Thursday, 26 May 2016

తన భవిష్యత్తు తానే .........

                                                         హిమబిందు వైద్య విద్యను అభ్యసించి పైచదువుల కోసం విదేశాలకు వెళ్ళింది.ఒక ఆరునెలలు బాగానే ఉంది.తర్వాత నుండి ఖాళీ సమయంలో పనిచేయడం మొదలు పెట్టింది.కాస్త డబ్బు కంటికి కనిపించేసరికి అత్యాశ పుట్టి తరగతులకు హాజరు కాకుండా రోజంతా పని చేసుకోవడం మొదలు పెట్టింది.విశ్వ విద్యాలయం నిబంధనల ప్రకారం కొద్ది గంటలు మాత్రమే పనిచేసుకోవచ్చు.నిర్లక్ష్యంగా నిబంధనలను పక్కన పెట్టి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి తనను ఎవరూ చూడటం లేదనుకున్నట్లు ప్రైవేటు ఏజన్సీల ద్వారావరుసనే మూడు నెలలు పనిచేసి ఏభై లక్షలు సంపాదించింది.మసి పూసి మారేడు కాయను చేసినట్లు కొద్ది గంటలు మాత్రమే పనిచేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించింది.స్నేహితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినా వేరే ఊరు వెళ్ళి మరీ పని చేసింది.చివరకు విశ్వవిద్యాలయం వాళ్ళు తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మొత్తం చరిత్ర బయటపడి నిబంధనలను అతిక్రమించినందుకు 10 సంవత్సరములు దేశ బహిష్కరణ చేసి వీసా రద్దు చేశారు.రెంటికీ చెడ్డ రేవడిలా చదువు ఆగిపోయింది.డబ్బు సంపాదన పోయింది.చేతులారా తన భవిష్యత్తు తానే నాశనం చేసుకుంది.

Tuesday, 24 May 2016

జీవన విధానం

                                                             యాంత్రికంగా ఏదో తిన్నామా,పడుకున్నామా,లేచామా అన్నట్లుగా జీవితం గడపడానికి,చేసే ప్రతిపని అంటే ఉద్యోగ బాధ్యతలు,తినే తిండి,మాట్లాడేమాట ఏదైనా కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా జీవితం గడపడానికి చాలా తేడా ఉంటుంది.జీవన విధానం పట్ల సరైన అవగాహన ఉండి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటమే కాక,భావోద్వేగాలు,ఆలోచనలు నియంత్రణలో ఉంటాయి.ఈవిధంగా జీవించగలగడం కొంతవరకు వంశాపారంపర్యంగా వస్తుందన్నది పెద్దల ఉవాచ.కానీ రోజూ వ్యాయామం,ధ్యానం,దీర్ఘంగా శ్వాసించడం,ప్రకృతి మధ్య గడపడం,ఆహార నియమాలు పాటించడం వంటి వాటి వల్ల ఆనందమయ జీవితం సాధ్యమవుతుందని నేటి ఉవాచ.ఏది ఏమైనా గానీ ఎప్పుడూ సంతోషంగా ఉండే వాళ్ళను ఏ కష్టాలు,అనారోగ్యాలు దరిచేరవు.

Saturday, 21 May 2016

జాగ్రత్తగా......

                                           మనల్ని విమర్శించే వాళ్ళందరూ మన శత్రువులూ కాకపోవచ్చు,పొగిడే వాళ్లందరూ    మన మంచికోరుకునే వారు కాకపోవచ్చు.ఒక్కొక్కసారి ఆ విమర్శ వెనుక ప్రేమ,ఆప్యాయత ఉండవచ్చు,పొగడ్త వెనుక ఈర్ష్య,ద్వేషం,అసూయ ఉండవచ్చు.అందుకని జాగ్రత్తగా గమనించి ఎవరు శత్రువులో,ఎవరు మిత్రులో తెలుసుకోవడం ఉత్తమం.

