Monday, 28 April 2014

ఎడారిలో ఒయాసిస్సు

            మౌర్యన్,మౌనిక భార్యాభర్తలు.ఇద్దరూ విదేశాల్లో వైద్యులు.విదేశాలలో ఎవరిపనులు వాళ్ళే చేసుకోవాలి కనుక వీళ్ళిద్దరూ వైద్యవృత్తిలో తీరిక లేకుండా హడావిడిగాఉంటారు ఎలాగో,ఏంటో అని మౌనిక తల్లిదండ్రులు
ఆందోళన పడుతుంటే మౌర్యన్ తల్లిదండ్రులు మీకు ఆబెంగ అక్కరలేదు అనిచెప్పారు.మా అబ్బాయిని సిల్వియా
 తన స్వంత కొడుకు కన్నా ఎక్కువగా కంటికి రెప్పలా కాపాడుతుంది.మా అబ్బాయి కూడా సిల్వియాతో
ప్రేమగా ఉంటాడు.ఏదోఒక సమయంలో మౌర్యన్ కనిపించకపోతే ఆమెకు నిద్రపట్టదు.మౌర్యన్ బిజీగాఉంటే ఆమే
మౌర్యన్ దగ్గరికి వెళ్తుంది."మై సన్,మై సన్" అంటూ ఉంటుంది.ఆమె ఋణం ఈజన్మలో తీర్చుకోలేనిది అనిచెప్పారు.
                 మౌనిక అక్కడకు వెళ్ళిన తర్వాత కోడలు వచ్చిందని ఎంతో సంతోషపడింది.కూతురు కన్నా ఎక్కువగా చూస్తుంది."మై డాటర్ ఇన్లా"అంటూ అందరికీ చెపుతూ ఉంటుంది.వీళ్ళు హాస్పిటల్ లో రకరకాల పేషెంట్లను చూడాలి కనుక వ్యాధి నిరోధక శక్తి ఉండాలని బలవర్ధకమైన ఆహరం, పానీయాలు తనే స్వయంగా తయారుచేసి ఇద్దరినీ   తినాల్సిందే,తాగాల్సిందే అంటూ హడావిడి చేస్తుంటుంది.ఈరోజుల్లో ఇంత ప్రేమగా  ఉండటం అరుదు.విదేశాలలో మరీ అరుదు.
ఈ యాంత్రికజీవనయానంలో ఎడారిలో ఒయాసిస్సులా సిల్వియా భగవంతుడిచ్చిన వరం.నిజంగా మేము దగ్గర ఉన్నాఅంత శ్రద్దగా చూడగలిగేవాళ్ళం కాదేమో.ఆమె నిస్వార్ధమైన ప్రేమకు ఒక్కొక్కసారి కళ్ళు చెమర్చుతాయి.
మౌనిక సిల్వియా కబుర్లు చెపుతుంటే ఆమె ఋణం ఎన్నటికీ తీర్చలేనిదిఅని మౌనిక తల్లిదండ్రులు అనుకున్నారు.

అగ్నిపర్వతాలు

       ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్న దేశం ఇండోనేషియా.ప్రపంచంలో పెద్ద అగ్నిపర్వతం
"లొంబోక్" దీవిలో ఉన్న "రింజిని".దీని ఎత్తు రెండువేల ఏడువందల డెబ్బైఐదు మీటర్లు.ఇండోనేషియాలోని
"కవా ఐజైన్" ఆమ్ల పూరితమైన అగ్నిపర్వతం.ఈ అగ్నిపర్వతం నుండి నిరంతరం సల్ఫర్ వాయువులు విడుదలవుతుంటాయి.దీనినుండి ఎగసిపడే మంటలు,వెలువడే లావా సల్ఫర్ వాయవుల కారణంగా రాత్రిపూట
నీలిరంగులోకి మారి మెరుస్తూ చూపరులకు మైమరపించేలా కనిపిస్తాయి.ఇండోనేషియాలో మొత్తం" 128"
అగ్ని పర్వతాలున్నాయి.

సమాజం

                                        సమాజం మొరిగే కుక్కలాంటిది.
                                        భయపడి పరుగెడితే వెంటపడి
                                        తరుముకుంటూ వస్తుంది.
                                        ధైర్యంగా నిలబడితే తోకముడిచి
                                        పరుగెడుతూ పారిపోతుంది.

నగ్నసత్యాలు

           
1) జీవితం ఒక సమరం లాంటిది.దానిని పూర్తిగా గెలిచినవాడు ఈ ధరాతలంపై ఎవ్వరూ లేరు.
2) మనుషులను విడదీయటానికి ఒకరినుండి మరొకరిని దూరంగాఉంచటానికి విజ్ఞానం రూపొందించిన
గొలుసులే విచారించకుండా ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలు.
3) నీవు సంపాదించే కన్నా తక్కువ ఖర్చు చేయటం నేర్చుకోగలిగితే నిన్ను మించిన ఆర్ధికనిపుణత ఉండదు.
బ్రతుకుతెరువులో మహేంద్రజాలం.
4) కలిమి,కాలం మనిషికి జీవితంలో ప్రధానమైన బరువులు.వాటినిఎలా ఉపయోగించుకోవాలో తెలియకపడే అవస్థలే కష్టాలు.
5) జీవితాన్ని గురించి అతిశయంగా ఊహించుకొనే కొద్దీ అది నిస్సారంగా అనిపిస్తుంది.జీవితాన్ని గురించి ఎంత
తక్కువగా ఊహించుకుంటే అంత నందనవనంలా కనిపిస్తుంది.
6) ముందు నిన్ను నీవు బాగుచేసుకో.మాలిన్యాన్ని అంతటిని తొలగించుకో.మంచి మార్గాన్ని ఏర్పరచుకో.
అప్పుడు ఎవరూ చెప్పకుండానే అందరూ నిన్ను అనుసరిస్తారు.
7) ఆగ్రహంతో గతాన్ని,భయంతో భవిష్యత్తును తిలకించే కంటే ఎరుకతో వర్తమానాన్ని అవలోకించటం మేలు.
8) అవకాశం తనంత తానుగా వచ్చిమన తలుపు తట్టదు.మనం అవకాశాన్ని వెంటాడుతూ దాన్ని
 సద్వినియోగం చేసుకోవాలి.
9) మనం ఇష్టపడే వస్తువులు మనకు దొరకనప్పుడు మనకు దొరికిన వస్తువులనే ఇష్టపడాలి.
10) ఆశయాలు ఆకాశంలోని చుక్కల్లాంటివి.వాటిని మనం అందుకోలేము.కానీ నడిసముద్రంలో నావికునికి దిక్సూచి వలేఈ ఆశయాల సహాయంతో గమ్యం చేరటానికి ప్రయత్నించాలి.

