Tuesday, 31 March 2015

మెడ,మోచేతుల నలుపు తగ్గాలంటే......

                                      ఒక చిన్న బంగాళదుంపను కోసి మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులాగా  చేయాలి.దీనికి ఒక స్పూను పెసర పిండి లేదా శనగ పిండి కలిపి నల్లగా ఉన్న ప్రాంతంలో రుద్దాలి.రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా నలుపు తగ్గి చర్మం రంగులో కలిసిపోతుంది.

స్వేచ్చలేని బ్రతుకు

                                                           చాలా సంవత్సరాల తర్వాత పంకజాక్షి మామ్మ కనిపించింది.మామ్మా!బాగున్నావా?అని పలకరించగానే బాగానే ఉన్నాను అంటూనే బొత్తిగా స్వేచ్చలేని బ్రతుకు అయిపోయింది అంది.
అదేమిటి?అంటే బాధపడటం తప్ప సమాధానం లేదు.చిన్నప్పుడే రెండో పెళ్ళి వాడికిచ్చి పెళ్ళి చేశారు తల్లిదండ్రులు.
జీవితమంతా మొదటిభార్య కూతుర్ని పెంచి పెద్దచేయటంతోనే సరిపోయింది.దానికితోడు పంకజాక్షి మామ్మకు పిల్లలులేరు.ఉన్న ఆస్థి మొత్తం ఆమెకు లేకుండా మరుదులు,అత్త,మామ కలిసి భర్తతో బలవంతాన మొదటి భార్య కూతురికి చెందేటట్లు రాయించి కూతురికి పెళ్ళి చేశారు.తర్వాత భర్త చనిపోయాడు.తండ్రి చనిపోగానే కొంత పొలం అమ్మేసి పట్టణంలోఇల్లు కట్టి కూతురు అక్కడే కాపురం పెట్టింది.చేసేదిలేక ఆమెకు,ఆమె పిల్లలకు చాకిరి చేస్తూ ఈమె కూడా పట్టణంలో వాళ్ళతో పాటు ఉండవలసి వచ్చింది. తనకంటూ స్వతంత్రంగా రూపాయి కూడా వాడుకోవటానికి    లేదు.కూర్చోమంటే కూర్చోవాలి.నిలబడమంటే నిలబడాలి అన్న చందంగా తయారైంది బ్రతుకు.ఇవన్నీ నోరు తెరిచి చెపితే నిలువనీడ కూడా ఉండదేమోనని మళ్ళీ భయం.ప్చ్,ఇలాంటివాళ్ళు ఎందరో.

Monday, 30 March 2015

కళ్ళు ఉబ్బుగా ఉంటే......

                                         కీర దోసకాయ ముక్కల్ని రోజూ కాసేపు కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళఅలసట,తలనొప్పితో పాటు కళ్ళు ఉబ్బరం తగ్గుతుంది.

పాతిక ఏళ్ళనాటి మొక్కు

                                                 స్వప్న బంధువులు ఉద్యోగరీత్యా అరుణాచలప్రదేశ్ లో ఉంటారు.స్వంత ఊరిలో
రామాలయంలో నలుగురు అన్నదమ్ములు,తల్లిదండ్రులతో సహా ఐదుజంటలు పీటలమీద కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపించి ఘనంగా ఊరంతా భోజనాలు పెట్టారు.ఇది పాతిక ఏళ్ళనాటి మాట.ఈనేపధ్యంలో స్వప్నమేము కూడా సీతారాముల కళ్యాణం చేయించి భోజనాలు పెట్టుకుంటే బాగుంటుందని మనసులో అనుకుంది.చేద్దాం,చేద్దాం అనుకుంటూనే ఆవిషయం మర్చిపోయింది.పాతిక ఏళ్ల తర్వాత స్వయంగా రామయ్య తండ్రే కబురుపంపినట్లుగా దూరపుబంధువు ఒకాయన కళ్యాణం దగ్గర కూర్చుంటారా?అని అడిగితే సరే అన్నారు కానీ అప్పటికీ స్వప్నకు గుర్తు రాలేదు.చాలామంది ఉండగా ఇంత దూరంలో ఉన్న మనల్ని అడగటంలో అంతరార్ధం ఏమిటా?అని ఆలోచించగా స్వప్నకు చప్పున తన మొక్కు సంగతి గుర్తొచ్చింది.అయ్యో!ఇన్నిఏళ్ల నుండి మర్చిపోయాను.ఇప్పటికైనా మించిపోయింది లేదని సంతోషంగా ఏర్పాట్లు చేసుకుని అందరూ కలిసి ఘనంగా సీతారాముల కళ్యాణం జరిపించి,భోజన ఏర్పాట్లు చేశారు.సీతారాముల కళ్యాణము చూతము రారండి అన్నట్లుగా బంధువులు,స్నేహితులు చుట్టుప్రక్కల వాళ్ళు  అందరూ రావటంవల్ల నిండుగా,కన్నులపండుగగా కల్యాణోత్సవం జరిగింది.హమ్మయ్య,పాతిక ఏళ్లకు భగవంతుని దయవల్ల మొక్కుతీర్చుకోగలిగాను అనుకుంది స్వప్న.  
    

Sunday, 29 March 2015

ఫిల్టర్ కాఫీ రుచిగా ఉండాలంటే......

                                          ఫిల్టర్ లో కాఫీపొడి,కొంచెం పంచదార వేసి మరిగే నీళ్ళు పోయాలి.తక్కువ నీళ్ళుపోసి చిక్కటి డికాక్షన్ తీయాలి.పచ్చిపాలు మరిగించి పొంగు రాగానే నురగతో సహా పోసి,అవసరమైనంత డికాక్షన్, పంచదార వేసి కలుపుకుని వేడివేడిగా తాగితే కాఫీ చాలా రుచిగా ఉంటుంది. 

Friday, 27 March 2015

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

                                        నాతోటి బ్లాగర్లకు,బ్లాగ్ వీక్షకులకు,పాఠకులకు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,అందరికీ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.వీలయితే సీతారాముల కళ్యాణం చూచి పానకం,వడపప్పు స్వీకరించి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల కటాక్షంతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.

కొబ్బరి పచ్చడి కమ్మగా .....

                                   తాజా లేతకొబ్బరి,పచ్చిమిరపకాయలు వేయించి సరిపడా చింతపండు వేసి మిక్సీలో మెత్తగా చేసి తాజా పెరుగు వేసి ఒకసారి మరల తిప్పితాలింపు వేస్తే చాలా రుచిగా ఉంటుంది.అంతే కమ్మటి కొబ్బరి పచ్చడి తయారయినట్లే.ఇది వేడివేడి గారెలు,ఇడ్లీతో తింటే ఎంతో బాగుంటుంది.    

Thursday, 26 March 2015

తేనె కల్తీదో కాదో .......

                                                      తేనె కల్తీదో కాదో తెలుసుకోవాలంటే ఒక 1/2 గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూను తేనె వేసి తిప్పాలి.వెంటనే కరిగిపోతే దానిలో బెల్లం పాకం కలిసిందని,అది కల్తీ తేనె అని అర్ధం చేసుకోవాలి.అదే తేనె కరగకుండా అడుగుకు చేరితే స్వచ్చమైన తేనె అన్నమాట.

రోజంతా హుషారుగా........

                                              ఉదయం నిద్రలేచిన తరువాత మొదటిగంటను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
ఆసమయంలో శారీరకంగా,మానసికంగా,ఆధ్యాత్మికంగా చేసేపనులు రోజంతా హుషారుగా ఉంచుతాయి.డబ్బు సంపాదనొక్కటే ముఖ్యం కాదు.మానసిక ఆనందం,ప్రశాంతత,సానుకూల దృక్పధం మనలో ఆత్మవిశ్వాసం పెంచటంతోపాటు హుషారుగా పనిచేయటానికి తోడ్పడి ఎన్నో విజయాలను మనకు అందిస్తాయి.

Wednesday, 25 March 2015

షర్బత్ విభిన్నంగా ....

                                                   ముందుగా షర్బత్ చిక్కగా తయారుచేసుకుని దానిలో సన్నగా తరిగిన నిమ్మచెక్కల్ని,చిటికెడు దాల్చినచెక్క పొడినివేయాలి.బాగా కలిపి 4 గం.లు పక్కన పెట్టెయ్యాలి.తర్వాత వడకట్టి  సరిపడా చల్లటినీళ్ళు కలిపి తాగితే మంచి రుచిగా ఉంటుంది.దీనిలో ఇష్టమైతే అల్లం తురిమి కొంచెం కలుపుకోవచ్చు.ఐస్ ముక్కలు కలిపితే చప్పగా ఉంటుంది కనుక చల్లటినీళ్ళు మాత్రమే కలపాలి.

కయ్యానికి కాలు దువ్వి

                                                      జితేంద్ర ప్రభుత్వోద్యోగంచేస్తూ ఇతర రాష్ట్రాలలో ఉండేవాడు.పిల్లలు పెద్ద వాళ్ళు
అయ్యారు కనుక వాళ్లకు పెళ్ళిళ్ళు చేద్దామనే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వంత ఊరికి వచ్చాడు.ఇన్ని రోజులనుండి తన వాళ్ళు,భార్య తరఫు వాళ్ళు కూడా వీళ్ళ ఆస్తులు చూస్తూ వాటి మీద ఆదాయం సరిగా లెక్కకట్టి  జితేంద్ర చేతికి ఇవ్వకుండా ఎవరికి అందినది వాళ్ళు తినేసేవాళ్ళు.జితేంద్ర వచ్చేసరికి మింగుడుపడక కాలికి వేస్తే వేలికి,వేలికి వేస్తే కాలికి ముడి వేస్తూ ఆస్తుల దగ్గరే కాక,ప్రతిచిన్నదానికి విసిగించడం మొదలుపెట్టారు.అయినా జితేంద్ర సహనంతో గొడవలు ఎందుకులే అని సర్దుకుపోతున్నాడు.అందరికీ ఒకవైపు కాకపోతే ఒకవైపు వాళ్ళైనా మంచి వాళ్ళుంటారు.మనకుఏంటో రెండువైపులవాళ్ళు పెద్ద తలనొప్పిగా తయారయ్యారుఅని భార్యాభర్తలు అనుకొంటుంటారు.దీనికి తోడు ఈమధ్య కొత్తగా వీళ్ళమీద వాళ్లకు,వాళ్ళమీద వీళ్ళకు జితేంద్ర అన్నాడని చెప్పి వాళ్ళమానాన వాళ్ళు ఉంటుంటే చూడలేక కయ్యానికి కాలుదువ్వి జితేంద్రను రెచ్చగొడుతున్నారు.స్వలాభం కోసం జనం ఇలా తయారయ్యరేమిటో? పోయేటప్పుడు ఎవరూ ఏమీ తీసుకెళ్ళలేరు .ఈమాత్రానికి ఎదుటివాళ్ళ సొమ్ము కోసం ఇంత తాపత్రయం దేనికో?ఇన్నిరోజులు స్వంత ఊరిలో ఉండకపోవటం వల్ల తియ్యగా కబుర్లు చెప్పేవాళ్ళు.ఇప్పుడు ఒక్కొక్కళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది.ఉపేక్షించి లాభం లేదు డబ్బు కన్నా విలువైన బంధాల గురించి వీళ్ళకు తెలియ చెప్పాల్సిందే అనుకున్నాడు జితేంద్ర.      

