Thursday, 31 December 2015

నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                            నూతన సంవత్సరంలో అందరి ఆశయాలు,ఆశలు,లక్ష్యాలు విజయవంతంగా నెరవేరాలని,అందరూ సుఖ,సంతోషాలతో,ఆయురారోగ్యాలతో,ధన ధాన్యాలతో తులతూగాలని మనసారా భగవంతుని కోరుకుంటూ బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,శ్రేయోభిలాషులకు,మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.


Wednesday, 30 December 2015

పెంకులో ఉడకేసి......

                                                          సుబ్బలక్ష్మి గారికి అతి శుభ్రం.శుభ్రం శుభ్రం అంటూ చేసినపనే చేస్తూ ఉంటుంది.తను చేసేది కాక అందరినీ చేయమంటుంది.పనివాళ్ళు కూడా అమ్మో!ఆవిడ దగ్గర మేము పని చేయలేము అంటూ ఎప్పటికప్పుడు పారిపోతుంటారు.అమ్మ ఇబ్బంది పడుతుందని పిల్లలు,పెద్దావిడ పని చేసుకోలేకపోతుందని దగ్గర బంధువులు కొత్త పనివాళ్ళను వెతుక్కుని తీసుకురాలేక నానా అవస్థలు పడుతుంటారు.పిల్లలకు విసుగొచ్చి సుబ్బలక్ష్మి గారిని కూర్చోబెట్టి అమ్మా!ఇంక మావల్ల కాదు.నీకు పనివాళ్ళను తీసుకురావటం తీసుకొచ్చిన తెల్లారే సరిగా చేయటం లేదంటూ వాళ్ళను పోట్లాడి బయటకు పంపేయడం పరిపాటి అయింది.అయినా అతి శుభ్రం అంటూ గీకినదే గీకి,తోమినదే తోమి ఆరోగ్యం పాడుచేసుకోవడం తప్ప ఏమి ఉపయోగం?మేమందరమూ పనులు శుభ్రంగా చేసుకోక పెంకులో ఉడకేసి ఆకులో ఆరేసుకుంటున్నామా ఏంటి? అన్నారు.ఆవిడ మహా మొండిఘటం.మీరు ఏరకంగా చేసుకుంటున్నారో?నాకు అనవసరం.నేను మాత్రం నాజీవితం ఎల్లమారే వరకు ఇంతే మారేది లేదు.మీరు నన్ను మార్చాలని కూడా ప్రయత్నించవద్దు అంటూ ఖరాఖండిగా చెప్పేసింది.చేసేది లేక పిల్లలు ఒక నమస్కారం పెట్టి నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయారు.

Tuesday, 29 December 2015

ఎవరి మర్యాద వాళ్ళు .......

                                                           ఈరోజుల్లో కొంత మంది ఎదుటివాళ్ళు మనల్ని గౌరవించాలని,ఇంటికి రాగానే సకల మర్యాదలు చేయాలనుకుంటున్నారు కానీ ఎదుటివారికి మనం మర్యాదలు చేస్తున్నామా?వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామా?లేదా?అని ఆలోచించడం లేదు.ఎంతసేపూ మనల్ని పట్టించుకోవడం లేదు,ఇంకా మనకోసం ఏదో చేయలేదు అని అనుకోవటమే తప్ప మనం ఎదుటివారికి ఏమి చేస్తున్నాము?అని అనుకోవటం లేదు.వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు కూడా సంతోషపడాలని,వాళ్ళు భాధగా ఉన్నప్పుడు ఎదుటివాళ్ళు కూడా వాళ్ళతోపాటు బాధపడాలన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ఈ విధంగాప్రవర్తించడం ఎంతవరకు సమంజసం?అనే ఆలోచన సుతరామూ కలగటం లేదు.ఒకసారో,రెండుసార్లో అయితే పోనీలే వాళ్లకి అదొక తృప్తి,చాదస్తం అని సరిపెట్టుకోవచ్చు. ఎంత కాదనుకున్నా ఇలా ప్రతీది ఎదుటి వారినుండి ఆశిస్తుంటే అనుబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.కనుక ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం మర్యాద.ఎవరి మర్యాద వాళ్ళు కాపాడుకోవడం ఉత్తమమైన పద్ధతి. 

Monday, 28 December 2015

మధుమేహం దరిచేరకుండా.....

                                                                      మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవాళ్ళు ఆహారపుటలవాట్లు మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం దరిచేరకుండా ఉంటుంది.అవేంటంటే ముడిబియ్యం ఓట్స్,మెంతులు,మెంతుకూర,కాకరకాయలు,ఆలివ్ నూనె వంటివి ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి.కలబంద రసం తాగటం లేక గుజ్జు తినగలిగితే మంచిది.మొదట్లో పాటించటం కష్టంగా ఉన్నా క్రమంగా అలవాటైపోతుంది.ఎంచక్కా మందులు,ఇంజెక్షన్ తో పని లేకుండా ఆహార నియమాలతోనే మధుమేహం దరిచేరకుండా అదుపులో ఉంచుకోవచ్చు.   

కొజ్జిది

                                                                              ప్రజ్వల ఎదుట చిన్నప్పుడు ఎవరైనా తన గురించి కానీ,తన కుటుంబం గురించి కానీ అభూతకల్పనలు మాట్లాడారంటే సివంగి లాగా పోట్లాడేది.ప్రజ్వలకు వరుసకు నాయనమ్మ  వీళ్ళ మీద వాళ్ళకు,వాళ్ళ మీద వీళ్ళకు చెప్పి తగువులు పెట్టేది.చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఆమె సంగతి తెలియక ఆవిడ మాటలు విని పోట్లాడుకునేవాళ్ళు లేకపోతే మాట్లాడుకోవటం మానేసేవాళ్ళు.ఒకసారి ప్రజ్వల ఎదురుగానే ప్రజ్వల గురించి ఈ పిల్ల కొజ్జిది అని దూరపు బంధువుకు చెప్పింది.నాగురించి ఆవిధంగా చెప్పటం ఏమిటి?అంటూ ప్రజ్వల ఆవిడ మీదపడి కొట్టినంతపని చేసింది.అప్పుడు నేను నీ గురించి అనలేదు అంటూ తప్పించుకోలేక మనవరాలివని నవ్వుతూ చెప్పానులే అంటూ సర్దిచెప్పింది.ఆమె బుద్దిలోపంతో అందరి గురించి చెప్పటం తప్పు కాదు కానీ నువ్వు చెప్పటం ఏమిటి?అంటే కొజ్జిది అని ప్రచారం మొదలెట్టింది.హతోస్మి!ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి సుమీ.

Saturday, 26 December 2015

తీపి తినాలనిపించినప్పుడు ......

                                                              కొంతమంది తెలియకుండానే  ఒత్తిడిగా ఉన్నప్పుడు చాక్లెట్లు,స్వీట్లు తింటూ ఉంటారు.అటువంటప్పుడు తీపి తినకుండా ఉడికించిన లేదా కాల్చిన చిలకడదుంపలపై కొద్దిగా తేనె,దాల్చిన చెక్క పొడి వేసుకుని తింటే ఒత్తిడి తగ్గటమే కాక ఏ విటమిన్ తోపాటు పోషకాలు అందుతాయి. 

చలికాలంలో చర్మం పొడిబారకుండా....

