Wednesday, 30 July 2014

దోసకాయ-వంకాయ పచ్చడిముక్కలు

     దోసకాయ - 1 చిన్నది
     వంకాయలు - 1/4 కే.జి
     పచ్చిమిర్చి - 10
     చింతపండు లేదా టొమాటోలు - చిన్న నిమ్మకాయంత లేక  2
     జీరా - 1 స్పూను
    వెల్లుల్లి - 6 రెబ్బలు
    కరివేపాకు,కొత్తిమీర - కొంచెం
    నూనె - సరిపడా
    తాలింపు దినుసులు,పసుపు - కొంచెం
                       బాండీలో నూనెవేసి పచ్చి మిర్చి మధ్యకు కట్ చేసి వేయించాలి.తర్వాత వంకాయలు గుండ్రంగా కోసి వేయించుకోవాలి.రోలు ఉంటే రోట్లో నూరితే బాగుంటుంది లేకపోతే మిక్సీలో నలిగీ నలగకుండా తీసేయాలి.టొమాటో
వేసేట్లయితే వేయించుకోవాలి.లేదంటే చితపండు వెయ్యొచ్చు.రెండురకాలుగా చేసుకోవచ్చు.రెండు రుచిగా ఉంటాయి.జీరా,వెల్లుల్లి కూడావెయ్యాలి.దోసకాయ మధ్యకు కోసి లోపలి గింజలు తీసేసి చిన్నచిన్న ముక్కలుగా కోసి పచ్చడిలో కలుపుకోవాలి.దీన్నిఒక బౌల్ లో తీసుకుని తాలింపు వేసుకోవాలి.కొత్తిమీర పచ్చిగానైనాతాలింపులోనైనా వేసుకోవచ్చు. నోరూరించే వంకాయ-దోసకాయ పచ్చడిముక్కలు రెడీ.ఇది అన్నంలో చాలా బాగుంటుంది.   

నీదీ నాదే,నాదీ నాదే

                                           ఇంతకు ముందు రోజుల్లో ఏ శుభకార్యం జరిగినా నీఇంట్లోదైనా,నాఇంట్లో దైనా ఒకటే మనందరమూ ఒకటి అనుకుని దగ్గరుండి పూర్తి అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు.అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళు,దగ్గరి బంధువులు,స్నేహితులు పదిరోజుల ముందే వచ్చి సందడి సందడిగా ఉండేవాళ్ళు.ఇప్పుడు పది రోజుల మాట దేవుడెరుగు ఆరోజు రావటానికి కూడా బాధపడుతున్నారు.ఇది ఇలాఉంటే ఒకాయన  దగ్గరి వాళ్ళింట్లో అయినా
స్నేహితులింట్లో అయినా ఎవరూ చెప్పకుండానే తన తరఫున ఒక 200మంది స్నేహితులను,ఆఫీసువాళ్ళను
తీసుకొస్తాడు.అదే వాళ్ళ ఇంట్లో అయితే ఎరగనట్లుగా వాళ్ళను మాత్రమే పిలిచి మీ దగ్గరివాళ్ళను పిలుచుకోండి అని చెప్పకుండా నాకు ఏమీ తెలియదు ఎవరినైనా పిలవాలంటే చెప్పండి అంటాడు.ఎవరైనా ఏమి చెప్పగలరు.అందరి
ఇళ్ళకు తీసుకొస్తాడు కనుక అందరినీ అలాగే తీసుకురమ్మంటే చాల ఖర్చయిపోతుంది కదా!అందుకని అలా మాట్లాడతాడు.తీసుకొచ్చేటప్పుడు నీఇల్లు,నాఇల్లు ఒకటే అనుకుంటాడు.తీసుకురమ్మనాల్సినప్పుడు నాఇల్లు నా ఖర్చు అనుకుంటాడు.ఇంకొంతమంది ఏమిచేస్తారంటే ఏదైనా వస్తువు కావాలంటే ఎదుటివాళ్ళది వాళ్ళ స్వంత వస్తువు లాగా వాడుకుంటారు.ఎదుటి వాళ్ళకు ఏదైనా అవసరమనుకుంటే అదిలేదు,ఇదిలేదు అని కుంటిసాకులు చెప్తారు.సహాయమైనా ఎదుటివాళ్ళ సహాయం తీసుకోవటానికి వెనుకాడరు.ఎదుటి వాళ్ళకు సహాయపడాలంటే ఏమీ తెలియనట్లుగా ప్రక్కకు తప్పుకుంటారు.ఇటువంటి వాళ్ళ గురించి ఏమి అర్ధం చేసుకోవాలంటే వీళ్ళునీదీ నాదే,నాది నాదే అనుకునే మనస్తత్వం.ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.   

Monday, 28 July 2014

కోడి'గ్రుడ్డు' వేపుడు

         కోడిగ్రుడ్లు - 6
        ఉల్లిపాయలు - 4
        పచ్చి మిర్చి - 5
       పచ్చి కొబ్బరి  - 2 స్పూన్లు
       అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
       ఉప్పు,నూనె - తగినంత
       వేపుడు కారం - 1 టేబుల్  స్పూను
      మసాలాపొడి - 1/2 టీ స్పూను
      కరివేపాకు - కొంచెం
                                      ముందుగా కోడిగ్రుడ్లు ఉడికించి పై పెంకు ఒలిచి చాకుతో చిన్నచిన్నగాట్లు పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు చాలాసన్నగా,చిన్నగా కట్ చేసుకోవాలి.ఇదే ఈకూర ప్రత్యేకత.పచ్చి మిర్చి కూడా కట్ చేసుకోవాలి.స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేయించడానికి సరిపడా వెయ్యాలి.ముందుగా సిమ్ లో కోడిగ్రుడ్లు వేయించి ప్రక్కన పెట్టాలి.తర్వాత తాలింపుకు అవసరమైన దినుసులన్నీ,కరివేపాకు వేసి వేగినతర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.అల్లం,వెల్లుల్లి పేస్ట్ ,ఉప్పు వేసి వేయించాలి.ఉల్లిపాయ ఎక్కువ వేయించగూడదు.పచ్చి వాసనపోయి మగ్గీ మగ్గనట్లుగా ఉన్నపుడు కొబ్బరివేసి రెండుసార్లు అట్లకాడతో త్రిప్పి, వేపుడు కారం వేసి గ్రుడ్లు,మసాలాపొడి కూడా వేసి గ్రుడ్లు విడిపోకుండా అటూఇటు రెండుసార్లు త్రిప్పి తీసేస్తే నోరూరించే కోడి'గ్రుడ్డు'వేపుడు రెడీ.ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.   

ఉల్లి - కన్నీళ్ళు

                ఉల్లిగడ్డలు ముక్కలు కోసేటప్పుడు కొంతమందికి ధారాపాతంగా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి.ఆకన్నీళ్ళతో పాటు ముక్కులో నుండి కూడా నీళ్ళు కారిపోతుంటాయి.ఇంతకు ముందు రోజుల్లో అయితేమన కంట్లో ఏదైనా దుమ్ము,ధూళి ఉంటే ఆకన్నీళ్ళతో పాటు కొట్టుకుపోతాయని సరిపెట్టుకునేవాళ్ళు.ఇప్పుడురోజూ ఇబ్బందిపడకుండా,
 ముక్కలు కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఈ చిట్కాలు.
 1)ఉల్లిపాయలు 1/2 గంట ముందు నీళ్ళల్లో వేస్తే కళ్ళవెంట నీళ్ళు రావు.
2)ఉల్లిపాయలు కోసేటప్పుడు ఫ్యాన్ తిరుగుతుంటే కోసేవాళ్ళకే కాక చుట్టూ, ఇంట్లో అందరికీ కూడా కళ్ళవెంటనీళ్ళు
వచ్చేస్తాయి.అలా రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ ముక్కలమీద చల్లితే చుట్టూ ఉన్నవాళ్ళకు,కట్ చేసేవాళ్ళకు
కూడా కళ్ళవెంట నీళ్ళు రాకుండా ఉంటాయి.
3)ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళే మహిళలకు ఉదయమే అన్ని పనులు కష్టం కనుక ఉల్లిపాయలు తరిగి ముందురోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉల్లి ముక్కలతోపాటు ఒక నిమ్మకాయ సగానికి కట్ చేసి పెడితే
వాసన బయటకు వ్యాపించకుండా ఉంటుంది.4,5 రోజులు తాజాగా ఉంటాయి.సమయం ఆదా అవుతుంది.  

Sunday, 27 July 2014

చుండ్రుకు చెక్

           చుండ్రు సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంటుంది.దీని వల్ల కొంతమందికి నుదుటిమీద,వీపుమీద చిన్నచిన్నమొటిమలు వస్తుంటాయి.తరచూ తలస్నానం చేస్తుంటే కొంతవరకు ఈసమస్యను అధిగమించవచ్చు.
తలస్నానంచేసి మరీ తడిగా ఉన్నప్పుడే తల దువ్వేసి జడ,ముడి,పోనీ ఏది వేసినా పైపైన ఆరుతుంది కానీ లోపలి తడి అలాగే ఉండటంవలన కూడా చుండ్రు వస్తుంది.చుండ్రుకు చెక్ పెట్టాలంటే ఒక్క చిట్కాలు పాటించడమే కాదు. నూనె పదార్ధాలు,తీపి ఎక్కువగా ఉండే పదార్ధాలు కూడా సాధ్యమైనంతవరకు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుంది. ఈక్రింది చిట్కాలలో మీకు నచ్చినవి,వీలుగా ఉన్నవి పాటించండి.
1)1/2 కప్పు నీటిలో 2 స్పూన్ల ఉసిరిక పొడి వేసి బాగా మరిగించాలి.చల్లారాక వడకట్టి 4 చుక్కల బాదంనూనె కలిపి
తలకు మర్దన చెయ్యాలి.ఇలా వారానికి ఒకసారి చేస్తే ఫలితం ఉంటుంది.
2)4 స్పూన్ల నిమ్మరసానికి 1 స్పూన్ ఆలివ్ నూనె,3 స్పూన్ల కొబ్బరినూనె,కలిపి తలకు రాసుకుని,గోరువెచ్చటి నీటిలో ముంచిన టవల్ చుట్టాలి.అరగంటయ్యాక షాంపూతో తలస్నానం చెయ్యాలి.
3)నాలుగైదు కర్పూరం బిళ్ళలు తీసుకుని పొడిచేసి ,1/2కప్పు కొబ్బరినూనెలో మరిగించాలి.నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు మర్దన చెయ్యాలి.అరగంటయ్యాక షాంపూతో తలస్నానంచేసి గోరువెచ్చటి నీళ్ళల్లో ముంచిన టవల్ తలకు చుట్టాలి.
4 )మందారపువ్వుల్నిమెత్తగా రుబ్బి చిక్కటిరసం తీసి తలకు రాసి కాసేపయ్యాక కడిగేస్తే ఫలితం ఉంటుంది.
5 )బేబీ ఆయిల్ తీసుకుని తలకు రాసి గోరువెచ్చటి నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టేయాలి.మర్నాడు తలస్నానం చెయ్యాలి.ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు మాయం.

ఫైబ్రాయిడ్స్ నివారణకు.....

         గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ సహజంగా వస్తుంటాయి.ఇంకా సంతానం కలగని వారిలోనయితే ఆలస్యం అయ్యే
అవకాశం ఉంటుంది.సంతానం కలిగిన వారిలోనయినా ఏవయసులోవారికయినా రావచ్చు.దీనివల్ల కడుపునొప్పి,
ఇర్రెగ్యులర్  పీరియడ్స్,ఓవర్ బ్లీడింగ్ సమస్యలు వచ్చేఅవకాశం ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ నివారణకు ఈ క్రింది విధంగా ఆచరిస్తే పై ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
                          ఎండు ఉసిరికాయల పొడి - 100 గ్రా.
                          మిరియాలు - 25 గ్రా.
                                ఈ రెండింటిని విడివిడిగా పొడి చేసుకుని మొత్తం బాగా కలిపి ఒక సీసాలో పెట్టుకుని ఉదయం,సాయంత్రం 1/2 టీస్పూను చొప్పున 1/2 కప్పు నీళ్ళల్లో కలుపుకుని త్రాగాలి. 

అధిక బరువు తగ్గటానికి ....

           గోరువెచ్చని నీరు - 1 గ్లాసు
           త్రిఫల చూర్ణం - 1 స్పూను
           మంచి తేనె - 1 స్పూను
         ఇవన్నీ కలిపి ఉదయం,సాయంత్రం త్రాగాలి.
          

పొట్ట తగ్గటానికి చిట్కా

          కలబంద రసం  - 2 స్పూన్లు
         వేయించిన జీరా పౌడర్ 1/4 స్పూను
         పసుపు  - 2 చిటికెలు
         మిరియాలపొడి  - 2 చిటికెలు
                పైవన్నీ కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.కలబంద రసం మొదట్లో 2 స్పూన్లతో మొదలుపెట్టి నిదానంగా 4 స్పూన్ల వరకూ పెంచాలి.కడుపులో మంట,అల్సర్ ఉన్నవాళ్ళు వాడకూడదు.

Saturday, 26 July 2014

కంటి చూపు మెరుగుపడాలంటే.........

              శరీరం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.ఇప్పుడు టి.వి.,కంప్యూటర్లతో కాలక్షేపం ఎక్కువైంది కనుక
చిన్నపిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళవరకూ కంటి చూపు తగ్గుతోంది.ఇంతకు ముందు రోజుల్లో ఇవేమీ లేవు కనుక
ఇప్పటికీ పెద్దవాళ్ళు సూదిలో దారం సునాయాసంగా ఎక్కించగలరు.ఈరోజుల్లో పిల్లలు కూడా సూదిలో దారం  ఎక్కించలేకపోతున్నారు.అందుకే కంటిచూపు మెరుగ్గా ఉండటానికి కొన్ని తప్పక పాటించాలి.అవేమిటంటే....
మనం వీలయినంత తరచుగా పొన్నగంటికూర,మునగాకు ఆహారంలో భాగం చేసుకోవాలి.ఈ రెండురకాలఆకులతో పప్పు చేసుకోవచ్చు.పెసర,కంది పప్పులు కొంచెం ఉడికించి,ఉల్లిపాయ,పచ్చి మిర్చి వేసి వేపుడు చేసుకోవచ్చు.
కారట్ ఏదోఒకరూపంలో అంటే రసం,హల్వా,కూర ఎలాగైనా ఎక్కువగా తినాలి.బాదంపాలు రోజు రాత్రిపూట త్రాగాలి.
 దీనితోపాటు కంటి వ్యాయామం కూడా చెయ్యాలి.కనుబొమలు కొంచెం నొక్కాలి.కొంచెం గోరు వెచ్చటి నీళ్ళల్లో
కర్చీఫ్ పిండి 5 ని.లు కళ్ళమీద పెట్టుకోవాలి.నువ్వులనూనె 2 చుక్కలు కళ్ళ చుట్టూ రాయాలి.కళ్ళు పైకి,క్రిందికి,
ప్రక్కకు,గుండ్రంగా త్రిప్పాలి.ఇవన్నీచేస్తుంటే తప్పకుండా కంటిచూపు మెరుగుపడుతుంది.వీటితోపాటు ఆరునెల్లకు ఒకసారయినా పిల్లలు,పెద్దవాళ్ళు కూడా కంటివైద్యునితో పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి.  

కొత్తిమీర టొమాటో దోసె

            మినప్పప్పు - 1 కప్పు
            బియ్యం -  3 కప్పులు
            టొమాటోలు - 3   (మీడియం సైజ్)
            పచ్చి మిర్చి  - 5
           కరివేపాకు - గుప్పెడు
           కొత్తిమీర - 3 చిన్న కట్టలు
           జీరా -  2 స్పూన్లు
                                 మినప్పప్పు,బియ్యం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.కడిగి మిక్సీలో వేసి తీసేసేముందు టొమాటోలు,పచ్చి మిర్చి,వేసి కొంచెం నలిగినతర్వాత కరివేపాకు,కొత్తిమీర వెయ్యాలి.మొత్తం కలిపి మెత్తగా అయిన తర్వాత జీరా వేసుకుని అప్పటికప్పుడైనా దోసెలుగా వేసుకోవచ్చులేదా 5,6 గంటల తర్వాతైనా వేసుకోవచ్చు.మన
ఇష్టం.ఏచట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

మునగాకు పొడి

              మునగాకు  - 5 కప్పులు
              నువ్వులు - 1/2 కప్పు
              పుట్నాలపప్పు - 1/2 కప్పు
              ధనియాలు - రెండు స్పూనులు
             జీరా - 1 స్పూను
             ఉప్పు -  2 స్పూన్లు
             చింతపండు - కొద్దిగా
             ఎండు మిర్చి - 12
             ఎండు కొబ్బరి - 1/2 కప్పు
             నూనె - 1 స్పూను
                      మునగాకు కొమ్మలతో కడిగితే త్వరగా ఆరిపోతుంది.ఆరినతర్వాత ఆకు తీసి ఒక ప్లేటులో పెట్టుకోవాలి. చింతపండు విడదీసి ఆరబెట్టాలి.ఖాళీ బాండీలో నువ్వు పప్పు,పుట్నాల పప్పు,ఎండు కొబ్బరి
విడివిడిగా వేయించుకోవాలి.ఒక స్పూన్ నూనె వేసి ఎండు మిర్చి,జీరా,ధనియాలు వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
పైవన్నీ కలిపి,మునగాకు కూడా దోరగా వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.ఈమునగాకు పొడి ఇడ్లీలో,
అన్నంలో బాగుంటుంది.దోసె వేసేటప్పుడు ఈ పొడిచల్లి వేస్తే బాగుంటుంది. 

పుచ్చకాయ పచ్చడి

              మనం పుచ్చకాయ లోపలిభాగం తిని పైన ఆకుపచ్చగా,తెల్లగా ఉన్నదంతా పడేస్తుంటాం.లోపలఎర్రగా ఉన్న భాగాన్ని మాత్రమే తింటాము.లోపల ఎన్నిపోషకపదార్ధాలు ఉంటాయో పైన అంతకన్నా ఎక్కువ ఉంటాయి.
ఇప్పుడు మార్కెట్లో పసుపు,ముదురు ఆకుపచ్చ రంగుల్లో కూడా పుచ్చకాయలు దొరుకుతున్నాయి.ఇవి మామూలు వాటికన్నాఎర్రగా,తియ్యగా ఉంటాయి.పైన తోలుకూడా పలుచగా ఉంటుంది.ఏరంగుకాయతోనైనా
పైనున్నతోలు వృధాగా బయట పడేయకుండా పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.అదెలా చేయాలంటే
ముందుగా పుచ్చకాయను సగానికి కట్ చెయ్యాలి. లోపలిభాగం తీసేసి పైన ఉన్న సగభాగాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.అవి సుమారు 400గ్రా.లు ఉంటాయి.15 పెద్దపచ్చిమిర్చి,చిన్న నిమ్మకాయంత చింతపండు,రెండు స్పూనుల జీరా,సగం వెల్లుల్లిపాయ,తగినంత ఉప్పు తీసుకోవాలి.బాండీలో కాస్త నూనె వేసి పచ్చిమిర్చి చీల్చి వేయించుకోవాలి.అవి తీసేసి పుచ్చకాయ ముక్కలు వేసి ఉప్పు వేసి మూతపెట్టి అప్పుడప్పుడు త్రిప్పాలి.నీరు
ఇగిరేవరకు ఉంచి తీసేసి ఆరనివ్వాలి.ఆరినతర్వాత మిక్సీలోనో,రోట్లోనో వేసి పచ్చడి చేయాలి.అన్నీవేసిచేసిన తర్వాత
దానిలో గడ్డపెరుగు సరిపడా కలిపి తాలింపు పెట్టాలి.ఇది చాలా రుచిగా వెరైటీగా ఉంటుంది.
                             

