Monday, 30 June 2014

కమలా లేక బత్తాయి జ్యూస్

         కమల లేక బత్తాయి రసం -1 లీటరు
         పంచదార -1 3/4 కే .జిలు
         నీరు - 1 1/4 లీటరు
        ఆరంజ్ ఎస్సెన్స్  లేక ఎమల్షన్ -4 టీస్పూనులు
        ఆరంజ్ రెడ్ కలర్ -1/2 స్పూను
       పొటాషియం మెటా బై సల్ఫేట్ లేక సోడియం బెంజాఎట్ - 3/4 టీస్పూను    
                  కమలా లేక బత్తాయి రసం తీసి వడకట్టి,పంచదార కరగనిచ్చి వడకట్టి చల్లారిన తర్వాత నిమ్మ ఉప్పు
లేక సిట్రిక్ యాసిడ్ ,ఆరంజ్ ఎస్సెన్స్ ,సోడియం బెంజాఎట్ ని సీసాలలో నింపుకోవాలి.1 లీటరు జ్యూస్ కి 5 సీసాలు
అవుతుంది.1 గ్లాసు రసంకి 3 గ్లాసులు చల్లటినీళ్ళు కలిపి సర్వ్ చెయ్యాలి.

ద్రాక్ష జ్యూస్

             పండ్ల రసం -1 లీటరు
             పంచదార - 2 కే.జిలు
            నీళ్ళు -1 లీటరు
         నిమ్మ ఉప్పు లేక  సిట్రిక్ యాసిడ్ - 30గ్రా .(6 టీ స్పూన్లు)
           టోనోవిన్ ఎస్సెన్స్ - 4 టీస్పూన్లు
           సోడియం బెంజాఎట్  -1 టీస్పూన్
               పండ్లను కడిగి 5 నుండి 10 ని.లు ఉడికించాలి.ఉడికించిన పండ్లను రసం తీయాలి.గింజలు వేరుచేయాలి.
 పంచదారను కరిగించాలి.పాకం వడకట్టి చల్లారిన తర్వాత పండ్ల రసమును కలిపి నిమ్మ ఉప్పు ,టోనోవిన్ ఎస్సెన్స్ సోడియం బెంజాఎట్ ని కలిపి  పొడిసీసాలలో నింపుకోవాలి.
 గమనిక:ద్రాక్షపండ్లు సీజన్ లో ఇలా చేసి పెట్టుకొంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది.1 లీటర్ జ్యూస్ కి 5 లీటర్లు అవుతుంది.1 గ్లాస్ కి 3 గ్లాసులు చల్లటి నీళ్ళు కలిపి త్రాగాలి.

బొగుడు

            సరోజాదేవిగారు అరవై సంవత్సరాలవరుకు తను,తనపిల్లలదే పైచేయిగా ఉండాలని పోరాడిన ఆమె.ఆమెకు
అకస్మాత్తుగా ఒకసారి భగవంతుడు కలలో కనిపించి నీదారి మళ్ళించి ఇకనుండి జ్ఞానసముపార్జన చేయిఅన్నాడట.
ఇక అప్పటినుండి ధ్యానం చేసుకుంటూ జ్ఞానం కోసం గ్రంధాలు చదవటం మొదలుపెట్టింది.ఆ గ్రంధాలలో అమృతం
ఉంది అనేది.ఒకపూట భోజనం,రాత్రికి ఒకపండు,పాలు తీసుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలనుండి గ్రంధాధ్యయనం చేస్తుంది.పుస్తకాలు,గ్రంధాలూ చదవటం వలన జ్ఞానవృద్ధి కదా!అందుకే ఆమె జ్ఞానిలాగానే కనిపిస్తుంది.ఇంతలో అనుకోకుండా ఆమె కొడుకు చనిపోయాడు.ఎవరికయినా మరణం సహజమని జ్ఞానిగా తెలిసినా తల్లిమనసు తల్లడిల్లి
ఇంత వయసున్న నన్ను వదిలేసి భగవంతుడు వాడిని తీసుకెళ్ళడమేమిటని దిగులుపడింది.చిక్కిశల్యమై బొగుడు
అంటే ఎముకలగూడులాగా తయారయింది.అందరికీ ఎన్నోచెప్పే ఆమె అలాఅవటం చూపరులకు బాధ కలిగింది.

Friday, 27 June 2014

కర్డ్ రైస్

      బియ్యం -1/4 కే.జి
     పెరుగు -1/4 కే.జి
     ఆవాలు - కొంచెం
     కరివేపాకు- కొంచెం
     ఎండుమిర్చి -2
     అల్లం ముక్కలు -కొంచెం
     కొత్తిమీరసన్నగాతరిగినది  - కొంచెం
     ఉప్పు -రుచికి సరిపడా
     నూనె  -తాలింపుకు సరిపడా    
                  అన్నం ఉడికించాలి.దీనిలో పెరుగు,అల్లం,పచ్చిమిర్చి ముక్కలు,కొత్తిమీర,తగినంత ఉప్పు కలిపి ప్రక్కన పెట్టుకోవాలి.బాండీలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు ,కరివేపాకు,ఎండుమిర్చివేసి చిటపటలాడాక పెరుగు,అన్నం  మిశ్రమంలో వేసి బాగా కలిపితే కర్డ్ రైస్ రెడీ.పెరుగు అన్నం తినని పిల్లలకు ఇలా చేసి ఇవ్వొచ్చు.కేరట్ తురుము కూడా వేసుకోవచ్చు.
    

Thursday, 26 June 2014

దద్దోజనం

    బియ్యం -1/2 కే.జి
    పాలు -లీటరు
   పచ్చిమిరపకాయలు -4
  ఎండుమిర్చి - 2
 ఆవాలు -కొంచెం,కరివేపాకు,అల్లంకొంచెం
  ఉప్పు  -  రుచికి సరిపడా
  నూనె  - తాలింపుకిసరిపడా
           అన్నం ఉడికించి చల్లారనివ్వాలి.పాలుకాచి గోరువెచ్చగా అయ్యేవరకూ ఆరనిచ్చి అన్నంలో పోసి పెరుగు వేసి
     తోడుపెట్టాలి.5,6 గంటలు అలా ఉంచితే పాలు తోడుకుంటాయి.బాండీలోనూనె వేసి ఆవాలు, కరివేపాకు, అల్లం,          పచ్చిమిరప ముక్కలు,ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టి అన్నం మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
    ఇది వేసవిలో తింటే చాలా మంచిది.

గ్రీన్ చికెన్

      చికెన్ -1/2 కే.జి
      కొత్తిమీర -ఒకకట్ట
     పుదీనా -1/2 కప్పు
     పచ్చిమిర్చి -8
     నిమ్మకాయ -1
    ఉప్పు- రుచికి సరిపడా
   నూనె - 1/2 కప్పు
              కొత్తిమీర,పుదీనా,పచ్చిమిర్చి మిక్సీలోవేసి మెత్తగా కాకుండా తీసేయాలి.అల్లం,వెల్లుల్లి,ఉప్పు    నిమ్మరసం,చికెన్ ముక్కలకు పట్టించి ఒకగంట నానబెట్టాలి.బాండీలోనూనె వేడిచేసి చికెన్ బాగా
వేయించాలి.తర్వాత నీళ్ళు కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి.నీరు ఇగిరిన తర్వాత దించేయాలి.
అంతే నోరూరించే గ్రీన్ చికెన్ రెడీ.పుల్కా,రోటీల్లోకి బావుంటుంది.   

తోటకూర చికెన్

        చికెన్ -1/4 కే.జి
        తోటకూర -2 కప్పులు
        ఎండుమిర్చి -4
        ధనియాల పొడి -1 స్పూన్
       పసుపు -చిటికెడు
      ఉప్పు,కారం -తగినంత
     కొబ్బరితురుము -1/2 కప్పు  
     ఉల్లిపాయ ముక్కలు -2 కప్పులు
     అల్లం,వెల్లుల్లి పేస్ట్ -1 స్పూన్
           చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు,కారం,పట్టించి ఒకప్రక్కన పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడిచేసి అందులోఎండు మిర్చి,ధనియాలపొడి,పసుపువేసి దోరగా వేయించుకోవాలి.తర్వాత ఉల్లిపాయలు వేసి మగ్గాక అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి చికెన్ వేసి త్రిప్పాలి.ఒకకప్పునీళ్ళు పోసి మూతపెట్టాలి.కొంచెంసేపయ్యాకతోటకూర వేసి నీరు ఇగిరేవరకు
ఉడికించాలి.చివరగా కొబ్బరితురుము వేసి దించేస్తే తోటకూర చికెన్ రెడీ.ఇది రైస్,చపాతీతో తినొచ్చు.   

చుక్కకూర చికెన్

              చికెన్ -500 గ్రా.
             చుక్కకూర -2 పెద్దకట్టలు
             ఉల్లిపాయలు -2 పెద్దవి
            అల్లం,వెల్లుల్లి -1 టీస్పూన్
           పచ్చిమిర్చి -6  
           కారం -2 స్పూన్లు
           పసుపు -1/4 టీస్పూన్
          కొబ్బరి -చిన్నముక్క
         గసగసాలు -1 టేబుల్ స్పూన్
         గరం మసాలా -2 టీస్పూన్లు
        ఉప్పు -తగినంత
        ఆయిల్ -75 గ్రా.
                       స్టవ్ మీద పాన్ లో నూనెవేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్నిఎర్రగా ఫ్రై చేసి దానిలో అల్లం,వెల్లుల్లి పేస్ట్ ,కారం,పసుపు వేసి రెండుసార్లు త్రిప్పి కడిగిన చికెన్ ముక్కల్ని వేసి త్రిప్పి మూతపెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.ఉడుకుతూ ఉండగా తగినంత ఉప్పువేసి పచ్చిమిరపకాయలు,కొబ్బరి.గసాలు,మెత్తగా మిక్సీలోవేసుకుని,గరంమసాలాకూడా వేసి బాగా త్రిప్పి కొంచెం నీళ్ళు అవసరమైతే పోసి ఉడికించాలి.చికెన్ పూర్తిగా ఉడికాక సన్నగా తరిగిన చుక్కకూరను కలిపి ఐదు ని.లు ఉడికించి స్టవ్ కట్టేస్తే చుక్కకూర చికెన్ రెడీ.ఇది చపాతీ,
రైస్ తో కూడా బావుంటుంది.

