ్వడమేమిటని అడిగిన దానికి సమాధానం దాటవేసి పెళ్ళికొడుక్కి వేలకోట్లు డబ్బుంది.ఎంత తిన్నా తరగదు.ఇంక చదువుతో పనేముంది?అనేసి వెళ్ళిపొయింది.డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు కదా!అనుకుంది స్నేహితురాలు.ఇంతలో స్నేహితురాలి అమ్మవచ్చింది.విషయం తెలిసి అనూరాధకు అసలే బోర ఎక్కువ కదా!కొత్తేముంది?వినేవాళ్ళు ఉంటే అలాగే వినిపిస్తుంది.అంది.

Friday, 18 December 2015

గులాబీ / బంతి పువ్వులతో........

                                                                                గులాబీలు,బంతి పువ్వులు ఇంటిముందు రకరకాల రంగులతో ముచ్చటగా చూడచక్కగా అందంగా ఉండటమే కాక,ఇంటిలోపల దేవుని పూజకు,అలంకరణకు ఉపయోగపడటమేకాక చర్మకాంతి మెరుగుపరుచుకోవటానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి.అదెలాగంటే ఏ రంగువైనా గులాబీ / బంతి పువ్వులను మెత్తటి పేస్ట్ చేసి దాన్ని ఒక స్పూను తీసుకుని,దానికి సరిపడా పచ్చిపాలు,ఒక స్పూను తేనె కలిపి ముఖానికి రాసి ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది.చేతులకు,మెడకు కూడా రాసుకుంటే చర్మకాంతి మెరుగుపడుతుంది.  

Thursday, 17 December 2015

తిక్క దానికో లెక్క

                                                         ఎప్పుడూ ఎవరికి వారు హడావిడి జీవనయానంలో పడి కొట్టుమిట్టాడటమే కదా అని రావు గారి కుటుంబం మొత్తం ఒక నెల రోజులు కలిసి సరదాగా,సంతోషంగా ఉందామన్నఉద్దేశ్యంతో అందర్నీతన ఇంటికి ఆహ్వానించారు.అప్పుడు అందరూ ఒకచోట కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాలు,మధురస్మృతులు తమ అనుభవాలు నేమరవేసుకుంటూ,అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండగా రావుగారు మా కుటుంబానికో తిక్క దానికో లెక్క ఉంది అన్నారు.అందరూ అదేమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో త్వరగా చెప్పమని అడిగారు.మా తాతల నాటినుండి ఇప్పటివరకు కూడా బాగా కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళమీద పెద్దగా అరిచేస్తామని చెప్పారు.ఎక్కువ కోపంతో తిక్క వచ్చినప్పుడు ఆ సమయంలో ఎదుటివాళ్ళ తప్పు ఏమీ లేదని తెలిసినా,అంతకు ముందు ఎప్పటిదో కోపం మనసులో ఉంచుకుని అరుస్తున్నాడని ఎదుటివాళ్ళు అర్ధం చేసుకోవాలన్నమాట అని చెప్పారు.విచిత్రంగా చూస్తున్న పిల్లలను చాలా అరుదుగా కోపం వస్తుందిలే కంగారుపడకండి అన్నారు.

Wednesday, 16 December 2015

వెంటిలేటర్ ద్వారా .....

                                               నగేష్ చూడటానికి నెమ్మదిగా ఉన్నట్లు కనిపించినా సకల దుర్గుణాభిరాముడు.ఒక్కటి కూడా మంచి లక్షణం అంటూ లేదు.ఈమధ్య కొత్తగా నేర్చుకున్నదేమిటంటే ఊళ్ళో కొత్త బైక్ ఎక్కడ కనపడితే అక్కడే దాన్నితీసుకెళ్ళి అమ్మేసుకోవటం మొదలుపెట్టాడు.వాళ్ళు వచ్చి ఇంటి మీద పడితే తండ్రి డబ్బులు కట్టటం అలవాటై పోయింది.తాజాగా ఒకళ్ళు దొంగతనం కేసు పెడితే పారిపోయాడు.తండ్రి వెతికి పట్టుకొచ్చికేసు మాఫీ చేసుకుని ఇంట్లో పెట్టి బయట తాళం పెట్టాడు.ఇంకెవరికీ అలవికాడని తనే స్వయంగా బోజనంతోపాటు మిగిలిన అవసరాలు అంటే మందు వగైరా చూస్తున్నాడు.అయినాసరే తండ్రి కళ్ళు కప్పి స్నానాలగదిలో ఉన్న వెంటిలేటర్ ద్వారా ఇంట్లో నుండి బయటకు దూకి  పారిపోయాడు.అన్నిపక్కలా  ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదు.

Tuesday, 15 December 2015

చేయకూడని పని

                                                          మన ఇంట్లో ఉన్న స్నానాల గదుల తలుపులు అసలు తీసి ఉంచకూడదు. ఎందుకంటే స్నానాల గదుల్లో ఉన్న ప్రతికూల తరంగాలు ఇంట్లోకి రావటం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది..దీనివల్ల అనారోగ్యంతోపాటు మనసును నిరాశ,నిస్పృహలు ఆవరిస్తాయి.కనుక ఈపని అసలు చేయకూడని పని.

కిటికీలు తెరవాలి

                                                                 మనలో చాలామంది దుమ్ము పడుతుందని కానీ,మరే ఇతర కారణం వలనైనా కానీ కిటికీ తలుపులు తెరవకుండా మూసేస్తుంటారు.ఇంట్లోకి ధారాళంగా వెలుతురు,తాజా గాలి వస్తుంటే ఆరోగ్యంతోపాటు మనసుకు ఉత్సాహంగా,ఆనందంగా ఉంటుంది.అందుకే వాతావరణం చల్లగా ఉన్నాసరే కిటికీలు తెరవాలి.ఈ విధంగా చేయటంవల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

అలిగి పుట్టింటికి .......

                                                   కుముద నోటితోపాటు గొంతు కూడా పెద్దది.ప్రతి చిన్నదానికి గయ్యో గయ్యో అంటూ అందరిమీద అరుస్తుంటుంది.భర్త,అత్తమామలపై కూడా ఒక్కొక్కసారి అలాగే అరుస్తుంటుంది.ఒకరోజు పిన్నత్త కూతురు పెళ్ళికి కుటుంబం మొత్తం కలిసి ఊరు వెళ్ళారు.పెళ్ళిలో కుముద భర్త తన చెల్లెలి కూతుర్ని కొంచెంసేపు ఎత్తుకున్నాడు.అది చూచి ఓర్వలేక ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళిలో నీ మేనకోడల్నిఎత్తుకోవటమేమిటి? అని భర్తతో తగువు పెట్టుకుని పిల్లల్ని కూడా భర్త దగ్గర వదిలేసి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది.కూతురు తెలివితక్కువగా చిన్న చిన్న వాటికి తగువుపడి సంసారం చెడగొట్టుకోవటం ఇష్టంలేక కుముద అమ్మ ఇంటికి ఫోనుచేసి అమ్మాయి ఒక వారం రోజులు మా ఇంట్లో ఉంటుంది అని చెప్పింది.వారం తర్వాత భర్తను,పిల్లలను వదిలి పుట్టింటికి రావటం పద్ధతి కాదని, ప్రతి చిన్నదానికి గొడవ పడకూడదని కుముద అమ్మ బ్రెయిన్ వాష్ చేసి అత్తారింటికి పంపించింది.

Monday, 14 December 2015

నోటి తురుతు

                                                              యామిని గుండ్రంగా పొత్రంలా ఉంటుంది అయినా తనే గొప్పగా,అందంగా ఉన్నాననే భావనతో అందర్నీ విమర్శిస్తూ నోటి తురుతుతో ఏదిబడితే అది మాట్లాడుతూ ఉంటుంది.అక్క కూతురి పెళ్ళి సందర్భంగా శుభలేఖ ఇవ్వటానికి రశ్మి ఇంటికి వచ్చింది.యామిని రశ్మి భర్తకు పిన్నిఅవుతుంది.రశ్మిభర్తతో ఇంతకు ముందుకన్నాఇప్పుడు చక్కగా ఉన్నావు అంది.భర్త గురించి కాస్త లావయ్యారు ఈమధ్య అంది రశ్మి.నువ్వు ఎంత లావు ఉన్నావో నీకు తెలియటం లేదు అంది రశ్మిని.రశ్మికి ఒళ్ళుమండి యామినికి కూడా తగిలివచ్చేట్లుగా అవునుగా!ఎవరిది వాళ్లకు తెలియదుగా!అన్నది రశ్మి.మళ్ళీ నోట మాట రాలేదు యామినికి.ఏమి మాట్లాడాలో తెలియక నిశబ్దంగా కూర్చుంది.

ముత్యమంత పసుపు .....

                                           ముత్యమంత పసుపు ముఖమెంత చాయ అన్నట్లు నిజంగానే ఒకప్పుడు ముఖానికి పసుపు రాసుకునే స్నానానికి  వెళ్ళేవాళ్ళు.అందుకే వయసు కనపడకుండా,ముఖాన ముడతలు లేకుండా చక్కగా ఉండేవాళ్ళు.ఇప్పుడు ఈ హడావిడి జీవనయానంలో అంత తీరిక ఉండటం లేదు.కానీ రెండు రోజులకు ఒకసారయినా ఒక పది ని.లు తీరిక చేసుకుని కొంచెం పసుపు దానికి సరిపడా నీళ్ళు తీసుకుని బాగా కలిపి ముత్యమంత పసుపు ముద్ద ముఖానికి రాసి ఒక పది ని.ల తర్వాత కడిగేయాలి.పసుపు కొత్త కణాలను వృద్ధి చేసి చర్మాన్ని బిగుతుగా మార్చటమే కాక వయసు రీత్యా వచ్చే ముడతల్ని రానివ్వదు.అందుకే పసుపుని యాంటీ ఏజింగ్ పౌడర్ అంటారు.   

Sunday, 13 December 2015

పెద్ద ఆరింద

                                                    అనిరుద్ర కు ఎనిమిది సంవత్సరాలు.అనిరుద్ర బాబాయ్,కొడుకు నాలుగు సంవత్సరాలవాడు మోటారు సైకిల్ పై వస్తుంటే ఆటోవాడు ఎదురుగా వచ్చేటప్పటికి అకస్మాత్తుగా బ్రేకు వేసేసరికి కింద పడ్డారు.బాబాయ్ కి చేతులు,కాళ్ళు బాగా కొట్టుకుపోయాయి.కొడుక్కి తలకు దెబ్బ తగిలింది.లోపల ఏమీ కాలేదు కానీ పైన గట్టి దెబ్బ తగలటంతో కుట్లు వేశారు.కొంతమేర కుట్లు కూడా వెయ్యటానికి కుదరక అలా వదిలేశారు.నిదానంగా కలిసిపోతుంది అని వైద్యులు అన్నారు.ఇంటికి బంధువులు వస్తే అనిరుద్ర పిన్ని ఇంకానయం తలలోపల ఏమీ కాలేదు.ప్రాణానికి ముప్పు రాలేదు.ఇంతటితో పోయింది.పిల్లాడి అదృష్టం అనుకోవాలి అని చెప్తుంది.ఇంతలో అటుగా వచ్చిన అనిరుద్ర అదృష్టమంట,ఏమిటి నా బొంద అదృష్టం అనేసింది.అక్కడే ఉన్న అనిరుద్ర అమ్మమ్మ ఇదొక పెద్ద ఆరింద అన్నీ దీనికే కావాలి అంది,

Saturday, 12 December 2015

అల్లరి @ 96

                                              పాల్ వయసు 96 సంవత్సరాలు.అయినా ఎంతో హుషారుగా అందర్నీ తన మాటలతో, చేష్టలతో కడుపుబ్బనవ్విస్తుంటాడు.తన 96 వ పుట్టినరోజు ఇంకా నాలుగురోజులు ఉందనగా అనుకోకుండా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.తన మునిమనుమరాలితో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలని ఇంటికి వెళ్ళాలని వైద్యురాలిని అడిగాడు.ఆమె పూర్తిగా తగ్గిన తర్వాత పంపుతామని చెప్పింది.అయినాసరే ఆ రోజుకు ఎలాగయినా వెళ్ళిపోవాలని వైద్యురాలిని నువ్వు మంచిదానివి,గొప్ప వైద్యురాలివి అంటూ పొగడటం మొదలుపెట్టి చిన్న పిల్లవాడిలా అల్లరి చేయడం మొదలు పెట్టాడు.90 ఏళ్ల భార్య మాత్రం ఇంటికి తీసుకు వెళ్తే వెంట వెంటనే ఆసుపత్రికి  తీసుకురావాలంటే తనకు కష్టం కనుక పూర్తిగా తగ్గినతర్వాతే ఇంటికి తీసుకువెళ్తానని చెప్పింది.పాల్ పదేపదే చిన్న పిల్లవాడిలా మారాం చేస్తుంటే  తప్పనిసరిగా వైద్యులు ఇంటికి పంపారు.

కలిసి కూర్చుని ......

                                                                చిరాగ్గా ఉన్నప్పుడు ఏ పని చేయాలనిపించక,ఏమి చేయాలో తోచక ఎదురుగా  కనిపించిన వాళ్ళ మీద అరవటమో,మౌనంగా కూర్చోవటమో లేక అటూఇటూ గిరగిరా తిరగుతూ ఫోన్లు మాట్లాడటమో చేస్తుంటారు.అలా  కాకుండా మన మనసుకు నచ్చిన స్నేహితులతో కానీ బంధువులతో కానీ కాసేపు కలిసి కూర్చుని కబుర్లు చెబితే మనసు తేలికపడుతుంది.మన మనసులోని భావాలూ ఇతరులతో పంచుకోవడంతో చాలా తక్కువ సమయంలో చిరాకు నుండి బయటపడవచ్చు. 

Friday, 11 December 2015

జుట్టు ఒత్తుగా....

