Wednesday, 24 September 2014

చాలా మంచి విషయాలు.......

                             ముఖ్యమైన పనుల ఒత్తిడి కారణంగా క్రొత్త పోస్టులు వ్రాయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.
నా పాత పోస్టుల్లో చిట్కాలు,జ్ఞాపకాలు,బోలెడన్ని కథలు,ఇంకా చాలా మంచి విషయాలున్నాయి.శ్రమ అనుకోకుండా వాటిని చదువగలరని ఆశిస్తున్నాను.ఇలా చెప్పినందుకు ఏమీ అనుకోకండి.మధ్య మధ్యలో క్లిక్ చేస్తూ చేపలకు ఆహారం వెయ్యటం మర్చిపోకండి.అప్పుడప్పుడు పేదలకు కూడా ఆహారం పెడుతూ వాళ్ళ ఆకలి తీర్చండి.ఎలా తీర్చాలో నాబ్లాగులో ఆడండి ఆకలి తీర్చండి అనే శీర్షికలో ఉంది.చూస్తారు కదూ.ధన్యవాదములు. 

మొక్కే వంగనిదే మాను వంగుతుందా?

                                          రాజీవి మహా మొండి ఘటం.చిన్నప్పటినుండి మొండిగా ప్రవర్తించేది.వయసుతోపాటు మొండితనం కూడా పెరిగింది.మంచైనా,చెడైనా తనకు తోచింది తప్ప ఎవరు చెప్పినా వినిపించుకోదు.అత్తవారింటికి వెళ్ళినా,బిడ్డలు పుట్టినా తన వైఖరి మార్చుకోదు.పైపెచ్చు పిల్లలను కూడా అలాగే తయారు చేస్తుంది.రాజీవి ప్రవర్తనతో విసిగిపోయిన అత్తగారు ఒకసారి వాళ్ళ నాన్న వస్తే మాటలసందర్భంలోఅదేమిటండీ?పిల్లలు పెళ్ళీడు  వస్తున్నా తన పద్ధతి మార్చుకోకపోగా పిల్లల్ని మొండిగా తయారుచేస్తే ఎలా? ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నాకు చాలాభాదగాఉందని అన్నారు.నాబాధ ఎవరితో చెప్పుకోమంటారు చిన్నప్పటినుండి ఆమెతో నేను
పడీపడీ నా భారం దించుకున్నాను.మీరు మంచివాళ్ళని మీఇంట్లో ఇచ్చాను.ఆమెతో ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు.అంతే తేడా.చిన్నప్పుడే వినేదికాదు ఇప్పుడు ఇంకేమి వింటుంది?"మొక్కే వంగనిదే మాను వంగుతుందా?"ఇక ఆమె వైఖరి మారదు మనం సర్దుకోవలసిందే?దయచేసి సర్దుకోండి అన్నాడు.
     

Tuesday, 23 September 2014

పెద్ద ఉసిరికాయల పొడి

  ఉసిరి కాయలు - 2 కే.జిలు
ఉప్పు - 2  రైస్ కుక్కర్ కప్పులు
ఎండుమిర్చి -  1/4 కే.జి
 ధనియాలు - 1/4 కే.జి
నూనె - కే.జి ,వెల్లుల్లి  - 1/4 కే.జి (ఇష్టమైతే)
                            ఉసిరి కాయల్ని కడిగి తుడిచి డైరెక్ట్ గా ఎండబెట్టి తెల్లగా వచ్చిన తర్వాత ముక్కలు చేసి  ఉప్పు,పసుపు వేసి నాలుగు రోజులు పెట్టిమధ్య మధ్యలో కలపాలి. తర్వాత మిక్సీలోవేసి ఎండలో 2 రోజులు ఎండబెట్టాలి.కొంచెం నూనెవేసి ఎండుమిర్చి వేయించి పొడి చేయాలి.ధనియాలు నూనె లేకుండా వేయించి
పొడిచేసి అన్నీ కలిపి తాలింపు పెట్టాలి.అంతే ఉసిరికాయల పొడి రెడీ.వేడి అన్నంలో చాలా బాగుంటుంది.
ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 

పునుగులు

బియ్యం -1/2 కిలో
మినప్పప్పు - 1/4 కిలో
పచ్చి శనగపప్పు - 100 గ్రా.
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి)
పచ్చి మిర్చి - పది
అల్లం - చిన్న ముక్క
జీరా -టీ స్పూను
 ఉప్పు - తగినంత
వంటసోడా - 1/4 టీ స్పూను
నూనె - వేయించటానికి సరిపడా
                                                    మినప్పప్పు,బియ్యం నాలుగు గం.లు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.పచ్చి శనగపప్పును ఒకగంట ముందుగా నానబెట్టాలి.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం సన్నగా తరగాలి.రుబ్బిన పిండిలో శనగపప్పు,ఉల్లి,అల్లం,పచ్చి మిర్చిముక్కలు,జీరా,ఉప్పు,వంటసోడా వేసి మధ్యస్థంగామెత్తగా కలపాలి.మీడియం      సైజులో పిండిముద్దను తీసుకుని గుండ్రంగా చేసి నూనెలో వేసి బాగా వేయించాలి.వీటిని వేడివేడిగా వేరుశనగ లేదా
కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటాయి.

మైసూరు బోండా

మైదా - 3 కప్పులు
బియ్యప్పిండి - కప్పు
పెరుగు - 2 కప్పులు (బాగా గిలకొట్టాలి)
జీరా - టీ స్పూను
ఉప్పు - తగినంత
వంటసోడా - 1/4 టీ స్పూను
నీళ్ళు - తగినన్ని
నూనె - వేయించటానికి సరిపడా
                                                         మైదాలో బియ్యప్పిండి,వంటసోడా,జీరా,ఉప్పుకలిపి పెరుగు,తగినన్ని నీళ్ళుపోసి గట్టిగా కాకుండా మధ్యరకంగా మెత్తగా కలిపి ఉంచాలి.చిన్నసైజు నిమ్మకాయంత పిండి తీసుకుని అరచేతిలో గుండ్రంగా చేస్తూ నూనెలోవేసి బంగారువర్ణంలోవేగనిచ్చి తీయాలి.వేడివేడిగా కొబ్బరి పచ్చడితో తింటే రుచిగా ఉంటాయి.ఇష్టమైన వాళ్ళు అల్లం పచ్చడితో కూడా తినవచ్చు.  