Tuesday, 24 March 2015

షర్బత్ కు అదనపు రుచి

                                                          షర్బత్ కు అదనపు రుచి రావాలంటే నిమ్మకాయలపై తొక్కును సన్నగా,పొడుగ్గాకోసి ముక్కలు మునిగేలా నీళ్ళు పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.4 గం.ల తర్వాత ఈ గిన్నెను పొయ్యిమీద పెట్టి మెత్తని గుజ్జులా అయ్యేవరకు ఉడికించి తగినంత చక్కర కలపాలి.మామూలుగా షర్బత్ చేసుకుని ఈ గుజ్జును దానిలో కొంచెం వేస్తే చాలా రుచిగా ఉంటుంది.

ఇగో తాత

                                                       అన్షూ విదేశంలో ఉంటుంది.అన్షూకు తాత కూడా విదేశంలో చాలా సంవత్సరాల నుండి స్థిరపడ్డాడు.తన పిల్లలే కాక తన మనవళ్ళు,మనవరాళ్ళు కూడా తనమాట జవదాటకూడదని అనుకుంటాడు.అన్షు తన కుటుంబసభ్యులను తనదగ్గరకు రమ్మని ఆహ్వానించి వాళ్ళు వచ్చినప్పుడు ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసింది.ఆవిషయం తెలిసి ఆయన ఆగ్రహంతో ఆమెకు ఫోను చేసి నేను ఎప్పటినుండో ఇక్కడ స్థిరపడి ఉన్నాను.వాళ్ళందరినీ ముందుగా నేను ఆహ్వానించాలి కానీ చిన్నదానివై ఉండి నువ్వు  ఆహ్వానించడమేమిటి?నీ ప్రణాళికను పూర్తిగా రద్దు చేసి మీ అందరూ వచ్చి నా ఇంట్లో ఉండాల్సిందే లేకపోతే మన మధ్య బంధుత్వం తెగిపోయినట్లే అన్నాడు.అన్షుకు ఈ మాటలకు కోపం వచ్చింది.అయినా తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఉండాలనే ఆలోచనతో తనకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో తన ప్రణాళికను రద్దుచేసుకుని ఇగో తాత మాటను గౌరవించి ఆయన చెప్పినట్లు చేసింది.   

తాగాడి లాగా .......

                                                                సుజిత్ కుటుంబంలో అందరూ చదువుకున్నా వాళ్ళే.సుజిత్ ఒక్కడికే సరిగా చదువబ్బలేదు.ఏపనీ చేయకుండా తిని,తిరగటం నేర్చుకున్నాడు.ఎవరి మాట లెక్కచేయకుండా ఆరకంగా పనీ,పాటా లేకుండా తిరగటమేమిటి?అని ఎవరైనా అంటే ఒంటికాలి మీద పోట్లాటకు తయారయ్యేవాడు.ఒకరోజు మేనమామకు కోపం వచ్చి తాగాడి లాగా పెరిగితే సరిపోయిందా?చదువు అంటే ఇష్టం లేకపోతే నీకిష్టమైన పని చేసుకో.అంతేకానీ ఖాళీగా తిరిగితే అదే అలవాటయి ఏపనీ చేయబుద్దికాదు.ఈరోజుల్లో వయసు మీద పడిన వాళ్ళు కూడా తిని కూర్చోవటం లేదు.ఇంత చిన్నవయసులో అసలు ఇలా ఉండకూడదు.హుషారుగా ఉండాలని పదేపదే   చెప్పగా నాకు వ్యాపారం చేయాలనీ ఉందని,ఇంత చిన్నవయసులో వ్యాపారం ఎందుకు?చదువుకోమని తల్లిదండ్రులు అంటున్నారని చెప్పాడు.సరే నువ్వు  ఏవ్యాపారం చేద్దామని అనునుకుంటున్నావో దాని గురించి లోటుపాట్లు అన్నీ కూలంకషంగా తెలుసుకుని అప్పుడు మొదలు పెట్టుకో.అప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండదు అని సుజిత్ కి నచ్చచేప్పేసరికి మేనమామకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యింది.  

పాలు పొంగి ........

                                            పాలు పొంగితే సంసారం బాగుంటుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు.రోజూ పాలు పెట్టినప్పుడల్లా పొంగితే  పొంగిన ప్రతీసారీ స్టవ్ తుడుచుకోవాలన్నాచాలా ఇబ్బంది.పండుగలప్పుడు,ముఖ్యమైన సమయాలలో పాలు పత్యేకంగా పొంగిస్తాము కనుక రోజూ పాలు పొంగి గిన్నె చుట్టూ పడిపోకుండా పాలగిన్నెలో ఒక గరిటె వేసి పొయ్యి మీద పెడితే గిన్నెలోపైవరకు వచ్చినా అక్కడే  మరుగుతుంటాయి కానీ చుట్టూ పడిపోవు.   

Saturday, 21 March 2015

వేసవిలో అనుకోకుండా అతిధులు వస్తే....

                                                      వేసవిలో అనుకోకుండా అతిధులు వస్తే అప్పటికప్పుడు ఏమివ్వాలో తెలియని పరిస్థితి.అందుకని ఖాళీగా ఉన్నప్పుడు ఒక కప్పు పంచదారలో ఒక కప్పు నీళ్ళు పోసి ముదురు పాకం వచ్చిన తర్వాత దింపెయ్యాలి.పాకం చల్లారక ముందే అందులో ఒక కప్పు నిమ్మరసం కలిపి చల్లార్చి సీసాలో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.ఇది వారం,పది రోజులు నిల్వ వుంటుంది.ఎవరైనా వచ్చినప్పుడు చల్లటినీళ్ళు కలిపి ఇవ్వవచ్చు. 

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

                                              ప్రపంచం నలుమూలల నుండి నా బ్లాగ్ వీక్షించ వచ్చే తెలుగువారందరికీ, నా తోటి బ్లాగర్లకు శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.జీవితం సకల అనుభూతుల మిశ్రమం.షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రకృతి మనకు ఇచ్చేసందేశమే కాక ఆరోగ్యదాయకం.

Friday, 20 March 2015

కరివేపాకు అందుబాటులో లేకపోతే ....

                                                            ఒక్కొక్కసారి కరివేపాకు పచ్చిదే తినాలనిపించేంత నవనవలాడుతూ ఉంటుంది.అలాంటప్పుడు ఎక్కువ తెచ్చుకుని దాన్ని నీడలో ఆరబెట్టి ఎండినట్లయిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి.ఈపొడి ఆకుపచ్చగా మంచి సువాసనతో ఉంటుంది.దీన్ని తాలింపులో వేయకుండా కూర దించే ముందు
ఒక చిటికెడు వేస్తే కరివేపాకు వాసన ఘుమఘుమలాడుతూ వస్తుంది..   

జ్ఞాపకశక్తి అమోఘం

                                     పార్వతమ్మకు ఎనభై ఐదు సంవత్సరాలు.వయసురీత్యా అరవై సంవత్సరాలకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి.ఆపరేషన్ అంటే ఉన్న భయం వల్ల ఒక ఐదు సంవత్సరాలు ఎలాగోలా ఇబ్బంది పడింది. కొడుకు కుటుంబం విదేశాలలో ఉంటుంది.పిల్లలు అంత దూరం నుండి వచ్చినా నాచేతితో వండి పెట్టలేక పోతున్నానని,చెప్పినా వినకుండా కొడుకు కుటుంబం వచ్చేలోపల ఆపరేషన్ చేయించుకోవటానికి   వెళ్ళింది.మోకాళ్ళకు ఆపరేషన్ బానే జరిగినా దురదృష్టవశాత్తూ చూపు కోల్పోయింది.కొడుకు వైద్యుడు నేను వచ్చిన తర్వాత చేయిద్దాం అన్నా వినకుండా కొడుకు వచ్చేసరికి తను మునిపటిలా చలాకీగా తిరిగి పనులు చేసుకోవాలని అనుకుంది.తనకొచ్చిన కష్టానికి మొదట్లో చాలా బాధపడింది.క్రమంగా అలవాటుపడి వాకర్ తో నడుస్తూ,పనివాళ్ళపై  అజమాయిషీ చేస్తూ,వంటమనిషి వండినది నచ్చక కూరల్లో ఉప్పు,కారం,టీలో పంచదార,టీపొడికూడా తనే  కావలసినంత వేయిస్తుంది.దగ్గర బంధువుల చరవాణి నంబర్లు ఒకటికి రెండు సార్లు చెప్పించుకుని గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు తనే ఫోన్ చేస్తుంటుంది.ఈవయసులో కూడా ఆమె జ్ఞాపకశక్తి అమోఘం.ఎవరి ఫోను నెంబరు కావాలన్నా పార్వతమ్మ గారిని అడగండి అని అందరూ అంటారు.అదీకాక తనకొచ్చిన కష్టాన్ని అధిగమించి ఇప్పటికీ తనపనులు తానే చేసుకుంటూ ఇంటికి ఎవరైనా ఫోను చేస్తే ముందుగా తనే గబగబా వచ్చి మాట్లాడుతుంది.  కనిపించకపోయినా టీ.వి పెట్టుకుని వార్తలు వింటూ ఏరోజు జరిగిన వార్తలు ఆరోజు తెలుసుకుంటుంది.        

చేమదుంపల కుర్మా

చేమగడ్డలు లేక చేమదుంపలు - 1/2 కే.జి
ఉల్లిపాయలు  - 2
పచ్చి మిర్చి  - 4
గడ్డపెరుగు - 2 గరిటెలు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
వేపుడు కారం - 1 టేబుల్ స్పూను
ఉప్పు - సరిపడా
మసాలాపొడి - 1/4 స్పూను
                                                                చేమదుంపలు శుభ్రంగా కడిగి నీళ్ళుపోసి కుక్కర్ లో మూడు విజిల్స్ రానివ్వాలి.మూతవచ్చిన తర్వాత నీళ్ళు పారబోసి ఆరనిచ్చిఒలిచి మధ్యరకం ముక్కలు కోసి బాండీలో నూనె పోసి వాటిని వేయించి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.అదే నూనెలో తాలింపువేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి వేయించిన చేమదుంపల ముక్కలు వేసి మరల వేయించాలి.సరిపడా ఉప్పు,వేపుడుకారం వేసి వేగాక మసాలాపొడి వేసి 2 ని.లు వేయించి స్టవ్ కట్టేయాలి.వెంటనే గడ్డపెరుగు వేసి తిప్పాలి.2 ని.లు కలిసేలా తిప్పి ప్రక్కన పెట్టేయాలి.ఇలా చేస్తే పెరురు నీరు తేరుకోకుండా రుచిగా ఉంటుంది.అంతే చేమదుంపల కుర్మా తయారయినట్లే. 