                                                 ఉసిరి పొడి,నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఒక గ్లాసు నీళ్ళు

                                        మనలో చాలామందికి లేవగానే బ్రష్ చేసుకుని కాఫీ,టీ తాగటం అలవాటు.పరగడుపున  కాఫీ,టీ తాగే బదులు ముందుగా ఒక గ్లాసు మంచి నీళ్ళు లేకపోతే తాగగలిగినన్నినీళ్ళు తాగి ఒక పది ని.ల తర్వాత కాఫీ,టీ తాగటం ఉత్తమం.పొద్దున్నే పరగడుపున ఒక గ్లాసు నీళ్ళు తాగటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.

Thursday, 10 December 2015

నీరెండలో .....

                                                  ఉదయం,సాయంత్రం నీరెండలో ఒక అరగంట కూర్చుంటే శరీరానికి డి-విటమిన్
అందుతుంది.విటమిన్ - డి లోపం వల్ల ఎముకలు పెళుసుబారటమే కాక గుండె జబ్బులు,పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది.కనుక నీరెండలో కాసేపు నడవగలిగితే మంచిది లేదంటే కుర్చీ వేసుకుని ఏ పేపరో,పుస్తకమో చదువుకుంటూ కూర్చోవటం అలవాటు చేసుకోవాలి.


Wednesday, 9 December 2015

ఎదుటివారిని మనసారా..........

                                                         మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంటుంది.అందంలో కానీ,సేవాగుణంలో కానీ,ప్రతిభ విషయంలో కానీ,ఎదుటివారికి  సహాయపడటంలో కానీ ఏదో ఒక అంశం కావచ్చు.ఎందుకన్నా కానీ ఎంత మంచి వాళ్ళైనా ఎదుటివారిని పొగుడుదామని అనుకోరు.ఎదుటివారిలో ఉన్న మంచిగుణాన్ని మనసారా అభినందించగలిగినప్పుడే నలుగురిలో మనం ప్రత్యేకంగా నిలబడగలుగుతాము.అందుకే ఎదుటివారిని మనసారా అభినందించటం అలవాటు చేసుకోవాలి.

చదువు ఒక్కటే

                                                           సురేంద్ర చదువుకునే రోజుల్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవు.అయినా కష్టపడి తల్లిదండ్రుల కోరికమేరకు వైద్యవిద్య చదువుకున్నాడు.తల్లిదండ్రులకు అంతగా ఇష్టం లేకపోయినా కొంత డబ్బు సంపాదించి మన దేశానికి వచ్చి చుట్టుపక్కల  ప్రజలకు అన్ని సౌకర్యాలతో పెద్ద ఆసుపత్రి కట్టించి మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకు వస్తానని మాటిచ్చి విదేశానికి వెళ్ళాడు.అనుకున్నట్లుగానే స్వదేశంలో స్వంత ఊరిలో అన్ని సౌకర్యాలతో పెద్ద ఆసుపత్రిని కట్టించి మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాడు.విదేశంలో కూడా మంచి వైద్యుడిగా పేరుపొంది ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుని స్వంత ఆసుపత్రులతోపాటు కోట్లకు పడగలెత్తాడు. సురేంద్ర అక్క తమ్ముడి ఇంటికి వెళ్ళి వచ్చి ఎంతో సంతోషంతో అందరికీ గర్వంగా నా తమ్ముడు విదేశాలకు వెళ్తూ వెంట ఏమీ తీసుకెళ్ళలేదు.చదువు ఒక్కటే వెంట తీసుకెళ్ళాడు.కష్టపడి చదువుకోవటం వల్ల ఎంతో ఎత్తుకు ఎదిగాడు.పిల్లలకు ఎన్ని ఆస్తులు కూడబెట్టి ఇచ్చినా చదువు తర్వాతే అన్నీ.అందుకే తల్లిదండ్రులు పిల్లల చదువుపై శ్రద్ధ వహించి పిల్లలు ఎవరికి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో నిలబడగలిగేలా చేస్తే వాళ్ళు ఆర్ధికంగా బాగుండటమే కాక నలుగురికీ సహాయపడేలా తయారవుతారని అందరికీ చెప్తుంది.నిజానికి చదువు ఒక్కటే ఎదుటివాళ్ళు తీసుకోలేనిది.అన్నింటికన్నా చదువే ముఖ్యం.అందుకే బాగా చదువుకోమని మనుమలకు,మనుమరాళ్ళకు చెప్తుంది. 

ఆలోచనలకు ఒక స్పష్టత

                                                          పచ్చటి ప్రదేశంలో చుట్టుపక్కల అంతా పరిశీలిస్తూ,ప్రకృతి అందాలను తిలకిస్తూ,రకరకాల పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,పక్షుల కువకువలు వింటూ,సూర్యోదయాన్నిచూస్తూ లేలేత ఎండలో సూర్యకిరణాలు మీద పడుతుండగా శరీరమంతా చెమట పట్టేలా నడవాలి.అప్పుడు మనసంతా దూదిపింజలా తేలికగా,ప్రశాంతంగా ఉంటుంది.ఆ సమయంలో మన మనసులో ఉన్న ఎన్నో ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది.  

Tuesday, 8 December 2015

స్నానం చేయించింది

                                                         స్నిగ్ధ మేనత్తకు ఒక అందమైన పర్సు తీసుకు వచ్చింది.మేనత్తకు ఒక పట్టాన అన్నీ నచ్చవు కనుక రెండు పర్సులు చూపించి ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పింది.అటు తిప్పి ఇటు తిప్పి ఒకటి తీసుకుంది.ఇంకొకటి స్నిగ్ధ తను కూర్చున్న సోఫాపై పెట్టింది.ఇంతలో మేనత్త వచ్చి సోఫా పైనున్న పర్సు తీసుకెళ్ళి తడిపి మళ్ళీ సోఫాపై పెట్టింది.స్నిగ్ధ పర్సు లోపల పెడదామనుకుని పట్టుకునేసరికి తడిగా ఉంది.ఇదేంటి?ఇది తడిచిపోయింది అంది స్నిగ్ధ.ఇంతలో అక్కడే ఉన్న స్నిగ్ధ పిన్నిమీ అత్త పర్సుకు స్నానం చేయించింది అని మీ అత్త ఇంట్లో ఉన్న అన్నిసామాన్లకు స్నానం చేయిస్తుంది.అలాగే  నీ పర్సుకు కూడా స్నానం చేయించింది అని చెప్పింది.ఎంతో ముచ్చటపడి తీసుకున్న ఖరీదయిన పర్సు కడిగేసరికి పాడయిపోయింది.స్నిగ్ధ ఏమైనా అంటే అత్త బాధ పడుతుందని ఏమీ మాట్లాడకపోయినా మొహం అదోరకంగా పెట్టింది.ఆడపడుచు చేసిన పనికి,తోటికోడలు మాట్లాడిన విధానానికి,కూతురు మొహం పెట్టిన తీరుకు చూస్తున్న స్నిగ్ధ అమ్మ పొట్ట పట్టుకుని మరీ పడీపడీ ఒక పావుగంట నవ్వుతూనే ఉంది.కాసేపటికి స్నిగ్ధ మామూలైంది.

నిద్ర లేచింది మొదలు......

                                                           ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు ఉరుకులు పరుగులు పెడుతూ పాదాలకు విశ్రాంతి లేకుండా తిరుగుతూనే ఉంటాము.శరీరం బరువు మొత్తం కాళ్ళపై పాదాలపై పడుతుంది.కనుక అలసిన పాదాలకు పడుకునే ముందు గోరువెచ్చటి కొబ్బరి నూనె రాసి ఒక 5 ని.లు మర్దన చేయాలి.ఇలా చేయటం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఒత్తిడి తగ్గటమే కాక అలసట తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.

Monday, 7 December 2015

ప్రతిరోజూ ఆవిరి

                                                                         సాధారణంగా మనకు జలుబు చేసినప్పుడు మాత్రమే ఆవిరి పట్టాలని గుర్తొస్తుంది.కానీ ప్రతిరోజూ ముఖానికి ఆవిరి పడితే ముఖం అందంగా,తాజాగా ఉంటుంది.చలికాలంలో ముఖం పొడిబారినట్లు ఉంటుంది కనుక మరిగే నీళ్ళల్లో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి ఆవిరి పడితే చర్మానికి తేమ అంది చర్మం శుభ్ర పడుతుంది.నీళ్ళను మరిగించి గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసి ఆవిరి పడితే శరీరానికి కొత్త శక్తి వస్తుంది.జలుబుగా ఉంటే మరిగే నీళ్ళల్లో యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పడితే తొందరగా ఉపశమనం కలిగి  శ్వాస తీసుకోగలుగుతారు.                

నీళ్ళల్లో ఈదుకుంటూ.......

                                               ఇరవై రోజుల క్రితం చెన్నైలో వర్షాలు మొదలైనప్పుడు మనస్విని పెళ్ళి.అప్పటికే జోరున వర్షం.కళ్యాణ మండపం చుట్టూ నీళ్ళు.పెళ్ళికొడుకు,బంధువులు రావాలన్నానీళ్ళల్లో నుండి రావాల్సిందే.అది అల్లాటప్పా పెళ్ళి కూడా కాదు.ఐ ఏ ఎస్ అధికారి కూతురి పెళ్ళి.అయినా ఇబ్బంది తప్పలేదు.విధికి ఎవరైనా తలవంచవలసిందే కదా!ముహూర్తం సమయం దగ్గర పడుతుంది.పెళ్ళికొడుకు ఇంకాకళ్యాణ మండపానికి చేరుకోలేదని అందరిలో ఉత్కంఠ.ఇంతలో ఎవరరూ ఊహించని విధంగా పెళ్ళికొడుకు నీళ్ళల్లో ఈదుకుంటూ సగం తడిసిన బట్టలతో వచ్చాడు.పెళ్ళికొడుకు కూడా మామూలు వ్యక్తి కాదు.ఐ పి ఎస్ అధికారి.ముహూర్తం సమయానికి సాహసం చేసి మరీ వచ్చినందుకు పెద్దలందరూ ఎదురెళ్ళి అభినందించి తోడ్కొని రాగా ముహూర్త సమయానికి మనస్విని మెడలో తాళి కట్టాడు..పెళ్ళికూతురు కూడా వైద్యురాలు.తుఫానులో పెళ్ళి ఎలా జరిగింది?అని స్నేహితురాలు ఫోను చేస్తే విచిత్రంగా జరిగింది అని చెప్పి పెళ్ళికొడుకు గుర్రం మీద రావటం చూశాం కానీ వింతగా నీళ్ళల్లో ఈదుకుంటూ వచ్చి మరీ నన్ను పెళ్ళి చేసుకున్నాడని మనస్విని చెప్పింది.

Sunday, 6 December 2015

ఒత్తిడిని పెంచే ఆహారం

                             ,                             చిప్స్,కప్ కేకులు,బర్గర్లు.పిజాలు వంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడంవల్ల  ఒత్తిడి పెరుగుతుంది.ఎప్పుడైనా ఒకసారి తిన్నా ఫరవాలేదు కానీ తరచుగా ఇలా ఒత్తిడిని పెంచే ఆహరం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.వాటికి బదులుగా పండ్లు,కూరగాయలు,ఎండు ఫలాలు తింటుంటే ఒత్తిడి తగ్గటమే కాక ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

హాయిగా నిద్ర పోవాలంటే .....

                                                    గోరు వెచ్చటి నీళ్ళల్లో కొంచెం గులాబీ నీళ్ళు,ఎవరికి నచ్చిన పరిమళం వాళ్ళు రెండు చుక్కలు కలిపి స్నానం చేస్తే శరీరానికి,మనసుకు ఉల్లాసంగా ఉంటుంది.కంటినిండా హాయిగా నిద్ర పడుతుంది.

మొటిమలు తగ్గాలంటే.......

                                                                  వాతావరణ కాలుష్యం వలన కానీ ,ముఖంపై జిడ్డు పేరుకోవడం వల్ల కానీ,మరే ఇతర కారణం వలనైనా కావచ్చు ఈరోజుల్లో ఎక్కువమంది వయసుతో సంబంధం లేకుండా మొటిమలతో ఇబ్బంది పడుతున్నారు.అలా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కొద్దిగా శనగ పిండి,పెరుగు,ఒక స్పూను వేపాకు రసం లేకపోతే ఒక 1/2స్పూను వేప పొడి కలిపి ముఖానికి రాయాలి.ఒక పావు గంట తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఈవిధంగా తరచుగా చేస్తుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

Saturday, 5 December 2015

వ్యసనం

                                                   రామారావు స్వీటు తినందే ఉండలేడు.ఒక పూట బోజనం తినకపోయినా ఉండగలడు కానీ స్వీటు తినాల్సిందే.ఎప్పుడైనా ఇంట్లో స్వీటు లేకపోతే అప్పటికప్పుడు వాళ్ళావిడ తయారు చేసి పెట్టాల్సిందే.లేకపోతే పిచ్చి కోపం వచ్చేస్తుంది.స్వీటు కనపడితే చాలు తినకుండా ఆగలేడు.ఎన్నో సమస్యలకు మూలకారణం అని తెలిసి కూడా తీపి అతిగా తినడం ఒక వ్యసనం.తను తినడమే కాక పిల్లలకు కూడా అదే అలవాటు చేశాడు.చిన్న వయసులోనే బరువు ఎక్కువగా పెరగటమే కాక మధుమేహం కూడా వచ్చింది.అయినా తీపి పదార్ధాలు తింటూనే రోజూ ఇంజెక్షన్ చేసుకుంటున్నాడు.చనిపోయినా ఫర్వాలేదు కానీ తీపి తినడం మానను అని చెప్తాడు.