భూమి,ఇళ్ళకు రెక్కలు

                         ఇప్పుడు అన్నిచోట్ల భూములకు,ఇళ్ళకు రెక్కలు వచ్చేశాయి.చివరకు అద్దె ఇళ్ళకు కూడా రెక్కలు వచ్చాయి.ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి.ప్రస్తుతం కొన్నిచోట్ల సామాన్య మానవుడికి చారెడు స్థలమున్నా లక్షాధికారో,కోటీశ్వరుడో అవుతున్నాడు.అది వేరే విషయం.రెండు పడకగదులున్న  ఇల్లు పదిహేనువేలు,మూడు ఇరవైవేలు,అదే ఇండిపెండెంట్ ఇల్లు అయితే పాతికవేలు అద్దె.ఎంత ఆదాయం వస్తే పెట్టగలరు?అగమ్యగోచరం.కోటు పట్టుకెళ్ళినంత తేలికగా కోటి పట్టుకెళ్తే చారెడు స్థలం రావటంలేదు.ఇక భూములైతే చెప్పనక్కరలేదు.ఎందుకూ పనికిరాని చవుడు పొలాలు కూడా అందుబాటులోలేవు.అలా ఉంది ప్రస్తుత పరిస్థితి.    

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

                                   వీక్షిత కుటుంబం స్వంత ఊరికి వెళ్ళి పొలాలు కొనుక్కుని,మంచి స్థలంలో అందమైన ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేసుకున్నారు.మధ్యవర్తులు అక్కడ పొలం ఉంది,ఇక్కడ స్థలం ఉందని చెప్పడము వెళ్లేసరికి
అయిపోవడము లేకపోతే సరిగ్గా లేకపోవడము జరుగుతుంది.ఈఊరినుండి ఆఊరికి వృధా ప్రయాణం,ప్రయాస తప్ప ఉపయోగం లేకుండా పోయింది.వీక్షిత స్నేహితురాలు మీప్రయత్నం ఎంతవరకు వచ్చింది?అనుకున్నట్లుగా అన్ని పనులు పూర్తయ్యాయా?అని అడిగింది.ఏఒక్క పనీ పూర్తికాలేదు.ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది
పరిస్థితి అని వీక్షిత స్నేహితురాలికి చెప్పింది. 

Monday, 22 September 2014

మా ఇంటికి వస్తే...,మీ ఇంటికి వస్తే....,

                         ఈరోజుల్లో చాలామంది మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు?మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు?అన్నట్లుగా ఉంటున్నారు.సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది ధరిత్రి.పేరులో సహనం ఉంది కానీ మనిషిలో స్వార్ధం తప్ప సహనం లేదు.ధరిత్రి ఇంటికి ఎవరు వెళ్ళినా తనకు,పిల్లలకు ఇష్టమైనవి తీసుకెళ్లకపోతే మొహం ముడుచుకుని వెళ్ళినవాళ్ళ మొహం మీదే గదిలోకి వెళ్ళితలుపు వేసుకుని ఎంతసేపటికీ రాదు.క్రొత్తవాళ్లకు విచిత్రంగా ఉంటుంది.ధరిత్రి తండ్రిని ఇంటికి రమ్మనదుకానీ బంధువుల ఇంటికి వెళ్ళి పదిరోజులు ఉంటుంది.ఆ పది రోజుల్లో ఆఇంటి వాళ్ళ పని గోవిందా గోవిందా.ఎంతబాగాచూసినా తృప్తిపడదు.స్వీట్లు,నాన్ వెజ్ పిచ్చి.పూటకొక నాన్ వెజ్ రకం తిన్నంత తెచ్చినా, కావలసినవన్నీ కొనిచ్చినా గంగవెర్రులెత్తినట్లు దేనికో ఒకదానికి పేచీ పెట్టుకుంటుంది.వెళ్ళేటప్పుడు షాపింగుకి
తీసుకెళ్ళి నచ్చిన బట్టలు కొనిచ్చినా ఇంటికి ఏడుస్తూ వెళ్ళి నన్ను,పిల్లలను సరిగా చూడలేదని కనిపించినవాళ్ళకి పితూరీలు చెప్తుంది.తోడపుట్టిన వాడి మొహం చూచి ఈమె పద్ధతి నచ్చకపోయినా తమ్ముడికి కూడా విషయం చెప్పకుండా తప్పక భరిస్తుంటారు ఆడపడుచులు.ఆడపడుచులని చూడటం మాట దేముడెరుగు వాళ్ళే ఈమెను చూడాలన్నట్లు ఉంటుంది భార్యాభర్తల ప్రవర్తన.ఎవరింటికైనా వెళ్తే ఈమెను బాగా మాట్లాడించాలి.ఆమె ఇంటికి వెళ్ళినా వెళ్ళినవాళ్ళే నవ్వు పులుముకుని ఇష్టం లేకపోయినా మాట్లాడించాలి.ఇదీ వరస.ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళ ప్రవర్తనలో మార్పురాదు.ఎదుటివాళ్లకు విరక్తి పుట్టాల్సిందే.ఏదోఒకపిచ్చిచీరలు తెచ్చిఆడపడుచులకు పెడుతుండి.కన్నవాళ్ళు పెట్టినవి వద్దనగూడదని నచ్చకపోయినా  తీసుకుంటారు.వాళ్ళు ఖరీదుగల చీరలు పెట్టినా నచ్చలేదని వదిలేసి వెళ్తుంది.
                               తోడపుట్టినవాడనే ఒక్క కారణంతో వీళ్ళ తుగ్లక్ చేష్టలు భరించాల్సి వస్తుందని ఆడపడుచులు
బాధపడుతుంటారు.ఆడపిల్లల మనసు బాధపెట్టి సాధించేది ఏముంటుంది? తాత్కాలిక సంతోషం తప్ప.          