Friday, 25 July 2014

మెంతిఆకుతో దోసె

         కావలసిన పదార్ధాలు
                                                                                                                                                                                    మెంతి ఆకు - 1 కప్పు
                మినప్పప్పు  - 50 గ్రా.
                 బియ్యం  - 100గ్రా.                                                                                                                                           జీరా - 1 స్పూను                                                                                                                                              ఉప్పు - తగినంత
                                   మెంతుకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.బియ్యం,మినప్పప్పు 5గం.లు నానబెట్టి కడిగి రుబ్బుకోవాలి.మెంతిఆకు,ఉప్పు,జీరా కలిపి అప్పటికప్పుడు దోసె వేసుకోవచ్చు.లేదా 7,8 గం.ల తర్వాతైనా వేసుకోవచ్చు.మెంతిఆకు తినటంవల్ల డయాబెటిస్ ఉంటే కంట్రోల్ అవుతుంది,లేదంటే రాకుండా ఉంటుంది.ఏ చట్నీతో అయినా తినవచ్చు.

చిరుధాన్యాలతో దోసె

                              కావలసిన పదార్ధాలు

                       మినపప్పు - 1 కప్పు
                       బియ్యం -  1 కప్పు
                   మల్టీ మిల్లెట్ పౌడర్ - 2 కప్పులు
                      మెంతులు - 1 స్పూను
                      జీరా  - 2 స్పూన్లు
               
                             మినప్పప్పు,బియ్యం విడివిడిగా 4 గం.లు నానబెట్టుకోవాలి.నానబెట్టే ముందు కడిగితే త్వరగా నానతాయి.మిక్సీలో వేసే ముందు ఒకసారి కడిగి విడివిడిగా మెత్తగా రుబ్బుకుని జీరా,మెంతులువేసి, మిల్లెట్ పిండి
(రాగి,జొన్న,సజ్జ,మొ.న 11 రకాల చిరుధాన్యాలతో చేసిన పిండిసూపర్ మార్కెట్లో దొరుకుతుంది) కొంచెం నీళ్ళతో తడిపి దీన్నికూడా వేసి ఒకసారి ఆన్ చేయాలి.మొత్తం కలిపిన పిండిని 7,8 గం.లు బయటే పులవనిచ్చి దోసె వేసుకుంటే  నోరూరించే ఆరోగ్యకరమైన మల్టీ మిల్లెట్ దోసె తినడానికి రెడీ.ఎక్కువ ఉంటే పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావారం రోజుల వరకూ నిల్వ ఉంటుంది.
                    దీన్ని కొబ్బరిచట్నీ,అల్లంపచ్చి మిర్చి చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.

గమనిక :మల్టీ గ్రైన్ ఆటా కాదు.మల్టీ మిల్లెట్ పౌడర్ 

బరువు తగ్గించే పుచ్చకాయ

          పుచ్చకాయలో 92%నీరు వుంటుంది.నీటిశాతం ఎక్కువగా ఉండి తక్కువ కాలరీలు ఉండటం వలన ఇది తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది.బరువు పెరుగరు.బొద్దుగా ఉన్న వాళ్ళకు ఇది మంచి ఆహరం.వేసవిలో దీనిలోనీరు ఎక్కువ ఉండటం వల్ల దాహం వేయదు.పుచ్చ కాయ అన్నికాలాల్లోతినదగిన పండు.పుచ్చకాయ పైన
ఆకుపచ్చగా ఉండేతొక్కతో కూడా పచ్చడి చేసుకోవచ్చు.చాల రుచిగాఉంటుంది.పుచ్చ గింజలు వల్ల చాలా  ఉపయోగాలున్నాయి.వేయించి పొడిచేసైనా,డైరెక్ట్ గా అయినా వాడుకోవచ్చు.ఈగింజలు రక్తనాళాల్నివెడల్పుచేసి
రక్తప్రసరణ బాగా జరిగేట్లు చేయటంవల్ల క్లాట్స్ ఏర్పడవు. గుండెజబ్బులు,రక్తపోటు రాకుండా చేస్తుంది.దీనిలో లైకోపిన్ ఉండటంవల్ల అన్ని రకాల కాన్సర్ లను కంట్రోల్  చేస్తుంది.మొలల వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.పుచ్చ గింజల్ని వేయించుకుని కొంచెం ఉప్పు,కారం చల్లి తినవచ్చు.వీటిని సలాడ్స్ లో వేయవచ్చు.ఆరోగ్యానికి మంచిది కనుక ప్రయత్నిస్తే బాగుంటుంది.

అవిసె గింజలు

              అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) ఒమేగా -3 యాసిడ్స్ కి పెట్టింది పేరు.దీనిలో పీచు పదార్దం ఎక్కువగా ఉంటుంది.ఈగింజల్నిమెత్తగా పొడిచేసి చపాతీలోకానీ,దోసె పిండి,ఇడ్లీ పిండిలో కానీ వేసుకుని వాడుకోవచ్చు.
చేపలు ఎక్కువగా తినేవాళ్ళయితే రోజుకి ఒక స్పూను వాడుకోవచ్చు.తినని వాళ్ళయితే రెండు స్పూనులు
వాడుకోవచ్చు.ఎక్కువగా వాడినా శరీరానికి వేడి చేస్తుంది.ఇది కొలెస్టరాల్ ని,రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.
జుట్టుని ఆరోగ్యంగా,గట్టిగా ఉంచుతుంది.డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.ఈగింజల్ని నానబెట్టి ఇష్టమైతే ఇడ్లీ పిండిలో కలుపుకోవచ్చు.గింజగింజ లాగానే గట్టిగాఉంటుంది.ఏరూపంలో తీసుకున్నాఆరోగ్యానికి చాలామంచిది. 

కరకరలాడే పకోడీలు

             శనగపిండి(బేసన్) - 1/4 కే. జి
             వరి పిండి(బియ్యప్పిండి) - గుప్పెడు
             ఉల్లిపాయలు - 4 మీడియం సైజ్
             పచ్చి మిర్చి  - 6
            అల్లం  - చిన్నముక్క
           నూనె  - వేయించటానికి సరిపడా
          వెన్న - కొంచెం
         ఉప్పు - సరిపడా
                      ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా,పొడవుగా కట్ చేసుకోవాలి.వెన్న,ఉప్పు,అల్లం,పచ్చిమిర్చి ముద్ద
వేసి బాగా కలపాలి.తర్వాత శనగపిండి,బియ్యప్పిండి వేసిఅవసరమైతే కొంచెం నీళ్ళు పోసి మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి.బాండీలో నూనె పోసి కాగాక కొంచెం పిండి చేతిలో తీసుకునినాలుగు వేళ్ళపై ఉంచి బ్రొటన వ్రేలితో
గుండ్రంగా త్రిప్పుతూ సన్నగా పడేలాగా నూనెలో వేయాలి.ఇటు,అటు త్రిప్పి బంగారు వర్ణంలోకి రాగానే తీసి ఒకప్లేటులో పేపర్ పై వెయ్యాలి.చాల త్వరగా కూడా వేగుతాయి.అన్నీ అలాగే వేయించితే కరకలాడే నోరూరించే వేడివేడి పకోడీ రెడీ.స్పైసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటాయి. వెన్న కొంచెం వెయ్యటంవల్ల అదనపు రుచి వస్తుంది.ఒకవేళ సమయానికి వెన్న లేకపోతే వేడివేడి నూనె వేసి కలిపినా రుచిగానే ఉంటాయి.


 

Thursday, 24 July 2014

మహాపాతకం

               వెంకట్రావు చదువుకునేటప్పుడే స్నేహితులతో కలిసి మద్యం సేవించటానికి అలవాటుపడ్డాడు.క్రమంగా అది వ్యసనంగా మారింది.పెళ్ళయి పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది.వెంకట్రావుకు ఇద్దరు పిల్లలు.అమ్మాయి పెళ్ళయిపోయింది.అబ్బాయికి  బాగా పెళ్ళి వయసు వచ్చిందని ఏదోఒక వంకపెడుతున్నాడని
తండ్రి ఆవేదన.ఎలాగోలా ఒక సంబంధం కుదిరేట్లుగా ఉందిలే అనుకుంటే భార్య కోడలు కోట్లు కట్నంతెచ్చేదైతేనే
ఒప్పుకుంటానని కొడుకు ఉద్యోగం చేసే దగ్గరకు వెళ్ళి కూర్చుంది.వెంకట్రావు ఒక్కడే ఉండి తెగ తాగేసి ఏమీ తినక
వెక్కిళ్ళు వస్తుంటే చెల్లెలు వెంకట్రావు కొడుక్కి ఫోనుచేస్తే ఎత్తటంలేదని కూతురికి చేసింది.మీనాన్న మేమెవరం ఏమి పెట్టినా తినటంలేదు.పగలైతే మేము చూస్తాం.ఇంట్లో ఎవరూ లేకపోతే రాత్రిపూట పరిస్థితి ఏమిటి? మీ అమ్మ,మీరు ఎవరూ పట్టిచుకోపోతే ఎలా?అంది.కూతురు ఆయన ఏమైపోయినా ఫర్వాలేదు." ఆయన కడుపున పుట్టటమే
మహాపాతకం"(పాపం చేసుకోవటంవల్ల ఆయన కడుపున పుట్టాము)అనేసింది.మాఅమ్మఇన్నిరోజులు భరించింది  ఆయనవల్ల మాపరువు పోతుంది.మీఅందరూ ఉన్నారుగా చూచుకుంటారో?ఊరుకుంటారో?మాకనవసరం అంది.ఆయన దగ్గరున్న డబ్బు కావాలి మీకు. తెల్లారిలేస్తే మీనాన్నదగ్గరకువచ్చి నాన్నా నాకూతురికి వడ్డాణం చేయించు,ప్లాట్ కొనిపెట్టు అంటూ వచ్చిడబ్బుతీసుకెళ్ళేటప్పుడు లేని నామోషీ ఇప్పుడెందుకు?.అంతమాట మాట్లాడటానికి నోరెలావచ్చింది.భార్యపిల్లలు పట్టించుకోకపోతే మాసంసారాన్ని చక్కదిద్దట్లేదని మమ్మల్ని నానామాటలు అంటున్నావేళకు అన్నీ పంపిస్తున్నాము.మీరు చిన్నపిల్లలుకాదు.మీరే తెలుసుకోవాలి.అమ్మను చూసినట్లే నాన్నను తీసుకెళ్ళి వైద్యం చేయించి ప్రేమతో మార్చాలి. మాకు సంబంధంలేదని బాధ్యతారాహిత్యంగా  మాట్లడతావేమిటి?నాన్నకు బాగోకపోతే ఒక్కమాట మాతో అనలేదు అంటారని చెప్పాను ఇక మీఇష్టం.
ఉన్నన్నాళ్ళు ఉంటాడు మేం మాత్రం ఏం చేయగలం అని వెంకట్రావు చెల్లెలు అంది.వెంకట్రావు మాములుగా మంచివాడు. భార్యాబిడ్డలంటేఅతి ప్రేమ. పల్లెత్తు మాట అనడు.అమాయకురాలైన కూతురు అలా మాట్లాడుతుందని ఎవరూ అనుకోలేదు. తర్వాత రోజు భార్య,కొడుకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్ళినా అది వేరే విషయం.కూతురు ముందు,వెనుక ఆలోచించకుండా మాట్లాడటం వలన సొమ్ము తినటానికైతే భార్యాబిడ్డలుకానీ వైద్యం చేయించి ఆఅలవాటు మాన్పించి మామూలు మనిషిగా మార్చొద్దా?చిన్నప్పుడు పిల్లలబాగోగులు చూస్తాం,పిల్లలు పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల బాగోగులు చూడాలి.మహాపాతకం చేసుకుని పుట్టాం అనటం ఎంత తప్పు.ఆయనకడుపున పుట్టబట్టి మంచిసంబంధంవచ్చి సుఖపడటంవల్ల పోకిళ్ళుపోతుంది అని ఊరంతా చెప్పుకుంటున్నారు.

సరయ

                             శిరీష్ ఇంటికి ఆమడ దూరంలో మంచినీళ్ళ చెరువు ఉంది.ఆ చెరువులో చిన్నచిన్న చేపలు
ఉంటాయి.వాటిని తినటం కోసం కొంగలు వస్తుంటాయి.శిరీష్ పిల్లలు ఎప్పుడన్నా సరదాగా చేపలు పట్టటానికి
వెళుతుంటారు.ఒకసారి అనుకోకుండా ఏదోపక్షి ఆకాశంలో ఎగురుతూ  సరయను తీసుకుని వెళ్తుండగా మధ్యలో వదిలేసింది.అప్పుడు సరయ క్రింద తోటలోఉన్నశిరీష్ పాలేరు తలపై పడింది.సరయ అంటే తాబేలు.దాన్ని
తీసుకొచ్చి పిల్లలకు ఇచ్చాడు.అదేసమయంలో చెరువులోనుండి దారితప్పి రెండు చిన్నతాబేళ్ళు నడుచుకుంటూ శిరీష్ ఇంటివైపు వచ్చాయి.వీటన్నింటినీ కలిపి పిల్లలు ఒక నాచుపట్టిన తొట్టిలో వేశారు.అవి దానిలోఉన్ననాచు మొత్తం తినేశాయి.ఒకరెండు రోజులు పిల్లలు వాటితో ఆడుకున్నాక మళ్ళీ చెరువులో వదిలేయమంటే పాలేరు వదిలేశాడు. ఇంతకు ముందు రోజుల్లో నీళ్ళ టాంకులు కడగటానికి శ్రమపడటం ఎందుకని తాబేలును తెచ్చి వేసేవాళ్ళు.అది టాంకులోని ఆకుపచ్చని పదార్ధన్నంతా తినేసి నీట్ గా చేసేది.తర్వాత చెరువులో వదిలేసేవాళ్ళు. 

కాసేపు ధ్యానం

                                       రోజు కాసేపు ధ్యానం చేయడం మంచి అలవాటు.ధ్యానం వల్ల ఏకాగ్రత,జ్ఞాపకశక్తి       పెరుగుతుంది.ఏసమస్యనైనా ఎదుర్కోగల పరిణతి పెరుగుతుంది.అనవసరమైన ఆలోచనలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.రక్తప్రసరణ వేగంతగ్గి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.తెల్లవారుజామున చేసుకోగలిగితే వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.నిశ్శబ్దంగాఉన్నప్రదేశంలోనిటారుగా,నిశ్చింతగా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మనసు త్వరగా లగ్నమౌతుంది.ఏదైనా ఆసనం వేసుకుని కానీ,బాసింపట్టు కానీ,అదీ కుదరకపోతే కుర్చీలో కూర్చునైనా చేసుకోవచ్చు. శ్వాస ఎంత సుదీర్ఘంగా,నిదానంగా ఉంటే ధ్యానం అంత ప్రభావంగా ఉంటుంది.ధ్యానం చేసేటప్పుడు భగవన్నామాన్నికానీ,ఓంకారాన్నిజపించవచ్చు.దేవుడి రూపాన్నికానీ,అందమైన ప్రకృతిని కానీ  ఊహించుకోవచ్చు.ధ్యానం చేసేటప్పుడు బలవంతంగా కళ్ళుమూసుకుని కుర్చోవద్దు.ఒక్క పది ని.లు.కేటాయించి ధ్యానం చేసుకుంటే మెదడులోని కణాలు చురుగ్గా పనిచేసి రోజంతా హుషారుగా ఉండగలం. 

నోరూరించే బెండకాయ వేపుడు

            బెండకాయలు - 1/2 కే.జి
            వేపుడు కారం - 1 1/2 స్పూను
            పచ్చికొబ్బరి - కొంచెం
            వెల్లుల్లి - 5 రెబ్బలు
            నూనె -  వేయించటానికి సరిపడా
            కరివేపాకు - కొంచెం
           తాలింపు దినుసులు
                              బెండకాయలు సన్నగా గుండ్రంగా కట్ చేసి ఒక పెద్దప్లేటులో పలుచగా ఆరబెట్టాలి.పట్టుకుంటే  జిగురుగా లేనప్పుడు వేయించితే పొడిపొడిగా ఉంటుంది.వెంటనేకానీ,జిగురుగా ఉన్నా వేపుడు రుచిగా ఉండదు.
 ఖాళీగా ఉన్నప్పుడు కట్ చేసి ఆరిపోయినతర్వాత ఫ్రిడ్జ్ లో ఒక బాక్స్ లో పెట్టుకుని ఉదయం వండుకోవచ్చు.వండే
ముందు బాండీలో వేయించటానికి సరిపడా నూనెపోసి కాగినతర్వాత బెండకాయముక్కలు వేసి దగ్గరే ఉండి త్రిప్పుతూ వేయించితే 10 ని.ల్లో అయిపోతుంది.డీప్ ఫ్రై అవకుండా,మెత్తగాలేకుండాముక్క వేగినతర్వాత రంధ్రాలున్న గరిటతో తీసి దానిమీద ఇంకొకటి పెట్టి నూనె నొక్కేసి ముక్కలు ఒకప్లేటులోపెట్టుకోవాలి.బాండీలోమిగిలిన నూనె తీసేసి ఒకగిన్నెలో పోసి అదేరోజు వేరే కూరకు లేదా పచ్చడికి వాడుకోవచ్చు.బాండీలోతాలింపు వేయటానికి
 సరిపడా నూనె ఉంచాలి.దానిలో ఎండుమిర్చి,దినుసులన్నీ ఒక్కోస్పూను చొప్పున వేసి ,సన్నగా కట్ చేసిన  వెల్లుల్లి,కరివేపాకువేసి వేగిన తర్వాత కొబ్బరి,ఉప్పు,వేపుడు కారం,బెండకాయ ముక్కలు వేసి రెండు ని.లు
 వేయించితే నోరూరించే బెండకాయ వేపుడు రెడీ.పొడిపొడిలాడుతూ వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా  ఉంటుంది.