Thursday, 19 March 2015

హార్మోన్ల అసమతుల్యత లేకుండా

                                         జొన్నతో చేసిన ఆహారపదార్ధాలు తినటం అలవాటు చేసుకుంటే మెనోపాజ్ లో
  హార్మోన్ల అసమతుల్యత ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.జొన్న రొట్టె,ఇడ్లీ,ఉప్మా,కిచిడీ,దోసె రకరకాలు        చేసుకోవచ్చు.రక్తహీనత రాకుండా ఉంటుంది.పీచు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కూడా జీర్ణమవుతుంది.

జుట్టు నిగనిగలాడాలంటే.......

                                         కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి ఆకు వేగిన తర్వాత దించేయాలి.నూనె  చల్లారిన తర్వాత వడకట్టి సీసాలో పోసుకోవాలి.రోజూ తలకు రాసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది.ఒకవేళ రోజూ
రాసుకోవటం ఇబ్బంది అనుకుంటే వారానికి మూడుసార్లు రాత్రిపూట తలకు పట్టించి ఉదయమే తలస్నానం చేయవచ్చు. 

కుయ్యో మొర్రో

                                                            సూర్య,చందూ అన్నదమ్ములు.ఇద్దరినీ ఒకటిగానే పెంచినా పెద్దవాడు దృడంగా,హుషారుగా ఉంటాడు.చిన్నవాడు కాస్త నీరసంగా,నెమ్మదిగా ఉంటాడు.పెద్దవాడు ఉదయమే లేచి గంట మోగిస్తూ,మంత్రాలు,స్తోత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటాడు.ఇంతకీ వాడికి పదేళ్ళు.అందరితో చక్కగా,పెద్ద తరహాలో మాట్లాడతాడు.మరి అదేంటో? అల్లరి విపరీతంగా చేస్తుంటాడు.చిన్నాడికి తొమ్మిదేళ్ళు.పెద్దవాడు కాస్త ఖాళీ దొరికితే చాలు చిన్నవాడిని దేనికో ఒకదానికి   కొడుతుంటాడు.చిన్నవాడు ఏడుస్తుంటాడు.ఎవరెంత చెప్పినా వాడి ధోరణి మాత్రం మార్చుకోడు.ఒకరోజు చిన్నవాడు బొమ్మలు వేసుకుంటుండగా పెద్దవాడు వాడిపై నుండి అమాంతంగా దూకేశాడు.చిన్నవాడి కాలు,చేతిపై కూర్చోబడ్డాడు.వాడు అమ్మో,అయ్యో నొప్పి అంటూ విలవిలలాడుతూ సాయంత్రందాకా కుయ్యో మొర్రో అంటూ ఏడుస్తూనే ఉన్నాడు.అమ్మమ్మవచ్చి నానా గొడవ చేసి స్వంత ఇల్లు కనుక సరిపోతుంది.అదే అద్దె ఇల్లయితే ఎప్పుడో ఖాళీ చేయించేవాళ్ళు.వీడిపిచ్చి అల్లరి రోజురోజుకి ఎక్కువై పోతుంది.చిన్నాడి కాలు,చెయ్యి ఇరిగిపోయిందో ఏంటో?అని హడావిడిగా ఆసుపత్రికి తీసుకెళ్ళింది. 

ఎటు పడుకుంటే అటు

                                                         స్వరాజ్యం ఇంటికి వాళ్ళ అమ్మమ్మ వచ్చింది.తెలిసిన వాళ్ళింటికి వస్తూ అమ్మమ్మను కూడా వెంట తీసుకొచ్చింది.ఆమెకు ఎనభై సంవత్సరాలుంటాయి.చెప్పిన మాట చెప్పకుండా తన అనుభవాలన్నీ చెప్పటం మొదలెట్టింది.మాకాలంలో చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు.పురుళ్ళు ఇళ్ళల్లోనే పోసుకునేవాళ్ళం అని చెప్పింది. తనకు రెండోసారి గర్భం వచ్చినప్పుడు ఎనిమిదోనెలలో లోపల బిడ్డ ఎటు పడుకుంటే అటు పడిపోతున్నట్లు అనిపించిందట.అయినా లోపల బిడ్డ తిరుగుతుంటే అలా ఉందేమో అనుకుని ఎవరితో చెప్పలేదట.పదిరోజుల తర్వాత చిన్నగా నొప్పులు వస్తే అమ్మకు చెప్పగానే ఏదో నాటు మందు ఇచ్చిందట.అప్పట్లో దాన్ని ఇళ్ళమ్మట అమ్మేవాళ్లట.వాతంనొప్పులైతే తగ్గిపోతాయని లేకపోతే ప్రసవమవుతుందని చెప్పి తమలపాకులో పెట్టుకుని తినమందట.తిన్నకాసేపటికి చనిపోయిన మగబిడ్డ పుట్టాడట.చర్మం కూడా ఊడిపోయిందట.ఏదో ఆయుష్షు ఉండి బతికింది నీకూతురు లేకపోతే ఇటువంటప్పుడు పెద్దప్రాణానికి ముప్పువచ్చేది.చిన్నచిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ పెద్దవాళ్ళు చూడడానికి వచ్చివాళ్ళ అమ్మను చివాట్లేశారట.ఇకనైనా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారట.   

నోటికి వచ్చిన పిచ్చితిట్లన్నీ......

                                                  మంగ తాయారు చిన్నప్పుడు పిచ్చిఅల్లరి చేసేది.గోడలు దూకటం,చెట్లెక్కడం  వంటి పనులు కూడా చేసేది.రౌడీ రాణిలాగా అందరినీ తిట్టేది. ఏడేళ్ళ వయసున్నప్పుడు ఒకసారి అవతలవైపు ఏముందో చూసుకోకుండా గోడ దూకింది.అక్కడ కత్తిపీట ఉంటే దానిపై పడిపోయి మోకలిపైన కండ కోసినట్లుగా సగంతెగి వేలాడటం మొదలెట్టింది.పెద్దపెద్ద శోకాలు పెడుతుంటే పెద్దవాళ్ళు చూచి పిచ్చి అల్లరి చేయవద్దంటే వినవు అని నాలుగు చివాట్లేసి వాళ్ళఊరిలో ఆసుపత్రి లేకపోవటంవల్ల పక్కఊరికి తీసుకెళ్ళారు.అక్కడి వైద్యుడు వయసులో,అనుభవంలో చాలా పెద్దాయన.ఆయన కుట్లువేస్తుంటే చిన్నదైనా మంగ తాయారుకు నోరెక్కువ కావటంతో వైద్యుణ్ణి నదురుబెదురు లేకుండా  పిచ్చితిట్లు తిట్టటం మొదలెట్టింది.నాకాలికి కుట్లు వేసేస్తున్నాడు దేముడో,రాముడో నొప్పిపెడుతోంది అంటూ కాలు కదిలిస్తూ నోటికి వచ్చిన తిట్లన్నీతిట్టడం మొదలెట్టింది.పెద్దవాళ్ళు తిట్టగూడదు అనిచెప్పినా వినిపించుకోవట్లేదు.వైద్యుడు మాత్రం ప్రశాంతంగా తిట్టనివ్వండి చిన్నపిల్ల అంటూ ఓపికగా,నవ్వుతూ  నీకు చాక్లెట్లు కావాలా?బిస్కట్లు కావాలా?అంటూ బుజ్జగించి కుట్లువేసేశారు. 

Wednesday, 18 March 2015

చపాతీ మెత్తగా రావాలంటే .......

                                                      చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం వెన్నకలిపి పిండిని బాగా మర్దన చేసి ఒక 10 ని.లు నానబెట్టి తర్వాత మరల ఒకసారి బాగా కలిపి చపాతీ చేస్తే మెత్తగా వస్తాయి.మెత్తదనం అనేది మనం పిండి కలిపేదానిపై ఆధారపడి ఉంటుంది.ఒక 1/2 కే.జి పిండికి ఒక పెద్ద నిమ్మకాయంత వెన్న వేస్తే చపాతీ కాల్చేటప్పుడు  నెయ్యి కానీ,నూనెకానీ వెయ్యనవసరం లేదు.చాలా మెత్తగా,రుచిగా ఉంటాయి.

కోరుకున్న రంగు సొంతమవ్వాలంటే .......

                                          ఇది అనాస పండ్లు దొరికే కాలం.దీన్నితింటే ఎంతో మంచిది.ఎన్నో పోషకాలతో పాటు పీచు తగినంత ఉంటుంది.కొయ్యటం కష్టమే కానీ కోరుకున్న రంగు సొంతమవ్వాలంటే ఒక స్పూను అనాసరసం తీసుకుని దానికి ఒకస్పూను పంచదార,ఒక స్పూను తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మునివేళ్ళతో సుతారంగా రుద్దాలి.పది ని.లు అయ్యాక చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.ఇలా తరచూ చేస్తుంటే కోరుకున్న రంగు స్వంతం చేసుకోవచ్చు.

Tuesday, 17 March 2015

పెరుగులో యూరియా

                                           సంజయ్ స్నేహితుడి కూతురు పెళ్ళికి వెళ్ళాడు.అక్కడ చదువుకున్నప్పటి స్నేహితులందరూ కలిశారు.భోజనం చేస్తుండగా సంజయ్ పెరుగు వేసుకుందామనుకునేసరికి ఒక స్నేహితుడు  వేసుకోవద్దని ఆపేశాడు.పెరుగు రుచిగా,గడ్డలాగా తోడుకోవటానికి యూరియా కలుపుతున్నారని చెప్పాడు.నిజమా!అని మిగతావాళ్ళు ఆశ్చర్యపోయేసరికి చరవాణిలో దానికి సంబందించిన ఋజువు చూపించాడు.అవును, వాళ్లకు లాభాలే ముఖ్యం కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదు అని చెప్పాడు.ఈమధ్య పెరుగు రుచిగా ఉంటుందని నేను వేసుకుంటున్నాను అని ఇంకో స్నేహితుడు అన్నాడు.అయితే ఇదన్నమాట అసలు రహస్యం.తెలిసి అనారోగ్యం కొని తెచ్చుకోవటమెందుకని ఇకముందు ఎవరూ బయట తయారు చేసిన పెరుగు వేసుకోవద్దని అనుకున్నారు. 

పూరీ రుచిగా

                                                   పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం పచ్చిపాలు పోసి కలిపి వెంటనే చేసుకుంటే
పూరీలు రుచిగా,మెత్తగా ఉంటాయి.కాగిన నూనెలో వేయగానే చక్కగా పొంగుతాయి.తీసి పక్కనపెట్టినా పొంగిన పూరీలు అణిగిపోకుండా చక్కగా నిలబడి ఉంటాయి.

