Saturday, 31 January 2015

పొడిచర్మంపై ముడతలు రాకుండా ........

                                              ఒక్కో స్పూను చొప్పున పాలు,పంచదార,కలబంద గుజ్జు కలిపి ముఖానికి పూతలా
వేయాలి.కాసేపాగి గోరువెచ్చటి నీళ్ళతో కడిగాలి.వారంలో మూడుసార్లు ఇలా చేస్తే పొడి చర్మంపై ముడతలు తగ్గుతాయి. 

జిడ్డు చర్మం తాజాగా.....

                                                   ఒక స్పూను కమలారసంలో ఒక స్పూను పంచదార కలిపి ముఖానికి మెడకు  రాయాలి.అప్పుడు జిడ్డు పోయి చర్మం తాజాగా ఉంటుంది.

చర్మసౌందర్యానికి చక్కర

                                             మూడుస్పూన్ల చక్కెరలో ఒకస్పూను ఆలివ్ నూనె,ఒక స్పూను పాలు కలిపి ఆ మిశ్రమంతో ముఖం,మెడ,చేతులు బాగా రుద్దాలి.చర్మం మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది.

Friday, 30 January 2015

జలుబు,దగ్గుకి పరిష్కారం

                                                జలుబు,దగ్గు,శ్వాసకోశ ఇబ్బందులకు చక్కని పరిష్కారం వెల్లుల్లి.పచ్చి వెల్లుల్లిని  చిన్నచిన్న ముక్కలుగా చేసి వేడి సూప్ లో వేసితింటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.కొంచెం పాలల్లో వెల్లుల్లి లేదా చిటికెడు మిరియాలపొడి లేదా కొంచెం పసుపు వేసుకుని వేడిగా త్రాగితే త్వరగా జలుబు,దగ్గు తగ్గుతుంది. 

ఆల్లం వెల్లుల్లి ముద్ద తాజాగా

                                                అల్లం శుభ్రంగా కడిగి పైచెక్కు తీసి చిన్నగా పలుచగా ముక్కలు చేసి తడిలేకుండా కొంచెంసేపు ఎండలో పెట్టాలి లేదా గాలికి ఆరనివ్వాలి.వెల్లుల్లి కొట్టి రేకలు తీసి కొంచెం నూనె రాసి ఒకగంట తర్వాత పొట్టు తీయవచ్చులేదా వేడినీటిలో వేసి వెంటనే వార్చేస్తే తేలిగ్గా పొట్టు వస్తుంది.అప్పుడు రెండింటినీ కలిపి మిక్సీలో వేసి కొంచెం నూనె,పసుపు,ఉప్పు కొద్దిగా వేసి ముద్దగా చేస్తే పూర్తిగా అయిపోయేవరకు కూడా మొదట చేసినప్పుడు ఎలా ఉందో అంతే తాజాగా ఉంటుంది.  

చర్మానికి నిగారింపు

                                                    చర్మం పొడిగా ఉండి నిర్జీవంగా కనిపిస్తుంటే 4,5 స్ట్రాబెర్రీలను మెత్తగాచేసి దానికి ఒక స్పూను గులాబీ నీరు చేర్చి,ఒకస్పూను తేనె కలిపి ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించాలి.10,15 ని.ల తర్వాత స్నానం చేయాలి.ఈపండ్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.దాంతో చర్మానికి సరిపడా తేమ అంది చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.ఎన్నో పోషకాలతో ఉన్నఈపండ్లు తింటే ఎంతో మంచిది.  

బొద్దింకల బెడద వదలాలంటే ......

                                   మనం ఎంత శుభ్రంగా ఉన్నావంటింట్లో ఎక్కడో ఒకచోట ఏచిన్నబొద్దింకో కనపడుతుంటుంది.
బొద్దింకలు,చీమలు రాకుండా ఉండటానికి లక్ష్మణ రేఖతో ఎప్పటికప్పుడు గీత గీయాలి.ఆహారపదార్ధాల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు పారేయాలి.సింకులో గిన్నెలు వేసి ఎక్కువసేపు వదిలేయకూడదు.సింకు వాడటం పూర్తయ్యాక
బేకింగ్ సోడా చల్లి పీచుతో రుద్ది వేడి నీళ్ళు పోయాలి.గొట్టాలలో ఇరుక్కున్న పదార్ధాలు పోవటంతోపాటు సింకు శుభ్రంగా ఉంటుంది.బొద్దింకలు రావు.చెక్కబీరువాలు,అల్మారాలలో లవంగాలు,దాల్చిన చెక్క,నాఫ్తలిన్ గోళీలు పల్చటి వస్త్రంలో చుట్టి పెట్టాలి.పాత పుస్తకాలు,పేపర్లు చెక్క పెట్టెలో పెడితే నెలకొకసారి ఆలివ్ నూనెతో తుడిచి,వాటిని దులిపి ఎప్పటికప్పుడు సర్దుకుంటే బొద్దింకల బెడద ఉండదు.దోసకాయ ముక్కలు పలుచగా కోసి ఎండ బెట్టి వాటిని అక్కడక్కడ పెడితే బొద్దింకలు రావు.వెల్లుల్లి రెబ్బలు ఒలిచి అక్కడక్కడా పెట్టినా ఉపయోగం ఉంటుంది.పాత పుస్తకాల మధ్యలో బేకింగ్ సోడా చల్లితే సరి బొద్దింకలు పారిపోతాయి. 

Thursday, 29 January 2015

గురిచూసి కొడితే .....

                                               సుజిత ఉండే రోడ్డులో ఒకరోజు చింపిరిజుట్టుతో,మురికిబట్టలతో మూడుచక్రాల సైకిలుమీద ఒకడు కనిపించాడు.పెళ్ళికి వెళ్ళటానికి తయారయి గేటు దగ్గరికి రాగానే అకస్మాత్తుగా వచ్చి చెయ్యి చాచేసరికి ఒక పది రూపాయలు ఇచ్చింది.రెండు రోజుల తర్వాత హడావిడిగా వెళ్తుంటే రోడ్డు ప్రక్కన కూర్చుని కర్ర దారికి అడ్డం పెడుతున్నట్లుగా పెట్టాడు.సుజిత పెద్దగా పట్టించుకోలేదు కానీ ఏమీఇవ్వకుండా వెళ్తున్నారని కోపంగా మొహం పెట్టినట్లు అనిపించింది.ఒకరోజు మధ్యాహ్నం రోడ్డుమీద పెద్ద గొడవ జరుగుతుంది.ఏంటోనని చూచేసరికి ఒక భార్యాభర్తలు కర్రతో వాడిని కొడుతూ పెద్దగా అరుస్తున్నారు.ఇంతకీ విషయమేమిటంటే ఒకామె పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇవ్వటానికి బండి మీద వెళ్తుంది.వీడు పెద్ద రాయి తీసుకుని ఆమె నడుముకి గురిచూసి కొట్టాడు.ఆమె అకస్మాత్తుగా క్రింద పడిపోయింది.అప్పటివరకు ఆమె వీడిని చూడలేదు.ఒంటిమీద బట్టలు సరిగా లేకుండా ఆమెను రా అంటుంటే దారిన పోయేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆగకుండా వెళ్ళిపోయారు.ఆమెకు చిన్నచిన్న దెబ్బలు తగిలాయి.నడుము దగ్గర గట్టిదెబ్బ తగిలింది.నిదానంగా లేచి భర్తకు ఫోను చేసి వెంటనే రమ్మని చెప్పగానే వచ్చాడు.విషయం చెప్పి చెరొక కర్ర తీసుకుని కొడుతుంటే ఇళ్ళల్లో నుండి ఆడవాళ్ళందరూ వచ్చి తలొక దెబ్బ వేసి రాయితీసుకుని వాడెలాగురిచూసి కొట్టాడో అలాగే నువ్వు కూడా గురిచూసి అక్కడ కొట్టమని చస్తాడు మళ్ళీ ఎవరినీ వెధవ కూతలు కుయ్యకుండా ఉంటాడని అందరూ ఒకేమాట చెప్పారు.అప్పటికీ వాడిలో పశ్చాత్తాపం కనపడలేదు కానీ ఆడవాళ్లందరూ కలిసి అన్నంతపనీ చేసేట్లున్నారని దణ్ణంపెట్టి తప్పయిందని తప్పిచుకుందామనుకున్నాడు.కాళ్ళు చచ్చుపడిపోయినా మదమాత్సర్యం తగ్గలేదని,దారిలో వెళ్ళే పనివాళ్ళను అలాగే మాట్లాడుతున్నాడని తర్వాతతెలిసింది.భర్త,ఇంకొందరు మగవాళ్ళు కలిసి చితక్కొట్టి కంటికి  కనిపించావోచంపేస్తామని గట్టిగా బెదిరించారు.బాబ్బాబు తప్పయిందని,అమ్మా!క్షమించమని ఆమె కాళ్ళ మీద పడబోయాడు.చీ!ఇదొక దొంగ నాటకం.నువ్వు క్షమార్హుడివి కాదుఅయినా  కాళ్ళు చచ్చుపడిపోయి నడవలేని స్థితిలో ఉన్నావని ఏమూలో ఉన్నజాలితో వదిలేస్తున్నానని చీత్కరించి కాళ్ళు  వెనక్కి తీసుకుంది.పోలీసులకు ఫోను చేస్తుంటే చక్రాల సైకిల్ తో వేగంగా పారిపోతుంటే వెంటపడే సరికి ప్రక్కన ఉన్న కాలువలో పడ్డాడు.వాడిని ఎవరూ దగ్గరికి వెళ్ళి పట్టుకోలేనంత అసహ్యంగా వాడి బుద్దిలాగే ఆకారం కూడా ఉంది  కనుక వదిలేశారు.చచ్చాడో,బ్రతికాడో కూడా పట్టించుకోలేదు.ఎందుకంటే ఇటువంటి వాళ్ళ మీద జాలిపడాల్సిన అవసరంలేదని అందరి అభిప్రాయం.    

