Saturday, 14 September 2019

ఇవ్వాళ చస్తే రేపటికి రెండు

                                                                             శ్రీనిష్ పదవ తరగతి చదువుతున్నప్పుడు తండ్రి చనిపోవడంతో  తండ్రి ప్రభుత్వోద్యోగం శ్రీనిష్ కి వచ్చింది.చిన్న వయసులోనే చేతి నిండా  డబ్బు అందుబాటులో ఉండడంతో మద్యం అలవాటయింది.ఇంట్లో వాళ్ళు మానేయమని గొడవ చేసినప్పుడు మొదట్లో నాలుగు రోజులు మానేయడం మళ్ళీ మొదలు పెట్టడం చేస్తుండేవాడు.తర్వాత తర్వాత నాకు పదేపదే చెప్పొద్దు.నేను మానలేనుఇవ్వాళ చస్తే రేపటికి రెండు అంతే అనేవాడు.దానితో కాలేయం,అన్ని అవయవాలు చెడిపోయి అర్ధంతరంగా నలభై ఎనిమిదేళ్లకే చనిపోయాడు.చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో పిల్లలు పెద్దవాళ్ళయి సాంకేతిక విద్యనభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.ఇల్లు కొనుక్కున్నారు.పిల్లలు పెళ్లి చేద్దామనుకునేలోపు ఇలా జరిగింది.మిగతా అన్ని విషయాల్లో పద్దతిగా వున్నా మద్యం విషయంలో చెవిలో జోరీగలా తల్లి,భార్య చెప్పినా వినకుండా చెడ్డ అలవాటుకు బానిసై చేతులారా జీవితం నాశనం చేసుకున్నట్లయింది.జీవితంలో ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాల్సిన సమయంలో అకస్మాత్తుగా రెండు రోజుల్లో అన్నీ ముగిసిపోవడంతో బతికున్నన్నాళ్లు ఇవాళ చస్తే రేపటికి రెండు అనేవాడు.అదే విధంగా జరిగింది అంటూ ఇంట్లో అందరూ తల్లడిల్లిపోతున్నారు. 

Tuesday, 3 September 2019

ఈరోజునే ఆనందంగా ......

                                                                  నిన్నటి గడిచి పోయిన గతం కన్నా,రేపు ఏమి జరుగుతుందో తెలియని భవిష్యత్తు కన్నా, గడువుతున్న ఈరోజే ఎంతో విలువైనది.అందుకే ఎంతో విలువైన ఈరోజునే మంచి పనులు చేస్తూ మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచుతూ హాయిగా గడిపేద్దాం.

Sunday, 1 September 2019

చవితి తిథి

                                                                   మనలో చాలామందికి వినాయక చవితి నాడు తెల్లవారుఝామునే లేచి స్వామికి ఇష్టమైన పిండి వంటలు చేసుకుని పూజ ముగిసేవరకు ఏమీ తినకుండా భక్తితో ప్రశాంతంగా ఏడు గంటల నుండి తొమ్మిది  గంటల లోపే పూజ చేసుకునే అలవాటు.కానీ ఈసారి చవితి తిథి ఉదయం తొమ్మి ఇరవై రెండు నుండి వస్తుంది కనుక ఇంట్లో పూజ చేసుకునే వారు తొమ్మిది ఇరవై ఐదు నుండి పన్నెండు గంటల లోపు చేసుకోవడం మంచిదని పండితుల సలహా ఇస్తున్నారు.పెద్దల మాట వింటే సరేసరి.లేదంటే మన ఇష్టం.

వినాయక చవితి శుభాకాంక్షలు

                                                విఘ్నాలకు అధిపతి వినాయకుడు.శ్రీరస్తు,శుభమస్తు,అవిఘ్నమస్తు అనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ అంటూ ఏపని మొదలుపెట్టినా ముందుగా వినాయకుని భక్తితో పూజించి ఆయన ఆశీస్సులు తీసుకుంటాము.అంతటి మహిమాన్వితుడైనట్టి వినాయకుడు పెద్దలకు,పిన్నలకు,మీకు,మాకు,మనందరికీ ఎదుటివారినుండి నీలాపనిందలు కలుగకుండా చల్లగా కాపాడాలని,అందరికీ ఆయురారోగ్యాలను,మానసిక ప్రశాంతతను,అష్టైశ్వర్యాలను,విద్యార్థులందరికీ వారు కోరుకున్న విద్యను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,నా బ్లాగ్ వీక్షకులకు నాతోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్లలు తెలియచేస్తున్నాను.

Saturday, 31 August 2019

వారానికి ఒక రోజైనా ........

                                                               అసలే వర్షాకాలం.జోరున వానలు.వానలో ఎవరైనా ఎప్పుడో ఒకసారి తడవక తప్పదు.దీనితో జలుబు,దగ్గు,గొంతునొప్పి వంటి బాధలు తప్పవు.అన్నింటి కన్నా జలుబు పెద్ద తలనొప్పి.అందుకే ఈకాలంలొ వారానికి ఒక రోజైనా ఇంట్లోనే ఉండే వాటితో తయారుచేసే ఈ కషాయాన్ని కాఫీ,టీ  బదులు ఒక అరకప్పు తాగితే ఎంతో మంచిది.దీనికోసం ఒక పెద్ద కప్పు నీటిలో ఒక చిటికెడు మిరియాలపొడి,చిన్న దాల్చినచెక్క ముక్క,నాలుగు లవంగాలు,ఒక పది తులసి ఆకులు,ఒక బిర్యానీ ఆకు,చిన్న అల్లం ముక్క తరుగు,చిన్న బెల్లం ముక్క వేసి మరిగించి,వడకట్టి తాగగలినంత వేడిగా తాగితే వర్షాకాలంలో వచ్ఛే సమస్యల నుండి తప్పించుకోవచ్ఛు.హాయిగా వర్షాకాలంలో సరదాగా కావాలని వర్షంలో తడిచినా,అనుకోకుండా తడిచినా కూడా ఎంచక్కా సంతోషంగా ఉండవచ్చు.ఎవరి ఇష్టానికి,రుచికి తగినట్లు వాళ్ళు కొద్దిగా మార్పులు చేసుకుని ఈ కషాయాన్నిఒకసారి ప్రయత్నించండి.ఎంతో మంచిది. 

Thursday, 1 August 2019

ప్రమాదం

                                                                  మనలో కొంతమంది కోపం వఛ్చినప్పుడు తరతమ బేధం లేకుండా తమ కోపాన్ని అంతటినీ మాటల ద్వారా ఎదుటివారిపై వెళ్ళగక్కేస్తుంటారు.వీళ్ళకి మనసులో కుళ్ళు,కల్మషం ఉండదు.వీరితో స్నేహం చేసినా ఎటువంటి ప్రమాదం ఉండదు.కానీ మరికొంతమంది పైకి నవ్వుతూ అతి ప్రేమ ఒలకబోస్తూ తమకన్నా కూడా ఎదుటివారి మంచి తాము ఎంతగానో కోరుకుంటున్నట్లు నటిస్తూ మాట్లాడుతుంటారు.నిజానికి ఇటువంటి వాళ్ళ మనసు నిండా కుళ్ళు,కల్మషంతోపాటు కుతంత్రాలు.ఇటువంటి వారితో పెద్ద ప్రమాదం.వీళ్ళను అసలు నమ్మకూడదు.స్నేహం అంతకన్నా చేయకూడదు.ఒక్కొక్కసారి తెలివిగలవాళ్ళు కూడా వీళ్ళ మాయలో పడిపోయి నష్టపోయేవాళ్లు కోకొల్లలు.కనుక తెలిసి ప్రమాదంలో పడేకన్నా కొంచెం ఎవరు ఎటువంటి వాళ్ళు అన్నది గమనించి స్నేహం అయినా కొత్తగా బంధుత్వం అయినా కలుపుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్త పడడం మంచిది.

Sunday, 28 July 2019

అడవిలో ప్రయాణాన్ని తలపించేలా.....