బిళంబి

                                 బిళంబి కాయ రెండు అంగుళాల పొడవుతో పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.దీన్నే కేరళ ఉసిరి అంటారు.చెట్టు మన రాతి ఉసిరి చెట్టును పోలిఉంటుంది.ఆకు ఆకారంలో ఉండి కాయ ఆకుల క్రింద ఉండటంవలన కనిపించవు.ఈకాయ"మధుమేహాన్ని"నియంత్రణలో ఉండేలా చేస్తుందని రమణి నాన్నగారు నర్సరీలన్నీజల్లెడపట్టి
తన ఇంట్లో పెంచుతున్నారు.మా ఊరిలో ఒకాయన ఇంట్లో ఈచెట్టు ఉంది.ఆయన గర్వంగా మాఇంట్లో బిళంబి చెట్టుంది అని గొప్పలు చెప్తుంటే ఎలాగైనా మాఇంట్లో కూడా పెంచాలని పట్టుదలగా అన్నిచోట్ల వెదికి మొక్కను తెచ్చానని రమణి స్నేహితురాలికి చెప్పి కాయలు కోసిఇచ్చారు.కాయను నేరుగా తినవచ్చు.పప్పు,పచ్చడి చేసుకోవచ్చు.ఏవిధంగా తిన్నాచాల రుచిగా ఉంది.ఆరోగ్యానికి మంచిది.కొలెస్టరాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. 

Tuesday, 16 September 2014

ఇరుకు మనస్తత్వం

                    మానస చదువుకున్న మూర్ఖురాలు.లోకజ్ఞానం తక్కువ.ఇంటికి ఎవరు వచ్చినా మాట్లాడదు.చుట్టాలు ఎవరూ మాఇంటికి రావద్దు మాపిల్లలకు,మాకు ఇష్టం ఉండదు అని అందరితో చెప్తుంటుంది.భర్త,పిల్లలను తీసుకుని
పిలవనివాళ్ళు పాపాత్ములు అన్నట్లు అందరి ఇళ్ళకు వెళ్ళితిని వస్తుంటుంది.ఆడపడుచు ఇంటికి వెళ్ళి పదేసిరోజులు ఉండి కావలసినవన్నీ కొనిపించుకుని,తనకు నచ్చిన వంటలు వండించుకుని తిని,అంత చేసినా ఇంకా తృప్తిలేక గిల్లి కజ్జాలు పెట్టుకుని తనను,తన పిల్లలను సరిగా చూడలేదని భర్త దగ్గర నటించి నలభైసంవత్సరాలు వయసువచ్చినా
చిన్నపిల్లలాగా ఏడ్చిభర్తకు చాడీలు చెప్పి సంతోషపడుతుంది.అతనికి కూడా భార్య అబద్దాలకోరు అని తెలిసినా
ఆమెవల్ల ఎవరు ఇబ్బంది పడినా తనకు ఇబ్బంది కలగనంతవరకు ఏమీ పట్టించుకోడు.అన్నిరోజులు ఆడపడుచు ఇంట్లో ఉన్నాఆమె ఇంటికి ఒక పూటవెళ్ళినా భోజనము సరిగ్గా పెట్టదు,ఆప్యాయంగా మాట్లాడదు.అత్తకు నడుము నొప్పి అయినా ఇరవై సంవత్సరాల పిల్లలను పెట్టుకుని ఒక్క పనీ సరిగ్గా చేయకుండా భర్తకు కూడా తిండి పెట్టకుండా తను తినేసి హాయిగా ఊరు పోద్దుగుంకక ముందే నిద్ర పోతుంటుంది.భర్త ఏటైముకి ఇంటికి వచ్చినా అత్త లేచి భోజనం పెట్టాల్సిందే.పొరపాటున ఆమెను లేపారా యుద్దమే.కొడుకు పస్తు పడుకుంటే చూడలేక అమ్మ లేవలేక అర్ధరాత్రివేళ లేచి అన్నం పెడుతుంటుంది. అత్త,ఆడపడుచుతో కూడా ఇష్టమైతే మాట్లాడుతుంది లేకపోతే లేదు.అందరూ తన ఇష్టం వచ్చినట్లు నడుచుకోవాలి అన్నట్లు ప్రవర్తిస్తుంది.ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే ?ఎంతమంది ఉన్నా అమ్మ,ఇద్దరు ఆడపిల్లలు గదిలో తలుపు వేసుకుని ఏదోఒకటి తిని మెదలకుండా బయటకు వస్తారు.ఇంటికి క్రొత్త వాళ్ళయితే వింతగా ఒక చూపు చూస్తారు.కొడుకు కూడా భార్య కష్టపడకుండా అంత పెద్ద వయసు అమ్మతో చాకిరి చేయించుకుంటాడు.ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంతటి ఇరుకుమనస్తత్వంతో ఉన్న మనుషులుంటారా?అని ఆశ్చర్యం కలుగుతుంది.ఒకప్రక్క అంత పెద్దఆమెతో చాకిరీ చేయించుకుంటున్నారని బాధ కలుగుతుంది.ఆస్తి,చాకిరీ  పెద్ద ఆమెది పోకిళ్ళు వీళ్ళవి.  

Saturday, 6 September 2014

అబలలు కాదు సబలలు

                      సాన్విత వృత్తిరీత్యా వైద్యురాలు.సాన్విత పనిచేసే ఆసుపత్రిలో వివిధ దేశాలకు చెందిన వైద్యులు పనిచేస్తుంటారు.ఒకసారి క్యూబాకు చెందిన వైద్యురాలు పరిచయమైంది.చాలా మంచి ఆమె.కానీ వాళ్ళు పెద్దగా  మాట్లాడుతుంటారు.తెలియనివాళ్ళు పోట్లాడుకుంటున్నారేమో?అనుకుంటారు.ఆమె మాటల సందర్భంలో
క్యూబాకు చెందిన ఆడవాళ్ళందరూ మానసికంగా,శారీరకంగా మిగతా ఆడవాళ్ళకన్నాచాలా దృడంగా ఉంటారు.
క్యూబాకు చెందిన ఆడవాళ్ళందరూ అబలలు కాదు సబలలు అని చెప్పింది. 