ఫ్రూట్ సలాడ్

          పాలు - 1 లీటరు
          కస్టర్డ్ పౌడరు- 5 పెద్ద స్పూన్లు
          పంచదార  - 10 పెద్ద స్పూన్లు
          అరటిపండు -1 మీడియం సైజుది
          యాపిల్ -1
          మామిడి పండు-1
          ఖర్జూరాలు -4
          ద్రాక్షపండ్లు -10
         దానిమ్మ గింజలు -గుప్పెడు
                                        కొంచెం చల్లటి పాలల్లో కస్టర్డ్ పౌడరు కలిపి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.ఒక లీటరు పాలు స్టవ్ మీదపెట్టి అడుగంటకుండా మరిగించాలి. పాలు మరుగుతుండగానే పౌడరు కలిపి పెట్టుకున్న పాలను కలిపి
గడ్డకట్టకుండా బాగా కలపాలి.అడుగంటకుండా కలుపుతూ చిక్కబడ్డాక చక్కెర వేసి దించాలి.చల్లారిన తర్వాత
ఫ్రిజ్ లో పెట్టాలి.5,6 గంటలు ఫ్రిజ్ లో పెట్టినతర్వాత అప్పటికే చిన్నచిన్నగా కట్ చేసిన పండ్ల ముక్కలను కలిపి చల్లగా సర్వ్ చేయాలి.పిల్లలు,పెద్దలు కూడా అన్నిరకాల పండ్లు తిన్నట్లవుతుంది.చ్క్ల్లగా ఫ్రెష్ పండ్లముక్కలతో చాలా రుచిగా ఉంటుంది.                          

చికెన్ 65

          చికెన్ -350 గ్రా.(బోన్ లెస్)
          కార్న్ ఫ్లోర్ -100 గ్రా.
          మైదా -100 గ్రా.
         గ్రుడ్డు-1
        అల్లం,వెల్లుల్లి పేస్ట్ -2 టీ స్పూన్లు
        కారం -1/2 టీస్పూన్
        చైనా ఉప్పు-1/2 టీ స్పూన్
       రెడ్ ఆరంజ్ కలర్-చిటికెడు
       ఉప్పు -తగినంత
       పచ్చిమిర్చి-12
      కరివేపాకు-3 కట్టలు
      పెరుగు -2 కప్పులు
     గరం మసాలా 1/4 టీ స్పూన్
    రిఫైన్డ్ ఆయిల్ -ఫ్రై చేయటానికి సరిపడా
                  ముందుగా ఒకగిన్నెలో కార్న్ ఫ్లౌర్,మైదా,కోడిగ్రుడ్డు మిశ్రమం,అల్లం,వెల్లుల్లి పేస్ట్,కారం,చైనా ఉప్పు,
తగినంత ఉప్పు కలిపి కొంచెం నీళ్ళుపోసి బజ్జీలపిండిమాదిరిగా కలుపుకోవాలి.తర్వాత బోన్ లెస్ చికెన్ ముక్కల్ని కలిపి అరగంటసేపు నానబెట్టాలి.బాణలిలో నునేపోసి కాగిన తర్వాత నానబెట్టిన చికెన్ ముక్కల్ని ఎర్రగా ఫ్రై చేసి తీసి
ప్రక్కన పెట్టాలి.ఇప్పుడు వేరే బాణలిలో 50గ్రా.నూనెపోసి కాగాక అందులో నిలువుగా కోసిన పచ్చిమిరపకాయలను,
కరివేపాకు వేసి చిటపటలాడేవరకు ఫ్రై చేసి దానిలో పెరుగు,కొంచెం గరంమసాలా,ఆరంజ్ కలర్,తగినంత ఉప్పువేసి
చికెన్ ముక్కల్ని కలపాలి.పెరుగు ఆవిరిగా మారేవరకు ఫ్రై చేస్తే చికెన్ ముక్కలు ఎర్రగా మారతాయి. 

ఉసిరికాయ జామ్

      పెద్ద ఉసిరికాయలు(లేక)చిన్న ఉసిరికాయల గుజ్జు  -1 కప్పు
      పంచదార - 2 1/2 కప్పులు
      సిట్రికాసిడ్ -1/2 స్పూన్
      పోటాసియం మెటా బై సల్ఫేట్ -1 స్పూన్
          ఉసిరికాయలలో కొంచెం నీళ్ళు పోసి ఉడికించాలి.ఉడికించితే గింజలు విడిపోతాయి.గింజలు ఏరి మిక్సీలో ఒకసారి ఆన్ చేస్తే గుజ్జు వస్తుంది.లేదా పప్పుగుత్తితో మెదిపితే గుజ్జు వస్తుంది.గుజ్జు,పంచదార కలిపి మందపాటి
గిన్నెలో వేసి త్రిప్పుతూ చిక్కబడ్డాక దించి సిట్రికాసిడ్,పోటాసియం మెటా బై సల్ఫేట్ కలపాలి.ఆరిన తర్వాత
 తడి లేకుండా పొడి సీసాలో భద్రపరచాలి.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Wednesday, 25 June 2014

డబుల్ కమేటా

       మిల్క్ బ్రెడ్ -6 స్లైసులు
       నెయ్యి -వేయించటానికి సరిపడా
      పంచదార-తీపి తినేదాన్నిబట్టి
      పాలు -1/2 లీటరు
          బ్రెడ్ నెయ్యి వేసి అట్లపెనం మీద ఎర్రగా వేయించి చిక్కని మరిగే పాలలో వేయాలి.పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగపాకం రానిచ్చి ప్రక్కనపెట్టుకోవాలి.పలల్లోనుంది తీసి పంచదార పాకంలో వేయాలి.జీడిపప్పు,కిస్మిస్  నేతిలో వేయించి పాకంలో వేసి మొత్తం ఒకసారి కలపాలి.ఆరినతర్వాత సర్వ్ చేయాలి.డబుల్ కమేటా చాలా టేస్టీగా ఉంటుంది.

అల్లరి చేష్టలు

           పిల్లలు అల్లరి చేయటం సహజం.అమృత విదేశం నుండి భర్త,కూతురు ఆశ్రితతో కలిసి స్వదేశానికి వచ్చింది.
అమృత చెల్లెలు అంజలి కూడా తనభర్త,కూతురు మైథిలితో వచ్చింది.అంతకు ముందే పిల్లలు అల్లరి చేస్తుంటే అంజలి ఆశ్రితను కోప్పడింది.ఆకోపం మనసులో పెట్టుకుందో ఏమో అంజలి కాఫీ త్రాగుతుండగా ఆశ్రిత అటుగా వచ్చింది.
పిన్నిచేతిలో ఉన్న కప్పుని ఎగిరి కాలితో తన్నింది.వేడివేడి కాఫీ అంజలి పొట్టమీద పడిపోయింది.పొట్టమీద ఎర్రబడి
మంటపెడుతుంటే ఆశ్రితను ఒక్క అరుపు అరిచింది.ఛీ పిన్ని అస్సలు మంచిదికాదు ఎప్పుడు చూసినా అరుస్తుంది.
మనం ఇక్కడనుండి వెళ్ళిపోదాం అని ఏడేళ్ళ ఆశ్రిత పెచీపెట్టుకుని కూర్చుంది.అప్పుడు వాళ్ళ నాన్న ఆశ్రితను వేరే
సిటీలో ఉన్ననానమ్మ దగ్గరకు తీసుకెళ్ళాడు.పిల్లలు ఒక్కొక్కళ్ళు ఉండటం వలన అతి గారాబంతో  చిన్నప్పటినుండి ఆడింది ఆట పాడింది పాటగా అలవాటైపోతుంది.నన్ను కోప్పడటమేమిటి?అనే ఆలోచన పిల్లలలోచిన్నప్పటినుండే ఏర్పడుతుంది.పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు అర్ధమయ్యేరీతిలో చెప్పకుండా ఊరుకున్నంతసేపు ఊరుకుని సహనాన్ని కోల్పోయి అరుస్తున్నారు.ఈ పరిణామం ఇద్దరికీ మంచిదికాదు.ఏదిమంచి,ఏది చెడు,ఎవరితో ఏ రకంగా ఉండాలి,ఎలా మాట్లాడాలి,చిన్నప్పటినుండి పరిసరాలను గమనించటం,జాగ్రత్తగా ఎలా ఉండాలి,చిన్నచిన్న విషయాలకే కోపం తెచ్చుకోకూడదనీ పెద్దవాళ్ళే ఆటలద్వారానో,మాటలద్వారానో పిల్లలకు నేర్పాలి.తప్పదు.     