                                                                 గ్రీష్మ కూతురు రేష్మ యు.కె  లో ఉంది.రేష్మకు వేసవిలో ఒక నెల రోజులు సెలవులు ఉండడంతోతన దగ్గరకు వఛ్చి ఉండమని కోరడంతో గ్రీష్మ కుటుంబంలో అందరూ వెళ్ళారు.విమానం దిగి రేష్మ ఇంటికి వెళుతుంటే దారి పొడుగూ అంతా పచ్చదనంతో కంటికి ఇంపుగా మనసుకు హాయిగా ప్రశాంతంగా అనిపించింది రహదారులకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు.అటు ఇటు చెట్లు మధ్యలో రహదారి.కొంత కొంత దూరం పెద్ద చెట్ల నుండి వాలిన కొమ్మలను పద్దతిగా పెంచి కత్త్తిరించడంతో పచ్చటి పందిరిలో నుండి వెళుతున్నట్లు అనిపించింది.కొద్ది దూరం రోడ్డుకి ఇరువైపులా పెద్దపెద్ద చెట్లు అడవిని తలపించేలా ఉంది.గ్రీష్మకు నిజంగా అడవిలో ప్రయాణిస్తున్న అనుభూతి.కలిగింది.అసలే గ్రీష్మకు పచ్చదనం అంటే ప్రాణం.దానితో గ్రీష్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.కళ్ళతో చూస్తే తప్ప మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి.ఎటు చూచినా పచ్చదనం.ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా ఉంది.మధ్యమధ్యలో నదులు వంతెనలు.ఎటువైపు వెళ్ళినా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తైన చెట్ల మధ్య నుండి వెళ్లడంతో ఎంచక్కా అడవిలో ప్రయాణాన్ని తలపించేలా ఉంది. గ్రీష్మ చక్కగా ప్రకృతి సోయగాన్ని,పచ్చదనాన్ని తిలకిస్తూ ప్రయాణించడం ఒక మధురానుభూతి అనుకుంది.గ్రీష్మ దీనితోపాటు మన దేశంలో కూడా ఈ విధంగా ఎత్తైన చెట్లు రహదారుల వెంట ఉంటే ఎంచక్కా ఎండల బాధ నుండి ఉపశమనాన్నీ పొందవచ్చు కదా! అనుకుంది.

Saturday, 22 June 2019

పెద్ద మనసుతో ....

                                                     జీవితంలో ఎప్పుడూ ఎదుటివారి తప్పుల్ని ఎంచుతూ కూర్చోకుండా,పెద్ద మనసుతో క్షమిస్తూ,గతాన్ని మరిచి,భవిష్యత్తులోకి తొంగి చూస్తూ,వర్తమానంలో ప్రశాంతంగా,ఆనందంగా జీవించగలిగితే ఆరోగ్యంతోపాటు ఆయుషు కూడా పెరుగుతుంది.

వడ్డీ ముచ్చట్లు

                                                                    అసలు కన్నా వడ్డీ ముద్దు అని పెద్దలు చెప్పినట్లుగానే అమల మనవరాలు పుడుతుందని తెలియగానే అమెరికా వెళ్ళి కూతురుకు పురుడు పోసి ఐదవ నెల రాగానే మనవరాలిని తనతో తీసుకొచ్చింది.రోజూ పొరుగునే ఉన్న విమలకు మనవరాలు మాన్వి ముచ్చట్లు చెప్పింది చెప్పకుండా చెప్పడం మొదలు పెట్టింది.మాన్వి సన్నగా చిన్నగా ఉండడంతో ఏడవ నెలకే బాగా ప్రాకడం మొదలు పెట్టింది.విమలగారూ మాన్వి దొంగ - పోలీసు ఆట భలే ఆడుతుంది.దొంగను పట్టుకో దొంగను పట్టుకో అనగానే వేగంగా ప్రాకుతుంది.మధ్య మధ్యలో ఆగి వెనక ఎవరైనా వస్తున్నారో రావట్లేదో అని చూచి మమ్మల్నిచూడగానే మళ్ళీ వేగంగా వెళ్ళి సోఫా పక్కన కూర్చుంటుంది.మాన్వి తెలివిగలది కావడంతో ఎనిమిదవ నెల వచ్చేటప్పటికి  చేతులతో సైగలు చేస్తూ ముఖంలో రకరకాల హావభావాలు పెడుతుంది.తొమ్మిది  వచ్చేటప్పటికి ఏదో ఒక మూలకు వెళ్ళి కూర్చుని ఆడించమని చేతితో సైగ చేస్తూ కవ్విస్తుంది.నిజంగా దాన్ని చూస్తుంటే  ఎంత ముద్దు వస్తుందో అంటూ వడ్డీ ముచ్చట్లు చెప్పి మురిసిపోతుంది.పిల్లలు కూడా అలాగే ముద్దుగా చేస్తారు.పెద్దలు చెప్పినట్లు అసలు కూతురు కన్నా మనవరాలు వడ్డీయే ముద్దు కదా!అనుకుంది విమల.  

Friday, 14 June 2019

పిల్లల భాదిత సంఘం

                                                       సుశ్రుతి వీసా కోసం కుటుంబంతో కలిసి యు.కె దౌత్య కార్యాలయానికి వెళ్ళింది.అప్పటికే అక్కడ ఒక అరవై మంది ఉన్నారు.సుశ్రుతి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నకాసేపటికి ఒక పెద్దాయన మాటలు కలిపి పరిచయ కార్యక్రమాలయ్యాక మాటల మధ్యలో మేమందరమూ పిల్లల బాధిత సంఘం సభ్యులము అంటూ అందరినీ పరిచయం చేశారు.అందరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.అందరూ కలిసి ఒక్కొక్కసారి కొన్నికొన్ని దేశాలు చొప్పున చూడటానికి వెళ్తుంటాము అని చెప్పారు.సుశ్రుతి ఆశ్చర్యంగా ఆయనను చూచేసరికి అదేనమ్మా మా పిల్లలందరూ చదువుకుని మళ్ళీ మన దేశానికి వచ్చేస్తాము అని చెప్పి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు.ఏమి చేస్తాము?మేమందరము కలిసి ఇలా సంవత్సరానికి ఒకసారి దేశాలు పట్టుకుని ముఖ్యమైన ప్రదేశాలు తిరుగుతున్నాము అని చెప్పారు.వాళ్ళు ఇక్కడికి రారు మేము అక్కడ ఉండలేము.ఇక్కడి డబ్బు వాళ్ళకి అవసరం లేదు.అందుకే ఈ వీసా తిప్పలు.మేమందరమూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరం అండగా ఉంటాము.సంతోషం అయినా,బాధ అయినా అందరం కలిసే పంచుకుంటాము.ఒకవైపు పిల్లలు దగ్గర లేరనే బాధ ఉన్నా ఇంకో వైపు ఇలా మేము అందరం కలిసిమెలిసి ఉండడం సంతోషాన్నిస్తుంది అని ఆయన చెప్పారు.పిల్లలు దూరాన ఉన్నారని ఈ వయసులో ఎలా ఉండాలో?అని బాధపడుతూ కూర్చోకుండా అందరూ సరదాగా,సంతోషంగా ఉండడం చాలా బాగుంది అని సుశ్రుతి చెప్పింది.బాధని కూడా సంతోషంగా సానుకూల ద్రుక్పధంతో అనుకూలంగా మార్చుకోవడమే కాక చతురతతో మాట్లాడడం సుశ్రుతికి బాగా నచ్చింది.పిల్లలు దగ్గర లేకపోయినా మలి వయసులో మా పరిస్థితి ఎలా?అనుకునే తల్లిదండ్రులకు,అమ్మానాన్న ఎలా ఉన్నారో?అని బాధపడే పిల్లలకు స్పూర్తిదాయకం అనుకుంది సుశ్రుతి.