అల్లం - మామిడికాయ నిల్వపచ్చడి

అల్లం -100 గ్రా.
మామిడికాయలు - 6
కారం - 3/4  కప్పులు(రైస్ కుక్కర్ కప్పు)
మెంతులు - 100 గ్రా.
ఉప్పు - సరిపడా
బెల్లం,పంచదార -1/4  కే.జి(200గ్రా.+50 గ్రా.)
వెల్లుల్లి  - 4,5
                                                 అల్లం శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలు కోసి ఆరబెట్టాలి.తర్వాత నూనె వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.మామిడికాయలు కడిగి తుడిచితురుముకోవాలి.మెంతులు వేయించి పొడి కొట్టుకోవాలి.అన్నీకలిపి బాగా వేడెక్కేవరకు రుబ్బుకోవాలి.చివరలోబెల్లం,పంచదార వేసి రుబ్బాలి.       వెల్లుల్లి పాయలు మూడు వేసి రుబ్బాలి.రెండు ఒలిచి కలుపుకోవాలి.చివరగా నూనె సరిపడాపోసి పోపు పెట్టాలి.
ఆరిన తర్వాత పొడి సీసాలోకానీ,జాడీలో కానీ పెట్టుకోవాలి. 

బాబాయి - అబ్బాయి

                                                             సంజీవరావుగారికి ఇద్దరు మగపిల్లలు.ఉద్యోగరీత్యా ఇద్దరూ వేరువేరు దేశాలలో ఉంటారు.సంజీవరావుగారి చిన్నకొడుకు పుట్టిన తారీఖునే పెద్దకొడుకు కొడుకు పుట్టాడు.అంటే ఒకేరోజు
బాబాయి,అబ్బాయి పుట్టినరోజు అన్నమాట.ఆ ఇద్దరూ వేరేవేరే దేశాల్లో ఉండటం వల్ల సంజీవరావుగారు,భార్య ఆ ఇద్దరి పుట్టినరోజుని అనాధాశ్రమానికివెళ్ళి అక్కడిపిల్లల మధ్య జరిపిస్తారు.రెండు పెద్ద కేకులు,స్వీట్లు,చాక్లెట్లు తీసుకెళ్ళి అందరికీ ఇచ్చి వాళ్ళతో కాసేపు సరదాగా ఆటలు ఆడి,పిల్లల ముఖాల్లో సంతోషాన్ని చూచి వీళ్ళు కూడా ఆనందంగా ఇంటికి తిరిగి వస్తారు. 

నూతనోత్తేజం

                                         ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్ళకి ఒక్కొక్కసారి  విసుగ్గా అనిపిస్తుంటుంది.
అలాంటప్పుడు ఇష్టమైన పాటలు వింటూ నచ్చినట్లు నాట్యం చేసుకోవచ్చు.నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు.చక్కని పుస్తకం కొత్త ఆలోచనలకూ కారణం కావచ్చు.రోజూ చూసే ఇల్లు,వస్తువులే అయినా వాటిని మార్చేసి నచ్చినట్లుగా  కొత్తతరహలో సర్దుకోవచ్చు.ఖాళీగా ఉంటే బోలెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి.సానుకూలమైన,ప్రతికూలమైన
ఆలోచనలైనా కాగితంపై రాసుకుంటే ఎవరికీ వారే తరచి చూచుకొని వారి ఆలోచనా  ధోరణిలో చక్కని మార్పుని తీసుకొచ్చి లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడుతుంది.ఒక్కరోజైనా నచ్చినరీతిలో ఉంటే మనసుకు ఉత్సాహంగా ఉండి నూతనోత్తేజంతో కొత్త పనులు ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది.     

పరిక్షల సమయంలో.....

                                             పరిక్షల సమయంలో పెద్దవాళ్ళుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లలు రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు.దీనితో ఉదయం అల్పాహారం తినటం మానేస్తుంటారు.    అల్పాహారం మెదడుకు శక్తినిస్తుంది కనుక పిల్లలు తప్పనిసరిగా తినేట్లు చూడాలి.కనీసం ఆరు,ఏడు గంటలన్నా  నిద్రపోయేలా చూడాలి.నిద్ర సరిపోకపోతే తలనొప్పి,ఏకాగ్రత లేకపోవడం,చదివింది గుర్తులేకపోవడం   జరుగుతుంటుంది.అప్పుడు ప్రయోజనం ఉండదు కదా.అందుకే ఆందోళన పడకుండా ప్రశాంతంగా మధ్యమధ్యలో 2,3 గం.లకొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం కాసేపు అటు,ఇటు నడవడం వల్ల కొత్త శక్తి వచ్చినట్లు చురుగ్గా ఉండగలుగుతారు.పది ని.లు విరామం తీసుకున్నట్లు ఉంటుంది.మంచినీళ్ళుపండ్లరసాలు,సమయానికి తగినట్లుగా ఆహారాన్ని ఇస్తూ చక్కగా చదువుకునేలా  ప్రోత్సహించాలి.చదవడం ఒక ఎత్తయితే ,పరిక్ష చక్కగా వ్రాయడం ఒక ఎత్తు.పరిక్ష రాసేటప్పుడు కూడా పేపరు ఇవ్వగానే హడావిడిగా వ్రాయడం మొదలు పెట్టకుండా ఒక 5 ని.లు ప్రశాంతంగా కళ్ళుమూసుకుని ఆతర్వాత వ్రాయడం మొదలుపెడితే చక్కగా వ్రాయగలుగుతారు.పరిక్షల సమయంలో కాకుండా ముందునుండే ఈవిధంగా పిల్లలకు పెద్దవాళ్ళు తర్ఫీదునివ్వాలి.పిల్లలు చక్కగా చదువుకుని ప్రయోజకులైతేనే కదా పెద్దవాళ్ళకు సంతోషం కనుక తల్లిదండ్రులు ఎన్ని పనులున్నాపిల్లలపట్ల శ్రద్ధ వహించాలి.తల్లో,తండ్రో ఎవరికి వీలైతే వాళ్ళు తప్పనిసరిగా పరీక్షాకేంద్రానికి పిల్లలను వెంటబెట్టుకుని తీసికెళ్ళి తీసుకురావాలి.ఇద్దరికీ వీలుకాకపోతే పెద్దవాళ్ళైనా వెళ్ళాలి.పిల్లలు ఉత్సాహంగా,చురుగ్గా ఉంటారు.     

Monday, 16 March 2015

గరిటెలు,పప్పుగుత్తి .....

                                              చంద్రావతికి ఇద్దరు కొడుకులు.పెద్దకొడుక్కి ఇద్దరు ఆడపిల్లలు.చిన్నకొడుక్కి ఇద్దరు మగపిల్లలు.పండుగలకు,సెలవులకు పిల్లలు,పెద్దలు చంద్రావతి దగ్గరకు చేరిపోతారు.పెద్దవాళ్ళు సమావేశమై కబుర్లలో పడిపోతారు.పిల్లలు ఆటల్లో పడిపోతారు.ఈ నేపధ్యంలో పిల్లల మధ్య గొడవ మొదలైంది.పెద్దకొడుకు పెద్దఅమ్మాయికి  చిన్నకొడుకు పెద్దకొడుక్కి కోపం వచ్చింది.వాళ్ళ ఇల్లే కాక పక్కిల్లు కూడా ఎగిరిపోయేలాగా పోట్లాడుకుని ఎవరికి  దొరికినవాటితో వారు గరిటెలు,పప్పుగుత్తి,స్పూనులు,ఫోర్కులతో యుద్ధం మొదలెట్టారు.అవి ఒకరి మీద ఒకరు విసురుకుంటుంటే పక్కింట్లోకొచ్చి పడటం మొదలెట్టాయి.అయినా పెద్దవాళ్ళు వాళ్ళ కబుర్లలో వాళ్ళున్నారు.ఏవో శబ్దాలు వస్తున్నాయని చూస్తే స్పూన్లు,గరిటెలు వర్షం పడుతున్నట్లుగా పక్కవాళ్ళ ఇంట్లో నుండి పడుతున్నాయి.ఏంట్రా ఆ గొడవ?అని కేకలేస్తే నన్ను తిట్టాడు నేను గరిటె విసిరాను అని అమ్మాయి చెప్పింది.నన్ను కొడితే నేను ఊరుకుంటానా అందుకే నేను కొట్టాను అన్నాడు అబ్బాయి.మీకు కోపం రావటమేమిటో?ఏదిపడితే అది విసురుకోవటం ఏంటో?అంటూ అమ్మాయ్ కబుర్లలో పడి పిల్లలు ఏమిచేస్తున్నారో చూచుకోవద్దా?అంటూ నిద్రాభంగమైన పక్కింటాయన నాలుగు అక్షింతలు వేశాడు.కొట్టుకోవటానికి కర్రలే అవసరంలేదు ఏవస్తువైనా ఉపయోగించవచ్చన్నమాట.   

నానమ్మ భయం

                                                 నిర్మలమ్మకు ఒక కొడుకు.అతనికి లేకలేక ఇద్దరు మగపిల్లలు పుట్టారు.ఇద్దరూ గారాబం ఎక్కువై అల్లరి పిడుగుల్లా తయారయ్యారు.తోటి పిల్లలను కొట్టడం వాళ్ళదగ్గర చేతిలో ఏది ఉంటే అది లాగేసుకోవడం,వాళ్ళు ఏడుస్తుంటే నవ్వడం వంటి పిచ్చి పనులు చేస్తుంటారు.పెద్దవాడు చిన్నవాడికన్నా బాగా అల్లరి చేస్తాడు.దీంతో తోటి పిల్లల తల్లిదండ్రులు ఇంటి దగ్గరకు వచ్చి గొడవచేయడం,ఇంకొకసారి ఇలాజరిగితే ఊరుకోబోమని హెచ్చరించడం మొదలెట్టారు.దీంతో ఆటలాడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళను కొట్టి వాళ్ళ పెద్దవాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని వస్తారరేమోనని తెగ భయపడిపోయి మనవళ్ళు సైకిలు మీద ఎంత దూరం వెళితే అంత దూరం తను నడిచి వెళుతుండేది.మీకు ఎందుకండీ శ్రమ వాళ్ళే ఆడుకుని వస్తారు కదా అని ఎవరైనా అంటే పది సంవత్సరాలు ఎన్నో పూజలు,వ్రతాలు చేస్తే పుట్టారు.వాళ్ళకేమయినా అయితే నేను తట్టుకోలేను.అందుకే ముందు జాగ్రత్తగా శ్రమ అయినా వెళ్తుంటాను అని చెప్పింది.          

Sunday, 15 March 2015

చెవుల్లో సన్నని వైర్లు

                                          ఈ మధ్య ఎవరిని చూసినా పెద్ద,చిన్న తేడా లేకుండా చెవుల్లో రెండు సన్నని వైర్లు
వేలాడేసుకుంటున్నారు. ఫోను మాట్లాడుకోవటానికో,పాటలు వినడానికో ఏ కారణమైనాగానీ దీని వల్ల చెవులు దెబ్బతినే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వీటివల్లే చెవులకు వినికిడి సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు.ఇంతకు ముందు ఎక్కడన్నా ఒకళ్ళు వినికిడి యంత్రం ఉపయోగించేవాళ్ళు.ఇప్పుడు చాలా మంది   వినికిడి యంత్రాలతో కనిపిస్తున్నారు.శబ్దకాలుష్యం కొంత కారణమైతే కొంత మనం చేతులారా చేసుకుంటున్నది.ఏది ఏమైనా చెవుల్లో పెట్టుకుని వినే అలవాటు తగ్గించుకోవటం మంచిది.   