చెత్త జోక్

             గిరీష్ ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా అమ్మాయి నచ్చలేదనో,ఏదోఒక కారణంతో పెళ్ళి వాయిదా వేస్తుండేవాడు.ఒకసారి బంధువుల ఇంట్లో పార్టీకి వెళ్ళినప్పుడు దూరపుబంధువు ఒకాయన ఏంటి?మాకు పెళ్ళి
భోజనం ఎప్పుడు పెడతావు?అని అడిగాడు.సమాధానం చెప్పేలోపే మళ్ళీ ఆయనే ఏదోఒక వంకపెట్టి పెళ్ళి వాయిదా వేస్తున్నావని విన్నాను.నామాటవిని నువ్వు ఒకపని చెయ్యి.ఫిబ్రవరి 31న పెళ్ళి చేసుకో అన్నాడు.అందరూవింతగా
చూసేసరికి తన చెత్త జోక్ కి తానే పెద్దగా నవ్వుకుని ఫిబ్రవరి 31ఉండదుకదా అందుకే అన్నానన్నాడు.గిరీష్,మిగతా
అందరి మొహాలు నల్లబడ్డాయి.అంతలో గిరీష్ అమ్మమ్మ అదేమిట్రా?నీకు చేతనయితే మంచిపిల్లను తీసుకొచ్చి చెయ్యి.అంతేగానీ చెత్త జోకులు వేస్తావెందుకు?జోక్ చేస్తే సరదాగా అందరు నవ్వుకునేట్లుగా ఉండాలి కానీ ఇబ్బంది
పడేట్లుండకూడదు.నీకు ఎప్పుడు,ఎక్కడ,ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అంది.నిజమే అనుకుని నాలుక కరుచుకున్నాడు.

Monday, 23 June 2014

రారాజు

             ఆకుకూరల్లో రారాజు తోటకూర.దీన్లో కాల్షియమ్,ఇనుము (ఐరన్)సమృద్ధిగా ఉంటాయి.రక్తహీనతను దూరం చేస్తుంది.రక్తం తక్కువ వున్నవాళ్ళు రోజు ఏదోఒక రూపంలో తినటం మంచిది.తోటకూర ఎముకలకు బలాన్నిచ్చి పెళుసుబారకుండా చేస్తుంది.మధుమేహం,గుండెజబ్బులబారిన పడకుండా చేస్తుంది.తోటకూర అంటే
పప్పు,వేపుడే కాదు చాలారకాలుగా ఉపయోగించవచ్చు.కొంచెం చింతపండు,టమోటాలు,ఉల్లిముక్కలు,పచ్చిమిర్చి  తోటకూరవేసి,తాళింపులో కరివేపాకు,కొత్తిమీరతోపాటు వెల్లుల్లివేస్తే చాలా బాగుంటుంది.చపాతీలో తోటకూర,పచ్చి మిర్చి సన్నగా కట్ చేసి చేసుకుంటే రుచిగా ఉంటాయి.తోటకూరతో పకోడీలు,వడలు చేసుకోవచ్చు.మినప్పప్పు నానబెట్టి గట్టిగావడలపిండిలా రుబ్బిన తర్వాత ఉల్లిపాయలు,తోటకూర,పచ్చిమిర్చి,అల్లంకొంచెం,కరివేపాకు  చిన్నచిన్నముక్కలుగా కట్ చేసి కలుపుకుని నూనెలో వేయించితే చాలా బాగుంటాయి.(గారెల మాదిరిగా మధ్యలో రంద్రం ఉంటే బాగా వేగుతాయి.)పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 

గోంగూర రైస్

          గోంగూర -2 కట్టలు (పులుపు ఎక్కువగా ఉన్నది)
          పుదీనా-ఒక గుప్పెడు
          కొత్తిమీర -గుప్పెడు
         కరివేపాకు -కొంచెం
         అల్లం,వెల్లుల్లి పేస్ట్ -ఒక స్పూను
         పచ్చిమిర్చి-7,8
         ఉల్లిపాయ -ఒకటి (సన్నగా పొడవుగా తరగాలి)
         గరం మసాలా పొడి -ఒక స్పూను
         బియ్యం - 3 కప్పులు
        ఉప్పు -సరిపడా
         నీళ్ళు- ఒకటికి ఒకటిన్నర్ర
                     బియ్యం కడిగి అన్నం వండి ఒకప్రక్కన పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి ఒకపాన్ లో నూనెవేసి నాలుగు లవంగాలు,రెండు యాలకులు,ఒకపెద్ద దాల్చినచెక్క,కరివేపాకువేసి,ఉల్లిముక్కలు,పచ్చిమిర్చి కొంచెం వేయించి
అల్లం,వెల్లుల్లిపేస్ట్ వేసిత్రిప్పి,ఉప్పు సరిపడావేసి, గోంగూర,పుదీనా,కొత్తిమీర వేసి వేగనివ్వాలి.చివరగా మసాలాపొడి వేసి దించాలి.ఇది ఒకప్రక్కన పెట్టి చల్లారనివ్వాలి.
                 రైస్ ఒకపెద్దప్లేటులోవేసి ఆరనిచ్చి దానిలో గోంగూర మిశ్రమం వేసి బాగా కలపాలి.పులుపు బాగా తినేవాళ్ళుఇంకొంచెం గోంగూర వేసుకోవచ్చు.గోంగూర రైస్ రెడీ.నూనె కొంచెం వేస్తే రైస్ చేతికి అంటకుండా ఉంటుంది.
ఇది చాలా బావుంటుంది.పిల్లలు గోంగూర తినడానికి ఇష్టపడరు కనుక ఇలాచేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇనుము ఎక్కువగా ఉంటుంది కనుక గోంగూర తినటం మంచిది.లంచ్ బాక్స్ లో పెట్టొచ్చు.

మెంతికూర ఫ్రైడ్ రైస్

           మెంతికూర -గుప్పెడు
          కొత్తిమీర -కొంచెం
          పుదీనా -కొంచెం
          కరివేపాకు -కొంచెం
          ఉల్లిపాయ -1 మీడియం లేదాఉల్లికాడలు
         పచ్చిమిర్చి -5 పెద్దవి
        అల్లం,వెల్లుల్లి పేస్ట్ -1 స్పూను
        బియ్యం -1/2 కే.జి
        టమోటాలు -4 మీడియం
      బంగాళదుంప -చిన్నది
     కారట్ -1 మీడియం
     ఒకగిన్నెలో కొంచెం నూనె,నెయ్యి వేసి 4 లవంగాలు,2 యాలకులు,దాల్చిన చెక్క,ఉల్లికాడలు,ఆకులన్నీవేసి
వేయించి అల్లం,వెల్లుల్లిపేస్ట్,పచ్చిమిర్చి,కూరగాయల ముక్కలువేసి వేయించాలి.కడిగి 1/2 గంట నానబెట్టిన బియ్యం వేసి వేయించాలి. 1 కి -1 1/2 నీళ్ళు పొయ్యాలి.ఉప్పువేసి పొంగువచ్చిన తర్వాత సిమ్ లో పెట్టి ఇగరనివ్వాలి.మంచి సువాసనతో చాలా రుచిగా ఉంటుంది.దీన్ని పెరుగుచట్నీతో తినొచ్చులేదా అలా అయినా తినొచ్చు.పిల్లలు ఆకుకూరలు ఇష్టపడరు కనుక ఇలా చేస్తే ఇష్టంగా తింటారు.
         

Sunday, 22 June 2014

మిల్క్ కేక్

            చిక్కని పాలు -3 గ్లాసులు
            పంచదార  -2 గ్లాసులు
            నెయ్యి    - 1/2 గ్లాసు
   బొంబాయి రవ్వ-1/4 గ్లాసు
            దళసరి పాత్రలో అన్నీవేసి బాగా కలపాలి.ఈమిశ్రమాన్ని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ పెట్టి గరిటెతో త్రిప్పుతూ ఉండాలి.మిశ్రమం గరిటెకంటుతూ జిగురుగా చిక్కగా ఉంటుంది.నెయ్యి పైకి తేలినప్పుడు ప్లేటుకి నెయ్యి
రాసి మిశ్రమాన్ని ప్లేటులో వెయ్యాలి.కొంచెము ఆరనిచ్చి కావాల్సిన షేపులోముక్కలు కట్ చేయాలి.మిల్క్ కేక్ రెడీ.
ఇది పాలకోవా రుచితో ఉంటుంది.
గమనిక:మిల్క్ కేక్ చేయటానికి నీళ్ళు అసలు వాడకూడదు.మంట మితంగా ఉండాలి. 

ఖూనీ

               రత్నావతి తన కొడుక్కి ఏరికోరి శ్రీధర్ అనే పేరు పెట్టుకుంది.తనకు ఆపేరంటే చాలా ఇష్టం.కొంతమంది అప్పట్లో నోరు తిరగక చీదరు,చీదరు అంటూ పిలిచేవాళ్ళు.పిల్లలు అయితే పోనీ పిలవటం కష్టం అనుకోవచ్చు.
పెద్దవాళ్ళు కూడా కొంతమంది అలాగే పిలిచేవాళ్ళు.రత్నావతికి ఏడుపు ఒక్కటే తక్కువ కావాలని ఎంతో ఇష్టపడి
పెట్టుకున్న పేరును ఖూనీచేసి పిలుస్తున్నారని బాధపడేది.ఇప్పటికీ ఒకళ్ళు ఇద్దరు అలాగే పిలుస్తారు.చేసేది ఏమీ
లేక రత్నావతి వాళ్ళకు చెప్పీచెప్పీ విసుగుతో వదిలేసింది.  