                                                         చలికాలంలో గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.స్నానం చేసే నీటిలో ఆలివ్ నూనె ఒక స్పూను వేసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.సబ్బు ఎక్కువగా వాడకూడదు.వీలయితే వారానికి ఒకసారి నువ్వుల నూనె శరీరానికి మర్దన చేసి శనగ పిండితో కానీ సుగంధ ద్రవ్యాలు కలిపిన సున్నిపిండితో కానీ  నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.వేపుళ్ళు తినకుండా తేలికపాటి ఆహరం తినాలి.మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి.పండ్లు,కూరగాయలు ఎక్కువగా తినాలి.వ్యాయామం తప్పనిసరి.ఆయిల్ ఇన్ వాటర్ బేస్ మాయిశ్చరైజర్లు వాడుకోవటం మంచిది.ఈ విధంగా చేస్తే చలికాలంలో చర్మం మృదువుగా అందంగా,ఆరోగ్యంగా ఉంటుంది. 

కళ్ళ వాపు,దురద తగ్గాలంటే....

                                                           నీళ్ళు మరిగించి దానిలో గ్రీ టీ బాగ్  వేసి ఆనీళ్ళు చల్లారాక ఆనీటితో కళ్ళు కడగాలి.ఇలా తరచూ చేయడం వల్ల కళ్ళ వాపు,దురద తగ్గటమే కాక చక్కటి నిద్ర మన సొంతమవుతుంది.

మాతృ భాషాభిమానం

                                                      ప్రజ్వల కు 11 రకాల భాషలు మాట్లాడటం వచ్చు.ఎన్ని భాషలు మాట్లాడినా తన మాతృ భాష తెలుగు అంటే ఎంతో మమకారం.విదేశాలలో పుట్టి పెరిగినా మాతృ భాషాభిమానంతో తన పిల్లలను తెలుగు తరగతులకు పంపించి మరీ తెలుగు నేర్పించింది.దానికి తోడు పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకుని చక్కగా మాట్లాడతారు.పిల్లలు స్వచ్చమైన తెలుగు మాట్లాడటమే కాక తెలుగు ఎక్సలెన్సీఅవార్డు గెలుచుకున్నారు.ఈ విషయం తెలిసి ప్రజ్వల అమ్మమ్మ ఎంతో సంతోషించి స్వదేశంలో ఉన్నవాళ్ళే స్వచ్చమైన భాష మాట్లాడటం లేదు.విదేశాలలో ఉన్న నువ్వు మాతృ భాషాభిమానంతో పిల్లలకు నేర్పించడమే కాక బహుమతి గెలుచుకునేలా చేశావు.శభాష్ మనవరాలా!నీలాగ అందరూ మాతృ భాష గురించి ఆలోచించితే ఎంత బాగుంటుందో అంటూ అభినందించింది. 

కాలి ఫ్లవర్ మెంతి కూర

కాలి ఫ్లవర్  - 1 (మధ్యరకం)
మెంతి కూర - 2 కట్టలు (పెద్దవి)
పచ్చి బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు 
తురిమిన కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు 
 కారట్ - 1 పెద్దది 
ఉల్లిపాయ - 1మధ్యరకం 
పచ్చి మిర్చి - 4  
నూనె - 3 టేబుల్ స్పూన్లు 
పసుపు - 1/4 స్పూను 
ఉప్పు - తగినంత 
వేపుడు కారం - 2 స్పూన్లు 
మసాలా పొడి - 1/4 స్పూను
తాలింపు కోసం :ఎండు మిర్చి-1,అన్నీ కలిపిన దినుసులు- 1 స్పూను,కరివేపాకు - కొంచెం
                                               కాలి ఫ్లవర్ తుంచి గోరువెచ్చటి నీళ్ళు,పసుపు,ఉప్పులో వేసి ఒక 10 ని.ల తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలు కోయాలి.మెంతు కూర శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.కారట్ చెక్కు తీసి తురమాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి పచ్చి మిర్చినిలువుగా చీల్చాలి.ఒక బాండీలో నూనె వేసి కాగిన తర్వాత తాలింపు వేసి ఉల్లిపాయ,పచ్చి మిర్చి,కాలి ఫ్లవర్ ముక్కలు,ఉప్పు,పసుపు,పచ్చి బఠాణీ వేసి మూతపెట్టి మధ్యమద్యలో తిప్పుతూ వేయించాలి.మగ్గి సగంపైన వేగాక తరిగిన మెంతికూర వేసి తిప్పాలి.కారట్,కొబ్బరి తురుము కూడా వేసి ఒక 5 ని.లు తిప్పి వేపుడు కారం వేసి తిప్పాలి.చివరగా మసాలా పొడి వేసి 2 ని.లు తిప్పి దించేయాలి.అంతే రుచికరమైన కాలి ఫ్లవర్ మెంతి కూర తయారయినట్లే.ఇది అన్నం,చపాతీల్లో చాలా బాగుంటుంది.

Thursday, 24 December 2015

పచ్చి బఠాణీ పచ్చదనం

                                                                              ఒకరోజు ఆర్యన్ కూరగాయలు కొనటానికి రైతు బజారుకు వెళ్ళాడు.పచ్చి బఠాణీలు నిగనిగలాడుతూ కనిపించేసరికి తీసుకుందామని ఆగాడు.ఇంతలో పక్కన ఉన్నతను ఒకసారి ఇటురండి అంటూ పిలిచాడు.చూడటానికి హుందాగా ఉన్నాడు ఎందుకు పిలుస్తున్నాడోనని ఆర్యన్ వెళ్ళాడు.ఏమండీ!పచ్చి బఠాణీలు ఒలిచి సంచిలో ఉన్నవి ఎప్పుడూ కొనుక్కోవద్దు అని చెప్పాడు.పచ్చి బఠాణీలు మంచి రంగుతో నిగనిగలాడుతూ కనపడటానికి వాటిని ఆకుపచ్చ రంగులో వేసి ఆరబెట్టి సంచుల్లో వెయ్యడం నేను చూశాను.వాటిని  ఎంత ఉడికించినా పూర్తిగా ఉడకక పోవడమే కాక వాటిని తినడం వలన కాన్సర్ వస్తుందని చెప్పాడు.అమ్ముకునే అతని దగ్గర చెప్పడం ఎందుకని పక్కకు పిలిచానని కొంతమందినైనా కాన్సర్ బారినుండి కాపాడినట్లు అవుతుందని చెప్పానన్నాడు.మీరు కావాలంటే బఠాణీ కాయలు కొనుక్కుని వాడుకోవటం మంచిదని సలహా ఇచ్చాడు.ఆర్యన్ ఆయనకు మంచి సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వచ్చి భార్యకు చెప్పాడు.ఆమె కూడా బఠాణీలు కడగటానికి నీళ్ళల్లో వెయ్యగానే నీళ్ళు ఆకుపచ్చగా మారుతున్నాయని చెప్పింది.
ప్రతి ఒక్కటి కల్తీయే వాళ్ళ లాభాలకోసం ఎదుటి వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. 