మంచి అలవాట్లు

                                     పిల్లలు మైనపుముద్ద లాంటివారు.మనం ఎలా మలిస్తే అలాగే తయరవుతారు.చిన్నప్పటి నుండి వాళ్లకు మంచి అలవాట్లు నేర్పిస్తే పెద్దయిన తర్వాత వారికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి.పిల్లలు తినే చాక్లెట్,బిస్కట్ కాగితాలు,చిత్తు కాగితాలు,పెన్సిల్ పొట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తడబ్బాలో వేయటం
అలవాటు చేయాలి.పిల్లలకు నీళ్ళంటే చెప్పలేనంత ఇష్టం.వదిలేస్తే నీళ్ళతో ఎంతసేపైనా ఆడతారు.మొహం కడిగినా పళ్ళు తోముకుంటున్నా,స్నానం చేస్తున్నా వృధా చేయకుండా అవసరమైనన్ని మాత్రమే వాడుకోమని,నీళ్ళను పొదుపుగా వాడమని చెప్పాలి.అలాగే చెట్లు,మొక్కలు మనకు కాయలు,పండ్లు ఇవ్వటమేకాక,మంచి గాలితోపాటు పర్యావరణాన్ని కాపాడతాయి కనుక వాటికి రోజు నీళ్ళు పోయాలని సూచించాలి.ఇంటిదగ్గర స్థలం ఉంటే సరే లేకపోతే కుండీలలో వాళ్ళతో మొక్కల్నినాటించి నీళ్ళు పోయించాలి.అవి పెరిగి పెద్దయి పువ్వులు,పండ్లు ఇస్తే మనకు ఎంత సంతోషమో వారికీ అర్ధమవుతుంది.గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు,లైట్లు,టి.వి,కంప్యూటరు స్విచ్ తీసేయటం వంటివి నేర్పించాలి.కాగితం సంచులు,జనపనార సంచులు వాడటం అలవాటు చేయాలి.పెద్ద పిల్లలయితే ప్రతిదానికి బండి వేసుకెళ్ళకుండా సైకిల్ కానీ,నడిచికానీ వెళ్లేలా ప్రోత్సహించాలి.వీలయినంతవరకూ ఎవరిపనివారే చేసుకునేలా  ప్రోత్సహించాలి.బయటనుండి రాగానే శుభ్రంగాకాళ్ళు,చేతులు కడిగేలాచూడాలి.పెద్దలను గౌరవించాలని, ఎవరిని పడితే వారిని ఏది పడితే అది మాట్లాడి బాధ పెట్టకూడదని చెప్పాలి.క్రమంగా వాళ్ళే అలవాటుపడతారు.  

చలాకీగా,చురుగ్గా

                                   మెదడు చురుగ్గా పనిచేయాలంటే రోజులో ఒకగంటసేపు మనకు నచ్చిన పుస్తకం కానీ,దిన పత్రిక కానీ ఏదైనా చదవటం అలవాటు చేసుకోవాలి.ఆలోచనల్లో వేగం పెరగాలంటే పద వినోదం,సుడుకో,చెస్,కారమ్స్
వంటి వాటికి సమయం కేటాయించాలి.ఎవరికి వాళ్ళువారివారి  అభిరుచులకు కొంత సమయం కేటాయించాలి.మంచి నిద్ర మెదడుని చురుగ్గా ఉంచుతుంది.తద్వారా చక్కటి ఆలోచనలు వస్తాయి.ఇవే కాక మన మనసుకు నచ్చిన, సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతో కాసేపు మాట్లాడితే హాయిగా ఉంటుంది.ప్రతికూల ఆలోచనలు దూరమై మనసుకు సంతోషంగా ఉండి చలాకీగా,చురుగ్గా ఉండగలుగుతారు. 

Wednesday, 28 January 2015

కంటి నిండా నిద్ర

                                             కంటి నిండా నిద్ర అంటే బారెడు పొద్దేక్కేదాకా నిద్రపోవటం అని కాదు.మధ్యమధ్యలో మెలుకువ రాకుండా ఎంత గాడంగా,హాయిగా నిద్రపోతున్నామన్నది ముఖ్యం.తరచూ మెలుకువ వచ్చేస్తుంటే ఉన్న వయసుకన్నా పెద్దగా కనిపిస్తుంటారు.అదీకాక బుర్ర సరిగా పనిచేయక సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు.మనం ఎంత బాగా నిద్రపోతే అంతబాగా బుర్ర పని చేస్తుందన్నమాట.హృద్రోగ సమస్యలు,మతిమరుపు లాంటివి రాకుండా ఉంటాయి.పడుకునే ముందు ధ్యానం చేసుకోవటం లేదా నచ్చిన పుస్తకం చదువుకోవటం గానీ,ఇష్టమైన సంగీతం వినటం గానీ చేస్తుంటే నిద్ర హాయిగా పడుతుంది.అప్పటికీ నిద్ర పట్టకపోతే వైద్యులని సంప్రదించాలి. 

అమ్మ బాబోయ్

                                  సునందిని కుటుంబసభ్యులకు చలికాలంలో కొంచెం మిరియాలపొడి వేసుకుని  ఏదోఒక సూప్ తాగటం అలవాటు.సమయాభావం వల్ల ఇంట్లో తయారు చేయలేకపోయింది.పెద్దవాళ్ళకు ప్రతి రోజు తప్పనిసరిగా సూప్ ఇవ్వాలి కనుక ఏమి చేయాలో తెలియక మొన్నామధ్య కొట్టుకు వెళ్ళినప్పుడు పొడి వేసి వేడి నీళ్ళు పోస్తే నిమిషంలో సూప్ తయారైపోతుందని వద్దో మొర్రో అన్నా రెండు పాకెట్లు షాపులో అమ్మాయి అంటగట్టింది.నిమిషంలో తయారు చేసేయ్యవచ్చు కదా అని సంబరపడి  కప్పులో పొడి వేసి వేడినీళ్ళు పోసి గిరగిరా స్పూనుతో తిప్పేసి ఎందుకైనా మంచిదని కొంచెం రుచి చూచేసరికి ఘాటుగా,కారంగా(పచ్చిమిర్చిఘాటు)నషాళానికి అంటింది.ఆ ఘాటు తగ్గటానికి పచ్చికారట్ తురుము,ఎండుద్రాక్ష చిటికెడు ఉప్పు,పంచదార వేసి ఇంట్లో వాళ్లకు ఇచ్చింది.వాళ్ళకసలే ఘాటుగా అలవాటు లేదు.ఒక స్పూను తాగేసరికే చనిపోయిన అమ్మ గుర్తువచ్చిఅయ్యబాబోయ్ అనటానికి బదులుగా "అమ్మబాబోయ్" ఇది మేము తాగలేము అంటూ పారబోశారు.నీకు సమయం లేకపోతే ఒకరోజు ఇవ్వక పోయినా ఫరవాలేదు కానీ ఇటువంటివి ఇవ్వొద్దు అని ముక్తాయింపు ఇచ్చారు.నిజం చెప్పొద్దూ కారం ఎక్కువ తినే అలవాటున్న సునందిని కూడా తాగలేకపోయింది.     

Tuesday, 27 January 2015

స్వైన్ ఫ్లూ కి విరుగుడు

                              ఇప్పుడు అందరికీ స్వైన్ ఫ్లూ అంటే భయం పట్టుకుంది.స్వైన్ ఫ్లూ రాకుండా ఉండాలంటే టి.వి.
చూస్తూ ఇంట్లో కూర్చోండి అని చలోక్తులు విసురుతున్నారు.స్వైన్ ఫ్లూ కి విరుగుడు "తులసి ఆకులు".రోజు 4 నుండి 6 తులసి ఆకులు తింటే స్వైన్ ఫ్లూ రాకుండా ఉంటుందని ఇప్పుడే ఒక మామయ్య తెలిసిన వాళ్ళందరికీ చెప్పమని చెప్పారు.అందుకని నేను మీ అందరికీ ఈ విషయాన్నితెలియచేద్దామని ఈ ప్రయత్నం.మనం దీనికోసం శ్రమ పడనక్కరలేదు కనుక ప్రయత్నిద్దాం.

ఓరి! నీ దుంప తెగ!

                                            హితేష్ కి ఐదు సంవత్సరాలు.నిమిషకు నాలుగు సంవత్సరాలు.ఇద్దరూఅన్నాచెల్లెళ్ళ పిల్లలు అంటే బావామరదళ్ళు.నిమిష ఇంటికి హితేష్ వచ్చినప్పుడు బావా,బావా అంటూ వెంట తిరిగేది.హితేష్ ఇంటికి నిమిష వెళ్ళినప్పుడు అరేయ్,ఒరేయ్ అని పిలవటం మొదలెట్టింది.అప్పుడు హితేష్ మీ ఇంటికి వచ్చినప్పుడు బావ అని పిలిచేదానివి ఇక్కడకు వచ్చి అరేయ్,ఒరేయ్ అంటున్నావు.అయినా నేను మగాడిని నువ్వు అరేయ్,ఒరేయ్ అనకూడదు.తెలుసా?బావా అని పిలవాలి. అంతే. అలా అయితేనే పలుకుతాను అన్నాడు.నిమిష కూడా తక్కువదేమీ కాదు.నేను అంతే పిలుస్తాను.పలికితే పలుకు లేకపోతే లేదు అంది.వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న పెద్దవాళ్ళు వీడేమో కూస్తంత ఉన్నాడో  లేడో నేను మగాడిని అంటున్నాడు.అదేమో అంతే పిలుస్తా పలికితే పలుకు లేకపోతే లేదు అంటుంది.ఓరి!నీ దుంప తెగ!వీళ్ళప్పుడే ఇన్నిన్ని మాటలు మాట్లాడేస్తున్నారు అని ఆశ్చర్యపోయారు.    

Monday, 26 January 2015

యోగా - ధ్యానం

                                            వేగంగా నడవటం వల్ల మోకాళ్ళపై బరువు ఎక్కువ పడుతుంది.ముందుముందు మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ.సైకిల్ తొక్కటం మంచిదే కానీ కొంతమందికి కాళ్ళు నొప్పులు రావచ్చు.
మనకు నచ్చిన ప్రదేశంలో చేసుకోవచ్చుకనుక యోగా - ధ్యానం చేసుకుంటే మంచిది.మనసు ప్రశాంతంగా ఉంటుంది కనుక ఆందోళన అనేది త్వరగా కలగదు.తద్వారా అధిక రక్తపోటు,గుండెకు సంబంధించిన సమస్యలు,పక్షవాతం లాంటివి రాకుండా ఉంటాయి. 

కడుపులో మంట

                                  వేళకు సరిగా తినకపోయినా లేదా చాలా తక్కువ ఆహరం తీసుకోవడం వల్ల ఆమ్లాలు ఉత్పత్తి అవటం వల్ల కడుపులో మంట వస్తుంటుంది.గ్యాస్ ఏర్పడి కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది.కడుపులో మంటను అశ్రద్ధ చేస్తే అల్సర్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే సమయానికి భోజనం చేయటం కుదరకపోతే అందుబాటులో ఉన్నది ఏ పండో లేక బిస్కట్లు,నీళ్ళ సీసా హాండ్ బాగ్ లో పెట్టుకుంటే సరి.అంతగా ఇబ్బంది ఉండదు.ఆసమయానికి ఏదోఒకటి తినటం వల్ల ఆమ్లాలు ఉత్పత్తయ్యే ప్రమాదముండదు.    

దెబ్బ తగిలితే వాపు రాకుండా

                                                     ఒక్కొక్కసారి పని హడావిడిలో ఏదోఒకటి కొట్టుకుని గట్టిగా దెబ్బతగిలి వాపు  వస్తుంటుంది.అందుబాటులో ఐస్ ఉంటే పెట్టవచ్చు లేదంటే దెబ్బ తగిలిన ప్రాంతంలో తేనె రాస్తే వాపు రాకుండా ఉంటుంది.

క్షణం తీరిక లేకుండా......