చీమండ గిన్నెలు

                             జ్యోతి పనిమనిషి ఒకరోజు గిన్నెలు కడుగుతూ మావైపు చీమండ గిన్నెలు ఉంటాయండీ.ఎంత
బాగుంటయ్యో! మేము స్టీలుగిన్నెలు గట్రా వాడమండీ అంది.జ్యోతి చీమండ గిన్నెలు అంటే ఏమిటి?నాకు అర్ధం
కాలేదు అంటే చీమండగిన్నెలంటే తెల్దేటండీ అంటుంది తప్ప అవేమిటో చెప్పటంలేదు.జ్యోతి వాళ్ళమ్మను అడిగింది.
అల్యూమినియం,జర్మన్ సిల్వర్ గిన్నెలను కొంతమంది సీమవెండి గిన్నెలంటారు.సీమవెండికొచ్చిన తిప్పలు
చీమండ అంటుంది అని చెప్పింది.అసలు సీమవెండి అంటారని కూడా జ్యోతికి తెలియదు.వాళ్ళమ్మ చెపితే కానీ అర్ధం కాలేదు.

Friday, 20 June 2014

బంగాళదుంప చిప్స్

          బంగాళదుంపలు కడిగి చెక్కుతీసి చిప్స్ చేసే దానితో పలుచగాచేసుకుని మరిగే నీటిలో కొంచెం ఉప్పువేసి
బంగాలదుంపల ముక్కలు వేసి మీడియం మంటమీద 10ని.లు ఉడికించాలి.చిప్స్ తెల్లగా రావాలంటే కొంచెం పటికవేసి 2ని.లతర్వాత నీరు వంచేయాలి.వాటిని రెండురోజులు ఎండలో ఎండనివ్వాలి.బాగా ఎండిన తర్వాత డబ్బాలో నిల్వచేసుకుని ఎప్పటికప్పుడు కావలసినన్ని వేయించుకుంటే కరకరలాడుతూ బావుంటాయి. 

మైసూర్ పాక్

             శనగపిండి(బేసన్) -1కప్పు
             పంచదార  -1 1/2 కప్పు
            నెయ్యి -1 1/4 కప్పు
             
                శనగపిండి ఉండలు లేకుండా వేయించాలి.పంచదారలో కొంచెంనీళ్ళు పోసి పాకం నీళ్ళల్లో నిలిచి చుడితే గుండ్రంగా అవ్వాలి.అప్పుడు నెయ్యివేస్తూ పిండివేసి త్రిప్పాలి.ఈమిశ్రమం బాగా పొంగుతున్నప్పుడు నెయ్యి రాసి
పెట్టుకున్న ప్లేటులో పోసి మనకు నచ్చినట్లుగా ముక్కలు కట్ చెయ్యాలి.
గమనిక: మిశ్రమం మరీ ఎక్కువ త్రిప్పితే పొడి అవుతుంది.తక్కువత్రిప్పి పోస్తే పొంగకుండా పలుచగా వస్తుంది.
అందుకని సరైన సమయంలో ప్లేటులో పొయ్యాలి.చాలా బాగా వస్తుంది.

Thursday, 19 June 2014

మిక్స్డ్ ఫ్రూట్ జామ్

యాపిల్,బొప్పాయి,సపోటా,అరటిపండ్లు ఎక్కువ తీసుకోవాలి.కమలా,ద్రాక్షపండ్లు తక్కువ తీసుకోవాలి.యాపిల్
ముక్కలు చిన్నవిగాచేసి ఉడికించి గుజ్జుతీసి రసం తీయాలి.(ఒకకిలో ముక్కలకు అరగ్లాసునీళ్ళు)బొప్పాయి,సపోటా గుజ్జు తీసుకోవాలి.ద్రాక్ష ఉడికించి రసం తీసుకోవాలి.అన్నిటిగుజ్జు కలిపివేయాలి.
                    గుజ్జు-1కిలో
                   పంచదార-1కిలో
                   నిమ్మఉప్పు-1టీస్పూను
                   మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ -1 టీ స్పూను
                  సోడియం బెంజాఎట్-1 టీస్పూను
       గుజ్జు,పంచదార కలిపి పొయ్యిమీద పెట్టి ఉడికించుకోవాలి.తీగపాకం వచ్చిన తర్వాత నిమ్మఉప్పు వేసి 5,10ని.లు ఉడికించాలి.ముద్దలాగా ఉంది జారిపడకుండా గట్టిగా ఉండాలి.పొడులను కలిపి తడిలేని పొడిసీసాలలో
(వెడల్పు సీసాలు)పోసి జామ్ చల్లారిన తర్వాత మూతపెట్టాలి.

ఉరుము ఉరిమి.....

             శ్రీధరణి బంధువులలో ఒకపెద్దాయన విదేశాలనుండి భార్యతో కలిసి స్వంతఊరికి వచ్చాడు.తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీధరణి ఇంటికి వచ్చివెళ్తామన్నారు.ఇంతలో శ్రీధరణి భర్త అర్జంటు పనిమీద స్వంతఊరికి
వెళ్ళాల్సొచ్చింది.పెద్దాయనకు ఫోనుచేసి నేను తప్పనిపరిస్థితులలో ఊరికి వెళ్ళాల్సొచ్చింది అందుకని బాబు విమానాశ్రయానికి వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాడు ఏమీ అనుకోవద్దు అనిచెప్పారు.తరువాత ఎన్నిగంటలకు  వస్తున్నారని శ్రీధరణి ఫోనుచేస్తే పెద్దాయన మేము మీఇంటికి రావటంలేదు విమానాశ్రయం దగ్గర హోటల్ లో విశ్రాంతి తీసుకుంటాము అని విసురుగా మాట్లాడాడు."ఉరుము ఉరిమి....వాడిమీద పడ్డట్లు"ఆయనకు ఏమైనా చిరాకు ఉంటే ఆయనకే పరిమితం అంతేకానీ అంత వయసు వచ్చిఎదుటివాళ్ళతో ఏమి మాట్లాడుతున్నామనే
ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడటమేమిటి?అని మనసులో అనుకుని అదేమిటి?వస్తామన్నారుకదా అంటే
నాభార్య అంతదూరం ప్రయాణం చేయలేదులే అన్నాడు.ఆవిషయం ముందే తెలుసుకదా అనుకుని సరేనండీ
అనేసింది శ్రీధరణి.ఏమిటో విచిత్రమైన మనస్తత్వాలు.

Wednesday, 18 June 2014

నువ్వెవడివిరా?

       లత,వీణ తండ్రి రామేశ్వరరావు చనిపోయారు.మగపిల్లలులేని కారణంగా తమ్ముడు కర్మకాండ      చేద్దామనుకున్నాడు.తండ్రి శవంతో పాటు స్మశానానికి లత,వీణ కూడా వెళ్ళటానికి బయలుదేరారు.
 హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు స్మశానానికి వెళ్ళకూడదని అందరూ చెప్పినా వినకపోతే
 ఒకపెద్దాయన ఆపటానికి లత చెయ్యిపట్టుకున్నాడు.ఏమిమాట్లాడుతుందో తెలియనిస్థితిలోఆయన్ని
"నువ్వెవడివిరా?నన్నుఆపటానికి మానాన్న నన్నే అంతా చెయ్యమన్నాడు"అనేసింది.అంతమాట
అన్నతర్వాత వద్దనటం కూడా అనవసరమని వదిలేశారు.అక్కచెల్లెళ్ళు ఇద్దరు చెరొకప్రక్క పాడె
పట్టుకున్నారు.స్మశానానికి వెళ్ళిన తర్వాతకూడా తమ్ముడు చితి వెలిగిస్తే కొంచెం వెలిగి ఆగిపోతే
అక్కాచెల్లెళ్ళు చెరొక అగ్గిపుల్ల వెలిగించివేశారు.అప్పుడు చితి అంటుకుంది.


Thursday, 12 June 2014

గోధుమ పాలతో హల్వా

           గోధుమలు-1 కప్పు
           పంచదార-1 కప్పు
          నెయ్యి-4 స్పూన్లు
          జీడిపప్పు-కొంచెం
         మిటాయి రంగు-చిటికెడు
         యాలకుపొడి -చిటికెడు
         గోధుమలు నానబెట్టి కొంచెం నీళ్ళుపోసి మిక్సీలోచిక్కటి  పాలు తీయాలి.పంచదారలో నీళ్ళుపోసి    ముదురుపాకం రానిచ్చి గోధుమపాలు పోసి బాగా దగ్గరకు వచ్చేవరకూ కలపాలి. తర్వాత నెయ్యి  జీడిపప్పు,యాలకుపొడి,మిటాయిరంగు వేసుకోవాలి.

కేరట్ బర్ఫీ

              కేరట్ తురుము -1 కప్పు
              పంచదార -1 కప్పు
              నెయ్యి -కొంచెం
             కేరట్ తురుము నేతిలో దోరగా వేయించుకోవాలి.పంచదారలో మరీఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం పోసి తీగపాకం రానిచ్చి వేయించిన కేరట్ తురుము వేయాలి.దగ్గరకు వచ్చేవరకూ త్రిప్పుతుండాలి.బాగా పొంగినతర్వత నేయ్యిరాసిన ప్లేట్ లోపోసి ఆరినతర్వాత ముక్కలు కట్ చేయాలి . చాక్లెట్ రుచితో చాలా  బాగుంటాయి.పది రోజులు నిల్వ ఉంటాయి.
గమనిక:కేరట్,పంచదార పాకం దగ్గరకు వచ్చినట్లే ఉంటుంది కానీ ప్లేట్లో పోస్తే అణిగిపోయినట్లుంటుంది.అందుకని బాగా పొంగినతర్వాతే ప్లేట్ లో పొయ్యాలి.ఒకసారి చేస్తే అర్ధమవుతుంది.