Wednesday, 23 December 2015

మొకిరి

                                                                         లక్మీరాజ్యం ఒక వారం రోజులు కూతురు దగ్గర ఉందామని ఊరు నుండి వచ్చింది.వచ్చిన దగ్గర నుండి పిల్లలు చెప్పినమాట వినకుండా కూతుర్ని చీటికీమాటికీ విసిగించడం గమనించింది.అమ్మమ్మ వచ్చినప్పటి నుండి తిడుతుందని పిల్లలు అభిప్రాయపడతారని నాలుగు రోజులు ఓపిక పట్టింది.ఈరోజుల్లో పిల్లలు మాట్లాడితే తిడుతున్నారనే భావనలో ఉంటున్నారు కదా!అందుకని ఒకరోజు పిల్లల్ని కూర్చోబెట్టి ఆమాట ఈమాట మాట్లాడుతూ ఏంటిరా?మరీ ఉన్నకొద్దీ మొకిరిగా తయారవుతున్నారు?అమ్మ చెప్పిన మాట వినటం లేదు.పోనీ బాగా చదువు కుంటున్నారులే అనుకోవటానికి చదువులోనూ మొకిరిగానే  ఉన్నారు అంటూ తిట్ల దండకం మొదలెట్టింది.ఆవిడ మొదలెట్టిందంటే ఎదుటివాళ్ళు దండం పెట్టి పారిపోవలసిందే.అలాగే పిల్లలు అమ్మమ్మా!ఇకనుండి అమ్మ చెప్పినమాట విని చక్కగా చదువుకుంటాము అని చెబితే కానీ వదలలేదు.

Saturday, 19 December 2015

అసలే బోర ఎక్కువ

                                               అనూరాధ ఎంతసేపు తను తన బంధువులు గొప్పని ఎదుటివాళ్ళు ఎందుకూ కొరగారు అన్నట్లు మాట్లాడుతుంటుంది.ఒకరోజు స్నేహితురాలి ఇంటికి కొంచెంసేపు కూర్చుని కాసిని గొప్పలు చెప్పటానికి వచ్చింది.మాటల్లో మా బావగారి అమ్మాయి పెళ్ళి కుదిరింది అని చెప్పింది.బావ కూతురు వైద్యవిద్య చదువుతుంది.పెళ్ళికొడుకు డిగ్రీ మాత్రమే చదివాడు.పెళ్ళికూతురు వైద్యురాలు కదా!డిగ్రీ చదివిన అబ్బాయికి ఇవ్వడమేమిటని అడిగిన దానికి సమాధానం దాటవేసి పెళ్ళికొడుక్కి వేలకోట్లు డబ్బుంది.ఎంత తిన్నా తరగదు.ఇంక చదువుతో పనేముంది?అనేసి వెళ్ళిపొయింది.డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు కదా!అనుకుంది స్నేహితురాలు.ఇంతలో స్నేహితురాలి అమ్మవచ్చింది.విషయం తెలిసి అనూరాధకు అసలే బోర ఎక్కువ కదా!కొత్తేముంది?వినేవాళ్ళు ఉంటే అలాగే వినిపిస్తుంది.అంది.

Friday, 18 December 2015

గులాబీ / బంతి పువ్వులతో........

                                                                                గులాబీలు,బంతి పువ్వులు ఇంటిముందు రకరకాల రంగులతో ముచ్చటగా చూడచక్కగా అందంగా ఉండటమే కాక,ఇంటిలోపల దేవుని పూజకు,అలంకరణకు ఉపయోగపడటమేకాక చర్మకాంతి మెరుగుపరుచుకోవటానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి.అదెలాగంటే ఏ రంగువైనా గులాబీ / బంతి పువ్వులను మెత్తటి పేస్ట్ చేసి దాన్ని ఒక స్పూను తీసుకుని,దానికి సరిపడా పచ్చిపాలు,ఒక స్పూను తేనె కలిపి ముఖానికి రాసి ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది.చేతులకు,మెడకు కూడా రాసుకుంటే చర్మకాంతి మెరుగుపడుతుంది.  

Thursday, 17 December 2015

తిక్క దానికో లెక్క

                                                         ఎప్పుడూ ఎవరికి వారు హడావిడి జీవనయానంలో పడి కొట్టుమిట్టాడటమే కదా అని రావు గారి కుటుంబం మొత్తం ఒక నెల రోజులు కలిసి సరదాగా,సంతోషంగా ఉందామన్నఉద్దేశ్యంతో అందర్నీతన ఇంటికి ఆహ్వానించారు.అప్పుడు అందరూ ఒకచోట కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాలు,మధురస్మృతులు తమ అనుభవాలు నేమరవేసుకుంటూ,అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండగా రావుగారు మా కుటుంబానికో తిక్క దానికో లెక్క ఉంది అన్నారు.అందరూ అదేమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో త్వరగా చెప్పమని అడిగారు.మా తాతల నాటినుండి ఇప్పటివరకు కూడా బాగా కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరు ఉంటే వాళ్ళమీద పెద్దగా అరిచేస్తామని చెప్పారు.ఎక్కువ కోపంతో తిక్క వచ్చినప్పుడు ఆ సమయంలో ఎదుటివాళ్ళ తప్పు ఏమీ లేదని తెలిసినా,అంతకు ముందు ఎప్పటిదో కోపం మనసులో ఉంచుకుని అరుస్తున్నాడని ఎదుటివాళ్ళు అర్ధం చేసుకోవాలన్నమాట అని చెప్పారు.విచిత్రంగా చూస్తున్న పిల్లలను చాలా అరుదుగా కోపం వస్తుందిలే కంగారుపడకండి అన్నారు.

Wednesday, 16 December 2015

వెంటిలేటర్ ద్వారా .....

                                               నగేష్ చూడటానికి నెమ్మదిగా ఉన్నట్లు కనిపించినా సకల దుర్గుణాభిరాముడు.ఒక్కటి కూడా మంచి లక్షణం అంటూ లేదు.ఈమధ్య కొత్తగా నేర్చుకున్నదేమిటంటే ఊళ్ళో కొత్త బైక్ ఎక్కడ కనపడితే అక్కడే దాన్నితీసుకెళ్ళి అమ్మేసుకోవటం మొదలుపెట్టాడు.వాళ్ళు వచ్చి ఇంటి మీద పడితే తండ్రి డబ్బులు కట్టటం అలవాటై పోయింది.తాజాగా ఒకళ్ళు దొంగతనం కేసు పెడితే పారిపోయాడు.తండ్రి వెతికి పట్టుకొచ్చికేసు మాఫీ చేసుకుని ఇంట్లో పెట్టి బయట తాళం పెట్టాడు.ఇంకెవరికీ అలవికాడని తనే స్వయంగా బోజనంతోపాటు మిగిలిన అవసరాలు అంటే మందు వగైరా చూస్తున్నాడు.అయినాసరే తండ్రి కళ్ళు కప్పి స్నానాలగదిలో ఉన్న వెంటిలేటర్ ద్వారా ఇంట్లో నుండి బయటకు దూకి  పారిపోయాడు.అన్నిపక్కలా  ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదు.

Tuesday, 15 December 2015

చేయకూడని పని

                                                          మన ఇంట్లో ఉన్న స్నానాల గదుల తలుపులు అసలు తీసి ఉంచకూడదు. ఎందుకంటే స్నానాల గదుల్లో ఉన్న ప్రతికూల తరంగాలు ఇంట్లోకి రావటం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది..దీనివల్ల అనారోగ్యంతోపాటు మనసును నిరాశ,నిస్పృహలు ఆవరిస్తాయి.కనుక ఈపని అసలు చేయకూడని పని.

కిటికీలు తెరవాలి

                                                                 మనలో చాలామంది దుమ్ము పడుతుందని కానీ,మరే ఇతర కారణం వలనైనా కానీ కిటికీ తలుపులు తెరవకుండా మూసేస్తుంటారు.ఇంట్లోకి ధారాళంగా వెలుతురు,తాజా గాలి వస్తుంటే ఆరోగ్యంతోపాటు మనసుకు ఉత్సాహంగా,ఆనందంగా ఉంటుంది.అందుకే వాతావరణం చల్లగా ఉన్నాసరే కిటికీలు తెరవాలి.ఈ విధంగా చేయటంవల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

అలిగి పుట్టింటికి .......

