Thursday, 22 September 2016

రోజూ టొమాటో రసం

                                                                      చర్మం రోజంతా తాజాగా ఉండాలంటే రోజూ ఉదయం అల్పహరంతో పాటు ఒక గ్లాసు టొమాటో రసంలో చిటికెడు ఉప్పు,చిటికెడు మిరియాల పొడి,కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి.ఈ విధంగా చేస్తే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.దీనితో పాటు బరువు అదుపులో ఉండడమే కాక తక్కువ సమయంలో ఆరోగ్యంగా,అందంగా ఉన్న వయసు కన్నా చిన్నగా,యవ్వనంగా కనిపిస్తారు. 

Wednesday, 21 September 2016

మొక్కల మధ్య కాసేపు

                                                             రోజూ కాసేపు మొక్కల మధ్య గడిపితే ఒత్తిడి మన దరిదాపులకు కూడా రాదు.మట్టి వాసన పీల్చుతూ,మొక్కల పచ్చదనం చూస్తూ అటూ ఇటూ ఏ ఆలోచనలు లేకుండా తిరుగుతూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.అందుకే ఇప్పుడు అందరూ ఇంటి పైనే రకరకాల ఆకులు పూలు,పండ్లు,కూరగాయలు,ఆకుకూరలు అన్ని రకాలతో మిద్దె  తోటను పెంచుతున్నారు.రోజూ ఒక అరగంట సాధ్యమైనంతవరకు వీలు కల్పించుకుని తోట పని చేయగలిగితే ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది.బహుళ అంతస్తుల్లో కూడా వరండాలో,ఇంట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు.కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉన్న గాలిని సహజ సిద్దంగా శుద్ధి చేస్తాయి.కొన్ని మొక్కలు దోమలు రాకుండా చేస్తాయి.అటువంటి వాటిని ఎంచుకుని తెచ్చి పెంచితే పచ్చదనంతోపాటు ప్రయోజనం కూడా ఉంటుంది.

Monday, 19 September 2016

ముసలి పిల్లలా?

                                                           రుక్మిణమ్మ ఇంటికి ఒకరోజు ఒక ముప్పై సంవత్సరాల యువతి మురికిగా చాలీ చాలని సగం చీర ముక్క ఒంటికి చుట్టుకుని పైన జాకెట్టు వేసుకోకుండా జుట్టు విరబోసుకుని  ఒక పిల్లను చంకన వేసుకుని అమ్మా!కట్టుకోవటానికి బట్టలు,తినడానికి తిండి,తాగటానికి బిడ్డకు పాలు లేవు ఇప్పించండి అంటూ పెద్ద గొంతుతో అరవడం మొదలు పెట్టింది.ఇంట్లో పని చేసుకుంటున్న రుక్మిణమ్మ కేకలు విని బయటకు వచ్చింది.ఆ వచ్చిన అమ్మాయి అవతారం చూడగానే రుక్మిణమ్మకు కోపం నషాళానికి అంటింది.అంతకు ముందు ఒకసారి ఒకామె ఇలాగే వస్తే నిజమే కాబోలు అనుకుని పాత చీరలు ఇచ్చి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి పంపించింది.తర్వాత రోజు మళ్ళీ అదే అవతారంలో కనిపించింది.అందుకే అంత కోపం.ఆ కోపంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.ఏమైనా ముసలి పిల్లలా?(ముసలి వాళ్ళా?పిల్లలా?)ఆ అవతారం ఏమిటి?కష్టపడి పని చేసుకో!పని చేసుకుంటే అన్నీ అవే వస్తాయి.ముందు ఇక్కడి నుండి వెళ్ళు.కష్టపడకుండా ఒంటికి చిన్న గుడ్డపీలిక చుట్టుకుని అడుక్కోవడం నేర్చారు.నీలాంటి వాళ్ళకు నేను ఏమీ ఇవ్వను అంటూ విసుక్కుంది.జాలి పడుతుందని అనుకున్న పెద్దావిడ అంత గట్టి గట్టిగా చివాట్లు పెట్టేసరికి బిక్కచచ్చిపోయి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది.ఒక్క రుక్మిణమ్మ అన్నంత మాత్రాన వాళ్ళు మారరు.ఇక్కడ కాకపోతే ఇంకొకచోట ఈరోజు గడిచి పోయింది లెక్క.కొంతమంది నోరు తెరుచుకుని జాలితోనో,వంకరగానో  చూస్తూ డబ్బులు ఇస్తున్నంత కాలము అలాగే జీవనం సాగిపోతుంది.