అమ్మా!నువ్వు లక్కీ

                                                             ఒకరోజు ఉదయాన్నే నీల కూతురు సిరి ఫోన్ చేసి అమ్మా! నువ్వు లక్కీ అంది.అవునా!ఎందుకు?అని అడిగింది నీల.ముందుగా కూతుర్ని కన్నతల్లిదండ్రులు అదృష్టవంతులు అని నా స్నేహితులురాళ్ళు చెప్పారు.మొదట నేను పుట్టాను కనుక నువ్వు లక్కీ!అంది సిరి.హ్హ హ్హ హ్హ అవును నిజమే కదా!అంది నీల.నిజంగానే అమ్మాయి ముందు పుడితే చక్కగా రకరకాల బట్టలు,నగలు,పట్టు లంగాలు ముచ్చటగా ఏది కావాలంటే అది అందంగా వేయొచ్చు.ఏదన్నాశుభకార్యాలు,పెళ్ళివేడుకలు చెయ్యాలన్నా ముందుగా ఆడపిల్ల అయితేనే ఎవరైనా బాగా చెయ్యగలుగుతారు.ఇది జగమెరిగిన సత్యం.  

Friday, 4 December 2015

సుకుమారంగా.......

                                                           నితీష పనిమనిషి ఊరు వెళ్ళింది.నాలుగు రోజుల్లో వస్తానన్న మనిషి నెల రోజులైనా రాలేదు.ఏ రోజకారోజు ఈరోజు వస్తుంది,రేపు వస్తుంది అనుకుంటూ ఎదురుచూస్తూ ఏ పూటకాపూట పని చేసుకోవాల్సివస్తుంది.ఒకరోజు అనుకోకుండా నితీష పెద్దమ్మ ఊరు నుండి నితీషను చూద్దామని వచ్చింది.అసలే నితీషకు పని చేసుకునే అలవాటు లేదు.వచ్చీ రాగానే నితీష పెద్దమ్మ పనిమనిషి ఊరు వెళ్ళిన సంగతి చెప్పకుండానే ఆవిషయం కనిపెట్టేసి ఏమ్మా!నీ చేతులు సుకుమారంగా ఉండేవి పని చేసేవాళ్ళ చేతుల్లా మొరటుగా తయారయినాయి.పనిమనిషి రావట్లేదా?అని అడిగింది.అవును పెద్దమ్మా!ఊరు వెళ్ళి ఇంకా రాలేదు అని నితీష చెప్పింది.

Thursday, 3 December 2015

జుట్టు పెరగటానికి టీ

నీళ్ళు - 1 కప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
నిమ్మకాయ - 1/2 చెక్క
పంచదార - తగినంత
                                                               కరివేపాకు వేసి నీళ్ళు మరిగించి వడకట్టి కొద్దిగా చల్లారనిచ్చినిమ్మరసం పిండి,పంచదార తగినంత కలుపుకుని తాగాలి.ఈ విధంగా చేస్తే జుట్టు రాలకుండా నల్లగా నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతుంది.టీ తాగటం మొదలెట్టిన 15 రోజులలోనే తేడా తెలుస్తుంది.

కీళ్ళ నొప్పులు,వాపు తగ్గాలంటే.......

అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చి పసుపు కొమ్ము - 1 అంగుళం ముక్క
కీరదోసకాయ - 1 పెద్దది
కారట్ - 3 పెద్దవి
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
                                               పై వన్నీశుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కోసి జ్యూసర్ లో వేసి రసం తీసి వడకట్టి వారానికి 4 సార్లు తాగాలి.ఈ విధంగా చేస్తుంటే కీళ్ళ నొప్పులు,వాపు తగ్గుతాయి.క్రమంగా కీళ్ళవాతం కూడా  తగ్గుముఖం పడుతుంది. 

అన్నదాతా సుఖీభవ!

                                                               సీతమ్మ,లక్ష్మమ్మ మంచి స్నేహితురాళ్ళు.అరవై సంవత్సరాలుంటాయి. నాగులచవితి సందర్భంగా పుట్టలో పాలు పొయ్యాలని అనుకున్నారు.వాళ్ళ ఊరిలో అయితే చాలా ఒత్తిడిగా ఉంటుందని ప్రశాంతంగా,నిదానంగా పూజ చేసుకోవచ్చని ఒక 1/2 గంట ప్రయాణించి వేరే ఊరులో ఉన్న సాయిబాబా  గుడికి వెళ్ళారు.అక్కడ కూడా చాలామంది ఉండటంతో అందరూ వెళ్ళేవరకు ఎదురు చూశారు.అప్పటికే 12 గం.లు అయ్యేసరికి నీరసం వచ్చింది.భక్తితో ఎలాగయినా పుట్టలో పాలుపొయ్యాలనుకుని ప్రయత్నించేసరికి తూలు వచ్చి పడిపోబోయేసరికి పక్కనే ఉన్న యువకుడు పట్టుకుని దగ్గరుండి వాళ్ళిద్దరికీ పుట్టలో పాలు పొయ్యటానికి సహాయం చేశాడు.బాబూ!నువ్వెవరివో? కానీ సమయానికి దేవుడే పంపినట్లుగా వచ్చి సహాయం చేశావు చల్లగా ఉండాలి అని దీవించారు. అదేరోజు ఇందుమతి కుటుంబం బాబా గుడిలో పూజ,సత్యన్నారాయణ స్వామి వ్రతం చేసుకుని బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.ఉదయం నుండి పుట్టలో పాలు పొయ్యటానికి వీలుపడక పుట్ట దగ్గరికి వచ్చిన ఇందుమతికి విషయం తెలిసి సీతమ్మను,లక్ష్మమ్మను విందుకు ఆహ్వానించింది.ఇద్దరూ డబ్బున్న వాళ్ళే.అప్పటికప్పుడు పిలిస్తే భోజనానికి రావటానికి మొదట ఇష్టపడలేదు.ఇందుమతి పట్టుబట్టి మీరు వయసులో పెద్దవాళ్ళు.ఈసమయంలో భోజనం చేసి వెళితే మాకు సంతోషం అని దగ్గరుండి భోజనానికి తీసుకెళ్ళింది.అన్నదాతా సుఖీభవ!అంటూ ఇద్దరూ నిష్కల్మషంగా దీవించేసరికి ఇందుమతి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది.బంధుమిత్రులు అందరూ వచ్చినా స్నేహితురాళ్ళు ఇద్దరూ భోజనం చేయడం ఇందుమతికి ఎంతో తృప్తిగా అనిపించింది.

చనా పలావు

బియ్యం - 1 కప్పు
కాబూలీ శనగలు - 1/4 కప్పు
 యాలకులు - 3
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 4
అనాస పువ్వు - 1
బిర్యానీ ఆకులు - 2
షాజీర - 1 స్పూను
జాపత్రి - 1
పచ్చి మిర్చి  - 6
ఉల్లిపాయ - 1 పెద్దది
 కొత్తిమీర - చిన్న కట్ట
పుదీనా - 1 కట్ట
ఉప్పు - తగినంత
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూను
నెయ్యి - 4 టేబుల్ స్పూనులు
నూనె  2 టేబుల్ స్పూనులు
                                                 ముందుగా బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి.చనా ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి.ఉల్లిపాయ,పచ్చి మిర్చి పొడవుగా తరగాలి.ఒక బాండీలో నెయ్యి,నూనె కలిపి పొయ్యి మీద పెట్టాలి.నెయ్యి కరిగాక యాలకులు,చెక్క,లవంగాలు,అనాస పువ్వు,జాపత్రి,షాజీర,బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.రెండు ని.ల తర్వాత పుదీనా ఆకులు,అల్లం,వెల్లుల్లి పేస్ట్,ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు,నానబెట్టిన శనగలు వేయాలి.రెండు ని .ల తర్వాత బియ్యం వేసి వేయించాలి.దీన్ని రైస్ కుక్కర్ లో వేసి 1 1/2 కప్పుల నీళ్ళుపోసి ,తగినంత ఉప్పు వేసి మూతపెట్టి స్విచ్ ఆన్ చేయాలి.చక్కగా పొడిపొడిలాడుతూ రుచికరమైన చనా పలావు తయారవుతుంది.దీన్నిఉల్లిపాయ పెరుగు పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.     

Wednesday, 2 December 2015

దూరపు కొండలు నునుపు

                                                           శివాని కి మొక్కలంటే ప్రాణం.తను ఉండే ప్రదేశంలోకన్నా కడియం వెళ్ళి తెచ్చుకుంటే ఎక్కువ మొక్కలు తక్కువరేటుకు వస్తాయన్న ఉద్దేశ్యంతో వెళ్ళింది.ప్రయాణ బడలిక తప్ప ఉపయోగం లేకుండా పోయింది.స్వంత ఊరిలో హైబ్రిడ్ గులాబీ మొక్క 50 రూ.లకు అమ్ముతుంటే కడియంలో 150 రూ.లు పెట్టి తెచ్చింది.ప్రత్యేకమైన మొక్క కాబోలు ఎన్నోపువ్వులు పూస్తుందనుకుని తెస్తే నెలకు ఒక్క పువ్వు కూడా రావటం లేదు.ఊరిలో కొన్న మొక్క నిండుగా విరగ పూస్తుంటే కడియం మొక్క దిష్టి బొమ్మలాగ దాని పక్కనే ఉంది.కడియం వెళ్ళాను కదా అని వేల రూ.లు పెట్టి అన్ని రకాల మొక్కలు కొనుక్కొచ్చింది.ఉన్న ఊరిలో మొక్కలు కొనుక్కోక "దూరపు కొండలు నునుపు"అని  దగ్గరకు వెళ్తేగానీ ఎత్తుపల్లాలు తెలియవన్నట్లుగా అయింది శివానీ పరిస్థితి.ఎడారి మొక్క నచ్చిందని అడిగితే 600 రూ.లు చెప్పి మా సారు లేరు ఇప్పుడు అమ్మడం కుదరదు అన్నాడు.మరి ఎందుకు పెట్టుకున్నట్లో? ఫొటోలలో అందమే కానీ అక్కడ అనుకున్నంత గొప్పగా ఏమీ లేదని,అంత దూరం శ్రమపడి వెళ్ళడం డబ్బు కూడా వృధా అని శివానీకి,వెంట వెళ్ళిన వాళ్ళకు అనిపించింది.

బీరకాయ వేసి బిర్యానీ

బీరకాయ - 1 పెద్దది
బంగాళదుంప -1
టొమాటోలు - 2
పచ్చిబఠాణీలు - 1/4 కప్పు 
ఉల్లిపాయలు - 2 
పచ్చిమిర్చి - 4 
పుదీనా - 1/2 కట్ట 
పసుపు - చిటికెడు 
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూను 
కారం - 1/2 టీ స్పూను 
గరం మసాలా - 1/2 టీ స్పూను 
పెరుగు - 1 టేబుల్ స్పూను 
జీరా -1 టీ స్పూను 
లవంగాలు - 3
దాల్చిన చెక్క - అంగుళం ముక్క 
యాలకులు - 2 
పలవు ఆకు - 1
నూనె ,నెయ్యి కలిపి - 2 టేబుల్ స్పూన్లు 
బాస్మతి బియ్యం - 1/4 కేజి
ఉప్పు - తగినంత
                                                          ముందుగా బియ్యం కడిగి 1/2 గం.నాననివ్వాలి.ఒకగిన్నెలేక  కుక్కర్ లో
కొద్దిగా నూనె  వేసి యాలకులు,నానబెట్టిన బియ్యం వేసి 1ని.వేయించి నీళ్ళు పోసి కొద్దిగా బిరుసుగా అన్నం వండాలి.ఒక పాన్ లో నూనె,నెయ్యి వేసి జీరా,లవంగాలు,చెక్క,పలావు ఆకు వేసి వేయించాలి.ఉల్లి,పచ్చిమిర్చి,అల్లం,వెల్లుల్లి వేసి వేగాక టొమాటో ముక్కలు,పుదీనా వేసి మగ్గనిచ్చి చెక్కు తీసిన బీరకాయ ముక్కలు,బంగాళదుంప ముక్కలు వేయించి ఉప్పు పసుపు,కారం,గరం మసాలా వేసి 2 ని.లు తిప్పాలి.పెరుగు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.అన్నం ఒక బేసిన్ లో వేసి చల్లారాక పై మిశ్రమాన్ని వేసి కలపాలి.మళ్ళీ ఈ మొత్తాన్ని ఒక మందపాటి గిన్నెలో వేసి మూతపెట్టి 10 ని.లు దమ్ చేస్తే రుచికరమైన బీరకాయ వేసిన బిర్యానీ తయారయినట్లే.

Tuesday, 1 December 2015

అసలు వయసు కన్నా తక్కువగా......

                                                           అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఇరవై ఏళ్ళ వాళ్ళలా హుషారుగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.నా వయసు ఇంకా ఇరవై అని పాడుకోకపోయినా మరీ అంతగా ఊహించుకోకపోయినా అసలు వయసు కన్నా తక్కువ వయసు వాళ్ళమని అనుకునేవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బ్రతుకుతారన్నది నిజం.బరువు పెరగకుండా ఉండటం,రోజూ వ్యాయామం చేస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ అవసరమైతే చికిత్స తీసుకోవటం,ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం వల్ల కావచ్చు ఏది ఏమైనా మేమింకా చిన్నవాళ్ళమనే భావంతో ఉన్నవాళ్ళ ఆయుర్ధాయం పెరగటమే కాక చూడటానికి కూడా ఉన్న వయసు కన్నా చిన్నవాళ్ళలా కనిపిస్తారు.వాళ్ళు చెప్తే తప్ప వయసు తెలుసుకోవటం కష్టం.ఇది ముమ్మాటికీ నిజం.

రోజూ కాసిని వేపాకులు

                                                   వేప చెట్టులో ప్రతిదీ అంటే ఆకులు,పువ్వులూ,బెరడు,నూనె,గింజలు,పండ్లు అన్నీ ఔషదభరితమే అని ప్రాచీన కాలం నుండి మనందరికీ తెలిసిన విషయం.దేని ఉపయోగం దానికే ఉన్నా రోజూ కాసిని వేపాకుల్ని తినడంవల్ల కాన్సర్ వ్యాధి రాదనేది సరి కొత్త విషయం.వేప ఆకుల్లో ఉండే రసాయనాలు కాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని అద్భుత ఔషధంగా పనిచేసి వ్యాధిని అరికడతాయి.