Saturday, 14 May 2016

మామిడికాయతో కోడికూర

ఎముకల్లేని కోడిమాంసం - 1/2 కిలో
నిమ్మరసం - 1 టేబుల్ స్పూను
మామిడికాయ - 1 చిన్నది
పెరుగు -1 టేబుల్ స్పూను
వెల్లుల్లి రెబ్బలు - 4
పచ్చిమిర్చి - 3
పసుపు - 1 టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీ స్పూను
జీరా పొడి - 1/4 టీ స్పూను
ధనియాల పొడి  - 1/2 టీ స్పూను    
ఉల్లిపాయలు - 2
జీరా - 1 టీ స్పూను
నూనె - 3 స్పూన్లు
 కొత్తిమీర  సన్నగా కోసినది - 1 టేబుల్ స్పూను
                                                                     ముందుగా కోడిమాంసం శుభ్రంగా కడిగి నిమ్మరసం,పెరుగు పట్టించి 1/2 గంట నాననివ్వాలి.ఉల్లిపాయలు ముద్దలా చేసుకోవాలి.మామిడికాయ చెక్కుతీసి ముక్కలు కోసి వెల్లుల్లి,పచ్చిమిర్చి వేసి ముద్దలా చేయాలి.బాండీలో కొద్దిగా నూనెవేసి కాగాక చికెన్ వేసి వేయించి నీరు ఇగిరాక పక్కన పెట్టాలి.మరో బాండీలో మిగిలిన నూనెవేసి కాగాక జీరా వేసి,ఉల్లిముద్ద వేసి వేగాక మామిడికాయ ముద్ద, పసుపు,జీరాపొడి,ధనియాలపొడి,కారం,ఉప్పు,పంచదార 1/4 టీ స్పూను వేసి కొద్దిగా  వేగనివ్వాలి.చికెన్ ముక్కలు వేసి బాగాకలిపి మూతపెట్టి ఒక 1/4 గంట తక్కువ మంటపై ఉడికించాలి.అవసరమైతే కొద్దిగా నీళ్ళు చల్లాలి.పూర్తిగా ఉడికాక కొత్తిమీర చల్లి దించేయాలి.అంతే నోరూరించే పుల్లపుల్లటి మామిడికాయ కోడికూర తయారయినట్లే.

Wednesday, 11 May 2016

నయగారం

                                                                             ష్రగ్య మనస్తత్వం విచిత్రమైనది.దానికి తోడు అబద్దాన్ని కూడా నిజమని నమ్మించడంలో దిట్ట.పక్కా అబద్దాలకోరు.పెళ్ళయిన తర్వాత తన భర్త తనతోతప్ప ఎవరితోనూ అంటే ఆఖరుకి తన స్వంత తల్లిదండ్రులతో,అక్కచెల్లెళ్ళతో,అన్నదమ్ములతో కూడా మాట్లాడకూడదని,వాళ్ళ ఆస్తిపాస్తులు మాత్రం కావాలని అనుకుంటుంది.తన ఇంటికి పురుగు కూడా రాకూడదని తను మాత్రం ఎప్పుడంటే అప్పుడు భర్త,పిల్లలను వెంటేసుకుని భర్త తోడబుట్టిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోతుంది.వాళ్ళు మాత్రం ఇష్టం ఉన్నా లేకున్నా చేష్టలుడిగి చూస్తూ చేసేది లేక ఈసురోమంటూ మర్యాదలు చేయాలి.ఇంత చేసినా తిని అవతలకు వెళ్ళి విమర్శిస్తూ ఉంటుంది.ఇంకో విచిత్రం ఏమిటంటే?భర్త ఎదురుగా లేనప్పుడు భర్త సన్నాసి,చవట అని అందరి ఎదుట తిడుతూ ఉంటుంది.భర్త రాగానే వయ్యారాలు పోతూ ఏమండీ!అంటూ కాళ్ళ దగ్గర కూర్చుని ఎంతో అమాయకంగా ముఖం పెట్టి కాళ్ళు,చేతులు ఒత్తుతూ ఉంటుంది.పాపం ఆ పిచ్చిముఖం భర్త లోకంలో అందరికన్నా నాభార్య మాత్రమే ప్రేమగా ఉంటుంది.ఈ రోజుల్లో కాళ్ళ ఎవరు ఒత్తుతున్నారు?అని తన వాళ్ళ గురించి అబద్దాలు చెప్పినా నిజం అని గుడ్డిగా నమ్ముతుంటాడు.ఈ వింత చూస్తే తప్ప ఎవరైనా చెప్పినా నమ్మలేని నిజం.చదువుతోపాటు సంస్కారం అబ్బుతుంది అంటారు కానీ బుద్ది లోపం ఉన్నప్పుడు చదువు ఉన్నా ఏమి లాభం?బుద్ధి మందగించిన భర్తలు ఉన్నంతకాలం ఇలా ష్రగ్య లాంటివాళ్ళు  నయగారం పోతుంటారు.