బావిలో పెద్దనత్త

                                               రాధ స్నేహితురాలు బందువులమ్మాయి పెళ్ళికి నాలుగురోజులు ఊరు వెళ్ళింది.
సత్యన్నారాయణ స్వామి వ్రతానికి అమ్మాయి అత్తవారింటికి వెళ్ళవలసి వచ్చింది.అక్కడ మగవాళ్లందరూ ఎక్కువగా ఉద్యోగరీత్యా దుబాయ్ లో ఉంటారు.ఆడవాళ్లు,పిల్లలు ఊళ్ళో ఉంటారు.రాధకు ఆఊరును చూస్తే భలే ముచ్చటేసింది. రోడ్లన్నీ నున్నగా,అందమైన భవనాలతో చూడ చక్కగా ఉంది.ఇంకో వింత ఏమిటంటే ఆ ఊరి శివాలయంలో ఒక పెద్ద బావి ఉంది.ఆబావిలో ఒక పెద్ద నత్త ఉంటుందట.మేనెలలో వెళ్తే ఆనత్తను చూడవచ్చని అప్పుడు ఒకసారి వాళ్ళ ఊరురమ్మని చెప్పారు.ఇంతకీ అది ఏ ఊరు?అని రాధ అడిగింది.బావిలో నత్త వల్ల ఆ ఊరికి నత్త రామేశ్వరం అనే పేరు వచ్చిందని,నత్త రామేశ్వరం వెళ్ళానని చెప్పింది. 

Friday, 13 March 2015

ఒకరినొకరు...

                                                భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.అప్పుడప్పుడు  చిన్నచిన్న గొడవలు రావటం సహజం.వాటిని పెద్దవి చేసుకునేకన్నాఎప్పుడూ నాదే పైచేయిగా ఉండాలని అనుకోకుండా సర్దుబాటు ధోరణి కూడా అలవర్చుకుంటే గొడవలు సర్దుమణుగుతాయి.ప్రతిఒక్కరికి ఎవరి స్వంత అభిరుచులు,ఇష్టాలు వాళ్లకుఉంటాయి.వాటిని మరొకరు ఇష్టపడకపోయినా,గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ తేలిగ్గా ఎవరి దగ్గరా మాట్లాడకూడదు.తెలిసోతెలియకో అలా మాట్లాడటం వల్ల ఎదుటివారు బాధపడటమే కాక లేనిపోని గొడవలకు తెర దించినట్లవుతుంది.   

చర్మం బిగుతుగా .......

                                                            గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.దీనిలో పళ్ళ రసం ఏదోఒకటి (నిమ్మ,కమలా,నారింజ,అనాస,మొ....వి)2 స్పూన్లు,ఒక స్పూను తేనె కలిపి ముఖానికి రాయాలి.1/4 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేయాలి.పండ్లరసం కలపటం వల్ల వాసన ఉండదు.తప్పనిసరిగా గోరువేడి  నీళ్ళతో ముఖం కడగాలి.బ్రష్ ఉపయోగిస్తే బాగుంటుంది.

గోళ్ళు అందంగా ఆరోగ్యంగా

                                        పదిరోజులకొకసారి గోళ్ళను కత్తిరించి చక్కటి ఆకృతినివ్వాలి.దీనివల్ల గోళ్ళు అందంగా ఉండటమే కాకుండా గోళ్ళల్లో పేరుకున్న మురికి పోతుంది.గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం పిండి పాదాలు,చేతులు 10 ని.ల చొప్పున పెడితే శుభ్రపడతాయి.తర్వాత పొడి వస్త్రంతో తుడిచి గోరు వెచ్చని బాదం నూనె తీసుకుని గోళ్ళకు మర్దన చేస్తే గోళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి.గోళ్ళరంగు వేసుకోవటం నేటి ఫ్యాషన్ అయినా అదేపనిగా వేసుకోవటం వల్ల గోళ్ళపై ఉండే సహజ నూనెలు పోయి పొడిబారి రంగు మారటం జరుగుతుంది.అలా జరగకుండా ఉండాలంటే వారంలో ఒకటి,రెండు రోజులైనా గోళ్ళరంగు వేసుకోకపోవటమే మంచిది.గోళ్ళరంగు తొలగించటానికి ఎసిటోన్ లేని రిమూవర్ ను ఉపయోగిస్తే గోళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి.

చిచ్చరపిడుగులు

                                                  అల్లరి చెయ్యడం పిల్లల సహజ లక్షణం. కొంతమంది పిల్లలు ఇంటికి ఎవరైనా కొత్తవాళ్ళు వచ్చినా లేదా వీళ్ళు బయటకు వెళ్ళినా చిచ్చరపిడుగుల్లా చెప్పిన మాట వినకుండా ఇంట్లో ఎప్పుడూ చెయ్యని అల్లరిపనులు కూడా చేస్తుంటారు.ఇలాంటి వాళ్ళతో బయటకు వెళ్ళాలన్నా భయమే అలాగని ఎక్కడికీ తీసుకెళ్ళకుండా ఉండకూడదు.అక్కడ గట్టిగా అరవటం,తోటిపిల్లలను కొట్టడం,అడిగినది ఇవ్వకపోతే ఏడవడం, ఏదిపడితే అది చేతుల్లోకి తీసుకుని తినడం వంటి పనులు చేయకూడదని అలాగయితేనే తీసుకెళ్తానని ముందే చెప్పాలి.ఇంకొంతమంది పెద్దవాళ్ళ దగ్గర ఉండకుండా ఏటో పరుగెత్తుతూ ఉంటారు.వీళ్ళను వెతుక్కోవడం పెద్ద తలనొప్పి.దూరంగా వెళ్ళకుండా దగ్గరలోనే పెద్దవాళ్ళకు కనిపించేలా ఆడుకొమ్మని గట్టిగా చెప్పాలి.చిన్నపిల్లలకు కూడా రక్షణ లేని రోజులాయె.ఎన్ని చెప్పినా వాళ్ళ ధోరణి వాళ్ళదే ఒకపట్టాన వినరు.అలా అని వదిలేయకుండా పిల్లలను విసుక్కోకుండా పదేపదే చెబుతూ ఉంటే వారిలో తప్పకుండా మార్పు వస్తుంది.ఎటొచ్చీ పెద్దవాళ్ళకు ఓర్పు  సహనం ఉండాలి అంతే.  

Thursday, 12 March 2015

అదనపు రుచి

                                        చికెన్ కర్రీ చేసేటప్పుడు మనకు నచ్చిన పద్దతిలో వండిన తర్వాత దించేముందు రెండు టేబుల్ స్పూన్ల చిక్కటి  కొబ్బరిపాలు పోసి రెండుసార్లు తిప్పి దించేయాలి.చివరగా కొబ్బరిపాలు పొయ్యటం వల్ల కూరకు అదనపు రుచి వస్తుంది. 

గ్రేవీ చిక్కగా,రుచిగా ఉండాలంటే ......

                                                     కాయగూరలతో వండినా,మాంసంతో వండినా గ్రేవీ చిక్కగా,రుచిగా ఉండాలంటే
గసాలు,కొబ్బరి,కొంచెంజీడిపప్పు,కొంచెం బాదంపప్పు మిక్సీలో వేసి కూరలో వేస్తే చాలా రుచిగా,చిక్కగా ఉంటుంది.
గుత్తివంకాయ వండేటప్పుడు టొమాటోతో పాటు కొంచెం వేరుసెనగపప్పు,కొంచెం పుట్నాలపప్పు,కొబ్బరి,గసాలు
4 జీడిపప్పుపలుకులు మిక్సీలో వేసి మెత్తగా చేసి కూరలో వేస్తే చాలా బాగుంటుంది.మనం వండే కూరనుబట్టి
2,4,6 పలుకులు వెయ్యాలనేది నిర్ణయించుకోవాలి.

లంబు-జంబు

                                                      లంబు,జంబు మేనమామ,మేనల్లుళ్ళు.వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేనట్లు వేరేవాళ్ళ దగ్గర మాట్లాడతారు.నిజానికి మేనమామ డబ్బులిచ్చినంతవరకు మేనల్లుడు మామయ్య అంటూ మాట్లాడతాడు.ఎప్పుడైతే ఇవ్వలేదో అప్పుడు పిచ్చి తిట్లు చాటున తిడతాడు.ఎదురుగా ఎంతో ప్రేమ ఈ విషయం మేనమామకీ తెలుసు.అయినా మేనల్లుడంటే ఉన్న ప్రేమో,మరింకేదో తెలియదు గానీ యధా రాజా తధా ప్రజా అన్నట్లు ఈయన ఇవ్వకా మానడు ఆయన తిట్టకా మానడు.క్షరా మామూలే .జనాలకు కాలక్షేపం.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే లంబు మిగతా మేనకోడళ్ళు,మేనల్లుళ్ళ గురించి ఆరాలు జంబూ నడిగి   తెలుసుకుంటాడు.మిగతవాళ్ళెవరికీ ఈయన మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు.వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు.అందుకని లంబూని పొగడరు.జంబూకి బద్ధకం ఎక్కువ.తన డబ్బు దాచుకుని ఎదుటివాళ్ళ డబ్బుతో జల్సా చేద్దామనుకుంటాడు.అందుకని లేనిపోయినవి కల్పించి వాళ్ళు అది అన్నారు,ఇదన్నారు అంటూ అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకుంటాడు.లంబూ కూడా జంబూ చెప్పినవే అబద్దమైనా నిజమని నమ్ముతాడు.లంబూ లాంటివాళ్ళు చెప్పుడు మాటలు విన్నంత కాలం జంబూ లాంటివాళ్ళు చెప్పి హాయిగా కష్టపడకుండా బ్రతుకుతారు. చెప్పుడు మాటలు వినేముందు దానిలో నిజమెంత? అని వివేకంతో ఆలోచించగలిగితే బాగుంటుంది.  ఆలోచిస్తున్నారంటే ఎదుటివాళ్ళు చెప్పడానికి సాహసించరు.   

ముఖం తేటగా కనిపించాలంటే........

                                                     ఒక టొమాటో రసంలో కొంచెం ఓట్స్ వేసి  అవి మెత్తబడి చిక్కని పేస్ట్ అయ్యాక
దాన్ని ముఖానికి పట్టించి ఒక 15 ని.ల తర్వాత కడిగేస్తే సరి.ముఖం మీది జిడ్డు,నలుపుదనం పోయి తేటగా కనిపిస్తుంది. 

Wednesday, 11 March 2015

తెలిసీ తెలియనట్లు నాటకం

                                            శ్రీజ బంధువులందరూ చిత్ర విచిత్ర మనస్తత్వం కలవారు.శ్రీజ కుటుంబం గురించి ఎప్పటికప్పుడు తు.చ తప్పకుండా అన్నట్లు సమాచారం సేకరిస్తూనే ఉంటారు.ఎదురుగా కన్పించినప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తూ ఏమ్మా!ఏమిటి కబుర్లు?అంటూ ఆరాలు అడిగి అప్పుడే విషయం తెలిసినట్లు నాటకాలు ఆడుతుంటారు.మళ్ళీ మాటల్లో ఎక్కడో ఒకచోట పొరపాటున అంతకు ముందే విషయం తెలిసి కూడా నాటకంగా  అడుగుతున్నట్లుగా బయట పడుతుంటారు.శ్రీజకు కూడా ఆవిషయం తెలుసు.వయసులో చాలా పెద్దవాళ్ళు  చాదస్తంతోనో,మరింకేదో పైత్యంతోనో అడుగుతున్నారులే అని తెలిసీ తెలియనట్లు నాటకాలు ఎందుకు? అని ఎదురు ప్రశ్నించకుండా చూసీచూడనట్లుగా వదిలేస్తుంది. 