Wednesday, 11 June 2014

దోమ

                                     మనుషులం ఎంత బలంగా ఉన్నా ఒకచిన్న దోమ కుట్టిందంటే  జబ్బు పడాల్సొస్తుందని హడలిపోతాము.అందుకే మనకి దోమంటే భయం.త్వరలో దోమలకాలం వస్తుంది కనుక మనం ముందునుండే జాగ్రత్తపడాలి.దానికి ఒక తరుణోపాయం ఉంది.అదేమిటంటే ఇప్పటినుండే దోమల్ని పారద్రోలే మొక్కలను ఇంటా బయటా పెంచుకోవటం.అది పెద్ద కష్టమేమీ కాదు.అవన్నీ మనకు తెలిసినవే కానీ మనం అంతగా వాటి  గురించి పట్టించుకోము.సాధ్యమైనంతత్వరగా వాటిని పెంచటం మొదలుపెట్టండి.హాయిగా దోమలబెడద లేకుండా ఉండొచ్చు.అవి పుదీనా,తులసి,వెల్లుల్లి,బంతి,రోజ్ మేరీ,సిట్రోనెల్లా అంటే నిమ్మగడ్డి.వీటి ఆకుల వాసన మనకి బాగుంటుంది కానీ దోమలకు దుర్వాసనలా ఉండి వాటిని ఇబ్బంది పెట్టడంవల్ల దూరంగా పారిపోతాయి.కాబట్టి ఈమొక్కల కుండీలను వాకిట్లో,కిటికీలదగ్గర,వంటగదిలో,హాల్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు.సిట్రోనెల్లా ఎండ తగిలే ప్రదేశంలో పెడితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది.రోజ్ మేరీ,సిట్రోనెల్లా నర్సరీల్లో దొరుకుతాయి.వెల్లుల్లిపాయల్ని కుండీలలో పెడితే మొక్కలు వచ్చేస్తాయి.పుదీనా ఇంట్లోనే పెంచుకోవచ్చు.  పుదీనా ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆకులు వంటల్లో వాడిన తర్వాత పుదీనా కాడలు పెట్టినా మొక్కలు ఏపుగా వస్తాయి తులసి,బంతి అందరికీ ఉంటాయి.లేకపోతే నర్సరీలో తెచ్చుకోవచ్చు.

పొడుపు కథలు

    1)అడవిలో పుట్టి అడవిలో పెరిగి మాఇంటికొచ్చి తైతక్కలాడింది?
                 కవ్వం
     2)అమ్మ అంటే దగ్గరకొస్తాయి,నాన్న అంటే దూరం జరుగుతాయి. ఏమిటవి?
                  పెదవులు
    3)కాసేపటికొకసారి వాటంతట అవే టపటప కొట్టుకుంటాయి.ఏమిటవి?
                కనురెప్పలు
    4)గోడమీది బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చేపోయేవారిని వడ్డిస్తుంటుంది.ఏమిటది?
                తేలు
    5)పళ్ళున్నా కొరకలేనిది. ఏమిటది?
               దువ్వెన
    6)నడిచేకొద్దీ తగ్గేది?
               దూరం
    7)రెండువైపులా చెవులున్నా వినలేనిది?
              గంగాళం
    8)నీదేకానీ నీకన్నాఇతరులే ఎక్కువ వాడతారు?
              నీ పేరు
    9) పెరిగేదే కానీతగ్గనిది.ఏమిటది?
              వయసు
   10)తెల్లబడితే మాసిపోయేది.ఏమిటి?
            బ్లాక్ బోర్డు

బ్రెడ్ దోసె

               బ్రెడ్ పాకెట్ -1 పెద్దది
              శనగపిండి-300గ్రా.
              ఉల్లిపాయలు -2
               పచ్చిమిర్చి - 3
                         
                    శనగపిండి తగినంత నీటితో పలుచగా దోసెలపిండిలాగా కలుపుకోవాలి.అందులో తగినంత ఉప్పు,కారం కలపాలి.కావాలనుకున్నవారు ఉల్లిపాయలను,పచ్చిమిర్చిని సన్నగా తరిగి పిండిలో కలపాలి.
పది ని.లు.పిండిని నాననివ్వాలి.తర్వాత స్టవ్ మీద  పెనంపెట్టి నూనె వేసి ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ ని శనగపిండిలోముంచి
పెనంమీద పెట్టి పైన మరో అరగరిటె పిండివేసి పలుచగా గుండ్రంగా త్రిప్పాలి.కాలిన తర్వాత రెండవ వైపునకు త్రిప్పి రెండు స్పూన్ల నూనెను దోసె చుట్టూ వెయ్యాలి.

చక్రపొంగలి

          బియ్యం -4 కప్పులు
         పెసరపప్పు-1కప్పు
          బెల్లం -5కప్పులు
          నెయ్యి -మెతుకు చేతికి అంటకుండా పట్టినంత
          ఎండుకొబ్బరి-  ఒక చిప్ప
         జీడిపప్పు,కిస్మిస్
               బియ్యము,పెసరపప్పు కలిపి 8కప్పుల నీళ్ళుపోసి ఉడికించాలి.దానిలోబెల్లం పెట్టి ఇగిరిన తర్వాత నెయ్యి వేయాలి.ఎండుకొబ్బరి సన్నగా ముక్కలుకోసుకుని నేతిలోవేయించాలి.జీడిపప్పు,కిస్మిస్ నేతిలో  వేయించి అన్నీకలిపి ఒక్కసారి కలిపితే చక్రపొంగలి రెడీ.ఇష్టమైన వాళ్ళు కొంచెం పచ్చకర్పూరం వేసుకోవచ్చు.   

ఆశ్చర్యం

                  రిధిమ బ్లాగ్ల్ లోని ఒక పోస్ట్ ని కాపీ చేసి ఒకపెద్దాయన ముఖపుస్తకంలో పోస్ట్ కి సంబంధించిన ఫోటో
పెట్టుకున్నాడు.రిధిమకు తెలిసిన ఇంకొక స్నేహితురాలు దానికి లైక్ పెట్టింది. అది రిధిమకు వచ్చింది.ఇదేమిటి ఇది అచ్చు నేను రాసిన పోస్ట్ లాగుందే అని ఆశ్చర్యపోయింది.రిధిమకు బ్లాగ్ ఉందని కూడా ఆస్నేహితురాలికి తెలియదు.ఎందుకో ఆరోజు కావాలనిఒక్కొక్క లైనుకి గ్యాప్ ఇచ్చి మరీ పోస్ట్ చేసింది.మొత్తం ఎలావుందో అలాగే కాపీ చేసి తన స్వంతదానిలా పెట్టుకున్నాడు.దానికి 60మంది లైక్ పెట్టడము వింతగా అనిపించింది.పాపం అందరికీ తెలియదు కదా!ముఖపుస్తకంలో పెట్టడము,అందరికీ చెప్పటం రిధిమకు ఇష్టముండదు కనుక బ్లాగ్ గురించి ఎవరికీ  చెప్పలేదు.ఏమిటో పితపకాలపు బుద్దులు పెద్దవాళ్ళకు కూడా తప్పు అని ఎదుటివాళ్ళకు  చెప్పాల్సిందిపోయి వాళ్ళే అలా ప్రవర్తించటం ఆశ్చర్యంగా ఉంది.  

డోనట్స్

            కోడిగ్రుడ్లు-4లేదా 6
            పంచదార -2గిద్దలు (2 రైస్ కుక్కర్ కప్పులు )
           వెన్నలేదానెయ్యి ,పాలు కొంచెం
          మైదా -తగినంత
         బేకింగ్ పౌడరు -1స్పూను
            కోడిగ్రుడ్లు గిలకొట్టి దానిలో పంచదార వేసి కరిగేవరకు త్రిప్పాలి.దానిలో నేయ్యికానీ వెన్నకానీ  వేయాలి.కొద్దిగా పాలుపోసి 5ని.లు.గిలకొట్టి బేకింగ్ పౌడరు వెయ్యాలి.మైదా వేసి పూరీపిండిలాగా కలుపుకోవాలి.ఒకగంట నాననిచ్చి రొట్టెలు చేసి ఏ ఆకారం కావాలంటే ఆఆకారంలో కట్ చేసి నెయ్యిలో వేయించితే బాగుంటాయి.నూనెలో అయినా వేయించుకోవచ్చు.      

టొమాటో బరమ్

             టొమాటోలు పెద్దవి-1 కే.జి(గట్టిగా ఉండాలి)
             బంగాళదుంపలు-1/2కే.జి
             పచ్చి బటాణీలు-300గ్రా.
             ఉప్పు-తగినంత
             పసుపు-చిటికెడు
             కారం-సరిపడా
             పోపుదినుసులు,నెయ్యి
                బంగాళదుంపలు,బటాణీలు ఉడికించాలి.దుంపలు పొట్టుతీసి పొడిచేయాలి.బాణాలిలో నెయ్యివేసి పోపుపెట్టి బంగాళదుంపలపొడి,బటాణీలు,ఉప్పు,కారం,పసుపువేసి బాగా వేయించాలి.ఇప్పుడు టొమాటోలు
పైభాగాన రూపాయిబిళ్ళంత దళసరిగా అదేసైజులో ఒకముక్కను చాకుతో కోయాలి.లోపలిగుజ్జు తీసేసి లోపల
బంగాళదుంప వేయించిన మిశ్రమాన్ని నింపి టొమాటోముక్కను యధాస్థానంలో అమర్చి సూది,దారంతో
కుట్టాలి.వీటిని మరిగే నెయ్యిలో కొద్దిగా వేయించి తియ్యాలి.వడ్డించేముందు దారం తీసేయ్యాలి.