ప్రతి చిన్నదానికీ.......

                                                     ప్రతి చిన్నదానికీ కోపం,చిరాకు వస్తున్నా.ఒకే విషయం గురించి ఆలోచనలు పదే పదే వస్తున్నా ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది.ఈ విషయం ఎవరికి వారే గమనించి మనసును దారి మళ్ళించి యోగా,ధ్యానం,వ్యాయామం,తోటపని,ఇంటిపని లేక మనసుకు నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటుంటే వీలయినంత త్వరగా వాటి నుండి బయటపడి సంతోషంగా ఉండవచ్చు. 

Monday, 30 November 2015

మౌనంగానే ఎదగమనీ ..........

                                                     భగవంతుడు మనకు నోరు ఇచ్చింది అతిగా తినడానికో,ఎదుటివారిని అతిగా విమర్శించడానికో కాదు.కఠినంగా,అతిగా మాట్లాడేవారంటే ఎవరికీ గౌరవం ఉండదు.సాధ్యమైనంతవరకూ మితంగా మాట్లాడుతూ హుందాగా ఉండటానికి ప్రయత్నించాలి.దీన్ని మించిన శక్తివంతమైన ఆయుధం మౌనం.మౌనాన్ని ధరించిన వ్యక్తిని ఎదుటివారి దుర్భాషలైనా,ఎంతటి బలవంతుడైనా ఏమీ చేయలేడు.కొంతమంది ఎదుటివాళ్ళకు ఏమీ తెలియదు మాకే అన్నీ తెలుసన్నట్లు  ఎదుటివారిని ఈసడించి మాట్లాడతారు.వ్యర్ధమైన మాటలతో జీవితాన్ని వృధా చేసుకోకుండా ఎవరి విధులు వారు నిర్వర్తించుతూనే పవిత్రమైన ధ్యానంతో,భగవంతుని నోరారా కీర్తించుతూ,సాటి మనిషి పట్ల గౌరవభావంతో ఉండాలి.                                     

రసం ఘుమఘుమలాడాలంటే.......

                                                            రసం ఘుమఘుమలాడాలంటే  తాలింపు మొత్తం నెయ్యితోనో,నూనెతోనో వేసేకన్నానెయ్యి కొద్దిగా,నూనె కొద్దిగా వేసి తాలింపు దినుసులు,కరివేపాకుతోపాటు వెల్లుల్లి,చిటికెడు ఇంగువ కూడా వేసి వేయించాలి.కొంచెం అల్లం,వెల్లుల్లి,రెండు పచ్చిమిర్చి దంచి వేస్తే మంచి రుచి వస్తుంది.రసం ఎక్కువ సమయం మరిగిస్తే పుల్లగా చిక్కగా తయారయి రుచి మారిపోతుంది.అందువల్ల ఎక్కువసేపు మరిగించకూడదు.చివరగా రసంలో కొంచెం కొబ్బరి వేస్తే రసానికి అదనపు రుచి వస్తుంది.

Sunday, 29 November 2015

రోజుకు రెండు చక్రాలు

                                                             అనాసపండు కొయ్యటం కష్టమని మనలో చాలామంది దాని జోలికి వెళ్ళం.కానీ దాన్ని తేలికగా కొయ్యటానికి ఇప్పుడు మార్కెట్ లో చాలా సాధనాలు వచ్చాయి.చక్కగా పక్వానికి వచ్చిన పండుని పై చెక్కు తీసి చక్రాలుగా కోసి రోజూ రెండు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఇది ఎన్నోరకాల కాన్సర్లు రాకుండా కాపాడుతుంది.రక్తంలో గ్లూకోజు శాతాన్ని నియంత్రిస్తుంది.వయసుతో పాటు వచ్చే కంటి సమస్యల్ని నివారిస్తుంది.కొద్దిగా పుల్లపుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ పండుని ఇంట్లో అందరూ రోజూ రెండు చక్రాలు తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇదే గద్దరిది

                                                                శ్రీహరిరావు కుటిల మనస్తత్వం కలవాడు.ఎదుటివాళ్ళ ఆనందాన్ని, సంతోషాన్ని చూచి ఓర్చుకోలేని మనస్తత్వం.అప్పటికప్పుడు కళ్ళల్లో జిల్లెడుపాలు పోసుకున్నట్లు పిచ్చి గంగిర్లెత్తి పోతాడు.పిల్లలను సరైన పెంపకం పెంచకుండా అత్తవారిళ్ళకు తోలి అత్తారింట్లో వాళ్ళమీద ఏడుస్తుంటాడు.ఒకసారి కూతురి ఆడపడుచు పిల్లలు విదేశాలనుండి వచ్చిన సందర్భంగా బంధుమిత్రులతో హార్ధిక సమావేశాన్ని ఏర్పాటుచేసింది.ఆ సందర్భంగా వచ్చి మెదలకుండా కాసేపు కూర్చుని భోజనం చేసి వెళ్ళక విదేశాలనుండి వచ్చినవాళ్ళను చూచి యధావిధిగా తన బుద్ధి బయటపెట్టి కూతురితో ఆమె ఆడపడుచు కూతురి గురించి "ఇదే గద్దరిది" ఆయన మంచివాడే అన్నాడు.ఇంతలో ఈవిషయాన్ని ఆడపడుచు కూతురు విని ఏమిటి?అని గట్టిగా అడిగే సరికి ఏమీ లేదు.నాన్న ఈ అమ్మాయే గద్దరిది,ఆయన మంచివాడని అంటున్నాడు అని కప్పిపెట్టటానికి ప్రయత్నం చేసింది.ఇంటికి వెళ్ళాక ఏదైనా మాట్లాడుకున్నాఅదొక రకం.అప్పటికప్పుడు వాళ్ళు వినేటట్లుగా అనటం అంత అవసరమా?ఏదైనా ఆయన్ని అంటే అన్నాడని సరిపెట్టుకోవచ్చు.ఉట్టి పుణ్యానికి ఎదుటివాళ్ళను మాటలతో  బాధపెట్టటం సమంజసమా?ఏంటో? కట్టెతో గానీ ఈ బుద్దులుపోవు అనుకుంది.

రోషం లేనిదాన్ని కనుక .......

                                                                                        సీతమ్మ కొడుక్కి లేకలేక చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు.అందరి అతి గారాబంతో వాళ్ళు పెరిగే కొద్దీ మహా మొండిగా తయారయ్యారు.పెద్దాచిన్న లేకుండా ఏదిపడితే అది మాట్లాడటం అలవాటయింది.ఒకరోజు ఉదయం పిల్లలిద్దరినీ నిద్ర లేపుతుంటే లేవకుండా బండదానా!పొద్దున్నేలేపుతావెందుకు?నోరుముయ్యి అంటూ అరవటం మొదలెట్టారు.ఆవిధంగా పిల్లలతో అనిపించుకోవటం సీతమ్మకు నచ్చదు.కోపాన్ని తమాయించుకుని నోరుముయ్యి అంటూ మాట్లాడుతున్నారు. ప్రేమను చంపుకోలేక   రోషం లేనిదాన్ని కనుక మీ ఇంటికి వస్తున్నాను అదే మీ అమ్మమ్మ అయితే ఇంట్లో అడుగు పెట్టేది కూడా కాదు అని గుణుసుకుంది.సీతమ్మ కొడుకు ఏటా అయ్యప్ప మాల వేసుకుంటాడు.పిల్లలకు కూడా మాల వేయించితేనన్నా క్రమశిక్షణ అలవాటవుతుందని అనుకుని వేయించారు.పూజ పెట్టుకుంటేనన్నా మార్పు వస్తుందని అనుకుంటే అది కూడా లేదు అంటూ మాల వేసుకున్నవాళ్ళను ఏమీ అనకూడదు కనుక  తన బాధను వెళ్ళగక్కింది.

Friday, 27 November 2015

చలికాలంలో ఆహారం

                                  చలికాలంలో ఆహరం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.ఈకాలంలో జలుబు,దగ్గుతోపాటు అనేకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.వంటల్లో మిరియాలు,పసుపు,లవంగాలు,యాలకులు వంటివి వాడటంవల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.వేడివేడి ఆహారం తినాలి. సూపులు తయారుచేసేటప్పుడు కొద్దిగా మిరియాలపొడి వేసుకుని వేడిగా తాగితే గొంతు నొప్పి,గరగర లేకుండా బాగుంటుంది.పచ్చికూరగాయ ముక్కలు తినేకన్నా ఉడికించినవి తినడం మేలు.ఆలివ్ నూనె వాడటం వల్ల శరీరంలో కొవ్వు దరి చేరకుండా ఉంటుంది. 

పెదవులు మృదువుగా

                                                                 చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి పెదవులు పగిలి గరుకుగా
తయారవుతాయి.ఈ సమస్య నుండి తేలికగా బయటపడాలంటే కొన్ని చుక్కలు తేనె,పంచదార తీసుకుని పెదాలకు రాసి ఒక ఐదు ని.లు తర్వాత కడగాలి.రోజుకు రెండుసార్లు ఈవిధంగా చేస్తే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి.

జీవితంలో సగం సమయం

                                                              లాలస వయసు నిండా పదహారేళ్ళు కూడా ఉండవు.ఎప్పుడు  చూసినా అందంగా తయారవటానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది.పక్కింటికి వెళ్ళాలన్నా,స్కూలుకు వెళ్ళాలన్నా కూడా పూర్తిగా మేకప్ వేసుకుంటే గానీ కదలదు.చదువు కన్నా ముందు ముఖారవిందానికి మెరుగులు దిద్దుకోవటమే ముఖ్యం అంటుంది.ఏ రంగు బట్టలు వేసుకుంటే ఆరంగు కనురెప్పలపై,బుగ్గలపై వేసుకుంటుంది.చెప్పులుతో సహా అన్నీ ఒకే రంగులో ఉండాలంటుంది.ఒక రోజు అద్దం ముందు కూర్చుని బుగ్గలకు రంగు వేసుకుంటూ నానమ్మతో ఏంటో?నానమ్మా!నా జీవితంలో సగం సమయం అందంగా తయరవటానికే సరిపోతుంది అంది.అప్పుడు నానమ్మ ఇప్పుడు అది అంత అవసరమా తల్లీ?ఈవయసులో చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తే అంత కన్నా ఎక్కువగా  భవిష్యత్తులో సుఖపడవచ్చు.అందంగా తయారవటానికి తర్వాత చాలా సమయం ఉంటుంది.కనుక ముందు బాగా చదువుకో అంది నానమ్మ.బుద్ధిగా సరేనంది కానీ అద్దం ముందు నుండి మాత్రం కదలలేదు. 

Thursday, 26 November 2015

మంచి ఆలోచన

                                                                    దమయంతికి మొక్కలంటే చాలా ఇష్టం.కార్తీక మాసం సందర్భంగా దమయంతి కుటుంబం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు.ఆ సందర్భంగా ఏదోఒక బహుమతి లేక రవికెల ముక్కలు  ఇచ్చే బదులు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మొక్క ఇద్దామని నిర్ణయించుకున్నారు.ఆ విషయం దమయంతి మరదలు వాళ్ళ నాన్న దగ్గర చెప్పింది.వాళ్ళ నాన్నమొక్కలు ఇవ్వటమనేది మంచి ఆలోచన.నా దగ్గర కూడా కొన్ని రామాఫలం మొక్కలు ఉన్నాయి.మీరు ఇచ్చే మొక్కలతోపాటు అవి కూడా ఇవ్వమని పంపించారు.దమయంతి రంగురంగుల గులాబీ,చామంతి,మందార,కనకాంబరం మొక్కలు నర్సరీ నుండి తెప్పించింది.దమయంతి వాళ్ళు పూజాకార్యక్రమంలో ఉండగానే మొక్కలు కిందకు దించుతూ ఉన్నప్పుడే ఎవరికి  దొరికినవి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అన్ని రకాల మొక్కలు మనిషికి 5-10 మొక్కలు చొప్పున కారులో సర్దుకున్నారు.చివరి వాళ్ళకు లేకుండా అయిపోయాయి.ఈ విషయం దమయంతికి తెలిసి మొదట కొంచెం బాధపడినా మళ్ళీ మొక్కలు తెప్పించే సమయం లేకపోవడం వలన ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మొక్క ఇచ్చినా మొక్కలంటే ఆసక్తి లేనివాళ్ళు సరిగా వాటి ఆలనాపాలనా చూడకపోతే మొక్క ఎండిపోయే బదులు ఇష్టమైన వాళ్ళు సక్రమంగా పెంచుతారులే అని సరిపెట్టుకుంది.కానీ మనలాంటి వాళ్ళే అందరూ అందరికీ ఒక్కొక్కటి ఇవ్వాలన్న వాళ్ళ ఆలోచనకు భంగం కలిగించి ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచన ఎప్పటికి కలుగుతుందో?అనుకుంది దమయంతి.ఇంతకీ రామాఫలం మొక్కలు మాత్రం మిగిలిపోయాయి.

Wednesday, 25 November 2015

వనభోజనాల సందడి

                                                             కార్తీకమాసం వచ్చిందంటే వనభోజనాల సందడే సందడి.ఈమాసంలో ఎంతో పవిత్రమన ఉసిరి చెట్టు కింద ఒక్క పూటయినా భోజనం చేయాలన్నది మన సంప్రదాయం.కార్తీక మాసంలో విష్ణుమూర్తి,లక్ష్మీదేవి ఇద్దరూ ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని పురాణం కధనం.అందుకే ఎవరికి వారు తోటలో ఉసిరి చెట్లు నాటి ఆచెట్ల కింద విందు భోజనాలు ఏర్పాటు చేయటం అనాదిగా వస్తున్నఆచారం.ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో కనీసం ఐదు ఉసిరి మొక్కలు నాటాలని పెద్దలు చెబుతుంటారు.సంవత్సరానికి ఒకసారి బంధుమిత్రులతో ఉదయం తోటకు వెళ్ళి సాయంత్రం వరకు పిల్లలు,పెద్దలు సరదాగా ఆటపాటలతో,కబుర్లతో ఆనందంగా గడపటం ఒక గొప్ప అనుభూతి.