శంభులింగం-జంబులింగం

                                               శంభులింగం,జంబులింగం ఇద్దరూ మేనత్త మేనమామ పిల్లలు.ఇద్దరూ వైద్యులు.
విదేశాలలో స్థిరపడ్డారు.ఇద్దరికీ ఎవరికి వారికి నేనే గొప్ప అని ఉంటుంది.ఒకరి గురించి ఒకరు పరోక్షంగా  విమర్శలు గుప్పిస్తుంటారు కానీ బంధువుల విషయంలో ఎవరికైనా సహాయం చేయాలంటే మొండిచెయ్యి  చూపిస్తుంటారు.ఇద్దరిదీ ఒకే మాట.స్వంత అక్కచెల్లెళ్ళను ఒకసారి రమ్మని మాటవరసకు కూడా అని ఎరుగరు. శంభులింగం అక్క,బావ వెళ్దామని ఏనాడూ అనుకోలేదు కానీ జంబులింగం చెల్లి,బావ శతవిధాల వెళ్దామని ప్రయత్నించినా తీసుకెళ్ళలేదు.స్వదేశానికి వచ్చినప్పుడు మాత్రం చెల్లి కల్లబొల్లి కబుర్లు చెప్పి ఏడిస్తే డబ్బు ఇచ్చి వెళ్తాడు.ఇంకేముంది జంబులింగం మంచివాడంటారు ఊరిజనం.విదేశాలకు బంధువులు వెళ్ళాలని ఏదైనా సలహా అడిగినా తనను ఏమైనా సహాయం అడుగుతారేమోనని తప్పుడు సమాచారం ఇస్తుంటాడు.శంభులింగం తనను సహాయం అడిగే అవకాశం ఇవ్వకుండా సరయిన సమాచారం ఇస్తుంటాడు.శంభులింగం కన్నా జంబులింగం మంచివాడంటారు లోతుగా ఆలోచించని ఊరిజనం.తెలిసిన వాళ్ళు దొందూ దొందే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు.ఎవరికీ మాటసాయం కూడా చెయ్యరు అని శంభులింగం జంబులింగం లాంటివాళ్ళు అంటారు.   

Tuesday, 10 March 2015

గిలిగిచ్చకాయ

                                                  రంజిత మేనకోడలికి ఆరేళ్ళు.పెద్ద ఆరిందలా మాట్లాడుతుంది.చిన్నదయినా ఎక్కడెక్కడి విషయాలు తనకే కావాలి.ఒకరోజు మేనకోడలిని చూద్దామని వాళ్ళింటికి రంజిత వెళ్ళింది.రా బాప్ప!
అంటూ తీసికెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి స్నేహితురాళ్ళతో ఆడిన ఆటలు చుట్టుపక్కల కబుర్లన్నీ చెప్పి చివరకు
ఈచీర మా అమ్మ పెట్టినదానిలాగే ఉంది ఔనా?అని అడిగింది.నువ్వు,మీ అమ్మా పెట్టినచీరలు తప్పక నాకసలు         చీరలే లేవే అంటూ గిలిగిచ్చకాయ మాటలు నువ్వూఅని ప్రేమతో కూడిన కోపంతో మేనకోడలిని  విసుక్కుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్ కరకరాలాడాలంటే.....

                                 బంగాళదుంపల్నినిలువుగా ముక్కలు కోసిన తర్వాత వాటిని కొద్ది నీళ్ళల్లో వేసి పిండి కవర్లో వేసి డీప్ ఫ్రిజ్ లో ఒకపూట పెట్టి తినేముందు నూనెలో వేయించుకుంటే రుచిగా కరకరలాడుతుంటాయి.   

వేసవిలో చర్మసంరక్షణ

                                                 వేసవిలో శీతల పానీయాలకు ప్రాధాన్యం తగ్గించి తాజాపండ్ల రసాలు,ఎక్కువగా  మంచి నీళ్ళు తాగాలి.దీనివల్ల చర్మం తాజాగా,మృదువుగా ఉంటుంది.సబ్బు వాడకం,ఫేస్ వాష్ వాడకం తగ్గించాలి.
 ఎండలో వీలైనంత వరకు బయటికి వెళ్ళక పోవడం మంచిది.ఎండలోకి వెళ్లేముందు చర్మ కణాలు దెబ్బతినకుండా  
 ముఖానికి,మెడకు,చేతులకు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాయాలి.చన్నీటి స్నానం మంచిది లేదంటే  గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.వేడినీళ్ళతో చేయకూడదు ఎందుకంటే చర్మం పేలి కందిపోతుంది.ఆకుకూరలు,  మామిడిపండ్లు కూడా వేడి కనుక ఇష్టమని ఎక్కువ తినకుండా  సపోటా,ఆపిల్,స్ట్రాబెర్రీ వంటి పండ్లు తినాలి.నిమ్మరసం,మజ్జిగ ఎక్కువగా  తీసుకోవాలి .ఎండు కర్జూరాలు,సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టి ఆనీరు తాగాలి.తాటి ముంజెలు తింటే మంచిది.  చర్మంపై ఎర్రబడితే తాటి ముంజెల్లోని నీళ్ళురాస్తే తగ్గిపోతుంది. చలువ చేసే పదార్ధాలు తీసుకోవటం వల్ల చర్మంపై వేసవిలో వచ్చే దద్దుర్లు,పేలుడు రాకుండా ఉంటుంది.కంటినిండా నిద్రపోవాలి.రోజు కాసేపు వ్యాయామం చేయాలి.రక్తప్రసరణ మెరుగుపడుతుంది.బయట ఎండగా ఉంది కదాని  ఎప్పుడూ చల్లదనంలో కుర్చోకూడదు.చర్మం పొడిబారుతుంది.ఇది మాకు తెలియదా ఏంటి ?అనుకోకండి.వారానికి రెండుసార్లు నలుగు పెట్టుకుంటే వేసవి కాలంలో కంటికి కనిపించని మురికి వదిలిపోయి చర్మం నునుపుగా బాగుంటుంది.ఇక చర్మ సంరక్షణ మన చేతుల్లోనే ఉంది. 

Monday, 9 March 2015

బంగాళదుంప కుర్మా

 బంగాళదుంపలు - 1/4 కె.జి
 ఉల్లిపాయలు - 2
  పచ్చిమిర్చి - 4
 అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
  పచ్చి కొబ్బరి - 2 స్పూనులు
  గసగసాల పొడి -  1/స్పూను
   వేపుడు కారం - 2/స్పూనులు
  గరం మసాలా - 1/2 స్పూను
   గడ్డ పెరుగు - 2 గరిటెలు
   నూనె - సరిపడా
                                       ముందుగా బంగాళదుంపలు ఉడికించి పొట్టుతీసి మధ్యరకం ముక్కలు కోయాలి.స్టవ్ వెలిగించి బాండీ పెట్టి సరిపడా నూనె వేసి తాలింపు దినుసులు,కరివేపాకు వేసి వేగాక పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలువేసి కొంచెం వేగాక అల్లం,వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.బంగాళదుంప ముక్కలు  వేసి వేగుతుండగా కొబ్బరి,గసగసాలపొడి వేసి వేయించాలి.పచ్చివాసన పోయాక వేపుడుకారం వేసి,గరం మసాలా  పొడి వేసి వేయించాలి.చివరగా పెరుగు వేసి,సన్నగా తరిగిన కొత్తిమీర వేసి 2 ని.లు తిప్పాలి.అంతే రుచికరమైన,         ఘుమఘుమలాడే బంగాళదుంప కుర్మా తయారయినట్లే.తినడమే తరువాయి.ఇది దేనితోనైనా బాగుంటుంది. 

తేటగీతికల్లాగా......

                                                    అనూష ఇంటికి బంధువులు వచ్చారు.వాళ్ళతోపాటు వాళ్లకు తెలిసిన ఒకామెను తీసుకొచ్చారు.ఆమె మాటల సందర్భంలో వాళ్ళ ఊరు నుండి ఉద్యోగరీత్యా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు రాజధానికి,కొంతమంది రాజధాని కాబోయి ఆగిపోయిన నగరానికి వచ్చారట.వాళ్ళల్లో ఇంతకు ముందు రాజధానికి వెళ్ళిన వాళ్ళకన్నా ఈ నగరానికి వచ్చినవాళ్ళు తేటగీతికల్లాగా ఉన్నారని చెప్పింది.అంటే ఏమిటండీ?అంటే ఆక్కడి నీళ్ళకన్నా ఇక్కడి నీళ్ళు మంచిగా ఉంటాయి కనుక తేటగా అంటే మంచి రంగు వస్తారని చెప్పింది.ఆవిడ మాటలు మొదట వినగానే తేట గీతి పద్యం గుర్తొచ్చింది.తేటగీతికల్లాగా మనుషులు ఉండటమేంటి?అనుకుంది.చివరికి ఆమె భలే విశ్లేషణ ఇచ్చింది.   

Sunday, 8 March 2015

మసాలా జొన్నరొట్టె

           తెల్ల జొన్నపిండి - 2 కప్పులు
           మెత్తటి ఆలూ ముద్ద - 1/2 కప్పు
          ఉల్లికాడల తరుగు - 1/4 కప్పు
          కొత్తిమీర తరుగు - 1/4 కప్పు
          అల్లం,పచ్చిమిర్చి పేస్ట్  - 1/2 స్పూను
          గరం మసాలా - 1/4 స్పూను
          ఉప్పు - తగినంత
          నెయ్యి - రొట్టె కాల్చడానికి సరిపడా
         జొన్న పిండి - కొద్దిగా
                                              నెయ్యి తప్ప మిగిలిన పదార్ధాలన్నీ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి.తర్వాత గోరువెచ్చటి నీళ్ళు చల్లుకుంటూ ముద్దలా కలపాలి.ఈపిండిని కొద్దిగా తీసుకుని పొడి పిండి అద్దుకుంటూ చేతితో రొట్టెలా తట్టాలి.బ్రష్ తో నెయ్యిరాస్తూ అట్లపెనంపై రెండువైపులా కాల్చాలి.మిగతా పిండి కూడా అలాగే చేసుకోవాలి.అంతే రుచికరమైన జొన్నరొట్టె తయారయినట్లే.ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి ఉప్పు,కారం,నిమ్మరసం సరిపడా కలిపి తింటే రుచిగా ఉంటుంది.      