Monday, 10 June 2019

ఒక్కసారి ఆలోచించండి

                                                                  ఈమధ్య ఎక్కువ మంది తమ బిడ్డ కడుపులో పడ్డ నాటి నుండి వాళ్ళను ఎంత గొప్పగా పెంచి అందరికన్నా గొప్ప వాళ్ళను చేసి అందలం ఎక్కిద్దామా అని అదే పనిగా ఆలోచించి తెగ హైరానా పడుతున్నారు.మరి మన అమ్మానాన్నలు అంతకన్నా ఎక్కువ కష్టపడితేనే కదా!మనము ఇంత వాళ్లము అయింది అని ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది.ఇప్పుడున్న సౌకర్యాలు,అవకాశాలు కూడా అప్పట్లో అందుబాటులో ఉండేవి కాదు.ఈ రోజుల్లో ఆదాయం పెరిగింది కనుక పిల్లలు ఆడింది ఆట పడింది పాటగా అడిగిందే తడవుగా కొండ మీద కోతిని కూడా తెచ్చి ఇవ్వగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.కానీ ఈ హడావిడి జీవితాల్లో పిల్లల కోసం ఎంత మంది తగిన సమయాన్ని కేటాయించి పూర్తి ప్రేమ,ఆప్యాయతను పంచగలుగుతున్నారు?మన అమ్మ చెప్పేది సొల్లు,నాన్న చెప్పేది సోది అనుకునే రోజులు.అమ్మానాన్నలు,అవ్వాతాతలు మిగిలిన బంధువర్గంతో కలిసిమెలిసి ఉండి అందరి మధ్య పెరగడంతో వాళ్లందరూ ఎన్నో మంచి బుద్దులు,సంస్కారం నేర్పితేనే పెద్ద వాళ్ళను పట్టించుకోవట్లేదు కొంతమంది.అమ్మానాన్నలతో మాత్రమే కలిసి ఉండే ఇప్పటి పిల్లలకు వెనుకటి ప్రేమ,ఆప్యాయతల విలువ ఏమి తెలుస్తుంది?అప్పట్లో అందరితో కలిసి పెరగటంతో చిన్నప్పటి నుండే సర్దుబాటు తత్వం,ఉన్నదానిలోనే  ఎదుటివారితో కలిసి పంచుకుని తిందాం అనే  ఆలోచన ఉండేది.అటువంటి కుటుంబ నేపధ్యంలో పెరిగి కూడా ఇప్పుడు తల్లితండ్రి అని కూడా పట్టించుకోవడంలేదు.రక్తసంబంధీకుల్లోనే ఎదుటివారిది కూడా తామే లాగేసుకుని తినేసేలా  ఉంది ఇప్పటి పరిస్థితి.నేను,నాది,నా పిల్లలు మాత్రమే అనే స్వార్ధం ఎక్కువైపోయింది.ఈరోజు మనం చేసినట్లే రేపు వాళ్ళు కూడా చేస్తారు కదా!అందుకే అటువంటి ఇరుకు మనస్తత్వాన్ని,సంకుచిత స్వభావాన్నివదిలిపెట్టి విశాల దృక్పధాన్ని అలవర్చుకుని పిల్లలకు కూడా చదువుతోపాటు పెద్దలు,తోటివారి పట్ల గౌరవం, సంస్కారం,సంప్రదాయాలు నేర్పితే పిల్లలకు పెద్దలకు కూడా ఎంతో శ్రేయస్కరం.మనం ఎంత డబ్బు ఇచ్చాము అన్నది లెక్క కాదు.ఎంత సంస్కారవంతంగా పెంచాము అన్నది లెక్క.మనకు పిల్లలు ఎంతో పెద్దలు కూడా అంతే ముఖ్యం కదా!ఒక్కసారి ఆలోచించండి.దీన్ని చదివి కొంతమందిలో అయినా మార్పు వస్తుందని  ఆశిస్తున్నాను.

Thursday, 6 June 2019

భుజంపై రామచిలుక

                                              ఆధ్య గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఒక వింత చోటు చేసుకుంది.ఆధ్య కుటుంబం పూజ చేయించుకునేటప్పుడు భార్యాభర్తలిద్దరు దైవదర్శనానికి వచ్చారు.భార్య భుజంపై ఒక రామచిలుక నిలబడింది.ఇంతలో చిలుకను చూడగానే ఆధ్య అమ్మమ్మ కంగారుగా అమ్మా!నీ భుజంపై చిలుక వాలింది అని చెప్పింది.వాళ్ళాయన కల్పించుకుని మామ్మగారూ అది మా పెంపుడు చిలుక అని చెప్పాడు.మేము ఎక్కడికి వెళ్తే అక్కడకి మాతోపాటు వస్తుంది.మోటారు సైకిలుపై దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా మా ఆవిడ భుజంపై కదలకుండా అలాగే కూర్చుంటుంది.మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని కూడా తీసుకుని వెళ్తాము అన్నాడు.దీన్ని మూడు సంవత్సరాల నుండి పెంచుకుంటున్నాము అని చెప్పాడు.దీని పేరు స్వీటి.పిల్లలు ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండడంతో మాకు స్వీటితో మంచి కాలక్షేపం అని చెప్పాడు.రామచిలుక కూడా ఏమాత్రం నదురుబెదురు లేకుండా అటుఇటు తల త్రిప్పుతూ పరీక్షగా అందరినీ గమనిస్తూ కూర్చుంది.వాళ్ళావిడ మాత్రం తన భుజంపై చిలుక ఉందని అందరూ తననే గమనిస్తున్నారని ఒకింత గర్వంతో గంభీరంగా ఉంది.                      

Monday, 3 June 2019

హావభావాలు

                                                        పూర్వం రోజుల్లో బిడ్డ పుట్టేవరకు ఆడబిడ్డో,మగబిడ్దోతెలిసేది కాదు.సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఇప్పుడు 4 D స్కానింగుల పుణ్యమా అని బిడ్డ ఏ విధంగా,ఎవరి పోలికలతో ఉంటుందని కూడా తెలిసిపోతుంది.స్కానింగ్ తీసేటప్పుడు బిడ్డల రకరకాల హావభావాలు ముచ్చట కొల్పుతున్నాయి.ఈమధ్య తెలిసినవాళ్ళ  పాప స్కానింగ్ తీయించుకోవడంతో గర్భం లోపల ఉన్నప్పుడు కూడా చంటి బిడ్డల మాదిరిగానే బోసి నవ్వులు స్కానింగు  తీసేటప్పుడు కదిలించడంతో ఒత్తిడి తగిలి విసుగు,కోపం,చిరాకు వంటి హావభావాలను బిడ్డ ప్రదర్శించడంతో అమితాశ్చర్యం కలిగి వింతగా,విచిత్రంగా అనిపించింది.నిజంగా సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందన్న విషయాన్ని ప్రత్యక్షంగా చూడడంతో ఆ సమాచారం అందరికీ తెలియచేద్దామని  ఈ పోస్టు పెట్టడం జరిగింది. 

తొందరపడి ....

                                                       తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు తొందరపడి నోరు జారితే అది ఎదుటివారి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది.కొంతమంది అంతగా పట్టించుకోకపోయినా కానీ సున్నిత మనస్కులు దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని అన్నవాళ్లు కనిపించినప్పుడల్లా బాధపడుతుంటారు.ఒకసారి అన్నమాటను తిరిగి వెనక్కు తీసుకోలేము కనుక తొందరపడి ఎవరినీ మాట్లాడకూడదు.ఎదుటివారిని ఎప్పుడూ కూడా అనవసరంగా  బాధ పెట్టకూడదు.అలా చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఇంకొకరితో అనవసరంగా అనిపించుకుని ఎప్పుడో ఒకసారి బాధపడవలసి వస్తుంది.ఆ ఏముందిలే ఏదో చెబుతుంటారు అనుకోవచ్చేమో కానీ ఇది నిజం.

Wednesday, 22 May 2019

అలనాడు - ఈనాడు

                                                                   మహాలక్ష్మమ్మ గారి ఇంటి నిండా ఎప్పుడూ ఖాళీ లేకుండా వచ్చేపోయే జనాలు.ఇంట్లో కొడుకు,కోడలు,పిల్లలు తోపాటు పనివాళ్ళు ఎప్పుడూ ఉంటారు.మహాలక్ష్మమ్మ గారే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అరవై ఐదేళ్ళ వయసులో కూడా కాఫీ,టీ,అల్పాహారం,భోజనం ఏర్పాట్లు చూస్తుంటారు.ఈమధ్య కాస్త నలతగా ఉండడంతో ఇంతకు ముందు మాదిరిగా హుషారుగా  తిరగలేక పోవడంతో పరామర్శించడానికి వచ్చేపోయే  బంధువులు,స్నేహితులు నీకేమమ్మా!కాలు క్రింద పెట్టనవసరం లేదు.నోట్లో నుండి మాట బయటికి రావడం ఆలస్యం ఏది కావాలంటే అది మంచం దగ్గరకే తెచ్చి అందించటానికి అందరూ ఉన్నారు అనడం మొదలెట్టారు.ఎంత మంది ఉన్నా ఏమి లాభం? చుట్టూ సముద్రం నీరు ఉన్నా త్రాగడానికి గుక్కెడు నీరు కూడా పనికిరానట్లు అవసరానికి ఎవరూ అందుబాటులో ఉండరు.మహాలక్ష్మమ్మగారి కోసమే ఒక ఆమెను ప్రత్యేకించి పెట్టారు.ఆమె ఎప్పుడు చూసినా చరవాణి చేతపట్టుకుని వదలదు.పిలిచిన గంటకు వచ్చి పిలిచారా మామ్మగారూ?అంటూ వస్తుంది.ఈలోపు శోష వచ్చేస్తుంది.ఎవరి గొడవ వారిదే.కాలు చెయ్యి బాగుండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వారి పని కూడా మనమే చేసిపెడితే అందరికీ సంతోషం మనకు కూడా సంతోషం.ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎదురింటి వాళ్ళు,పక్కింటి వాళ్ళు,వెనకింటి వాళ్ళు అందరూ వంతులవారీగా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు.ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత వెదికినా మచ్చుకైనా కనబడటం లేదు.ఈరోజుల్లో అయితే పలకరింపుకు వెళ్ళాలన్నావెళ్తే ఎక్కడ వారి అనారోగ్యం తమకు చుట్టుకుంటుందో అని బెరుకుగా వెళ్ళి మొక్కుబడిగా ఒక 5 ని.లు కనిపించి వెళ్ళిపోతున్నారు.ఏదేమైనా కానీ మునుపటి రోజులు పోయాయి.మళ్ళీ అలనాటి  అభిమానం,ఆప్యాయత,ప్రేమ ఈనాడు కూడా అందరిలో ఉంటే ఎంత బాగుంటుందో?!అని మహాలక్ష్మమ్మగారు అనగానే అవునవును అంటూ వంతపాడారు స్నేహితురాళ్ళు.వాళ్ళతోపాటు మనము కూడా ఎదురు చూడడమే కాక తప్పకుండా రావాలని కోరుకుందాము.