Tuesday, 10 May 2016

మాకు వచ్చిందే గొప్ప

                                                       ఈరోజుల్లో కొంతమంది ఎదుటివాళ్ళ పిల్లలకు వందకు వంద వచ్చినా,తొంభై తొమ్మిది వచ్చినా మనసారా అభినందించలేరు.ఓస్ ఇంతేనా?ఆ!మార్కులది ఏముందిలే?ఇల్లు అలకగానే పండగ కాదు ఆ మార్కులు ఒక లెక్కా! అంటూ తీగలు తీస్తూ మాట్లాడతారు.అదే వాళ్ళ పిల్లలకి వందకు యాభై వచ్చినా తెగ మురిసిపోతూ పేపరు చాలా కష్టంగా ఇచ్చారట మా అమ్మాయికి  లేక అబ్బాయికి కనుక ఆ మాత్రం వచ్చాయి ఇంకెవరన్నా అయితేనా!తప్పి కూర్చునేవాళ్ళు అంటూ డప్పు కొట్టి మరీ చెపుతుంటారు.ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మీదేముంది?మాకు వచ్చిందే గొప్ప!ఎదుటివాళ్ళను అభినందించకపోయినా ఫరవాలేదు కానీ ఈసడించినట్లు మాట్లాడకూడదు.అది వాళ్ళ సంస్కారం అని ఎంతగా సరిపెట్టుకుందామని అనుకున్నా అది ముల్లులా ఎదుటివాళ్ళ మనసును గాయపరుస్తూ ఉంటుంది.మనం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నామని చంకలు కొట్టుకున్నా దానితోపాటు కుసంస్కారము అంతకన్నా వృద్ధి చెందుతుంది.ఇది మచ్చుకు మాత్రమే.

Monday, 9 May 2016

అంతం లేని ఆవేదన

                                                                   అనగనగా ఒక అమ్మ.ఆ అమ్మకు ఇద్దరు బిడ్డలు.ఒక కూతురు,ఒక కొడుకు.ఇద్దరినీ ఎంతో ప్రేమగా తన సుఖసంతోషాలను లెక్కచేయకుండా అందరికన్నా మిన్నగా ఇద్దరినీ సమానంగా పెంచింది.అయినా నీకు కూతురు అంటేనే ఇష్టం,నువ్వు కూతురునే బాగా చూచుకున్నావు అంటూ ఒకటే సతాయింపు.కూతురు ఇది కావాలి,అది కావాలి అని ఏనాడూ నోరు తెరిచి అడిగేది కాదు.కొడుకు చిన్నతనం నుండే చదువుకోకుండా పెంకిగా మోటారుసైకిల్ కావాలి,కారు కావాలి అంటూ అప్పోసోప్పో చేసి అయినా కొనిచ్చేదాకా మారం చేసి కొనిపించుకునేవాడు.అయినా తృప్తి లేదు.కాలక్రమంలో ఇద్దరికీ పెళ్ళిళ్ళయినాయి.కొడుకు వెధవ బుద్ధికి తగినట్లే తల్లి లేని చుప్పనాతి శూర్పణక ఇంటికి కోడలయ్యింది.తల్లి,బిడ్డ ఫోనులో మాట్లాడుకున్నా ఓర్చుకోలేక కూతురు  ఫోను రాకుండా ఫోనునంబరు బ్లాక్ లిస్టులో పెట్టింది.అది తెలిసినా తెలియనట్లు కొడుకేమో భార్యావ్యామోహంతో కళ్ళకు పొరలు కమ్మి కళ్ళు మూసుకుపోయి నిజం తెలుసుకోలేని మూర్ఖుడు.వయసు మీద పడుతున్నాఇంటి భాధ్యత తెలియని మనుషుల మధ్య చాకిరీ తప్పని పరిస్థితి.ఎప్పుడైనా కూతురు దగ్గర నాలుగు రోజులుండి వద్దామనుకుంటే అమ్మ ఆస్థి రాసేస్తుందేమో అని భయం.భార్యాభర్త కలిసి తల్లిని ఎక్కడికీ వెళ్ళనివ్వరు.ఎవరైనా పెళ్ళికి అమ్మ రాలేదేమిటి? అని అడిగితే ఆరోగ్యం బాగోలేదు అని అబద్ధాలు.తెల్లారి లేస్తే ఇంటెడు చాకిరీ అమ్మే చేస్తుందని అందరికీ తెలుసు.తృప్తి లేని కొడుకు ఒకపక్క,తల్లి లేని పిల్ల అని కోడల్ని తన  కూతురు కన్నాఎక్కువగా చూసినా తల్లి ప్రేమ తెలియక పాషాణంలాంటి కోడలు ఒకపక్క,చివరికి  తన కూతురికి తల్లి ఉండీ లేని పరిస్థితిగా ఉందని  ఆ తల్లి ఆవేదన చెందని రోజు లేదు.ఒకవేళ కూతురు అమ్మను ఇంటికి తీసుకెళదామంటే ఆస్థి దోచుకుతినడానికి తీసుకెళ్ళిందని దుష్ప్రచారాలు.ఈ తల్లి,కూతుళ్ళ ఆవేదన ఎప్పటికి తీరేనో?ఈరోజుల్లో ఇటువంటి మూర్ఖులు ఎక్కువైపోయి స్వశక్తితో సంపాదించుకోవటం చేతకాక పెద్దవాళ్ళను,తోడబుట్టిన వాళ్ళను నానా ఇబ్బంది పెడుతున్నారు.   