                                                   కుముద నోటితోపాటు గొంతు కూడా పెద్దది.ప్రతి చిన్నదానికి గయ్యో గయ్యో అంటూ అందరిమీద అరుస్తుంటుంది.భర్త,అత్తమామలపై కూడా ఒక్కొక్కసారి అలాగే అరుస్తుంటుంది.ఒకరోజు పిన్నత్త కూతురు పెళ్ళికి కుటుంబం మొత్తం కలిసి ఊరు వెళ్ళారు.పెళ్ళిలో కుముద భర్త తన చెల్లెలి కూతుర్ని కొంచెంసేపు ఎత్తుకున్నాడు.అది చూచి ఓర్వలేక ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళిలో నీ మేనకోడల్నిఎత్తుకోవటమేమిటి? అని భర్తతో తగువు పెట్టుకుని పిల్లల్ని కూడా భర్త దగ్గర వదిలేసి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది.కూతురు తెలివితక్కువగా చిన్న చిన్న వాటికి తగువుపడి సంసారం చెడగొట్టుకోవటం ఇష్టంలేక కుముద అమ్మ ఇంటికి ఫోనుచేసి అమ్మాయి ఒక వారం రోజులు మా ఇంట్లో ఉంటుంది అని చెప్పింది.వారం తర్వాత భర్తను,పిల్లలను వదిలి పుట్టింటికి రావటం పద్ధతి కాదని, ప్రతి చిన్నదానికి గొడవ పడకూడదని కుముద అమ్మ బ్రెయిన్ వాష్ చేసి అత్తారింటికి పంపించింది.

Monday, 14 December 2015

నోటి తురుతు

                                                              యామిని గుండ్రంగా పొత్రంలా ఉంటుంది అయినా తనే గొప్పగా,అందంగా ఉన్నాననే భావనతో అందర్నీ విమర్శిస్తూ నోటి తురుతుతో ఏదిబడితే అది మాట్లాడుతూ ఉంటుంది.అక్క కూతురి పెళ్ళి సందర్భంగా శుభలేఖ ఇవ్వటానికి రశ్మి ఇంటికి వచ్చింది.యామిని రశ్మి భర్తకు పిన్నిఅవుతుంది.రశ్మిభర్తతో ఇంతకు ముందుకన్నాఇప్పుడు చక్కగా ఉన్నావు అంది.భర్త గురించి కాస్త లావయ్యారు ఈమధ్య అంది రశ్మి.నువ్వు ఎంత లావు ఉన్నావో నీకు తెలియటం లేదు అంది రశ్మిని.రశ్మికి ఒళ్ళుమండి యామినికి కూడా తగిలివచ్చేట్లుగా అవునుగా!ఎవరిది వాళ్లకు తెలియదుగా!అన్నది రశ్మి.మళ్ళీ నోట మాట రాలేదు యామినికి.ఏమి మాట్లాడాలో తెలియక నిశబ్దంగా కూర్చుంది.

ముత్యమంత పసుపు .....

                                           ముత్యమంత పసుపు ముఖమెంత చాయ అన్నట్లు నిజంగానే ఒకప్పుడు ముఖానికి పసుపు రాసుకునే స్నానానికి  వెళ్ళేవాళ్ళు.అందుకే వయసు కనపడకుండా,ముఖాన ముడతలు లేకుండా చక్కగా ఉండేవాళ్ళు.ఇప్పుడు ఈ హడావిడి జీవనయానంలో అంత తీరిక ఉండటం లేదు.కానీ రెండు రోజులకు ఒకసారయినా ఒక పది ని.లు తీరిక చేసుకుని కొంచెం పసుపు దానికి సరిపడా నీళ్ళు తీసుకుని బాగా కలిపి ముత్యమంత పసుపు ముద్ద ముఖానికి రాసి ఒక పది ని.ల తర్వాత కడిగేయాలి.పసుపు కొత్త కణాలను వృద్ధి చేసి చర్మాన్ని బిగుతుగా మార్చటమే కాక వయసు రీత్యా వచ్చే ముడతల్ని రానివ్వదు.అందుకే పసుపుని యాంటీ ఏజింగ్ పౌడర్ అంటారు.   

Sunday, 13 December 2015

పెద్ద ఆరింద

                                                    అనిరుద్ర కు ఎనిమిది సంవత్సరాలు.అనిరుద్ర బాబాయ్,కొడుకు నాలుగు సంవత్సరాలవాడు మోటారు సైకిల్ పై వస్తుంటే ఆటోవాడు ఎదురుగా వచ్చేటప్పటికి అకస్మాత్తుగా బ్రేకు వేసేసరికి కింద పడ్డారు.బాబాయ్ కి చేతులు,కాళ్ళు బాగా కొట్టుకుపోయాయి.కొడుక్కి తలకు దెబ్బ తగిలింది.లోపల ఏమీ కాలేదు కానీ పైన గట్టి దెబ్బ తగలటంతో కుట్లు వేశారు.కొంతమేర కుట్లు కూడా వెయ్యటానికి కుదరక అలా వదిలేశారు.నిదానంగా కలిసిపోతుంది అని వైద్యులు అన్నారు.ఇంటికి బంధువులు వస్తే అనిరుద్ర పిన్ని ఇంకానయం తలలోపల ఏమీ కాలేదు.ప్రాణానికి ముప్పు రాలేదు.ఇంతటితో పోయింది.పిల్లాడి అదృష్టం అనుకోవాలి అని చెప్తుంది.ఇంతలో అటుగా వచ్చిన అనిరుద్ర అదృష్టమంట,ఏమిటి నా బొంద అదృష్టం అనేసింది.అక్కడే ఉన్న అనిరుద్ర అమ్మమ్మ ఇదొక పెద్ద ఆరింద అన్నీ దీనికే కావాలి అంది,

Saturday, 12 December 2015

అల్లరి @ 96

                                              పాల్ వయసు 96 సంవత్సరాలు.అయినా ఎంతో హుషారుగా అందర్నీ తన మాటలతో, చేష్టలతో కడుపుబ్బనవ్విస్తుంటాడు.తన 96 వ పుట్టినరోజు ఇంకా నాలుగురోజులు ఉందనగా అనుకోకుండా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది.తన మునిమనుమరాలితో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలని ఇంటికి వెళ్ళాలని వైద్యురాలిని అడిగాడు.ఆమె పూర్తిగా తగ్గిన తర్వాత పంపుతామని చెప్పింది.అయినాసరే ఆ రోజుకు ఎలాగయినా వెళ్ళిపోవాలని వైద్యురాలిని నువ్వు మంచిదానివి,గొప్ప వైద్యురాలివి అంటూ పొగడటం మొదలుపెట్టి చిన్న పిల్లవాడిలా అల్లరి చేయడం మొదలు పెట్టాడు.90 ఏళ్ల భార్య మాత్రం ఇంటికి తీసుకు వెళ్తే వెంట వెంటనే ఆసుపత్రికి  తీసుకురావాలంటే తనకు కష్టం కనుక పూర్తిగా తగ్గినతర్వాతే ఇంటికి తీసుకువెళ్తానని చెప్పింది.పాల్ పదేపదే చిన్న పిల్లవాడిలా మారాం చేస్తుంటే  తప్పనిసరిగా వైద్యులు ఇంటికి పంపారు.

కలిసి కూర్చుని ......