సర్వదోషహర

                                                                       కార్తీక మాసం నుండి వచ్చే ఉసిరి కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరం,ఔషధ గని ఉసిరి.శీతాకాలం నుండి వేసవి వరకు వచ్చే కాయల్ని ఎండ బెట్టి పొడిచేసినా,పచ్చడి రూపంలో కానీ,మురబ్బాకానీ ,చిన్నముక్కలు చేసి ఎండ బెట్టి సంవత్సరమంతా నిల్వ  చేసుకుని ఏ విధంగా వాడుకున్నాఆరోగ్యానికి ఎంతో మంచిది.అందుకే ఉసిరిని "సర్వదోషహర" అంటారు.శరీరంలోని విష తుల్యాలను తొలగించి అన్ని అవయవాలు సమన్వయంతో పని చేసేలా చేస్తాయి.ఉసిరిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ కనుక గుండె జబ్బులు,కాన్సర్,మధుమేహం,జీర్ణ సంబంధ సమస్యలు వంటివి సైతం దరిచేరవు.తాజా ఉసిరి గుజ్జును కుదుళ్ళకు పట్టించడం వల్ల జుట్టు బాగా పెరిగటమే కాక నల్లగా కూడా ఉంటుంది.అందుకే ఉసిరిని ఏదో ఒక రూపంలో తింటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే.ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా కాపాడుతుంది.

అచ్చం అక్కడి అమ్మాయే

                                                     ప్రదీప్తి కూతురు,అల్లుడు విదేశాలనుండి ఐదు సంవత్సరాల తర్వాత స్వదేశానికి వచ్చారు.ఆ సందర్భంగా ప్రదీప్తి కుటుంబం బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు.విందుకు వచ్చిన ఒక పెద్దావిడ వెళ్తూ వెళ్తూ ప్రదీప్తి దగ్గరకు వచ్చి నీ కూతురు అచ్చం అక్కడి అమ్మాయే అనిపిస్తుంది.మనిషే కాదు జుట్టు కూడా మారిపోయింది అంది.మనిషీ మారలేదు జుట్టు కూడా మారలేదు.ఇప్పుడు పిల్లలు సరదాగా జుట్టుకు రంగులు వేయించుకుంటున్నారు కదా!అందులో అమ్మాయి బంగారు వర్ణం అక్కడక్కడా వేయించుకుంది.అందుకని నీకు అలా అనిపించింది అంతే.అంతకు మించి మార్పు ఏమీ లేదు అంది ప్రదీప్తి.    

పంచుకుంటే......

                                                          ఆత్మీయులతో బాధను పంచుకుంటే సగానికి తగ్గుతుంది.ఆనందం రెట్టింపు అవుతుంది. 

Monday, 23 November 2015

పులిహోర రుచిగా........

బియ్యం  - 2 కప్పులు
నిమ్మకాయ - 1
పెద్ద ఉసిరికాయలు - 2
ఉప్పు - తగినంత
పచ్చి మిర్చి - 5
కారట్ తురుము  - గుప్పెడు
                                                  బియ్యం శుభ్రంగా కడిగి మరీ బిరుసుగా,మెత్తగా కాకుండా మధ్యస్థంగా అన్నం వండాలి.తర్వాత వెడల్పాటి ప్లేటులో ఆరబెట్టాలి.స్టవ్ వెలిగించి బాండీలో నూనెవేసి కాగిన తర్వాత 2 లేక 3 ఎండుమిర్చి వేసి వేగాక దినుసులు వేసి వేగనివ్వాలి.కరివేపాకు వేసి వేగాక పసుపు,నిలువుగా కోసిన పచ్చిమిర్చి ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి.దీన్ని ఆరబెట్టిన అన్నంపై వేసి,సన్నగా తరిగిన కొత్తిమీర,కారట్ తురుము నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఇష్టమైతే వేరుశనగ గుళ్ళు,జీడిపప్పు వేసి వేయించి కలపాలి.ఉసిరికాయ తురుము వేయడంవల్ల పులిహోరకు అదనపు రుచి వస్తుంది.   

నాజూగ్గా తయారవ్వాలంటే........

                                                                    రోజూ ఒక తమలపాకు ఈనెలు తీసేసి దానిపై చిటికెడు మిరియాల పొడి వేసుకుని తిని వెంటనే చల్లటి మంచినీళ్ళు తాగితే నాజూగ్గా తయారవుతారు.ఈవిధంగా రెండు నెలల పాటు చేయాలి. 

Tuesday, 10 November 2015

మీ ఇంట మహాలక్ష్మి

                                                                      దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించి సంధ్య వేళ దీపాలు వెలిగించి ఇంటి ముందు పెడితే సకల సంపదలు చేకూరుతాయి.ఈదీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మీ ఇంట మహాలక్ష్మి కొలువై ఉండాలని కోరుకుంటూ..........
.....


దీపావళి శుభాకాంక్షలు

                                        మహాలక్ష్మి మన ఇంట సిరులు కురిపించాలని,ఆనందంతో ఆయురారోగ్యాలతో,భోగభాగ్యాలతో తులతూగేలా లక్ష్మీ కటాక్షం మన అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ నాబ్లాగ్ వీక్షకులకు,నాతోటి బ్లాగర్లకు ,మిత్రులకు,శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు.

Monday, 9 November 2015

పచ్చటి మొక్కల మధ్య......

                                                       ఉదయం సూర్య కిరణాలు రాగానే లేలేత ఎండలో పచ్చటి మొక్కల మధ్య వారానికి ఒకసారైనా స్వచ్చమైన గాలి పీల్చుతూ నడవడం వల్ల వారమంతా ఉత్సాహంగా ఉండటమే కాక ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు.ఉరుకుల పరుగుల జీవితంలో పనిగట్టుకుని వెళ్ళాలంటే కష్టం అనుకునేవాళ్లు ఉన్నంతలో   కిటికీల్లో,బాల్కనీల్లో చిన్నచిన్న కుండీలు పెట్టుకోవచ్చు.ఉదయం లేవగానే పచ్చటి మొక్కలు చూడటం వల్ల మనసుపై సానుకూల ప్రభావం పడుతుంది.మొక్కల మధ్య ఎక్కువ సమయం గడపటం వల్ల ఒత్తిడి దరిచేరదు. 

Sunday, 8 November 2015

పచ్చి బఠాణీ - మెంతి కూర

మెంతి కూర తరిగినది - 2 కప్పులు
జీరా - 1 స్పూను
ఉల్లిపాయ -1
టొమాటోలు - 2
పచ్చి బఠాణీ - 1 కప్పు
గరం మసాలా - 1 టేబుల్ స్పూను
ఉప్పు - తగినంత
కారం - తగినంత
క్రీం - 2 స్పూనులు (ఇష్టమైతే)
నూనె - 1/4 కప్పు
                                                     
గ్రేవీ కోసం:పచ్చిమిర్చి - 5,జీడిపప్పు - 10,గసాలు - 2 స్పూనులు,అల్లం వెల్లుల్లు పేస్ట్- టేబుల్ స్పూను

                                              గ్రేవీ కోసం తీసున్నవాటిని మెత్తని పేస్ట్ చేయాలి.బాండీలో నూనె వేసి కాగాక అందులో జీరా,ఉల్లిపాయ ముక్కలు,వేసి వేయించి 2 ని.ల తర్వాత టొమాటో గుజ్జు వేసి సిమ్ లో  పెట్టి వేగాక,గసాల పేస్ట్,గరం మసాలా,కారం,తగినంత ఉప్పు వేయాలి.2 ని.ల తర్వాత మెంతికూర,బఠాణీలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టాలి.బఠాణీలు ఉడికిన తర్వాత క్రీమ్ వేసి దించేయాలి. 

చురుగ్గా ఆహ్లాదంగా....

                                                                          రోజూ ఒక పావుగంట తప్పనిసరిగా వ్యాయామం చేయడం వల్ల మానసిక స్థితికి సంబంధించిన హార్మోన్లు పనితీరు మెరుగుపడుతుంది.దాంతో మెదడుపై సానుకూల ప్రభావం అధికంగా ఉంటుంది.దీనివల్ల మనసు చురుగ్గా,ఆహ్లాదంగా ఉంటుంది.మనం సహజంగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని కానీ,నాజుగ్గా తయారవుతామని కానీ అనుకుంటాము.కానీ చలాకీగా,ప్రశాంతంగా ఒత్తిడి అనేది దరిచేరకుండా ఉండాలంటే శరీరం మొత్తం కదిలేలా వ్యాయామం చేయడం వల్ల అది సాధ్యమవుతుందని అనుభవజ్ఞుల సలహా,సూచన.

Saturday, 7 November 2015

కూరగాయలు కొద్దికొద్దిగా ఉంటే......

                                                           కూరగాయలు కొద్దికొద్దిగా ఉంటే వాటిని వృధాగా పడేయకుండా అన్నీ కలిపి పులుసు,పచ్చడి,కూర చేయవచ్చు.రుచిగా ఉంటుంది.సలాడ్లు చేయవచ్చు.అన్నం వండేటప్పుడు అన్ని కూరగాయలు వేసి వండుకోవచ్చు.దీన్ని రసంతో కానీ,పులుతో కానీ,పెరుగుతో కానీ తినవచ్చు.ఆకుకూరలు ఉంటే కూడా అన్నీ కలిపి ఉల్లిపాయ,పచ్చి మిర్చి వేసి వండితే బాగుంటుంది.విభిన్న రుచిలో ఉండటమే కాక అన్నిరకాల పోషకాలు అందుతాయి. 

ఆహారం వృధా కాకుండా ........

                                                      ఎవరికైనా భోజనం వడ్డించేటప్పుడు ఎక్కువ మొత్తంలో పెట్టి తినమని బలవంత పెట్టకూడదు.పాపం!ఎదుటివాళ్ళు మొహమాటానికో,పడేయకూడదనో తినలేక,పారేయలేక నానా ఇబ్బంది పడుతుంటారు."అన్నం పరబ్రహ్మ స్వరూపం"అని అన్నారు పెద్దలు.తక్కువ మొత్తంలో ముందు వడ్డించితే కావాలంటే మళ్ళీ వడ్డించవచ్చు.ముందుగానే ఎక్కువ పెట్టేస్తే తినలేక పారేసే అవకాశం ఉంది.అన్నం వృధాగా పడేయకూడదు.మనం ఏది పెడితే అదే తినాలి అనుకోకుండా పిల్లల విషయంలో కూడా వాళ్ళేమి తింటారో అడిగి అది చేసి పెడితే ఆహారాన్ని వృధా చేయరు.రోజూ కుటుంబసభ్యులు ఎంత తింటారో అంచనా వేసుకుని దానికి తగినట్లుగా వండితే ఆహారం వృధా కాకుండా ఉంటుంది.రోజు ఒకే పద్దతిలో వంట చేసేకన్నావివిధ రకాల పద్దతుల్లో చేస్తే అందరూ ఇష్టంగా వృధా చేయకుండా తింటారు. 

Friday, 6 November 2015

అలసిన చర్మానికి........

                                                   నిద్ర సరిపోకపోయినా,పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ముఖంలో అలసటతో పాటు చర్మం నిర్జీవంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటుంది.అటువంటప్పుడు ఐస్ ముక్కలు పలుచటి వస్త్రంలో వేసి ముఖంపై,కళ్ళపై ఒక 5 ని.లు రుద్దాలి.తర్వాత అరటి పండు తొక్క లోపలి భాగంతో ముఖంపై మృదువుగా మర్దన చెయ్యాలి.ఒక 10 ని.ల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి.ఈ విధంగా చేస్తే ముఖంలో అలసట తగ్గి చర్మానికి కొత్త కళ వస్తుంది.  

మోకాళ్ళు నొప్పులు,శబ్దాలు తగ్గాలంటే.............

                                         ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎక్కువమందికి కాళ్ళ నొప్పులు,కీళ్ళ నొప్పులు,మోకాలి నొప్పులు వస్తున్నాయి.కింద కుర్చోవాలంటే కష్టం.కూర్చుంటే లేవడం కష్టం.పరిణయ కింద కూర్చుని లేవగలదు కానీ మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళ నుండి కిర్రు,కిర్రు అంటూ శబ్దాలు వస్తున్నాయి.పరిణయ భర్త వృత్తిరీత్యా ఇంజినీరు.వృత్తిలో భాగంగా పెద్దపెద్ద భవనాలు నిర్మించేటప్పుడు ఇరవై అంతస్తులు నిర్మాణదశలో ఉండగా పైకి క్రిందకు చాలాసార్లు ఎక్కి దిగటం వలన మోకాళ్ళు నొప్పి రావడం మొదలయింది.అందుకని పరిణయ,ఆమె భర్త ఇద్దరూ కలిసి వైద్యుని దగ్గరకు వెళ్ళారు.పరిణయకు మోకాలి చిప్పల దగ్గరుండే జిగురు పదార్ధం తగ్గుతుందని,భర్తకు మోకాళ్ళు లోపల ఒకదానితో ఒకటి రుద్దుకోవడం వల్ల నొప్పి వస్తుందని రోజు క్రమం తప్పకుండా ఈ కింది విధంగా చేయమని చెప్పారు.అదెలాగంటే ....
                                                                   1)కాళ్ళు ముందుకు చాపి కూర్చుని రెండు మోకాళ్ళ కింద చిన్నచిన్న దిండ్లు పెట్టుకోవాలి.చేతులు పక్కన పెట్టుకోవాలి.మోకాళ్లను నేలవైపు నొక్కుతూ కొద్దిగా ఒత్తిడి తెచ్చి కొన్ని సెకన్ల తరువాత కాళ్ళను వదులు చేయాలి.ఇలా10 - 20 సార్లు చేయాలి.శ్వాస మాములుగా తీసుకుని వెన్నెముక నిటారుగా ఉంచాలి.2)కాళ్ళు రెండు చాపి కూర్చుని కుడికాలు కొద్దిగా మడిచి మోకాలి కింద చిన్న దిండు పెట్టుకుని,రెండు చేతులతో పొట్టవైపుకు మోకాలిని దిండుతోసహా మడిచి దగ్గరకు తీసుకోవాలి.ఎక్కువ ఒత్తిడి పనికి రాదు.వెన్నెముక,ఎడమకాలు నిటారుగా ఉండాలి.ఇలా ఒక 10 సెకన్లు ఉంచాలి.5 - 10 సార్లు చేయాలి.ఎడమ కాలితో కూడా ఇదే విధంగా చేయాలి.ఇలా చేయడం వల్ల మోకాలి కండరాలు శక్తివంతంగా తయారయి నొప్పి,వాపు శబ్దాలు తగ్గిపోతాయి.కింద కూర్చుంటే తేలిగ్గా కూడా లేవగలుగుతారు.  