Friday, 5 September 2014

తెల్లగా ఉండే మురుకులు

               పెసరపప్పు - 1/2 కప్పు
               మినప్పప్పు - 1/2 కప్పు    
               బియ్యప్పిండి  -1 కే.జి
                                ఒక కుక్కర్ లో పెసరపప్పు,మినప్పప్పు నీళ్ళుపోసి మెత్తగా ఉడికించాలి.ఆపై బాగా మెత్తగా ఉండేలా మిక్సీలోవెయ్యాలి.దీన్ని బియ్యపిండిలో వేసి, తగినంత ఉప్పు,కొంచెం వాము,వేసి ముద్దలా కలపాలి.దీన్ని జంతికల గొట్టంలో పెట్టి కావలసిన సైజులో,ఒత్తుతూ నూనెలో వేయించాలి.ఇవి చాల రుచిగా,గుల్లబారి తెల్లగా కరకరలాడుతూ ఉంటాయి.

జంతికలు(చక్రాలు)

           బియ్యం - 4 కప్పులు
           మినపగుళ్ళు  - 3/4 కప్పు
           పచ్చిశనగపప్పు - 1/4 కప్పు
          సగ్గు బియ్యం - చారెడు (నాలుగు వేళ్ళమీద నిలిచినన్ని)
           నూనె - వేయించటానికి సరిపడా                                                                                                                                                 బియ్యం కడిగి ఎండలో ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. మినపగుళ్ళు దోరగా వేయించుకోవాలి.
 ఎండినబియ్యం,మినపగుళ్ళు(లేక) పప్పు,పచ్చిశనగపప్పుసగ్గుబియ్యం అన్నీకలిపి మరపట్టించాలి.పిండి మొత్తంలో కొంచెం వాము,ఉప్పు,కారం కలిపి సరిచూచుకుని కొంచెం కొంచెం పిండి,వెన్న,కొద్దిగా గోరువెచ్చనినీళ్ళతో జంతికల గొట్టంలో నుండి దిగేలా కలుపుకోవాలి.ఎక్కువ పిండి కలిపితే సమయం గడిచిన కొద్దీ చక్రాలు గట్టిగా వస్తాయి.వీటిని కాగిన నూనెలో గుండ్రంగా చుట్టలు నొక్కి వేయగలిగితే వేయవచ్చులేదా ఒక ప్లేటుకి నూనె రాసి దానిమీద గుండ్రంగా వత్తి నూనెలో వేయవచ్చు.బంగారు వర్ణంలో వేయించాలి.అంతే నోరూరించే జంతికలు(చక్రాలు,చక్కిలాలు)రెడీ.   

కఫం కరగాలంటే

                  60 రోజులు అలోవెరా(కలబందగుజ్జు) జెల్ తింటే కఫం కరుగుతుంది.

Thursday, 4 September 2014

రసం పొడి

             ఎండుమిర్చి - 10
             కందిపప్పు - 1 కప్పు
             ధనియాలు - 1 కప్పు
            మిరియాలు - 1/2 కప్పు
            జీరా - 1/2 కప్పు
            పచ్చి శనగపప్పు - 1 కప్పు
                                                            వీటన్నింటినీ విడివిడిగా నూనె లేకుండా వేయించుకోవాలి.విడివిడిగా మెత్తగా పొడి చేసుకుని చివరలో అన్నీకలిపి ఒకసారి ఆన్ చేస్తే సమంగా కలుస్తుంది.రసం పొడి రెడీ.

అరటిపళ్ళ హల్వా

                అరటిపళ్ళు - 8(పసుపు పచ్చవి)
                పంచదార - 450 గ్రా.
                నెయ్యి - 75 గ్రా.
                యాలకులు - 2
                                         పండిన అరటిపళ్ళను 8 ఏరుకుని తొక్కను తీయకుండా ఆవిరిపై ఉడికించాలి.ఉడికిన
తర్వాత తొక్కనుతీసి గుండ్రంగా సన్నని ముక్కలు తరగాలి.ముక్కాల మధ్యనుండే నల్లని భాగాన్ని,గింజలను తీసి
వేయాలి.ముక్కలను గుజ్జుగా తయారు చేసి పంచదారను కరిగించి కలపాలి.ఈమిశ్రమాన్ని సన్నటి మంటమీద ఉంచి ముద్దగా అయ్యేవరకు కలపాలి.అప్పుడు నెయ్యి వేసి బాగా కలిపి తిరిగి అంచుల వెంబడి నెయ్యి బయటకు వచ్చేవరకు పొయ్యిమీద ఉంచి యాలకుపొడి చల్లి నెయ్యి రాసిన ప్లేటులో వెయ్యాలి.ఆరిన తర్వాత ముక్కలు మనకు
నచ్చిన ఆకారంలో కట్ చేయాలి.     

చంద్రకాంతలు

            శనగపప్పు - 1/4 కే.జి
            పంచదార - 1/4 కే.జి
            కొబ్బరితురుము - 1 కాయ
            యాలకుపొడి - కొంచెం
            నెయ్యి  - కొద్దిగా
            జిలేబీ రంగు - చిటికెడు
                                                                                                                                                                                                                            శనగపప్పు 2 గం.లు నానబెట్టాలి.నీళ్ళుపోయకుండా
రుబ్బాలి.కొబ్బరి తురుము నేతిలో వేయించుకోవాలి.మందపాటి గిన్నె పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసి మనం ఎంత పప్పు వేశామో అన్ని నీళ్ళు పొయ్యాలి.నీళ్ళు మరగగానే జిలేబీరంగు వేసి,పంచదార,కొబ్బరితురుము,యాలకుపొడి  వెయ్యాలి.అన్నీ బాగా కలిశాక రుబ్బిపెట్టుకున్నశనగ పప్పుకలపాలి.ఉడుకుతున్నప్పుడు ఉండ కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి.అలా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేముందు దింపి పీటమీద తడివస్త్రం వేసి దానిమీద ఈముద్ద పల్చగా చెయ్యాలి.చల్లారాక ముక్కలు కట్ చేయాలి.ఈముక్కలు బాగా చల్లారాక నేతిలో దోరగా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి.   