వెన్నంటి

                                                                        ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొద్ది సేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే దానికి పరిష్కారం లభించినట్లుగానే ప్రతి ప్రశ్నకు సమాధానం,ప్రతి కష్టం వెనుక ఒక మంచి అవకాశం నీడలా వెన్నంటి ఉంటాయి.కొంత మందికి ముందు,కొంత మందికి ఆలస్యం అయినంత మాత్రాన నిరాశ పడవలసిన పని లేదు.తప్పకుండా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Thursday, 15 September 2016

మనసులో మాట

                                                                          ఈరోజుల్లో చాలా మంది మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నారు.చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా ఉంటున్నారు.ఈ విధంగా ఉంటే ఎదుటి వాళ్ళకు మనపట్ల ఉన్న గౌరవం తగ్గిపోతుంది.కనుక చెప్పేది చేసేది కూడా ఒకటే ఉండాలి.అలా చేయలేని వాళ్ళు నిశ్శబ్దంగా  ఉండటం మంచిది.ఇంకొంతమంది పైకి ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడతారు.లోపల అంతా కుళ్ళు,కుతంత్రాలు.ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉంటేనే మాట్లాడాలి.అంతే కానీ నటించకూడదు.ఇంకొంత మంది ఎవరి మీదైనా కోపం వస్తే ఎదుటివారిది తప్పా?మనది తప్పా?అని విశ్లేషించుకోకుండా మనసులో పెట్టుకుని ఏదో కక్ష సాధిస్తున్నట్లు కనిపించినప్పుడల్లా సతాయిస్తూ ఉంటారు.కోపం వస్తే ఆ కొద్దిసేపు మాటలోనే కానీ మనసులో పెట్టుకోకూడదు.జీవితం ఎంతో విలువైనది.పిచ్చిపిచ్చి అపోహలతో జీవితాన్ని వృధా చేసుకోకూడదు.సుఖ సంతోషాలతో ఉండాలంటే మనసులో ఏదీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి.


పొట్ట చుట్టూ........

బరువు పెరిగినప్పుడు ముందుగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది.ఇది తగ్గాలంటే రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ క్రింది విధంగా జ్యూస్ చేసుకుని తాగాలి.
                                           నిమ్మకాయ -1
                                           తురిమిన అల్లం  - 1 టేబుల్ స్పూను
                                           కలబంద రసం - 1 టేబుల్ స్పూను
                                            దోసకాయ - 1
                                            కొత్తిమీర  - కొంచెం
                                            నీళ్ళు - 1/2 గ్లాసు
                                                  ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి వడకట్టి తాగితే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుక్రమంగా కరిగిపోతుంది.
                                           

Wednesday, 14 September 2016

చేప ముళ్ళు

                                                                      సాగర్ ఒకరోజు పుస్తకం కోసం అలమరపై వెదుకుతుండగా మూడు చిన్నచిన్న మైనపు సంచుల్లో పసుపు కుంకుమ అద్దిన చేప తల నుండి తోక వరకు ఉన్న ముళ్ళు కనిపించాయి.అసలే సాగర్ కి అనుమానాలు ఎక్కువ.వాటి గురించి తెలిసిన వాళ్ళకు ఫోను చేస్తే నిన్ను దెబ్బ తీయడానికి చేతబడి చేశారు అని చెప్పి వాటిని ఎక్కడో ఒక చోట బయటపెట్టి ఉంచితే వచ్చి వాటిని పట్టుకెళ్ళి బాగు చేస్తామని చెప్పారు.దానికితోడు సాగర్ కాలుజారి  కిందపడటంతో ఆరు వారాలు మంచంపై నుండి కదలకుండా ముఖ్యమైన పనులకు మాత్రమే లేస్తూ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.ఇంకేముంది?నాకు చేతబడి చేశారంటూ వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం మొదలు పెట్టాడు. వాళ్ళల్లో కొంతమంది సాగర్ ను చూడటానికి వచ్చి తానంటే తందాన అంటూ అవును చేతబడి అయి ఉంటుంది.చేప ముళ్ళుతో పసుపు కుంకుమతో ఇంట్లో వేశారంటే అదే అంటూ మాట్లాడుతున్నారు.ఈరోజుల్లో కూడా చేతబడులు చేసేవాళ్ళు ఉన్నారంటే నమ్మటం,నమ్మకపోవటం తర్వాత సంగతి కానీ ప్రస్తుతం అందరికీ ఇదొక కాలక్షేపం అయిపోయింది.