Wednesday, 15 May 2019

అప్పటికీ ఇప్పటికీ

                                                                      చదువుకునే రోజుల్లో రోహిణి,బ్రహ్మాజీ ప్రక్కప్రక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళు.బ్రహ్మాజీ చిన్నవాడు అవడంతో అక్కా,అక్కా అంటూ రోహిణి చుట్టూ తిరుగుతుండేవాడు.దానికి తోడు బ్రహ్మజీకి ఇద్దరూ అన్నలే కనుక రోహిణి అంటే వాడికి చాలా ఇష్టం.రోహిణి పైచదువుల కోసం వెళ్ళడం తర్వాత పెళ్ళి,పిల్లలు ఎవరి గోల వాళ్ళదే.అనుకోకుండా ఒక రోజు తెలిసిన వాళ్ళ ఇంట్లో బ్రహ్మాజీ కనిపించి మీరు రోహిణి అక్కేనా? అని తనను తను పరిచయం చేసుకున్నాడు.మాటల మధ్యలో అక్కా చిన్నప్పుడు పాఠశాలకు,ప్రైవేటుకు తిరగడం వల్ల నీ చెప్పులు త్వరగా అరిగిపోయేవి కదా!అని చిన్ననాటి కబుర్లు చెప్తూ ఇప్పుడు కూడా చెప్పులు అంతే అరిగిపోతున్నాయా?అని అడిగాడు.లేదయ్యా!ఇప్పుడు వచ్చేపోయే బంధువులకు వంటావార్పు చేసి మర్యాదలు చేయడంతో చెప్పుల బదులు కాళ్ళు అరిగిపోతున్నాయి.అప్పటికీ ఇప్పటికీ అదే తేడా అని చెప్పింది రోహిణి.బ్రహ్మాజీ పకపక నవ్వుతూ అక్కా ఏది ఏమైనా కానీ అప్పటికీ ఇప్పటికీ నువ్వు,నీ మాట తీరు ఏమాత్రం మారలేదు అని చెప్పాడు.కాసేపు చిన్నప్పటి కబుర్లు చెప్పి వెళ్తూ వెళ్తూ తన ఇంటికి రమ్మని ఆహ్వానించి రోహిణి వద్ద శెలవు తీసుకున్నాడు.      

Sunday, 12 May 2019

అమృతమూర్తి

                                                        సంబంధ బాంధవ్యాల్లో ఎక్కువ శాతం స్వార్ధపూరితాలే కానీ అమ్మ ప్రేమ ఒక్కటే అందుకు మినహాయింపు.నిష్కల్మషమైన ప్రేమ అమ్మ స్వంతం.అందరికన్నా ముందు లేచి ఆఖరికి పడుకుంటూ ఆరోగ్యం బాగా లేకున్నా పనిచేస్తూ మనసు నొచ్చుకున్నా నవ్వేస్తూ అందరికీ అన్నీ అమర్చడం అమ్మకే సాధ్యం.అత్మీయతకు చిరునామా అమ్మ.ముమ్మాటికీ అమ్మకి అమ్మే సాటి.అమ్మ తన పిల్లలకే కాక పిల్లల పిల్లలకు కూడా సేవ చేసే అమృతమూర్తి.నిస్వార్ధంగా పిల్లల కోసం చేసే త్యాగాలు చాకిరీలకు అంతూదరీ ఉండదు.ఇంటి పనులకు విరామం విశ్రాంతి అనేది ఉండదు కదా!అమ్మ బాధ్యత మహా కష్టమైనది,క్లిష్టమైనది.అమ్మ ఓర్పుకి,నేర్పుకీ,నైపుణ్యానికి,ప్రేమకు ఏమి అవార్డు ఇవ్వగలం?అమ్మ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది.అమ్మకోసం కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు.అలసిసొలసిన వయసులో అమ్మను ప్రేమతో చూసుకోవడం మన బాధ్యత.అమ్మ సంతోషమే మనకు ఎంతో సంతృప్తి.కాసేపు అమ్మతో గడిపితే కొండంత  ప్రేమ మన స్వంతమవుతుంది.స్వేచ్చగా ,సంతోషంగా మనసులోని భావాలన్నీ పంచుకోగలిగేది ఒక్క అమ్మతో మాత్రమే.అమ్మతో మాట్లాడితే ఎక్కడ లేని నిశ్చింత.మనసుకి ప్రశాంతత.తరాల అంతరంతో ఎవరైనా అమ్మా నీకేమీ తెలియదు నువ్వు మాట్లాడకు అని కసిరితే  వాళ్ళ పిల్లలతో తిరిగి కసిరించుకోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకుంటే మంచిది.పెద్దయ్యాక పిల్లలు ఆర్ధికంగా ఎదిగితే కుళ్ళు కుతంత్రాలు లేకుండా సంతోషపడేది ఒక్క అమ్మ మాత్రమే.దేశానికి రాజు అయినా అమ్మకు కొడుకే అన్నట్లు ఎవరు ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా అమ్మకు కొడుకు,కూతురు మాత్రమే.ఆ అమృతమూర్తికి సంతోషంగా,ప్రేమతో సేవ చేసే భాగ్యాన్ని,సమయాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని ఈరోజే కాకుండా ప్రతిరోజు మాతృదినోత్సవం అనుకోవాలని కోరుకుంటూ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.   

Monday, 6 May 2019

వేసంగి నేస్తం

                                                                   వేసవి వచ్చిందంటే ఏమి తిన్నా తినకపోయినా చల్లటి మంచినీళ్ళు ఉంటే చాలు అనిపిస్తుంది.ఇంటికి వచ్చిన అతిధులకు రాగానే చల్లటి మంచి నీళ్ళు ఇస్తే ఎంతో సంతోషపడతారు.కుండ నీరు అయితే మరీ సంతోషం.ఇంతకీ వేసంగి నేస్తం ఏమిటంటే మంచి నీటి మట్టి కుండ.కుండలో ఒక రాగి పాత్ర కూడా  వేస్తే నీళ్ళు శుభ్రం అవుతాయి.వేసవిలో ఈ  నీరు త్రాగడం ఉత్తమం.దప్పిగొన్నవారికి గుక్కెడు నీళ్ళు ఇస్తే అన్ని బాధలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి.వీలయితే పక్షులకు,జంతువులకు కూడా వేసవిలో తాగడానికి మట్టి పాత్రల్లో నీళ్ళు పెట్టడం ఎంతో మంచిది.ఇప్పుడు చాలామంది వెనుకటి రోజుల్లో మాదిరిగా మట్టి పాత్రలో వండి వడ్డించడానికి,వాటిల్లో తినడానికి ఇష్టపడుతున్నారు.మట్టి కుండలో నీరు,మట్టి పాత్రలో వండిన పదార్ధాలు రుచితో పాటు ఆరోగ్యదాయకం.వీలయితే ప్రయత్నించండి. 

రారమ్మని ....

                                                                  అక్షయ తృతీయ నాడు రవ్వంత మంచి చేసినా కొండంత పుణ్యం దక్కుతుంది.అలాగే చెడ్డ పనులు చేసినా అంతే ఎప్పటికీ తరగని పాపం దక్కుతుంది.ఈరోజు కొంచెమైనా,ఎక్కువైనా అవసరమున్న వారికి దానం ఇవ్వడం వలన వందరెట్లు అధిక ఫలం ఉంటుంది.ఈరోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి పూజ,దర్శనం ఎంతో మంచిది.అలాగే ఈరోజు బంగారం కొనడం సంప్రదాయంగా మారింది.బంగారమే కొనాలని ఏమీ లేదు.రాగి కొంటే రారమ్మని బంగారాన్ని,వెండిని తన వెంట తెస్తుందని మనకు తెలియని విషయం.ఈమధ్యనే ఒక అమ్మ ద్వారా తెలియడంతో ఈ రోజు రాగి ఇంటికి కొని తెచ్చుకోవడం ఉత్తమం అనిపించింది. 