సొరకాయతో అప్పాలు

               సొరకాయ -1/4 కే.జి
               బియ్యప్పిండి -1/2కే.జి
               నూనె-1/4కే .జి
              పచ్చి మిర్చి -8
             ఉప్పు -తగినంత
            శనగపప్పు లేదా
            పెసరపప్పు-ఏదోఒకటి -2tb స్పూన్లు
            నువ్వులు-1స్పూను
              ముందుగా శనగ లేదా పెసరపప్పును నానపెట్టుకోవాలి.సొరకాయ చెక్కుతీసి తురుమకోవాలి. ఈతురుములో బియ్యప్పిండి,నానినపప్పు,నువ్వులు,పచ్చిమిర్చి,ఉప్పు కలిపి నూరినముద్దను కలిపి
పకోడీలపిండి మాదిరిగా కలుపుకోవాలి.బాణలిలో నూనెపోసి బాగా కాగిన తర్వాత పైముద్దని చిన్న
ఉండలుగాచేసి అరచేత్తోతట్టి నూనెలో ఎర్రగా వేయించాలి.

మామిడికాయ పెసరదోసె

                                                         
                     
               పుల్లని మామిడికాయ -1
               బియ్యం -1/4కే.జి
               పెసరపప్పు-1/2కే.జి
               ఉల్లిపాయలు -4
               పచ్చిమిర్చి -5
              అల్లం -చిన్నముక్క
             జీర(జీలకర్ర)-కొంచెం
             ఉప్పు -తగినంత
            నూనె -దోసెలకు సరిపడా
                                                 
                                     ముందుగా బియ్యం,పెసరపప్పు కలిపి నానబెట్టి,నానినతర్వాత మిక్సీలోవేసి      మామిడికాయముక్కలను చేర్చి మెత్తగా రుబ్బినతర్వాత పచ్చిమిర్చి,జీర,ఉప్పు,అల్లంవేసి రుబ్బాలి.
మామూలు దోసెలు లాగానే పలుచగా వేసుకుని పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి.
కొబ్బరి చట్నీకానీ,అల్లం,పచ్చిమిర్చి చట్నీతోగానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.
సహాయం

            బియాస్ దుర్ఘటనలో పిల్లలు చనిపోవటం చాలా బాధగా అనిపించింది.సహాయకచర్యలు అంతంతమాత్రంగా ఉన్నాచుట్టుప్రక్కల ఉన్న మన తెలుగువారందరూ వచ్చి పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం,స్నేహితులు చనిపోయిన షాక్ తో ఉన్న పిల్లలకు తినడానికి,త్రాగటానికి ఏదోఒకటి ఇచ్చివాళ్ళను ఆషాక్ లోనుండి బయటకు తీసుకురావటం,అక్కడిఅధికారులతో  మాట్లాడి సహాయకచర్యలను ముమ్మురం చేయడం,చనిపోయిన పిల్లల తల్లిదండ్రులను ఓదార్చటం,భాషతో ఇబ్బంది పడకుండా అవసరమైనచోట మాట్లాడటం, ముఖ్యంగా మనవాళ్ళు
అని సహాయం చేయటం హర్షణీయం.రాజకీయనాయకులో,అధికారులో వచ్చి ఎప్పుడో చేస్తారులే అనుకోకుండా
వెంటనే స్పందించి సహాయపడటం అభినందనీయయం. 

Tuesday, 10 June 2014

దొంగజ్వరం

             నిఖిత,నిఖిల నికిజ హాస్టల్లో ఒకేగదిలో ఉండేవారు.వీళ్ళందరూ ఒకే ఊరివాళ్ళు.ఇంటర్మీడియట్ ఒకే గ్రూపులో ఒకే సెక్షన్లో చదివేవారు.నిఖిత అప్పుడప్పుడు క్లాసులు ఎగ్గొట్టేది.అందుకోసం రకరకాల వంకలు చెప్పేది.
హాస్టల్ వంటగది నుండి ఒక ఉల్లిపాయను తెచ్చి చంకలో పెట్టుకునేది.ఉల్లిపాయ చంకలో పెట్టుకున్న కాసేపటికి
 వొళ్ళంతా వేడెక్కి బాగా జ్వరం వచ్చినట్లుండేది.ధర్మామీటర్ తో చూస్తే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత చూపించేది.వార్డెన్
వచ్చి కళాశాలకు వెళ్ళలేదేమిటి?అని అడిగితే బాగా జ్వరం వచ్చింది అని వణుకుతున్నట్లు నటించేది.నిజంగానే
జ్వరం వచ్చిందని నమ్మి టాబ్లెట్ ఇచ్చి విశ్రాంతి తీసుకోమని వెళ్ళేది.వార్డెన్ అటు వెళ్ళగానే చంకలో ఉల్లిపాయ తీసేసేది.జ్వరం తగ్గిపోయేది.వార్డెన్ దొంగజ్వరాన్ని నిజమని నమ్మేసిందని నిఖిత సంతోషంగా లేచి గంతులేసేది.

సంఘీభావం

           కాకులు ఏదైనా ఆహారాన్ని చూడగానే కావు,కావు అంటూ మిగతావాటన్నిటిని పిలిచి అన్నీకలిసి ఆహారాన్ని పంచుకుని తింటాయి.వీటిని చూచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది.ప్రజలందరూ సంఘీభావంతో
కలిసికట్టుగా ఉంటే సాధ్యంకానిపని అంటూ ఏదీ ఉండదు.ఎవరో వచ్చి ఏదోచేస్తారని అనుకోకుండా మనకు మనమే
అందరమూ సంఘీభావంతో చేయి,చేయి కలిపి నిష్కల్మషంగా ఏపని మొదలుపెట్టి చేసినా ఎంతోఅభివృద్ధి సాధించ గలుగుతాము.తద్వారా మనం ఉన్నచోట ఎంతో అభివృద్ధి చేసుకోగలం.అందరూ  నిస్వార్ధంగా,నిజాయితీతో
పనిచేస్తే రాష్ట్రాలు,దేశం కూడా బాగుపడుతుంది.ముందుగామనల్ని మనం బాగుచేసుకోవాలి.ఆతర్వాత ఇతరుల్ని బాగుచేయగలం.అప్పుడు అందరూ సంఘటితంగా కృషి చేస్తే దేనినైనా సాధించగలం.ఇప్పటికే ప్రజలలో చాలా మార్పు వచ్చింది.ఇకముందు అవినీతిని,స్వార్ధాన్నిఅంతంచేయగలిగితే మనం తప్పకుండా ఎంతో అభివృద్ధిని సాధించగలమని ఆశిద్దాము. 

నల్లలక్ష్మి

          లక్ష్మినల్లగా ఉంటుంది.పుట్టిన ఊరిలో" నల్లలక్ష్మి"అనిపిలిచేవాళ్ళు.అత్తగారి ఊరిలో కూడా అలాగే
పిలవటం మొదలుపెట్టారు.పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యేవరకు ఊరుకుంది.ఉన్నట్లుండి ఏమయ్యిందో ఏమో ఒక
పెద్దావిడ నల్లలక్ష్మి అని పిలిచిందట.అప్పుడు అందరి ఎదుట మాట్లాడకుండా ఇంటికి వెళ్ళినతర్వాత ఫోనుచేసి
ఒకగంట ఏకధాటిగా నన్ను నల్లలక్ష్మి అని పిలుస్తావా?అంటూ పోట్లాట వేసుకుంది.పెద్దావిడకు తలకాయవాచిపోయి వాకిట్లో అరుగుమీద కూర్చుని వచ్చేపోయే జనాలను పిలిచిమరీ అందరూ పిలిచినట్లుగానే నేను పిలిచాను.ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా పిలిపించుకుని ఇప్పుడు ఆపేరు అలవాటయిన తర్వాత ఇకనుండి పిలవొద్దు
మామ్మాఅనిచెప్పకుండా,పెద్దదాన్నని చూడకుండా మాట్లాడిందని వాపోయింది.మొదటినుండి పిలిపించుకోవటం లక్ష్మితప్పు.దేవుడిచ్చిన రూపానికి లక్ష్మిని బాధపెట్టకూడదు.ఇంతకుముందు రోజుల్లో నలుగురైదుగురు ఒకేపేరుతో ఉంటే నల్ల,తెల్ల,సన్న,లావు అంటూ పిలిచేవాళ్ళు.ఈరోజుల్లో ఎక్కువమంది ఉంటే ఇంటిపేరుతో  పిలుస్తున్నారు. కాలంమారిందికదా!నామట్టుకు నేను ఎవరినీ విమర్శించను,బాధపెట్టను.ఎవరినో బాధపెట్టాలనే ఉద్దేశ్యంతో రాసినదికాదు.ఇలా పిలిస్తే అలా రియాక్టవుతారని,వాళ్ళ మనసుని బాధపెట్టినట్లవుతుందని తెలియచేప్పటమే నాఉద్దేశ్యం.
కొసమెరుపు:ఇంతకుముందు రోజుల్లో పెద్దవాళ్ళంటే భయం,భక్తీ,గౌరవం అన్నీఉండేయికనుక ఏదిపడితే అది
పిల్లలు మాట్లాడేవాళ్ళుకాదు.పెద్దవాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు.ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కనుక ఏదిపడితే
అది మాట్లాడటం ఫ్యాషనయి పోయింది.  