Saturday, 26 April 2014

భావోద్వేగబంధం

     మనీష్ విదేశాలలో ప్రభుత్వవైద్యుడుగా పనిచేస్తూ పైచదువులు చదువుకుంటున్నాడు.ఒకరోజు చెల్సి మనీష్ పనిచేసే ఆసుపత్రికి వైద్యంకోసంవచ్చి పరిచయమైంది.మాట్లాడుతూఉండగా మాటల్లో మనీష్''మామ్''అని
మాట్లాడేసరికి ఆపిలుపు గుండెనుతాకి తన చనిపోయినకొడుకు పిలిచినట్లుగా ఫీలయింది.అప్పటినుండి మనీష్
నే తన స్వంతకొడుకులా చూచుకొంటుంది.చెల్సి తమ్ముడు,చెల్లెళ్ళు కూడా అక్క మనోభావాలను అర్ధం చేసుకుని మనీష్ ని తమ కుటుంబంలో ఒకసభ్యుడిగా పరిగణించి ఎంతో ప్రేమగా ఉంటారు.మనీష్ కూడా వాళ్ళతో అంతే ప్రేమగా ఉంటాడు.చెల్సి స్వంతకొడుక్కి ఎలాసలహాలిస్తుందో అలాగే ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెడితే బావుంటుంది ఏది ఎక్కువలాభం వచ్చేది తానే స్వయంగా చూసుకుంటుంది.ఏసమయానికి ఏదితినాలో,
ఏది తినకూడదో,దేనిలో ఎన్ని కేలరీలు ఉన్నాయో,ఏది ఇష్టమో,ఏది అయిష్టమో స్వంత తల్లికన్నాఎక్కువ చెల్సీ  చెపుతుంది.స్వంతతల్లిదండ్రులకన్నా చెల్సీ కే తెలుసు.మనీష్ మనస్తత్వానికి ఏఅమ్మాయిసరిపోతుందో ,ఎవరిని
చేసుకుంటే బాగుంటుందనేది చెల్సి నే నిర్ణయించింది.మనీష్ పెళ్ళి చేసుకున్న అమ్మాయిని స్వంతకోడలిగా చూస్తుంది.స్వంత రక్తసంబంధీకులే అంతప్రేమగా ఉండరు.ఆ ప్రేమ,ఆప్యాయతలకు చలించిపోయి ఒక్కొక్కసారి
 కళ్ళవెంబడి నీళ్ళు తిరుగుతాయి.మనీష్ నాకెలా కొడుకయ్యాడో,నేను మనీష్ కెలా తల్లినయ్యానో తెలుసా?
మాది'' emotional bonding ''అంటే ''భావోద్వేగ బంధం''అని చెల్సి చెప్తుంటుంది.మనీష్ కూడా చెల్సి నాకు స్వంత అమ్మ కన్నా ఎక్కువ అని చెప్తూఉంటాడు.

కుత్సిత స్వభావం

        ఈమధ్య హిమబిందు ఒక స్నేహితురాలింటికి వెళ్ళింది.కుశల ప్రశ్నలు అయినతర్వాత తనకు ఒక సమస్య వచ్చిందని చెప్పింది.నేను మీతోపాటే చదువుకున్నాను,మీతోపాటే డబ్బుకూడా కట్నంగా అత్తారింటికి తీసుకునివెళ్ళాను.మీకేసమస్యలు లేవు.నాకు,నాపిల్లలకు అన్నీ ఎక్కడలేని సమస్యలు వచ్చినాయి
 అని ఏడ్చేసి నాకొచ్చిన కష్టం అందరికీ ఎప్పుడు వస్తుందో? నేనెవరికి ద్రోహం చెయ్యలేదు అయినాఇలా ఉన్నాను అనేసింది.సమస్య వస్తే పరిష్కారమార్గం ఆలోచించాలి లేదా ఎవరోఒకరి సలహాతీసుకోవాలి అంతేగానీ
నాకొచ్చిన కష్టం అందరికీ రావాలి అనుకోవటం ఏమిటి? ఒక కన్ను పోయిందని ఏడిస్తే ఇంకొక కన్ను పోతుందని శాస్త్రం.మనం బాగుండాలి మనతోపాటు అందరూ బాగుండాలి అని భగవంతుని కోరుకోవాలి.నీ ఆలోచనావిధానం
తప్పు.ముందుగా నీఆలోచనల్లో మార్పు తెచ్చుకుని ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే అదే మంచి జరుగుతుంది అని హిమబిందు ఆమెను ఓదార్చింది.నేను ఎవరికీ ద్రోహం చెయ్యలేదు అంటుంది అంతకన్నా
ఎక్కువే కుత్సిత  మనస్తత్వంతో అందరికీ కష్టాలు నాలాగా రావాలని కోరుకుంటుంది.ఆరకంగా ఆలోచించటమేమిటి? అని హిమబిందు విస్తుపోయింది.

మళ్ళీతిరిగిరానిరోజులు

       సునీల,సమత కళాశాలలో కలిసి చదువుకున్నారు.ఇద్దరూ ప్రాణ స్నేహితులు.తర్వాత ఎవరికివారు తీరికలేని జీవితాలు గడిపేస్తున్నారు.చాలాసంవత్సరాల తర్వాత సునీల ఫోను నంబరు ఎలాగో తెలుసుకుంది. సమత సునీలకు ఫోనుచేసి అర్జెంటుగా నీతోమాట్లాడాలి ఎన్నిపనులున్నాసరే వీలుచూసుకుని రా నిన్నుచూచి
చాల రోజులైంది చూడాలనిపిస్తుంది వెంటనే రమ్మని చెప్పింది.ఒత్తిడి పనుల వలన వెంటనే రాలేకపోతున్నాను.
వీలైనంత త్వరగా వస్తాను అని సునీల చెప్పింది.అప్పటివరకు నిన్ను చూడకుండా ఉండాలా?అని బాధపడింది.
ఆ ఆప్యాయతకు సునీల చలించిపోయింది.ఎలాగో ఒకసిటీ నుండి ఇంకొక సిటీకివెళ్ళి అక్కడినుండి రెండుగంటలు
ప్రయాణించి సమత ఇంటికి వెళ్ళింది.ఒకరినొకరు చాల సంవత్సరాలతర్వాత చూసుకోవటంతో సంతోషంతో కళ్ళ
వెంబడి నీళ్ళు వచ్చేసినాయి.చాలా రోజులతర్వాత ఇద్దరూ కళాశాల రోజులు నెమరువేసుకున్నారు.అప్పటి స్నేహితుల గురించి,లెక్చరర్లు గురించి ఒకటేమిటి కబుర్లతో సమయం ఇట్టే గడిచిపోయింది.ఏదిఏమైనా మళ్ళీ
ఆరోజులు తిరిగిరావు.ఏబాదరబందీ లేకుండా,హాయిగా,స్వేచ్చగా,నవ్వుతూ,తుళ్ళుతూ,గెంతుతూ,ఒకరినొకరు
టీజ్ చేస్తూ,ఏ బాధ్యతలు లేకుండా,చదువుకుంటూ గడిపే స్వేచ్చాయుత జీవితం విద్యార్ధి జీవితం.మిగతా జీవితం
అంతా సంతోషంగానే గడిపినా మళ్ళీ తిరిగిరాని రోజులే కళాశాల రోజులు అని సునీల,సమత అభిప్రాయం. 