Thursday, 5 November 2015

ప్లాస్టిక్ సీసాలు వాసన రాకుండా.........

                                                                      కొద్దిరోజులు వాడకపోతే ప్లాస్టిక్ సీసాలనుండి అదొకరకమైన వాసన వస్తుంటుంది.అటువంటప్పుడు ఒక కప్పు గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక నిమ్మకాయ రసం  పిండి కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.ఈనీళ్ళను సీసాల్లో నింపి కాసేపయ్యాక కడిగితే ప్లాస్టిక్ సీసాలనుండి వాసన రాకుండా శుభ్రంగా ఉంటాయి.  

Wednesday, 4 November 2015

దోమలకు ఇష్టం

                                                    ఇంతకుముందు బాగా దోమలుంటే  తప్పరమణి దగ్గరకు దోమలు వచ్చేవి కాదు. అలాంటిది ఇప్పుడు తెగ కుట్టేస్తున్నాయి.అదేంటి?ఇంతకు ముందు కుట్టేవి కాదుకదా!అనుకుంది రమణి.ఒకరోజు "ఓ"గ్రూపు రక్తం దోమలను బాగా ఆకర్షిస్తుందని పేపరులో చదివింది.రమణి ఇంట్లో అందరిదీ ఓ +.రమణిది మాత్రం ఓ - .అందుకని కుట్టేవి కాదు అనుకునేది.కానీ ఇప్పుడు రమణిని కూడా కుట్టటం వలన ఈమధ్య దోమలకు ఓ గ్రూపు అయితే చాలు ఇష్టం అని అర్ధం చేసుకుంది. 

దిబ్బరొట్టె మీద దిబ్బరొట్టె

                                                                     సత్తెమ్మ కూతురు చదువుకుని ప్రయోజకురాలై కొద్ది రోజులు విదేశాలలో ఉండి డబ్బులు సంపాదించుకుని తిరిగి స్వదేశానికి వచ్చి అమ్మానాన్నలను పెద్దవయసులో  తనే దగ్గరుండి జాగ్రత్తగా చూచుకోవచ్చని వెళ్ళింది.ఏ వయసు ముచ్చట ఆ వయసుకని అమ్మానాన్నలు పెళ్ళి చేశారు.ఆమెకు కూతురు పుట్టింది.తను ఉద్యోగానికి వెళ్ళటం కోసం మనవరాలిని పెంచటానికి అమ్మానాన్నలను తన దగ్గరకు తీసుకెళ్ళింది.ఒక ఆరునెలల తర్వాత సత్తెమ్మ ఇంటికి తిరిగి వచ్చింది.సంబరంగా విదేశంలో ఉన్న కూతురి కబుర్లు అందరికీ చెబుతూ మధ్యలో అక్కడ దిబ్బరొట్టె మీద దిబ్బరొట్టె పెట్టి దాని మధ్యలో కూరగాయలు పెడతారని అది తిన్నానని చెప్పింది.మొదట వింటున్న వాళ్ళకు అర్ధం కాలేదు కానీ తర్వాత బర్గర్ అని అర్దమయింది.సత్తెమ్మ తనకు తెలిసిన భాషలో భలే వివరించిందని,ఆ చెప్పే విధానానికి  వింటున్న అందరికీ నవ్వు వచ్చింది. 
  

Tuesday, 3 November 2015

స్వతంత్రంగా.......

                                                          జీవితం ఎప్పుడూ ఒకేవిధంగా ఉంటే నిరాసక్తంగా అనిపిస్తుంటుంది.నిరాసక్తత ఎక్కువైతే ఆత్మన్యూనత ఏర్పడుతుంది.దీనిలో నుండి ఎంత త్వరగా  బయటపడాలంటే అంత త్వరగా మార్పుకోసం  ప్రయత్నించాలి.ముందుగా మన మనసుకు నచ్చిన పని చేస్తే ఎవరేమనుకుంటారో అని ఆలోచించడం మానేయాలి.ప్రతి పనినీ అందరికీ నచ్చేలా చేయడం చాలా కష్టం.ఇది ఎదుటివారికి కూడా వర్తిస్తుంది.ఈ చిన్న ప్రాధమిక సూత్రం గుర్తుంచుకుంటే దేన్నైనా స్వతంత్రంగా చేయగలుగుతారు.వ్యాపారమైనా,ఉద్యోగమైనా ఎవరి అబిరుచికి తగినట్లుగా వాళ్ళు చేస్తే ఉత్సాహంగా చేయగలిగి బాగా  రాణిస్తారు.

ఆభరణాలు సరికొత్తగా.......

                                                                 బంగారు,వెండి ఆభరణాలు కొన్నాళ్ళకు పాతవాటిలా కనిపిస్తుంటాయి.
అలాంటప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం,నీళ్ళు సమపాళ్ళల్లో తీసుకుని దానిలో ఆభరణాలను ఒక అరగంటపాటు నానబెట్టి తర్వాత తీసి మామూలు నీళ్ళతో శుభ్రంగా కడిగి మెత్తటి వస్త్రంతో తుడిస్తే సరికొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి.

Monday, 2 November 2015

చక్కటి అనుబంధం

                                                            రాజారావు గారికి పుస్తకాలన్నా,పుస్తకాలను చదవటంఅన్నా ఎంతో ఇష్టం.ఎక్కడకు వెళ్ళినా నచ్చిన పుస్తకాలను ధర ఎంతైనా కొని ఇంట్లో భద్రపరచటం,తీరిక సమయంలో వాటిని చదవటం అలవాటు.తన మనవడు,మనవరాలు చదవటం కోసం ఒక చిన్న గ్రంధాలయాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేశారు.వాళ్ళకు తాతయ్య దగ్గరకు రావటం,తాతయ్య చెప్పే కథలు వినడం,చదవటం ఎంతో ఇష్టం.అంతగా పిల్లలకు ఎందుకు ఇష్టం అంటే పిల్లలకు నచ్చేచక్కని బొమ్మలు,కార్టూన్లు,పజిళ్ళు,పిల్లలను ఆకట్టుకునే రంగుల్లో ఉండే నీతి కథల పుస్తకాలను తెచ్చి తన గ్రంధాలయంలో పెడుతూ ఉంటారు.వీటిల్లో బొమ్మలు వేసేవి,బొమ్మలకు రంగులు దిద్దేవి,పజిళ్ళు పూర్తి చేసేవి,బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలు ఎక్కువ ఉంటాయి.దానికి తోడు రాజారావుగారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పిల్లలు రాగానే అవన్నీ పక్కన పెట్టి రకరకాల హావభావాలతో కథలు చదివి విడమరచి చెప్తూ,వాళ్ళకు నచ్చిన ఆటలు ఆడుతూ వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపటంతో పిల్లలకు  తాతయ్యతో అనుబంధంతోపాటు,పుస్తకాలతో కూడా చక్కటి అనుబంధం ఏర్పడింది. అందుకని పిల్లలకు స్వంతంగా కథలు చెప్పడం,చదవటం,చదివింది అర్ధం చేసుకోవటం  చిన్నతనం నుండే అలవాటయింది.ఎవరికయినా చిన్నప్పటినుండి తరగతి పుస్తకాలే కాక,విడి పుస్తకాలు కూడా చదవటం అలవాటు చేస్తే వారికి విజ్ఞానంతోపాటు,సామజిక అవగాహన,కష్టనష్టాలు ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యం,పరిణతి  ఉంటుంది.రకరకాల పుస్తకాలు చదవటం వల్ల భాషపై పట్టు వస్తుంది.

అమ్ముకునేవాళ్ళ కన్నా.....

                                                                          స్పందన కొడుకు శ్రీహర్ష ఉన్నత విద్యను అభ్యసిస్తూ హాస్టల్ లో ఉంటున్నాడు.సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చాడు.కొడుకు ఇబ్బంది పడకుండా అవసరమైన వస్తువులు సర్ది ఉంచితే అన్నీ ఉన్నాయి.ఏమీ వద్దంటూ తీసి పక్కన పెట్టాడు.స్పందన తీసుకెళ్ళు నాన్నా!అవసరమైతే ఉంటాయి కదా!అని ఒక్కొక్కటి మళ్ళీమళ్ళీ తీసి ఇస్తుంటే ఏంటమ్మా?సామాన్లు అమ్ముకునే వాళ్ళు కొనండి అంటూ వెంటబడి విసిగించినట్లుగా నువ్వు వస్తువులు తీసుకెళ్ళు నాన్నా!అంటూ అమ్ముకునే వాళ్ళ కన్నా కనాకష్టంగా  హింస పెట్టేస్తున్నావు? దయచేసి నన్నువదిలేయ్ అమ్మా!అన్నాడు.ఇదేమిటి?ఎంతో ప్రేమతో ఇస్తుంటే హింస పెడుతున్నట్లుగా ఉంది కాబోలు.ఏమి పిల్లలో ఏమిటో?అనుకుంది స్పందన.

సన్నటి మేకప్ బ్రష్ తో.........

                                                   కంప్యూటర్ కీబోర్డ్ పై దుమ్ము,ధూళి పేరుకుపోయినప్పుడు సన్నటి,మెత్తటి మేకప్ బ్రష్ తో దులిపితే తేలికగా శుభ్రపడుతుంది.

Sunday, 1 November 2015

సోయా గ్రాన్యూల్స్ వడ

                                                       సోయా ఆకు,పాలు,సోయా గ్రాన్యూల్స్ ఏరూపంలో తీసుకున్నాఆరోగ్యానికి చాలా మంచిది.ఎప్పుడూ ఒకే రకంగా గ్రాన్యూల్స్ టొమాటోతో కలిపి కూర మాత్రమే వండుకునే కన్నావడల్లా వేస్తే బాగుంటుంది.
సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు(పొట్టు లాంటిది)
బ్రెడ్ పొడి - 1 కప్పు
బంగాళ దుంప - 1 పెద్దది
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చి మిర్చి - 5
కొత్తిమీర - చిన్న కట్ట
ఉప్పు - తగినంత
మొక్కజొన్న పిండి - 2 స్పూనులు
గరం మసాలా - 1 స్పూను
టొమాటో కెచప్ - 1 స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
                                                         సోయా గ్రాన్యూల్స్ పొట్టు వేడినీటిలో వేసి 5 ని.ల తర్వాత నీళ్ళు వంపేసి కొద్దిగా చల్లటి నీళ్ళు పోసి గట్టిగా పిండి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేయాలి.బంగాళదుంప ఉడికించి ముద్దలా చేయాలి. ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు సన్నగా కోసి పెట్టుకోవాలి.కొత్తిమీర సన్నగా తరగాలి.వీటన్నింటిని,మిగిలిన పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.దీన్ని చిన్నచిన్న వడల్లాగా చేసి కాగుతున్న నూనెలో వేయించి తీయాలి.వీటిని రెడ్ చిల్లీ సాస్ తో కానీ.టొమాటో సాస్ తో కానీ తింటే రుచిగా ఉంటాయి.

Saturday, 31 October 2015

తీరిక దొరికితే......

                                                 మనలో చాలా మందికి కాసేపు తీరిక దొరికితే చాలు టి.వి.చూడటమో లేదా పుస్తకం చేత్తో పట్టుకుని కుర్చోవటమో అలవాటు.రోజులో ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవటం వల్ల శ్వాస,గుండె కొట్టుకునే వేగం తగ్గి రక్తప్రసరణ తగ్గుతుంది.ఈమార్పులు నిస్తేజాన్ని సూచిస్తాయి.మన శరీరానికి సరిగా ప్రాణవాయువు అందకపోయినా నిస్సత్తువ ఆవరిస్తుంది.దీనితో ఇతర సమస్యలు మొదలవుతాయి.అందుకే ఒకేప్రదేశంలో ఎక్కువ సమయం కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి తిరుగుతూ అప్పుడప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి.తీరిక దొరికితే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచవచ్చు.దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.ఒత్తిడి తగ్గితే అసంకల్పితంగా  ఏ అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.దీనితో మనం దాదాపు సంపూర్ణ ఆరోగ్యం అంది పుచ్చుకొన్నట్లే.

Friday, 30 October 2015

ఆర్ధిక పరిజ్ఞానం

                                                                       చిన్నప్పటి నుండి పిల్లలను సైన్సు,లెక్కల్లో రాణించేలా ప్రోత్సహిస్తే
పెద్దయ్యాక అమ్మాయిలకైనా,అబ్బాయిలకైనా ఆర్ధిక పరిజ్ఞానం వస్తుంది.ఆ దిశగా అడుగులు వేసేలా తల్లిదండ్రులు కూడా తర్ఫీదునివ్వాలి.చిన్న వయసు నుండే బాంకు ఖాతాలను నిర్వహించగలిగి ఉద్యోగం కోసమే ఎదురుచూడకుండా తమంతట తామే స్వంత సంస్థల్ని నిర్వహించి ఆర్ధికంగా ముందడుగు వేయగలుగుతారు.'0' పెట్టుబడితో కూడా వ్యాపారాలు ఎలా చేయవచ్చు?లాభం ఎంత?నష్టంఎంత?అని ఆలోచించడం మొదలుపెట్టి చదువుకోనేటప్పటి నుండే వ్యాపారదృక్పధం వైపుగా అడుగులు వేయగలుగుతారు.ఒకవేళ కొంచెం అటూఇటూగా ఉన్నావారు నష్టపోతారేమో అనే శంక తల్లిదండ్రుల్లో ఉన్నా ముందుగా ఒక అవకాశం ఇవ్వటం వలన ఒక ప్రయత్నంలో విఫలమైనా ధైర్యంగా ముందడుగు వేసి మరోసారి విజయం సాధించగలుగుతారు.దీని వలన ఆర్ధిక నిర్ణయాలు పక్కాగా తీసుకోగలుగుతారు.    