సమయం లేదు

                                                          జస్విక తొమ్మిదో తరగతి చదువుతుంది.ఎక్కువగా టి.వి,కంప్యూటరు  దగ్గర కూర్చోవటం వల్ల కంటిచూపు మందగించి కన్ను ఎర్రబడుతుంది.వాళ్ళ నానమ్మ కంటి ఆసుపత్రికి వెళ్తూ జస్వికను కూడా వైద్యుని వద్దకు రమ్మంటే నాకు పరీక్షలు కనుక అట్టే సమయం లేదు రాలేనంది.సరేలే పిల్లను ఇబ్బంది పెట్టటం ఎందుకులే నేను కూడా తర్వాత వెళ్తానని నానమ్మ తన ప్రయాణం మానుకుంది.తర్వాతరోజు సెలవు ఉండటం వల్ల జస్వికకు పరిక్ష లేదు.జస్విక అమ్మ పరీక్షలన్ని రోజులు టి.వి ఇంట్లో చూడటానికి వీల్లేదని నిషేధాజ్ఞ జారీ చేసింది.అమ్మను మించినది పిల్ల కనుక పిన్ని ఇంటికి వెళ్దామని వంక పెట్టుకుని టి.వి చూడడానికి అందరినీ బయలుదేరదీసింది.అదే ఇంట్లో కొంచెంసేపు టి.వి చూడనిస్తే ఈ తిప్పలు ఉండవు కదా!పిల్లల్ని మరీ కట్టడి చేసినా ఇదే తరహాలో ఉంటుంది వ్యవహారం.పిన్నిరండి రండిఅంటూ  నవ్వుతూనే నన్ను చూడటానికి ఈసమయంలో రారు కదా!దీనికి ఆసుపత్రికి వెళ్ళటానికి సమయం లేదు కానీ టి.వి చూడటానికి సమయం దొరికిందా?అంటూ చురక అంటించింది.అమ్మాకూతుళ్ళు కుక్కిన పేనుల్లా నోటమాట రాకుండా ఉండిపోయారు.     

Saturday, 7 March 2015

ఎంతో ఇష్టం

                                                     రంగి జానకి దగ్గర కొత్తగా పనికి చేరింది.వచ్చిన దగ్గర నుండి వెళ్ళేవరకు నోటికి మూతలేనట్లు లొడలొడా మాట్లాడింది మాట్లాడినట్లే ఉంటుంది.చెప్పినది చెప్పకుండా ఆ చెప్పేవిధానం వినడానికి కూడా బాగానే ఉంటుందిలే.అమ్మా!మీరు ఇక్కడ కూర్చోండి అంటూ కుర్చీవేసి తను పని చేసుకుంటూ చెప్పే కబుర్లన్నీ వినేవరకు వదలదు.ఒకరోజు జానకి రంగికి గారెలు తినటానికి పెట్టింది.గారెలు తింటూ అమ్మా!మావైపు  బెల్లం గారెలు చేస్తాము.చాలారుచిగా ఉంటాయి.తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని శాస్త్రం ఉన్నట్లు తింటే బెల్లం గారెలే తినాలి అంటూ రంగి లొట్టలు వేస్తూ చెప్పింది.అవి ఎలా తయారు చేస్తారంటే మాఊరి దగ్గర బెల్లం తయారుచేసే చోట బెల్లం ఊట ఇస్తారు.( బెల్లం తీగపాకం పట్టి అయినా వేయవచ్చు) దానిలో వేడివేడి గారెలు వండగానే వేసి ఒక పూట పాకంలో ఉంచితే అవి పీల్చుకుని ఎంతో రుచిగా బాగుంటాయి.బెల్లం గారెలంటే నాకు ఎంతో ఇష్టం అని రంగి చెప్పింది.   

వ్యాపకం

                                      మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి.ఖాళీగా,పని లేకుండా కూర్చుంటే ఆకలి మొదలై ఏదో ఒకటి తినాలనిపిస్తుంది.నిద్రపోవాలనిపిస్తుంది.దీనితో బరువు పెరగుతారు.అందుకే పనులేమీ లేకపోతే ఒంటరిగా కూర్చోకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని క్షణం తీరిక లేకుండా ఉండేలా చూచుకోవాలి.అది సాధ్యపడాలంటే అభిరుచికి  తగినట్లు బాగా నచ్చినదాన్ని ఎంచుకుని ప్రణాళిక సిద్దం చేసుకుని దాన్నిఆచరణలో పెట్టాలి.ఇలా చేస్తే కాలక్షేపము అవుతుంది.ఆదాయము వస్తుంది.                          

రసాయనాలు తొలగాలంటే......

                                     కూరగాయలు,ఆకుకూరలు పండించేటప్పుడు తెగుళ్ళు,పురుగు పట్టకుండా బోలెడన్ని
పురుగు మందులు చల్లుతున్నారు.వాటి తాలుకు రసాయనాలు మనకడుపులోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏదైనా
వండే ముందు ఉప్పు,పసుపు నీళ్ళల్లో వేసి ఒక పది ని.లు నాననివ్వాలి.అప్పుడు రసాయనాలతో పాటు మురికి కూడా పూర్తిగా వదిలిపోతుంది.శుభ్రంగా కడిగి మనకు కావలసిన ఆకారంలో ముక్కలు కోసుకుని వండుకోవాలి.

Friday, 6 March 2015

రంగు మారకుండా....

                                    కూరగాయల్ని ఉడికించేటప్పుడు వాటి రంగు మారకుండా ఉండాలంటే ఉడికించే నీటిలో కొంచెం వంటసోడా వేయాలి.

హడావిడి

                                             ఇంటినిండా బంధువులతో హడావిడిగా ఉంది.వాళ్ళు ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి వెళ్ళటం వల్ల ఈరోజే మహిళాదినోత్సవ శుభాకాంక్షలు పోస్ట్ చేయవలసి వచ్చింది.రేపు పోస్ట్ చేయటానికి  వీలుపడుతుందో,లేదో తెలియని పరిస్థితి.అందుకని ఒకరోజు ముందే పోస్ట్ చేశాను.ఏమీ అనుకోకండి. 

పప్పుచెక్కలో పప్పులు కరకరలాడాలంటే .....

                                        వేరుశనగ పప్పుచెక్క చేసేటప్పుడు దానిలో పప్పులు కరకరలాడాలంటే పప్పు వేయించుకుని పట్టుతీసి ఒకప్రక్కన పెట్టుకుని బెల్లంతో ముదురుపాకం పట్టుకుని ప్లేటుకు నెయ్యిరాసి దానిలో పాకంపోసి దానిపై పప్పులు పోసి గరిటెతో సర్దాలి.ఆరిపోయిన తర్వాత ముక్కలు చేయాలి.ఇలా చేస్తే పప్పులు మెత్తబడకుండా రుచిగా ఉంటాయి.

సానుకూల దృక్పధం

                          గృహిణులైనా,ఉద్యోగులైనా,వ్యాపారులైనా సానుకూల దృక్పధంతో ఉండి,సానుకూల దృక్పధంతో ఆలోచిస్తే తప్పక విజయం సాధించగలరు.సంతోషమే సగం బలం.మహిళలందరికీ శుభాకాంక్షలు.                          

మహిళా విజయం

                                                  ఒకప్పుడు హాయిగా భర్త సంపాదించి పెడుతుంటే కూర్చుని తింటూ ఊసుపోక ఆడవాళ్ళందరూ కాలక్షేపానికి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనే చాలా మంది అభిప్రాయం.రోజులు మారాయి.ఆడపిల్లలందరూ చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసుకోవటమో,స్వంతంగా వ్యాపారాలు చేసుకోవటమో చేస్తూ ఆర్ధికంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు.ఇది ఒక విధంగా చెప్పాలంటే మహిళలు సాధించిన విజయం.నేటి యువతరం మహిళలే కాకుండా భర్త,పిల్లలే లోకం అనుకున్నవాళ్ళు కూడా పిల్లల భాద్యతలన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తమ తమ  అభిరుచులకు,సృజనాత్మకతకు పదును పెట్టి దాన్ని వ్యాపారంగా మలుచుకుని కొందమందికి ఉపాధి కల్పిస్తూ నలుగురికి తమకు తోచిన సేవ చేస్తూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు.ఇది నిజంగా హర్షించతగ్గ విషయం.

అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

                      నాతోటి మహిళా బ్లాగర్లకు,ప్రపంచంలో నలుమూలల నుండి నా బ్లాగ్ వీక్షించవచ్చే తోటి  మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

హోళీ రంగుల కేళి

హోళీ అంటేనే రంగుల కేళి.వయసు తారతమ్యం లేకుండా సరదాగా జరుపుకునే పండుగ హోళీ.ఉదయం నుండి సరదాగా రంగులతో ఆటలు,పాటలతో హోళీ పండుగ జరుపుకుని ఉంటారు కదా!ఇప్పటికే ఆలస్యమయింది.అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు.

జంతు ప్రేమ

                                               రాజారావుగారికి జంతువులంటే అమితమైన ప్రేమ.ఆయన దగ్గర లేని పక్షులు,
జంతువులంటూ ఉండేవి కాదు..ఒక ఎకరం స్థలం పక్షులు,జంతువుల సంరక్షణ కోసం కేటాయించారు.  రకరకాలపక్షులు,జంతువులు,కుక్కలు,కోతులు,పాములతో సహా పెంచుతూ ఉంటారు.వాటి సంరక్షణ కోసం చాలామంది పనివాళ్ళుంటారు.ఆయన కూడా మొత్తం తిరిగి అన్నింటికీ దేనికి పెట్టే ఆహరం దానికి సరిగా అందుతుందో లేదో పర్యవేక్షిస్తుంటారు.ఒకసారి ఆయనకు ఎంతో ఇష్టమైన కుక్క చనిపోయింది.దాన్నిఎవరైనా పేరు పెట్టి మాత్రమే పిలవాలి.కుక్క అంటే ఇష్టం ఉండేది కాదు.ఆయనకు అదంటే అంత ఇష్టం.అడి చనిపోయినప్పుడు ఆయన బాధ వర్ణనాతీతం.దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆయన పొలంలోనే ఖననం చేసి సమాధి కట్టించి అందరికీ భోజనాలు పెట్టారు.ఆయనకు ఎంతో ఇష్టమైన కుక్క అకస్మాత్తుగా చనిపోయేసరికి విరక్తి చెంది అప్పటినుండి కొత్తకొత్త వాటిని తీసుకొచ్చి పెంచటం తగ్గించారు.   

చేతులు సన్నబడాలంటే

                                                జొన్న రొట్టెలు రోజూ చేస్తుంటే క్రమేపీ చేతులు సన్నబడతాయి.జొన్న రొట్టెలు చేయాలంటే పిండి బాగా కలిపి చేతులతో మాత్రమే తట్టి చేస్తుంటాము కనుక ఇది చేతులకు మంచి వ్యాయామం.ఎంత బాగా రొట్టె చేయగలిగితే అంత రుచిగా ఉంటుంది. 