Friday, 25 April 2014

పల్లెకుపోదాం చలోచలో

        శార్వాణి సిటీ నుండి ఇప్పటికీ నెలకి ఒకసారైనా పల్లెకు వెళ్తూ ఉంటుంది.తనకు పల్లెలంటే అంత ఇష్టం.
ఆ వాతావరణం,కొండలు,కోనలు,నదులు,కాలువలు,పంటకాలువలు,పొలాలుఅవన్నీచూస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది.ఎడ్లబళ్ళు,ఆవులు,గేదెలు,రకరకాలపక్షులు,గిన్నెకోళ్ళు,జెముడుకాకులు,కోయిలలు,జామచెట్లమీద
దోరజామకాయలను తినటానికి వచ్చేచిలుకలు,ఒకటేమిటి అవన్నీచూడటానికి ఎంతోఆహ్లాదకరంగా ఉంటాయి.
'పల్లెలేదేశానికిపట్టుకొమ్మలు'.లేతమొక్కజొన్నపొత్తులు,వేరుశనగకాయలు,లేతతాటిముంజలు,కందికాయలు,
సీమతుమ్మకాయలు,మామిడికాయలు,చెరుకుగడలు,తంపటి వేసిన వేరుశనక్కాయలు,తేగలు,బాదంకాయలు  పండు తాటికాయలు సిటీలో తినాలన్నా,ఎంతడబ్బు పెట్టినా దొరకనివి పల్లెల్లో ఎన్నో.  
        శార్వాణి చిన్నతనంలో వీధిమొత్తం బంధువులే ఉండేవారు.పొలాల్లో పండినపంటలను ఇళ్ళముందు రాసులుగాపోసేవారు.పిల్లలు ఆరాసులమీద ఎక్కి పైనుండి క్రిందికి జారుతూ ఆటలాడేవారు.
ఇళ్ళముందు పెద్దపెద్ద పురులుకట్టి వడ్లుపోసి నిల్వచేసేవాళ్ళు.అంతకు ముందురోజుల్లో పాతర అంటే చాలా  పెద్దగుంట బాదంకాయ ఆకారంలోకానీ,గుండ్రంగాకానీ తీసి మందంగా వరిగడ్డి పరిచి చాపలువేసి వడ్లు,పసుపు నిల్వచేసేవాళ్ళు.వేరుశనగమొక్కలు,మొక్కజొన్నకండెలురాసులుగాపోసేవాళ్ళు.ఆడవాళ్ళందరూభోజనాలుచేసి
మధ్యాహ్నం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ వలిచేవాళ్ళు.పిండివంటలు కూడా బంధువులందరూ కలిసి ఒకచోట వండుకునేవాళ్ళు.ఎప్పుడు ఆవీధివీధి సందడిసందడిగా ఉండేది.ఇప్పటికీ అలాగే సందడిగా ఉంటుంది.ఆచిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురం.ప్రశాంతంగా ఉండాలన్నా,ప్రకృతిని ఆస్వాదించాలన్నా పల్లెకు వీలయినప్పుడల్లా పిల్లలను కూడా తీసుకుని వెళ్తూఉంటే  వాళ్లకు కూడా ప్రకృతి అందాలను తిలకించటం అలవాటవుతుంది.
సిటీలో తినేఫాస్ట్ ఫుడ్స్ కాకుండా పల్లెటూరి రుచులు అలవాటుచేస్తే సెలవలు వచ్చినప్పుడు పిల్లలు కూడా
పల్లెకు పోదాం చలోచలో అంటారు.

Thursday, 24 April 2014

శాడిజం

     సుఖద ,చరణ్ భార్యాభర్తలు.ఇద్దరూ తెల్లగా అందంగా ఉంటారు.చరణ్  కోపిష్టి.కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించేది వాడికే తెలియదు.వాళ్ళకు ఇద్దరూ పిల్లలు.అమ్మాయి శ్రీజ,అబ్బాయి శ్రీకర్.ఒకసారి శ్రీకర్ క్రింద పడిపోయాడు.దెబ్బ తగిలింది.చరణ్ ఆఫీసు నుండి వచ్చినతర్వాత ఆవిషయం తెలిసి సుఖదను గదిలోకి తీసుకెళ్ళి చేతులు వెనక్కి కట్టేసి ఒక చేత్తో నోరుమూసేసి చెంపలు గట్టిగా ఎడా పెడా వాయించేశాడు.పిల్లాడిని తల్లి కావాలని  ఎత్తి పడేయదు కదా.పిచ్చి ఆవేశంతో శాడిస్టులాగా  ప్రవర్తించటంవలన సుఖదమనసు బాధపడింది.
అసలే తెల్లగా ఉన్న సుఖద బుగ్గలు ఎర్రగా కందిపోయి బూరెల్లా అయిపోయినాయి.ఉదయం చరణ్ ఆఫీసుకి
వెళ్ళగానే స్నేహితురాళ్ళకు ఫోనుచేసి బావురుమని ఏడ్చేసింది.వాళ్ళందరూ సుఖద తల్లిదండ్రులకు
చెప్పగానే వాళ్ళు పరుగెత్తుకుని వచ్చారు.సుఖదను మేనత్త కొడుక్కి ఇచ్చారు.అందం ఉండగానే సరిపోయిందా
బుద్దిలేనప్పుడు ఎందుకు?పిల్లలు పడటం సహజం అంతమాత్రాన తల్లిని రాక్షసుడిలాగా కొట్టటమేమిటి?అనిచరణ్ తల్లిదండ్రులను కూడా పిలిపించి  మాఅమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతాము అన్నారు.చరణ్
తప్పయింది ఆవేశంలో అలా ప్రవర్తించాను ఇంకెప్పుడూ అలాచేయను అని చెప్పాడు.అటు పెద్దవాళ్ళు ఇటు
పెద్దవాళ్ళు ఆవేశం అనర్ధదాయకం ఇంకెప్పుడూ పిచ్చిపనులు చేయకు అని బుద్ది చెప్పి వెళ్లారు.అప్పటినుండి బుద్దితెచ్చుకుని,ఆవేశాన్నితగ్గించుకుని భార్యను ,పిల్లలను బాగా చూసుకోవటం మొదలెట్టాడు.