                                 ఇంటి పనులు,బయటి పనులు(పనివాళ్లున్నా కూడా) ఇంట్లో అందరికీ ఎవరికి ఏమి కావాలో చూస్తూ క్షణం తీరిక లేకుండా ఉండే ఇల్లాలు తను మాత్రం వేళకు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవటం,     సమయానికి భోజనం చేయటం దగ్గర అశ్రద్ధ చేస్తుంది.ముప్పై ఏళ్ళలోపు అంతగా సమస్యవుండదు.తర్వాత  ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాల్సిందే.కాఫీ,టీ తాగే బదులు పాలు,పాల పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తులో ఎముకల సాంద్రత తగ్గకుండా ఉంటుంది.ఆడవాళ్ళల్లో రక్తహీనత ఎక్కువ.అందుకోసం ఇనుము ఎక్కువగా వుండే ఆకుకూరలు,బెల్లం,వేరుశనగ వంటివి తీసుకోవాలి.తీరిక సమయంలోఎండు ద్రాక్ష,బాదం,వాల్ నట్లు వంటివి తింటూ ఉండాలి.ఇంటి పనులతో వ్యాయామం అయిపొయింది అనుకోకుండా ఒక గంట వ్యాయామం చేయాలి.సాయంత్రం మీవారితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ వ్యాహ్యాళికి వెళ్తుంటే సరదాగా ఉంటుంది.యోగా,ధ్యానం చేస్తుంటే అనవసర ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉంటుంది.రోజులో కాసేపు లేదా వారంలో రెండు సార్లన్నా ఎవరికోసం వారు కొంత సమయం కేటాయించుకుంటే ఏదో కోల్పోయాం  అనుకోకుండా ఎవరికి  నచ్చిన పని వారు చేస్తే  మనసుకు సంతోషంగా ఉంటుంది.    

రోజుకి పది పప్పులు

                                           రోజుకి ఒక పది బాదం పప్పులు తింటే పొట్ట తగ్గుతుంది.గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది.సాయంత్రం ఏదో ఒక చిరుతిండి తినేకన్నాబాదం పప్పులు తినటం మంచిది.

Sunday, 25 January 2015

ప్రణతోస్మి దివాకరం

                                ఈరోజు రధసప్తమి అంటే సూర్యభగవానుడు ఆవిర్భవించిన పవిత్రమైన రోజు. మాఘసప్తమినే
రధసప్తమి అంటారు.ఈరోజున సూర్యుని రధము ఉత్తరదిశవైపు ప్రయణిస్తుంది.సూర్యభగవానుడు సమస్త మానవాళికి జీవనప్రధాత.గ్రహాధిపతి.హరిహర బ్రహ్మ స్వరూపుడు.ఆరోగ్యప్రధాత.వేకువఝామునే జిల్లెడుఆకులు,రేగుపళ్ళు తలపై ,భుజాలపై పెట్టుకుని స్నానంచేసి,ఆవుపాలతో పాయసం వండి చిక్కుడు ఆకుల్లో సూర్యుడికి తులసిమొక్క దగ్గర నివేదన పెడితే ఎంతో మంచిది.కొంతమంది చిక్కుడుకాయలు,రేగుపళ్ళతో రధం తయారు చేస్తారు.ఆంధ్రరాష్ట్రంలో పురాతన సూర్యదేవాలయాలు రెండు వున్నాయి.ఒకటి అరసవల్లిలోని సూర్యనారాయణ దేవాలయము.అందరికీ తెలిసినదే.రెండవది విజయవాడ దగ్గరలోఉన్న పోరంకి గ్రామంలోని శ్రీ ఆంజనేయ భవానీ శంకర "సూర్యనారాయణ" దేవాలయం..రధసప్తమి సందర్భంగా మనందరికీ ఆయురారోగ్యఐశ్వర్యాలను ప్రసాదించమని సూర్యభగవానుని ప్రార్ధిస్తున్నాను.

గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు


గాలి తీసేసిన బెలూన్ లాగా ........

                                                                   తన్మయ్ కు ఐదేళ్ళు.ఇప్పటి పిల్లలు వయసును మించి కబుర్లు చెప్తున్నారు.వాడికి ఒక తమ్ముడు పుట్టాడు.వాడు పుట్టినప్పుడు వాళ్ళమ్మ బొద్దుగా తయారయింది.చిన్నవాడికి     నడకవచ్చేటప్పటికి,ఇద్దరు పిల్లల పనులవల్ల సన్నగా తయారయింది.దీనిలో వింతేమీ లేకపోయినా చిన్నవాడి మొదటి పుట్టినరోజని బంధువులను పిలుచుకున్నారు.ఏమిటి అంతగా చిక్కిపోయావు?అని వాళ్ళ అమ్మను అందరూ అడుగుతుంటే తన్మయ్ అమ్మా నువ్వు నిజంగానే తమ్ముడు పుట్టినప్పుడు బెలూన్ లాగా  ఉన్నావు.  ఇప్పుడు గాలి తీసేసిన బెలూన్ లాగా ఉన్నావు అన్నాడు. అందరూ ఒకటే నవ్వులు. 

Saturday, 24 January 2015

హాయిగా సంతోషంగా .......

                                     మనకు ఉన్నంతలోనే హాయిగా,సంతోషంగా ఉండటం అలవరుచుకుంటే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటమే కాక సంతృప్తికర జీవితంతోపాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.కొంతమంది ప్రతి చిన్నదానికి ఆందోళన పడుతుంటారు.ఆందోళన పడినందువల్ల సమస్య త్వరగా పరిష్కారమవదు.తలనొప్పి రావటం తప్ప.అందుకే కొంచెం ప్రశాంతంగా ఆలోచించితే సమస్యకు పరిష్కారము లభిస్తుంది.ఎవరైనా చిటపటలాడుతుంటే
మనకు కూడా తెలియకుండానే చికాకు అనిపిస్తుంది.అటువంటి వాళ్ళకు సాధ్యమైనంత దూరంగా వుండటం మంచిది.మనం సంతోషంగా ఉంటే మన చుట్టుప్రక్కల వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు.కొంతమందితో మాట్లాడిన తర్వాత మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.మరికొందరితో మాట్లాడితే ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది.సాధ్యమైనంతవరకు హాయిగా,సంతోషంగా,నవ్వుతూ ఉండగలిగితే అన్నివిధాలా అందరికీ శ్రేయస్కరం.                                                                                                  

ఆందోళన తగ్గాలంటే ........

                                                           ఒక్కొక్కసారి మనం ఏమీ ఆలోచించక పోయినా ఆందోళనగా ఉన్నట్లు           అనిపిస్తుంటుంది.అలాంటప్పుడు ఈ క్రింది విధంగా చేస్తే నిమిషాల్లో ప్రశాంతంగా ఉంటుంది.                              1)ముక్కుతో గాలి పీల్చి నోటితో వదలాలి.ఇలా ఒక పది సార్లు చేస్తే అప్పటికప్పుడు ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. 2)చిన్నపిల్లల్లాగా బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తే ఆందోళన మటుమాయం. 3)దీర్ఘంగా ఊపిరి పీల్చి నిదానంగా గాలి బయటకు వదిలినా ఆందోళన తగ్గుతుంది.

రోజుకో కమలా ఫలం

                                 రోజుకో కమలా  ఫలం తింటే చర్మం,ఊపిరితిత్తులు,గర్భాశయానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.కంటిచూపు స్పష్టంగా కనిపిస్తుంది.కాలేయం,మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది.చెడు కొలెస్టరాల్ ని నిరోదిస్తుంది.పీచు ఎక్కువగా ఉంటుంది కనుక విరేచనం సాఫీగా అవుతుంది.గుండెకు రక్తం సక్రమంగా  సరఫరా చేస్తుంది.కాన్సర్ ని నిరోధిస్తుంది.
                                    కమల ఫలమే కాక పై తొక్కలు కూడా చర్మకాంతిని మెరుగు పరిచి అందంగా కనిపించేలా చేస్తాయి.అదెలాగంటే కమలాల పైతోలు ముక్కలు చేసి ఎండ బెట్టి పొడిచేసి కొంచెం పొడి కొంచెం పాలు తీసుకుని ముఖానికి,మెడకు,చేతులకు రాసి చల్లటి నీటితోశుభ్రంగా కడుక్కోవాలి.

బుద్ధి గడ్డి తిని ......

                                  పూజిత స్నేహితురాళ్ళతో కలిసి బట్టలు కొనడానికి వెళ్ళింది.వచ్చేటప్పుడు దగ్గర దారిలో అయితే త్వరగా ఇంటికి చేరుకోవచ్చనే ఉద్దేశ్యంతో బయదేరుతుండగా ఇంకొక స్నేహితురాలు అటువైపు ఈ   సమయంలో వాహనాలు నిలిచిపోతుంటాయి.అందుకని దూరమైనా వేరే దారిలో వెళ్ళమని చెప్పింది.అయినా వినిపించుకోకుండాపూజిత,స్నేహితురాలు కలిసి అదే దారిలో ప్రయాణించటం మొదలెట్టారు.కొద్ది దూరం వెళ్ళేసరికి ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.ఎంత సమయమైనా ఒక్క వాహనము కూడా కదలటం లేదు.బాగా విసుగుతోపాటు,తలనొప్పి కూడా మొదలైంది.ముందుకు,వెనక్కు కూడా వెళ్ళలేని పరిస్థితి.స్నిహితురాలు చెప్పినా  వినకుండా బుద్ధి గడ్డి తిని ఈ దారిలో వచ్చామని స్నేహితురాళ్ళు తమని తాము తిట్టుకున్నారు. 

Friday, 23 January 2015

ఒక్కటే ఆడపిల్ల

                                       స్వరాజ్యం చిన్నప్పుడు ఇంట్లో కరెంటు ఉండేది కాదు.ఒకరోజు పెద్దవాళ్ళందరు ఆరుబయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.స్వరాజ్యం లాంతరు ఒత్తి పెద్దది చేద్దామని వెళ్ళింది.వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు పాము కనిపించలేదు.తర్వాత పెద్ద వెలుగులో తనకు నాలుగు అడుగుల దూరంలోపాముని గమనించి భయంతో బయటకు పరుగు తీసింది.బయట కూర్చున్నవాళ్ళందరూ కర్రలు తీసుకుని లోపలకు వచ్చారు.పాము ఎక్కడా కనిపించలేదు.చివరకు మట్టికుండకు చుట్టుకుని ఉంది.కుండను కదిలించినా కుండతోపాటు  పాము గట్టిగా చుట్టుకోవటంవల్ల ఇవతలకు రావటంలేదు.చివరకు ముల్లుకర్ర తీసుకొచ్చి లాగి చంపేశారు.ఉల్లుపాము  చిన్నగా ఉంటుంది కానీ అది 'ఉఫ్' అని ఊదితే దాని వంటిమీద ఉన్న మచ్చల్లాగే మనుషుల శరీరం మీద వచ్చి పొరలుగా ఊడిపోతాయట.పిల్లను ఊదిందేమో 20 రోజులు జాగ్రత్తగా చూచుకోమని వీభూది మంత్రించి ఒకాయన చెప్పారు.ముగ్గురు అన్నదమ్ములకు మగపిల్లలు ఉన్నారు కానీ స్వరాజ్యం ఒక్కతే ఆడపిల్ల.అమ్మో!ఈపిల్లకు ఏమన్నా అయితే ఏమి చెయ్యాలి?అని అందరూ ఒకటే ఏడుపు.20 రోజులు పిల్లను ఒకళ్ళు విడిచి ఒకళ్ళు కాపలా కాశారు.చివరకు 20 రోజుల తర్వాత స్వరాజ్యం బాగానే ఉందని ఊపిరి పీల్చుకుని అందరూ సంతోషించారు.  