Tuesday, 13 September 2016

శాశ్వతం కాదని

                                                             
                                                              లక్ష్మీ దేవి  ఒక్క రోజులో వాడిపోయే కలువ పూవులోఎందుకు దర్శనం ఇస్తుందో తెలుసా?అంత లోతుగా ఆలోచించే తీరిక,ఓపిక మనందరికీ ఉండక పోవచ్చు.తెలిస్తే మనలో చాలా మంది డబ్బు కోసం అదేపనిగా వెంపర్లాడి తరతరాలు కూర్చుని తినేంత సంపాదించాలని అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళని కూడా లేకుండా వెన్నుపోటు పొడవటం,స్నేహితులను,కనిపించిన వాళ్ళను అడ్డంగా మోసగించడం,డబ్బు కోసం అవినీతికి పాల్పడడం చేయరు.ఎందు కంటే ధనం శాశ్వతం కాదని ఏదో ఒక రోజు మాయమై పోవచ్చని అంటే కలువ పూవులా ఈరోజు ఉంటుంది రేపు పోతుందని తెలియచెప్పడానికే లక్మీదేవి కలువ పువ్వులోదర్శనం ఇస్తుంది.జీవితం శాశ్వతం కాదు డబ్బు అంతకన్నాశాశ్వతం కాదు అన్న పరమార్ధం అర్ధం చేసుకుని సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తూ డబ్బే లోకంగా అడ్డదారులు తొక్కకుండా ఉండడం మంచిది.

Monday, 12 September 2016

అతి తెలివి తక్కువ చేష్టలు

                                                                        అనకాపల్లి వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఏ వస్తువు దొరకనిదంటూ లేదు.కాకపోతే అమెరికాలో కొంచెం ఖరీదు ఉండొచ్చు.తెలిసో తెలియకో కొంతమంది నిత్యావసర వస్తువులు వంటి ఇడ్లీ రవ్వ,పిండి,పప్పులు,జీలకర్ర,కరివేపాకు,రకరకాల పచ్చళ్ళు,స్వీట్లు అన్నీ చుట్టబెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు.అమెరికా విమానాశ్రయంలో  చెకింగ్  చేసేటప్పుడు కొంత మంది ఉద్యోగులు  నవ్వుకుని చూసీ చూడనట్లు వదిలేస్తారు.ఈమధ్య ఒకాయన కోడలు తెమ్మని చెప్పిందని కోడి మాంసం,రొయ్యలు పచ్చళ్ళు తీసుకెళ్ళి అవి మామూలు పచ్చళ్ళు అని బుకాయించేసరికి 150 డాలర్లు జరిమానా వేశాడు.అయినా వాదిస్తుంటే అక్కడి ఉద్యోగికి ఒళ్ళు మండి ఒక గంట పక్కన నిలబెట్టి పాకెట్ తెరిచి చూచి 500 డాలర్లు కట్టి వెళ్ళమన్నాడు.చచ్చినట్లు నోరుమూసుకుని డబ్బు కట్టి బ్రతుకు జీవుడా!అని బయట పడ్డాడు. ఇంకొక ఆమె కరివేపాకు,జీరా,వేరుసెనగ పప్పులు నానా చెత్త చెదారం మూటకట్టి సూట్ కేసులో పెట్టుకుంది.ఇవ్వన్నీఇక్కడకు   తీసుకు రాకూడదు అని అమాయకురాలు అనుకుని 100 డాలర్లు జరిమానా కట్టమన్నాడు.నా దగ్గర డబ్బులు లేవు నేను కట్టను అని మాట్లాడేసరికి స్కాన్ చేసినప్పుడు డబ్బులు ఉన్న విషయం కనిపిస్తుంది కదా!అబద్దం చెపుతుందని బాగ్ తెరిపించి 350 డాలర్లు వేశాడు.పై ఇద్దరు కూడా తప్పు ఒప్పుకుని మొదటే కడితే సరిపోయేది కదా!చేసేది తప్పు కాక అబద్దాలు,వాదనలు.వాదించడానికి కూడా అర్ధం ఉండాలి.అతి తెలివి కలవాళ్ళం అనుకునే తెలివి తక్కువ చేష్టలు.ఇలాంటివన్నీ అతి తెలివి తక్కువ చేష్టలు అన్నమాట.ఒకాయన ఆమధ్య దుబాయ్ కొడుకు దగ్గరకు వెళ్తూ సోంపు గింజలు తెలియక తీసుకెళ్ళి జైలు పాలయ్యాడు.బయటకు తీసుకురావటం చాలా కష్టం అయింది.వెళ్ళేముందు ఒక్కసారి అతర్జాలంలో ఏ దేశానికి ఏమేమి వస్తువులు తీసుకెళ్ళవచ్చో అనేది తెలుస్తుంది.అప్పుడు ఏ సమస్యా ఉండదు.