సుభాషితరత్నాలు

జీవన మాధుర్యాన్ని అర్ధం చేసుకొనేందుకు,ఆస్వాదించటానికి కూడా సహృదయం ఉండాలి.

సహ్రుద్భావం సంఘజీవనానికి అంతరాత్మలాంటిది.అప్పుడప్పుడు గాయాలు తగిలినా దానికి వుండే విలువ  ఎప్పుడు ఉంటుంది.

దురదృష్టం,విదిప్రాతికూల్యం కొన్ని సందర్భాలలో మానసికశక్తుల్ని కప్పివేసే మాట వాస్తవమే కానీ పోరాడే
స్వభావం ఆతెరలను తొలగించగలదు.

స్వార్థమే కాదు అహం కూడా మనిషిని బానిసగా చేసుకొని అనాగరిక ప్రవర్తనకు దరి చూపుతుంది.అహంభావిని ప్రయత్నపూర్వకంగా కూడా ఎవరూ ప్రేమించలేరు.

జీవితంలో అతిక్లిష్టమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యంగా కావాల్సింది ఆత్మస్థయిర్యం.

ఎట్టిపరిస్థితుల్లోనూ మనల్ని ద్వేషించేవారి ఇక్కట్లను(కష్టాలను),భాదల్ని అవహేళన చేయకూడదు.

జీవితంలో మనోనిగ్రహము,క్రమశిక్షణల అవసరం ఎంతయినా ఉంది.

సుస్థిర ఆర్ధిక భద్రతలకు పొదుపరితనం నిజంగా గుండెకాయ లాంటిది.

నీ విజయాలను నీఅంతట నీవే చెప్పుకోవలసి వస్తే సాధ్యమైనంత తగ్గించి చెప్పుకోవటం మంచిది.

వ్యక్తిత్వమున్న మనిషి ఎప్పుడు నిజాయితీని కాలదన్నకూడదు.కార్యదక్షుడి చేతుల్లో నిజాయితీని మించిన
పదునైన ఆయుధం మరొకటి లేనేలేదు.అంత్యనిష్టురం-ఆది నిష్టురం

మనమందరం తప్పించుకోలేం గానీ ముఖమాటంలో పడటమంత మూర్ఖత్వం మరోటి లేదు.ఇందువల్ల మనిషి  ఎదో ఒక సందర్భంలో చిక్కుల్లో పడే ప్రమాదముంది.ఒకసారి సుభద్ర స్నేహితురాళ్ళల్లో ఒకామె కొద్దిరోజుల క్రితమే పరిచయమైంది.అయినా చొరవగా మూడు లక్షల రూపాయలు అప్పు ఇవ్వమని అడిగింది.డబ్బుఇచ్చి పగ    పిల్లనిచ్చి పగ అని శాస్త్రం.అందుకని సుభద్ర మాదగ్గర అప్పు ఇచ్చేంత డబ్బులేదు ఏమీ అనుకోవద్దు అని చెప్పింది.
అయినా కొద్దిపాటి పరిచయంతోనే డబ్బు అడగటమేమిటి?అవతలకు వెళ్ళిన తర్వాత ఏమి అనుకుంటారు?అనుకోకుండా అడిగేసింది.ఎవరయినా కష్టపడనిదే డబ్బురాదు కదా,డబ్బు చెట్లకు కాయదు కదా ,కాయలైనా  ఊరికే ఇచ్చేరోజులు కాదు.ఆమె సంపాయించే డబ్బుతో ఎలా తీర్చగలదు పోనీలే అని ఇచ్చి తర్వాత భాద పడే కన్నా ముందే మేల్కోవటం మంచిదనీ,అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలనీ అలాచెప్పింది.అందుకని డబ్బుఅడిగిన ఆమె సుభద్ర గురించి దుష్ప్రచారం చేయటం మొదలెట్టింది.

రత్నాల్లాంటి వాక్యాలు

ఇతరులకు సంతోషం కలిగించే పనే నిజంగా మంచిపని.
మంచిపని కోసం పాటుపడితే హృదయం విశాలమౌతుంది.
సంతృప్తి అనేది సహజ సంపద వంటిది.
సత్యము,అహింస ఈ రెండూ నీ ఊపిరితిత్తులు.
విశ్వంలో చాలా ఖరీదైన వస్తువు ఆత్మ.
సత్యం సర్వోత్తమమైనది.సత్యమయజీవితం అంతకంటే సర్వోత్తమమైనది.
నిర్మలహృదయం లేనివాడు,ఉద్రేకాలను అనుచుకోలేనివాడు విద్యావంతుడు కానేరడు.
దానం కోసం లోభి పరితపించేట్లు నీ ఉత్తమలక్ష్యం కోసం నీవు పరితపించు.
శూన్యములో  శాంతిని సాధించలేము.
పేదరికం ప్రతిభకు తల్లిలా చేయూతనిస్తుంది.
శాంతి కేవలం ఒక స్వప్నం మాత్రమేకాదు.ప్రత్యక్షంగా ప్రజలకు అత్యవసరమైన విషయం.జీవితానికి పట్టుకొమ్మ.
ఆకలిదప్పుల లాగా సౌందర్యం పట్ల అభిరుచి కూడా ఒక సహజమైన వాంఛ.
మనమెంత అధ్యయనం చేస్తామో అంతగా మన అజ్ఞానాన్ని తెలుసుకోగల్గుతాము.
అసమానత నుండి హింస,సమానత నుండి అహింస పుడతాయి.
ఈప్రపంచం మార్పును ద్వేషిస్తుంది.కానీ మార్పు మాత్రమే అభివృద్దిని కనపర్చగల ఏకైక సాధనం.