కడుపు తరుక్కుపోతోంది

                                  శిశిర ఎంతో ముచ్చటపడి అందంగా ఇల్లు కట్టుకుంది.అన్నీఒకే రంగులో ఉండేలాగా అంటే గది గోడలు,అలమరలు,క్రింది గచ్చుతో సహా అంటే లేత గులాబీరంగు గది అయితే అదే రంగులో ఉండే పాలరాయి  ఖరీదెక్కువైనా ఖర్చుకు వెనుకాడకుండా కట్టించుకున్నారు.అనుకోకుండా భర్త పనిచేసే కంపెనీ తరఫున విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది.స్వంతగా ఉండటానికి కట్టుకున్న ఇల్లు అద్దెకు ఇవ్వటం ఇష్టం లేకపోయినా ఇవ్వక తప్పలేదు.
 ఎనిమిది సంవత్సరాలకు తిరిగి వచ్చేద్దామనే ఉద్దేశ్యంతో ఇల్లు ఖాళీ చేయించారు.వచ్చేముందు రంగు వేయిద్దామని
వెళ్తే అసలు ఇల్లు మనదేనా?అనేంతగా మురికిగా ఉంది.ఆఇంటిని చూచి శిశిర కడుపు తరుక్కుపోయింది.పాలరాయి నాపరాయి లాగా తయారయింది.కరెంటు స్విచ్ లు  జిడ్డు కారుతున్నాయి.అరమర తలుపులు పైవరకూ పెట్టించుకుంటే ఒక్కటి పట్టటంలేదు.వంటగది అయితే ఎంత మురికిగా ఉందో చెప్పనవసరం లేదు.ఒక్కతాళం పట్టడం లేదు.ఇంటి చుట్టూ నల్లగా అడుగు క్రింద పెట్టలేనంత మురికిగా ఉంది.ఇచ్చేటప్పుడు క్రొత్త ఇల్లు.ఈ 8 సంవత్సరాల్లో ఒక్క రోజన్నాచుట్టూ కానీ,ఇంట్లో కానీ ఊడ్చి తుడుచుకోలేదని వినికిడి.అద్దెకు ఇచ్చినా ఇటువంటి వాళ్ళను ఒకకంట గమనించాలన్నమాట.ఇది ఒక అనుభవం.నెలరోజుల నుండి పనులు చేయించుతున్నా ఒక కొలిక్కి రాలేదు.లక్షలు ఖర్చయ్యేదికాక ఆఇంటిని చూస్తే కడుపు తరుక్కుపోతోంది అక్కా అంటూ శిశిర బాధపడింది.     

Thursday, 22 January 2015

చూపుతిప్పుకోనివ్వని అందం ..........

                         రోజులో ఏదోఒక సమయంలో కొంచెం సమయం కేటాయించగలిగితే చూపుతిప్పుకోనివ్వని అందం
సొంతం చేసుకోవచ్చు.అందుకోసం ఒక1/4 కప్పు పాలల్లో 1 స్పూను గంధంపొడి,కొంచెం (ఆలివ్,బాదం,నువ్వుల నూనె లేదా ఏదోఒక నూనె అందుబాటులో ఉన్నది)నూనె,1/4 స్పూను తేనె కలిపి ముఖం,చేతులు,మెడకు  పూతలా రాసి ఆరేవరకు ఉంచి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఆతర్వాత పాలమీగడ రాసుకుని కాసేపాగి కడిగేస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం నిగారింపుగా ఉంటుంది.స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం నిమ్మరసం కలిపి చేస్తే సువాసనతో తాజాగా ఉంటుంది.  చర్మం నిగారింపుగా ఉంటే ఎవరైనా అందంగా కనిపిస్తారు. సమయం ఉంటే శరీరమంతటా రాసుకోవచ్చు.  
   

గంధంపొడితో.......

                                         ఒక నిమ్మకాయ రసంలో 2 స్పూన్ల కాచిన పాలు,1/4 స్పూను గంధంపొడి కలిపి ముఖానికి,మెడకు,చేతులకు పూతలా  రాసి ఆరాక కడిగేయాలి.రోజుకి ఒకసారి ఇలా చేస్తుంటే చర్మంపై పేరుకున్న
మురికి తొలగిపోయి నలుపుదనం తగ్గి తేటగా కనిపిస్తుంది. 

జరజరమని......

                                 నితిన్ వాళ్ళది వ్యవసాయ కుటుంబం.ఒకసారి వాళ్ళ అమ్మ పాలేరు రాలేదని ఇంట్లో ఎవరూ లేరని పశువులకు మేత వేసి రమ్మని పంపించింది.పశువుల పాక దూరంగా పొలాల ప్రక్కన ఉంది.అసలే నితిన్ కు పాములంటే భయం.బిక్కుబిక్కు మంటూనే అమ్మ మాట కాదనలేక వెళ్ళాడు.అటు ఇటు చూసుకుని ఏమీ లేవని నిర్ధారించుకుని పచ్చగడ్డి తీసి పశువులకు వేయటం మొదలుపెట్టాడు.ఇంతలో పశువుల పాక తాటాకులతో వేస్తారు కనుక పైనుండి జరజరమని శబ్దం వినిపించింది.పైకి చూసేసరికి తాటిఆకుల్లో నుండి పెద్ద పాము పాకుతూ కనిపించింది.వామ్మో!పాము పాము అంటూ నితిన్ పచ్చగడ్డిని అక్కడే వదిలేసి ఒకటే పరుగు.పశువులపాక దగ్గర మొదలెట్టి ఎక్కడా ఆగకుండా ఇంట్లో వెళ్ళి పడ్డాడు.ఒకటే ఆయాసపడుతుంటే ఏమైందని వాళ్ళ అమ్మ అడిగితే నోటమాట రాక పాము పాము అనటంతప్ప ఏమీ మాట్లాడటంలేదు.పాము కనిపించి ఉంటుందని అర్ధం చేసుకుని ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి.కంగారుపడకుండా నిలబడి దాన్ని ఏమీ చేయకపోతే దానంతటదే వెళ్ళిపోతుంది అని చెప్పింది.
  

అరచేతిలో ఆవుజున్ను

                                       60 సంవత్సరాలకలో ఒకసారయినా ఆవుజున్ను అరచేతిలో పెట్టుకుని తినాలని పెద్దలు అంటారు.కన్య వాళ్ళ అమ్మ ఆవుజున్నుతయారుచేసి ఒకతనికి ఇచ్చి పంపించింది. అమ్మా!కన్యా పిల్లలకు గిన్నెలో పెట్టి స్పూను వేసి ఇవ్వకు.ఆవుజున్ను అరచేతిలో పెట్టుకుని కళ్ళకద్దుకుని తింటే మంచిది.అందుకని అరచేతిలో పెట్టు అని చెప్పింది.సరేనని కన్య కూడా అలాగే చేసింది.ఆవుజున్నుపవిత్రమైనది.లభించటం కూడా కష్టం.  

నూనె లేకుండా కూరగాయల అన్నం

ముడిబియ్యం-1/2 కప్పు
ఉల్లిపాయముక్కలు - గుప్పెడు
పచ్చిమిర్చి - 2
సొరకాయముక్కలు -గుప్పెడు
పొట్లకాయముక్కలు - గుప్పెడు
నాటు చిక్కుడుకాయలు - 8
టొమాటోలు -పెద్దవి 2 లేదా చిన్నవి 4
కారట్ ముక్కలు లేదా తురుము - గుప్పెడు
ములక్కాడ  -1(7,8 ముక్కలు)
కరివేపాకు - గుప్పెడు
పుదీనా -గుప్పెడు
కొత్తమీర - గుప్పెడు
దాల్చిన చెక్క - 1
లవంగాలు -2
                                                ముడిబియ్యం కడిగి 4 కప్పుల నీళ్ళుపోసి పైన చెప్పినవన్నీ వేసి రైస్ కుక్కర్లో పెట్టాలి.అన్నం ఉడికి ఆగిపోగానే గిన్నె తీసి ప్రక్కన పెట్టాలి.లేదంటే కొంచెం అడుగున అన్నం అంటుకుని నలుపుగా వస్తుంది.ఇష్టమైతే కాకరకాయ,బీరకాయ ముక్కలు కూడా వేయవచ్చు.నూనె లేకపోయినా రుచిగా ఉంటుంది.రసం,పెరుగుతో తినవచ్చు.లేదా అలాగే తినవచ్చు.నూనె లేకుండా అన్ని రకాల కూరగాయలు వేస్తాము కనుక ఆరోగ్యానికి మంచిది.బరువు తగ్గుతారు.


Wednesday, 21 January 2015

కళింది మట్ట

                                                                  జ్ఞానీ ఇంటికి తెలిసిన వాళ్ళమ్మాయి వచ్చింది.వచ్చిన దగ్గరనుండి లొడలొడా(అతిగా)మాట్లాడుతూనే ఉంది.మాటల్లో మావైపు కళింది మట్టలు బోలెడన్ని ఎక్కడబడితే అక్కడ ఉంటాయి.మేమసలు పట్టించుకోము.ఇక్కడ ఏంటో?ఇంటి ముందు దిష్టి తగలకుండా కడతారు.కుండీలలో తెచ్చి పెడతారు అంది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కలబందని వాళ్ళు కళింది మట్ట అంటారట.

కన్నీటి వీడ్కోలు

                                        వసంత చలాకీగా ఉంటుంది.తరతమ భేదం లేకుండా అందరింటికి ఏ చిన్నదానికైనా ఎంత దూరమైనా,భర్త పనుల ఒత్తిడి కారణంగా రాలేకపోయినా, తానొక్కతే అయినా వెళ్ళివస్తుండేది.సాయంత్రమైతే చాలు దగ్గరలోని గుడిలో భజన కార్యక్రమానికి,దైవ సంకీర్తనకు వెళ్తుండేది.అటువంటిది ఒకరోజు బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళి అక్కడ ఉన్నట్టుండి క్రింద పడిపోయింది.అక్కడితో ఆమె మరి మాట్లాడలేక గొంతు మూగబోయింది.  వైద్యులు ఆమె మరి మాట్లాడలేదని తేల్చి చెప్పేశారు.అయినా తనకు అవసరమైనవి పుస్తకంలో రాసి  చూపించేది. తాను చనిపోతానని తెలుసు కనుక పిల్లలకు తెలియదని తన కర్మకాండలకు అందరినీ పిలవమని బంధువులందరి పేర్లు పుస్తకంలో రాసి ఉంచింది.పిల్లలు ఆవిషయం చెప్పి బాధపడుతుంటే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.ఎక్కడున్నా అందరూ వచ్చిఅశ్రునయనాలతో ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. 