Thursday, 29 October 2015

అర ఇస్తా ఒకటి ఇవ్వు

                                                    సుజిత స్నేహితురాలు ఆరణి అన్నీ గొప్పలు చెప్పుకుంటుంది.పైగా అత్యాశ.ఒక రోజు సుజిత ఇంటికి వచ్చి మాటల మధ్యలో తన కొడుకు ఉద్యోగం చేస్తూ తెగ సంపాదించుతున్నాడని గొప్పలు చెప్పింది.చెప్తూ ఇప్పుడు అర ఇస్తాగానీ నువ్వు సంవత్సరానికి ఒకటి ఇవ్వు అంది.అంటే సుజితకు మొదట అర్ధం కాలేదు.తర్వాత విడమరచి తన ఉద్దేశ్యం చెప్పింది.అదేమిటంటే మీ వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వమని నేరుగా అడక్కుండా నేను 50 లక్షలు నీకు ఇస్తానుగానీ ఒక సంవత్సరానికి నువ్వు తిరిగి నాకు కోటి రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇవ్వమంది.సుజిత ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి వెంటనే తేరుకుని కావాలంటే వ్యాపారంలో వాటా ఇవ్వమని అడుగు?అంతే కానీ ఏ లెక్కన నన్నుకోటి రూపాయలు ఇవ్వమని అడిగావు?వాటా ఇవ్వమంటే  ఎంతో కొంత వాటా ఇష్టమైతే ఇస్తారేమో?అంతే కానీ నా వ్యాపారానికి నీ డబ్బు అక్కరలేదు.ఎంత మంచి వ్యాపారమైనా మొదలుపెట్టగానే రెట్టింపు లాభం రాదు.అక్రమ వ్యాపారం మా వల్ల కాదు కానీ 10 రూ.ల వడ్డీ లెక్కన అయితే తప్ప రెట్టింపు అవ్వాలంటే కష్టం.అందుకని నేను ఆపని చేయలేను కానీ నువ్వే రెట్టింపు ఇచ్చేవాళ్ళను చూచి వడ్డీకి ఇచ్చుకో అని ఆరణికి సలహా ఇచ్చింది సుజిత.మళ్ళీ మారు మాట్లాడలేదు ఆరణి. 

ముందు జాగ్రత్త

                                                                      ఏపని చేసినా ముందు జాగ్రత్త తప్పనిసరి.అలాగే ఆరోగ్య విషయంలో కూడా ముందుజాగ్రత్తతో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.విటమిన్ -డి శరీరానికి చాలా చాలా అవసరం.సూర్య కిరణాల్లో విటమిన్ - డి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ప్రతి రోజు కాసేపు నీరెండలో ఉంటే మంచిది.ఎముకలు బలహీన పడకుండా ఉంటాయి.బరువుపెరగకుండా జాగ్రత్త పడాలి.వారంలో ఐదు రోజులు ఒక 1/2 గం. తప్పనిసరిగా వ్యాయామం క్రమం తప్పకుండా చేసే వారిలో గుండె జబ్బులు,కాన్సర్ ప్రమాదం తక్కువ.ప్రతి రోజు నడక చాలా మంచిది.తాజా పండ్లు,కూరగాయలు తినాలి.చిరు ధాన్యాలు,హోల్ గ్రైన్,వెన్నతీసిన పాలు,దంపుడు బియ్యం,బ్రకోలి,పుచ్చకాయ,కాబేజీ,బొప్పాయి,జామ వంటివి ముందునుండే అలవాటుగా తింటుంటే అనారోగ్యాలు దరిచేరవు.                                                

Wednesday, 28 October 2015

ఆరుబయట........

                                                     ఇంటి లోపల ఆడుకునే పిల్లలకన్నా ఆరుబయట నీరెండలో నలుగురితో కలిసి ఆడుకునే పిల్లలు ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటారు.ఒంటరిగా ఆడుకొనే వాళ్ళ కన్నా అందరితో కలిసిమెలిసి ఆడుకోవటం వలనే కాక,నీరెండలో విటమిన్ డి ఉండి శరీరానికి తగినంత అందుబాటులో ఉండటం వలన కూడా ఉత్సాహంగా ఉంటారు. 

అవాంచిత రోమాలపై.......

                                               పసుపులో పాలు కలిపి చిక్కటి పేస్ట్ చేసి అవాంచిత రోమాలపై పట్టించాలి.20 ని.ల తర్వాత వేడినీటితో కడగాలి.ఇలా కొద్దిరోజులు చేస్తే అవాంచిత రోమాలన్నీ తొలగిపోతాయి.

Tuesday, 27 October 2015

మునగాకు - శనగపప్పుకూర

మునగాకు - ఒక దోసెడు
పచ్చిశనగపప్పు- 1/2 కప్పు
నూనె  - 1/4 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
ఉప్పు - తగినంత
వెల్లుల్లి ముక్కలు - 1 స్పూను
వేపుడు కారం --1 టేబుల్ స్పూను
ఎండుమిర్చి - 1
ఆవాలు- 1 స్పూను
మినప్పప్పు - 1 స్పూను
పసుపు -  1/4 స్పూను
జీరా - 1/2 స్పూను
                                                         ముందుగా పచ్చి శనగపప్పు రెండు గం.లు నానబెట్టి నీళ్ళు వంపేసి మెత్తగా
రుబ్బి పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేడిచేసి ఎండుమిర్చి,ఆవాలు,మినప్పప్పువేసి వేగాక,జీరా,వెల్లుల్లి ముక్కలు వేయాలి.తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక మునగాకు వేసి పచ్చివాసన పోయాక శనగపప్పు ముద్ద, ఉప్పు,పసుపు వేసి వేయించాలి.కాసేపటికి ఇది  పొడిపొడిగా అవుతుండగా వేపుడు కారం వేసి రెండు  ని.లు వేయించి దించేయాలి.ఇది వేడివేడి అన్నం,చపాతీల్లోకి బాగుంటుంది. 


Monday, 26 October 2015

మెరుగైన నిర్ణయాలు

                                                           తెల్లవారుఝామున ఏకాగ్రతతో చదవడంవల్ల త్వరగా చదివినది బుర్రకెక్కి గుర్తుండిపోతుంది.అందుకే పెద్దవాళ్ళు తెల్లవారుఝామున చదుకున్న చదువే చదువు అని చెప్పేవాళ్ళు.ఉదయానే
ఏ ఆహారం తీసుకోకముందు శరీరం,మనసు దేన్నైనా చురుగ్గా స్వీకరించి చక్కటి ఫలితాలిస్తాయి.పరగడుపున చేసిన వ్యాయామం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.తెల్లవారుఝామున అదీ పరగడుపున ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల కిష్టమైన సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది.ఆ సమయంలో ఆలోచించడంవల్ల మెరుగైన నిర్ణయాలు తీసుకో గలుగుతారు.వ్యాపార దిగ్గజాలందరూ సూర్యోదయానికి ముందే తమ దినచర్యను మొదలెట్టటంవల్ల వ్యాపారంలో రాణించ గలుగుతున్నారు.పరగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండి జీవక్రియ మెరుగ్గా ఉంటుంది.అందుకే ఏ పని చేసినా మెరుగైన ఫలితాలుంటాయి.

ఏమరుపాటు

                                                              ఆశ్రిత వృత్తిరీత్యా వైద్యురాలు.విద్యార్ధినిగా ఉన్నప్పుడు చదువుకు మాత్రమే  పెద్దపీట వేసేది.తరువాత వివాహమై గృహిణిగా,పిల్లలకు తల్లిగా కుటుంబానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి తరువాత వృత్తికి ప్రాధాన్యత ఇస్తుంది.ఈ రోజుల్లో కూడా పనివాళ్ళపై వదిలేయకుండా తనే స్వయంగా దగ్గరుండి పిల్లల పనులు అన్నీ చూస్తుంది.వాళ్ళ నానమ్మ అయితే ఆశ్రితను చూచి తెగ ముచ్చట పడుతుంది.పిల్లలు ఆటల్లో ఎక్కడ కింద పడి దెబ్బలు తగిలించుకుంటారోనని అతి జాగ్రత్తగా కాపలా కాసేది.అయినా సరే ఒకరోజు ఆశ్రిత ఇంటికి బంధువులు వస్తే మాట్లాడుతుండగా పిల్లలు వాళ్ళ గదిలో మంచం దగ్గరలో సోఫా ఉంటే మంచం మీదనుండి సోఫా మీదకు,సోఫా మీద నుండి మంచం మీదకు దూకుతూ ఒకరికొకరు పోటీపడి చిన్నవాడు కింద పడిపోయాడు.కింద పడినప్పుడు చేతి మణికట్టు దగ్గర చిట్లింది.దానికి పెద్ద కట్టు వేసి 21 రోజులు జాగ్రత్తగా చుడాలన్నారు.ఆశ్రిత వాళ్ళ నానమ్మ వెయ్యి కన్నులతో కాపలా కాసినట్లు అతి జాగ్రత్తగా పిల్లలను చూస్తుంటావు కదా!అంత దెబ్బ ఎలా తగిలింది?అని అడిగింది.ఎంత జాగ్రత్తగా ఉన్నా కాస్త ఏమరుపాటుతో ఉన్నందువల్ల ఇబ్బంది పడవలసి వచ్చిందని ఆశ్రిత నానమ్మకు విపులంగా చెప్పింది.   

Saturday, 24 October 2015

జుట్టు పెరగాలంటే......

                                       ఒక గుప్పెడు మందార ఆకులు తీసుకుని దీనికి నాలుగు స్పూనుల  పెరుగుతో కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.దీన్ని చిన్నచిన్న ఉండలు చేసి జుట్టుకి సరిపడా  కొబ్బరి నూనెలో వేసి 5 ని.లు మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడే జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా,చక్కగా పెరుగుతుంది. 

Friday, 23 October 2015

గెలిచేందుకు......

                                                             ఏదైనా లక్ష్యం సాధించాలని అనుకున్నప్పుడు మనం గెలుస్తామనిగానీ, ఓడిపోతామనిగాని మనకు ముందే  తెలిస్తే మనం మానసికంగా అందుకు అనుగుణంగా తయారవుతాము.అదే విధంగా ఒక్కొక్కసారి  తప్పకుండా గెలుపు మనదే అనుకుని చివరి క్షణంలో అనుకోకుండా ఓడిపోతే ఆ బాధ వర్ణనాతీతం.ఒక్కసారిగా ప్రాణం ఉసూరుమనిపిస్తుంది.ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా మరలా ప్రయత్నించి చూడాలి.ఇలా దగ్గరదాకా వచ్చి తప్పిపోయిన గెలుపు మనలో తప్పకుండా సాధించి తీరాల్సిందే  అనే  పట్టుదలను పెంచి   గెలిచేందుకు దోహదపడుతుంది.అప్పుడు తప్పకుండా విజయం మన స్వంతమవుతుంది.                  

ముఖంపై ముడతలు రాకుండా......

                                                                             వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావటం సహజం.కానీ ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలావరకు ముఖంపై ముడతలు త్వరగా రాకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.ఒక గుప్పెడు మెంతి ఆకుల్ని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేయాలి.దీన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి.అప్పుడు ముఖం మృదువుగా మారి ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.ఇలా తరచుగా చేస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.మెంతి కూర ప్రత్యేకంగా ఏమి తెచ్చుకుంటాములే!అనుకోకుండా రెండు కుండీల్లో  మట్టిపోసి పైపైన కదిలించి మెంతులు చల్లితే చక్కగా మొక్కలు వస్తాయి.ఒక దాంట్లో మొక్కలు అయిపోయేటప్పటికి రెండో దానిలో మొక్కలు వచ్చేలా చల్లుకుంటే కాలంతో సంబంధం లేకుండా అన్ని రోజులు మెంతి కూర వాడుకోవచ్చు. 

Thursday, 22 October 2015

విచిత్రమైన అలవాటు

                                                                           స్పూర్తి కి మొక్కలు పెంచే అభిరుచితోపాటు ఒక విచిత్రమైన అలవాటుంది.ధర ఎంత అనేది పట్టించుకోకుండా మొక్కలు కొని రకరకాల కుండీలలో పెంచుతుంది.కుండీలో మొక్క పైకి పెరిగి పువ్వులు పూస్తూ ఉంటుంది.స్ఫూర్తి కి కుండీలో మట్టి కనిపించటం అసలు  ఇష్టం ఉండదు.అందుకని మట్టి కనిపించకుండా తోటకూర,మెంతులు,ధనియాలు మొదలైనన గింజలు  చల్లుతుంది.ధనియాలు ఒక వారానికి మొలకలు వస్తాయి.మెంతులు చల్లిన  మూడోరోజు కల్లా మొలకలు వచ్చేస్తాయి.నీళ్ళు చిలకరించాలే  తప్ప ఎక్కువగా పొయ్య కూడదు. వారం రోజులకు మొక్కలు పెరిగి పచ్చగా,నిగనిగలాడుతూ పచ్చటి తివాచీ పరిచినట్లుగా అందంగా కుండీ చూడముచ్చటగా ఉంటుంది.నీడలో కూడా పచ్చి ఆకులే తినాలని అనిపించే లాగా చక్కగా  మొక్కలు వస్తాయి.తాజాగా ఉన్న ఆకుకూరలు తను వాడుకోవటమే కాక ఇంటికి ఎవరైనా తెలిసినవాళ్లు వచ్చినా  చిన్నచిన్నకట్టలు కట్టి ఇస్తుంది.వాళ్ళు కూడా ఆకుకూర  తాజాగా,మంచి సువాసనతో ఎంత బాగుందో  అంటూ తెగ ముచ్చట పడిపోతుంటారు.స్పూర్తి విచిత్రమైన అలవాటు తనకే కాక తనతోపాటు చాలామందికి చక్కగా ఉపయోగకరంగా ఉంది.