రహస్యం

                                                  వినీల,వినీత ప్రక్క ప్రక్క ఇళ్ళల్లో ఉంటారు.మంచి స్నేహితులు.ఒకరోజు పిచ్చాపాటీ మాట్లాడుతుంటే వినీల మనం మంచి స్నేహితులమయినా ఎప్పటినుండో ఒక విషయం అడుగుదామని అనుకుంటున్నాను అడగలేక ఊరుకుంటున్నాను అని చెప్పింది.పర్వాలేదు నాదగ్గర  మొహమాటమెందుకు అడగమని వినీత అంది.నువ్వు ఏసమయంలోనయినా అంత చలాకీగా,తాజాగా ఎలాఉంటావు?పైగా ఉన్న వయస్సుకన్నాతక్కువగా ఎలా కనిపిస్తావు?ప్లీజ్ నాకు ఆరహస్యం చెప్పవా అనిఅడిగింది.దీనిలో రహస్యం ఏమీలేదు.నేను ఏ విషయం గురించీ అతిగా ఆలోచించను.ఎదుటివారి స్వవిషయాల గురించి అస్సలు పట్టించుకోను.ఈర్ష్య,అసూయ,ద్వేషాలకు దూరంగా ఉంటాను.ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఈచెవితో విని ఆచెవితో వదిలేస్తాను.ఆవేశపడి కోపం తెచ్చుకోను.అవసరమైతే ఎదుటివారికి సహాయం చేస్తాను.ఎవరైనా నాకు పలానా సమస్య వచ్చిందని సలహా అడిగితే తోచిన సలహా ఇస్తాను.మంచి ఆహారంఅంటే పండ్లు,కూరగాయలు,చిరు ధాన్యాలు,తక్కువ నూనెతో చేసిన పదార్దాలు తీసుకుంటూ,కొంచెంసేపు వ్యాయామం చేస్తూ,మంచి పుస్తకాలు చదువుతూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాను.సాద్యమయినంత వరకు చెరగని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటాను.నన్ను ఇదే ప్రశ్నవైద్యురాలితోసహా చాలామంది అడిగారు.చిరునవ్వే సమాధానం ఇచ్చాను.నువ్వు అడిగావు కనుక చెప్పాను.రేపటినుండి నువ్వుకూడా అలాఉండటానికిప్రయత్నించు.కష్టమైన పనేమీ కాదు.నువ్వూ నాలాగే కనిపిస్తావు అనివినీత వినీలకు చెప్పింది.అమ్మో చాలా కష్టం నాకుఊరందరి విషయాలు కావాలి లేకపోతే నిద్రపట్టదు.నేను నీలాగా కనిపించాలంటే అవన్నీ కష్టమైనా పాటించటానికి ప్రయత్నిస్తాను అని వినీల చెప్పింది. రోజుకి 8 గ్లాసుల నీళ్ళు త్రాగాలి.కీర,పుచ్చకాయలు తినాలి.కంటినిండా నిద్రపోవాలి.ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పి తగవులు పెట్టకూడదు  సుమీ  అని వినీత చెప్పింది.నాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు అని వినీల వినీతకు చెప్పింది.


Wednesday, 23 April 2014

కల్లబొల్లి కబుర్లు

                   శ్రీమంతిని చదువుకునే రోజుల్లోవాళ్ళ ఊరునుండి కళాశాలకు ఒక పదిమంది కలిసి బస్సులో
వెళ్ళేవాళ్ళు.సృజన శ్రీమంతినికి జూనియర్. చామనచాయతో ఒకమాదిరి అందంతో ఉండేది.సృజనను వాళ్ళ అన్నయ్య న్యాయవిద్య పూర్తిచేసిన ధనవంతుల అబ్బాయికి చెల్లిని ఇచ్చి పెళ్ళి చేద్దామని వాళ్ళింటికి వెళ్ళాడు.వాళ్ళు కుటుంబ స్నేహితులు. మాఅబ్బాయి మీఊరిలో శ్రీమంతిని అనేఅమ్మాయిని ఇష్టపడుతున్నాడు.వాళ్లకు కూడా మా సంబంధం  ఇష్టమైతే  వాళ్ళతో మాట్లాడదామని అనుకుంటున్నాము .
 అందువల్ల మీరు ఏమీ అనుకోవద్దు అని చెప్పారు.ఆవిషయం సృజన అన్నయ్య  ఇంట్లోవాళ్లకు మన ఊరిలో ఉన్న శ్రీమంతినిని చేసుకుందామనే ఉద్దేశ్యం వాళ్ళఅబ్బాయికి ఉందని మాకూఇష్టమేనని ఏమీ అనుకోవద్దని చెప్పారని చెప్పాడు.దాంతో సృజన అహం దెబ్బతిని నన్నుకాదని శ్రీమంతిని అందంగా ఉంటుందని ఆమెను చేసుకుందామని అనుకుంటున్నారా? అలా డైరెక్టుగా ఆమెను చేసుకుందామని చెప్పటమేమిటి? మనం ఎలా కనిపిస్తున్నాము?
 అని కోపంతో ఊగిపోయింది.కళాశాలకు వెళ్లి స్నేహితుల దగ్గర శ్రీమంతిని గురించి అవాకులు చెవాకులు పేలింది.
 కల్లబొల్లి కబుర్లు చెప్పింది.శ్రీమంతిని కోసం రోజు బస్సులో ఒక లాయరు వస్తాడు.శ్రీమంతిని పుస్తకాలు,హ్యాండ్బాగ్  మోస్తాడు.బస్సులో సీటు అట్టిపెడతాడు అనిచెప్పింది.ఆమెస్నేహితురాలు వచ్చి శ్రీమంతిని అడిగింది.శ్రీమంతిని
వెళ్ళి సృజనను అలా చెప్పటం ఏంటని నాలుగు దులిపేసింది.అవును ఊరికే అబద్దంచెప్పాను.మా అన్నయ్య నన్ను చేసుకోమని వాళ్ళింటికి వెళితే వాళ్ళఅబ్బాయి నిన్నుఇష్టపడుతున్నాడుఅన్నారుఅందుకే అలాచెప్పాను.
నాదే తప్పు సారీ  అని చెప్పింది.ఇంకెప్పుడూ ఎవరి గురించీ కల్లబొల్లికబుర్లు చెప్పకు అని సృజనకు శ్రీమంతిని
బుద్ది చెప్పింది.

Tuesday, 22 April 2014

గొప్పలు

     గొప్పలు చెప్పుకోవటం ఎప్పుడు మంచిది కాదు.మొదట్లో ఉన్న గొప్పలు చెప్పుకుంటారు.తర్వాత లేని గొప్పలు చెప్పుకుంటారు.ఆచెప్పుకున్నవి నిజం చెయ్యటం కోసం అబద్దాలు కల్పించుకుంటారు.జస్వంత్ నేనే అందరికన్నా
గొప్పవాడినని చెప్పుకోవటానికి తాపత్రయ పడుతుంటాడు.నాకు ఎమ్మెల్యేలు,ఎంపీలు,మినిస్టర్లు తెలుసు అంటూ
కోతలు కోస్తూ ఉంటాడు.నీకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పావు కదరా ఫలానా పని చేయించి పెట్టు అంటే ఎదో ఒక కథ వినిపిస్తాడు.ఎవరికి ఎవరు తెలిసినా,ఎవరు చుట్టాలయినా ఏమి గొప్ప వాడు ఏమైనా సాధిస్తే వాడికి గొప్ప అంతేకానీ పిచ్చివాడిలాగా గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అందరూ హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు.