Tuesday, 20 January 2015

ముక్కుమీద ఈగ వాలినా .........

                                                            వినమ్రకు వరుసకు మేనమామకు అత్యవసరంగా గుండెకు బైపాస్ సర్జరీ చెయ్యవలసి వచ్చింది.ఆయనకు ఇతరత్రా ఏఅనారోగ్య సమస్యలు లేవు.ముందురోజు మాత్రం నడుస్తుంటే ఆయాసం
వచ్చి గుండె దగ్గర నొప్పివస్తే పొట్టలో గ్యాస్ పట్టేసిందేమో అనుకున్నాడట.తగ్గకపోయేసరికి ఆసుపత్రికి వెళితే ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఆపరేషన్ చెయ్యాలన్నారు.ఆయనకు ఒక ఆరు సంవత్సరాల క్రితం పెద్ద యాక్సిడెంట్ అయ్యి కాలుకి మూడు రాడ్లు వేసారు చేతికి నరాలు తెగిపోయి చెయ్యి ఆకారం అయితే ఉంది కానీ పనిచేయ్యకపోగా విపరీతమైన నొప్పి వస్తుంటుంది.నొప్పిమందులువేసుకోవటం వల్ల కూడా కొంత తెలియలేదు.ఒక చెయ్యి పనిచెయ్యక పోవటం వల్ల,ఇంకొక చేతికి రక్తం ఎక్కిస్తున్నారు.అంతకు ముందు పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఇంత ఇబ్బంది పడలేదు.ఇప్పుడు  ముక్కు మీద ఈగ వాలినా ఎవరో ఒకరిని పిలిచి తోలమనాల్సిన పరిస్థితి వచ్చిందని అంత బాధలోనూ ఆయన జోక్ చేస్తున్నాడు.  

ఈరికలు

                                        జాగృతి ఇంట్లో వంటమనిషి ఒకరోజు కూరగాయలు కోస్తూ ఈరికలు కొయ్యాలా అమ్మా!
అని అడిగింది.అంటే ఏమిటి?అంటే ఉల్లిపాయలు ఈరికలు కొయ్యాలా?అంటున్నాను అంది.నువ్వు అడిగినది నాకు అర్ధం కాలేదంటే అదేనమ్మా చీలికలుగా అంటే సన్నగా పొడవుగా కొయ్యటాన్నే మావైపు ఈరికలు అంటాము.అందుకని అలా నోటికి వచ్చేసింది అంది.  

Monday, 19 January 2015

పరిక్షలు ఉత్తమం

                                                         ఈమధ్య గుండెకు సంబందించిన సమస్యలు   ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మాములుగా అందరితో పాటు,వైద్యులు కూడా ఎదుటివారి ఆరోగ్యసమస్యలు పరిష్కరిస్తూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు.అందువల్ల గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల కవాటాలన్నీ దాదాపుగా మూసుకుపోయేవరకు తెలుసుకోవటంలేదు.చివరకు ప్రాణం మీదకు వచ్చి సర్జరీలు చేయించుకునే పరిస్థితి ఎదురవుతుంది.ఇటువంటి క్లిష్టపరిస్ధితి ఎదురు కాకుండా ఉండాలంటే 40 సంవత్సరాలు దాటిన దగ్గరనుండి ప్రతిఒక్కరు తమ ఆరోగ్యం,తమ జీవిత భాగస్వాముల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి సంవత్సరానికి ఒకసారి శరీరానికి సంబందించిన పూర్తి పరిక్షలు చేయించుకోవటం ఉత్తమం.కొంచెం ఏమాత్రం తేడాకనిపించినా ప్రతి ఆరునెలలకు ఒకసారి చేయించుకోవటం ఉత్తమం.  

లక్షా తొంభై అనుమానాలు

                                                                          ఇంతకు ముందు రోజుల్లో అందరూ పొలాల్లోవైనా,పెరటిలోవైనా కూరగాయలు కానీ,పండ్లు కానీ,ఆకుకూరలైనా,పండుగ వచ్చిందంటే పిండివంటలైనా ఎంతో ఆప్యాయంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవారు.కొన్ని కుటుంబాలలో తప్ప ఆ ఆప్యాయతానురాగాలే కరువైపోయాయి.వాళ్లకు,వీళ్ళకు పంపే బదులు అమ్ముకుంటే పోలా!అనుకునేవాళ్ళే ఎక్కువైపోయారు.ఒకవేళ ఎవరైనా పంపినా అమ్మో! వీళ్ళకు మనతో ఏమి అవసరముందో?మన నుండి ఏమి ఆశిస్తున్నారో?లేకపోతే వీళ్ళకు ఏమి దోషముందో?అది పోవటానికి ఇలా ఇస్తున్నారేమో?ఎవరో ఒకళ్ళకి దానం ఇవ్వమని ఎవరైనా చెప్పారేమో?ఇలా లక్షా తొంభై అనుమానాలు మనసులో మెదులుతున్నాయి.ఇక పిండి వంటలు కూడా నువ్వులు వేస్తారు కనుక అమ్మో!అవితీసుకుంటే మనకు ఏదైనా పట్టుకుంటుందేమో?అనే ఆలోచనలు,అనుమానాలుఎక్కువైపోయాయి.          

ఈ చింత పూసింది అంటే ఆచింత కాసింది.....

                             ఊర్మిళ  బంధువులందరిదీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కరకం మనస్తత్వం.ఎలాగంటే ఈచింత పువ్వు పూసింది అంటే ఆచింత కాయ కాసింది అనేంతగా ఉంటుంది వ్యవహారం.అది మంచి అయినా,చెడు అయినా అంతే.
ఇక్కడ అమ్మాయి పుట్టిందంటే అక్కడ సమర్తాడిందంటారు.ఇక్కడ చిన్న జబ్బు చేసిందంటే అక్కడ చనిపోయింది
అంటారు.ఒక్కొక్కసారి ఊర్మిళకు చెడ్డ చికాకు వచ్చేస్తుంటుంది.అయినా తప్పదు కదా!ఒంటరిగా మనం ఒక్కళ్ళమే 
గిరి గీసుకుని కూర్చోలేము.అందరినీ భగవంతుడు ఒకే విధంగా పుట్టించడు కదా!పోనీలే రకరకాల మనస్తత్వాలు
 అని సరిపెట్టుకుంటుంది.

స్పందన

                            యోగిత గుడిలో పూజ చేసుకుని ధనుర్మాస సందర్భంగా గుడికి వచ్చిన వాళ్ళందరికీ  తులసి మొక్కలు పంచుదామని తీసుకెళ్ళిరామాలయంలో ఇచ్చింది.అక్కడ ప్రసాదాలతోపాటు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మొక్క ఇస్తే ఇంటికి తీసుకెళ్ళి ఏమి చేయాలి?అని అడిగారు.తులసి కోటలో పెట్టుకోండి లేకపోతే మీఇంటి గుమ్మం ముందు  పెట్టుకొండి.తులసిమొక్క గుడి నుండి తీసుకెళ్ళి ఇంటిముందు పెడితే మంచిదని అంటే తప్పనిసారిగా తులసిమొక్కలు దానం చేస్తున్నారేమో అన్న శంకతో తీసుకెళ్ళారు.
             యోగిత కుటుంబానికి గోపూజోత్సవానికి రమ్మని బాబాగారి గుడినుండి పిలుపు వచ్చింది.గోపూజకు వచ్చినవారికి ఇద్దామని యోగిత తులసి మొక్కలు తీసుకెళ్ళింది.పూజారికి చెప్పగానే పూజ దగ్గర పెట్టిన తర్వాత వచ్చినవారిని తీసుకెళ్ళమని ప్రకటించారు.ముత్తైదులందరూ చక్కగా పూజదగ్గర అలంకరించారు.తులసివనంలో దేవతలు ఆసీనులైనట్లుగా అనిపించింది.గోపూజ,మిగతా పూజా కార్యక్రమం అయినతర్వాత ముందే ప్రకటించిన విధంగా అందరూ తులసిమొక్కలు సంతోషంగా తీసుకెళ్ళారు.ఇంకా కొంతమందికి మొక్కలు అందలేదని చెప్పారు.వెంటనే యోగిత వాళ్ళు మనిషిని పంపించి ఒక 10 ని.ల్లో అందరికీ అందించారు.అప్పటివరకు ఎదురుచూచి మరీ సంతోషంగా తులసి మొక్కలు తీసుకెళ్ళారు.యోగిత వాళ్లకు చాలా సంతోషంగా,తృప్తిగా అనిపించింది.ఎందుకంటే ముందురోజు స్పందన ఆవిధంగా ఉంటే తర్వాత రోజు స్పందన ఈవిధంగా ఉంది.     

మీగడ పెరుగు

                        మీగడ పెరుగు తినటానికి రుచిగా ఉండటమే కాక చర్మం మృదువుగా ఉండటానికి,కాంతివంతంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది.అదెలాగంటే కాస్త మీగడ పెరుగు తీసుకుని ముఖానికి,మెడకు,చేతులకు రాసి గోరువెచ్చని నీళ్ళతో కడిగితే వయసుతో సంబంధం లేకుండా వచ్చే మచ్చలు,ముడతలు రాకుండా చేస్తుంది.
                         మీగడ పెరుగులో  శనగపిండి కలిపి శరీరానికి రుద్దుకుంటే చలికాలంలో వచ్చేపగుళ్ళు,చర్మం పొడిబారటంలాంటివి లేకుండా చర్మం మృదువుగా ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. జిడ్డుగా లేకుండా ఉంటుంది. 

Saturday, 17 January 2015

గాజు పాత్రలు ఒకదానిలో ఒకటి పట్టేస్తే .........

                            గాజుగ్లాసులు,గిన్నెలు ఒకదానిలో ఒకటి గట్టిగ పట్టేస్తే నీళ్ళల్లో కాసేపు ఉంచాలి.లేదా రెండిటికి  మద్యలో కొంచెం ఖాళీ ఉన్న వైపు నీళ్ళు నిదానంగా లోపలకు పోసి నెమ్మదిగా కదిలించి తీస్తే పగిలిపోకుండా చక్కగా విడివిడిగా వస్తాయి.

చామనచాయగా ఉంటే ......

                                        పెరుగు,తేనె కలిపి ఈమిశ్రమాన్నిముఖానికి,మెడకు,చేతులకు పాక్ లాగా వేసి 20 ని.ల
తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం రంగు మెరుగుపడుతుంది.