Wednesday, 21 October 2015

విజయదశమి శుభాకాంక్షలు

                                                      అమ్మలు గన్నఅమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ మమ్ము కరుణించి కాపాడమ్మా!అంటూ ఆ కనకదుర్గాదేవిని నిండు మనసుతో  ప్రార్ధిస్తూ ఆ అమ్మవారి కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని అందరి ఇంట సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,భోగభాగ్యాలతో కూడిన ఆనందం వెల్లివిరియాలని,ఈ విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,నా తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు. 
         
     

                  

Tuesday, 20 October 2015

జుంబా నృత్యం

                                                                     వేగంగా నడవడం,మామూలుగా నడవడం,పరుగెత్తడం,జిమ్ కి వెళ్ళడం సర్వ సాధారణంగా చేసే వ్యాయామాలు.ఇప్పుడు చాలామంది జుంబా నృత్యాన్ని వ్యాయామంగా ఎంచుకుంటున్నారు.అయితే ఇది చాలా నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకుంటే నేర్చుకోవటం చాలా సులువు.శరీరాన్ని వేగంగా కదిలిస్తూ చేసే నృత్యంతో కూడిన వ్యాయామం కనుక తరగతులకు వెళ్ళే ముందు అంతర్జాలంలో వీడియోలు చూసి సాధన మొదలు పెడితే అడుగులు వేయడం,చేతులు తిప్పడం,కాళ్ళ కదలికల వంటివి తెలుస్తాయి.తరగతులకు వెళ్ళినా అందరిలో చేయడానికి మొహమాటంగా అనిపించదు.అదీకాక తేలికగా కూడా నేర్చుకోవచ్చు.జుంబాలో తప్పటడుగులు సర్వ సాధారణం.మొదట్లో ఎవరైనా తప్పులు చేయటం సహజం. సంగీతాన్నిబట్టి మనం భంగిమను వెంటనే మార్చేయాల్సి ఉంటుంది.అమ్మో!మనం ఆవిధంగా చేయలేమేమో  అని భయపడనక్కరలేదు.భయాన్ని వీడి నృత్యం మీద దృష్టి పెట్టి చేస్తే అదే అలవాటయిపోతుంది.సంగీతం ఏకాగ్రతగా వింటూ నృత్యంతో కూడిన వ్యాయామం జుంబా ప్రత్యేకత.ఇది నేటి ట్రెండ్.

భవిష్యత్తు అంతా.........

                                                                               నిన్నటి కంటే ఈరోజు,ఈరోజు కంటే రేపు,రేపటి కంటే ఎల్లుండి బాగుండాలని సహజంగా అనుకుంటాము.అలాగే భవిష్యత్తు అంతా సంతోషంగా,సుఖంగా సాగిపోవాలని అందరమూ మనస్పూర్తిగా కోరుకుంటాము కదా!అలా సాగిపోవాలంటే భగవంతుని దయతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి.సానుకూల దృక్పధంతో అందుకు తగిన కృషి చేయాలి.నాలుగు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆయాచితంగా ఎదుటివాళ్ళ నుండి దోచుకుందామని దానితో జల్సాగా బ్రతుకుదామని అనుకునేవాళ్ళే ఎక్కువమంది ఉంటున్నారు.అది తాత్కాలికమే కానీ ఎల్లకాలమూ అదే విధంగా జరగదని,తమ  భవిష్యత్తు ముందు ముందు అగమ్యగోచరమని  తెలిసినా తమ కుటిల ప్రయత్నాలు మానుకోలేరు.ఎప్పుడైనా ఎవరికి వారు వాళ్ళ స్వయంకృషితో,సానుకూల ధృక్పదంతో ఆలోచించి తమ స్వశక్తిని నమ్ముకుని సంపాదించిన సొమ్ముతో సుఖంగా,సంతోషంగా ఉండగలరు.అటువంటి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన ఠీవి,దర్జా ప్రస్పుటంగా కనిపిస్తూ ఉంటుంది.అటువంటి వాళ్ళ భవిష్యత్తు అంతా సుఖంగా,సంతోషంగా సాగిపోతుంది.                   

Monday, 19 October 2015

నిద్రలో గురక

                                                                    నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నిద్రలో గురక పెట్టడమనేది సహజమైపోయింది.ఇది అనారోగ్యానికి సూచన.దీనివల్ల పక్కవాళ్ళకు ఇబ్బందితోపాటు ఎవరికి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి శ్వాస ఆడక ఇబ్బంది కలుగుతుంది.ఎవరైనా బాగా గురక పెడుతుంటే ముందుగా వాళ్ళను తట్టి లేపాలి. అధిక బరువుతోపాటు,మెడ దగ్గర కొవ్వు ఎక్కువ పేరుకోవటం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి గురక వస్తుంది.ముఖ్యంగా బరువును అదుపులో ఉంచితే గురక సమస్య అనేది ఉండదు.లేదంటే నిద్రపోయేటప్పుడు వెల్లకిలా పడుకోకుండా ఒక పక్కకు ఒత్తిగిలి పడుకుంటే గురక అంతగా వినిపించదు.గురకను నివారించడానికి దిండ్లు,మౌత్ గార్డ్ లు ఎన్ని వచ్చినా నిపుణులను సంప్రదించడం మంచిది.   

ఆశ్చర్యానందం!

                                         పుట్టినరోజునాడు,పెళ్ళిరోజునాడు నాకు అసలు గుర్తుండదు.పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత నుండి వాళ్ళు శుభాకాంక్షలు తెలియచేస్తే అప్పుడు గుర్తువస్తుంది.ఈరోజు లాప్ టాప్,ఐపాడ్ తీసి గూగుల్ పేజి రాగానే స్వీట్లు,కేకు,కొవ్వొత్తులు,రవికలముక్క,పసుపు,కుంకుమ,గంధం,పువ్వు,పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ  పంపినట్లుగా వచ్చినాయి.అంతకుముందే పిల్లలు శుభాకాంక్షలు చెప్పారు కనుక నాకోసం కాదుకదా!అయినా నాకు ఎందుకు వస్తుందిలే?ఈరోజు ఎవరి పుట్టినరోజో చూద్దామని చూచేసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంద్రాణి!అని వచ్చేసరికి ఆశ్చర్యం,ఆనందం రెండు ఒకేసారి ముప్పిరిగొనగా భలే!భలే!అని చిన్నపిల్లలా ఆశ్చర్యానందాలతో గెంతులు వేయాలనిపించింది.కాసేపటికి ఆశ్చర్యానందం నుండి తేరుకుని ఆనందోత్సహంతో దాన్ని ఫోటో తీసి గూగుల్ వాళ్ళు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్టారొహో!అని అమ్మకు,పిల్లలకు పంపాను.తర్వాత ముఖపుస్తకం తెరవగానే గాలిబుడగలతో పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంద్రాణి!అని వచ్చింది.చాలా సంతోషం అనిపించింది.ఏదిఏమైనా గూగుల్,ముఖపుస్తకం శుభాకాంక్షలు తెలియచెప్పడం ఈరోజు నాకు గొప్ప మధురానుభూతిని మిగిల్చింది.అందుకే నాబ్లాగ్ ద్వారా ఈవిధంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.                              

Sunday, 18 October 2015

ఉప్పు తక్కువ తినాలి

                                                సహజంగా ఆకుకూరలు,కూరగాయలు వండేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే సరిపోతుంది.ప్రాసెస్ చేసిన ఆహరం,గుడ్లు,పాలు,సోయా వంటి వాటిల్లో సహజంగానే సోడియం ఉంటుంది.జంక్ ఫుడ్,చిప్స్ వంటి వాటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కనుక తినకూడదు.ఉప్పు ఎక్కువగా తినడం వల్లఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.పెరుగు అన్నంలో ఉప్పు లేనిదే ముద్ద దిగదు చాలామందికి.త్వరగా రక్తపోటు రావటానికి ఇదొక సాధనం అన్నవిషయం అసలు పట్టించుకోరు.అందుకే పెరుగన్నంలో ఉప్పుసాధ్యమైనంతవరకు మానేయాలి.కూరల్లో కూడా ఉప్పు తక్కువ తినాలి.ఉప్పు వేసిన కొద్దీ కారం,పులుపు,మసాలాలు  అన్నీఒకదాని వెంట ఒకటి వేస్తుంటాము.దాంతో కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి.ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే   ఉప్పు ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది.

మామిడికాయ కోడికూర

ఎముకల్లేని కోడిమాంసం - 1/2 కిలో 
నిమ్మరసం - 1 టేబుల్ స్పూను 
మామిడికాయ - 1 చిన్నది
వెల్లుల్లి రెబ్బలు - 4 
పచ్చిమిర్చి - 3
పెరుగు - 1 టేబుల్ స్పూను 
ఉప్పు - రుచికి సరిపడా 
ఉల్లిపాయలు - రెండు 
పసుపు - టీ స్పూను 
కారం - 2 టీ స్పూన్లు 
జీరాపొడి -1/2 టీ స్పూను  
ధనియాలపొడి - 1/2 టీ స్పూను 
జీలకర్ర - 1 టీ స్పూను 
పంచదార -1/4 టీ స్పూను 
నూనె - 4 టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు 
                                   కోడిమాంసం కడిగి నిమ్మరసం,పెరుగు పట్టించి 1/2 గంట నాననివ్వాలి.ఉల్లిపాయలు ముద్దగా చేయాలి.మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కోసి,వెల్లుల్లి,పచ్చిమిర్చి వేసి మిక్సీలో మెత్తగా చేయాలి.బాండీలో 2 స్పూన్లు నూనె వేసి కాగాక కోడిమాంసం  వేసి మధ్యరకం మంటమీద నీరు ఇగిరేవరకు వేయించి పక్కన పెట్టాలి.మరో బాండీలో మిగిలిన నూనె వేసి జీలకర్ర,కరివేపాకు కొద్దిగా వేసి వేగాక ఉల్లిముద్దని వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ పేస్ట్,పసుపు,జీరాపొడి,ధనియాలపొడి,కారం,పంచదార వేసి 5 ని.లు వేయించాలి.అది వేగాక వేయించిన కోడిమాంసం ఉప్పు,వేసి బాగా కలపాలి.కొద్దిగా నీళ్ళు చిలకరించి మూతపెట్టి 20 ని.లు తక్కువ మంటమీద ఉడికించాలి.పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించాలి.

Saturday, 17 October 2015

పొట్టలో గ్యాస్ సమస్య లేకుండా......

                                                            మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడో ఒకసారి పొట్టలో గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది.ఈ సమస్య లేకుండా ఉండాలంటే రెండు స్పూనుల మెంతులను రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి తర్వాత రోజు ఉదయం పరగడుపున తినాలి.ఈ విధంగా చేస్తే పొట్టలో గ్యాస్ సమస్యతో పాటు,నోటి దుర్వాసన కూడా  ఉండదు.రక్తంలోగడ్డలు కట్టకుండా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. 

ముద్ద మందారంలా ........

                                                                   ఒక స్పూను కలబంద గుజ్జు,అర స్పూను కీరా రసం,అర స్పూను పెరుగు,ఐదు చుక్కల గులాబీ నీళ్ళు కలిపి ముఖానికి రాయాలి.ఒక పావుగంట ఆరనిచ్చి తర్వాత చన్నీళ్ళతో కడిగితే ముఖం ముద్ద మందారంలా  అందంగా ఉంటుంది.

Friday, 16 October 2015

తన దగ్గరే ఉన్న భావన

                                                                                 రామలక్ష్మి కొడుకు,కూతురు చదువు నిమిత్తం విదేశాలలో ఉంటున్నారు.కూతురు వెళ్ళినప్పుడు అంతగా అనిపించలేదు కానీ కొడుకు వెళ్ళినప్పుడు చాలా భాధ పడింది.ఎంత బాధ అంటే ఏదో పోగొట్టుకున్నట్లుగా శూన్యంలోకి చూస్తున్నట్లు కూర్చునేది.ఒకరోజు స్నేహితురాలు ఫోనులో కూడా సరిగా మాట్లడటంలేదని రామలక్ష్మిని చూచి వెళ్దామని వచ్చింది.కొడుకు చిన్నప్పటి ముంజేతి కంకణం పెట్టుకుని చిక్కిశల్యమై పిలిచినా వినిపించుకోకుండా ఏటో చూస్తుంది.ఏమిటి అలా తయారయ్యావు?పిల్లలు వృద్ధిలోకి రావటమే కదా!మనకు కావలసింది.రోజూ  ఫోనులో మాట్లాడుతూనే ఉంటావు.ఇంత బేలగా తయరయ్యావేమిటి?హుషారుగా ఉండాలి కానీ అనేసరికి బావురుమని ఏడ్చింది.అమ్మాయి వెళ్ళినా అబ్బాయి దగ్గరే ఉన్నాడు కనుక అంత బెంగ అనిపించలేదు.పెద్దాడయినా రోజూ కాసేపు ఒడిలో కూర్చుని కబుర్లు చెప్తే కానీ వాడికీ,నాకు నిద్ర పట్టేదికాదు.అందుకే వాడు నాదగ్గరే ఉన్నభావన కలగటానికి వాడి చిన్నప్పటి కంకణం వెతికి పెట్టుకున్నాను అని చెప్పింది.