తప్పులెన్నువాడు

               తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లు తప్పు చేయటం మానవసహజం.తెలిసో,తెలియకో
ఏదోఒకటి చేస్తుంటాము.కొంతమంది ఎదుటివాళ్ళలో ఏతప్పు కనపడుతుందా,ఎప్పుడు విమర్శిద్దామాఅని కాచుకు కూర్చుంటారు.సరిగ్గా ఈకోవకే చెందుతాడు రవికిరణ్.లేచిన దగ్గరనుండి ఇక్కడ ఇది ఎందుకు పెట్టావు?ఆపని ఆరకంగా చెయ్యటమేమిటి?నువ్వు మాట్లాడే విధానం తప్పుఅంటూ గయ్యిమంటూఅరుస్తూనే ఉంటాడు.ఇంతకు ముందు చెప్పినవి మచ్చుకు కొన్ని మాత్రమే.ఆతప్పులెన్నే వాక్ప్రవాహ కార్యక్రమం రాత్రి పడుకోబోయే వరకూ
ఆగదు.ఎవరైనా బుద్ది తక్కువై వాళ్ళింటికి వచ్చారంటే ఆరోజు వాళ్ళ పని అయిపోయినట్లే.అసలు ఇంతకీ తను అలా
ఇతరులమీద అరవటం,విమర్శించటం తప్పుఅని ఎప్పటికీ తెలుసుకోలేడు.తెలుసుకుని సరిదిద్దుకోలేని మూర్ఖత్వం.
ఇతనిలో మంచితనం కూడా ఉంది.ఎదుటివాళ్ళకు సహాయపడే మనస్తత్వం.అందువల్ల ఎవరూ అలా మాట్లాడటం తప్పుఅనరు.అన్నా" సూది కోసం సోదికి పోతే పాతవి బయటపడినట్లు" నువ్వు అప్పుడెప్పుడో అది చేశావు,ఇది చేశావు అంటూ విమర్శిస్తాడు. మనకెందుకొచ్చిన గోల ఊరుకుంటే పోలా అనుకుంటారు.   

Wednesday, 23 July 2014

రెండు ని.ల్లో కోడిగ్రుడ్డు పొరుటు

        కోడిగ్రుడ్లు  - 2
       ఉప్పు - చిటికెడు
      సంబారు కారం - 1/2 స్పూను
      పసుపు -  కొంచెం
      నూనె - కొంచెం ఎక్కువ
                       ముందుగ ఒక చిన్నప్లేటులో ఉప్పు,పసుపు,కారం రెడీగా పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి బాండీలో మాములుకన్నా కొంచెం ఎక్కువ అంటే ఒక గుంటగరిటెడు నూనె వేసి కాగాక గ్రుడ్లుకొట్టి వెయ్యాలి.వెయ్యగానే గ్రుడ్లసొన ప్రక్కనేఉన్న నూనెలో ప్లేటులోనివన్నీ వేయాలి.వెంటనే అన్నీ కలిపి వేగంగా త్రిప్పితే గ్రుడ్డు పొరుటు సన్నగా వస్తుంది.కారం నూనెలోవేయగానే మంచివాసన వచ్చి ఘుమఘుమలాడే కోడిగ్రుడ్డు పొరుటు సిద్దం.ఇది
రెండు ని.ల్లో అయిపోతుంది.లంచ్ బాక్స్ ల్లోకి బాగుంటుంది.అప్పటికప్పుడు తేలికగా,రుచిగా చేసుకోవచ్చు.

కాలక్షేపానికి.....

                      నాగమణి కాలక్షేపానికి ఊరిలో తనఇంటి నుండి ఒక మైలుదూరం నడిచి స్నేహితురాలి ఇంటికి  నడిచి వస్తుంటుంది.లోపలికి వెళ్ళిన మనిషి ఐదు,ఆరు గంటలైనా బయటికి రాదు.వాళ్ళాయన ఇంకా రాలేదని  వెళ్తేకానీ ఆకాలక్షేపం కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టరు.స్నేహితురాలి ఇంటికివచ్చినడిమంచంమీద బాసింపట్టువేసుకుని   చెప్పింది చెప్పకుండా ఊరి మొదట్లో వాళ్ళగురించి మొదలుపెట్టి ఊరి చివర ఉన్నపాడుపడ్డ కొంపను కూడావదిలి
పెట్టకుండా ఎక్కడ ఏమి జరుగుతుందో?ఎవరు ఎక్కడికి వెళ్ళారో?ఏమి చేస్తున్నారో?అన్నీవీళ్ళకే  కావాలి.ఇంతకీ వీళ్ళకు ఏమీ కంతలు లేవా?అంటే అన్నీ అతుకుల బొంతలే.వాటి గురించి, ఎవరైనా ఏమైనావాళ్ళకుటుంబం
 గురించి చెప్పుకోవచ్చేమో అనే ఆలోచనే లేదు.ఇద్దరూ వాళ్ళ గొప్పలు రొప్పుకుంటూ డప్పుకొట్టి మరీ చెప్పుకుంటారు.
 వినేవాళ్ళు అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదాఅన్నట్లు ముసిముసిగా నవ్వుకుంటూ వింటూ ఉంటారు.
 ఎప్పుడైనా స్నేహితురాలి ఇంట్లో మీటింగ్ ముందయితే బంధువుల ఇళ్లకు వచ్చి అమ్మో,అయ్యో అంటూ అక్కడ
 నొప్పిగా ఉంది,ఇక్కడ కాలు మెలితిరిగి పోయింది,చేతికి పక్షవాతం వచ్చిందేమో,గుండె నొప్పిగా ఉంది అంటూ
 ఇంటికి వెళ్ళగలనో,లేదో అంటూ కూనిరాగాలు తీస్తుంటుంది.కాలక్షేపానికి కూడా హద్దూ,పొద్దూ ఉండాలి.మళ్ళీ
 ఇంటికి వెళ్ళి వాళ్ళాయనతో పూసగుచ్చినట్లు అన్నీచెప్పందే కడుపుబ్బిపోయి నిద్రపట్టదు.వాళ్ళాయన ఏమన్నా  తక్కువ తిన్నాడా?అంటే అదేమీ లేదు.ఇవన్నీ తీసుకెళ్ళి ఆడవాళ్ళకన్నా కనాకష్టంగా ఎవరింటికి వెళ్తే వాళ్ళింట్లో
 మీటింగ్ పెట్టి పోచుకోలు కబుర్లు చెపుతాడు. కాలక్షేపానికి ఏపుస్తకమో చదువుకుంటే జ్ఞానం వస్తుంది.లేదంటే  ఏగుడికో వెళ్ళి కృష్ణా,రామా అంటూ భజన చేసుకుంటే పుణ్యం దక్కుతుంది.అయ్యో రామా! అంత జ్ఞానమే ఉంటే  ఇంత సోది చెప్పుకోనక్కరలేదు.ఏం చేస్తాం?ఎవరి పిచ్చి వారికి ఆనందం.   

కారట్ పచ్చడి

                          కారట్ - 1/4 కే .జి.
                           పచ్చిమిర్చి - 10
                          ఉప్పు - తగినంత
                         చింతపండు - నిమ్మకాయంత
                        జీరా -కొంచెం
                        వెల్లుల్లి - 4 రెబ్బలు
                        పెరుగు - తగినంత
                       నూనె - తాలింపుకిసరిపడా                                                                                                                   కరివేపాకు,కొత్తిమీర - కొంచెం                                                                                                                                                                                                                                                                                            కారట్ తురిమి ప్రక్కన పెట్టుకోవాలి.పచ్చిమిరపకాయలు వేయించి,తగినంత ఉప్పు ,
చింతపండు,జీరా,వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా అయినతర్వాత కారట్ తురుము వేసి ఒక్కసారి ఆన్
చెయ్యాలి.తర్వాత దానికి తగినంత పెరుగు కలిపి,కొత్తిమీర,కరివేపాకు,వెల్లుల్లి,దినుసులు అన్నీవేసి తాలింపుపెడితే
 కారట్ పచ్చడి రెడీ.ఇది అన్నంలో,మినప గారెలకు చాలా రుచిగా ఉంటుంది. 

నారింజ పులిహోర

           నారింజ పండు తియ్యతియ్యగా,పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.ఈరసం క్రమం తప్పకుండ పరగడుపున 41 రోజులు తీసుకుంటే సంతాన సాఫల్యత పెరుగుతుంది.డయాబెటిస్,హార్ట్ పేషెంట్స్ కి ఈపండు ఎంతో మంచిది.కాన్సర్
ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు నారింజలో సమృద్ధిగా ఉంటాయి.ఎసిడిటీని తగ్గిస్తుంది.
         నారింజ కాయ పులిహోరకు చాలా బాగుంటుంది.ఇప్పుడు నారింజ కాయలు ఊరిలో చెట్ల నిండా విరగకాసి చూడ ముచ్చటగా ఉన్నాయి.పులిహోర చేయాలంటే మధ్యరకం కాయలు బాగుంటాయి.పిందెలు కాకుండా,పండ్లు కాకుండా మధ్యరకంగా ఉండాలి.
                                           బియ్యం  - 4 రైసు కుక్కర్ కప్పులు
                                          నారింజ కాయ - 1 మీడియం సైజుది,పుల్లనిది
                                           పసుపు - కొంచెం,ఉప్పు - సరిపడా
                                          నూనె - సరిపడా
                                          తాలింపు దినుసులు
                                         కరివేపాకు - కొంచెం,పచ్చిమిర్చి - 6
                  ముందుగా  బియ్యం కడిగి అన్నం వండాలి.కొంచెంసేపయ్యాక అన్నం ఒక పెద్ద ప్లేటులో వేసి ఆరబెట్టాలి.
స్టవ్ పైన బాండీలో నూనె వేసి కాగిన తర్వాత రెండు ఎండుమిర్చివేసి,ఆవాలు,మినప్పప్పు,శనగపప్పు ఒక్కొక్క స్పూను చొప్పున వేసి వేగనిచ్చి కరివేపాకువేసి వేగనిచ్చి,పసుపు,పచ్చిమిర్చివేసి వేగిన తర్వాత అన్నంలో వెయ్యాలి.కావాలనుకుంటే జీడిపప్పుకానీ,పల్లీలు కానీ వేయించి కలుపుకోవచ్చు.ఈలోపు నారింజరసంతీసి,ఉప్పు
 వేసి కలిపి ప్రక్కనపెట్టుకుని తాలింపు, అన్నంలో వేయగానే రసం కూడా అన్నంలో పోసి బాగా కలిసేట్లుగా కలపాలి.నారింజ కాయ పులిహోర రెడీ.ఇది పిల్లలకు లంచ్ బాక్స్ లోకి రుచిగా ఉంటుంది.పెద్దవాళ్ళకు కూడా పుల్లపుల్లగా తినటానికి బాగుంటుంది.నిమ్మకాయ పులిహోర రుచికి ఇది భిన్నమైన రుచి.

యవ్వనంగా కనిపించేలా చేసే అద్భుతఫలం

                     వయసు మీద పడనివ్వకుండా యవ్వనంగా కనిపించేలా చేసే అద్భుతఫలం పైనాపిల్ (అనాస).ఇది
మన శరీరంలోని క్రొవ్వుని కరిగించి బరువును నియంత్రిస్తుంది.ఈపండు తినటంవల్ల ఆహరం త్వరగా జీర్ణమౌతుంది.
అజీర్తి లేకుండా చేస్తుంది.గొంతునొప్పి,చిగుళ్ళనొప్పులు,కీళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు రోజు రెండు పైనాపిల్ ముక్కలు
తింటే నొప్పులు,వాపులు తగ్గుతాయి.సైనసైటిస్ కి మంచిదివ్యౌషధంలా పనిచేస్తుంది.ఆస్టియోపోరాసిస్ రాకుండా నిరోధిస్తుంది.హృద్రోగులు రోజు క్రమం తప్పకుండా రెండు ముక్కలు తింటే రక్తంలో క్లాట్స్ ఏర్పడవు.రోగనిరోధకశక్తిని
పెంచుతుంది.ఈ పండు రోజు తింటే చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది.ఇది కొయ్యటం కొంచెం కష్టమే అయినా చాల అద్భుతఫలం.ఇప్పుడు మార్కెట్లో పైనాపిల్ తేలిగ్గా కోసే పరికరాలు వచ్చాయి.

Tuesday, 22 July 2014

బంగారం లాంటి దానిమ్మ

             ఊరిలో ప్రతి ఒక్కరి ఇంట్లో కాయ దానిమ్మ,పువ్వు దానిమ్మ రెండు రకాలుంటాయి.దానిమ్మ వల్ల ఎన్నో ప్రయోజనాలు.రోజు తప్పనిసరిగా గుప్పెడు గింజలైనా తినాలి.ఒక అరదానిమ్మ పండైనా తినగలిగితే మరీమంచిది.
రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.రక్తశుద్దికి దానిమ్మ కాయను మించినది లేదు.దీనిలో ఉన్న యాంటీ
ఆక్సిడెంట్ లవల్ల అన్నిరకాల కాన్సర్లు రాకుండా కాపాడుతుంది.రక్తంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.ఇది
హృద్రోగులకు చాలా మంచిది.డయాబెటిస్,ఆస్టియో ఆర్త్రైటిస్ వంటి వ్యాధుల్ని నియంత్రించటంలో అమోఘంగా
పనిచేస్తుంది.కడుపులో మంట,గొంతు,నోటి సమస్యల్ని తగ్గిస్తుంది.జ్వరం వచ్చినప్పుడు దానిమ్మ గింజలు తింటే
వెంటనే నీరసం తగ్గుతుంది.దానిమ్మ చిగుళ్ళు కూడా దివ్యౌషధంగా పనిచేస్తాయి.చిగుళ్ళు మోషన్స్ కంట్రోల్
చేస్తాయి.దానిమ్మ గింజలు ఒలిచి నిల్వ ఉంచకూడదు. అప్పటికప్పుడు ఒలిచి తింటే మంచి ఫలితం ఉంటుంది.
బంగారాన్ని ఎంతగా ఇష్టపడతామో అంతే ఇష్టంతో ఇన్ని ప్రయోజనాలున్నబంగారం లాంటి దానిమ్మను రోజు
తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.  

హెయిర్ జెల్ కాళ్ళకు....

             మనోజ్ఞ మనస్తత్వం వింత మనస్తత్వం.చదువుకున్నదే కానీ మూర్ఖత్వం పాళ్ళు ఎక్కువ.తన వస్తువులు
చవకరకంవి అయిన భద్రంగా దాచుకుంటుంది.ఎదుటివాళ్ళ వస్తువులు ఎంత ఖరీదువైనా బయట పడేస్తుంటుంది.
షాపింగ్ కి వెళితే తన డబ్బు తీయకుండా అన్నీ కొనుక్కుని ఏటో చూస్తూ నిలబడితే అత్తగారో,ఆడపడుచో బిల్లు ఎన్ని వేలైనా కట్టాల్సిందే.ఇంట్లో అన్నిరకాల పళ్ళు ఉన్నా ఎవరికీ పెట్టదు,ఎవరు తిన్నా నచ్చదు  చివరికి భర్త అయినాసరే.పనివాళ్లకు ఇవ్వదు కుళ్ళిపోయినతర్వాత వాళ్ళనే పారేయమంటుంది.పారేసుకునే బదులుమాకిచ్చినా
ఎవరికిచ్చినా తింటారుగదా అనిఅనుకుంటారు.ఇష్టం లేకపోతే తండ్రి ఇంటికి వచ్చినా మాట్లాడదు,మర్యాద చెయ్యదు.అతిధులు ఇంటికి వచ్చినా మాట్లాడకుండా గదిలో కూర్చుంటుంది.ఒకసారి మనోజ్ఞ ఒదిన ఇంటిపనుల్లో
సహాయంచేసే కుర్రాడు అప్పుడప్పుడు హెయిర్ జెల్ వాడతాడని విదేశీ హెయిర్ జెల్ పిల్లలు వదిలేస్తే ఇద్దామని తీసుకెళ్తుంది.ఒదినా అదేమిటి?అనిఅడిగి వాడికి ఇవ్వటమేమిటి? నేను కాళ్ళకు రాసుకుంటాను అని మనోజ్ఞ తీసుకుని దాచుకుంది.చదువుకున్న అజ్ఞానా?మూర్ఖత్వమా?అదేమిటి?హెయిర్ జెల్ తలవెంట్రుకలకు రాసుకుంటారు కానీ కాళ్ళకు రాసుకుంటాననటమేమిటో?కాళ్ళకు ఏమైనా ఫర్వాలేదుకానీ ఎదుటివాళ్లకు వీసమెత్తు కూడా ఇవ్వకూడదు ఈవిచిత్ర ప్రవర్తన ఎప్పటికి మారుతుందోనని ఒదిన మనసులో అనుకుంది.

/

మనఇంట్లో రుచిగా....

           మనం ఎలాగూ ఇంట్లో వంట చేసుకుంటాం.అదే ఇంకొంచెం రుచిగా ఉండేలా చేస్తే తృప్తిగా తినొచ్చు.ఇంతకు
ముందు పోస్ట్ లో వేపుడు కారం ,సంబారు(కూర)కారం,( అంటే సాంబారులోఈ కారం వేయం)మసాలా పొడి వేసి వంట చేస్తే చాలా రుచిగా ఉంటాయి.బెండ,దొండ,కాకర,పొట్ల,బీర,సొర(ఆనప)వంటివాటికి వేపుడుకారం ఒక్కటే సరిపోతుంది.ఆలూఫ్రై ,చిక్కుడు,గుమ్మడి,వంకాయ,కారట్,బీన్స్,అరటి,క్యాబేజ్ మొ.వాటికి అల్లం,వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి,వేయించిన తర్వాతవేపుడు కారం,కొద్దిగా మసాలాపొడి వేస్తే ఆరుచే వేరు.చాలా బాగుంటుంది.గుజ్జు కూరలకు,
కొన్ని కలగలుపు కూరలకు కూర కారం ఒక్కటే సరిపోతుంది.టొమాటో,కోడిగ్రుడ్డు పులుసుకూరలో,బంగాళదుంప
టొమాటోకలిపి వండే కూరలో కూడా కూరకారం,అల్లం,వెల్లుల్లి చివరగా మసాలాపొడి వేస్తే చాల రుచిగా వుంటుంది.
చింతపండు వేసే పులుసు కూరల్లో ఈ కారంఅదనపు రుచినిస్తుంది.నాన్ వెజ్ లో కూరకారం ,అల్లం,వెల్లుల్లిపేస్ట్ , చివరగా మసాలాపొడి వేస్తే చాల రుచిగా ఉంటాయి. 

కళ్ళ చుట్టూ నలుపు పోవాలంటే....