బియ్యప్పిండి-సగ్గుబియ్యం వడియాలు

                    బియ్యప్పిండి  - 1 కప్పు
                    సగ్గుబియ్యం   -  1/2 కప్పు
                    నీళ్ళు   -  6 కప్పులు
                    పచ్చి మిర్చి - 8
                    ఉప్పు - రుచికి సరిపడా
                                                       సగ్గుబియ్యం రాత్రిపూట ఒక కప్పు నీళ్ళల్లో నానబెట్టాలి.బియ్యప్పిండి ఒక కప్పు నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో నాలుగు కప్పుల నీళ్ళు మరిగించి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికిన తర్వాత నీళ్ళల్లో కలిపిన బియ్యప్పిండి పోసి బాగా త్రిప్పాలి.చివరలో పచ్చిమిర్చి,ఉప్పు
పేస్ట్ వేసి కలిపి చిక్కబడిన తర్వాత దించేయాలి.బాగా ఆరబెట్టి మధ్యమధ్యలో తెట్ట కట్టకుండా త్రిప్పుతుండాలి.
ఆరిన తర్వాత పాలిథిన్ కవరు మీద ముద్దలుగా చేతితో పెట్టాలి.ఎండలో ఎండబెడితే సాయంత్రానికి ఎండిపోయి రాలిపోతాయి. బాగా ఎండిన వాటిని డబ్బాలో పోస్తే సంవత్సరం నిల్వ ఉంటాయి.

పొద్దు లచ్చమానూ

                      సంగీత పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు.పని ఉందని ఎప్పుడైనా బయటకు వెళ్ళిందా సంగీత పని అయిపోయినట్లే.ఇల్లంతా రణగొణధ్వనులతో,బొమ్మలు,పుస్తకాలు ఇంట్లో కాలు పెట్టటానికి ఖాళీలేకుండా ఉంటుంది.
అవన్నీ సర్దుకునేటప్పటికి తలప్రాణం తోకకు వస్తుంది.పొద్దు లచ్చమానూ అంటే ప్రొద్దంతా వీళ్ళతో వేగలేక తలకాయ
నొచ్చుతోంది అనుకుంటుంది.ఒక్కొక్కసారి ఏడుపు కూడా వచ్చేస్తుంది.సంగీత ఇంటికి ఎవరైనా వస్తే మాట్లాడుతుంటే ఎగిరి ఒళ్ళో కూర్చుని చేతులతో,కాళ్ళతో కుమ్మేస్తుంటారు.తప్పు అనిచెప్పలేని పరిస్థితి. చెప్పినా అర్ధం చేసుకోలేని పరిస్థితి.ఆసమయంలోఆమెకు ఏమి చేయాలోతెలియదు.ఎదుటివాళ్ళకు ఏమి చేయాలోఅర్ధం కాదు.ఈవిషయంలో నిర్ణయం సంగీతది,భర్తది.పిల్లలు అల్లరి చేయటం సహజమే అయినా మరీ ఇంతగా అల్లరి చేసే హైపర్ యాక్టివ్ పిల్లలతో ఇబ్బందే.    

దొంగ కాయలు

                               శిరీష ఊరు వెళ్ళినప్పుడు మరదలు మధూలిక వద్దన్నా వినకుండా నాలుగు వంగమొక్కలు ఇచ్చింది.ఒకటి బ్రతికినా విరగ కాస్తుంది.గులాబీ వంకాయలు చాలా రుచిగా ఉంటాయి.కుండీలో కూడా కాస్తాయి.
ఒకసారి పెట్టిచూడండి అంది.అంతగా చెప్తున్నప్పుడు కాదనటమెందుకు? అని తీసుకొచ్చి భూమిలో పెట్టింది.రెండు మొక్కలు బ్రతికాయి.గులాబీ,ఉదా కలిసిన రంగుతో కాయలు చూడముచ్చటగా విరగ కాసినాయి.పనిమనిషిని
వంకాయలు కోసుకురా.నువ్వుకూడా ఇంటికి పట్టుకెళ్ళి కూర వండుకో అని శిరీష చెప్పింది.కొన్నికాయలు కోసుకొచ్చి అమ్మా!వంకాయలు అందరికీ కనబడవు.వంకాయలు దొంగవి.మేము వంకాయల్ని "దొంగ కాయలు"
అంటాము అని చెప్పింది.అదేమిటి?బానే కనిపిస్తున్నాయి కదా!అంటే ఆకుల క్రింద ఉంటాయి.కావాలంటే మీరు చూడండి నేను కోసుకొచ్చినా ఎక్కడో ఒకచోట కాయలు కనబడతాయి అంది.నిజంగానే ఇంకా కొన్నికాయలు
మళ్ళీ కోసింది.వంకాయలకు కూడా పేర్లు పెడతారు కాబోలు అని శిరీష అనుకొంది.
                            వెన్న,ఉప్పు,సంబారు కారం కలిపి లేత వంకాయలను నిలువుగా నాలుగు భాగాలుగాచివర విడిపోకుండా చీల్చి లోపల ఈ మిశ్రమం రాసి కొంచెం నూనెలో మగ్గిస్తే ఒక్కో వంకాయ తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది.గులాబీ వంకాయకున్న ప్రత్యేకత అది.పాలుపోసి వండినా,టొమాటో వేసినాకూర ఎంతోరుచిగా ఉంటుంది.
 వేపుడు అయితే అల్లం,వెల్లుల్లి,మసాలా వేసి వండితే ఆరుచే వేరు.ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీమళ్ళీ కావాలంటారు.


Wednesday, 3 September 2014

బ్రెడ్ హల్వా

             బ్రెడ్ - 6 స్లైసులు
             పంచదార - 1/4 కే.జి
            పాలు 1/4 లీటరు
            నెయ్యి - 150 గ్రా.
            జీడిపప్పు,కిస్ మిస్ - కొద్దిగా
                                             బ్రెడ్ ను చిన్నచిన్న ముక్కలుగా చేసి నేతిలో వేయించి వాటిని తీసి ముందుగా కాచినపాలల్లో వేసి నానబెట్టాలి.పంచదారలో ఒకకప్పు నీళ్ళు పోసి లేతపాకం తయారు చెయ్యాలి.వేడి పాకంలో నానబెట్టిన బ్రెడ్ వేసి నెయ్యి కొంచెం కొంచెం పోస్తూ చిక్కగా అయ్యేవరకు త్రిప్పాలి.వేయించిన జీడిపప్పు,కిస్మిస్ వేసి త్రిప్పాలి.రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ.
                         