సీసామూతలు సరిగా పట్టకపోతే

                        సీసాల మూతలు సరిగా పట్టకపోతే మూతల లోపలి భాగానికి కొద్దిగా వంట నూనె రాస్తే సరి.

Friday, 16 January 2015

చక్కనమ్మ చిక్కినా అందమే

                                        వినీష  అందంగా అజంతా శిల్పంలాగా ఉంటుంది."చక్కనమ్మ చిక్కినా అందమే"అనేది
సామెత.ఒక్కొక్కసారి కొంచెం బొద్దుగా,ఒక్కొక్కసారి కాస్త చిక్కి సన్నగా తయారౌతుంది.అయినా కూడా  అందంగా మెరిసిపోతుంది.వినీష లాంటి వాళ్ళను చూసే ఈ సామెత వాడారేమో అనిపిస్తుంది.ఎటువంటి వాళ్ళకయినా ఈర్ష్య కలిగేలా వినీష  చర్మం కాంతులీనుతుంటుంది.అదెలా సాధ్యమంటే రంగురంగులలో ఉండే కూరగాయలు,పండ్లుతనకు ఇష్టమున్నా,లేకపోయినా తింటే మంచిదని,ఆరోగ్యపరంగానేకాక,అందంగాఉంటారని వాళ్ళమ్మ చిన్నప్పటినుండి తనకు తినటం అలవాటు చేసిందని చెప్పింది.టొమాటోలు,ఆకుకూరలు,నిమ్మజాతి పండ్లు,చిరు ధాన్యాలతో చేసిన పదార్థాలు,చేపలు,గుడ్లు చర్మానికి కాంతినిచ్చితాజాగా ఉంచుతాయని తన చర్మ రహస్యం చెప్పింది.మరి మనం కూడా ప్రయత్నిద్దామా ! చర్మం కాంతివంతంగా ఉండటానికి పైపూతలు వేసినా దానితోపాటు ఆహారం తీసుకోవటం వల్ల సహజ సౌందర్యం ఇనుమడిస్తుంది.    

పంటి నొప్పులు

                                   ఇప్పుడంటే దంత వైద్యశాలలు ఉంటున్నాయి కానీ ఒకప్పుడు ఆకులు అలముల మీదే
ఆధారపడేవాళ్ళు.మధూలిక అమ్మమ్మ ఆకుమందు ఇస్తే పంటినొప్పి మటుమాయమౌతుందని ఆవూరి వాళ్ళ
నమ్మకం.ఎవరికి పిప్పిపన్ను నొప్పి వచ్చినా వచ్చేవారు.మధూలిక ఇదంతా చిన్నతనం నుండి శ్రద్ధగా అమ్మమ్మ వెన్నంటే ఉండి గమనిస్తుండేది.మధూలిక అమ్మమ్మ అక్కడొక ఆకు,అక్కడొక ఆకు పెరటిలోకి వెళ్ళి తీసుకొచ్చి నలిపి కొంచెం పసరు వచ్చిన తర్వాత పిప్పిపన్ను ఉన్నచోట నొక్కి పెట్టుకోమనేది.అలా 3రోజులు పెట్టుకున్న తర్వాత పంటినొప్పి మటుమాయమయ్యేది.  

గోపూజ విశిష్టత

                                                              గోమాతలో సకల దేవతలు కొలువుంటారని నానుడి.గోమాతను పూజిస్తే సకల దేవతలు ఆశీర్వదిస్తారు.పితృదేవతలు సంతోషిస్తారు.గోవులను లక్ష్మీ సంపదగా భావించి పూజించాలి.గోక్షీరం
అమృతంతో సమానం.గోమూత్రం సర్వరోగ హరమై క్రిమికీటక నాశనకరమై గృహాన్ని పవిత్రం చేస్తుంది.ఆవు నెయ్యితో దీపారాధనకు ఎంతో మంచిది.యజ్ఞంలో,హోమాలలో ఆవునెయ్యికి ప్రాధాన్యం.ఆవుపేడతో ముంగిట్లో కళ్ళాపి చల్లుతారు.అమ్మపాలు తర్వాత ఆవుపాలు ఎంతో పవిత్రమైనవి,పోషకమైనవి.అభిషేకద్రవ్యాలలో ముఖ్యమైనవి ఆవునెయ్యి,పాలు,పెరుగు.ఇలా గోమాతకు సంబందించిన ప్రతిదీ ఎంతో పవిత్రమైనది.ఏకాదశినాడు శుచిగా స్నానంచేసి ఉదయమే గోమాతను పూజిస్తే ఎంతో పుణ్యం.శుక్రవారం గోపూజ ఎంతో మంచిది.ఈరోజు కనుమ,శుక్రవారం,ఏకాదశి అన్నీ కలిసివచ్చినాయి కనుక గోమాతను పూజించటంవల్ల విశిష్ట ఫలితం కలుగుతుంది.
   

"కనుమనాడు కాకైనా కదలదు"

                                              "కనుమనాడు కాకైనా కదలదు"అనే సామెత ఉంది.వీలైనంతవరకు ఎవరూ ఆరోజు ప్రయాణించరు.పండుగరోజు రాత్రి కానీ,ముక్కనుమనాడు  కానీ వెళ్తారు.ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే
ఎవరైతే వెళ్ళాలో వాళ్ళ ఇంటికి తూర్పుకానీ,ఉత్తరం కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో వెంట తీసుకెళ్లవలసినవి పెట్టుకుని ఆరోజు ప్రయాణం చేయవచ్చని దైవజ్ఞుల సలహా.   

కనుమ,ముక్కనుమ

                                                  మన భారతీయ సంస్కృతిలో పశుసంపదకు విశిష్ట ప్రాధాన్యం ఉన్నందువలన పశుపాలన,గోసంరక్షణకు ప్రసిద్ధి.పాలిచ్చే గోవుకు,పనిచేసే బసవనికి ఎంతో విలువ,పూజనీయత ఉంది.ధాన్యలక్ష్మి
ఇంటికి వచ్చే సమయంలో వచ్చే "సంక్రాంతి"పర్వదినాలలో మొదటిరోజు బోగి,రెండోరోజు మకర సంక్రాంతి, ప్రత్యేకంగా మూడోరోజు పశువుల పండుగ చేస్తారు.ఇదే కనుమ ప్రత్యేకత.నాలుగోరోజు ముక్కనుమ.దీనిని దూడల పండుగ అంటారు.కొన్ని ప్రాంతాలలో ముక్కనుమ నాడు గోవులను,ఎద్దులను మాత్రమే పుజిస్తారు.పశువుల పండుగ అంటే పశువులకు విశ్రాంతి.ఆరోజు పొలం పనులు చేయరు.ఉదయమే శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు పూసి అందంగా అలంకరిస్తారు.కొమ్ములకు మువ్వలు,మెడలో గంటలు కడతారు.

Thursday, 15 January 2015

అనుకోకుండా.......

                                          ఉదయాన్నే పెదనాన్నగారి అమ్మాయి ఫోన్ చేసి గుళ్ళో గోదాదేవి రంగానాధస్వామి  కళ్యాణం జరుగుతుంది.మీరు చేస్తారా?అని అడిగింది.భగవత్సంకల్పం.మాకు అనుకోకుండా దక్కిన అదృష్టంగా భావించి సరేనని చెప్పాము.పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం మేళతాళాలతో తలంబ్రాలబియ్యం,కల్యాణానికి అవసరమైనవన్నీ తీసుకుని పిల్లలు,పెద్దలు,ముత్తైదువలు అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి రంగరంగవైభవంగా గోదాదేవికి రంగనాధస్వామికి కళ్యాణం జరిపిచడం జరిగింది.ఆద్యంతముస్వామి,అమ్మవార్లకళ్యాణం కన్నులపండువగా జరిగింది.అప్పటికప్పుడు అనుకున్నా ఏర్పాట్లన్నీ ఘనంగా,సంతృప్తికరంగా ఉన్నాయి.దేముడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా!అందరూ దగ్గరుండి తల ఒక పని చేశారు.మాకూ ఎంతో సంతోషంగా,సంతృప్తిగా అనిపించింది.
   

సంక్రాంతి శుభాకాంక్షలు

                                       అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.  
               
 

Tuesday, 13 January 2015

కూరగాయల రసం

                                       మనకు ఇష్టమైన అన్నిరకాల కూరగాయలముక్కలు,కొంచెం కొత్తిమీర  మిక్సీలో  వేసి,
రసం తీసి వడకట్టి భోజనానికి ముందు ఒక గ్లాస్ తీసుకుంటే ఎక్కువ ఆకలి వేయదు.తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

పొడిచర్మం ఉన్నవాళ్ళు తీసుకోవలసిన ఆహారం

                                       పొడిచర్మం ఉన్నవాళ్ళు కొబ్బరినీళ్ళు,ఒమేగా3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది.వెల్లుల్లి,బాదం,కారట్,వాల్ నట్లులో అవి అధికంగా ఉంటాయి.ఇవి పొడి చర్మాన్ని తాజాగా మారుస్తాయి.
రోజుకొక ఆపిల్ తినటంవల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

Monday, 12 January 2015

కారట్,టొమాటో సూప్

కారట్ - 200 గ్రా.
టొమాటోలు - 2
అల్లం - చిన్న ముక్క
మిరియాలపొడి - 1/4 స్పూను
ఉప్పు - తగినంత
 పుదీనా ఆకులు - అలంకరణకు కొంచెం
                                      అల్లం,కారట్లు కడిగి చిన్న ముక్కలు కొయ్యాలి. 5 ని.లు ఉడికించి మిక్సీలో వేసి వడ  పొయ్యాలి.టొమాటోలు వేడి వేడి నీళ్ళల్లో  వేసి బయటకు చల్లటి నీళ్ళల్లో వేస్తే పైన ఉండే తోలు తేలికగా ఊడి  వస్తుంది.వీటిని కూడామిక్సీలో వేసి వడ పొయ్యాలి.ఈ రెండు మిశ్రమాల్ని కలిపి మరిగించాలి.దానిలో తగినంత ఉప్పు,మిరియాలపొడి కలిపి తీసేయ్యాలి.కొద్దిగా నిమ్మరసంపిండితే రుచిగా ఉంటుంది.సన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసుకుని వేడివేడిగా తాగితే బాగుంటుంది ఇది ఏ కాలంలోనయినా మంచిది.   

అమ్మకు పుట్టినరోజు కానుక

                                                 శ్రీవిద్యకు ఇద్దరు మగపిల్లలు.అందులో చిన్నవాడికి అమ్మ అంటే  అమిత ప్రేమ.
చిన్నప్పటి నుండి నేను పెద్దయ్యాక బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి నీకు వడ్డాణం చేయిస్తాను అని
చెప్పేవాడు.అన్నట్లుగానే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు.ఉద్యోగరీత్యా విదేశంలో కొన్నాళ్ళు పనిచేయవలసి వచ్చింది.అక్కడ ఉన్నప్పుడు అమ్మ పుట్టినరోజు వచ్చింది.అమ్మను ఆశ్చర్యానందాలలో ముంచెత్తుదామని  స్నేహితుడికి డబ్బు పంపించి వడ్డాణం కొనమని,అదే చేత్తో ఒక పెద్ద కేక్ తీసుకుని అమ్మకు పుట్టినరోజు కానుక ఇవ్వమని పంపించాడు.శ్రీదేవి ఉబ్బితబ్బిబ్బయి తనవాళ్ళందరికీ సంతోషంగా కొడుకు పుట్టినరోజు కానుకగా వడ్డాణం పంపించాడని చెప్పింది .   