కూర్చో,నిల్చో

                                                              మనందరినీ చిన్నప్పుడు కూర్చో,నిల్చో అంటూ ఏకాగ్రత కోసం తరగతి గదిలో ఉపాధ్యాయులు వ్యాయామం చేయించేవాళ్ళు.చాదస్తం కాకపోతే పాఠాలు చెప్పకుండా ఇంతసేపు పిల్లల్ని ఇబ్బంది పెట్టి చేయించాలా?అంటూ తిట్టుకునేవాళ్ళం.అది ఒక మంచి వ్యాయామం కూడా అని మనకు అప్పుడు తెలియదు.ఇప్పుడు చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ పెద్దవాళ్ళు రోజు ఉదయం,సాయంత్రం కాసేపు కూర్చోవటం,నిల్చోవడం చేస్తుంటే బరువు పెరగకుండా ఉంటారని నిపుణుల సూచన.దీనితో పాటు చేతులు,కాళ్ళు కదిలించుతూ చిన్నచిన్న వ్యాయామాలు చేస్తుంటే బరువు అదుపులో ఉండి సంపూర్ణ ఆరోగ్యం స్వంతమవుతుంది.

బొజ్జ పెరిగితే....

                                                                          బొజ్జ పెరిగితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని మనందరికీ తెలుసు.అయినా మన అలవాట్లు అంత త్వరగా మార్చుకోలేము.నూనె తగ్గించి కూర వండితే నోటికి రుచిగా ఉండదనే అపోహతో తగ్గిద్దామని మనసులో ఉన్నా అలవాటులో పొరపాటు అన్నట్లు తెలియకుండానే ఎక్కువ నూనె వేసి అవసరం లేకున్నా గుజ్జు కూరలకు కూడా వేస్తుంటాము.వేపుళ్ళు అయితే చెప్పనవసరం లేదు.దీనికి తోడు తీపి పదార్ధాలు,అప్పడాలు,వడియాలు,పచ్చళ్ళు,ఐస్ క్రీమ్ ఇలా షడ్రుచులతో రోజూ భోజనం చేసి వెంటనే పగలు రాత్రి కూడా నిద్ర పోతుంటాము.మాంసాహారం అయితే చెప్పనక్కరలేదు.ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటలైనా నిద్ర పోకూడదు.వెంటనే నిద్ర పోవటంతో పొట్ట పెరిగి క్రమంగా రోగాల బారిన పడవలసి వస్తుంది.ఒక్కసారి పొట్ట పెరిగిందంటే తగ్గటం కష్టం.తగ్గించుకోవటానికి కూడా చాలా కష్టపడవలసి వస్తుంది.బొజ్జ పెరిగిందంటే ముందుగా వచ్చేది మధుమేహం.తర్వాత వరుసగా గుండె,మూత్రపిండాల సమస్యలు,పక్షవాతం,కాన్సర్,ఒక్కటేమిటి? అన్నీ చుట్టుముట్టవచ్చు.అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ,మితంగా తింటూ బొజ్జ పెరగకుండా ముందే జాగ్రత్త పడటం మంచిది.దీనితో పాటు బత్తాయి,నిమ్మ,నారింజ,కమలా పండ్లు వంటివి ఎక్కువగా తినాలి.ఇవి బరువుని నియంత్రిస్తాయి.

Friday, 9 September 2016

అతి పెద్ద ఆయుధాలు

                                                       ప్రపంచంలో అతి పెద్ద ఆయుధాలు రెండే రెండు.అవి ఏంటయ్యా!అంటే ఒకటి మౌనం,రెండు మందహాసం.మౌనం ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు.మందహాసం ఎన్నో ప్రశ్నలను దగ్గరకు
రానివ్వదు.ఈ రెండు మన దగ్గర ఉంటే మనం ధన్యులం.ఎవరూ మనల్నిప్రశ్నించే సాహసం చెయ్యరు.వేలెత్తి చూపే ఆస్కారం అంతకన్నా ఉండదు.ప్రశాంతమైన జీవితం మన స్వంతం.