మిక్స్డ్ వెజిటబుల్ హల్వా

           కొబ్బరి తురుము  - 1 కప్పు
          బీట్ రూట్ తురుము -1 కప్పు
          కారట్ తురుము - 1 కప్పు
          పంచదార - 3 కప్పులు
          నెయ్యి -3 కప్పులు
          జీడిపప్పు - కొంచెం
         కిస్ మిస్ - కొంచెం
        పచ్చ కర్పూరం  - చిటికెడు
        యాలకు పొడి - కొంచెం
                                                       కారట్,బీట్ రూట్,కొబ్బరి తురుములను కొద్దిగా నీరుపోసి ఉడికించాలి.
ఉడికాక,పంచదార వేసి కరిగాక కొద్దికొద్దిగానెయ్యి పోస్తూ కలుపుతూ వేగనివ్వాలి.10 ని.లా తర్వాత ముద్ద అయ్యాక దించాలి.యాలకుపొడి,నేతిలో వేయించిన కిస్ మిస్,జీడిపప్పు,ముద్ద కర్పూరం వేసి కలియబెట్టాలి.పళ్ళెంలోపోసి
ఆరాక నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవాలి.
                 

           
         

కారపు వెన్న ఉండలు

      బియ్యం పిండి - 5 కప్పులు
     దోరగా వేయించిన  మినపపిండి  - 1 కప్పు
      పచ్చి మిర్చి - 20-25 కాయలు
     వెన్న - 1/2 టేబుల్ స్పూను
     చిక్కని కొబ్బరి పాలు - పిండి కలపటానికి సరిపడా
     ఇంగువ - 1/4 టేబుల్ స్పూను (ఇష్టమైతే )
     నువ్వులు - టేబుల్ స్పూను
      ఉప్పు - తగినంత
      నూనె - వేయించడానికి సరిపడా
                                                             పచ్చిమిర్చి,ఉప్పు,ఇంగువ దోరగా వేయించుకుని మెత్తని పేస్ట్ చేయాలి.జల్లించిన పిండిలో ఈమిశ్రమం,వెన్న,నువ్వులు కలపాలి.చిక్కగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలతో
చపాతీ పిండిలా కలపాలి.కొద్ది కొద్దిగా పిండి తీసుకుని చిన్నచిన్నఉండల్లా చేయాలి.వీటిని కొంచెం ఆరనిచ్చి నూనెలో వేయించాలి.కరకరలాడుతూ నోరూరించే కారపు వెన్న ఉండలు రెడీ.

ఏదైనా తెగినప్పుడు రక్తం ఆగాలంటే .....

                కూరగాయలు కోస్తున్నప్పుడో,తోటపని చేస్తున్నప్పుడో,ఏదో ఒకచోట తెగి సహజంగా రక్తం వస్తుంటుంది.
అటువంటప్పుడు కలబంద (అలోవెరా) గుజ్జుతో రక్తం వచ్చే ప్రదేశంలో రుద్దితే ఆగిపోతుంది.కొంచెం అయితే వెంటనే
ఆగిపోతుంది.ఎక్కువగా వస్తుంటే కొంచెం సమయం పడుతుంది.కలబంద గుజ్జు రాయటంవలన గాయం నీరు పట్టకుండా త్వరగా మానిపోతుంది.ఎన్నో ఉపయోగాలున్న కలబంద మన ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన మొక్క.

గట్టిదెబ్బ తగిలితే నల్లమచ్చ పడకుండా చిట్కా

                                  మనం హడావిడిగా వెళ్తుంటే అనుకోకుండా ఒక్కొక్కసారి గట్టిగా ఏదో ఒకటి కొట్టుకుని దెబ్బ తగులుతుంటుంది.అటువంటప్పుడు రక్తం గడ్డకట్టి నల్లమచ్చ పడుతుంది.ఆనలుపు ఒక పట్టానపోదు.దెబ్బ తగిలిన
వెంటనే ఐస్ గడ్డను దెబ్బ తగిలిన ప్రదేశంలో,చుట్టూరాపెడితే రక్తం గడ్డ కట్టదు,నొప్పిలాగేస్తుంది.నల్ల మచ్చ పడదు.
ఒకవేళ రక్తం గడ్డకట్టినా ఐస్ పెడితే నిదానంగా మామూలై పోతుంది.పసిపిల్లలయినా,చిన్నపిల్లలయినా ఉయ్యాలలో నుండో,కూర్చునో,ఆడుకుంటూ పడినప్పుడు వెంటనే ఐస్ పెట్టాలి. పిల్లలు పడినప్పుడు వాంతులయితే తప్పకుండా వైద్యుని సంప్రదించాలి.

Tuesday, 2 September 2014

సజ్జ భక్ష్యాలు

                         సజ్జ భక్ష్యాలు అంటే హల్వా లేక కేసరి పూరీ అని కూడా అంటారు.అసలు పేరు సజ్జ భక్ష్యాలు.వీటిని గణపతికి,అమ్మవారికి ప్రత్యేకంగా నవరాత్రులకు నివేదన పెడుతుంటారు.ఎలా చేయాలంటే .....
                          హల్వా కోసం
               బొంబాయి రవ్వ - 1 కప్పు
              నీళ్ళు - 1 1/2 కప్పు
              పంచదార - 1 1/2 కప్పు
              నెయ్యి  - సరిపడా
              యాలకుల పొడి - కొద్దిగా
                    పూరీ కోసం
               మైదా - 1/2 కే .జి
              నెయ్యి - కొద్దిగా
                                       ముందుగా మైదాలో నెయ్యి కొద్దిగా వేసి పూరీ పిండిలాగా కలుపుకుని ఒక  ప్రక్కన పెట్టాలి.బాండీలో రవ్వపోసి వేయించి చివర్లో కొద్దిగా నెయ్యి వేసి త్రిప్పాలి.దీన్ని ఒక ప్లేటులో పొయ్యాలి.స్టవ్ పై ఒక మందపాటి గిన్నెలో నీళ్ళుపోసి మరుగుతుండగా రవ్వ పోసి,పంచదార,నెయ్యి వేసి  త్రిప్పుతూ ఉండాలి.ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చినప్పుడు దించేయాలి.స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వేయించటానికి సరిపడా నూనె పోసి కాగుతుండగా కొంచెం మైదాపిండితోఉండ చేసి  అరచేతిలో పెట్టి నొక్కి దానిలో కొంచెం హల్వా పెట్టి పైన మైదా పిండితోమూసి మరలా అరచేతితో నొక్కి నూనెలో వేయించాలి.ఇవి చాలా రుచిగా ఉంటాయి.
నోట్ :స్వీటు కనుక పై పూరీకి ఉప్పు వెయ్యకూడదు.
                      