 1)అలోవెరా(కలబంద)గుజ్జు,బంగాళదుంప(ఆలూ)సమపాళ్ళలో తీసుకుని రెండింటిని మెత్తగా మిక్సీలో వేసి
కళ్ళచుట్టూ రోజు రాస్తుంటే తగ్గిపోతుంది.
2)కళ్ళచుట్టూ కొబ్బరినూనె రాసి కొంచెంసేపయ్యాక కడిగేయాలి.
3)అలోవెరా జ్యూస్ లో కీరదోస(గుండ్రంగాపలుచగా కట్ చేసి మళ్ళీ మధ్యకు కట్ చేయాలి)ముక్కలను ముంచి కంటికి పైన,క్రింద అతికించాలి.ఒక ఇరవై ని.లు.అలాగే ఉంచి తర్వాత నీళ్ళతో కడిగేయాలి లేదా కాటన్ తడిపి పిండి
తుడవాలి.
              కీరాముక్కలు కంటిమీద పూర్తిగా పెట్టుకుంటే ఒకచోట కూర్చోవాలి కనుక సగం,సగం పైన,క్రింద పెట్టుకుని మనపనులు మనం చేసుకోవచ్చు.        

కడుపుతో ఉన్న కల్లాలిలా....

                     కరిష్మ పనిమనిషి భావన కూరగాయలు ముక్కలుగా కోస్తూ అమ్మా మీరు వండే కూరలు రుచిగా
ఉంటాయి.మా ఇంట్లో వాళ్ళకు చాలా ఇష్టం.ఈరోజు ఫలానా కూర వండండి అంటూ అడుగుతూ ఉంటుంది.కడుపుతో (గర్భిణిగా ఉన్నప్పుడు)ఉన్నవాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో అది తినాలనిపిస్తుంది,ఇది తినాలనిపిస్తుంది అంటూ అడిగి చేయించుకునేవాళ్ళు.ఈరోజుల్లో అంటే అన్నీదొరుకుతున్నాయి.అందుకే ఇలా అదికావాలి,ఇదికావాలి చేసిపెట్టండి అంటూ అడిగే వాళ్ళను కడుపుతో ఉన్న కల్లాలి లాగా అడుగుతున్నావేమిటి?అంటూ ఉంటారు.మూడు రోజులనుండి అమ్మా చేశారా?అని అడుగుతుంది.తనకేమో పనుల వత్తిడివలన కుదరటం లేదు.ఇంతకుముందు పిల్లలు అడిగేవాళ్ళు.ఇప్పుడు పిల్లలేమో హోటల్ కెళ్ళి కావలసినవి తింటున్నారు.రోజులు మారాయి కదా అందుకని పనివాళ్ళు చేసిపెట్టండమ్మా అని అడుగుతున్నారు.

తికో

             వెంకటేష్ మామూలుగా ఉన్నప్పుడు చక్కగా కబుర్లు చెపుతాడు.మద్యానికి బానిసై ఇంట్లో భార్యను,
పిల్లలను ఏమీ అనడు కానీ ఇతని వలన చుట్టుప్రక్కల వాళ్ళకు,తల్లికి,తోడపుట్టిన వాళ్ళకు మహా ఇబ్బంది.
తాగిన మైకంలో ఏమి మాట్లాడుతున్నాడో తెలియక ఆరోడ్డులో వెళ్ళేవాళ్ళను,వచ్చేవాళ్ళను" తికో" ఇటురా
అంటూ పిలుస్తుంటాడు.ఇంటి పైకెక్కి అమ్మ,ఒదినను,చెల్లెళ్ళను పళ్ళకిచ్చమ్మలు,కోతులు,తికోలు అంటూతిడుతూ ఉంటాడు.తల్లి కడుపున పుట్టినందుకు,చెల్లెళ్ళు తోడపుట్టినందుకు పోనీలేఅని ఊరుకున్నాఒదినలు ఊరుకోరు కదా! ఇది చాలదన్నట్లు ప్రక్కన మేనత్తపిల్లలు ఉంటే వాళ్ళఇళ్ళకు వెళ్ళి వాళ్ళపిల్లలను,కోడళ్ళను టీ పెట్టివ్వమని
డబ్బులివ్వమని,ఏమే,అదే,ఇదే అంటుంటే ఈయన వస్తున్నాడంటే చాలు తలుపులేసుకోవటం మొదలుపెట్టారు.
మద్యానికి బానిసై ఎలాంటి మనిషి ఎలా తయారయ్యాడని బాధగా ఉన్నా చేయగలిగింది ఏమీ లేదు.ఎవరి మాట వినడు కనుక భార్య,పిల్లలుపెద్దయ్యారు కనుక వాళ్ళే శ్రద్ధ తీసుకుని మామూలు మనిషిని చెయ్యగలగాలి.ముప్పై
సంవత్సరాలు వచ్చినా మేము ఇంకా చిన్నపిల్లలమే అంటారు పిల్లలు.ఈ కాలం పిల్లలు కొంతమందికి పంటలు తీసుకోవటానికున్న శ్రద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూడటంలో లేదు.కలికాలం. 

Monday, 21 July 2014

బట్టల్లో పేలాలు వేయించటం

               వాసు ఒకప్పుడు వర్ధని వాళ్ళకు బట్టలు ఇస్త్రీ చేసేవాడు.ఉద్యోగరీత్యా వర్ధని వాళ్ళ కుటుంబం వేరే ఊరు
వెళ్ళాల్సివచ్చింది.ఒకపది సంవత్సరాల తర్వాత వాసు పొలాలు,ఇళ్ళు కొనాలన్నా,అమ్మాలన్నామధ్యవర్తిత్వం చేస్తున్నాడని తెలిసింది.వర్ధని మంచి పొలాలు,ఇళ్ళు ఎక్కడైనా ఉంటే కొనటానికి చూడమని ఫోన్ చేసింది.సరేనని
కొన్ని ఉన్నాయని గంట కొట్టినట్లు చెప్పాడు.మేము ఫలానా రోజున చూడటానికి వస్తామని రెడీ గా ఉండమని చెప్పింది.మొన్న మీకు చెప్పినవి కొన్ని కొనేశారు అసలు ఇవ్వాళ చూసింది రేపు ఉండటం లేదు పిచ్చిగా ఎగబడి  కోట్లు ఖర్చుపెట్టి కొనేస్తున్నారు.అమ్మేవాళ్ళు కూడా ఇవ్వాళ ఒక రేటు రేపొక రేటు చెప్తున్నారు అంటూ బట్టల్లో పేలాలు వేయించి నట్లుగా చెప్పాడు.వాసు ఇన్ని కబుర్లు నేర్చినందుకు,చెప్పే పద్దతికి వర్ధని ఆశ్చర్యపోయింది.    

మోసెత్తింది

               కృతిక వాళ్ళ పనిమనిషి లక్ష్మి మనుమరాలికి నాలుగు సంవత్సరాలు.పనిచేస్తున్నంతసేపు మాట్లాడటం   లక్ష్మి అలవాటు.ఒకరోజు మనుమరాలి ముచ్చట్లు చెపుతూ మామనుమరాలికి మామిడికాయలంటే మోసెత్తిందండీ
అంది.అంటే ఏమిటి?అంటే మీరు ఈసంవత్సరము మామిడికాయలు చాలాఇచ్చారు కదండీ.అవి అదేపనిగా తిని
అమ్మామ్మా!ఇకచాలు మోసెత్తిందంటుందండీ అంటే వెగటుపుట్టటం (మొహం మొత్తటం)అన్నమాట అంది.ఎవరు బజారుకు వెళ్తే వాళ్ళను మామిడికాయలు తెమ్మని పీక్కుతినేది.50 రూ.లు పెట్టినా రెండు కూడా రావు కదమ్మా!
మీరు ఇవ్వటంవల్ల ఇంటిల్లిపాదీ తృప్తిగా తిన్నాము.అందుకని పిల్లది అలాగంది అనిచెప్పింది.కృతిక వాళ్ళ అమ్మ,
తమ్ముడువాళ్ళు ఊరినుండి వస్తూ తోటకాయలు తీసుకుని రావటంవలన అందరితోపాటు లక్ష్మికి కూడా ఇచ్చేది.
అందుకే అంత సంతోషంగా తృప్తిగా తిన్నామని చెప్పింది.పాడైపోయిన తర్వాత పారేసుకునే బదులు బాగున్నప్పుడే మనతోపాటు వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని కృతిక అభిప్రాయం.వృధాగా పడేయటం ఎందుకని ముందే ఇస్తుంటుంది. 

మసాలాపొడి

 ధనియాలు  - 1 1/2 రైసు కుక్కర్ గ్లాసులు
 లవంగాలు -  6 గ్రా. (60 లవంగాలు )
యాలకులు - 3 ,4
దాల్చిన చెక్క  - 2 1/2 గ్రా.
              పైవన్నీ విడివిడిగా బాండీలో వేయించి ముందుగా ధనియాలు,తర్వాత మిగిలినవన్నీ ఒకేసారి మెత్తగా మిక్సీలో పొడి చేసుకోవాలి.ఒక చిన్న బేసిన్లో వేసి ఇవన్నీ కలిపి ఒక సీసాలో పోసుకుంటే వాసన పోకుండా అయిపోయేంత వరకూ మంచి వాసన వస్తుంటుంది.ఇది వెజ్,నాన్ వెజ్ కర్రీస్ కి కూడా చాలా బాగుంటుంది.

వానా వానా వల్లప్పా......

                కృష్ణ ప్రియకు చిరుజల్లులో తడవడమంటే ఎంతో ఇష్టం.వర్షం పడటం మొదలవగానే వచ్చే మట్టివాసన అంటే ఎంతో ఇష్టం.వానా వానా వల్లప్పా వాకిలి చెరుగు చెన్నప్పా.......అంటూ పాడుకుంటూ వర్షంలో గెంతుతూ ఉంటుంది.పెద్దగామెరుపులు,ఉరుములుతో కూడిన వర్షం వచ్చినప్పుడు అర్జునా,అర్జునా అంటూవర్షాన్ని చూడటం ఇష్టం.ఆవర్షం లో మొక్కజొన్న పొత్తులు కాల్చుకుని తింటూ కిటికీలో నుండి బయటకు చూడటం ఇంకా ఇష్టం.
పగలు దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా రాత్రి జోరున కురిసే వర్షాలంటే ఇష్టం.వర్షాలు విస్తారంగా కురిసి పొలాలు పచ్చటి పైర్లతో కళకళలాడుతుంటే చూడటం మహా ఇష్టం.గలగలపారే సెలయేళ్ళను,నిండుగా ప్రవహించే నదీమ తల్లులను చూడటం ఇష్టం.సకాలంలో వర్షాలు కురిసి పంట చేతికొచ్చినప్పుడు రైతన్నమొహంలో సంతోషాన్ని చూడటం ఇష్టం.సరైన సమయంలో వర్షాలుపడి,పంటలు బాగా పండి దేశం సుభిక్షంగాఉండటం ఇష్టం.
నాలుగైదు రోజులు కురిసే జిడ్డువర్షాలన్నా,పంటలు నష్టపెట్టే అకాలవర్షాలన్నామహా చిరాకు.
   

వేపుడు కారం

        ఎండు మిర్చి  - రెండు గుప్పెళ్ళు
       జీరా - ఒక చారెడు
      వెల్లుల్లి - 2
               ఎండుమిర్చి,జీరా మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొద్దిగా గింజగా ఉన్నప్పుడే తీసేయాలి.తీసేముందు వెల్లుల్లి వేస్తే మంచి వాసన వస్తుంది.ఇది వాడకాన్ని బట్టి ఒక పది,పదిహేను రోజులు వస్తుంది.బెండ,దొండ,ఆలూ
ఏ వేపుడుకైనా ఇదివేస్తే మంచి రుచి వస్తుంది.వేపుళ్ళకు మెత్తగా ఉన్నకారం కన్నాఈకారం బాగుంటుంది.
        

సంబారు కారం

       పచ్చి కారం(ఎండుమిర్చికారం) - 3 గిద్దలు (3 రైస్ కుక్కర్ గ్లాసులు)
      ధనియాలు - 1 1/2 గిద్దలు                        1 1/2 కుక్కర్ గ్లాసులు
      మెంతులు - 1/2 కుక్కర్ గ్లాసు
      జీరా  -  1/2 కుక్కర్ గ్లాసు
     ఉప్పు - 1 కుక్కర్ గ్లాసు
    పసుపు  - 2 టేబుల్ స్పూనులు
    నూనె - చిన్న గ్లాసు
   వెల్లుల్లి  - 5 పెద్దవి
                      ముందుగా ధనియాలు వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.మెంతులు మంచి వాసన వచ్చేట్లుగా వేయించి మెత్తగా పొడిచేసుకోవాలి.జీరా కూడా వేయించి పొడి చేయాలి.వెల్లుల్లి  పైపొట్టు తీసి మిక్సీలో
కొద్దిగా నలిగేట్లుగా చేయాలి.ఇవన్నీ ఒక బేసిన్లో వేసి కారం కూడా కొద్దిగా త్రిప్పుతూ గోరువెచ్చగా  వేడిచేసి బేసిన్లో
వేయాలి.ఉప్పు,పసుపు,నూనె కూడా వేసి పొడిగా ఉన్న గరిటెతో కానీ,తడిలేకుండా చేత్తోకానీ బాగా కలపాలి.
కొద్దిగా ఆరినతర్వాత తడిలేని సీసాలోకానీ,ప్లాస్టిక్ డబ్బాలో కానీ వెయ్యాలి.ఉప్పు వేస్తాం కనుక స్టీల్ డబ్బాలో వేయకూడదు.ఇది అన్నికూరల్లో వేస్తే అదనపు రుచి వస్తుంది.ఒకసారి కొంచెం శ్రమ పడితే మన వాడకాన్ని బట్టి
నెలో,రెండు నెలలో వస్తుంది.వెజ్,నాన్ వెజ్ కర్రీస్ కి కూడా బాగుంటుంది.పచ్చికారం డైరెక్ట్ గావాడుకునే కన్నా
ఇది చాలాబాగుంటుంది. ప్రయత్నించండి.తేడా మీకే తెలుస్తుంది.అప్పడాలు,వడియాలు,అప్పడపు పూలు,కార్న్ ఫ్లేక్స్ వేయించినప్పుడు ఈ కారం కొంచెంచల్లితే స్పైసీగా బావుంటాయి.ఉప్పు వేయనవసరం లేదు.  

Sunday, 20 July 2014

పేదవాడియాపిల్

        జామ పండు అంటే పేదవాళ్ళే తింటారు అది పేదవాడియాపిల్ అని చాలామంది అపోహ పడుతుంటారు.కానీ
దీనిలో ఆపిల్ కన్నా ఎక్కువ పోషకపదార్దాలుంటాయి.నిమ్మజాతి పండ్లలోకన్నా జామలో సి విటమిన్ ఐదు నుండి పదిరెట్లు ఎక్కువగా వుంటుంది.ఇది యాంటీఆక్సిడెంట్లాగాపనిచేసి గుండెజబ్బులు,అనేకరకాల కాన్సర్లు రాకుండా
కాపాడుతుంది.ఇందులోని పీచు మలబద్దకం పోగొడుతుంది.వ్యర్ధాలను తొలగించటంలో మూత్రపిండాలకు సహాయ పడతాయి.దంత పరిరక్షణకు జామ చక్కగా పనిచేస్తుంది.ఒక గ్లాసునీళ్ళల్లో నాలుగు జామ ఆకులు వేసి మరిగించి ఆరిన తర్వాత పుక్కిలించితే గొంతునొప్పి తగ్గుతుంది.కాల్షియం కూడా ఎక్కువ ఉండి ఎముకలు గట్టిపడటానికి
తోడ్పడుతుంది.దీనిలో ఎర్రజామ,తెల్లజామ రెండు రకాలుంటాయి.ఏదైనా ఒకటే ఉపయోగం.ఏది ఏమైనా పిల్లలకు అన్నిరకాల పండ్లు తినటం చిన్నప్పటినుండే అలవాటుచేయాలి.దోర జామపండుకొంచెం ఉప్పు,కారం చల్లుకుని తింటే చాలా బాగుంటుంది.పెద్దవాళ్ళు కూడా రోజుకొక జామకాయ తింటే మంచిది. 

నిందారోపణలు

                         శ్రీజిత్ మనస్తత్వం అనుమానంతోకూడిన నిందారోపణ మనస్తత్వం.తనకు తోచినది కొంత భార్య చెప్పినది కొంత జోడించి ఎదుటివారిపైన,ఆఖరికి కన్నపిల్లలైనా,తోడబుట్టిన తరపువాళ్ళైనా వెనుకాడడు.ఒకసారి
అత్యవసర పరిస్థితుల్లో అక్క ఊరు వెళ్ళాల్సి శ్రీజిత్ ఫ్యామిలీని నాలుగురోజులు తనింట్లో ఉండమని చెప్పింది.అది
భార్యకు ఇష్టంలేదు కాబోలు బయటకు చెప్పకుండా ఆడపడుచు కూతురిపై లేనిపోనివి కల్పించి భర్తకు చెప్పింది.అక్కఊరునుండి వచ్చేటప్పటికి పదహారేళ్ళ మేనకోడలిగురించి రెండురోడ్ల అవతలమేడ మీదున్న ఒక అబ్బాయివైపు చూస్తుంది.ఇద్దరూ లేచిపోయేట్లున్నారు అని చెప్పాడు.ఇదివిని మేనకోడలు చిన్నపిల్లైనా ఇది ఆడపిల్లను శంకిస్తూ మాట్లాడినమాట.నీకు ఇద్దరు ఆడపిల్లలున్నారు.చెప్పుమాటలు విని మాట్లాడొచ్చో,లేదోనని
 ఆలోచించాలి.నాపై నిందారోపణలుచేసినవాళ్ళు నాశనమైపోతారు అనేసింది.తప్పు అలా మాట్లాడకూడదు.నాకు నువ్వు ఏమిటనేది తెలుసుఅని కూతురికి చెప్పి శ్రీజిత్ ఇక ఈసంభాషణ ఇంతటితో వదిలెయ్యి.నాకూతురి గురించి నాకు బాగాతెలుసు అని చెప్పేసింది.పోనీ అప్పటికైనా బుద్ది మార్చుకున్నాడా అంటేఅదీలేదు.పదిహేనుఏళ్ల తర్వాత నాలుగురోజులువిశ్రాంతిగా అక్కఇంట్లో ఉన్నాడు.అక్కకొడుకు గురించి పిల్లడు మనచేతిలోలేడు.చెయ్యి దాటాడు
అనిచెప్పాడు.అది ఏమిటంటే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని ,స్నేహితులతో చాట్ చేస్తున్నాడని దాని సారాంశం.
శ్రీజిత్ నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు.ఈరోజుల్లో అది మామూలు విషయం.తను ఎలాంటివాడో నాకు తెలుసు
అని అక్క చెప్పింది.ఈపిచ్చి వాగుడు వల్ల తనవిలువ పిల్లల దగ్గర,తల్లిదండ్రుల దగ్గర కూడా పోగొట్టుకుంటున్నానని అర్ధం చేసుకోవటంలేదు.పెద్దవాళ్ళు మర్చిపోయినా పిల్లలు వీటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు.పోనీ ఇది ఎదుటి
వాళ్ళకే పరిమితమా?అంటే తనపిల్లలు పైన ఉంటే ఎవరో చూశారని మీరు చూడందే వాళ్ళెందుకు చూస్తారని నాలుగు వేసేసరికి మేము ఏమీ చెయ్యకపోయినా కొట్టటమేమిటి?అని పిల్లలు మనసులో కోపం పెంచుకున్నారు.
ఈ విపరీత మనస్తత్వం వల్ల ఎదుటి మనసులు బాధపడటం,తన విలువ పోగొట్టుకోవటం తప్ప ఏమీ లేదు.భార్య
అంటే ప్రేమ ఉండొచ్చు కానీ చెప్పుడుమాటలు విని మాట్లాడటం అంత తెలివితక్కువ మరోటి లేదు.శ్రీజిత్ అక్క గొడవలు ఎందుకులే అనుకోవటం వల్ల కానీ లేకపోతే కుటుంబంలో పెద్ద గొడవలయ్యేవి.
  