Wednesday, 1 May 2019

నామ్మా!డబ్బాలు పట్టుకెళ్ళు

                                                        ద్వివేద్ ఆరు సంవత్సరాల అల్లరి పిడుగు.దీనికి తోడు కబుర్ల పుట్ట.అమ్మానాన్నలు విదేశాలలో ఉండడంతో ద్వివేద్ కొన్ని రోజులు నానమ్మ తాతయ్యల వద్ద పెరిగాడు.దీనితో వాడికి వాళ్ళంటే చాలాచాలా ఇష్టం.ద్వివేద్ నానమ్మను నామ్మా!అని పిలిచేవాడు.ద్వివేద్ కి తమ్ముడు పుట్టడంతో ఇద్దరి మనవళ్ళతో కోడలికి కష్టం అని నానమ్మ ద్వివేద్ ని చూచుకోవడానికి వెళ్ళింది.కొన్ని నెలల తర్వాత  నానమ్మ తిరుగు ప్రయాణం అవుతుంటే ద్వివేద్ నామ్మా!నువ్వు వెళ్లొద్దు ఇక్కడే ఉండిపో అని ఒకటే ఏడుపు.ఏడవకు నాన్నా!మనకు మన ఊరిలో పొలాలు,ఇళ్ళు ఉన్నాయి కదా!అక్కడ తాతయ్యకు కూడా ఇబ్బంది. అందుకే మళ్ళీ పనులు చూచుకుని తాతయ్య,నేను వస్తాము అని చెప్పింది.అప్పుడు ద్వివేద్ కళ్ళు తుడుచుకుని నామ్మా!నేను పెద్దపెద్ద డబ్బాలు ఇస్తాను.వాటిని పట్టుకెళ్ళి పొలాలు,ఇళ్ళు వాటిల్లో పెట్టుకుని ఇక్కడకు తీసుకుని రా!ఇక్కడే అందరం ఉండిపోవచ్చు అన్నాడు.ఒక్క క్షణం నోట మాట రాక నానమ్మ వాడి మద్దుముద్దు మాటలకు నవ్వుకుంటూ పొలాలు,ఇళ్ళు డబ్బాల్లో తేవడానికి కుదరదు నాన్నా!వాటిని అక్కడే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పింది.అలాగయితే పనులు అయిపోగానే త్వరగా వచ్చేయండి నామ్మా!మీకోసం ఎదురుచూస్తాను అని సంతోషంగా వీడ్కోలు చెప్పాడు.

Tuesday, 23 April 2019

క్షణభంగురం

                                                      మనకన్నా పై మెట్టు మీద ఉన్న వాళ్ళను చూచి ఈర్ష్య పడడం  మన కన్నా క్రింది మెట్టుపై ఉన్నవాళ్ళను చూచి మేమే గొప్పగా పైన ఉన్నామని గర్వపడడం కొంతమంది మానవుల సహజ లక్షణం.రెండు లక్షణాలు కూడా ప్రమాదకరమే.ఈ రోజుల్లో కొంత మంది పై విధంగానే ప్రవర్తిస్తున్నారు.అందులో ఒకడు జీవన్. జీవితం క్షణభంగురం అని జీవన్ లాంటి వాళ్ళకు అర్ధం కాదు.జీవన్ అతనితోపాటు అతని భజనగాళ్ళు దీన్ని మర్చిపోయి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అహంకారంతో విర్రవీగుతూ దురుసుగా ప్రవర్తిస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ,ప్రక్కవాళ్ళకు తగువులు పెట్టి వాటిని వాళ్ళే తీర్చడం చేస్తూ ఉంటారు.ఇవి చాలవన్నట్లు దీనికి తోడు ఈమధ్య కొంగ్రొత్త ధోరణి మొదలెట్టాడు.ఆడపిల్లలకు పసుపు కుంకుమల క్రింద తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్థి రేటు పెరిగేసరికి జీవన్ కి దుర్బుద్ధి పుట్టి తన భజనగాళ్ళను వేసుకుని  ఆ ఆస్తులు కాజేయాలని ఈ ఊరి వాళ్లందరూ ఆడపిల్లలకు ఆస్తులు దోచిపెడతారని,మగపిల్లలకు అన్యాయం చేస్తారని తల్లిదండ్రుల్ని,ఆస్తులు దోచుకుని వెళ్తారని ఆడపడుచుల్ని పిచ్చితిట్లు తిట్టడం మొదలెట్టాడు.డబ్బు పిచ్చి నషాళానికి అంటినట్లు పెళ్లిళ్లకు పేరంటాళ్ళకు వెళ్ళినా బంధువులు అందర్నీ సమావేశపరిచి ఒకటే పిచ్చిగోల.ఇతన్ని చూచి జీవన్ బాటలో మరి కొంతమంది ఆశపరులు తయారయ్యారు.ఇదే నేటి సరి కొత్త ధోరణి అనుకుంటున్నారు.అత్యాశతో తను చేస్తున్న పని,మాట్లాడే మాటలు చాలా తప్పని తెలుసుకునేటప్పటికి జీవితంలో ఏమీ మిగలదు.తన వాళ్ళందరి మనస్సుల్లోస్థానం కోల్పోవటం తప్ప.తర్వాత ఎంత కావాలనుకున్నా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అయిపోతుంది.తాత పళ్ళెం తలవైపే ఉంటుందని మనం ఏమి చేస్తే మన పిల్లలు కూడా అంతకన్నా ఎక్కువగా అదే తరహాలో ఉంటారని జీవన్ లాంటి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది.తల్లిదండ్రుల్ని,ఆడపడుచుల్ని తిట్టకూడదని తిడితే జీవితంలో పైకి ఎదగరని ఆయాచితంగా ఎదుటి వారి సొమ్ము కోసం ఆశించకుండా ఒళ్ళు వంచి ఉన్న కాస్త సమయాన్ని మంచిపనులకు ఉపయోగిస్తూ సత్ప్రవర్తనతో ఉంటే జీవన్,అతని చుట్టూ ఉన్నవాళ్ళకే కాక వినే వాళ్ళకు,ఇంట్లో వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది.                                                                                                                                                          

Saturday, 13 April 2019

శ్రీరామనవమి శుభాకాంక్షలు

                తెలుగు వారి బ్లాగు వీక్షకులకు,తోటి బ్లాగర్లకు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,భారతీయులకు(ఏదో ఒక రూపంలో శ్రీ రామనవమి చేస్తుంటారు కదా)మన తెలుగువారందరికీ సీతారామ లక్ష్మణ అంజనేయస్వాముల కరుణ కటాక్ష వీక్షణాలు,వారి దీవెనలు ఎల్లవేళలా మన అందరియందు ఉండాలని శిరసు వంచి నమస్కరించి అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో,సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని  మనసారా కోరుకుంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.  

Friday, 5 April 2019

ఉగాది శుభాకాంక్షలు

                                                          నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లార్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,ప్రపంచంలో ఎక్కడ  స్థిరపడినా కానీ మన తెలుగు వారందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.మళ్ళీ ఉగాది వచ్చేవరకు అందరూ సంతోషంగా ఉంటూ మానసికంగా,శారీరకంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ధన కనక వస్తు వాహనాలను  సమకూర్చుకోవాలని,ఇలాంటి మరెన్నో ఉగాది పండుగలకు స్వాగతం పలకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 

సంతోషాల సంవత్సరాది

                                                                              వసంత రుతువులో కొత్త చిగుళ్ళతో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో శుద్ధ పాడ్యమి రోజు వచ్చేదే తెలుగు వారి సంవత్సరాది.మావి చిగుర్లు తిన్న కోయిల కుహు కుహులతో సమ్మోహనంగా ఆహ్వానం పలగ్గానే ఉరుకులు పరుగులుతో సంతోషాలను మోసుకొచ్చేదే ఉగాది.అభ్యంగన స్నానానంతరం దేవతార్చనతో శ్రీవికారి నామ సంవత్సరాన్ని స్వాగతించి షడ్రుచుల ఉగాది పచ్చడి నివేదించాలి.గుమ్మాలకు మామిడి తోరణాలు,కొత్త బట్టలు,పిండి వంటలు సరే సరి.మనం తలపెట్టిన కార్యక్రమాలకు శుభ ఫలితాలు కలగాలని కోరుకుని ఉగాది పచ్చడి స్వీకరించాలి.వేప పూవుతో చేసిన ఈ పచ్చడి తినడం వలన సర్వారిష్టాలు తొలుగుతాయి.ముఖ్యంగా కష్టం సుఖం అనే తేడా లేకుండా అన్నీ సమ దృష్టితో చూడాలన్నదే సంకేతం.పంచాంగ శ్రవణం వింటూ బంధు మిత్రులతో రాశి ఫలాలు చర్చిస్తూ సరదాగా సంతోషంగా గడిపేయాలి.సంవత్సరాది నాడు ఎంత సంతోషంగా గడిపితే అంత సంతోషంగా మళ్ళీ సంవత్సరాది వచ్చే వరకు జీవితం హాయిగా సాగిపోతుందని పెద్దల ఉవాచ.అంతే కాదు అది అందరి నమ్మకం. 