ఉల్లిత్తు

              కామేష్ చిన్నప్పుడు ఉలిపి పనులు చేసేవాడు.దానికితోడు నల్లగా ఉండేవాడు.ఉల్లిగింజ నల్లగా ఉంటుంది.  అందుకని కామేష్ నల్లగాఉండి ఉలిపిపనులు చేస్తుంటాడని ఎవరో "ఉల్లిత్తు" అని పేరు పెట్టారు.ఇక అందరూ అసలు
పేరు మర్చిపోయి ఉల్లిత్తు అని పిలవటం మొదలుపెట్టారు.ముసలివాడయినా అదేపేరుతో పిలుస్తున్నారు.కామేష్ కూడా ఏయ్ ఉల్లిత్తు ఇటు రా అంటేనే వస్తాడు.కామేష్ అంటే దిక్కులు చూస్తాడు.అసలు పిలిపించుకునే వాడికి లేని బాధ మనకెందుకు?అతనికీ సరదాగానే ఉంది.అందుకే ఇష్టంగా పిలిపించుకుంటున్నాడు.  

ద్వజస్తంభం

             ఇషిక స్వంతఊరిలో రామాలయాన్ని పునర్నిర్మించి ద్వజస్తంభం ఎత్తారు.ఏఆలయనికయినా ద్వజస్తంభం
ముఖ్యం.ద్వజస్తంభం ఎత్తినప్పుడు ఆఊరిఆడపిల్లలను పుట్టింటికి పిలిచి బట్టలు పెట్టటం ఆనవాయితీ.ఆరోజు ఆలయానికివెళ్ళి దైవదర్శనం చేసుకుని పుట్టింటివాళ్ళు పెట్టినచీర కట్టుకుని భోజనంచేయాలని లేకపోతే పన్నెండు
సంవత్సరాలు పుట్టింటి వాళ్ళతో పసుపు,కుంకుమ పెట్టించుకోకూడదని పెద్దలు చెపుతుంటారు.అందుకని తప్పనిసరిగా ఆడపిల్లలందరూ ఊరికి వెళ్తారు.ఇషిక కూడా అలాగే ఊరు వెళ్ళింది.తనతో చదువుకున్నచిన్నప్పటి స్నేహితులు,బంధువులు అన్నితరాలవాళ్ళు ఆలయప్రారంభోత్సవానికి వచ్చారు.వాళ్లందరూ చాలాసంవత్సరాల
తర్వాత కనిపించటంవలన ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఇషికను చూచి అందరూ చాలాచాలా
సంతోషించారు ఎందుకంటే చిన్నప్పటినుండి ఇషిక అంటే అందరికీ ఇష్టం.దీక్షతీసుకుని కొంతమంది దంపతులు  ప్రారంభోత్సవపూజలు,హోమాలు చేసినవాళ్ళు తప్ప సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆలయం
లోపలకు ఎవరినీ పంపించలేదు.అయినా ఇషికవాళ్ళను లోపలకు అనుమతించటంవలన దగ్గరనుండి కళ్యాణం
చూడటంవల్ల చాలా సంతోషం కలిగింది. ఆవుదూడ మూలవిరాట్టుల దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మిగతావాళ్ళు దర్శనం చేసుకోవాలి కనుక ఆతర్వాత దైవదర్శనం చేసుకున్నారు.ఆలయం తరఫున మూడురోజులు  భోజనాలు ఏర్పాటు చేశారు.దేవుడి భోజనం తప్పనిసరిగా చేయాలి కనుక,ద్వజస్తంబం ఎన్నోఏళ్లకు ఒకసారి ఎత్తుతారు కనుక దూరప్రాంతాల వాళ్ళు కూడా వచ్చారు.   

Monday, 9 June 2014

మెంటల్ కృష్ణ

                భావన స్నేహితురాలి కొడుకు పెళ్ళికి వెళ్ళింది.అక్కడ దూరపుబంధువు ఒకతను కన్పించాడు.భావన
కొడుకు పెళ్ళికి స్వయంగా ఇంటికివచ్చి పిలవలేదని తెగ సతాయించాడు.పెళ్ళికి శుభలేఖ పంపించి ఫోనుచేసి
చెప్పింది.సమయాభావం వల్ల వేరే సిటీలో ఉన్నవాళ్ళను స్వయంగా పిలవటానికి సాధ్యపడలేదు.అర్థం చేసుకోవాలి కదా!కష్టపడి ప్రయాణం చేసి రావాల్సిన అవసరం లేకుండాఏ.సి బస్సులు కూడావేశారు.ఆవిషయం తెలిసి కూడా
తెలియనట్లు నటించి వాళ్ళను పిలిచావు,వీళ్ళను పిలిచావు నన్నే పిలవలేదు అని మాట్లాడుతూనే ఉన్నాడు.
మెంటల్ కృష్ణలాగ వీడు తగిలాడు ఉదయాన్నే అయినా ఈరోజుల్లోకూడా స్వయంగా ఇళ్ళకు వచ్చి పిలవలేదని
అనుకోవటం ఏమిటి?అని భావన మనసులో అనుకొంది.నువ్వు నన్నుస్వయంగా పిలవకపోయినా నేను నాకొడుకు పెళ్ళికి నిన్ను స్వయంగా పిలుస్తానులే అని చెప్పి వెళ్ళాడు.    

స్థపతి

                                            స్థపతి అంటే శిల్పి.విజయవాడకు దగ్గరలోని ఒకఊరిలో పాతరామాలయం స్థానంలో    నూతనరామాలయాన్ని నిర్మించారు.స్థపతి తన శిల్పకళాచాతుర్యంతో విగ్రహాలను,ఆలయగోపురాన్ని,గోపురం పైన ఉన్నవిగ్రహాలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేశారు.ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఆఊరిపెద్దాయనకు కలలో శ్రీరాముడే స్వయంగా కన్పించి ఆలయాన్ని పునరుద్ధరించమని చెప్పారని తను పెద్దమొత్తంలో డబ్బుఇచ్చి
ఊరివారందరి సహకారం కావాలని చెప్పారు.ఊరిలోవాళ్ళు,విదేశాలలో ఉన్నవాళ్ళు ఎవరికివాళ్ళు స్వచ్చందంగా
ఇచ్చిన డబ్బుతో ఆలయనిర్మాణానికి నడుం బిగించారు.పెద్దాయన స్వయంగా ఆలయనిర్మాణాన్నిదగ్గరుండి పర్యవేక్షించారు.ఊరిలో ఉన్నకుర్రాళ్ళందరు వీలయినప్పుడల్లా ఆలయనిర్మాణ పనులుచూసేవారు.ఆలయ
ప్రారంభోత్సవం సందర్భంగా స్థపతిని,వాస్తుశిల్పిని,వేదపండితులను,దీక్షతీసుకుని మూడురోజులు పూజలుచేసిన
దంపతులను పెద్దాయన సత్కరించారు.ఎంతో ఘనంగా ఆలయ ప్రారంభోత్సవం జరిగింది.ఇంకొక ముచ్చటగొలిపే
విషయమేమిటంటే ఇవన్నీ చూస్తూ స్థపతి ఆరేళ్ళకుమారుడు కొంచెంపువ్వులు,అక్షింతలు తీసుకుని తండ్రి పాదాలపై వేసి నమస్కరించాడు.అది చూచి అందరూ ముచ్చటపడ్డారు.     

Wednesday, 4 June 2014

వెఱ్రిపప్ప

             సిటీకి దగ్గరలోఉన్న రెండు పల్లెల్లో ఒకపల్లెలోని వాళ్ళు చాలామంది మంచి చదువులు చదువుకొని వేరే
సిటీల్లోను,వేరేదేశాలలో స్థిరపడ్డారు.ఇంకొకపల్లెలోని వాళ్ళు కొద్దిమంది అప్పుడప్పుడే పెద్దచదువులు పూర్తిచేశారు.
జానకిది చదువుకున్నవాళ్ళున్నపల్లె.జానకి బాగా చదువుకుని మంచిపద్దతుల్లో పెరిగినపిల్ల.జానకిని చదువుకోని
వాళ్లున్నపల్లెలోని చదువుకున్న అబ్బాయికిచ్చి పెళ్ళిచేశారు.సిటీకి అడుగుదూరంలో ఉన్నాజానకి అత్తవారింటికి వెళ్ళేటప్పటికి వాళ్ళింట్లో వాళ్ళ భాష కొంచెం తేడాగా ఉండేది.స్పూన్లు అనటానికి బదులుగా స్కూన్లు అని,గరిటని
గంటి అనిఅనేవాళ్ళు.ఇంకాకొన్ని అలాగే మాట్లాడేవాళ్ళు.జానకి ఎలాగయితే కష్టపడి ఆఅలవాట్లన్నీ మాన్పించి
మంచి భాష అలవాటు చేసింది.ఆవెఱ్రిపప్పలను మార్చటం చాలా కష్టం వాళ్ళు ఎవరుచెప్పినా వినేరకం కాదు అని
 అందరూ అన్నారు.జానకి దాన్ని చాలెంజ్ గా తీసుకుని నేను మార్చగలను అని వాళ్ళను మార్చి చూపించింది.
ఆశ్చర్యం ఏమిటంటే ఆ వెఱ్రి పప్పలు తెలివితేటలు నేర్చుకుని,వేషభాషలు మార్చుకుని జానకి వాళ్ళను మోసంచేసి
జానకినే"వెఱ్రి పప్పను"చేసేశారు.వాళ్ళను బాగుచేసి తను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లయింది జానకి పరిస్థితి.
   