                                                                చిరాగ్గా ఉన్నప్పుడు ఏ పని చేయాలనిపించక,ఏమి చేయాలో తోచక ఎదురుగా  కనిపించిన వాళ్ళ మీద అరవటమో,మౌనంగా కూర్చోవటమో లేక అటూఇటూ గిరగిరా తిరగుతూ ఫోన్లు మాట్లాడటమో చేస్తుంటారు.అలా  కాకుండా మన మనసుకు నచ్చిన స్నేహితులతో కానీ బంధువులతో కానీ కాసేపు కలిసి కూర్చుని కబుర్లు చెబితే మనసు తేలికపడుతుంది.మన మనసులోని భావాలూ ఇతరులతో పంచుకోవడంతో చాలా తక్కువ సమయంలో చిరాకు నుండి బయటపడవచ్చు. 

Friday, 11 December 2015

జుట్టు ఒత్తుగా....

                                                 ఉసిరి పొడి,నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఒక గ్లాసు నీళ్ళు

                                        మనలో చాలామందికి లేవగానే బ్రష్ చేసుకుని కాఫీ,టీ తాగటం అలవాటు.పరగడుపున  కాఫీ,టీ తాగే బదులు ముందుగా ఒక గ్లాసు మంచి నీళ్ళు లేకపోతే తాగగలిగినన్నినీళ్ళు తాగి ఒక పది ని.ల తర్వాత కాఫీ,టీ తాగటం ఉత్తమం.పొద్దున్నే పరగడుపున ఒక గ్లాసు నీళ్ళు తాగటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.

Thursday, 10 December 2015

నీరెండలో .....

                                                  ఉదయం,సాయంత్రం నీరెండలో ఒక అరగంట కూర్చుంటే శరీరానికి డి-విటమిన్
అందుతుంది.విటమిన్ - డి లోపం వల్ల ఎముకలు పెళుసుబారటమే కాక గుండె జబ్బులు,పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది.కనుక నీరెండలో కాసేపు నడవగలిగితే మంచిది లేదంటే కుర్చీ వేసుకుని ఏ పేపరో,పుస్తకమో చదువుకుంటూ కూర్చోవటం అలవాటు చేసుకోవాలి.


Wednesday, 9 December 2015

ఎదుటివారిని మనసారా..........

                                                         మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంటుంది.అందంలో కానీ,సేవాగుణంలో కానీ,ప్రతిభ విషయంలో కానీ,ఎదుటివారికి  సహాయపడటంలో కానీ ఏదో ఒక అంశం కావచ్చు.ఎందుకన్నా కానీ ఎంత మంచి వాళ్ళైనా ఎదుటివారిని పొగుడుదామని అనుకోరు.ఎదుటివారిలో ఉన్న మంచిగుణాన్ని మనసారా అభినందించగలిగినప్పుడే నలుగురిలో మనం ప్రత్యేకంగా నిలబడగలుగుతాము.అందుకే ఎదుటివారిని మనసారా అభినందించటం అలవాటు చేసుకోవాలి.

చదువు ఒక్కటే

                                                           సురేంద్ర చదువుకునే రోజుల్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవు.అయినా కష్టపడి తల్లిదండ్రుల కోరికమేరకు వైద్యవిద్య చదువుకున్నాడు.తల్లిదండ్రులకు అంతగా ఇష్టం లేకపోయినా కొంత డబ్బు సంపాదించి మన దేశానికి వచ్చి చుట్టుపక్కల  ప్రజలకు అన్ని సౌకర్యాలతో పెద్ద ఆసుపత్రి కట్టించి మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకు వస్తానని మాటిచ్చి విదేశానికి వెళ్ళాడు.అనుకున్నట్లుగానే స్వదేశంలో స్వంత ఊరిలో అన్ని సౌకర్యాలతో పెద్ద ఆసుపత్రిని కట్టించి మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాడు.విదేశంలో కూడా మంచి వైద్యుడిగా పేరుపొంది ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుని స్వంత ఆసుపత్రులతోపాటు కోట్లకు పడగలెత్తాడు. సురేంద్ర అక్క తమ్ముడి ఇంటికి వెళ్ళి వచ్చి ఎంతో సంతోషంతో అందరికీ గర్వంగా నా తమ్ముడు విదేశాలకు వెళ్తూ వెంట ఏమీ తీసుకెళ్ళలేదు.చదువు ఒక్కటే వెంట తీసుకెళ్ళాడు.కష్టపడి చదువుకోవటం వల్ల ఎంతో ఎత్తుకు ఎదిగాడు.పిల్లలకు ఎన్ని ఆస్తులు కూడబెట్టి ఇచ్చినా చదువు తర్వాతే అన్నీ.అందుకే తల్లిదండ్రులు పిల్లల చదువుపై శ్రద్ధ వహించి పిల్లలు ఎవరికి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో నిలబడగలిగేలా చేస్తే వాళ్ళు ఆర్ధికంగా బాగుండటమే కాక నలుగురికీ సహాయపడేలా తయారవుతారని అందరికీ చెప్తుంది.నిజానికి చదువు ఒక్కటే ఎదుటివాళ్ళు తీసుకోలేనిది.అన్నింటికన్నా చదువే ముఖ్యం.అందుకే బాగా చదువుకోమని మనుమలకు,మనుమరాళ్ళకు చెప్తుంది. 

ఆలోచనలకు ఒక స్పష్టత

                                                          పచ్చటి ప్రదేశంలో చుట్టుపక్కల అంతా పరిశీలిస్తూ,ప్రకృతి అందాలను తిలకిస్తూ,రకరకాల పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,పక్షుల కువకువలు వింటూ,సూర్యోదయాన్నిచూస్తూ లేలేత ఎండలో సూర్యకిరణాలు మీద పడుతుండగా శరీరమంతా చెమట పట్టేలా నడవాలి.అప్పుడు మనసంతా దూదిపింజలా తేలికగా,ప్రశాంతంగా ఉంటుంది.ఆ సమయంలో మన మనసులో ఉన్న ఎన్నో ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది.  

Tuesday, 8 December 2015

స్నానం చేయించింది

                                                         స్నిగ్ధ మేనత్తకు ఒక అందమైన పర్సు తీసుకు వచ్చింది.మేనత్తకు ఒక పట్టాన అన్నీ నచ్చవు కనుక రెండు పర్సులు చూపించి ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పింది.అటు తిప్పి ఇటు తిప్పి ఒకటి తీసుకుంది.ఇంకొకటి స్నిగ్ధ తను కూర్చున్న సోఫాపై పెట్టింది.ఇంతలో మేనత్త వచ్చి సోఫా పైనున్న పర్సు తీసుకెళ్ళి తడిపి మళ్ళీ సోఫాపై పెట్టింది.స్నిగ్ధ పర్సు లోపల పెడదామనుకుని పట్టుకునేసరికి తడిగా ఉంది.ఇదేంటి?ఇది తడిచిపోయింది అంది స్నిగ్ధ.ఇంతలో అక్కడే ఉన్న స్నిగ్ధ పిన్నిమీ అత్త పర్సుకు స్నానం చేయించింది అని మీ అత్త ఇంట్లో ఉన్న అన్నిసామాన్లకు స్నానం చేయిస్తుంది.అలాగే  నీ పర్సుకు కూడా స్నానం చేయించింది అని చెప్పింది.ఎంతో ముచ్చటపడి తీసుకున్న ఖరీదయిన పర్సు కడిగేసరికి పాడయిపోయింది.స్నిగ్ధ ఏమైనా అంటే అత్త బాధ పడుతుందని ఏమీ మాట్లాడకపోయినా మొహం అదోరకంగా పెట్టింది.ఆడపడుచు చేసిన పనికి,తోటికోడలు మాట్లాడిన విధానానికి,కూతురు మొహం పెట్టిన తీరుకు చూస్తున్న స్నిగ్ధ అమ్మ పొట్ట పట్టుకుని మరీ పడీపడీ ఒక పావుగంట నవ్వుతూనే ఉంది.కాసేపటికి స్నిగ్ధ మామూలైంది.