Thursday, 5 March 2015

అమ్మ చెప్పిన తర్భూజ కబుర్లు

                                       అన్వితకు పండ్లలో తర్భూజ అంటే అసలు ఇష్టం ఉండదు.అమ్మ ఎలాగయినా అన్వితకు ఆపండు తినటం అలవాటు చేయాలని ఒకరోజు కూర్చోబెట్టి తర్భూజ తినటం వలన ఎంత ఉపయోగమో చెప్పటం మొదలుపెట్టింది.తర్భూజలో ఎక్కువ నీటిశాతం,తక్కువ కెలోరీలు ఉంటాయి.అందువల్ల బరువు తగ్గుతారు.బరువు తగ్గాలంటే రాత్రిపూట తినాలి.వేసవిలో తింటే త్వరగా దాహం వేయదు.తక్షణ శక్తినిస్తుంది.గుండెకు ఎంతోమంచిది.రోజూ తింటే చర్మం నునుపుగా తయారౌతుంది.జుట్టు పెరుగుతుంది.రక్తంలో చక్కరశాతాన్ని అదుపు చేస్తుంది.కడుపులో మంట తగ్గిస్తుంది.అధిక రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది.పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం ఉండదు. ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు తినటం మంచిది అని చెప్పి మొదటగా తినటం కనుక కొంచెం పంచదార వేసి ఇచ్చింది.అమ్మ చెప్పింది కనుక అన్విత మొదట అయిష్టంగానే తినటం మొదలుపెట్టింది కానీ తర్వాత రుచిగానే ఉందనిపించి క్రమంగా తినటం అలవాటు చేసుకుంది.ఇప్పుడు అన్వితకు తర్భూజ అంటే ఎంతో ఇష్టం.   

తలనొప్పి వస్తే ......

                                   వేసవి కాలంలో కొంచెం ఎండలో ప్రయాణం చేసినా తలనొప్పి వస్తుంటుంది.తలనొప్పి వచ్చింది కదా కాస్త వేడి టీ తాగుదామంటే మండుటెండలో తాగలేని పరిస్థితి.ఆ తలనొప్పి నుండి బయట పడాలంటే కాసిని తులసి ఆకుల్ని తీసుకుని ఆవిరి పడితే సరి.ఒక్క వేసవి కాలం అనే కాదు ఎప్పుడైనా తలనొప్పి వస్తే తులసి ఆకులతో ఆవిరి పడితే వెంటనే తలనొప్పి మాయమౌతుంది. 

అమ్మమ్మ చెప్పిన చిట్కా

                                                  సంవత్సరమంతా పప్పులు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే మార్చిలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత,అమావాస్య ముందు తెచ్చుకుని అమావాస్య ఎండలో పోసి డబ్బాలలో  నిల్వపెట్టుకోవాలి. ఇలా చేస్తే సంవత్సరమంతా పప్పులు పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి.పౌర్ణమి ముందు పప్పులు కొంటే అవి త్వరగా పురుగు పడతాయని పెద్దలు చెప్తుంటారు.ఏదైనా ఎండబెట్టాలంటే పౌర్ణమి ఎండకన్నాఅమావాస్య ఎండలో బాగా ఎండుతాయని అమ్మమ్మ చెప్తుంది.    

Wednesday, 4 March 2015

గౌరవించడం

                          అభీష్ట తాతగారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు  ప్రకాశరావు గారిని మాట్లాడుతున్నాను అంటూ చెప్పేవారు.అదేమిటి?తాతగారు భలే!తనను తానే గౌరవించుకుని గారు అని చెప్పుకుంటున్నారు అనుకునేవాళ్లు మనుమలు,మనుమరాళ్ళు.ఆయన తన అనుభవంతో అలా చెప్పేవారని ఇప్పుడు అర్ధమవుతోంది.మనల్ని గౌరవించడం ఎలాగో ఇతరులకు మనమే నేర్పాలి అన్నట్లుగా ఉంటుంది.ఇది వింతగా ఉన్నా నిజం.మనం మీరు అని మాట్లాడినా నువ్వు అనే కాలం ఇది.ముందు మనల్ని మనం గౌరవించుకోవటం నేర్చుకుంటే ఇతరులు మనల్ని గౌరవిస్తారు.ఎదుటివాళ్ళు ఏదైనా మాట్లాడినా నచ్చకపోయినా మొహమాటంగా ఊరుకుంటే అది తేలికగా ఏదిపడితే అది మాట్లాడటానికి ఆస్కారం ఇచ్చినట్లవుతుంది.అలా ఊరుకోకూడదు.ఉదాశీనత పనికి రాదు.అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలని శాస్త్రం.అందుకని మొదట్లోనే ఖండించాలి.              

కలుపుగోలుగా

                                            బంధువులతో కానీ,స్నేహితులతో కానీ కలుపుగోలుగా అంటే కలివిడిగా అందరితో సరదాగా,సంతోషంగా మాట్లాడేవారి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.ఆందోళన,ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి.
ఎవరితోనూ సరిగా మాట్లాడకుండా ముభావంగా గిరి గీసుకుని కూర్చునే వారికి గుండె సమస్యలు అధికంగా ఉంటాయి.ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది.పెళ్ళిళ్ళ కాలంలో అన్నింటికి ఏమి వెళ్తాం అని అనుకోకుండా వెళ్తుంటే
అందరితో కలుపుగోలుగా మాట్లాడటం అలవాటవుతుంది.అందరితో సరదాగా,సంతోషంగా గడపటం వల్ల మనసుకు హాయిగా బోలెడంత ఆనందంతోపాటు చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది.కొందరు ఎదుటివాళ్ళు సంతోషంగా ఉంటే
చూచి ఓర్చుకోలేక సూటీపోటీ మాటలనడమో,వెటకారంగా మాట్లాడటమో చేస్తుంటారు.అటువంటివాళ్ళను అసలు పట్టించుకోకుండా వదిలేసి సరదాగా కబుర్లు చెప్పేవారితో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.  

Tuesday, 3 March 2015

సాదాసీదాగా

                                             అభిజ్ఞ కుటుంబం అమెరికాలో జరగనున్న మేనకోడలి వివాహానికి హాజరవటం కోసం వీసా కార్యాలయానికి వెళ్ళింది.అక్కడ ఒక పెద్దాయన చెరగని చిరునవ్వుతో అందరివైపు పలకరింపుగా చూస్తుంటే ఈయన్ని ఎక్కడో  చూచినట్లు అనిపిస్తుంది అనుకుంది అభిజ్ఞ.సాదాసీదాగా,హుందాగా,ఏ హడావిడి లేకుండా, ప్రశాంతంగా అందరితోపాటు లైన్లో నిలబడి,లోపలికి వెళ్ళి తనవంతు వచ్చేవరకు ఎదురుచూచి అదే చెరగని చిరునవ్వుతో పని పూర్తియిన తర్వాత భార్యతో కలిసి వెళ్లారు.దీనంతటికి ఒక మూడుగంటల సమయం పట్టింది.ఇంతకీ ఆయన ఎవరంటే తమిళనాడు మాజీ గవర్నరు.ప్రక్కనే వన్న ఇంకొక పెద్దాయన ఆయన వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్పేసరికి ఔనా!ఎంత సాదాసీదాగా ఉన్నారు అని ఆశ్చర్యపోయారు.చిన్నచిన్నపదవుల్లో ఉన్నవాళ్ళే ఎంతో హడావిడి చేసే రోజులాయె.   

ప్రోత్సాహం

                                        తనకు వచ్చినదాన్ని నలుగురికి నేర్పిస్తూ ఎదుటివాళ్ళను ప్రోత్సహించే వాళ్ళే త్వరగా
ఏరంగంలోనయినా రాణిస్తారు.ఎప్పుడైనా మనం ఎదుగుతూ ఎదుటివాళ్ళను ప్రోత్సహించాలి.అమ్మో!మనం నేర్పిస్తే మనకన్నా వాళ్ళు ముందు పైకి వస్తారేమో!అనుకునేకన్నా మనం బాగుండాలి మనతోపాటు ఎదుటివాళ్ళు కూడా
బాగుండాలి అనుకునేవాళ్ళే త్వరగా పైకి ఎదుగుతారు.సంతృప్తికరమైన జీవితం గడపగలుగుతారు. 

Monday, 2 March 2015

పెరుగు గురించి కబుర్లు

 1) పాలు తోడుపెట్టిన తర్వాత ఒక ఎండు మిరపకాయ వేస్తే పెరుగు గడ్డలాగా తోడుకుంటుంది.
2)చలికాలంలో పెరుగు త్వరగా తోడుకోవాలంటే తోడుపెట్టిన తర్వాత ఒక అరలోపెట్టి తలుపు వేయాలి లేదా ఒక గిన్నెలో పెట్టి ఇంకొక గిన్నె మూతవేయాలి.
3)వేసవిలో పెరుగు పులుపు రాకుండా ఉండాలంటే చిన్న కొబ్బరిముక్క వేయాలి.
4)పెరుగు ఎప్పుడూ నిలువు డబ్బాలో తోడుబెట్టుకుంటే త్వరగా తోడుకుంటుంది 

Sunday, 1 March 2015

పేరుకు తగ్గట్టే

                                           వసుంధర తన కూతురుకు ఏరికోరి ఎంతో ఇష్టంగా తను చదివే ఒక వారపత్రికలో వచ్చిన ధారావాహికలోని పేరు పెట్టుకుంది.ఒక అందమైన గర్విష్టి ధనవంతురాలి పాత్ర పేరు అది.వసుంధర తమ్ముడు మేనకోడలిని ఆటపట్టిస్తూ నీపేరు బాగోలేదు పేరు మార్చుకో అంటూ చాంతాడంత పట్టిక రాసిచ్చాడు.నాకేమీ అక్కరలేదు నాపేరే నాకు నచ్చింది అంటూ చిన్నపిల్లైనా గడసరిగా సమాధానం చెప్పేది.అప్పట్లో ఆ ధారావాహిక చాలామంది చదివేవాళ్ళు కాబోలు.మొన్నీమధ్య అదే పేరు గురించి సంభాషణ జరిగింది.వరుసకు మేనమామ ఒకతను వసుంధర కూతురుకు వాళ్ళింట్లో శుభకార్యానికి పిలవటం కోసం 4,5 సార్లు ఫోను చేస్తే ఎత్తలేదని కినుకగా నీపేరుకు తగ్గట్టే ఫోను కూడా ఎత్తటం లేదు అన్నాడు.అసలు జరిగిన విషయమేమిటంటే వసుంధర కుటుంబం మొత్తం ఒక వారం విహారయాత్రకు వెళ్లారు.ఆసమయంలో చేసి ఉంటాడు.అదేమిటి?అమ్మా!ఆయన ఫోనుచేసి మరీ అలా మాట్లాడాడు అని వసుంధరను అడిగితే నీపేరు ఒక గర్విష్టి పాత్రది అందుకని పేరుకు తగ్గట్టే నీకు గర్వం అని అతని ఉద్దేశ్యం అయ్యుంటుంది అని చెప్పింది.నిజం చెప్పాలంటే వసుంధర కూతురు నిగర్వి.పేరు పెట్టినంత మాత్రాన పాత్రకు తగినట్లు నిజజీవితంలో ఉండాలని ఏమీ లేదు.ఎవరి స్వభావం వారిది.వాళ్ళ తప్పుడు అభిప్రాయాలను ఎదుటివాళ్లపై రుద్దుతుంటారు.