Sunday 28 July 2019

అడవిలో ప్రయాణాన్ని తలపించేలా.....

                                                                 గ్రీష్మ కూతురు రేష్మ యు.కె  లో ఉంది.రేష్మకు వేసవిలో ఒక నెల రోజులు సెలవులు ఉండడంతోతన దగ్గరకు వఛ్చి ఉండమని కోరడంతో గ్రీష్మ కుటుంబంలో అందరూ వెళ్ళారు.విమానం దిగి రేష్మ ఇంటికి వెళుతుంటే దారి పొడుగూ అంతా పచ్చదనంతో కంటికి ఇంపుగా మనసుకు హాయిగా ప్రశాంతంగా అనిపించింది రహదారులకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు.అటు ఇటు చెట్లు మధ్యలో రహదారి.కొంత కొంత దూరం పెద్ద చెట్ల నుండి వాలిన కొమ్మలను పద్దతిగా పెంచి కత్త్తిరించడంతో పచ్చటి పందిరిలో నుండి వెళుతున్నట్లు అనిపించింది.కొద్ది దూరం రోడ్డుకి ఇరువైపులా పెద్దపెద్ద చెట్లు అడవిని తలపించేలా ఉంది.గ్రీష్మకు నిజంగా అడవిలో ప్రయాణిస్తున్న అనుభూతి.కలిగింది.అసలే గ్రీష్మకు పచ్చదనం అంటే ప్రాణం.దానితో గ్రీష్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.కళ్ళతో చూస్తే తప్ప మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి.ఎటు చూచినా పచ్చదనం.ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా ఉంది.మధ్యమధ్యలో నదులు వంతెనలు.ఎటువైపు వెళ్ళినా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తైన చెట్ల మధ్య నుండి వెళ్లడంతో ఎంచక్కా అడవిలో ప్రయాణాన్ని తలపించేలా ఉంది. గ్రీష్మ చక్కగా ప్రకృతి సోయగాన్ని,పచ్చదనాన్ని తిలకిస్తూ ప్రయాణించడం ఒక మధురానుభూతి అనుకుంది.గ్రీష్మ దీనితోపాటు మన దేశంలో కూడా ఈ విధంగా ఎత్తైన చెట్లు రహదారుల వెంట ఉంటే ఎంచక్కా ఎండల బాధ నుండి ఉపశమనాన్నీ పొందవచ్చు కదా! అనుకుంది.