నిద్ర లేచింది మొదలు......

                                                           ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు ఉరుకులు పరుగులు పెడుతూ పాదాలకు విశ్రాంతి లేకుండా తిరుగుతూనే ఉంటాము.శరీరం బరువు మొత్తం కాళ్ళపై పాదాలపై పడుతుంది.కనుక అలసిన పాదాలకు పడుకునే ముందు గోరువెచ్చటి కొబ్బరి నూనె రాసి ఒక 5 ని.లు మర్దన చేయాలి.ఇలా చేయటం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఒత్తిడి తగ్గటమే కాక అలసట తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.

Monday, 7 December 2015

ప్రతిరోజూ ఆవిరి

                                                                         సాధారణంగా మనకు జలుబు చేసినప్పుడు మాత్రమే ఆవిరి పట్టాలని గుర్తొస్తుంది.కానీ ప్రతిరోజూ ముఖానికి ఆవిరి పడితే ముఖం అందంగా,తాజాగా ఉంటుంది.చలికాలంలో ముఖం పొడిబారినట్లు ఉంటుంది కనుక మరిగే నీళ్ళల్లో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి ఆవిరి పడితే చర్మానికి తేమ అంది చర్మం శుభ్ర పడుతుంది.నీళ్ళను మరిగించి గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసి ఆవిరి పడితే శరీరానికి కొత్త శక్తి వస్తుంది.జలుబుగా ఉంటే మరిగే నీళ్ళల్లో యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పడితే తొందరగా ఉపశమనం కలిగి  శ్వాస తీసుకోగలుగుతారు.                

నీళ్ళల్లో ఈదుకుంటూ.......

                                               ఇరవై రోజుల క్రితం చెన్నైలో వర్షాలు మొదలైనప్పుడు మనస్విని పెళ్ళి.అప్పటికే జోరున వర్షం.కళ్యాణ మండపం చుట్టూ నీళ్ళు.పెళ్ళికొడుకు,బంధువులు రావాలన్నానీళ్ళల్లో నుండి రావాల్సిందే.అది అల్లాటప్పా పెళ్ళి కూడా కాదు.ఐ ఏ ఎస్ అధికారి కూతురి పెళ్ళి.అయినా ఇబ్బంది తప్పలేదు.విధికి ఎవరైనా తలవంచవలసిందే కదా!ముహూర్తం సమయం దగ్గర పడుతుంది.పెళ్ళికొడుకు ఇంకాకళ్యాణ మండపానికి చేరుకోలేదని అందరిలో ఉత్కంఠ.ఇంతలో ఎవరరూ ఊహించని విధంగా పెళ్ళికొడుకు నీళ్ళల్లో ఈదుకుంటూ సగం తడిసిన బట్టలతో వచ్చాడు.పెళ్ళికొడుకు కూడా మామూలు వ్యక్తి కాదు.ఐ పి ఎస్ అధికారి.ముహూర్తం సమయానికి సాహసం చేసి మరీ వచ్చినందుకు పెద్దలందరూ ఎదురెళ్ళి అభినందించి తోడ్కొని రాగా ముహూర్త సమయానికి మనస్విని మెడలో తాళి కట్టాడు..పెళ్ళికూతురు కూడా వైద్యురాలు.తుఫానులో పెళ్ళి ఎలా జరిగింది?అని స్నేహితురాలు ఫోను చేస్తే విచిత్రంగా జరిగింది అని చెప్పి పెళ్ళికొడుకు గుర్రం మీద రావటం చూశాం కానీ వింతగా నీళ్ళల్లో ఈదుకుంటూ వచ్చి మరీ నన్ను పెళ్ళి చేసుకున్నాడని మనస్విని చెప్పింది.

Sunday, 6 December 2015

ఒత్తిడిని పెంచే ఆహారం

                             ,                             చిప్స్,కప్ కేకులు,బర్గర్లు.పిజాలు వంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడంవల్ల  ఒత్తిడి పెరుగుతుంది.ఎప్పుడైనా ఒకసారి తిన్నా ఫరవాలేదు కానీ తరచుగా ఇలా ఒత్తిడిని పెంచే ఆహరం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.వాటికి బదులుగా పండ్లు,కూరగాయలు,ఎండు ఫలాలు తింటుంటే ఒత్తిడి తగ్గటమే కాక ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

హాయిగా నిద్ర పోవాలంటే .....

                                                    గోరు వెచ్చటి నీళ్ళల్లో కొంచెం గులాబీ నీళ్ళు,ఎవరికి నచ్చిన పరిమళం వాళ్ళు రెండు చుక్కలు కలిపి స్నానం చేస్తే శరీరానికి,మనసుకు ఉల్లాసంగా ఉంటుంది.కంటినిండా హాయిగా నిద్ర పడుతుంది.

మొటిమలు తగ్గాలంటే.......

                                                                  వాతావరణ కాలుష్యం వలన కానీ ,ముఖంపై జిడ్డు పేరుకోవడం వల్ల కానీ,మరే ఇతర కారణం వలనైనా కావచ్చు ఈరోజుల్లో ఎక్కువమంది వయసుతో సంబంధం లేకుండా మొటిమలతో ఇబ్బంది పడుతున్నారు.అలా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కొద్దిగా శనగ పిండి,పెరుగు,ఒక స్పూను వేపాకు రసం లేకపోతే ఒక 1/2స్పూను వేప పొడి కలిపి ముఖానికి రాయాలి.ఒక పావు గంట తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఈవిధంగా తరచుగా చేస్తుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

Saturday, 5 December 2015

వ్యసనం

                                                   రామారావు స్వీటు తినందే ఉండలేడు.ఒక పూట బోజనం తినకపోయినా ఉండగలడు కానీ స్వీటు తినాల్సిందే.ఎప్పుడైనా ఇంట్లో స్వీటు లేకపోతే అప్పటికప్పుడు వాళ్ళావిడ తయారు చేసి పెట్టాల్సిందే.లేకపోతే పిచ్చి కోపం వచ్చేస్తుంది.స్వీటు కనపడితే చాలు తినకుండా ఆగలేడు.ఎన్నో సమస్యలకు మూలకారణం అని తెలిసి కూడా తీపి అతిగా తినడం ఒక వ్యసనం.తను తినడమే కాక పిల్లలకు కూడా అదే అలవాటు చేశాడు.చిన్న వయసులోనే బరువు ఎక్కువగా పెరగటమే కాక మధుమేహం కూడా వచ్చింది.అయినా తీపి పదార్ధాలు తింటూనే రోజూ ఇంజెక్షన్ చేసుకుంటున్నాడు.చనిపోయినా ఫర్వాలేదు కానీ తీపి తినడం మానను అని చెప్తాడు.