బియ్యం రవ్వతో ఉండ్రాళ్ళు

                       గణపతి నవరాత్రుల సందర్భంగా రోజుకొక నివేదన పెడుతుంటాము.బియ్యం రవ్వతో ఉప్పు వేసి చేసే ఉండ్రాళ్ళు ఎంతో ప్రత్యేకమైనవి.అవి ఎలా చేయాలంటే ......
                    కటుకు బియ్యం రవ్వ- 1 కప్పు
                    నీళ్ళు - 1 1/4 కప్పు
                    నెయ్యి - కొంచెం
                    ఉప్పు - తగినంత
                    జీరా  - 2 స్పూనులు
                                 కటుకు బియ్యం రవ్వ (బియ్యం కడిగి ఆరబెట్టకుండా డైరెక్ట్ గా రవ్వ పట్టించాలి) పట్టించి
మందపాటి గిన్నెలో నెయ్యి వేసి,నీళ్ళు పోసి తెర్లుతుండగా(బాగా మరుగుతుండగా)ఉప్పు తగినంత వేసి,జీరా,
రవ్వ పోసి సిమ్ లో ఉంచి మ్రగ్గనివ్వాలి.నీరు ఇగిరిపోయే ముందు స్టవ్ ఆపేయాలి.ఆరినతర్వాత కొంచెం కొంచెం
తీసుకుని మనకు కావలసిన సైజులో ఉండచుట్టి (గుండ్రముగా చేసి)ఇడ్లీ కుక్కర్లో ప్లేట్లకు నెయ్యి రాసి పెట్టి 10ని.లు
ఆవిరి మీద ఉడకనివ్వాలి.ఇక బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు రెడీ.స్వామికి నివేదన పెట్టి తినడమే తరువాయి.రుచిగా
ఉంటాయి.కావాలంటే కొబ్బరి చట్నీ కానీ,పల్లీల చట్నీతో కానీ తినవచ్చు.


మైదాతో చిట్టి చెక్కలు

 మైదా  - 1/2 కే.జి
 పచ్చి శనగపప్పు - గుప్పెడు
 పచ్చి మిర్చి- 6
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - తగినంత
నూనె - వేయించటానికి సరిపడా
                     పచ్చి శనగపప్పు నానబెట్టాలి.అల్లం,పచ్చి మిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.కుక్కర్ లో అడుగున నీళ్ళు పోసి పైన ఒక పలుచటి వస్త్రం వేసి దానిలో మైదా వేయాలి.విజిల్ లేకుండా మూతపెట్టి ఆవిరిపై ఉడికించాలి.15 ని.ల
తర్వాత దించేయాలి.అప్పుడు మైదాలోనానబెట్టిన పచ్చి శనగపప్పు,అల్లం,పచ్చి మిర్చి పేస్ట్,ఉప్పువేసి గట్టిగా కలపాలి.బాండీలో నూనె పోసి కాగిన తర్వాత ఒక పాలిథిన్ కవరుకు నూనె రాసి దానిపై చిన్నచిన్న చెక్కలు చేసుకోవాలి.వాటిని నూనెలో వేసి వేగనివ్వాలి.తెల్లగా ఉండగానే తీస్తే తర్వాత గోధుమ రంగులోకి వస్తాయి. అంతే కరకరలాడే చిట్టి చిట్టి చెక్కలు రెడీ.
ఇష్టమైతే కొంచెం సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు.

Monday, 1 September 2014

బరువు తగ్గటానికి మంచి చిట్కా

       కొర్రబియ్యం - 1  
      నీళ్ళు - 3
       క్రమం తప్పకుండా రాత్రి వరి అన్నంతోపాటుగా, కొర్రబియ్యం అన్నం,పెరుగు కలిపి తినాలి. ఇలా రోజు తింటుంటే బరువు తగ్గుతారు.బరువు తగ్గటానికి ఇది ఒక మంచి చిట్కా.కొర్రబియ్యం ఇప్పుడు అన్నిసూపర్ మార్కెట్ లలోనూ,
షాపుల్లోనూ దొరుకుతున్నాయి.  

థైరాయిడ్,కొలెస్టరాల్ కంట్రోల్ లో ఉండటానికి చిట్కా

       కొత్తిమీర రసం  -  2 స్పూనులు 40 రోజులు త్రాగాలి.ఇలా చేయడం వలన థైరాయిడ్,కొలెస్టరాల్ అదుపులో
ఉంటాయి.
       