Sunday, 11 January 2015

వజ్రాల నెక్లెస్

                               సాకేత్ తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన గారాబు బిడ్డ.అతి గారాబం వల్ల చదువంటే కాస్తంత అశ్రద్ధ.అప్పుడప్పుడు సరిగ్గా చదువుకోవటం లేదని అమ్మానాన్న సతాయిస్తుంటారు.అప్పుడు కాసేపు ఏమీ మాట్లాడకుండా కూర్చుని తర్వాత అమ్మ దగ్గరకు వచ్చి చిన్నపిల్లలను మాయ చేసినట్లుగా తల నిమిరి అమ్మా!నేను పెద్దయిన తర్వాత బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళి సంపాదించి నీకు వజ్రాల నెక్లెస్ కొని పెడతాను అంటుంటాడు.వజ్రాల నెక్లెస్ మాట దేముడెరుగు ముందు నువ్వు చదువుకోమంటుంది వ్వాళ్ళ అమ్మ.ఏమ్మా నీకు వజ్రాల నగ వద్దా?అని ఆట పట్టిస్తుంటాడు. 

టొమాటో రైస్

టొమాటోలు - 1/4 కే.జి
బియ్యం - 1/2 కే.జి
పుదీనా - 1 చిన్న కట్ట
కొత్తిమీర - 1 చిన్న కట్ట
కరివేపాకు - కొద్దిగా
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 5
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 స్పూను
నూనె - 2 గరిటెలు
దాల్చిన చెక్క - 1
లవంగాలు - 4
యాలకులు - 2
ఉప్పు - సరిపడా
సంబారు కారం - 1 1/2 స్పూను
మసాలాపొడి - 1/4 స్పూను
                                               ముందుగా బియ్యం కడిగి అన్నం(మెత్తగా కాకుండా) వండి ప్రక్కన పెట్టుకోవాలి.స్టవ్ మీద బాండీ పెట్టి నూనెవేసి కాగిన తర్వాత దాల్చిన చెక్క,లవంగాలు,యాలకులు కరివేపాకు,కొత్తిమీర,పుదీనా వేసి వేయించాలి.పొడవుగాతరిగిన ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.టొమాటో ముక్కలు కూడా వేసి ఉప్పు,కారం వేసి వేయించాలి.చివరలో మసాలా పొడి వేసి వేయించి దించేయాలి.అన్నం ఒక ప్లేటులో వేసి ఆరనివ్వాలి.కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు టొమాటో పేస్ట్ కూడా వేసి రెండు బాగా కలపాలి.నోరూరించే ఘుమఘుమలాడే రుచికరమైన టొమాటో రైస్ సిద్ధం.పిల్లలకు,పెద్దలకు కూడ లంచ్ బాక్స్ లో పెట్టటానికి చాలా బాగుంటుంది.

వెంటనే నునుపుగా....

                          కొంచెం కలబంద గుజ్జు తీసుకుని ముఖానికి,చేతులకు రాసి ఒక 5 ని.ల తర్వాత చల్లటి నీటితో కడిగితే వెంటనే చర్మం నునుపుగా ఉంటుంది.చలికాలంలో చిన్నచిన్నపగుళ్ళు,ముడతలు మటుమాయమౌతాయి.  

చరవాణితో వచ్చిన తంటా

                                         క్రిష్ అమ్మానాన్నలు బదిలీపై స్వంత ఊరికి వచ్చారు.స్వంత ఇళ్ళు ఉన్నా అద్దెకు ఇవ్వటంవల్ల అప్పటికప్పుడు ఇబ్బంది పెట్టి ఖాళీ చేయమనటం ఇష్టంలేక వేరే ఇల్లు అద్దెకుతీసుకున్నారు.సామాన్లు దించుతున్నప్పుడు క్రిష్ స్నేహితుడి తండ్రి చూచి చాలా సంవత్సరాల తర్వాత క్రిష్ తల్లిదండ్రులను చూడటంవల్ల అవునో,కాదో అనుకుని సరిగా గుర్తుపట్టక కొడుక్కి ఫోను చేశాడు.వాళ్ళకు స్వంత ఇళ్ళున్నాయి కదా!ఫలానా చోట వాళ్ళలాగే కనిపించారు.ఇక్కడికెందుకు వస్తారు? నిజంగా వాళ్ళేనా క్రిష్ ని కనుక్కో?అని చెప్పాడు.క్రిష్ విదేశాలలో ఉంటే స్నేహితుడు అర్ధరాత్రప్పుడు ఫోనుచేసి మరీ అసలు విషయం నిర్ధారించుకున్నాడు.అర్ధరాత్రనీ లేదు అపరాత్రనీ లేదు ఈ చరవాణితో వచ్చిన తంటా ఇదే.ఇంత చిన్న విషయానికి అంత హంగామా.     

Saturday, 10 January 2015

కర్రతో కొడుతున్న శబ్దాలు

                                         మంజరి ఇంటిదగ్గరలో  తాటిఆకులతో వేసిన ఇల్లుంది.అందులో చిన్నచిన్నపనులు
చేసుకుంటున్న ఒక జంట కాపురముంటున్నారు.రోజు సాయంత్రం అయ్యేటప్పటికి భర్త తాగి వస్తుంటాడు.రాగానే చావు,చావు అంటూ కర్రతో కొడుతున్న శబ్దాలు వినిపిస్తుంటాయి.మంజరికి అసలు విషయం తెలియక భర్త తాగివచ్చి భార్యను కొడుతున్నాడనుకుని అయ్యో!పాపం రోజూ తాగి ఇంటికి రావటమే కాక భార్యను ఇబ్బంది పెడుతున్నాడని
కాస్త గడ్డి పెడదామనుకుని పాలేరుని తోడు తీసుకుని వెళ్ళింది.ఇంతా అక్కడకు వెళ్లేసరికి ఊహించిన దృశ్యం వ్యతిరేకంగా ఉంది.అదేమిటంటే తాగుడు మానటం లేదని భార్యే భర్తను కొడుతుంది.ఆ విషయం బయటి వాళ్లకు తెలియకుండా భర్త చావు,చావు అంటూ కర్రతో పరుపుపై కొడుతున్నాడు.వైద్యులు తాగుడు మానకపోతే చనిపోతాడన్నారని ఎంత చెప్పినా తాగుడు మానటం లేదని చెప్పీ చెప్పీ విసుగు వచ్చిందనీ తాగుడు మానేసేవరకు కొడుతూనే ఉంటానని ఇలా చేస్తేనైనా బుద్ది వచ్చి మానేస్తాడనే నమ్మకంతో కొడుతున్నానని చెప్పింది.ఇద్దరూ ఎవరిమాట వినే పరిస్థితిలో లేరు.వాళ్లకు చెప్పి ప్రయోజనం లేదని ఆమె నమ్మకం వమ్ముకాకూడదని అనుకుంటూ మంజరి ఇంటికి తిరుగు ముఖం పట్టింది.   

కొబ్బరి నీళ్ళతో.....

                                 కొబ్బరి నీళ్ళు ఆరోగ్యపరంగానే కాక,అందానికి కూడా ఉపయోగపడతాయి.ఉదయం ముఖం మెడ,చేతులు శుభ్రంగాకడిగి తడిలేకుండా తుడుచుకుని కొబ్బరినీళ్ళను ముఖానికి,మెడకు,చేతులకు రాసుకుని
15 ని.ల తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం మీదున్న మచ్చలు,ముఖం,మెడ,చేతుల నలుపుదనంపోయి చర్మం నిగారింపుగా ఉంటుంది. 

Friday, 9 January 2015

మంటలు ఆర్పబోయి .......

                                                రామన్న పనిచేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.ఎవరూ ఆవిషయం గమనించలేదు.రామన్న ఫోను మాట్లాడుతూ అటువైపు వెళ్ళాడు.ప్రక్కనే ఇళ్ళు ఉండటం వలన  మంటలార్పే యంత్రం వచ్చేసరికి ఆలస్యమవుతుందని ఆరోజు పనిలోకి ఎవరూ రాకపోవడంవల్ల తానొక్కడే ఒంటి చేతి మీద మంటలైతే  ఆర్పగలిగాడు కానీ బయటకు వచ్చి క్రింద పడిపోయాడు.ఉన్న కొద్దిమంది తోటివారు ఆసుపత్రికి తీసుకెళ్ళారు.వైద్యులు మూడు రోజుల వరకూ నమ్మకం చెప్పలేమన్నారు. ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవటం వల్ల మనిషి గాలి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.మంటలు ఆర్పబోయి తనప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.ఎట్టకేలకు రామన్న రెండురోజుల తర్వాత లేచి కూర్చున్నాడు.ఒక 15 ని.లు ఆసుపత్రికి వెళ్ళటం ఆలస్యమైతే మనిషి దక్కేవాడు కాదు.ముందు అతనిపై ఆధారపడిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి.
   

Thursday, 8 January 2015

నాలుకా లేక తాటిమట్టా?

                                   మధు శాలిని మొదటిసారి కనిపించినప్పుడు మనిషి అమాయకురాలేమో అనుకునేట్లుగా
కనిపిస్తుంది.కొన్నిరోజులైతేగానీ ఆమె నిజ స్వభావం తెలియదు.సరిత స్నేహితురాలు కనిపించి ఆమెతో ఎక్కువగా  
మాట్లాడకే తల్లీ!నీనోట్లో నుండి మాట బయటకు రాకుండానే నీమీద లేనిపోయినవి కల్పించి చెప్పేస్తుంది జాగ్రత్త అని చెప్పింది.ఆమెది నాలుకా లేక తాటిమట్టా?అని అందరూ అనుకుంటారు.తాటిమట్టకు రెండు వైపులా పదును ఉన్నట్లుగా ఈమె నాలుకకు కూడా రెండువైపులా పదునెక్కువ అంది.స్నేహితురాలు చెప్పినట్లుగానే నాలుగు రోజుల తర్వాత ఒకామె ఏమిటండీ నేనెవరో మీకు తెలియకపోయినా మీరంటే మాకెంతో గౌరవము.మీరు అలా మాట్లాడారంటే మేము నమ్మలేదనుకోండి.అయినా మీకు తెలియటం కోసం చెప్తున్నాము.మధుశాలిని మాగురించి మీరు ఏవేవో మాట్లాడారని చెప్పింది అంది.ఆరకంగా చెప్పటం తప్పు కదా!అని ఆమెను అడిగినా నేనెక్కడ చెప్పాను?అనే జవాబే వస్తుంది కనుక అడగటం కూడా అనవసరమనుకుని అప్పటినుండి సరిత మధుశాలిని కనిపించినా తప్పించుకుని వెళ్ళిపోవటం మొదలు పెట్టింది.ఇటువంటి వాళ్ళదే ఇప్పుడు రాజ్యం.తస్మాత్ జాగ్రత్త.         