అమ్మా!నువ్వు లక్కీ

                                                             ఒకరోజు ఉదయాన్నే నీల కూతురు సిరి ఫోన్ చేసి అమ్మా! నువ్వు లక్కీ అంది.అవునా!ఎందుకు?అని అడిగింది నీల.ముందుగా కూతుర్ని కన్నతల్లిదండ్రులు అదృష్టవంతులు అని నా స్నేహితులురాళ్ళు చెప్పారు.మొదట నేను పుట్టాను కనుక నువ్వు లక్కీ!అంది సిరి.హ్హ హ్హ హ్హ అవును నిజమే కదా!అంది నీల.నిజంగానే అమ్మాయి ముందు పుడితే చక్కగా రకరకాల బట్టలు,నగలు,పట్టు లంగాలు ముచ్చటగా ఏది కావాలంటే అది అందంగా వేయొచ్చు.ఏదన్నాశుభకార్యాలు,పెళ్ళివేడుకలు చెయ్యాలన్నా ముందుగా ఆడపిల్ల అయితేనే ఎవరైనా బాగా చెయ్యగలుగుతారు.ఇది జగమెరిగిన సత్యం.  

Friday, 4 December 2015

సుకుమారంగా.......

                                                           నితీష పనిమనిషి ఊరు వెళ్ళింది.నాలుగు రోజుల్లో వస్తానన్న మనిషి నెల రోజులైనా రాలేదు.ఏ రోజకారోజు ఈరోజు వస్తుంది,రేపు వస్తుంది అనుకుంటూ ఎదురుచూస్తూ ఏ పూటకాపూట పని చేసుకోవాల్సివస్తుంది.ఒకరోజు అనుకోకుండా నితీష పెద్దమ్మ ఊరు నుండి నితీషను చూద్దామని వచ్చింది.అసలే నితీషకు పని చేసుకునే అలవాటు లేదు.వచ్చీ రాగానే నితీష పెద్దమ్మ పనిమనిషి ఊరు వెళ్ళిన సంగతి చెప్పకుండానే ఆవిషయం కనిపెట్టేసి ఏమ్మా!నీ చేతులు సుకుమారంగా ఉండేవి పని చేసేవాళ్ళ చేతుల్లా మొరటుగా తయారయినాయి.పనిమనిషి రావట్లేదా?అని అడిగింది.అవును పెద్దమ్మా!ఊరు వెళ్ళి ఇంకా రాలేదు అని నితీష చెప్పింది.

Thursday, 3 December 2015

జుట్టు పెరగటానికి టీ

నీళ్ళు - 1 కప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
నిమ్మకాయ - 1/2 చెక్క
పంచదార - తగినంత
                                                               కరివేపాకు వేసి నీళ్ళు మరిగించి వడకట్టి కొద్దిగా చల్లారనిచ్చినిమ్మరసం పిండి,పంచదార తగినంత కలుపుకుని తాగాలి.ఈ విధంగా చేస్తే జుట్టు రాలకుండా నల్లగా నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతుంది.టీ తాగటం మొదలెట్టిన 15 రోజులలోనే తేడా తెలుస్తుంది.

కీళ్ళ నొప్పులు,వాపు తగ్గాలంటే.......

అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చి పసుపు కొమ్ము - 1 అంగుళం ముక్క
కీరదోసకాయ - 1 పెద్దది
కారట్ - 3 పెద్దవి
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
                                               పై వన్నీశుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కోసి జ్యూసర్ లో వేసి రసం తీసి వడకట్టి వారానికి 4 సార్లు తాగాలి.ఈ విధంగా చేస్తుంటే కీళ్ళ నొప్పులు,వాపు తగ్గుతాయి.క్రమంగా కీళ్ళవాతం కూడా  తగ్గుముఖం పడుతుంది. 

అన్నదాతా సుఖీభవ!

                                                               సీతమ్మ,లక్ష్మమ్మ మంచి స్నేహితురాళ్ళు.అరవై సంవత్సరాలుంటాయి. నాగులచవితి సందర్భంగా పుట్టలో పాలు పొయ్యాలని అనుకున్నారు.వాళ్ళ ఊరిలో అయితే చాలా ఒత్తిడిగా ఉంటుందని ప్రశాంతంగా,నిదానంగా పూజ చేసుకోవచ్చని ఒక 1/2 గంట ప్రయాణించి వేరే ఊరులో ఉన్న సాయిబాబా  గుడికి వెళ్ళారు.అక్కడ కూడా చాలామంది ఉండటంతో అందరూ వెళ్ళేవరకు ఎదురు చూశారు.అప్పటికే 12 గం.లు అయ్యేసరికి నీరసం వచ్చింది.భక్తితో ఎలాగయినా పుట్టలో పాలుపొయ్యాలనుకుని ప్రయత్నించేసరికి తూలు వచ్చి పడిపోబోయేసరికి పక్కనే ఉన్న యువకుడు పట్టుకుని దగ్గరుండి వాళ్ళిద్దరికీ పుట్టలో పాలు పొయ్యటానికి సహాయం చేశాడు.బాబూ!నువ్వెవరివో? కానీ సమయానికి దేవుడే పంపినట్లుగా వచ్చి సహాయం చేశావు చల్లగా ఉండాలి అని దీవించారు. అదేరోజు ఇందుమతి కుటుంబం బాబా గుడిలో పూజ,సత్యన్నారాయణ స్వామి వ్రతం చేసుకుని బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.ఉదయం నుండి పుట్టలో పాలు పొయ్యటానికి వీలుపడక పుట్ట దగ్గరికి వచ్చిన ఇందుమతికి విషయం తెలిసి సీతమ్మను,లక్ష్మమ్మను విందుకు ఆహ్వానించింది.ఇద్దరూ డబ్బున్న వాళ్ళే.అప్పటికప్పుడు పిలిస్తే భోజనానికి రావటానికి మొదట ఇష్టపడలేదు.ఇందుమతి పట్టుబట్టి మీరు వయసులో పెద్దవాళ్ళు.ఈసమయంలో భోజనం చేసి వెళితే మాకు సంతోషం అని దగ్గరుండి భోజనానికి తీసుకెళ్ళింది.అన్నదాతా సుఖీభవ!అంటూ ఇద్దరూ నిష్కల్మషంగా దీవించేసరికి ఇందుమతి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది.బంధుమిత్రులు అందరూ వచ్చినా స్నేహితురాళ్ళు ఇద్దరూ భోజనం చేయడం ఇందుమతికి ఎంతో తృప్తిగా అనిపించింది.

చనా పలావు

బియ్యం - 1 కప్పు
కాబూలీ శనగలు - 1/4 కప్పు
 యాలకులు - 3
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 4
అనాస పువ్వు - 1
బిర్యానీ ఆకులు - 2
షాజీర - 1 స్పూను
జాపత్రి - 1
పచ్చి మిర్చి  - 6
ఉల్లిపాయ - 1 పెద్దది
 కొత్తిమీర - చిన్న కట్ట
పుదీనా - 1 కట్ట
ఉప్పు - తగినంత
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూను
నెయ్యి - 4 టేబుల్ స్పూనులు
నూనె  2 టేబుల్ స్పూనులు
                                                 ముందుగా బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి.చనా ముందురోజు రాత్రి నానబెట్టుకోవాలి.ఉల్లిపాయ,పచ్చి మిర్చి పొడవుగా తరగాలి.ఒక బాండీలో నెయ్యి,నూనె కలిపి పొయ్యి మీద పెట్టాలి.నెయ్యి కరిగాక యాలకులు,చెక్క,లవంగాలు,అనాస పువ్వు,జాపత్రి,షాజీర,బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.రెండు ని.ల తర్వాత పుదీనా ఆకులు,అల్లం,వెల్లుల్లి పేస్ట్,ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు,నానబెట్టిన శనగలు వేయాలి.రెండు ని .ల తర్వాత బియ్యం వేసి వేయించాలి.దీన్ని రైస్ కుక్కర్ లో వేసి 1 1/2 కప్పుల నీళ్ళుపోసి ,తగినంత ఉప్పు వేసి మూతపెట్టి స్విచ్ ఆన్ చేయాలి.చక్కగా పొడిపొడిలాడుతూ రుచికరమైన చనా పలావు తయారవుతుంది.దీన్నిఉల్లిపాయ పెరుగు పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.     