Monday, 1 April 2019

మరువం మధురం

                                                                      చిన్నప్పుడు వారిజ ఇంటి చుట్టూరా నలువైపులా అన్ని రకాల మొక్కలు ఉండేవి.మల్లె పందిరి ప్రక్కనే ఒక పెద్ద మడిలో మరువం,చిన్న మడిలో ధవనం ఉండేవి.ఆ రోజుల్లో మరువం,ధవనం మొక్కలు అందరి ఇళ్ళల్లో ఉండేవి కాదు.వారిజకు ధవనం కన్నా మరువం వాసన బాగుంటుంది.మరువం కొమ్మలు పెరిగి క్రిందికి వాలగానే ఆ కొమ్మలపై కొద్దిగా మట్టి పెడితే ఇంకో మొక్క అయ్యేది.అలా చెయ్యడం వారిజకు ఎంతో ఇష్టంగా  సరదాగా ఉండేది.ఇంటికి వాటిని చూడడానికి స్నేహితురాళ్ళు,ఇరుగుపొరుగు పిల్లలు వచ్చేవాళ్ళు.తన ఇంట్లో మాత్రమే మరువం ఉన్నందుకు వారిజకు ఒకింత గర్వంగా కూడా ఉండేది.అప్పట్లో వేసవి వచ్చిందంటే చాలు ఊరిలో ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా మేము ముందంటే మేము ముందనిమరువం,పువ్వుల కోసం పోటిపడి మరీ పూలజడ వేసుకునేవారు.పూలజడకు ప్రత్యేకంగా పొడుగు కదా ఉండే దొంతర మల్లెపువ్వులు,మరువం,కనకాంబరాలు వారిజ ఇంటి నుండే అందరూ తీసుకెళ్ళి వేసుకునేవాళ్ళు.వారిజకు మరువం గురించి చదవగానే ఆనాటి మధురస్మృతులు గుర్తొచ్చాయి.ఎటువంటి తలనొప్పి అయినా మరువం ఆకులు వాసన చూడగానే యిట్టె తగ్గిపోతుందని,తలలో పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదని పెద్దవాళ్ళు అనుకునేవారు.ఇది ఒక ఔషధ మొక్క అని, దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఈ మధ్యనే ఒక పుస్తకంలో వారిజ చదివి ఆశ్చర్యపోయింది.ఇప్పుడు వారిజ ఎన్నిసార్లు తెచ్చి పెట్టినా మరువం మొక్కని బ్రతికించలేకపోతుంది.ఆకు వాసనతో నిద్ర బాగా పడుతుందని ఒక కప్పు నీళ్ళల్లో కొద్దిగా మరువం ఆకులు వేసి మరిగించి త్రాగితే ఆడవాళ్ళ నెలసరి సమస్యలన్నీ తగ్గిపోతాయని, మధుమేహం,గుండె జబ్బులు వంటివి దరిచేరవని,రక్త ప్రసరణ వేగం అదుపులో ఉంటుందని వైద్యులు తెలియచేస్తున్నారు.వెంకటేశ్వరస్వామికి కూడా తులసిమాల,దళాలతో  పూజ చేసినట్లే మరువంతో కూడా  చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుందని పెద్దలు తెలియ చేస్తున్నారు.ఏదేమైనా తనకు ఎంతో ఇష్టమైన మరువం మధురం అంటుంది వారిజ.   

Thursday, 28 March 2019

మెలేసి

                                                                     అర్పిత వయసు సరిగ్గా ఆరేళ్ళు.ఆరింద లాగా ఎన్నో కబుర్లు అన్నీ తనకే తెలిసినట్లు చెబుతుంది.ఒకరోజు అమ్మమ్మలు,నానమ్మలు అందరూ కూర్చుని ఉండగా అర్పిత అమ్మ ఆశ్రిత కూడా వచ్చి కూర్చుంది.ఇంతలో పక్కింటి ఆమె రెండు ములక్కాయలు తెచ్చి ఆశ్రిత చేతిలో పెట్టింది.మాటల్లో అర్పితకు ములక్కాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పింది.బట్టలను అటు తిప్పి,ఇటు తిప్పి మెలేసి పిండినట్లుగా  ములక్కాయ ముక్కను నోట్లోనే అటు తిప్పి ఇటు తిప్పి మెలేసి నమిలి నమిలి తింటుందని,కింద పడెయ్యవే! అని కోప్పడే వరకు  నములుతూనే ఉంటుందని సరదాగా చెప్పింది. 

Tuesday, 26 March 2019

చిలకలేరు

                                                                ధన వత్సల ఇంట్లో పనిచేస్తుంది.ఏ విషయాన్నైనా సరదాగా అభినయిస్తూ నవ్వు తెప్పించే విధంగా చెబుతుంది.ధన కబుర్లు వత్సలకు మంచి కాలక్షేపం.ధన ఒకరోజు హడావిడిగా పనికి వస్తూనే అమ్మా!మా ఇంట్లో ఎలుకలు ఎవరినీ నిద్ర పోనీయటం లేదు.రాత్రి,పగలు అని కూడా తేడా లేకుండా  వాటి ఇష్టం వచ్చినట్లు స్వైర విహారం చేస్తున్నాయి.మొన్న మధ్యాహ్నం నిద్రపోతుంటే మా అక్క బొటన వ్రేలు కొరికింది.నేను నిన్న రాత్రి నిద్రపోతుంటే నా చిలకలేరు కొరికేసింది అని చెప్పింది.ఏదో సలుపుతున్నట్లు ఉంది  అని చూద్డును గందా!ఎలుక గీరింది అంది.చిలకలేరు కొరకటమేమిటి ధన?అంటే ఇదిగోనమ్మా! అంటూ చిటికెన వ్రేలు చూపించింది.ఓరి నీ దుంప తెగ!చిలకలేరు అంటే ఇంకా ఏంటో? అనుకున్నాను.చిటికెన వ్రేలుకు వచ్చిన తిప్పలు అన్న మాట అని వ్రేలును చూస్తే చిన్న చిన్నగా కొరికినట్లు గుర్తులు కనపడుతున్నాయి.వైద్యుని వద్దకు వెళ్లి ఒక ఇంజెక్షన్ చేయించుకో?అంటే అవసరం లేదమ్మా!పెసర్లు తింటే సరిపోద్ది అంది.ధన ఎవరు చెప్పినా వినే రకం కాదు.తనకు తోచింది చేసే రకం.అందుకే ఎవరి పద్దతులు వాళ్ళవి అనుకుని సరే! నీ ఇష్టం అంది వత్సల. 

Sunday, 24 March 2019

ఈరకాడు,ఈరకట్టు

                                                          శిల్ప ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు వంట చేసి పెట్టడానికి నీలమ్మ వస్తుంటుంది.అనుకోకుండా ఒక రోజు స్నేహితులు రావడంతో శిల్ప నీలమ్మకు కబురుపెట్టింది.ఈరోజు మా ఈరకాడు.ఈరకట్టు వచ్చారమ్మా!వాళ్ళకు భోజనాలు పెడుతున్నాను.ఒక అరగంటలో వస్తాను అని చెప్పింది.వచ్చిన స్నేహితులకు కూడా అర్ధం కాలేదు.అందుకే నీలమ్మ రాగానే శిల్ప ఈరకాడు.ఈరకట్టు అంటే ఎవరు?అని అడిగింది.మా రవికి పిల్లనిచ్చిన తల్లిదండ్రులు.మేము వియ్యపురాలిని,వియ్యంకుడిని ఈరకట్టు,ఈరకాడు అంటాము అని చెప్పింది.మొదటిసారి వినడంతో ఎవరైనది అర్ధం కాలేదు అందుకే అడిగాను అని చెప్పింది శిల్ప.