దరిద్రపు అలవాటు

          ఇష్రిత ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు.తన పనేదో తను చేసుకుంటూ సహోద్యోగులు కనిపిస్తే నిష్కల్మషంగా     చిరునవ్వుతో పలకరించటమే తప్ప బాతాఖానీ కొట్టదు.అలాంటిది ఒకరోజు కారిడార్లో వెళ్తుండగా తన పేరు
వినిపించింది.ఏమిటోనని నిలబడేసరికి కొంతమంది కలిసి మాట్లాడుకుంటూ కనిపించారు.ఇంతకీ దాని సారాంశమేమిటంటే ఇష్రితకు గర్వమనీ,ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదనీ అనుకుంటున్నారు.అదేమిటి?
నేను ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరిస్తుంటాను కదా!ఆరకంగా మాట్లాడుకోవటమేమిటి? అనుకుంది.
ఉన్నతవిద్యనభ్యసించి కూడా నలుగురూ మాట్లాడుకునేటప్పుడు వేరేవాళ్ళగురించి తప్పుగా మాట్లాడుకోవడం
అంత "దరిద్రపు అలవాటు"ఇంకొకటి ఉండదు.స్నేహంగా ఉంటూనే వాళ్ళ వెనుక ఏదోఒకటి ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు.ఇప్పుడు ఇదొక చెత్త ఫాషనయిపోయింది.ఈఅజ్ఞానం నుండి ఎప్పుడు బయటపడతారో ఏమో? 

Tuesday, 3 June 2014

తొలిసారి- మలిసారి

           అద్విక తొమ్మిదోతరగతి చదువుతోంది.మొట్టమొదటగా స్కూలులో చేర్చినప్పుడు అమ్మానాన్న తరగతిగదిలోనికి పంపించి బయటకు రాగానే పరుగెత్తుకుంటూ రెండుసార్లు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది.
మళ్ళీ పంపిస్తారేమోనని చెట్లచాటున దాక్కుంది.ఇంతలో వాళ్ళ తాతగారు వచ్చి నేను పంపిస్తాను రమ్మని
ఎత్తుకుని తీసుకెళ్ళారు.మళ్ళీపరుగు లంకించుకుందామనుకునేసరికి ఎత్తుకుని వీపుమీద గట్టిగా ఒక్కటిచ్చారు.
ఇక అంతటితో ఏడ్చుకుంటూ కదలకమెదలక కూర్చుండిపోయింది.కానీ అంత చిన్నవయసులో కూడా అద్వికకు
బాగా కోపమొచ్చింది.తాతగారితో మాట్లాడకుండా అలిగి నానా హంగామా చేసింది.ఆయన ఇంకెప్పుడుకొట్టను అని మాటిస్తేగానీ మామూలవలేదు.అద్వికను వాళ్ళ తాతగారు కొట్టడం అదే" తొలిసారి-మలిసారి."

సుత్తాయి

         ఊళ్ళల్లో అసలు పేర్లకన్నాపెట్టుడు పేర్లతోనే ఎక్కువ పిలుస్తుంటారు.చిన్నప్పుడు కానీ,కొంచెం పెద్దయిన తర్వాత కానీ చేసిన చిలిపిపనులు కానీ,చెడ్డపనులు కానీ గుర్తుపెట్టుకుని మరీ ఒకపేరు పెట్టేసి పిలుస్తుంటారు.
ఈసుత్తాయి అనేపేరు కూడా అలాంటిదే.అసలుపేరు శేఖర్ అయితే చిన్నప్పుడు ఒకపెద్దాయన అల్లరి చేస్తుంటే
గట్టిగా తిట్టి,కొట్టటానికి వెంటపడేసరికి శేఖర్కి కోపమొచ్చిఒకసుత్తి తీసుకుని ఆపెద్దాయన తలపై కొట్టటానికి
ప్రయత్నించేసరికి ప్రక్కన ఉన్నాయన పట్టుకుని ఏరా!వేలేడంతలేవు సుత్తితెచ్చి పెద్దాచిన్నాలేకుండా తలపై
కొడదామనుకుంటున్నావా?అని శేఖర్ ని పట్టుకుని నాలుగంటించి అంటే నాలుగు దెబ్బలు వేసి రేపటినుండి
వీడిని "సుత్తాయి"అని పిలవండిరా అని హుకుం జారీచేశాడు.ఇక అప్పటినుండి శేఖర్ పెళ్ళయి పిల్లలు మంచి
ఉద్యోగాలలో స్థిరపడినా అసలుపేరుతో పిలవకుండా పెట్టుడు పేరుతోనే అందరూ పిలుస్తారు.
Monday, 2 June 2014

లాలీ వచ్చిందోచ్

         శిరోమణి నల్లగా,పొడవుగా ఉంటుంది.పోలికలు కాస్త ఫర్వాలేదు కానీ తనకు తానే నాఅంత అందగత్తె ప్రపంచంలో ఎక్కడా లేదనుకుంటుంది.తెలివిగా,చక్కగా మాట్లాడాననుకుని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎదుటి
వాళ్ళను అవమానపరుస్తుంటుంది.తనుమాత్రం ఫోనుచేయదు.కానీఎదుటివాళ్ళు చేస్తేమాత్రంగంటలు గంటలు
మాట్లాడుతుంది.చిన్నప్పుడైతే లారీని లాలీ అన్నా ఫర్వాలేదు కానీ పెద్దయిన తర్వాత కూడా లారీ అనటానికి బదులుగా" లాలీ" అనే అంటుంది.కబుర్లు మాత్రం బోలెడు చెప్తుంటుంది.చిన్నప్పుడు పెద్దయిన తర్వాత వెంట్రుకను పెళ్లి చేసుకుంటానని,చెత్త కుప్పను పెళ్ళి చేసుకుంటానని చెప్పేది.పెద్దయినా కూడా అలాగే అత్తిపిత్తి ఆలోచనలు అంటే సొల్లుకబుర్లు చెప్తుంటుంది.అందుకే అందరూ శిరోమణి రాగానే రారా ఏమిటి విశేషాలు? అంటూనే ఏదైనా
మనసులో బాధపడుతుందేమో అనుకోకుండా మన"లాలీ వచ్చిందోచ్"అంటూ నవ్వుతుంటారు.

Sunday, 1 June 2014

పక్షపాతం

             కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపట్ల పక్షపాతం చూపిస్తుంటారు.అందరినీ ఒకేరకంగా కనిపెంచినా ఒక
బిడ్డను ఒకరకంగా ఇంకొకబిడ్డను ఇంకొక రకంగా చూస్తుంటారు.తల్లిదండ్రులంటే పక్షపాతం లేకుండా ఎంతమంది
బిడ్డలున్నాఅందరినీ సమానంగా చూడగలగాలి లేదంటే ఒక్క బిడ్డతో సరిపెట్టుకుని వాళ్ళనే చూచుకోవాలి.సుచిత్రకు
తెలిసిన ఒకామెకు ఇద్దరు ఆడపిల్లలు.ఇద్దరికీ ఒక సంవత్సరమే తేడా అయినా పన్నెండేళ్ళ చిన్నపిల్లను ఒళ్లో పడుకోబెట్టుకుని మాచిన్నాడిని ఏమ్మన్నా అన్నావంటే ఊరుకోను అని పెద్దపిల్లను బెదిరించి చిన్నపిల్లకు ముద్దులు పెడుతుంటుంది.అప్పుడు పెద్ద అమ్మాయి హావభావాలను గమనించి ఉంటే అసలు తల్లి అలా ప్రవర్తించదు.తల్లే చెల్లంటే ఈర్ష్య పుట్టేలా చేతులారా చేసినట్లవుతుంది.తల్లి ఇద్దరినీ సమానమైన ప్రేమతో చూడాలి.ఈరకంగా ఎవరూ పక్షపాతం చూపకూడదు.పిల్లలు పెద్దయినతర్వాత ఈర్ష్య,అసూయా,ద్వేషం మనసులో ఏర్పడకుండా అక్కాచెల్లెళ్ళు,
అక్కాతమ్ముళ్ళు,అన్నదమ్ములు,అన్నాచెల్లెళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళనుబట్టే,వాళ్ళు చేసిన అలవాట్లనుబట్టే  ఒకరికొకరు ప్రేమ,ఆప్యాయత,అనురాగాలతో ఉంటారు.
        

పాలల్లో తోడు

           శంకరరావు నిరుపేద కుటుంబంలో పుట్టాడు.సరిగ్గా చదువుకోకుండా ఏవో చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు.పెద్ద అయిన తర్వాత బాగా సోమరితనం అలవాటయి పోయింది.కష్టపడి పనిచేయకుండా పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ పేకాటరాయుళ్ళ దగ్గర కూర్చోవటానికి అలవాటుపడ్డాడు.ఊరికే ఎవరూ కుర్చోబెట్టుకోరు కదా
అందుకని వాళ్ళకు అవసరమైన పనులు అంటే సిగరెట్లు,మందు అన్నీ తెప్పించుకునేవాళ్ళు.పోలీసులు వస్తే చెప్పటానికి బయట కాపలా పెట్టేవాళ్ళు.వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు.అంతే తప్ప వేరే పని చేసుకుందామనే ఆలోచన ఉండేది కాదు.పేకాటరాయుళ్ళకు ఇతను లేకుండా పని జరిగేదికాదు.పాలల్లో తోడు వేయనిదేపెరుగు తోడుకోనట్లుగా శంకరరావు లేనిదే ఆట మొదలెట్టరని ఇతన్ని" పాలల్లో తోడు" అని అందరూ పిలవటం మొదలు పెట్టారు.ఇక అతని అసలుపేరు కనుమరుగై పాలల్లో తోడుగా స్థిరపడిపోయాడు.