రక్తంలో హిమోగ్లోబిన్

                                     మహిళల్లో ఏకారణం వల్లనైనాగానీ ఎక్కువమందికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది.రోజూ ఆహారంలో ఆకుకూరలు,పండ్లు,పాలు,గుడ్లు తీసుకుంటూ ఒకపది ఎండు ద్రాక్ష శుభ్రంగా కడిగి కొంచెం నీళ్ళల్లో 7,8 గం,లు నానబెట్టి వాటిని నమిలి తిని,ఆనీరు త్రాగాలి.రోజూ ఇలా చేస్తే క్రమంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.శరీరంలో రక్తం సరిపడా ఉంటే వ్యాధులు దరిచేరకుండా ఉండటమేకాక,చర్మం కాంతివంతంగా ఉంటుంది.   

అదనపు కొవ్వు కరగటానికి .......

                             దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక చిటికెడు అంటే ఒకటి,మూడు వేళ్ళతో వచ్చినంత పొడి తీసుకుని అరచేతిలో వేసుకుని మూడు చుక్కల తేనెతో కలిపి రంగరించి చూపుడు వేలితో తీసుకుని నాలుకకు రాయాలి.రోజూ ఇలా చేస్తుంటే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరిగి జీవక్రియల వేగం మెరుగుపడి బరువు తగ్గుతారు.

Wednesday, 7 January 2015

సున్నితమైన చర్మం తాజాగా ..........

                                  సున్నితమైన చర్మం కలవారు కలబంద గుజ్జులో కీరదోస రసం,పెరుగు,గులాబీ నూనె ఒక్కొక్క స్పూను చొప్పున కలిపి రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.

కలబందతో కళగా.........

                                కలబంద గుజ్జులో ఒక స్పూను గులాబీ రసం కలపాలి.ఎండలో నుండి వచ్చాక ముఖానికి రాసి మృదువుగా రుద్దాలి.ఇలా తరచుగా చేస్తే ముఖం కళగా ఉంటుంది.
                                 కలబంద గుజ్జులో ఒక స్పూను నిమ్మరసం కలిపి దాన్ని ముఖం,మెడ,చేతులుకి రాసుకుంటే
నలుపుదనం తగ్గుతుంది.15 ని.ల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేయాలి.

Tuesday, 6 January 2015

విజయ రహస్యం

                                                                           తీవ్ర ఒత్తిడి సమయంలోనూ భావోద్వేగ నియంత్రణ కోల్పోకుండా సందర్భానుసారంగా,సమయస్పూర్తితో చక్కటి నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రణాళికాబద్ధంగా ఒత్తిడిని తట్టుకునే మానసిక స్థితిని సంపాదించుకోవాలి.అదెలాగంటే మనకిష్టమైన సృజనాత్మకత కలిగిన క్రొత్త అలవాట్లను నేర్చుకుంటూ ఉంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది.దీనితో ఎంత ఒత్తిడిలో ఉన్నాసమన్వయం కోల్పోకుండా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ విజయం సాధించగలం.ఖాళీగా ఉన్నప్పుడు పజిల్స్,సుడుకొ లాంటివి పూర్తిచేస్తూ మెదడుకు మేత పెడుతూ ఉంటే మెదడు పదునెక్కి మంచి నిర్ణయాలు తీసుకోగలిగి అనుకున్నది సాధించగలం.ఇదే విజయ రహస్యం.    

Sunday, 4 January 2015

కోడి గుడ్డు క్రింద పడితే.....

                                  కోడి గుడ్డు క్రింద పడి పగిలితే ఎంత తుడిచినా దాని వాసన పోదు.అటువంటప్పుడు గుడ్డు పడిన ప్రదేశంలో ఉప్పు చల్లి తర్వాత శుభ్రం చేస్తే దుర్వాసన రాదు.  

పంచదారతో......

                            పెదవులను పంచదారతో రుద్ది చల్లటి నీటితో కడిగితే మృదువుగా పొట్టు లేవకుండా ఉంటాయి.

ఎండు గడ్డిలా ....

                                      ఎండు గడ్డిలాగా ఉన్న జుట్టు అంటే బాగా పొడిబారిన వెంట్రుకలు అన్నమాట.ఇలా ఉన్న జుట్టుకు ఒక కప్పు పెరుగు గడ్డలు లేకుండా చిక్కగా చేసి దానిని తలకు పట్టించాలి.ఆరాక వేడినీటిలో ముంచి పిండిన టవల్ ను తలకు చుట్టాలి.5 ని.ల తర్వాత తీసేసి షాంపూతో తల స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారయినా చేస్తుంటే  జుట్టు నిగనిగలాడుతూ మెత్తగా ఉంటుంది.           

Saturday, 3 January 2015

నోటిపూత

                            అప్పుడప్పుడు నాలుక ఎర్రబారి ఏమి తిన్నా మంటగా ఉంటుంది.అలాంటప్పుడు గుప్పెడు మెంతు ఆకులు తీసుకుని ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి మరిగించి ఆనీళ్ళతో పుక్కిలించితే నోటిపూత  తగ్గుతుంది. 

కష్టేఫలి

                                      హరి వడ్రంగి పని చేస్తుంటాడు.చిన్నప్పటినుండి కష్టపడి పనిచేసే తత్వం.తను కష్టపడినా  పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రావాలని అతని కోరిక.దానికి తోడు పిల్లలు కూడా తండ్రి మనసు అర్ధం చేసుకుని బాగా చదువుకుని ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.అమ్మాయి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించింది.కొడుకు కూడా స్వదేశంలో మంచి ఉద్యోగం సంపాదించాడు.కూతురికి మంచి సంబంధం చూచి వివాహం చేశాడు.మొన్ననే విదేశాలకు వెళ్ళి వచ్చానని,అక్కడ ఏమీ తోచక అనుకున్నకన్నా ముందే స్వదేశానికి వచ్చానని 
ఏమాత్రం గర్వం లేకుండా చాలా సంతోషంగా స్నేహితులకు చెప్పాడు.పిల్లలు చక్కగా స్థిరపడ్డారు కనుక పని మానేసి హాయిగా ఉండొచ్చు కదా!అని అంటే ఓపిక ఉన్నంతవరకు చేద్దామనుకుంటున్నాను అని చెప్పాడు.కష్టేఫలి అన్నట్లు అతను కష్ట పడినందుకు ప్రతిఫలం లభించింది.   

మహిళలే పనిలో ముందంజ

                                    వ్యాపారంలోనయినా,ఉద్యోగంలోనయినా,ఇంటిపనుల్లోనయినా మగవారికన్నామూడురెట్లు మహిళలే కష్టపడి బద్దకించకుండా పనులు పూర్తి చేయ్యడంలో ముందంజలో ఉన్నారు.రోజంతా పనిచేసినా చురుగ్గా ఇంటికొచ్చాక సోమరితనం అనేది లేకుండా ఇంటిపనులు చక్కబెడతారు.వ్యాపారంచేసే మహిళలు బ్యాంకు రుణాలు తీసుకుంటే నిర్ణీత సమయం కన్నా ముందే కట్టేస్తుంటారని మహిళలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు     వస్తున్నాయి.మగవాళ్ళు ఏపనినయినా తేలిగ్గా తీసుకుంటారని,మహిళలు దేన్నయినా పట్టుదలతో కృషి చేసి  సాధించగలరని విశ్లేషకుల అభిప్రాయం.ప్రతి పురుషుని విజయం వెనుక తల్లి,భార్య,సోదరి,అమ్మమ్మ,నానమ్మ ఎవరైనా ఒక స్త్రీ ఉంటుందన్నది యదార్ధం.

Friday, 2 January 2015

చద్దిపెట్టె

                                           కాంతమ్మ గారికి కాస్త చాదస్తం పాళ్ళు ఎక్కువ.దానితోపాటు నదురూ బెదురూ లేకుండా ఎవరినైనా ఏదిబడితే అది పుల్ల విరుపుగా మాట్లాడుతుంది.ఎవవరింటికయినా  వెళ్ళినా నిర్మొహమాటంగా  తనకు కావలసింది వండించుకుని మరీ తింటుంది.చద్దిపెట్టెలోవి నాకు మాత్రం పెట్టకండి మీరు తింటే తినండి అని చెపుతుంది.చద్దిపెట్టె అంటే ఫ్రిజ్ అన్నమాట.మిగిలిన పదార్ధాలన్నీ దానిలో పెట్టుకుంటారు కనుక దాన్ని చద్దిపెట్టె  అంటారు కాంతమ్మ గారు.

పాలు తోడెట్టి.......

                                   పారిజాతమ్మ గారికి ఎనభై సంవత్సరాలు.కొడుకు విదేశాల్లో ఉంటాడు.కూతురు         దగ్గరలోనే ఉంటుంది కానీ తల్లీకూతుళ్ళు సఖ్యతగా ఉండరు.డబ్బు మాత్రం కూతురు తీసుకుంటుంది.అమ్మ   నన్నుఎప్పుడూ పోట్లాడి పిచ్చితిట్లు తిడుతుందని అందరికీ,అన్నకు ఏడ్చి చెపుతుంది.తెలియనివాళ్ళునిజమే అనుకుంటారు.వీళ్ళిద్దరికీ గొడవ  ఎందుకులే అని పనివాళ్ళను పెట్టి జాగ్రత్తగా చూచుకోమని కొడుకు  డబ్బు ఇస్తుంటాడు.ఈమధ్య క్రొత్తగా ఒకతన్ని పెట్టి వెళ్ళాడు.అతనికి తెలియక పాలు తోడుబెట్టి రెఫ్రిజిరేటర్ లో పెట్టాడు. పాలు తోడుకుని పెరుగు అయిన తర్వాత పెట్టాలని,లేకపోతే పెరుగు తోడుకోదన్న విషయం పాపం అతనికి తెలియదు.పారిజాతమ్మగారికి అసలే పెరుగు లేనిదే భోజనం చేసినట్లుండదు.భోజనం చేసేటప్పుడు పెరుగు వెయ్యటానికి బదులు పాలతో ఉన్న గిన్నె తీసుకెళ్ళి పెరుగు తోడుకోలేదని చెప్పాడు.ఎందుకు తోడుకోలేదంటే మీరు చల్లగా వేసుకుంటారని పాలు తోడెట్టి ఫ్రిజ్ లో పెట్టానండీ అంతే అన్నాడు.ఇవ్వాళ పెరుగు లేకుండా చేశావు కదరా!అని పెద్ద గొడవ చేసింది కాక భలే వాడిని  పనిలో పెట్టారని అందరికీ చరవాణి ద్వారా చెప్పడం మొదలెట్టింది.