ఎవరి గౌరవం వాళ్ళు

                                                           లక్ష్మణ్,లక్షణ ఇద్దరు భార్యాభర్తలు.ఎక్కడకు వెళ్ళినా ఇద్దరూ ఎప్పుడూ జంట పక్షుల మాదిరిగా కలిసే వెళ్తారు.వాళ్ళకు ఇద్దరు పిల్లలు.పిల్లలు చిన్న వాళ్ళయినా అబ్బాయిని  మంచి స్కూల్లో చదివించాలని ఊహ తెలిసినప్పటి నుండి హాస్టల్లో పెట్టారు.అమ్మాయిని అమ్మ దగ్గరో,అత్త దగ్గరో వదిలేసి ఎక్కడంటే అక్కడకు వెళ్ళిపోయేవాళ్ళు.అందుకే ఇద్దరు బాగానే చదువుకున్నాపిల్లలకు,పెద్దలకు ప్రేమాభిమానాలు ఉన్నా అంతగా బలపడలేదు.అబ్బాయి విదేశాలలో ఉన్నాడు.అనుకోకుండా అమ్మాయి విదేశాలకు వెళ్ళింది.ఇక్కడ ఉన్నప్పుడే ఒక బిడ్డ పుట్టాడు.అక్కడకు వెళ్ళాక ఇంకో బిడ్డకు జన్మనివ్వడంతో సమస్య మొదలయింది.నాన్నకు రావడానికి వీలుపడదు అని చెప్పినా సరే అమ్మను తన వద్దకు రావాల్సిందేనని పిల్లలతో ఇబ్బందిగా ఉందని ఆరు నెలలు తన దగ్గర ఉండాలని మంకు పట్టు పట్టుకుని కూర్చుంది.ఒకసారి వాయిదా వేసినా రెండోసారి లక్షణకు వెళ్ళక తప్పింది కాదు.వెళ్ళే సమయం దగ్గర పడుతున్న కొద్దీ భర్త తీరిక దొరకగానే వస్తానని ఎంతగా నచ్చచెప్పినా ఇటు భర్తను వదిలి ఉండలేక,ఒంటరిగా వెళ్ళడం ఇష్టంలేక దిగులుతో నాలుగురోజుల ముందు నుండి అన్నం కూడా తినడం మానేసింది.కాలం ఆగదు కదా!వెళ్ళే రోజు రానే వచ్చింది.విమానాశ్రయం లోపలకు వెళ్ళేవరకు భర్తను అంటిపెట్టుకుని అతని చేతిని వదలకుండా చివరకు ఏడ్చేసింది.భార్య ఏడుపు చూచి భర్తకు కూడా ఏడుపు వచ్చేసింది.మిగతా వాళ్ళకు విషయం అర్ధం కాకపోయినా వీళ్ళతో వచ్చిన వాళ్ళకు మాత్రం ఈ జంట పక్షులు నడివయసు వచ్చినా ప్రేమపక్షుల మాదిరిగా  ఒకరినొకరు వదిలలేనట్లుగా వెళ్తుంటే వీళ్ళు విడివిడిగా అన్ని రోజులు ఎలా ఉండగలరో ఏంటో?అనిపించింది.పిల్లలు కూడా వాళ్ళ అవసరమే ముఖ్యం అనుకోకుండా పెద్దల మనోభావాలు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.పెద్దలు కూడా పిల్లల అవసరాలు గుర్తించి మసులుకుంటే సమస్యలు ఉండవు.సాధ్యమైనంత వరకు పెద్దలైనా,పిల్లలైనా ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోనేలా ఉంటే ఎవరి గౌరవం వాళ్ళు దక్కించుకున్నట్లు అవుతుంది.