Friday, 22 March 2019

అసలు విషయం

                                                               సత్యకు  తానంటే అన్నకు చాలా ప్రేమ అని విపరీతమైన నమ్మకం.ఆ విషయంలో ఒకింత గర్వంగా ఉండేది.అన్నను ఎవరైనా ఒక మాట అంటే గయ్యాళి గంపలా పోట్లడేది.చెల్లి సంసారం తన సంసారంలా అనుకుని భాద్యతగా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేశాడు.అనుకోకుండా సత్యకు ఉన్నట్లుండి జ్వరం వచ్చి ఆసుపత్రి పాలయింది.వైద్యులు ఒక పది రోజులు ఓపిక పడితే నయమవవచ్చు అని చెప్పారు.కానీ అన్న ఇప్పుడు చెల్లి కోలుకున్నా కానీ  మునుపటిలా ఉండకపోవచ్చు.ఎప్పుడైనా పోవచ్చు కనుక ఇప్పుడే వైద్యం చెయ్యకుండా అలాగే ఉంచితే ఉన్నన్ని రోజులు ఉంటుంది అన్నాడట.వైద్యం చేసి ఉపయోగం లేకపోతే వదిలెయ్యవచ్చు.అంతేకానీ వైద్యం చెయ్యకుండా ప్రాణం ఎలా పోగొడతామన్నారు వైద్యులు.మా ఇష్టప్రకారం మేమే ఇంటికి తీసుకుని వెళ్తున్నామని సంతకం పెట్టి ఇంటికి తేచ్చేశాడు.చెల్లికి ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది.డబ్బు కూడా అన్న పెట్టక్కరలేదు.అయినా అన్న ఇలా చేశాడన్న విషయం చెల్లికి తెలియదు.అసలు విషయం తెలిస్తే చెల్లి మనసు ఎంత బాధ పడేదో?మామూలు రోజుల్లో ఎంత ప్రేమగా ఉన్నా చివరికి శాయశక్తులా బ్రతికించడానికి తాపత్రయ పడాలి.అంతేకానీ ఈ అన్న విచిత్ర ప్రవర్తన వైద్యులకు మింగుడు పడలేదు.బంధువులు తలోక మాట అంటారని బంధువులను ఎవరినీ రావొద్దని ఒక దండం పెట్టి అవసరమైనప్పుడు నేను కబురు పెడతానని చెప్పాడు.చెల్లి నన్ను అన్న ప్రేమగా దగ్గరే ఉండి చూచుకుంటున్నాడని అమాయకంగా తుది శ్వాస విడిచింది. 

Thursday, 21 March 2019

చావు బ్రతుకుల మధ్య

                                                                 శిశిరకు ఈమధ్య లేచిన దగ్గర నుండి అన్నీచావు వార్తలే వినిపిస్తున్నాయి.ఎప్పుడూ గలగల మాట్లాడుతూ మంచి అయినా,చెడు అయినా స్నేహితులు బంధువుల ఇళ్ళల్లో జరిగే ఏ ఒక్క కార్యక్రమనికి డుమ్మా కొట్టకుండా హాజరయ్యే పెదనాన్న కూతురు అక్కయ్య చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.ఆమెకు ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గింది జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు మూడేళ్ళ క్రితమే చెప్పారు.ఏ కొంచెం బాగోకపోయినా వైద్యుల దగ్గరకు వెంటనే పరుగెత్తుకు వెళుతుంది కానీ వాళ్ళిచ్చిన మందులు సరిగా వేసుకునేదికాదు.దానికి తోడు ఒకళ్ళకు నలుగురి వైద్యుల సలహాలు తీసుకునేది.ఏదీ పాటించకపోవడంతో ఊపిరి పీల్చుకోలేక కృత్రిమంగా గొట్టాల ద్వారా గాలి పీల్చుకుంటూ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.సమయానికి అన్న విదేశాల నుండి రావడంతో కొద్ది ఆలస్యంగా అయినా వైద్యం అందుబాటులోకి వచ్చింది.పిల్లలు విదేశాల నుండి పరుగెత్తుకుని తల్లి వద్దకు వచ్చారు.అన్న ఒదిన వైద్యులే అయినా సామాన్య మానవుల్లా ఆలోచిస్తున్నారు.చెల్లి అంటే ఉన్న అమితమైన ప్రేమ వల్ల వెంటిలేటర్ పై పెట్టొద్దని అనడంతో మీరు కాసేపు బయట కూర్చుంటే మా విధి మేము నిర్వర్తిస్తామని ఇక్కడి వైద్యులు అనడంతో చేసేది లేక మిన్నకున్నాడు.ముక్కుకు గొట్టాలు పెట్టి బోర్లేసి,తిప్పిపెడుతుంటే చూడలేక కళ్ళు,ముక్కు వాచిపోయి,ముఖం ఎర్రగా కందిపోయేలా ఏడ్చి ఏడ్చి,బుర్ర పని చెయ్యక ముక్కుకి గొట్టాలు తొలగించమంటాడు.అన్నకి అంత ప్రేమ ఉండడం చెల్లి అదృష్టమే కానీ వైద్యం జరగాలి కదా!అందరితో ఆప్యాయంగా మాట్లాడే ఆమె అకస్మాత్తుగా ఆ స్థితిలో ఉండేసరికి అందరికీ బాధగానే ఉంది.కోలుకోవచ్చు,కోలుకోకపోవచ్చు.ఎదురు చూడడం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు.  

Wednesday, 20 March 2019

ఇరుగు చల్లన,పొరుగు చల్లన

                                                          శ్రేయ మొన్నామధ్య తిరుపతి వెళ్ళినప్పుడు ఒక తెలిసినావిడ చాలారోజుల తర్వాత కనిపించి నన్ను గుర్తుపట్టారా?నాపేరు జ్ఞాని అని చెప్పింది.మాటల సందర్భంలో సంప్రదయాలు,పద్దతులు గురించి మాట్లాడుతూ మన అమ్మ,అమ్మమ్మలు మనకు నేర్పడంతో మనం పాటిస్తున్నాము.మనం మన పిల్లలకు చెప్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తాయి అంది.మా అమ్మమ్మ చిన్నప్పుడు లైటు వేసేటప్పుడు ఇరుగు,చల్లన,పొరుగు చల్లన,అందరూ చల్లన,తర్వాత మనం చల్లన అనుకోవాలని చెప్పేది.ఇప్పటికీ నేను అదే పాటిస్తాను అని చెప్పింది.మీరు గమనించారా?ఎప్పుడూ కూడా మనం  ఒక్కళ్ళమే బాగుండాలి అనే స్వార్ధం ఉన్న వాళ్ళ కన్నా మనం,మనతోపాటు అందరూ బాగుండాలి అనుకునే వాళ్ల జీవితం ఆనందమయంగా ఉంటుంది.నేను,నావాళ్ళు మాత్రమే అనుకున్నదానికి మనమందరమూ అనుకున్నదానికి చాలా తేడా ఉంటుంది.పూర్వం కష్టమైనా సంతోషమైనా అందరూ కలిసి పంచుకునే వాళ్ళు.ఈరోజుల్లో నేను అనే స్వార్ధం ఎక్కువగా కనిపిస్తున్నా మళ్ళీ పాతరోజులు రావాలని తప్పకుండా వస్తాయని అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆశిద్దాం అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.శ్రేయకి కూడా ఆమెతో మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు.మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా!ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండొచ్చు అనుకుంది శ్రేయ. 

ఏమని?

                                                                              అమూల్యకు ఐదున్నర సంవత్సరాలు.చురుకైన పిల్ల.విదేశాలలో స్థిరపడినా అమూల్య తల్లి మాతృభాష పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశ్యంతో అమూల్యకు తెలుగు మాట్లాడడం చక్కగా నేర్పింది.దానితో అమూల్య ఎవరేమి అడిగినా  తడుముకోకుండా తెలివిగా సమాధానం చెబుతుంటుంది.ఒక పెద్దావిడ అమూల్యతో కాసేపు ముచ్చట్లు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్తూ వెళ్తూ మీ నాన్నను అడిగానని చెప్పు అమ్మా!అంది.ఏమని అడిగావని చెప్పను?అని గుప్పెట మూసి బొటనవేలు పైకి పెట్టి చెయ్యి పైకి కిందికి ఊపుతూ అడుగుతుంటే చిన్నపిల్ల అభినయంతో అడిగేతీరుకు ముచ్చటపడి పెద్దావిడ పకపక నవ్వుతూ మీ పెద్దమ్మ నిన్ను అడిగింది నాన్నా!అని చెప్పు అంది.మళ్ళీ అదే ఏమని అడిగావని చెప్పాలో చెప్పు అంటూ వెంటపడితే ఎలా చెప్పాలో తెలియక తికమకపడి చేతిపై ఒక ముద్దు పెట్టి వెళ్లిపోయింది. 