Saturday, 7 May 2016

మాతృదినోత్సవ శుభాకాంక్షలు

                                                              అమ్మ అంటే ప్రేమ,అనురాగం,ఆప్యాయతలను కురిపించే అమృతమూర్తి. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. 
     

Thursday, 5 May 2016

పచ్చదనంతో పెరిగే ఆయుష్షు

                                                           ఇంటి ముందు,ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెట్టి వాటిని సంరక్షించడానికి ఎంతో కృషి చేసి అవి పెరిగి,పువ్వులు పూసి,కాయలు కాస్తుంటే కలిగే సంతోషం మాటలతో చెప్పతరం కాదు.పెద్ద వృక్షాలు  అయితే పెంచే వాళ్ళే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా కాలుష్యం లేని గాలిని ఊపిరితిత్తుల నిండుగా పీల్చుకోగలుగుతారు.ఇది ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం.మొక్కలకు పోషణ చేయటం శారీరక వ్యాయామం మాత్రమే కాక మానసికంగా ప్రశాంతంగా ఉండటంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.చెట్లు,మొక్కల మధ్య ఎక్కువ సమయం గడిపేవాళ్ళు స్వచ్చమైన గాలిని పీల్చుకోవటంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవిస్తారు.బ్రతికినంత కాలం సంతోషంగా ఆరోగ్యంగా ఉండటమే కదా!కావలసినది.అందుకని వీలయినప్పుడల్లా ప్రకృతి మధ్య గడపితే పచ్చదనంతో ఆయుష్షు పెరుగుతుంది.   

Tuesday, 3 May 2016

చేదు అనుకోకుండా....

                                                                        చేదు అనుకోకుండా మెంతులు,మెంతి కూర రోజూ ఆహారంలో భాగం చేసుకోగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.వీటిల్లో ఉన్న పీచు కొన్నిరకాల కాన్సర్లు రాకుండా కాపాడుతుంది.రాత్రిపూట రెండు స్పూన్లు మెంతులు నానబెట్టి పరగడుపున తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.ఈ రెండింటితో గుండె జబ్బులు,అధిక బరువు,కీళ్ళ నొప్పులు నివారింపబడటమే కాక జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.తాలింపు దినుసులతో పాటు మెంతులు,కరివేపాకుతో పాటు మెంతి కూర వేసుకోవటం అలవాటు చేసుకుంటే కూరలకు అదనపు రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.మెంతి కూర సన్నగా తరిగి ఇడ్లీ,దోసె,చపాతీలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

చకచకా తిరుగుతూ కాళ్ళతో తన్నుతూ .........

                                                                       ప్రవస్వి రెండోసారి గర్భవతి.అమ్మాయి పుట్టాలని భార్యాభర్తల కోరిక.అమ్మాయే పుడుతుందని జ్యోతిష్కులు,వైద్యులు కూడా చెప్పారు.ఎప్పుడెప్పుడు అమ్మాయి భూమి మీదకు వచ్చి తన ఒడిలో సేద తీరుతుందా!అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ తనకెంతో ఇష్టమైన అమ్మవారి పాటలు వింటూ వీలయినప్పుడల్లా లలితా పారాయణం చదువుకుంటుంది.లోపల బిడ్డ కూడా ఆ పాటలకు అనుగుణంగా   స్పందిస్తూ,తను కూడా పారాయణం వింటున్నదన్నదానికి చిహ్నంగా  పొట్ట లోపల చకచకా కదులుతూ సంతోషంగా కాళ్ళతో తన్నడం ఒకటి రెండుసార్లు గమనించింది.వేరే ఏమైనా సంగీతం పెట్టినప్పటికన్నాభక్తి గీతాలు పెట్టినప్పుడు ఎక్కువ చురుకుగా తిరుగుతూ సుతిమెత్తటి పాదాలతో తన్నుతూ గిలిగింతలు పెడుతుందని మురిపెంగా అమ్మతనంలోని కమ్మదనాన్నిఆస్వాదిస్తూ త్వరలో పుట్టబోయే కూతురికి స్వాగతం పలుకుతుంది.