Sunday, 4 September 2016

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                               నా బ్లాగ్ వీక్షకులకు,పాఠకులకు,నా తోటి బ్లాగర్లకు,ఏదేశంలో ఉన్నా అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.ఇప్పటినుండయినా అందరం గణేష్ చతుర్ధి సందర్భంగా మట్టి వినాయకుని మాత్రమే పూజించి,తరించి,వినాయక నిమజ్జనం చేసేటప్పుడు నీటి కాలుష్యం తద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మన వంతుగా  పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం.సర్వ విఘ్నాలను తొలగించి మనందరికీ విజయాన్ని చేకూర్చాలని,విద్యార్ధులందరికీ విద్య,ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని సదా విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.మట్టి వినాయకుణ్ణి సృజనాత్మకంగా,విభిన్నరూపాలలో ఎలా తయారుచేయాలో విద్యార్ధులకు అవగాహన కలిగించి,స్వహస్తాలతో తయారు చేసి పూజించితే ఎంత బాగుంటుందో వారికి తెలియచెప్పాలి.అప్పుడు మార్పు అందరిలో దానంతట అదే వస్తుంది. 

Friday, 2 September 2016

ఎముకలు గట్టిగా

                                                                   వయసుతో నిమిత్తం లేకుండా నడుం నొప్పులు,మోకాళ్ళ నొప్పులు నిత్యం మనం వింటూనే ఉంటాము.ఇవే కాకుండా వంగి పాదాలు రుద్దుకుంటుంటే చిటుక్కున పట్టేయడం,ఎక్కువ సేపు మెడ వంచి పనిచేస్తే మెడ నొప్పి,బలంగా ఏమైనా తోస్తే వీపు నొప్పి,ఎక్కడో ఒకచోట పట్టేయడం జరుగుతుంది.అదేమంటే వెన్నెముక బలహీనంగా తయారై పూసలు నొక్కుకోవడమో,ఊడిపోవడమో,డిస్క్ పక్కకు తొలగటమో జరిగిందని బెల్టు వేసుకోవడమో లేక శస్త్ర చికిత్స వరకు వెళ్ళటమో జరుగుతుంది.వీటన్నిటికీ కారణం ఎముకలు వెన్నెముక బలహీనంగా తయారవడమే.ఇంతకు ముందు రోజుల్లో నడుము,కాళ్ళ నొప్పులతో ఒకరో,ఇద్దరో బాధ పడేవాళ్ళు.ఇప్పుడు నూటికి ఎనభై మంది ఏదోఒక నొప్పితో బాధ పడుతున్నారు.దీనికి పరిష్కారం ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు తినడమే.నువ్వులు,బాదం పప్పులు,పాలు,గుమ్మడి గింజలు,సబ్జా గింజలు,పాలకూర,రాగులు,కొర్రలు,సజ్జలు,యవలు,జొన్నలు వంటి తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.ముందుగా ఒక 15 రోజులు క్రమం తప్పకుండా ఉదయం అల్పాహరంతో పాటు ఒక కప్పు వేడిపాలలో ఒక టేబుల్ స్పూను నువ్వులు,ఒక 1/2 టేబుల్ స్పూను గుమ్మడి గింజలు పొడిచేసి,2 స్పూనులు తేనె కలిపి తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి.వ్యాయామం చేసేటప్పుడు ఎవరికి వారు చేయగలిగినంత వరకు మాత్రమే చేయాలి.బలవంతాన చేతులు,కాళ్ళు,నడుము వంచి చెయ్యకూడదు.లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

వంటింటి గట్టు శుభ్రంగా.......

                                                              పిండి వంటలు చేసినప్పుడు వంటింటి గట్టు ఎంత శుభ్రంగా కడిగినా ఎంతో కొంత జిడ్డుగానే ఉన్నట్లు అనిపిస్తుంది.అటువంటప్పుడు కొంచెం రాళ్ల ఉప్పు,కొద్దిగా సోడా ఉప్పు,కొంచెం సర్ఫు కలిపి గట్టుపై చల్లి కొద్దిగా నీళ్ళు చల్లుతూ పీచుతో రుద్దాలి.ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా జిడ్డు వదిలి వంటింటి గట్టు శుభ్రంగా ఉంటుంది.చీమలు కూడా రాకుండా ఉంటాయి. 

Thursday, 1 September 2016

ముక్కలు నల్లబడకుండా.......

                                                                 బంగాళదుంప,యాపిల్,వంకాయ,పచ్చి అరటి కాయ ముక్కలు కోస్తూ ఉన్నప్పుడే నల్లగా మారిపోతుంటాయి.అలా నల్లగా మారిపోకుండా ఉండాలంటే చల్లటి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ముక్కలు వేస్తే తాజాగా,తెల్లగా ఉంటాయి.