పరమాత్ముని పండు

                 పరమాత్ముని పండు అంటే బొప్పాయి పండు.బొప్పాయి పండుని అందరు ఇష్టపడరుకానీ దీనిలో ఎన్నో
పోషకపదార్దాలు ఉంటాయి.ఎ,బి,సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.మలబద్దకం లేకుండా చేస్తుంది.రోజు ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహం,గుండెజబ్బుల బారినపడకుండా చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బాగా పండిన బొప్పాయిపండు చాలా రుచిగా ఉంటుంది.బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.పచ్చికాయ తో కూర చేసుకోవచ్చు.చెక్కు తీసి ముక్కలుకోసి ఉడికించి బాగాపిండి,మెత్తగా కాకుండా (బద్దగాఉండాలి)ఉడికించిన కందిపప్పుతో కలిపి వేపుడు చేస్తే చాలా బాగుంటుంది.పచ్చిబొప్పాయి ముక్క వేస్తే ముదురుమాంసం కూడా మెత్తగా ఉడుకుతుంది.తల్లిపాల వృద్దికి పచ్చిబొప్పాయి మంచిది.బాగాపండిన బొప్పాయి
గుజ్జు,తేనెకలిపి మొహానికి,మెడకు అప్లై చేసి ఒకపది ని.ల.తర్వాత కడిగితే నున్నగా మెరుస్తుంది.ఇన్నిరకాలుగా బొప్పాయి వలన ఉపయోగాలు ఉన్నాయి కనుకనే దీనిని పరమాత్ముని పండు అని అంటారు.    

ఆలూ - క్రిస్పి

         బంగాళ దుంపలు - 4
         ఉప్పు,కారం - తగినంత
         జీడిపప్పు - మన ఇష్టం
         కరివేపాకు - కొంచెం
             ముందుగా బంగాళదుంపల్నికడిగి చెక్కు తీసి కొంచెం పెద్దగా తురమాలి.తురుము రంగు మారకుండా
కొంచెం నీళ్ళల్లో వేసి బాగా చేతితో పిండి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.వేయించటానికి సరిపడా నూనె బాండీలో పోసి బాగా కాగిన తర్వాత తురుము కొంచెం కొంచెం నూనెలో చల్లుతున్నట్లుగా వేయాలి.లేకపోతే ఉండలు కట్టినట్లుగా ముద్దగా వస్తుంది.వేయగానే అటుఇటు త్రిప్పి బంగారు వర్ణం రాగానే తీసేసి పేపర్ మీద వేయాలి.మొత్తం అలాగే వేయించుకోవాలి.తర్వాత కొంచెం నూనెలో కరివేపాకు వేసి వేగినతర్వాత జీడిపప్పు వేయించి సరిపడా ఉప్పు,కారం వేయించిన ఆలూవేసి ఒకసారి త్రిప్పిబౌల్ లో వేస్తే ఆలూ క్రిస్పి రెడీ.ఇది కరకలాడుతూ క్రిస్పీగా,రుచిగా ఉంటుంది.
చేయటం కూడా చాలా తేలిక.పిల్లలు,పెద్దలు కూడా ఇష్టపడతారు.
గమనిక :ఎక్కువ వేయించితే మాడిపోయి రుచిగా ఉండదు.

బుల్లిపిట్ట మజిలీ

                            ఒకరోజు సాయంసంధ్యా సమయంలో సన్నగా వాన తుంపరలు పడటం మొదలైంది.పక్షులన్నీ గూళ్ళకు చేరుకునే సమయం.ఒకబుల్లిపిట్ట గూటికి చేరేసమయంలో వర్షం పడటం మొదలై అకస్మాత్తుగా పెరిగింది.
అప్పుడు బుల్లిపిట్టకు దారిలోఒక ఇంట్లో కుండీలో మొక్కలు కనిపించాయి. వివేకంతో బుల్లిపిట్ట తడుస్తూ వెళ్ళేకన్నా
కుండీలోని మొక్కఆకుల్లో తలదాచుకుందామనుకుని ఒక ఆకుమీద వాలింది.కొంచెం వానజల్లు మీదపడుతుందని
పైకి తేరిపారచూచి గొడుగుక్రింద ఉన్నట్లుగా అడ్డంగా ఉన్న ఆకుక్రింద నిలబడింది.వర్షం పడుతుందని నీరజ తలుపు తీస్తే వరండాలో ఈదృశ్యం కనిపించింది.ఆపిట్ట తెలివికి ముచ్చటేసింది.ఇంతలో నీరజవాళ్ళ అబ్బాయి అమ్మ ఏమి గమనిస్తుందో చూద్దామని వచ్చి బుల్లిపిట్ట నిలబడిన విధానం బాగుందని ఫోటో తీశాడు.కొంచెంసేపటికి వర్షంపడటం ఆగిపోయింది.చీకటిపడినాసరే బుల్లిపిట్ట తుర్రుమంటూ తనగూటికి ఎగిరిపోయింది.

Wednesday, 16 July 2014

రాతి ఉసిరితో రకరకాలు

         రాతి ఉసిరి అంటే చిన్నఉసిరి ఊళ్ళల్లో దాదాపు అందరి ఇళ్ళల్లో వుంటుంది.ఇది కొంచెం తీపి,పులుపుతో కలిసి రుచిగా ఉంటుంది.కొన్ని స్కూళ్ళదగ్గర ఇప్పటికీ ఉప్పు,కారం కలిపిపొట్లంతో రాతి ఉసిరి కాయలు అమ్ముతూ ఉంటారు.పిల్లలు ఇష్టంగా తింటారు.దీనిలో ఎన్నో పోషకపదార్దాలు ఉంటాయి.వీటిని కందిపప్పుతో కలిపి పప్పు చేసుకోవచ్చు.రాతి ఉసిరి కాయలు,పంచదార సమాన కొలతతో స్టవ్ సిమ్ లో పెట్టి త్రిప్పుతూ ఉండాలి.అప్పుడు తేనెరంగులో చిక్కగా అయిన తర్వాత దించేయాలి.రోజు ఒకకాయతో,ఒకస్పూనుతేనె లాగా తింటే చాల మంచిది.
ఇది నిల్వ వుంటుంది.దీనితో జామ్ బాగుంటుంది.పులిహోర చేసుకోవచ్చు.

పాలకూర - ఆలుగడ్డ

పాలకూర -4 కట్టలు (చిన్నవి)
ఆలుగడ్డలు - 1/4 కే.జి
ఉల్లిగడ్డలు - 2
పచ్చిమిర్చి  - 5
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
ఉప్పు - తగినంత
వేపుడు కారం - 1 టేబుల్ స్పూను
గరం మసాలా - 1/2 స్పూను
నూనె - సరిపడా
          ముందుగా ఆలుగడ్డలు ఉడికించి మధ్యరకం ముక్కలు కట్ చేయాలి.బాండీలో నూనె వేయించటానికి సరిపడాపోసి ఆలుగడ్డ ముక్కల్నిఫ్రైచేసి ప్రక్కన పెట్టుకోవాలి.మిగిలిన నూనెలో తాలింపుదినుసులు కరివేపాకువేసి చిటపటలాడినతర్వాత ఉల్లి,పచ్చిమిర్చి,అల్లంవెల్లుల్లిపేస్ట్ వేసివేగాక పాలకూరవేసి కొంచెంమ్రగ్గినతర్వాత
వేయించిన ఆలూముక్కలు,ఉప్పు,వేపుడుకారం(ఎండుమిర్చి,జీరా వేసి మరీమెత్తగా కాకుండా మిక్సీలో కారం
చేయాలి.ఇది వేపుడు కూరలకు బాగుంటుంది.)వేసి కొంచెం వేయించి గరం మసాలా పొడిచల్లి మంచి వాసన వస్తుండగా తీసేయాలి.ఘుమఘుమలాడే పాలకూర ,ఆలుగడ్డ కర్రీ రెడీ.   

Tuesday, 15 July 2014

ఉల్లికాడలు - గ్రుడ్డు

              ఉల్లికాడలు వేస్తే బిర్యానీకి,ఫ్రైడ్ రైస్ కి అదనపు రుచివస్తుంది.వీటితో చాలావెరైటీలు చేసుకోవచ్చు.చాలా
త్వరగా కూడా అయిపోతుంది.ఉల్లికాడలు,గ్రుడ్డు వేసి చేస్తే చాలా బాగుంటుంది.అదెలా చేయాలంటే ........
               ఉల్లికాడలు - 1 కట్ట (మీడియం సైజుది)
               గ్రుడ్లు  - 3
               పచ్చిమిర్చి - నాలుగు
                అల్లం,వెల్లుల్లి పేస్ట్  - 1 స్పూను
               ఉప్పు - తగినంత
               కారం   - 1 స్పూను
               గరం మసాలా పొడి - 1/2 స్పూను
                నూనె - సరిపడా కన్నా కొంచెం ఎక్కువ
                              ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీలో నూనెవేసి తాలింపు పెట్టి ఉల్లికాడలముక్కలు,పచ్చి
మిర్చి ముక్కలువేసి కొంచెం వేయించి, అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి మధ్యరకంగా వేగాక ఉప్పు,కారం,గరంమసాలాపొడి
వేసి ఒకసారి త్రిప్పి గ్రుడ్లు కొట్టి ఆమిశ్రమంలోవేసి త్రిప్పాలి.కొంచెం నూనె పైకి తేలితే గ్రుడ్డుసొన బాగావేగి రుచి  బాగుంటుంది.వేడిగా ఉల్లికాడలు,కోడిగ్రుడ్డు కర్రీ రెడీ.  

షూటింగ్ హంగామా

                      స్వప్నకు తెలిసినతను,ఐదుగురు స్నేహితులుతో కలిసి తక్కువ బడ్జెట్ సినిమా తీస్తున్నామని చెప్పాడు.రెండు నెలలనుండి ఒకహిందీ అమ్మాయినితెచ్చి వేరేహోటల్లో బస ఏర్పాటు చేస్తే చాలాడబ్బు ఖర్చు అవుతుందని ఇంట్లోనే ఏర్పాటు చేశారు. మాఇంట్లో హీరోయిన్ ఉందని అందరికీ చెప్పటం మొదలుపెట్టారు.వాళ్ళ బంధువుల ఇంట్లోనో,వాళ్ళ ఇళ్ళల్లోనో షూటింగ్ తీస్తున్నారు.స్వప్న ఇంటి ప్రక్కనతను మాఇంట్లో షూటింగ్ ఉందని చుట్టుప్రక్కల షాపుల్లో,ఇళ్ళల్లో చెప్పి హంగామా చేశాడు.సినిమా షూటింగ్ పిచ్చివాళ్ళు కొంతమంది పాపం షూటింగ్ ఉందని చూద్దామని చక్కగా రెడీ అయి వచ్చారు.తీరా చూస్తే అక్కడ ఏ షూటింగ్ లేదు.వచ్చినవాళ్లు పెద్ద హంగామా చేశాడు సినిమా షూటింగ్ ఉందని, పైగా కాస్త అందంగా ఉన్నఅమ్మాయిలను మాసినిమాలో నటిస్తావా?అంటూ అడగటం అని తిట్టుకుంటూ ఇళ్ళకు వెళ్లారు.సినిమా తీస్తున్నామని వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది.తెలిసినవాళ్ళ దగ్గర కూడాఎంతో గర్వంగా మాట్లాడుతున్నారు.

Monday, 14 July 2014

వీరంగం

             సాత్విక షాపింగ్ కి వెళ్ళి వస్తుండగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది.విషయం ఏమిటంటే ఇంజినీరింగ్ చదువుకుంటున్న కుర్రవాడికి మతిస్థిమితం లేక కత్తి తీసుకుని రోడ్డుమీద కనిపించిన వాళ్ళందరినీ గాయపరుస్తూ
వీరంగం సృష్టించటంవలన ఇబ్బంది తలెత్తింది.అతన్ని ఆపటంకోసం కొంతమంది రాళ్ళు తీసుకుని విసరటం,అతన్ని  గాయపరచటం,కారం చల్లటం చేస్తున్నారు.ఆ నేపధ్యంలో అక్కడ ఉన్నషాపులు,ఇళ్ళ అద్దాలు పగిలిపోయి రోడ్డంతా గాజుపెంకులు పరుచుకున్నాయి.ఎలాగయితే కొంతమంది ధైర్యం చేసి వెనుకనుండి అతన్ని పట్టుకుని చేతులు వెనక్కు విరిచి,ఒకబాల్చీ నీళ్ళు తలపైనుండిపోశారు.అందరూ రాళ్ళూ విసరటం వల్ల అతనికి ఎక్కడపడితే అక్కడ గాయాలయ్యాయి. పోలీసులొచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు.సాత్విక కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పెద్దాయన గాయాలతో కనిపించాడు.తెలిసిన అతనిలాగా కనిపించి ప్రక్కవాళ్ళను అడిగితే ఇదంతా చేసింది ఆయన కొడుకేననీ,ముందు ఆయన్నేకత్తితో గాయపరిచాడనీ చెప్పారు.తండ్రి ఎత్తుగా,లావుగా ఉండేవాడల్లా ఇప్పుడు చిన్నగా,సన్నగా ఉండటంవల్ల సాత్విక మొదట గుర్తుపట్టలేదు.వ్యాపారం చేస్తూ దర్జాగా తిరిగేవాడు.బంధువులు మోసం చేయటంవల్ల ఈపరిస్థితులు తలెత్తినాయని చెప్పి బాధపడ్డాడు.సాత్విక కు కూడా అయ్యో పాపం !అనిపించి ఇంటికి వెళ్ళినా అదే దృశ్యం కళ్ళల్లో మెదులుతూనే ఉండి రోజంతా ఏపనిమీదా మనసు లగ్నం చేయలేక పోయింది.  

ఫెయిర్ &లవ్లీ తాత

               సౌదామిని భర్త,పిల్లలతో కలిసి అత్తగారి ఊరు వెళ్ళింది.వీళ్ళు అనుకోకుండా వేరే ఊరు వెళ్తూ మధ్యలో పెద్దవాళ్ళను చూద్దామని వెళ్లారు.వీళ్ళు వెళ్లేసరికి మామగారు మొహానికి అక్కడక్కడ తెల్లతెల్లగా ఏదోదట్టంగా రాసుకున్నారు.ఆయన ఎవరూ చూడకుండా మొహం తిప్పుకుంటున్నారు కానీ వీళ్ళ కంట పడనేపడింది.కోడలు
అడగటం బావుండదు కదా!అందుకని అడగలేదు.టేబుల్ సర్దుతూఉండగా ఫెయిర్&లవ్లీ కనిపించిసౌదామిని చేతితో పట్టుకుని చూస్తుంది.మామగారికి తొంభై ,అత్తగారికి ఎనభై సంవత్సరాలు.వీళ్ళకు దీనితో ఏమి అవసరంఉందబ్బా! అనుకుంటూ ఉండగావాళ్ళ అత్తగారు చూచి మీమామగారు మొహాన చిన్నచిన్న బ్రౌన్ కలరు మచ్చలు ఉన్నాయని
రాసుకుంటున్నారు అని చెప్పింది.సౌదామిని ఏమీ మాట్లాడలేదు.పిల్లలు మాత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఫెయిర్&లవ్లీ తాత అంటూ నవ్వటం మొదలుపెట్టారు.
  

Sunday, 13 July 2014

ఆటపట్టిద్దామనుకొంటే..

        నిఖిల్ పొట్టిగా సన్నగా ఉంటాడు.కళాశాలలో తోటి విద్యార్ధులు అందరికన్నా చిన్నగా ఉండటంవలన చిన్న
పిల్లవాడిలాగా ఆట పట్టిస్తుంటారు.నిఖిల్ కి తనను ఎవరూ లెక్క చేయటంలేదనే అభిప్రాయం.అందుకని ఒకసారి
కళాశాల ఆవరణలో ఇద్దరు చిన్నపిల్లలు సైక్లింగ్ చేస్తుంటే వాళ్ళను ఆపి మీపేర్లేమిటి? అనిఅడిగాడు.వాళ్ళు నీకు
చెప్పేదేమిటి?అన్నట్లుగా ముందు నీపేరు చెప్పుతర్వాత మా పేర్లు చేప్తామన్నారు.నిఖిల్ వేరే పేరు చెప్పాడు.పిల్లలు కొంచెం అవతలికి వెళ్ళి వేరే వాళ్ళను అడిగి నిఖిల్ పేరు తెలుసుకున్నారు.మా నాన్న ఈ కళాశాలలో ప్రొఫెసర్. నువ్వు మమ్మల్నిఆపినందుకు మమ్మల్ని తిట్టావని నీపేరు మానాన్నకు చెప్తాము అంటూ అక్కడినుండి వేగంగా
వెళ్ళిపోయారు.నిఖిల్ ఈ విషయం తన స్నేహితుడితో చెప్తూ అదేమిట్రా?నన్ను చిన్నపిల్లలుకూడా లెక్కచెయ్యట్లేదు
నేను ఆట పట్టిద్దామంటే నన్నే ఆట పట్టిస్తున్నారు అంటూ బాధపడిపోయాడు.  

ఈడేర్చలేను

                       మల్లిక్ కి కూతురు పుట్టింది.భార్య విచిత్రమైన మనిషి.కూతురికి ఆరునెలల వయసప్పుడు ఒకసారి  మల్లిక్ మేనకోడలు ఎత్తుకుంది.మల్లిక్ భార్యకు పిల్లను ఎత్తుకోవటం ఇష్టంలేక భర్తకు పిల్లను పడిపోయేటట్లుగా ఎత్తుకుంటుందని లేనిపోని కల్పితాలు చెప్పింది.అది నిజమేననుకుని చూడకుండానే వద్దని చెప్పలేక అది క్రింద
పడిపోతే కాళ్ళు విరిగిపోయి కుంటిదయితే పెద్దయిన తర్వాత దాన్ని ఈడేర్చలేను అన్నాడు.పిల్లల్ని జాగ్రత్తగా ఎత్తుకోమని చెప్పాలి లేదంటే నా భార్యకు ఎవరూఎత్తుకోవటం ఇష్టంలేదని ముక్కుసూటిగా చెప్పొచ్చు.ఆరెండు కాకుండా ఎంతో దూరం ఆలోచనా స్రవంతి వెళ్ళిపోయింది.ఏమిటో ?విచిత్రమైన మనుషులు,మనస్తత్వాలు.   