మోనా మంకీ

     గ్రెనెడా చాలా అందమైన ద్వీపం.మోనా మంకీ గ్రెనెడా లో ఉంటుంది.అక్కడి రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే కనిపిస్తుంది.రెయిన్ ఫారెస్ట్ లోపలకు వెళ్తే కనిపిస్తుంది.దానికి ఎవరయినా చూడటానికి వెళ్ళినవాళ్ళు కవరుతో
ఉన్న తినుబండారాలను ఇస్తే తింటుంది.లేకపోతే  విసిరి పడేస్తుంది.అరటిపండు ఇస్తే చక్కగా తొక్కను నాలుగు భాగాలుగా తీసి కొంచెం తిని మళ్ళీ కొంచెం తొక్క తీసి తింటుంది.చాక్లెట్ ఇస్తే పైకవరు గట్టిగా ఉంటే కష్టపడి తీసి
తినేసింది.మోనా మంకీ ప్రత్యేకత అదే.గైడ్ విచిత్ర శబ్దం చేసి పిలిస్తే వచ్చింది.టూరిస్టులు తినటానికి ఎదో ఒకటి ఇస్తుంటారు కనుక తీసుకుని వెళ్లిపోతుంటే గైడ్' హే బోయ్ డోంట్ గో ' అంటే కుర్చుని ఫోటోకి ఫోజులిచ్చింది.

స్త్రీ

స్త్రీ ఆలోచనలో హృదయం కనిపిస్తుంది.పురుషుని హృదయంలో అతని మేధస్సు ప్రతిబింబిస్తుంది.

వివాహం అయిన స్త్రీకి భర్త ఒక్కడే మంచి స్నేహితుడు.అతనిని కాదని మరోకస్త్రీతో స్నేహం చేసిందంటే ప్రమాదమే.

స్త్రీ శాసిస్తున్నదంటే ఆంతర్యం లో విధేయురాలనే అర్థం.

సౌష్టవం కల స్త్రీ నగతో సమానం.సౌశీల్యం కల స్త్రీ సంపదతో సమానం.

ఏ స్త్రీ తప్పు చేసినా వాటన్నిటికీ పురుషుడే కారకుడు.అతని మూర్ఖత్వమో దుష్టస్వభావమో స్త్రీల చేత తప్పులు చేయిస్తుంది.

స్త్రీలతో సంభాషించటం నిజంగా ఒక కళ.తన కంటే తక్కువవాడని అనుకున్న మగవాడిని ఏ స్త్రీ ప్రేమించదు.

ఆరాధన లేకుండా ప్రేమిస్తే అది స్నేహమే కానీ ప్రేమ కాదు.స్త్రీ  ప్రేమ దీర్ఘంగా ఉండి నిరీక్షణలో వృద్ది పొందుతుంది.

పరోపకారం

           చెట్లు పండ్లను ఇస్తున్నాయి.నదులు తియ్యటి నీళ్ళను ప్రవహిమ్పచేస్తున్నాయి.ఆవులు బలవర్ధకమైన పాలను ఇస్తున్నాయి.ఎవరూ అడగకుండానే ఇవన్నీ ఈపనులు ఎందుకు చేస్తున్నాయంటే పరులకు ఉపకారం
చేయడంకోసమే.కనుక ఈశరీరాన్ని  కూడా ఇతరులకు ఉపకారం చేయటం కోసమే వినియోగించాలి.
           హిమజ వాళ్ళ అమ్మమ్మ తను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని వైద్యకళాశాలకు డొనేట్ చేసింది.
ఎంతోమంది వైద్యవిద్యార్ధులకు ఎనాటమీ ప్రాక్టికల్స్ అప్పుడు ఉపయోగపడుతుందని తను బ్రతికుండగానే
వైద్యకళాశాల వాళ్ళను పిలిపించి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసింది.దహనం చేస్తే తప్ప ముక్తి కలుగదు అని
అనుకోకుండా భావితరాలకు ఉపయోగపడాలనే నిర్ణయం తీసుకున్నందుకు అందరూ ఆమెను అభినందించారు.

Monday, 21 April 2014

నీచాతి నీచం

        రామన్ ఒకప్రభుత్వోద్యోగి. లంచం లేనిదే ఏపనీచేయడు.అవి చాలవన్నట్లు తల్లిదండ్రులు ఇచ్చినఆస్థికాక   వాళ్ళుతినటానికి ఉంచుకున్నదాన్నికూడా అన్నకు ఇస్తారేమోనని మాయమాటలు చెప్పి తినటానికి లేకుండా
మొత్తం రిజిస్టరు చేయించుకున్నాడు.తాను చెడ్డకోతి వనమంతా చెరిచినట్లు అక్కకు లేకుండా అక్కకొడుక్కి కూడా
రిజిస్టరు చేయించాడు.జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు వీడికి వాడి సపోర్టు.రామన్ కొడుకు వయసుకి తగినట్లు ఎదగలేదు.పెళ్లి వయసు వచ్చింది.మాములుగా అన్నీ సక్రమంగా ఉంటేనే పిల్లనిచ్చే దిక్కు లేని రోజులు. అటువంటిది రామన్ పిన్నికి పిల్లలు లేకపోతే అక్క మునిమనుమరాలిని పెంచుకుని వీడికి డబ్బు ఉందని ఆపిల్లని ఇవ్వటానికి సిద్దమైంది.పిల్లాడికి మాట కూడా సరిగ్గా రాదు.పిన్నికున్న ఆస్థి మొత్తం పిల్లకు రాస్తేనే కొడుక్కి పిల్లను చేసుకుంటానన్నాడు రామన్.పిల్లను ఇవ్వటమే ఎక్కువ. ఆస్థితినటానికి కూడా లేకుండా ముందే ఇవ్వమనటం
ఎంత నీచాతి నీచం.నిశ్చితార్దం అయిన తర్వాత పేచీ పెట్టుకుని  పిన్నికి మాయమాటలు చెప్పి ఇప్పుడు సగం పిల్ల పేరుమీద మిగిలిన సగం వాళ్ళ తదనంతరము పిల్లకు చెందేలా రిజిస్ట్రేషనుచేయించి ఇచ్చేట్లుగా ఒప్పించాడు. తనకొడుకు తిన్నగా లేడు ముందుముందు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి.అయినా ఆస్థి ముందే ఇవ్వమని
ఒత్తిడి చేయటం నీచాతి నీచమైన బుద్ది.