Wednesday, 13 March 2019

లడ్డూ పాప

                                                                        అహల్య ఆరేళ్ళ పాప.విదేశాల నుండి శెలవులకు తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది.అనుకోకుండా చిన్న తాతయ్య మరణించాడు.రోజూ  కాసేపు అహల్యను తీసుకుని వాళ్ళమ్మ బాబాయి ఇంటికి వెళ్లి పిన్నిదిగులు పడకుండా కబుర్లు చెప్పి వస్తుంది.ఒకరోజు అహల్యకు చిన్న అమ్మమ్మ లడ్డు ఇచ్చింది.అది నచ్చి రోజూ వాళ్ళింటికి వెళ్ళగానే లడ్డూ కావాలి,లడ్డు కావాలి అని మారాం చెయ్యడం మొదలెట్టింది.అలా అడగకూడదు అని అమ్మ ఎంత చెప్పినా వినడం లేదు.దీనికి ఎంత చెప్పినా వినడం లేదు.ఇంట్లో నుండి వచ్చేటప్పుడు అడగనని చెప్పి వస్తుంది.ఇక్కడకు రాగానే మొదలు పెడుతుంది.నాకే సిగ్గుగా ఉంటుంది అని అహల్య అమ్మ తల పట్టుకుంది.చిన్నపిల్ల కనుక అడిగింది.పెద్ద వాళ్ళు అడగరు కదా! అని లడ్డు పాప వచ్చింది రామ్మా!అంటూ రోజూ వెళ్ళగానే తాజా లడ్డూ తెచ్చి అహల్యకు ఇవ్వడం మొదలెట్టారు.

Friday, 8 March 2019

మహిళా దినోత్సవం

                                                            ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నా బ్లాగ్ వీక్షించే మహిళలకు ధన్యవాదములు తెలియచేస్తూ మహిళలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 
                                                                      
                                                               
                                                        
                                                      

Sunday, 3 March 2019

మహా శివరాత్రి శుభాకాంక్షలు

                                                       మహా శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీఈ అర్థరాత్రి నుండి రేపు తెల్లవారుఝాము వరకు కూడా భక్తులతో కిటకిట లాడిపోతాయి.దేవాలయ కమిటీలు కూడా జాగరణ చేసే భక్తుల కోసం వివిధ హోమాలు,లింగోద్భవ కాలంలో అభిషేకాలు,హరికథా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఉపవాసం,జాగరణ,అభిషేకాలు చేయలేకపోయినా ప్రశాంతంగా ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా,భక్తితో ఒక మారేడు దళం  శివలింగంపై పెట్టి చెంబుడు నీళ్ళు పోసినా భక్తశులభుడైన ఆ శివ శంకరుని కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.నా బ్లాగ్ వీక్షకులకు,చదువరులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు ఆ భోళాశంకరుడు చల్లని దీవెనలు అందించాలని మనసారా కోరుకుంటూ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
                                                 
                                               

Friday, 1 March 2019

కష్టమొస్తే ..........

                                                   ఒక రోజు ప్రణతి వంటపనిలో నిమగ్నమై ఉండగా ఏమండీ! ఒకసారి బయటకు వస్తారా? అంటూ ఒక పెద్దావిడ పిలిచింది.ప్రణతి బయటకు వచ్చేసరికి వీధి గుమ్మం ముందు ఒక పెద్ద ముత్తైదువ నుదుట పెద్ద బొట్టుతో,రెండు చేతులకు నిండుగా బంగారు,మట్టి గాజులతో  పట్టుచీర ధరించి నిలబడి ఉంది.ప్రణతిని చూడగానే మేము ప్రక్క వీధిలో ఉంటాము.రంగనాథస్వామికి అఖండ దీపారాధన చేసి శ్రీరంగం దర్శనానికి వస్తామని మొక్కుకున్నాము.అందుకోసం పరిచయం లేని ముగ్గురి వద్దకు బిక్షకు వెళ్ళాలి.మీరు అఖండ దీపారాధన కోసం ఆవు నెయ్యి,ఒక రవికె ముక్క ఇవ్వగలరా?అని అడిగింది.ప్రణతి సరే ఇస్తానని చెప్పి లోపలికి రమ్మంది.ఇంతలో పెద్దావిడ నాలుగు మంచి మాటలు చెప్తూ అమ్మా!ఏదైనా కష్టం వస్తే ఎప్పుడైనా పక్కింటావిడకో,తోటి కోడలికో చెప్పుకోకూడదు.తులసి కోట దగ్గర కాసేపు ప్రశాంతంగా కూర్చుని తులశమ్మకు మనస్పూర్తిగా నీ మనసులో ఉన్న బాధను చెప్పుకో!కాసేపటికి మనసు తేలికై నీ మనసులోని బాధ దానంతట అదే తగ్గిపోతుంది అని మా అమ్మ చెప్పేది అని చెప్పింది.పెదవి దాటితే పేటలు దాటతాయని పెద్దలు ఊరికే చెప్పలేదు.ఎంతో అనుభవపూర్వకంగా చెప్పినట్లే ఈమె కూడా ఎవరికి చెప్పినా ప్రయోజనం లేకపోగా ప్రశాంతత ఉండదని కష్టమొస్తే తులశమ్మకు చెప్పుకోమని మంచిమాట చెప్పింది అనుకుంది ప్రణతి.

Sunday, 13 January 2019

సంక్రాంతి శుభాకాంక్షలు

                         భోగి భోగ భాగ్యాలను,పండుగ పాడిపంటలను,ధనధన్యాలను,ఆయురారోగ్యాలను, కనుమ కనకాన్ని సమృద్ధిగా ప్రసాదించాలని నిండు నూరేళ్ళు సుఖంగా అందరూ కలిసిమెలిసి ప్రశాంత జీవనాన్ని గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నాబ్లాగ్ వీక్షకులకు,తెలుగువారందరికీ మనస్పూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు.

ఉపద్రవం

                                               శాంతమ్మ రోజు లేచినట్లే ఉదయాన్నే లేచి తలుపు తీద్దామని వెళ్ళింది.కానీ ఏమైందో ఏమో అక్కడే పడిపోయింది.కొడుకు,పని మనుషులు గబగబా వచ్చి లేపటానికి ప్రయత్నించారు.చేతుల్లోనే వాలిపోయి గురక వచ్చేసరికి భయంతో చనిపోయిందేమో అనుకుని ఒకడు వదిలేశాడు.బరువు అంతా కొడుకుపై పడేసరికి నడుము దగ్గర ఒక్కసారి  కలుక్కుమంది.భరించలేనంత భాధతోనే వదిలేసినవాడిని గదిమి ఎలాగైతే మంచం మీదికి చేర్చారు.మొహం తుడిచి అమ్మా!నీకేమీ కాలేదు కళ్ళు తెరువు అని నాలుగు సార్లు చెప్పేసరికి స్పృహలోకి వచ్చింది.తమ్ముడికి పెద్ద ఆసుపత్రి ఉండడంతో అన్ని పరీక్షలు నిమిషాల మీద జరిగిపొయినాయి.కుడి భుజం విరిగింది.మోకాలు చిట్లిందని వైద్యులు తేల్చారు.మోకాలుకు కట్టు,భుజానికి శస్త్ర చికిత్స చేయడంతో ఆరు వారాలు మంచానికి పరిమితం అని తేల్చారు.ఆయాలు నర్సులు సేవలు చేస్తున్నా అమ్మ ఒక గదిలో మంచంపై,కొడుకు పక్షం రోజులు పూర్తి విశ్రాంతి నిమిత్తం ఒక గదిలో మంచంపై పండుగ పూట పడుకోవాల్సి వచ్చింది.ఎక్కడికో వెళ్తే ప్రమాదం జరిగితే అదో  రకం ఇంట్లోనే ఈవిధంగా జరగడం బాధాకరం.ఉపద్రవం అనేది ఎప్పుడు ఎలా పొంచి వుంటుందో తెలియని పరిస్థితి.ఎప్పుడూ చలాకీగా తిరిగేవాళ్ళు అలా పడుకునేసరికి చూపరులకు కూడా చాలా బాధ అనిపించి వాళ్ళను విశ్రాంతి తీసుకోనీయకుండా చూడటానికి వరుసగా లైన్లు కట్టారు.