గావుకేక

            రోహన్ స్నేహితుడు రోహిత్  వైద్య శాస్త్రం మొదటిసంవత్సరం చదువుతున్నాడు.మొదటిసంవత్సరంలోని
సబ్జెక్ట్ లు అన్నీ కష్టంగా ఉంటాయి కనుక పాసవగలనో లేదోనని కంగారుపడ్డాడు.రిజల్ట్సు వచ్చినప్పుడు తనుకూడా పాసయ్యానని తెలిసి ఆ సంతోషంలో పెద్ద గావుకేక పెట్టి ఎవరో చనిపోతే ఏడ్చినట్లు బావురుమన్నాడు.ఏమైందో అర్ధం కాక అందరూ పరుగెత్తుకొచ్చారు.ఏమైందిరా?అంటే చెప్పకుండా ఏడుస్తున్నాడు.కాసేపు శోకాలు తీసి తాపీగా నేను
పాసయ్యాను అందుకే సంతోషంతో ఏడ్చానని చెప్పాడు.ఓరి నీ సంతోషం మాటేమోగానీ మమ్మల్నందరినీ కంగారు
పెట్టేశావు కదరా! అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. 

చిన్ని మనసు ఆతృత

            జలంధర మూడవతరగతిలో ఉన్నప్పుడు తరగతిలో మొదటిస్థానం వచ్చినందుకు టీచరు ఒక పుస్తకం
బహుమతిగా ఇచ్చారు.తర్వాత ఆ టీచరు పదోన్నతిపై వేరే ఊరికి బదిలీ అయ్యారు.వెళ్తూవెళ్తూ జలంధరను పిలిచి
చక్కగా చదువుకోమని చెప్పారు.జలంధరకు ఆ టీచరు అంటే మహా ఇష్టం.కొద్దిరోజుల తర్వాత ఆ టీచరు ప్రక్క ఊరిలోని స్కూల్లో ఉన్నారని తెలిసి ఆమెను చూద్దామని చిన్నిమనసు ఆతృత పడింది.ఇంట్లో చెప్తే వద్దంటారని
చెప్పకుండా జలంధర,ఇద్దరు స్నేహితురాళ్ళను తీసుకుని ప్రక్కఊరి స్కూలుకు వెళ్ళింది.ఇంతాకష్టపడి అక్కడికి
వెళితే ఆటీచరు వేరే ఊరికి వెళ్ళిపోయారు.టీచరును చూద్దామని ఆతృతతో వెళ్ళిన ఆ చిన్నిమనసుకు నిరాశ కలిగింది.తర్వాత ఇంట్లో చెప్పకుండా వెళ్ళినందుకు నాలుగు చివాట్లు పెట్టారు.

Friday, 11 July 2014

సేమ్యా వడ

     సేమ్యా  -1 పాకెట్
    నీళ్ళు  - 3 నీళ్ళు
    బ్రెడ్ - 2,3 ముక్కలు
    ఆలూ - 2 లేక 3
    పల్లీలు - కొంచెం
     పచ్చిమిర్చి - 4,5
     నూనె   - సరిపడా
    కొత్తిమీర - 1 చిన్న కట్ట
                   మరుగుతున్న నీళ్ళల్లో కాస్త ఉప్పు,సేమ్యా,ఒక స్పూన్ నూనెవేస్తే సేమ్యాపొడిగా వస్తుంది.ఉడికిన తర్వాతనీరు లేకుండా వంచేయాలి.బ్రెడ్ నీళ్ళల్లో నానబెట్టి పిండేసి ముద్దగా చెయ్యాలి.ఆలూ ఉడికించి మెత్తగాచేసి
ఉడికించిన సేమ్యాలో, బ్రెడ్, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు,సన్నగాతరిగిన కొత్తిమీర,పల్లీ ముక్కలు అన్నీ కలపాలి.తడిలేకుండా బాగాకలపాలి.చేతితోకానీ,కవరుమీదకానీ వడలుగా గుండ్రంగావత్తి కాగేనూనెలో వేయించాలి.
సాస్ తోకానీ,కొబ్బరి చట్నీతోకానీ వేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Thursday, 10 July 2014

అడుక్కోవటానికి హద్దు

             రాజ్ కొడుక్కి పిల్లనివ్వటమే కష్టం.ఎందుకంటే పాపం అమాయకుడు.పుట్టుకతోనే తేడాగాపుట్టాడు.వాళ్ళకు వేరే స్కూళ్ళు వున్నాయి.వాటిలో చేర్చితే ప్రయోజనం ఉంటుంది.మామూలు స్కూల్లోచేర్చి చదవటంలేదని రాజ్
కొట్టేవాడు.ప్రతి పరీక్షకు లంచం ఇచ్చి ఎలాగో ఇంటరువరకు లాక్కొచ్చాడు.టెక్నికల్ కోర్సులో చేర్చి పాసవటంలేదని
కొట్టి చివరకు విసుగొచ్చి లక్షల్లో లంచమిచ్చి చిన్నప్రభుత్వోద్యోగంలో పెడదామన్నా సాధ్యపడలేదు.అసలు తండ్రిగా
పిల్లవాడి పరిస్థితి అర్ధం చేసుకుని తగిన స్కూల్లో చేర్చాలి.పిల్లవాడిని ఇబ్బంది పెట్టకూడదు అని అర్ధం చేసుకోవాలి.
సరే అయిపోయిందేదో అయిపొయింది.రాజ్ బంధువులలో ఒకామె అయినవాళ్ళల్లో పిల్లనిద్దామని పిల్లడు ఎలాఉన్నా
డబ్బుఉంది అని డబ్బిచ్చి మరీ పిల్లనిస్తంది.పిల్లనివ్వటమే ఎక్కువయితే ఆమెను ఆడపడుచు కట్నం ఇమ్మని,పెళ్ళి బాగా చెయ్యమని,150 కాసుల బంగారం పెట్టమనీ,తిరగటానికి పెద్దకారు ఇవ్వమనీ,ఊళ్ళుఊళ్ళు స్వీట్లు,గిఫ్టులు పంచిపెట్టుకోవటానికి ఇవ్వమనీ ఒత్తిడి చేసి అడుగుతున్నాడు.బంధువులలో పిల్లనిస్తే అండగా ఉంటారనే ఒకపిచ్చి
ఆలోచనతో ఆమె అన్నింటికీ సరే అంటుంది కదా!అని అడుక్కోవటానికి కూడా హద్దు ఉండాలి. 

ఊతపదమా?కుళ్ళుబోతుతనమా?

                     మోహన్ ఒకభాద్యతగల పదవిలో ఉన్నా డబ్బే ముఖ్యమనుకునే లంచగొండి.దానికితోడు కొడుకు అమాయకుడైనా మోహన్ పిన్ని పెంచుకున్న మొండి కూతుర్నిచ్చి ఆస్తి కట్టబెడుతుంది.ఇక మోహన్ కు,భార్యకు
ఆనందానికి అవధులు లేక భూమ్మీద కాళ్ళు నిలవటం లేదు.మోహన్ అన్న కూతురు,అల్లుడు విదేశాలలో డాక్టర్లు.
తన కొడుకు పెళ్ళి విషయం చెప్పటానికి కూడా ఫోను చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయని తనకు ఫోను చేయమని మెసేజ్ పెట్టటము,మిస్స్డ్ కాల్స్ ఇవ్వటము చేస్తుంటాడు.సరే బాబాయి కదా అని తీరిక చేసుకుని ఫోను చేస్తే చిన్న
వయసు డాక్టర్లను పట్టుకుని"మీ ఆరోగ్యం బాగుందా?"అని ఇద్దరినీ అడుగుతుంటాడు.పోనీ సానుకూలదృక్పధం తో
ఆలోచించి అతనికి "ఊతపదమా?" అనుకోవటానికి లేదు.వేరేవాళ్ళను ఎవరినీ అడగటం ఎప్పుడూ వినలేదు.తను
అడ్డగోలుగా సంపాదించుకుంటున్నాకూడా అన్నపిల్లలు డాక్టర్లని కుళ్ళుబోతుతనమా?ఏమో?

బేబీ కార్న్ స్నాక్

            బేబీ కార్న్ - 1/4 కే.జి
            మిరియాలపొడి -1/2 స్పూన్
            కాప్సికం  - 1/4 కే .జి
            కొత్తిమీర - కొంచెం
            కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్లు
            ఉల్లిపాయ - 1
             మైదా - 1/4 కప్పు  
            అల్లం,వెల్లుల్లి పేస్ట్  - 1 టీస్పూన్
            మిర్చి - 4
           మిరియాల పొడి - కొంచెం
           ఉప్పు - కొంచెం
           కారం - కొంచెం
                            బేబీ కార్న్ ముక్కలు కట్ చేసి మైదా,కార్న్ ఫ్లోర్ ,నీళ్ళుపోసి ఉప్పు,కారం,అల్లం,వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి ఒక్కొక్కటి వేయించాలి.పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించాలి. కాప్సికం ,మిర్చి సన్నగా కట్ చేసి కొంచెం వేగిన తర్వాత వేగిన బేబీ కార్న్ వేసి,కొంచెం ఉప్పు,మిరియాలపొడి,కారం వేసి ఒక ప్లేట్ లో పెట్టి కొత్తిమీర సన్నగా కట్ చేసి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

బాత్ రూమ్ మామ్మగారు

           నాగమణి పెద్దమ్మ ఒక ఇరవై సంవత్సరాల క్రితం కొడుకు దగ్గరకు అమెరికా వెళ్ళివచ్చింది.నాగమణి పెద్దమ్మ  నాగమణి స్నేహితురాలు ఒకేసారి నాగమణి ఇంటికి వచ్చారు.అమెరికా వెళ్ళి వచ్చారట కదా!అక్కడ ఎలావుంది?అని అడిగింది.అక్కడ వాతావరణం చాలా బాగుంది.దుమ్ము,ధూళి ఏమీ ఉండదు.గజిబిజి ట్రాఫిక్ ఉండదు.ఎటు
చూచినా ఎత్తైన బిల్డింగులు,పెద్దపెద్ద చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది.బాత్ రూమ్ లయితే ఎంత నీట్ గా ఉంటాయో
క్రింద నెయ్యిపోతే అద్దుకోవచ్చు అన్నంత శుభ్రంగా ఉంటాయి అంది.ఆహా!అలాగా!అంది.ఇక అప్పటినుండి ఇరవై సంవత్సరాలనాటి సంగతి గుర్తుపెట్టుకుని ఇప్పటికీ నాగమణి కనిపించినప్పుడల్లా స్నేహితురాలు నవ్వుకుంటూ
"బాత్ రూమ్ మామ్మగారు"బాగున్నారా?అని అడుగుతుంటుంది.

హెయిర్ స్టైల్

           సత్యవాణి స్వంతఊరిలో ఉన్న ఇంట్లో ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు క్రొత్తగా పనికి చేరాడు.వాడు పొట్టిగా,బొద్దుగా వుంటాడు.వాడిది గిరజాలజుట్టు.వాడు నిమిషానికి ఒకసారి కారుఅద్దంలోనో,బైక్ అద్దంలోనో
మొహం చూసుకుంటూ జుట్టు సరిచేసుకుంటూ ఉంటాడు.మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.ఒకసారి సత్యవాణి ఊరు వెళ్ళినప్పుడు గమనించి ఏమిటి కాసేపటికి ఒకసారి అద్దంలో చూచి జుట్టు చేత్తో సరిచేసుకుంటూ
కనిపిస్తున్నావు? అని అడిగింది.మేము నలుగురు స్నేహితులం.మేము అందరమూ ఒకబార్బరుదగ్గర హెయిర్ స్టైల్ చేయించుకుంటాము.ఒక జెల్ తలకుపట్టిస్తే ఏ రకంగా కావాలంటే ఆరకంగా జుట్టు వంగుతుంది.అందుకని అద్దంలో
వీలున్నప్పుడల్లా సరిచేసుకుంటూ ఉంటానుఅని చెప్పాడు.ఓరి బడవా!సిటీలో చదువుకునే కుర్రాళ్ళు రకరకాల
హెయిర్ స్టైల్స్ చేయించుకుంటుంటే మొహాలు విచిత్రంగా తయారవుతున్నాయి అనుకుంటే ఇక్కడకూడా ఈజాడ్యం
మొదలయిందా? అనుకుంది.   

Wednesday, 9 July 2014

అరుగు రాజకీయాలు

                       పల్లెల్లో అందరి ఇళ్ళముందు కూర్చుని మాట్లాడుకోవటానికి అరుగులు ఉంటాయి.దాదాపు అందరి
ఇళ్ళల్లో పెద్దపెద్ద చెట్లు ఉంటాయి.అందుకని ఏ టైములోనయినా అరుగులకు నీడ ఉంటుంది.ఆడవాళ్ళు ఖాళీగా
ఉన్నప్పుడు అందరూ అరుగులమీద కూర్చుంటారు.మగవాళ్లందరూ ఇంకోప్రక్కన మీటింగు పెడతారు.ఆమీటింగు
పెట్టినప్పుడు ఉల్లిపాయ,చింతపండు దగ్గరనుండి ముఖ్య మంత్రులు,ప్రధాన మంత్రుల వరకూ చర్చలు జరుగుతూ ఉంటాయి.పెరగబోయే నిత్యావసర ధరల నుండి లోక్ సభ రాజ్యసభల్లో తీసుకోబోయే నిర్ణయాల గురించికూడా వీళ్ళే
ఊహించి ముందే చెప్పేస్తుంటారు.అక్కడ కాసేపు కూర్చుంటే చాలు పేపరు చదవాల్సిన అవసరం లేదు.అంతెందుకు రైల్వే బడ్జెట్ లోని లోపాలు ఏమిటి?ఎవరికి అనుకూలంగా ఉపయోగంగా ఉంది ?అన్నది వాళ్ళే నిర్ణయించేస్తారు.ఇక
ఆడవాళ్ళు మార్కెట్లో పిన్నీసు మొదలు సత్యపాల్ డిజైనర్ చీరల వరకూ మాట్లాడేస్తుంటారు.కొంచెంసేపు అక్కడ కూర్చుంటే చాలు మనకు ఎన్నో క్రొత్తక్రొత్త విషయాలు తెలుస్తుంటాయి.వెళ్ళి కూర్చున్నవాళ్ళు నోరు తెరవక తప్పదు.

స్వీట్ కార్న్ చాట్

స్వీట్ కార్న్ - 200 గ్రా.
ఉడికించిన ఆలూ - 1
ఉల్లిముక్కలు - కొంచెం
టొమాటో ముక్కలు - కొంచెం
పచ్చిమిర్చి - 2
కారట్ - 1
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - సరిపడా
కారామ్-కొంచెం
చాట్ మసాలా  -1 స్పూను  జీరా పౌడర్ - 1 స్పూను
నిమ్మరసం - 1 టీ స్పూను
             ఉడికించిన కార్న్,ఆలూ ముక్కలు,ఉల్లి,టమాటో ముక్కలు,పచ్చిమిర్చి సన్నని ముక్కలు,కారట్ తురుము,కొత్తిమీర సన్నగా తరిగినది,ఉప్పు,కారం,చాట్ మసాలా,జీరా పౌడరు,నిమ్మరసం అన్నీ వేసి కలపాలి.
ఇది పిల్లలకు,పెద్దలకు కూడా హెల్దీ చాట్.

నిలువెల్లా స్వార్ధం

                         ఈరోజుల్లో నూటికి తొంభై మంది ప్రక్కవాళ్ళు ఏమైనా ఫర్వాలేదు మనం మాత్రం బాగుంటే చాలు అనుకుంటున్నారు.అంతెందుకు ఒకే కుటుంబంలో అక్కచెల్లెళ్ళు,అన్నదమ్ములు కూడా తన తోడబుట్టిన వాళ్లకు
దక్కకుండా వీలయినంతవరకు ఎవరికి వాళ్ళేతామే తినేద్దామనే ఆలోచనలో ఉంటున్నారు.అలాగని అందరూ అదే రకంగా ఉంటారని కాదు ఎక్కువ శాతం మంది ఇదేరకంగా ఉన్నారు.కుళ్ళు,కుతంత్రాలు మనసులో పెట్టుకుని పైకి
మొహాన నవ్వు పులుముకోవటం ఈరోజుల్లో ఫ్యాషనయిపోయింది.ఇంతాచేసి ఎన్నికుట్రలు,మంతనాలు చేసి ఆస్తి కొట్టేసినా బాగుపడేదేమీ ఉండదు.చనిపోయినప్పుడు ఎత్తుకుపోయేదేమీ ఉండదు.బ్రతికినన్నాళ్లు నిలువెల్లా స్వార్ధంతో బ్రతికి చివరకు కాటికి పోయేటప్పుడు వీడు తోడబుట్టినవాళ్లకు అన్యాయం చేశాడు,పిల్లల్లో కూడా ఒకళ్ళని ఒకరకంగా ఇంకొకడిని ఇంకోరకంగా చూశాడు అని అనిపించుకోవటం తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు.

చిట్కాలు

1)రాగి చెంబులో రాత్రిపూట నీళ్ళుపోసి,9 తులసి ఆకులువేసి ఉదయం ఆకులుతిని నీళ్ళు త్రాగితే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.
2)1 స్పూను మెంతులు ఒకగ్లాసు నీళ్ళల్లో వేసి ఉదయం ఆ గింజలు తిని నీళ్ళు త్రాగితే ఆరోగ్యంగా వుంటారు.
3)ముల్లంగి రసం 1/4 గ్లాసు ఉదయం,సాయంత్రం తీసుకుంటే అధికబరువు తగ్గుతారు.
4)మెంతులు ఒకస్పూను మునిగేవరకు నీళ్ళుపోసి నానబెట్టి ఆనీళ్ళు పారబోసి మెంతులు నమిలితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
5)ఆహరం తిన్నతర్వాత వెల్లుల్లి రేకలు నాలుగు పొట్టు తీసి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బి.పి,షుగరు,గుండె సంబంధ వ్యాధులకు మంచిది.
6)మొక్కజొన్న పొత్తు పీచు లేతది ఏదో ఒకరకంగా కూరల్లో 10,15 రోజులు తింటే మూత్రపిండాలలోని  రాళ్ళు కరిగిపోతాయి.
7)వాము,రాళ్ళ ఉప్పు సమానంగా తీసుకుని పొడిచేసి పళ్ళు రుద్దితే దంతసమస్యలు ఉండవు.
8)ఉసిరికాయలపొడి ఏదోఒక రూపంలో తింటే యవ్వనంగా ఉంటారు.
9)మందారాకు,పువ్వులు నువ్వులనూనెలో కాచి ,తలకు రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి.
10)తమలపాకులు,10 మిరియాలు కలిపి తింటే 20రోజుల్లో సన్నగా ఉన్నవాళ్ళు బరువు పెరుగుతారు.