Wednesday, 2 December 2015

దూరపు కొండలు నునుపు

                                                           శివాని కి మొక్కలంటే ప్రాణం.తను ఉండే ప్రదేశంలోకన్నా కడియం వెళ్ళి తెచ్చుకుంటే ఎక్కువ మొక్కలు తక్కువరేటుకు వస్తాయన్న ఉద్దేశ్యంతో వెళ్ళింది.ప్రయాణ బడలిక తప్ప ఉపయోగం లేకుండా పోయింది.స్వంత ఊరిలో హైబ్రిడ్ గులాబీ మొక్క 50 రూ.లకు అమ్ముతుంటే కడియంలో 150 రూ.లు పెట్టి తెచ్చింది.ప్రత్యేకమైన మొక్క కాబోలు ఎన్నోపువ్వులు పూస్తుందనుకుని తెస్తే నెలకు ఒక్క పువ్వు కూడా రావటం లేదు.ఊరిలో కొన్న మొక్క నిండుగా విరగ పూస్తుంటే కడియం మొక్క దిష్టి బొమ్మలాగ దాని పక్కనే ఉంది.కడియం వెళ్ళాను కదా అని వేల రూ.లు పెట్టి అన్ని రకాల మొక్కలు కొనుక్కొచ్చింది.ఉన్న ఊరిలో మొక్కలు కొనుక్కోక "దూరపు కొండలు నునుపు"అని  దగ్గరకు వెళ్తేగానీ ఎత్తుపల్లాలు తెలియవన్నట్లుగా అయింది శివానీ పరిస్థితి.ఎడారి మొక్క నచ్చిందని అడిగితే 600 రూ.లు చెప్పి మా సారు లేరు ఇప్పుడు అమ్మడం కుదరదు అన్నాడు.మరి ఎందుకు పెట్టుకున్నట్లో? ఫొటోలలో అందమే కానీ అక్కడ అనుకున్నంత గొప్పగా ఏమీ లేదని,అంత దూరం శ్రమపడి వెళ్ళడం డబ్బు కూడా వృధా అని శివానీకి,వెంట వెళ్ళిన వాళ్ళకు అనిపించింది.

బీరకాయ వేసి బిర్యానీ

బీరకాయ - 1 పెద్దది
బంగాళదుంప -1
టొమాటోలు - 2
పచ్చిబఠాణీలు - 1/4 కప్పు 
ఉల్లిపాయలు - 2 
పచ్చిమిర్చి - 4 
పుదీనా - 1/2 కట్ట 
పసుపు - చిటికెడు 
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూను 
కారం - 1/2 టీ స్పూను 
గరం మసాలా - 1/2 టీ స్పూను 
పెరుగు - 1 టేబుల్ స్పూను 
జీరా -1 టీ స్పూను 
లవంగాలు - 3
దాల్చిన చెక్క - అంగుళం ముక్క 
యాలకులు - 2 
పలవు ఆకు - 1
నూనె ,నెయ్యి కలిపి - 2 టేబుల్ స్పూన్లు 
బాస్మతి బియ్యం - 1/4 కేజి
ఉప్పు - తగినంత
                                                          ముందుగా బియ్యం కడిగి 1/2 గం.నాననివ్వాలి.ఒకగిన్నెలేక  కుక్కర్ లో
కొద్దిగా నూనె  వేసి యాలకులు,నానబెట్టిన బియ్యం వేసి 1ని.వేయించి నీళ్ళు పోసి కొద్దిగా బిరుసుగా అన్నం వండాలి.ఒక పాన్ లో నూనె,నెయ్యి వేసి జీరా,లవంగాలు,చెక్క,పలావు ఆకు వేసి వేయించాలి.ఉల్లి,పచ్చిమిర్చి,అల్లం,వెల్లుల్లి వేసి వేగాక టొమాటో ముక్కలు,పుదీనా వేసి మగ్గనిచ్చి చెక్కు తీసిన బీరకాయ ముక్కలు,బంగాళదుంప ముక్కలు వేయించి ఉప్పు పసుపు,కారం,గరం మసాలా వేసి 2 ని.లు తిప్పాలి.పెరుగు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.అన్నం ఒక బేసిన్ లో వేసి చల్లారాక పై మిశ్రమాన్ని వేసి కలపాలి.మళ్ళీ ఈ మొత్తాన్ని ఒక మందపాటి గిన్నెలో వేసి మూతపెట్టి 10 ని.లు దమ్ చేస్తే రుచికరమైన బీరకాయ వేసిన బిర్యానీ తయారయినట్లే.

Tuesday, 1 December 2015

అసలు వయసు కన్నా తక్కువగా......

                                                           అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఇరవై ఏళ్ళ వాళ్ళలా హుషారుగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.నా వయసు ఇంకా ఇరవై అని పాడుకోకపోయినా మరీ అంతగా ఊహించుకోకపోయినా అసలు వయసు కన్నా తక్కువ వయసు వాళ్ళమని అనుకునేవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువ రోజులు బ్రతుకుతారన్నది నిజం.బరువు పెరగకుండా ఉండటం,రోజూ వ్యాయామం చేస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ అవసరమైతే చికిత్స తీసుకోవటం,ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం వల్ల కావచ్చు ఏది ఏమైనా మేమింకా చిన్నవాళ్ళమనే భావంతో ఉన్నవాళ్ళ ఆయుర్ధాయం పెరగటమే కాక చూడటానికి కూడా ఉన్న వయసు కన్నా చిన్నవాళ్ళలా కనిపిస్తారు.వాళ్ళు చెప్తే తప్ప వయసు తెలుసుకోవటం కష్టం.ఇది ముమ్మాటికీ నిజం.

రోజూ కాసిని వేపాకులు

                                                   వేప చెట్టులో ప్రతిదీ అంటే ఆకులు,పువ్వులూ,బెరడు,నూనె,గింజలు,పండ్లు అన్నీ ఔషదభరితమే అని ప్రాచీన కాలం నుండి మనందరికీ తెలిసిన విషయం.దేని ఉపయోగం దానికే ఉన్నా రోజూ కాసిని వేపాకుల్ని తినడంవల్ల కాన్సర్ వ్యాధి రాదనేది సరి కొత్త విషయం.వేప ఆకుల్లో ఉండే రసాయనాలు కాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని అద్భుత ఔషధంగా పనిచేసి వ్యాధిని అరికడతాయి.

ప్రతి చిన్నదానికీ.......

                                                     ప్రతి చిన్నదానికీ కోపం,చిరాకు వస్తున్నా.ఒకే విషయం గురించి ఆలోచనలు పదే పదే వస్తున్నా ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది.ఈ విషయం ఎవరికి వారే గమనించి మనసును దారి మళ్ళించి యోగా,ధ్యానం,వ్యాయామం,తోటపని,ఇంటిపని లేక మనసుకు నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటుంటే వీలయినంత త్వరగా వాటి నుండి బయటపడి సంతోషంగా ఉండవచ్చు.