Saturday 31 August 2019

వారానికి ఒక రోజైనా ........

                                                               అసలే వర్షాకాలం.జోరున వానలు.వానలో ఎవరైనా ఎప్పుడో ఒకసారి తడవక తప్పదు.దీనితో జలుబు,దగ్గు,గొంతునొప్పి వంటి బాధలు తప్పవు.అన్నింటి కన్నా జలుబు పెద్ద తలనొప్పి.అందుకే ఈకాలంలొ వారానికి ఒక రోజైనా ఇంట్లోనే ఉండే వాటితో తయారుచేసే ఈ కషాయాన్ని కాఫీ,టీ  బదులు ఒక అరకప్పు తాగితే ఎంతో మంచిది.దీనికోసం ఒక పెద్ద కప్పు నీటిలో ఒక చిటికెడు మిరియాలపొడి,చిన్న దాల్చినచెక్క ముక్క,నాలుగు లవంగాలు,ఒక పది తులసి ఆకులు,ఒక బిర్యానీ ఆకు,చిన్న అల్లం ముక్క తరుగు,చిన్న బెల్లం ముక్క వేసి మరిగించి,వడకట్టి తాగగలినంత వేడిగా తాగితే వర్షాకాలంలో వచ్ఛే సమస్యల నుండి తప్పించుకోవచ్ఛు.హాయిగా వర్షాకాలంలో సరదాగా కావాలని వర్షంలో తడిచినా,అనుకోకుండా తడిచినా కూడా ఎంచక్కా సంతోషంగా ఉండవచ్చు.ఎవరి ఇష్టానికి,రుచికి తగినట్లు వాళ్ళు కొద్దిగా మార్పులు చేసుకుని ఈ కషాయాన్నిఒకసారి ప్రయత్నించండి.ఎంతో మంచిది. 

Thursday 1 August 2019

ప్రమాదం

                                                                  మనలో కొంతమంది కోపం వఛ్చినప్పుడు తరతమ బేధం లేకుండా తమ కోపాన్ని అంతటినీ మాటల ద్వారా ఎదుటివారిపై వెళ్ళగక్కేస్తుంటారు.వీళ్ళకి మనసులో కుళ్ళు,కల్మషం ఉండదు.వీరితో స్నేహం చేసినా ఎటువంటి ప్రమాదం ఉండదు.కానీ మరికొంతమంది పైకి నవ్వుతూ అతి ప్రేమ ఒలకబోస్తూ తమకన్నా కూడా ఎదుటివారి మంచి తాము ఎంతగానో కోరుకుంటున్నట్లు నటిస్తూ మాట్లాడుతుంటారు.నిజానికి ఇటువంటి వాళ్ళ మనసు నిండా కుళ్ళు,కల్మషంతోపాటు కుతంత్రాలు.ఇటువంటి వారితో పెద్ద ప్రమాదం.వీళ్ళను అసలు నమ్మకూడదు.స్నేహం అంతకన్నా చేయకూడదు.ఒక్కొక్కసారి తెలివిగలవాళ్ళు కూడా వీళ్ళ మాయలో పడిపోయి నష్టపోయేవాళ్లు కోకొల్లలు.కనుక తెలిసి ప్రమాదంలో పడేకన్నా కొంచెం ఎవరు ఎటువంటి వాళ్ళు అన్నది గమనించి స్నేహం అయినా కొత్తగా బంధుత్వం అయినా కలుపుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్త పడడం మంచిది.