Tuesday, 8 July 2014

అడకత్తెరలో పోకచెక్క

                     రమణమూర్తి ఉన్నత స్థాయి ఉద్యోగి.భార్య ఇద్దరుపిల్లలతో సుఖంగా ఉన్నాడు.ఇంతలో అనుకోని అవాంతరం వచ్చిపడింది.ఆ అవాంతరం అతని జీవితాన్నే ఇరకాటంలో పడేసింది.అదెలాగంటే వాళ్ళమామగారికి
వ్యాపారంలో విపరీతమైన నష్టం వచ్చి రెండో అమ్మాయి వివాహం చేయలేని పరిస్థితి ఏర్పడింది.అప్పుడు పెద్ద
కూతురు దగ్గరకువచ్చి నీచెల్లెలు పెళ్లి నేను చేయలేని పరిస్థితి అందుకని నీభర్తను ఎలాగైనా ఒప్పించి నీభర్తకు
చెల్లెల్నిచ్చి పెళ్ళిచెయ్యి లేకపోతే మాకు ఆత్మహత్యే శరణ్యం అని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.తండ్రి బాధ చూడలేక జాలిపడి తనసంసారంలో చెల్లెలికి స్థానమివ్వటం ఏమిటి?అనే ఆలోచన లేకుండా చెల్లెల్ని పెళ్ళి చేసుకోమని భర్తకు చెప్పింది.భర్త వేరే సంబంధం చూచి నీచెల్లి పెళ్ళి చేద్దామని చెప్పినా వినకుండా నువ్వు చేసుకోకపోతే నేను,మాఅమ్మ నాన్న,చెల్లి అందరం ఆత్మహత్య చేసుకుంటాము అప్పుడు పిల్లలు అనాధలవుతారు.అప్పుడైనా నువ్వు ఇంకోపెళ్ళి
చేసుకోవాల్సిందే అందుకని ఇప్పుడే చేసుకోమని బెదిరించింది.తప్పని పరిస్థితుల్లో రమణమూర్తి మరదల్నిపెళ్ళి
చేసుకున్నాడు.అయినతర్వాత ఇద్దరూ నేనంటే నేనని పోటీపడతారుకదా!ఎట్టిపరిస్థితులలోను ఇద్దరిని పెళ్ళి చేసుకోకూడదు.అక్కచెల్లెళ్ళను అసలు చేసుకోకూడదు."అడకత్తెరలో పోకచెక్క"లాగా అయింది ఇద్దరిమధ్య నా పరిస్థితి అని రమణమూర్తి బాధపడుతుంటాడు.

కందతో కట్లెట్

కంద  - 1/4 కేజి
అల్లం -కొంచెం ,కొబ్బరి -కొంచెం
 పచ్చిమిర్చి - 5
వెల్లుల్లి - 6 రెబ్బలు
బ్రెడ్ - 4 స్లైసులు
కోడిగ్రుడ్డు లేదా పాలు - 1 లేదా కొంచెం పాలు
నూనె - సరిపడా
          కంద ముక్కలుగాకట్ చేసి ఉడికించాలి.దానిలో అల్లం,పచ్చిమిర్చి వెల్లుల్లి,ఉప్పు,కొబ్బరి మెత్తగాచేసి కలపాలి.
2 స్లైసుల బ్రెడ్ ని నీళ్ళల్లో ముంచి ఆనీటిని పిండేసి ముద్దగాచేసి కందలో కలపాలి.కోడిగ్రుడ్డు ఇష్టమైతే కలపొచ్చు. లేదంటే కొంచెం పాలుపోసి కలుపుకోవచ్చు.ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మనకు నచ్చిన ఆకారంలో తయారు చేసుకోవచ్చు.ఇంకో 2 స్లైసుల బ్రెడ్ ని ఎర్రగా వేయించి పౌడర్ చేసి ఆ పౌడర్ లో కట్ లెట్లను రెండువైపులా దొర్లించి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి.ఇవి రుచికి చాల బావుంటాయి.చెయ్యడం కూడా సులభం. 

కారట్ లడ్డు

     కారట్ - 1/4 కేజి
     రవ్వ - 1 కప్పు
     కొబ్బరి తురుము - 1 కప్పు
     పంచదార - 2 కప్పులు
      నెయ్యి  -  తగినంత
       జీడిపప్పు ముక్కలు
      యాలకులపొడి కొంచెం
          కారట్ సన్నగా తురమాలి కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు,రవ్వ,కొబ్బరి తురుము,కారట్ అన్నీ విడివిడిగా వేయించుకోవాలి.కారట్ తురుము సిమ్ లో తడి లేకుండా వేయించుకున్నాక రవ్వ,కొబ్బరితురుము కూడా వేసి
పంచదార వేసి కలపాలి.కాసేపటివరకు గరిటెతో బాగా త్రిప్పుతుండాలి.ఈ మిశ్రమం గట్టిపదేతప్పుడు దించేసి జీడిపప్పు,యాలకులపొడి వేసి బాగా కలిపి కాస్త వేడిమీద లడ్డు తయారు చేయాలి.
     

రవ్వలడ్డు

     బొంబాయి రవ్వ - 2 కప్పులు
    పంచదార - 2 కప్పులు
    జీడిపప్పు - 50 గ్రా.
    ఎండు ద్రాక్ష( కిస్ మిస్)-25 గ్రా.
    నెయ్యి - 1 కప్పు
    యాలకులపొడి - కొద్దిగా
   
          రవ్వను దోరగా వేయించుకోవాలి.పంచదారను మెత్తగా మిక్సీలో వేయాలి.జీడిపప్పు ముక్కలు చేసుకోవాలి.జీడిపప్పు ముక్కల్ని,కిస్ మిస్ నేతిలో వేయించుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో రవ్వ,పంచదారపొడి,
జీడిపప్పు ముక్కలు,కిస్ మిస్,యాలకులపొడి,అన్నీవేసి బాగా కలపాలి.నెయ్యిని వేడిచేసి ఈ మిశ్రమంలో పోసి బాగా కలిపి వేడిమీదనే లడ్డు చేయాలి.

కొబ్బరిస్వీట్

  కొబ్బరికాయ - 1 పెద్దది
 పంచదార - 4 కప్పులు
        కొబ్బరికాయను తురమాలి.అడుగు మందంగా ఉన్న బాండీలో కొబ్బరితురుము,పంచదార ,అరగ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి వెలిగించి పంచదార కరిగే వరకూ అప్పుడప్పుడు త్రిప్పి కరిగినతర్వాత దగ్గరికి వచ్చేముందు
ఆపకుండా త్రిప్పుతుండాలి.బాగా పొంగువస్తునప్పుడు అంతముందే ఒక ప్లేటుకు నెయ్యి రాసి అట్టిపెట్టుకుని దానిలో పొంగుతున్న మిశ్రమాన్ని పొయ్యాలి.కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేపులో ముక్కలు కట్
చేసుకోవాలి.తెల్లగా బోలుగా ఉన్న కొబ్బరిస్వీట్ రెడీ.ఇది చాల రుచిగా ఉండటమే కాక తేలిగ్గా తయారుచేసుకోవచ్చు.

తోడుదొంగలు

              నరేష్,రూపేష్ ఇద్దరు మేనమామ,మేనల్లుళ్ళు.వీళ్ళిద్దరూ కలిసి విదేశాలలో ఉన్న స్వరూప్ అంటే నరేష్
స్వంత అన్న,రూపేష్ స్వంత మేనమామని మోసంచేసి స్వరూప్ కి తెలియకుండా స్వరుప్ కి చెందాల్సిన ఆస్తిని
పెద్దవాళ్ళని బెదిరించి నరేష్ ముప్పావు వంతు,రూపేష్ పావు వంతు రిజిస్టర్ చేయించుకున్నారు.ఒకసారి విదేశాలనుండి వచ్చినప్పుడు స్వరూప్ కి ఈవిషయం తెలిసింది.ఇదేమి పద్ధతి అంటే ఇద్దరూ నేలచూపులు చూస్తూ తలలు దించుకున్నారు.తర్వాత విడివిడిగా స్వరూప్ ని కలిసి ఎవరికి వాళ్ళునాది తప్పుకాదు అంటే నాదితప్పు కాదని నరేష్ బెదిరించి రాయించుకున్నాడని రూపేష్,రూపేష్ కాకాపట్టి పెద్దవాళ్ళతో రాయించుకున్నాడని నరేష్ చెప్పటం మొదలుపెట్టారు.మీ ఇద్దరిదీ తప్పే అందరం ఒకచోట కూర్చుని మాట్లాడుకుని సామరస్యంగా ఏ పనైనా
చేసుకోవటం పద్ధతి అంతే కానీ మీఇష్టం వచ్చినట్లు చేయకూడదు కదా!అని స్వరూప్ ఇద్దరినీ చివాట్లు పెట్టాడు.
ఇద్దరు ఇద్దరే తోడుదొంగలు.తప్పు కప్పిపెట్టుకోవటానికి నాటకాలాడుతున్నారని,డబ్బుకి గడ్డితినటం మాని
ఎప్పుడు బాగుపడతారో అని స్వగతంగా అనుకున్నాడు.   

నీళ్ళు=డబ్బు

         నీళ్ళు వృధా చేయకండి.నీళ్ళు ఎంత ఖర్చయితే డబ్బు అంతఖర్చైపోతుందని పెద్దలు చెప్తుంటారు.ఇంతకు
ముందురోజుల్లో చెంబుతో కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చేవారు.చెంబుడు నీళ్ళతో కాళ్ళు మొత్తం తడిచేలా కడుక్కోగలిగితే పొదుపరులని,సగమే తడిస్తే ఖర్చుదారులనీ అంచనా వేసేవాళ్ళట.చైనీస్ వాస్తు ప్రకారం కూడా
వృధా అయ్యే నీటిని అరికట్టమని చెప్తారు.నీళ్ళు కారిపోయే పంపుల్ని త్వరగా రిపేరు చేయించమని అంటారు.
మనం ఇంట్లో కూడా బియ్యం,పప్పులు,కూరగాయలు కడిగిన నీళ్ళు వృధా చెయ్యకుండా ఒక బకెట్లో పోసి మొక్కలకు పోస్తే మొక్కలు బాగా పెరుగుతాయి.నీళ్ళు వృధాగా పోవు. ఏది ఏమైనా ,ఏకోణంలో చూచినా నీరు
వృధా చేయకపోవటం అన్నది మంచి పద్ధతి.అందుకే నీళ్ళు=డబ్బు అన్నది నిజం.

వెన్నెల్లో హాయి హాయి....

                వెన్నెలను చూడగానే అస్మితకు తనబాల్యం గుర్తొస్తుంటుంది.వెన్నెల్లో తమ్ముడు,స్నేహితులతో కలిసి
  ఆడిన ఆటలు గుర్తొస్తాయి.ఇంట్లో అందరూ సమావేశమై ఆరుబయట వెన్నెల్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవటం  గుర్తొస్తుంటుంది.ముఖ్యంగా అమ్మ,అమ్మమ్మ వేడివేడి అన్నంలో వెన్నపూసవేసి,కొత్తఆవకాయ కలిపి అస్మితకు,
తమ్ముడికి వెన్నెల్లో గోరుముద్దలు తినిపించటం మరీమరీ గుర్తొస్తుంటుంది.ఆరుచి,ఆఅనుభూతే వేరు.ఇప్పటి బిజీ
లైఫ్ లో వెన్నెల గురించి అలోచించే తీరిక కూడా ఉండదు.ఏ హోటల్ వాళ్ళో,క్లబ్ వాళ్ళో వ్యాపార లాభాలకోసం వెన్నెల్లో డిన్నర్ అంటూ ప్రకటనలిస్తేగానీ వెన్నెల గొప్పతనం పెద్దలకు,పిల్లలకు తెలియదు.
  

Saturday, 5 July 2014

స్నేహం - బంధుత్వం

              ఒకప్పుడు స్నేహమంటే మధురమైనది,పవిత్రమైనది అనే అభిప్రాయం.స్నేహానికి ప్రాణమిచ్చేవారు.
అవసరమైనప్పుడు బంధుత్వం కంటే స్నేహానికే ప్రాధాన్యమిచ్చేవారు.ఇప్పుడు,స్నేహానికి బంధుత్వానికి కూడా అర్ధం లేకుండా పోతుంది.స్నేహితులేమో కిట్టీ పార్టీలంటూ ఒకచోట చేరి కాస్త ఎవరైనా ఆలస్యంగా వస్తే ఈలోపు వాళ్ళమీద ఉన్నవీ,లేనివీ చెప్పుకుంటూ ఉంటారు.ఇప్పుడు ఒకళ్ళ గురించి చెప్పుకున్నవాళ్ళు రేపు మన గురించైనా ఆరకంగానే చెప్పుకోవచ్చుఅనుకుంటే బాగుంటుంది.ఎంతో ప్రేమగా ఉన్నట్లు ఫోనులు చేయటం ఇంకొంచెం కల్పించి అది,ఇది
అనివీళ్ళ గురించి వాళ్లకే తెలుసు అన్నట్లు బిల్డప్ ఇవ్వటం, మీటింగు పెట్టటం అవసరమా?ఇప్పుడు ఇదొక లేటెస్ట్ ట్రెండ్.అటువంటి స్నేహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.దీనికి స్నేహమనే ముసుగు పెట్టుకోవాలా?
            బంధువులు మాత్రం తక్కువేముంది? కొంతమంది ఎక్కడ పార్టీ ఉన్నా,పెళ్ళిళ్ళు ఉన్నా ముందే వెళ్ళి కూర్చుని పిలిచిన వాళ్ళను విమర్శించటం,లేదంటే ఒక్కొక్కటి తింటూ పేర్లుపెట్టటం.తిన్నతర్వాత అరిగే వరకూ
వేరేవాళ్ళ గురించి వాడు అలా,వీడు ఇలా అంటూ ఎక్కడెక్కడి సంగతులు మాట్లాడటం ఇక్కడ  కల్పితాలు
తీసుకెళ్ళి ఇంకొక చోట వినిపించటం ఫ్యాషనైపోయింది.ఇటువంటి వాళ్ళతో పెద్ద తలనొప్పి అయిపోయింది.
వాళ్ళ పెళ్ళిలో అన్నిరకాలు పెట్టారుగానీ ఏమి తినాలో అర్ధం కాలేదు.వీళ్ళ దగ్గర తినటానికి ఏమీ సరిగ్గా లేవు.
 అంటే బాగా తినటానికి పెట్టినా తంటానే పెట్టకపోయినా తంటానే అంటే విమర్శించటం వాళ్ళ నైజం.అందుకని వీళ్ళ ఇద్దరినీ వదిలేసిఏ అనాధశరణాలయాలకో,వృద్ధాశ్రమాలకోవెళ్ళి వాళ్ళకు కడుపునిండా పెట్టటం నేర్చుకోవాలి.
ఇదండీ సంగతి.

గంగావా(భా)యల్ ఆకు పచ్చడి


   గంగా భాయల్  ఆకు - 4,5 కట్టలు 
  పచ్చిమిర్చి - 7,8 
 నువ్వులు - 1 టీ స్పూను 
 పల్లీలు - 10
 టొమాటో - 1 ఉప్పుతగినంత  
  జీరా - 1 స్పూను  
 చింతపండు - కొంచెం
          నువ్వులు,పల్లీలు నూనె లేకుండా  వేరువేరుగా వేయించుకోవాలి.కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి వేయించి తీసేసి,తర్వాత టొమాటో వేయించిప్రక్కన పెట్టుకోవాలి. ఆకు విడిగా వేయించుకోవాలి.నువ్వులు,పల్లీలు,జీరా అన్నీ మెత్తగా రోటిలో దంచి పచ్చిమిర్చి,చింతపండు,ఉప్పు నూరి టొమాటోవేసి నూరి,చివరగా వెల్లుల్లి,ఆకు వేసి నూరాలి.
దీనికి తాలింపు పెట్టిన తర్వాత ఒకపెద్ద ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేయించి కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
గమనిక :ఈఆకు అన్నిచోట్ల దొరకదు. పప్పులోచింతపండు వెయ్యకుండా టొమాటోలు,ఉల్లి,పచ్చిమిర్చి వేసి ఈఆకు వేసి వండి తాలింపు పెడితే ఎంతో రుచిగా వుంటుంది.అన్నం,చపాతీలోకి బాగుంటుంది.  

మెంతిఆకు రోటిపచ్చడి

        మెంతికూర - 4 కట్టలు
        పచ్చిమిర్చి - 7,8
       చింతపండు - చిన్న నిమ్మకాయంత
       వెల్లుల్లి - 5 రెబ్బలు
       జీరా - ఒక స్పూను
       సాల్ట్ - తగినంత
       ధనియాలు - 1 స్పూను
       నూనె - 1 స్పూను
      పోపుదినుసులు
     పచ్చికొబ్బరి - కొంచెం (ఇష్టమైతే వేసుకోవచ్చు)
              గిన్నెలో నూనె వేసుకుని మిరపకాయలు వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.మెంతిఆకు వేసి కొంచెం ఉప్పువేసి
మూతవేసి మగ్గించాలి.ధనియాలు వేయించుకోవాలి.చింతపండు నానబెట్టి,వెల్లుల్లి రెబ్బలు పొట్టుతీసి ప్రక్కన పెట్టుకోవాలి.ముందుగా రోటిలోధనియాలు,ఉప్పు,జీరావేసి నూరి పచ్చిమిర్చి,చింతపండు నూరి వెల్లుల్లి కూడా నూరిన తర్వాత ఆకు వేసి నూరాలి.లేకపోతే పేస్ట్ అయిపోతుంది.దీన్ని ఒకగిన్నేలో తీసి కొంచెం నూనెతో తాలింపు పెట్టుకోవాలి.రోటిపచ్చడి కదా!చాలా రుచిగా ఉంటుంది.మెంతికూర ఆరోగ్యానికి మంచిది.
గమనిక:చిన్న మెంతుకూర అంటే రెండు ఆకులతో మార్కెట్లో దొరుకుతుంది.లేకపోయినా కుండీలలో మెంతులు చల్లితే మూడోరోజు కల్లా మొలకెత్తుతాయి.వీటికి ఎక్కువ నీళ్ళు పొయ్యకూడదు.చల్లితే సరిపోతుంది.ఇది వేపుళ్ళ లో
కరివేపాకుతోపాటు వేస్తే రుచిగా ఉంటుంది.

Friday, 4 July 2014

మాంగో జామ్

          పండిన మామిడిపళ్ళ గుజ్జు  -2 కప్పులు
          పంచదార -1 కప్పు
          సిట్రిక్ యాసిడ్ - 1/2 టేబుల్ స్పూన్లు
                   మామిడిపళ్ళగుజ్జు తీసి దాన్ని ఒక్కనిమిషం మిక్సీలో వేసి కప్పుతో కొలుచుకోవాలి.అందులో సగం పంచదార వేయాలి. అడుగు మందంగా ఉన్నసాస్ పాన్ లో గుజ్జు,పంచదార వేసి స్టవ్ మీద పెట్టి  గరిటెతో ఆపకుండా త్రిప్పాలి.బాగా చిక్కబడిన తర్వాత దించి చల్లారిన తర్వాత సిట్రిక్ యాసిడ్ కలిపి తడిలేని జార్ లోకానీ,సీసాలోకానీ
 వేసి మూతపెట్టాలి.
               