విచిత్రం

        అనీల మామయ్య చనిపోతే తెనాలి దగ్గరున్న పల్లెటూరికి వెళ్ళింది.అనీల వెళ్ళేటప్పటికి వాళ్ళ మామయ్యను
బయటకు తీసుకొచ్చి పడుకోబెట్టి స్మశానానికి తీసుకెళ్ళటానికి  సిద్ధం చేస్తున్నారు.ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.పెద్దాయన్ని పడుకోబెట్టిన ప్రదేశానికి దగ్గరలోనే  ఉన్నఒక పెద్ద బొప్పాయిచెట్టు పెళపెళా విరిగి క్రింద పడిపోయింది.చెట్టునిండా పెద్దపెద్ద కాయలు పండటానికి సిద్దంగా ఉన్నాయి.కాయలు ఎవరి కంటా పడకుండా ఒక చొక్కా ఆయనదే చుట్టించేశాడు. ఆ చెట్టు అంటే ఆయనకు చాలా ఇష్టమనీ,రోజు నీళ్ళు పొయ్యనిదే ఊరుకునేవాడు కాదనీ,చనిపోయేముందు కూడా ఆచెట్టుకు నీళ్ళు పోయించాడనీ,కాయలు ఎవరినీ కొయ్యనిచ్చేవాడు కాదనీ,
ఆయన చనిపోగానే ఆచెట్టుపడిపోవటం వింతగా ఉందనీ అందరూ ఆశ్చర్యపోయారు.

Sunday, 13 April 2014

మిరియాలు-ఉపయోగాలు

1)మిరియాలపొడి,పెరుగు కలిపి తింటే జలుబు తగ్గుతుంది.
2 )కుక్క కరిచినప్పుడు కరిచిన స్థలంలో మిరియాలపొడిని వేసినచో  భాద తగ్గి గాయం మానిపోవును.
3)మిరియాలు,వేపాకు, నీళ్ళు కలిపి మిక్సీలో వేసి వడకట్టి ఆనీళ్ళు   త్రాగినచో శరీరంలో దురదలు మాటుమాయమౌతాయి.
4)మీకు ఆకలి వేయటం లేదా?అయితే 15మిరియాలు పొడిచేసి ఒక పెద్దస్పూను తేనెలో కలిపి ప్రతిరోజూ తిన్నచో
కరకర ఆకలి వేస్తుంది.
5)మిరియాలు పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.ఇది ముఖ్యంగా స్త్రీలు ప్రతిరోజూ తీసుకుంటే
నెలసరి దోషములున్నవారికి నయమవుతుంది.
6)అరటిపండు పైన మిరియాలపొడి చల్లి పిల్లలకు తినిపిస్తే అజీర్తి చేయదు. 

Thursday, 10 April 2014

నిర్వచనాలు

న్యాయవాది   -  ఏ పార్టీ ఫీజు ఇస్తే ఆపార్టీ కేసు  న్యాయమనిపించేవాడు.

సన్యాసి          -  భాదలేని జీవితాన్ని గడపటానికి భాదపడేవాడు.

శాంతి           -   యుద్దానికి యుద్దానికి మధ్య విశ్రాంతి.

ప్రార్ధన         -    అర్ధం కానివాడిని అర్ధించటం.

అద్దం          - నిన్నుగురించి నీతోనే పచ్చి అబద్దం పలికేధి.

రాజకీయం - ప్రజాజీవితంలో కజ్జాలు కల్పించే కల్మషం. 

దుర్భిణి

      కిరణ్మయి ఇంటి ఎదురుగా ఉన్న ఇంటిలో ఒక కుటుంబం అద్దెకు దిగింది.ఆమె వయస్సు యాభై సంవత్సరాలు

ఉండొచ్చు.ఎవరితో ఏమీ మాట్లాడదు. ఒకరోజు కిరణ్మయి ఇంటి ప్రక్కనఉన్న వైశాలిని వర్షంపడేలా ఉందని
 
వాతావరణం ఎలా వుందో చూచి తలుపులు వేద్దామని బాల్కనీలోకి వచ్చింది.వైశాలిని కొంచెం తలుపు తెరచి
 
చదవటం కానీ,వ్రాయటం కానీ చేస్తూ ఉంటుంది..క్రొత్తగా వచ్చినామె దుర్భిణితో అంటే బైనాక్యులర్ తో వీళ్ళ

ఇంటివైపు చూస్తూ కనిపించింది.అకస్మాత్తుగా వైశాలిని బాల్కానీలోకి వస్తుందని ఊహించలేదు.కంగారుపడి

దుర్భిణిని వెనక్కు పెట్టేసింది.ఈమెకు ఇదేమి చెండాలపుఅలవాటు ఎదురింట్లో,ప్రక్కింట్లో ఏమిజరుగుతుందో

అని  దుర్భిణి సహాయంతోచూడటం సాంకేతికపరిజ్ఞానాన్ని ఈరకంగాకూడా ఉపయోగించుకుంటున్నారు కాబోలు

అనుకుని ఒకవిచిత్రమైన చూపు చూచి ధడేల్మని వైశాలిని తలుపు వేసేసింది.తను అలా చూడటం వైశాలిని

చూసిందని అప్పటినుండి బయటకు వచ్చి చూడటం మానేసింది.

శ్రేష్టుడు

ధనవంతుని కంటే బంధువు శ్రేష్టుడు.బంధువు కన్నా వయస్సులో పెద్ద అయినవాడు శ్రేష్టుడు.వయోధికుని కంటే
క్రియావంతుడు ఉత్తముడు.క్రియావంతుని కంటే కూడా విద్యావంతుడు మిక్కిలి శ్రేష్టుడు.కనుక విద్యావంతుడు
 అందరి కన్నా శ్రేష్టుడు.
                 పాముపడగమీద ఎంతో విలువైన మణి ఉంటుంది.అయినా విషజంతువు కనుక మనం దానిని చూచి
దూరంగా తొలగిపోతాము.అలాగే ఎంతటి విద్య ఉన్నాదుర్జనుడైతే త్యజించవలసిందే.ఆవిద్యవల్ల ఉపయోగంలేదు.
విద్యావంతుడు "విద్యావంతుణ్ణి" అని చెప్పుకోవటంతోనే విజ్ఞానాన్ని కోల్పోతాడు."విద్యయొసగును వినయమ్ము"
అని నానుడి.కానీ ఇప్పుడు వినయం మాట దేముడెరుగు అహంకారం ఎక్కువగా కనిపిస్తుంది.చిన్న,పెద్ద అని తేడా
లేకుండా చదువుకున్నామనే గర్వంతో ఏమాట పడితే ఆమాట ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అనే ఇంగితజ్ఞానం
లేకుండా మాట్లాడేస్తున్నారు.చదువుతోపాటు గర్వం పెరగకూడదు.అప్పుడు ఆచదువు వ్యర్దమవుతుంది.

తెలుసా?

1)సృష్టిలో మొదటి పక్షి రెక్కల బల్లి.

2 )మాస్కోలో రాత్రి పదిగంటల వరకు సూర్యుని వెలుగు ఉంటుంది.

3 )మామూలు బల్బు కంటే 47,300రెట్లు ఎక్కువ కాంతినిచ్చే ఏకైక పెద్దబల్బు జపాన్లో ఉంది.

4 )తిమింగలం 500 ఏళ్ళు బ్రతుకుతుంది.దీని కంటే ఎక్కువకాలం బ్రతికే ప్రాణి లేదు.