లేడీస్ స్పెషల్

                                   మొన్నామధ్య ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆయుర్వేద వైద్యం తెలిసిన బంధువు వరుసకు అన్నయ్య కనిపించి ఆమాట ఈమాట మాట్లాడుతుండగా ప్రకృతిపరంగా ఆడవాళ్లకు వచ్చే సమస్యలకు,పరిష్కార మార్గాలు సూచించమని అడిగాను.నువ్వు నాకు చెల్లెలివి కనుక అడిగితే చెప్తున్నాను.అందరూ మా దగ్గరకు  రావటానికి,చెప్పటానికి బిడియపడుతూ ఉంటారు.మేము వెళ్ళిఅందరకు చెప్పలేము కదా అన్నారు.నాబ్లాగులో
పెట్టవచ్చా? అని అడిగాను.తప్పకుండా!ఏదైనా సలహా కావాలన్నాఇస్తాను.నలుగురికీ ఉపయోగపడటం కన్నా
కావాల్సింది ఏముంటుంది?మాకూ సంతోషం అన్నారు.              
                                                   గర్భాశయ  సమస్యలకు
 1 )ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవటానికి
                                     దొండ ఆకులు - 20
                                     పెరుగు - 1 కప్పు
   దొండ ఆకులు మిక్సీలో వేసి ఒకకప్పు పెరుగులో కలిపి వారానికి ఒకసారి చొప్పున మూడు సార్లు తింటే రెగ్యులర్
పీరియడ్స్ వస్తాయి.
2 )ఓవర్ బ్లీడింగ్,వైట్ డిశ్చార్జ్,అన్ని గైనిక్ సమస్యలకు
                                కిటికిసర ఆకు  - 1 కప్పు
                               జొన్న పిండి - 2 కప్పులు
                           ఆకు ఆరబెట్టి జొన్న పిండిలో కలిపి రొట్టెలు చేసుకుని తినాలి.(లేదా) సరిపడా బెల్లం కలిపి ఆవిరి కుడుములాగా వండుకోవాలి.
                 5 రోజులు ఈరకంగా తినాలి.మొదటి రోజునే తేడా తెలుస్తుంది.ఏ సమస్య ఉన్నా తగ్గిపోతుంది.
నోట్ : అన్ని సమస్యలకు ఇంకా మంచి పరిష్కారం
          రక్త సంబంధీకులు అంటే మనవికానీ,తల్లివి కానీ,కూతురివి కానీ వెంట్రుకలు ఊడినవి చుడితే ఒక గోళీ అంతచుట్టని మట్టి మూకుడులో సిమ్ లో స్టవ్ పై పెట్టి మాడ్చి పొడిలాగా చేయాలి.దీన్ని ఖాళీ కాప్స్యుల్ లో పోసి నీళ్ళతో వేసుకోవాలి.ఒకసారి ఇలాచేస్తే నెలసరిలో వచ్చే కడుపు నొప్పితో సహా అన్ని సమస్యలు పరిష్కారమౌతాయి.
                             ఈ ముగ్గురిలో ఎవరో ఒకరివి మాత్రమే ఉపయోగించాలి.బంధువు అయినా మంచి విషయాలు చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఊరు నుండి వచ్చిన తర్వాత ఇవన్నీ మీతో పంచుకోవటానికి  ఇప్పటికి వీలుపడింది. 

పెద్ద గండం

                    సుశ్రుత ఊరిలో లేని సమయంలో ఎదురింటి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందనీ,కారులో నలుగురున్నారనీ,కారు తిరగబడిందనీ,నలుగురూ పాణాలతో ఉన్నారనీ ఫోను వస్తే ఏడుస్తూ ఆసుపత్రికి వెళ్ళారనీ
కాపలాదారు పరుగెత్తుకుంటూ వచ్చి వగరుస్తూ చెప్పాడు.ఎదురింటి ఆమె ఉదయమే పువ్వులుకోస్తూ కనిపించింది. సుశ్రుత బాబు ఎలా ఉన్నాడు?అంటూ పరామర్శించటానికి వెళ్ళింది.ఇప్పుడు బానే ఉన్నాడు.అమ్మవారి దయవల్ల పెద్ద గండం గడిచింది.నలుగురు స్నేహితులు పార్టీకి వెళ్ళి తిరిగి వస్తుంటే మాఅబ్బాయికి నిద్రవచ్చి స్నేహితుడిని డ్రైవ్ చెయ్యమన్నాడట.అతను 140కి.మీ స్పీడుతో వెళ్తుండగా బైక్ అడ్డువచ్చిందట.వీడు,వాడు కూడా కంగారుపడి
ఒకరికొకరు ఒకేవైపు ఎదురురావటం వల్ల తప్పించబోయి చెట్టుకి గుద్దాడట.చెట్టు కూలిపోయింది.ఈలోగా మా అబ్బాయి కంగారుపడి హ్యాండ్ బ్రేక్ వెయ్యటంతో కారు 12 అడుగుల ఎత్తు ఎగిరి తిరగబడిందనీ చెప్పింది.ఒకతనికి
స్ప్లీన్ తీసేశారని,అందరికీ వెన్నెముకకు ఎక్కడో ఒకచోట దెబ్బతగిలిందనీ,అందరూ 18 సంవత్సరాలవాళ్ళేననీ,మా
అబ్బాయికి వెన్నెముక దగ్గర ఒక ఎముక ప్రక్కకు తొలగిందని,చిన్నవయసు కనుక ఆపరేషన్ చెయ్యలా?ఇంకా ఏదైనా మార్గముందా?అని పెద్దడాక్టర్ల సలహా తీసుకుంటున్నామని చెప్పింది.సుశ్రుతకు ఏమి మాట్లాడాలో అర్ధం కాక నోట మాట రాలేదు.18 సంవత్సరాల పిల్లలు అర్ధరాత్రి పార్టీలంటూ వెళ్ళి 140 కి.మీ వేగంతో వెళ్ళటం ఏంటో?
యాక్సిడెంట్ అవటం ఏంటో? ఆనలుగురు భూమి మీద నూకలుండి  బ్రతికడమే అనుకోవాలి.అంతే కాకుండా ఈ
సంఘటను బట్టి తల్లిదండ్రులుగా మనమందరమూ కూడా ఆలోచించాల్సిన విషయం.పిల్లలకు తెలిసీతెలియని
వయసు.మరీ కట్టడి చేయకుండా పిల్లలతో స్నేహభావంతో ఉంటూ ఏది మంచి,ఏది చెడు అని తెలుసుకోగలిగేలా,
స్నేహితులు వత్తిడి చేసినా ఆలోచించి అడుగు వేయటం,ఆంక్షలు పెడుతున్నామని ఫీల్ అవకుండా నేర్పించాలి.
మనకు ఎన్నిపనులున్నా కొంతసమయం వాళ్ళకు కేటాయించాలి.ఆడ పిల్లలయినా,మగ పిల్లలయినా వాళ్ళ భావాలు మనతో పంచుకోగలిగేలా చిన్నప్పటినుండి తల్లిదండ్రులుగానే కాక,స్నేహితుల్లా మెలగాలి.ఈవయసులో
నీకు చదువు ముఖ్యమా?పార్టీలు ముఖ్యమా? అని అరిస్తే ఎదురు తిరగటమో,ఇంట్లో తెలియకుండా వెళ్ళటమో చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.అందుకని మనమూ నేర్పరితనం అలవర్చుకోవాలి.పిల్లలు కాదోయ్ పిడుగులు అన్నట్లు ఉంటున్నారు.అందుకని పిల్లల్ని ఒక కంట గమనిస్తూ ఉండాలి.ఆ విషయం వాళ్ళకి కూడా తెలియకుండా   మనమే తెలివిగా నడుచుకోవాలి.చదువుతోపాటు,మంచి బుద్ధులు అలవడేలా చూడాల్సిన బాధ్యత మనదే.