మాంగో లస్సీ

       పెరుగు - 2 కప్పులు
       పంచదార - 2 టేబుల్ స్పూన్లు
       మామిడి గుజ్జు - 2 కప్పులు
       ఐస్ క్యూబ్స్ - 3
      మామిడిపండు గుజ్జు,పెరుగు,పంచదార మిక్సీలో వేసి బాగా కలిసేట్లుగా చేయాలి.ఐస్ క్యూబ్స్ కూడా వేసి మరోసారి ఆన్ చేయాలి.చల్లని మాంగో లస్సీ తయార్.త్రాగటమే ఆలస్యం.
 గమనిక:తీపి ఇష్టమైన వారు ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు.రుచి,రంగు కోసం రెండు స్పూన్ల రోజ్ వాటర్
కలుపుకోవచ్చు.

మెరిసే చిరునవ్వు

          ఎప్పుడూ చెరగని చిరునవ్వు ముఖానికి  అందం.ఆనవ్వుతోపాటు తెల్లని పలువరుస ఉంటే ఇంకా అందం.
అది మీసొంతం కావాలంటే వారానికొకసారి ఉప్పులో నాలుగు చుక్కలు నిమ్మరసం వేసి దంతధావనం చేయండి.
దంతాలు మిలమిలా మెరుస్తాయి. 

మిక్స్డ్ వెజిటబుల్ దప్పళం

               దోసకాయ - 1
               సొరకాయ ముక్క - చిన్నది
               వంకాయలు - 2
              బెండకాయలు - 4
              దొండకాయలు - 4
              టమోటాలు - 4
              ములక్కాడ - 1      
              ఉల్లిపాయ - పెద్దది
             పచ్చిమిర్చి -  6
             చింతపండు - పెద్ద నిమ్మకాయంత                                                                                                                      వీటన్నింటినీ మధ్యరకంగా ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి 4 స్పూనుల నూనెవేసి            ఎండుమిర్చి,మినప్పప్పు,శనగపప్పు,ఆవాలు,జీరా,వెల్లుల్లి ముక్కలు,కరివేపాకు,కొత్తిమీరవేసి తాలింపు
   పెట్టి ముక్కలన్నీ వేసి రెండుసార్లు త్రిప్పి చింతపండు పులుసు పిండాలి.చిన్నబెల్లం ముక్కవేస్తే బాగుంటుంది.
  కుక్కర్ మూతపెట్టి 3విజిల్స్ రానిచ్చి స్టవ్ కట్టేయాలి.కుక్కర్ మూత వచ్చినతర్వాత ఒక 5ని.లు స్టవ్ మీదఉంచి    తీసేస్తే ఘుమఘుమలాడే మిక్స్డ్ వెజిటబుల్ దప్పళం రెడీ.ఇది అన్నంతో చాలా బాగుంటుంది.

ఈల పాట

                  ప్రియంవద పనిమనిషి రాకపోతే బట్టలు తీసుకురావటానికి మేడపైకి వెళ్ళింది.బట్టలు మడతపెట్టటంలో
నిమగ్నమయి తీస్తూనే పనిమనిషి లావణ్య గురించి ఆలోచిస్తుంది.ఇంతలో పెద్దగా ఈలపాట వినిపించింది.ఉలిక్కిపడి
నన్నుచూచి ఈల వేసేంత ధైర్యం ఎవరికుంది?అని అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఒకపిట్ట పెద్దగా ఈలవేస్తూ ప్రక్క ఇంటిమీద నుండి ఎగిరి వెళ్ళిపోయింది.ప్రియంవద పైన తనొక్కదాన్నే ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి పెద్దగా నవ్వేసింది.మేనెలలో కొన్నిపక్షులు ఈల వేస్తాయన్నవిషయం అంతకు ముందే పుస్తకంలో చదివింది కానీ
అవి మనదగ్గర కూడా ఉంటాయన్నవిషయం తెలియదు.అటువంటిపక్షిని ఇదేమొదటిసారి చూడటం,దానిఈలపాట
వినడం అందుకని ప్రియంవద ఆశ్చర్యపోయింది.

Thursday, 3 July 2014

వృధా చేయకండి

            ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు కొద్దికొద్దిగా మిగిలిపోతాయి.అటువంటప్పుడు వాటితో ఏంచేస్తాములేఅని
 వృధా చేయకండి.కొంచెం బెండకాయలు,కొంచెందొండకాయలు,కొద్దిగా పచ్చిమిర్చి,కొన్ని టొమాటోలు ఉంటేవాటిని
అన్నింటినీ కడిగి,బెండకాయలు,అన్నీ ముక్కలు కట్ చేసి,బాండీలో నూనె వేసి వాటన్నింటికీ సరిపడా మిర్చిని
నిలువుగా చీల్చి వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.బెండ,దొండ ముక్కల్ని కూడా కొద్దిగా వేయించి దానిలో టమాటో
ముక్కలు,ఉప్పు వేసి మగ్గించాలి.ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా అయిన తర్వాత తీసి కరివేపాకు,వెల్లుల్లి
కొత్తిమీరతో తాలింపు పెడితే చాల బాగుంటుంది.ఇది ఇడ్లీ,దోసే,అన్నంలోకి బాగుంటుంది.
                         అలాగే బెండకాయల్లో ముదురుకాయలు వచ్చినా పడేయకుండా వాటికి సరిపడా పచ్చిమిర్చి
టొమాటోలు వేసి పైన చెప్పిన విధంగా చట్నీ చేస్తే బాగుంటుంది.చింతపండు వేయనవసరం లేదు.
             ఒక్కొక్కసారి దొండకాయలు పైకి పచ్చిగా ఉండి లోపల పండురంగువి వచ్చినా పారేయకుండా వాటితో కూడా పైన చెప్పిన విధంగా చట్నీచేసుకోవచ్చు.దీనికి కూడా చింతపండు అవసరంలేదు.పచ్చిమిర్చి,టొమాటోలు
సరిపడా వేసుకుంటే సరిపోతుంది.అన్నింటికీ తాలింపు పెట్టాలి.
         
          

మిక్స్డ్ వెజిటబుల్ కిచిడీ

            బియ్యం -ఒక కప్పు
           పప్పు - అర కప్పు
           కారట్ తురుము -అర కప్పు
           పాలకూర -చిన్నకట్ట
          పచ్చి బటాణీ -పావు కప్పు
          కాలీఫ్లవర్ ముక్కలు -అర కప్పు
         బీన్స్ ముక్కలు - పావు కప్పు
         ఎరుపు కాప్సికం - ఒకటి
         ఆకుపచ్చ కాప్సికం - ఒకటి
        ఉల్లిపాయ -ఒకటి
        అల్లం పేస్ట్ - టీ స్పూను
        పచ్చిమిర్చి పేస్ట్ -ఒకటీస్పూను
       కొత్తిమీర తురుము -రెండు టేబుల్ స్పూన్లు
      పసుపు  - టీ స్పూను
     దాల్చిన చెక్క - చిన్నముక్క
     లవంగాలు - మూడు
     యాలకులు - రెండు
     పలావు ఆకులు -రెండు
     ఉప్పు - తగినంత
    నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు
               బియ్యం,పప్పు కడిగి ప్రక్కన పెట్టుకోవాలి.కుక్కర్ లో నెయ్యి ,యాలకులు,లవంగాలు,పలావు ఆకులు దాల్చిన చెక్క వేసి ఒకసారి త్రిప్పాలి.తర్వాత ఉల్లిపాయ ముక్కలు,అల్లం,పచ్చిమిర్చి పేస్ట్ వేసివేయించి,కూరగాయ
ముక్కలన్నీ రెండు,మూడు ని.లు వేయించాలి.ఇప్పుడు బియ్యం,పప్పు,పసుపు వేసి ఒకసారి త్రిప్పి ఉప్పువేసి
తగినన్ని నీళ్ళు పోసి మూతపెట్టి ఉడికించాలి.ఉడికిన తర్వాత కొత్తిమీర వెయ్యాలి.మిక్స్డ్ వెజిటబుల్ కిచిడీ రెడీ.    

Wednesday, 2 July 2014

బ్రతుకుతెరువు-మార్పు

                        బ్రతుకుతెరువు కోసం ఒక ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళటం,కష్టపడి ఎవరికి తగినపని వాళ్ళు చేసుకోవటం సహజం.కానీ ఈప్రపంచంలో విలాసంగా బ్రతకటానికి ఎక్కువమంది తేలిక మార్గాన్నిఅంటే అన్నీ  అబద్దాలాడటం,మోసాలు,మాయలుచెయ్యటం ఈరోజుల్లోఒక వ్యాపకంగా పెట్టుకుంటున్నారు.నాలుగు కబుర్లుతో
ఎదుటివాళ్ళను మాయాజాలంలో పడేయటం ఫ్యాషనైపోయింది.అతిత్వరలో మీడబ్బుని రెట్టింపు చేస్తామంటే అది
అసాధ్యమని తెలిసినా ప్రజలు కూడాఅది నిజమేనేమో ఏపుట్టలో ఏపాము ఉందో పెట్టిచూద్దాం అనుకోవటం గుడ్డిగా
మోసపోవటం జరుగుతుంది.పెద్దపెద్దఉద్యోగాలిప్పిస్తాం ముందు కొంతడబ్బు డిపాజిట్ చెయ్యమనటం అది నమ్మి  చదువుకున్నవాళ్ళు కూడా చదివినదానికి తగిన ఉద్యోగం వస్తుంది కానీ పెద్దది ఎక్కడనుండి ఇస్తాడనే ఆలోచన లేకుండా అప్పుతెచ్చి అయినా పెట్టేయటం మోసపోవటం తర్వాత లబోదిబోమనటం అలవాటయింది.వీటన్నిటికీ పెట్టకుండా స్వయంఉపాధి మార్గాన్నిఎంచుకోవటం మేలు.లోన్ ఇప్పిస్తామంటూ అక్కడా మోసమే అందుకే జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలి.మీరు రెండునెలల్లోనే మాదగ్గరకొస్తే ప్రావీణ్యం సంపాదిస్తారు ఎంతోఎత్తుకు ఎదుగుతారు అని చెప్పేవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు.ఆరకంగా సంపాదించే వాళ్ళు జీవితంలో పైకి రాలేరు.అది తెలుసుకుంటే బాగుంటుంది. మోసపోయేవాళ్ళుఒకసారి మోసపోతారు.దాన్నుండి గుణపాఠం నేర్చుకోవాలి. మోసంచేసేవాళ్ళు అందర్నీ చెయ్యలేరు.ఎప్పుడో ఒకసారి ఎదురుదెబ్బ తగలక మానదు.బ్రతకటానికి వక్రమార్గాన్ని ఎంచుకోనక్కర్లేదు.
నిజాయితీతో మామూలు భోజనం తిన్నాఅరిగి ఒంటికి పడుతుంది.అక్రమార్జితంతో పంచభక్ష్యపరమాన్నాలు తిన్నా
అరగక ఆస్పత్రులచుట్టూ తిరగాల్సివస్తుంది.అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు.అందరూ నిజాయితీతో ఉంటే  ఈప్రపంచం ఎప్పుడో బాగుపడేది.ఇన్నినేరాలు, ఘోరాలు ఉండేవికాదు.ఇప్పుడిప్పుడే ప్రజలు నిజాయితీ విలువ తెలుసుకుంటున్నారు.ఇకనైనా అందరిలో మార్పు వచ్చి నేరాలు,ఘోరాలు తగ్గి అందరు సుఖశాంతులతో ఉండాలని ఆశిద్దాం.ఇది ఏ కొద్దిమందితోనో సాధ్యమయ్యేది కాదు.అందరిలో మార్పు రావాలి.

మసాలా వడ

         మినప్పప్పు  - 1 కప్పు
         పచ్చి శనగపప్పు - 1 కప్పు
         పెసరపప్పు  -  1/2 కప్పు
        పెద్దఉల్లిపాయ - ఒకటి
        పచ్చిమిర్చి - 6
       పుదీనా -ఒక కట్ట
      కొత్తిమీర  -చిన్నవి 2 కట్టలు
      కరివేపాకు - గుప్పెడు
     అల్లం  కొంచెం,నూనె సరిపడా
             పప్పులన్నీ నాలుగు గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి.ఆతర్వాత కడిగిపప్పులన్నీ,అల్లం  మిక్సీలో వేసి గట్టిగా కచ్చాపచ్చగా అంటే బాగా మెత్తగా అవకుండా పలుకుగా ఉండాలి.తర్వాత పుదీనా,కొత్తిమీర,కరివేపాకు
సన్నగా తరిగి,ఉల్లిపాయ,పచ్చిమిర్చి కూడా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పిండిలోకలపాలి.
             అరచేతిలో చిన్నగా పిండితో గుండ్రంగా అంచులు కొంచెం పలుచగా మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా ఉండేలా చేసి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేగనిచ్చి తీయాలి.ఘుమఘుమలాడే మసాలా వడలు రెడీ.కొబ్బరి చట్నీ,వేరుసెనగ చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఫిష్ చిప్స్

        చేప ముక్కలు - 3/4 కే.జి
        నిమ్మరసం - 5 tb స్పూన్లు
        ఉప్పు - సరిపడా
         కారం -సరిపడా
        కోడిగ్రుడ్లు  - 5
       మైదా  - కప్పున్నర్ర
      బ్రెడ్ పొడి - కప్పున్నర్ర
     నూనె   - వేయించటానికి సరిపడా
      చేపముక్కల్ని బాగా కడగాలి.నిమ్మరసంలో ఉప్పు,కారం కలిపి ఒక్కొక్క ముక్కని రెండువైపులా ముంచి
ఒకపావుగంట ప్రక్కన ఉంచాలి.మైదా నీళ్ళతో పలుచగా కలుపుకోవాలి.కోడిగ్రుడ్లు కొట్టి ఒకగిన్నెలో గిలకొట్టి పెట్టుకోవాలి బ్రెడ్ పొడి కూడా ఒక ప్లేటులో పెట్టుకోవాలి.నిమ్మరసంలో ముంచిన చేపముక్కను మైదాలో ముంచి
తర్వాత కోడిగ్రుడ్లసొనలో ముంచితీసి,బ్రెడ్ పొడిలో దొర్లించాలి.స్టవ్ మీద బాణలి పెట్టి నూనె కాగిన తర్వాత ఈముక్కల్నినూనెలో వేయించి తీయాలి.  

       

Tuesday, 1 July 2014

తనదయితే -ఎదుటివాళ్ళదయితే

                              రాఘవేంద్రరావుగారు ఉద్యోగంచేస్తూ వ్యాపారంకూడా చేస్తుంటారు.తనదయితే ఒక రూపాయిది రెండు రూపాయలు చెప్పటం,ఎదుటివాళ్ళదయితే రూపాయిది పావలాకి అడగటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
తన,పర భేదం ఉండదు.ఎదుటివాళ్ళను ఎంత బాగా ఉపయోగించుకోవచ్చోఆయనకు బాగా తెలుసు.అందుకే రెండు పడవలమీద కాళ్ళు వేసినా రాణించగలిగారు.రెండు పడవలమీద కాళ్ళు వెయ్యగూడదని శాస్త్రం.నేర్పరితనం,కష్టపడే
తత్వంవల్ల కలిసొచ్చింది.అయినా ఎదుటివాళ్ళది మరీ పావలాకి అడగటం దారుణం.ఈరోజుల్లో ఎక్కువమంది ఇలాగే
ఉంటున్నారు.కలికాలం కదా!తనదగ్గర ఉద్యోగం చేసేవాళ్ళకు కూడా చాలా తక్కువ జీతాలకు ఎక్కువపని చేయించుకోవటం,తనకు ఉపయోగపడతారనుకుంటే పని చేయకపోయినా అదే జీతం ఇవ్వటం అలవాటు.ఇది ఒక
వ్యాపారరలక్షణం.ఏంచేస్తాం?అయిన సరయిన ఉద్యోగాలు దొరక్క దానిలో పనిచేసినా చాలులే అని వెళ్తుంటారు.

ఆషాడం -మునగాకు

          ఆషాడమాసంలో చినుకుపడే వేళ ఆరోగ్యాన్ని చేకూర్చే మునగాకు తినాలి అంటారు పెద్దలు.మునగాకులు
చూడటానికి తేలిగ్గా ఉంటాయి కానీ ఎన్నో పోషకవిలువలు కలిగి ఉంటాయి.ప్రోటీన్లు,ఇనుము,కాల్షియం వీటిల్లో మెండుగా ఉంటాయి.రోజుకు రెండు స్పూన్లు మునగాకులు తినగలిగితే పోషకాహారలేమి ఉండదని చెప్తుంటారు.
పెసరపప్పుతో మునగాకు కలిపి వండితే ఆరుచే వేరు.పెసరపప్పు ఒకప్పు,రెండుకప్పుల మునగాకు,పచ్చిమిర్చి
ఉప్పు,ఒకకప్పునీళ్ళుపోసి కుక్కర్లో ఉడికించాలి.పోపుపెట్టి చివరలోవెల్లుల్లి,పచ్చికొబ్బరి కొంచెం,ఉడికించి ప్రక్కన
పెట్టుకున్నపప్పు వేసి ఒకసారి కలిపి దించేయాలి.అసలు మునగాకు వేసినట్లే అనిపించదు.

జబ్బ లెగస్తలేదు

              రజిత పనిమనిషి వేగంగా మాట్లాడుతుంది.ఒక్కొక్కసారి ఎదుటివాళ్ళకు ఏమి మాట్లాడుతుందోఅర్ధంకాదు.
ఉదయమే వచ్చి ఈరోజు జబ్బలెగస్తలేదు ముఖ్యమైన పనిచేస్తాను అంది.ఒక్కనిమిషం రజితకు అర్ధంకాలేదు.ఏంటి?
మళ్ళీచెప్పు అంటే మళ్ళీఅంతకన్నా వేగంగా చెప్పింది.అసలువిషయం చెప్పమంటే మాఇంట్లోఉన్న బట్టలు,గిన్నెలు
మొత్తం పని చేసేసరికి జబ్బ,రెక్కఅంటే చెయ్యి నొప్పి వచ్చింది పైకి లెగటంలేదు అంది.హమ్మయ్య!ఇప్పటికిఅసలు
సంగతి అర్ధమయింది అనుకుని సరే రేపు చేసుకో అని రజిత అంది.ఈరోజుల్లో వాళ్ళు తానంటే మనం తందాన అని
అనాల్సిందేగా అని రజిత మనసులోఅనుకుంది.