5 )చంద్రుడు భూమికిచ్చే వెలుగు కంటే భూమి చంద్రుడికి 90రెట్లు ఎక్కువ కాంతినిస్తుంది.

6 )ప్రపంచంలో పోస్టల్ పద్దతిని 1630లో అమెరికాలో ప్రవేశపెట్టారు.

7)ప్రపంచంలో ఎక్కువ బ్రాంచీలు ఉన్న బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా.

8)ఒకమెరుపు 250 కోట్ల ఓల్టులవిద్యుత్ శక్తికి సమానము.

 9)ప్రపంచంలో కెల్లా పెద్ద దేవాలయం కంబోడియాలో ఉంది.402 ఎకరాల స్థలంలో వైష్ణవాలయాన్ని రెండవ సూర్యవర్మ 12వ శతాబ్దంలో నిర్మించాడు.

10)ప్రేమ ప్లస్ అయితే మైనస్ పెళ్లి. 

Tuesday, 8 April 2014

గుర్తులే మనుషులైతే

       ప్లస్          +  అబ్బాయి    - కట్నం వస్తుంది కాబట్టి
      మైనస్         -   అమ్మాయి   -కట్నం ఇవ్వాలి కాబట్టి
     ఇంటూ       *   భార్య *భర్త   -జనాభాను హెచ్చిస్తారు కాబట్టి
     కొడుకులు -  డివై డెడ్ బై  -  ఆస్తిని పంచుకుంటారు కాబట్టి
      అల్లుడు,అప్పులవాడు     =  అల్లుడు అప్పులవాడితో సమానం (ఈజ్ ఈక్వల్ టూ)
     బంధువులు,స్నేహితులు > బంధువుల కన్నా స్నేహితులు గొప్ప(గ్రేటర్ దాన్)
   కూతురి కొడుకు }<కూతురి కొడుకు వంశోద్ధారకుడుకాదు కాబట్టి (లోయర్ దాన్ )
  కొడుకు కొడుకు  }  కొడుకు కొడుకు కన్నా తక్కువ
ఆఫీసు ,ఇల్లు      -ఆఫీసు ఇంటికన్నా ఎక్కువేమీ కాదు( ఈజ్ నాట్ గ్రేటర్ దాన్)
కోడళ్ళు       -    ఖర్చు పెట్టడంలో చిన్నకోడలు పెద్దకోడలు కన్నా
                       తక్కువేమీ కాదు (ఈజ్ నాట్ లోయర్  దాన్)
దేర్ ఫోర్     -జీవితమంతా లెక్కల మయం
      గుర్తులు టైప్ చేయలేని కారణంగా వ్రాయలేదు.ఒకప్పుడు పైవిధంగా అభిప్రాయపడేవారు.ఇప్పుడు ఎవరూ
అలా  అనుకోవటం లేదు.రోజులు మారినాయి కదా అందుకని అందరూ సమానమనే ఆలోచనతో ఉంటున్నారు.

అత్యంత సంతానోత్పత్తి

ప్రపంచంలో అత్యంత సంతానోత్పత్తి చేయగలవి రాక్షస నత్తలు.రాక్షస నత్తలు ప్రతి మూడు రోజులకు ,ఒక్కొక్కసారి

 రెండు రోజులకు మూడు వందల రెట్లు అధికం అవుతాయి.వీటి తర్వాత కుందేళ్ళు.ఓ ఆడ,మగ కుందేళ్ళను ఒక

గదిలో ఉంచితే ఇరవైనాలుగు రోజుల తర్వాత ఆగది కుందేళ్ళతో నిండిపోతుంది.రెండు ఎలుకల్ని ఒక బోనులో పెట్టి

ఒక సంవత్సరం ఉంచితే ఆ జత ఎలుకలు నాలుగు వందల ఎలుకల్ని పుట్టిస్తాయి.

ఇంటికి దీపం ఇల్లాలు

భార్యను ఒక విలాసవస్తువుగా కాక ఒక అమూల్యమైన వరంగా భావించి హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు

ఆమెద్వారా పొందే ఆనందం,గౌరవము మానవుడు జీవితంలో మరేవిధంగాను పొందలేడు.భార్యకన్నా తను

అధికుడినన్న అహం ఉన్న ఏభర్తా ఆమె మనసులో పూర్తి స్థానాన్ని పొందలేడు.ఇల్లాలి ప్రేమపూర్వకమైన

ధైర్యవచనాలు ఆత్మస్థయిర్యాన్ని కంచుకోటలా తయారు చేస్తాయి.స్త్రీత్వాన్ని ఎప్పుడూ కించపరచకూడదు.

అది ఎంతో పవిత్రమైనది.తన భార్య పట్ల త్రుణీకారభావంతో ఉండేవాడు ఇతర స్త్రీల విషయంలో ప్రదర్శించే

కృత్రిమమైన గౌరవం భార్య మనసులో మరింత దురభిప్రాయాన్ని పెంచుతుంది.భార్యను తగ్గించి మాట్లాడటం

ద్వారా స్థానం పెంచుకుందామనుకోవటం వెఱ్రి భ్రమ.ఇంటికి దీపం ఇల్లాలే.ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంటే

ఇల్లు కళకళలాడుతుంది.ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉంటారు.ఇది తెలిసినవారి జన్మ ధన్యమైనట్లే .

సుభాషితాలు

1)మనిషి అయినవాడికి లోకవ్యవహారం తెలిసి ఉండాలి.భయము,సిగ్గు ,ధర్మగుణం,దయాగుణం కూడా ఉండాలి.

   ఈ ఐదుగుణాలు లేనిమనిషితో స్నేహం చేయకూడదు.

2)మనిషిలో అతివిలువైనది సహృదయత.

3)మనసు కంటే వేగమైనది కోరిక.

4)వ్యక్తిత్వమున్నమనిషి ఎవరూ నిజాయితీని కాలదన్నకూడదు.కార్యదక్షుడి చేతుల్లో నిజాయితీని మించిన

పదునైన ఆయుధం మరొకటి లేదు.

5)యవ్వనం ఒక ప్రవాహం లాంటిది.దానికి సరైన ఆనకట్ట వేసి ఆనీటిని మళ్లించినప్పుడే జీవితం ధన్యమవుతుంది.


శ్రీరామ నవమి శుభాకాంక్షలు

తెలుగువారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.రామరాజ్యంలో వలె దేశం సుభిక్షముగా,సుపరిపాలనతో,
అవినీతి అంతమొంది,ప్రజలందరూ సుఖసంతోషాలతో,సత్ప్రవర్తనతో ఉండాలని సీతారామలక్ష్మణ ఆంజనేయుల కృపాకరుణాకటాక్ష వీక్షణాలుమనందరిపై ప్రసరింపచేయాలనీ మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను.