Sunday, 19 April 2015

నొప్పులు మాయం

                                     ఆహారంలో అల్లం వాడకం పెంచితే కండరాల నొప్పులు,గొంతు నొప్పి,ఇతర నొప్పులు మాయమౌతాయి.అల్లం టీ తాగటం అలవాటు చేసుకుంటే మంచిది. 

కోహినూర్ వజ్రం కన్నా జాగ్రత్తగా.........

                                                 జగదీశ్ గారు వృత్తిరీత్యా వైద్యులు.వైద్యుడయినా ఆయన కూడా సగటు మనిషే కదా!ఒకసారి స్నానానికి వెళ్ళి జారి పడటంవలన వెన్నెముక చివర చిట్లింది.ఒకసారి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మాటల మధ్యలో వరుసకు బావ ఎలా ఉన్నావు?ఈమధ్య దెబ్బతగిలిందట కదా!తగ్గిందా?అని అడిగితే మధ్య వయసులో ఒకసారి తగిలిన తర్వాత ఎంతో కొంత నొప్పి ఉంటుంది.అందుకని ఎక్కడికి వెళ్ళినా నామోషీ అనుకోకుండా గట్టిగా పక్కన ఉన్న రైలింగ్ పట్టుకోవాలి.ఒక వయసు వచ్చిన తర్వాత మన శరీరంలో ప్రతి ఎముక కోహినూర్ వజ్రం కన్నా జాగ్రత్తగా కాపాడుకోవాలి.నాదగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకు ఇదేచెప్తూ ఉంటాను అని చెప్పారు.   

Saturday, 18 April 2015

దొంగలను తలదన్నే దొంగ

                                                   నాగిగాడికి లేని చెడ్డ అలవాటు లేదు.చెడ్డ అలవాట్లకు బానిసై ఏరకంగా ఎవరిని మోసం చేసి డబ్బు సంపాదించాలా? అని నిరంతరం రకరకాల ప్రణాళికలు వేస్తుంటాడు.నాగిగాడి ఊరు మీదుగా కొందరు నదిలో ఇసుకను అక్రమంగా రాత్రిపూట లారీలతో తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు.వీడికి ఉన్నట్టుండి ఒక గొప్ప ఆలోచన వచ్చింది.అదేమిటంటే వాళ్ళు దొంగతనంగా  ఇసుక అమ్ముకోగాలేనిది నేను వాళ్ళను మోసం చేస్తే తప్పేమిటి?అని నకిలీ ఎస్.ఐ అవతారం ఎత్తాడు.రాత్రిపూట దారిలో కాపుగాచి వెళ్ళే వచ్చే లారీలను పట్టుకుని ఆపి ఎస్.ఐ నని డ్రైవర్లను బెదిరించి వాళ్ళ దగ్గరున్న డబ్బు,లేకపోతే ఉంగరాలు,గొలుసులు ఏవి ఉంటే అవి  తీసుకోవటం మొదలుపెట్టాడు.కొద్దిరోజులు ఓపిక పట్టి వీడి మీద అనుమానం వచ్చిఅసలు పోలీసులకు వీడి గురించి ఉప్పందించారు.వాళ్ళు వచ్చివీడి భండారం బయటపెట్టారు.పోలీసులు తనకోసం వేట మొదలెట్టారని తెలిసి ఇంట్లో నుండి మాయమయ్యాడు.ఇంటికి వెళ్తే బార్య ఒకగొలుసు,ఉంగరం మాత్రమే ఉందని పోలీసుల చేతిలో పెట్టింది.తర్వాత కొద్ది రోజులకు ఇంటికి వచ్చాడు.ఇసుక దొంగలను తలదన్నే దొంగ బయల్దేరాడని నాగిగాడికి కూడా ఇన్ని తెలివితేటలు ఎప్పుడబ్బినాయో? అని అందరూ ఆశ్చర్యపోయారు.     

Thursday, 16 April 2015

తక్షణశక్తి

                                                     జొన్నల్లో పీచు,పిండి పదార్ధం ఎక్కువ. జొన్నలతో చేసిన ఆహారపదార్ధాలు తేలిగ్గా జీర్ణమవటంవల్ల తక్షణశక్తినిస్తాయి.తక్కువ తిన్నా పొట్టనిండుతుంది.గోధుమల కన్నాజొన్నలు త్వరగా జీర్ణమవుతాయి.జొన్నరొట్టె తరచూ తినడంవల్ల రక్తహీనత బారినుండి బయటపడవచ్చు.వీటిలోని పోషకాలు రొమ్ము క్యాన్సర్,కొలెస్టరాల్ అదుపులో ఉంచడం,గుండె జబ్బుల బారినుండి,మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడతాయి.

సమస్య ఎదురైనప్పుడు........

                                                ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని చూచి భయపడి పారిపోయే కన్నాసమస్య ఎక్కడ మొదలైందో ఆలోచించండి.పరిష్కారమార్గం వెతకాలి.అప్పటికప్పుడు పరిష్కార మార్గం దొరక్కుండా ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయపడటం కన్నాఆ అనుభవం నుండి మనం ఏమి నేర్చుకున్నామో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.ఎదుగుదలలో వైఫల్యం కూడా ఒక భాగమే అనుకోవాలి.అప్పుడు ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోగల సత్తా వస్తుంది.  

సానుకూలంగా మాట్లాడే వారితోనే.....

                                                        మనచుట్టూ ఎప్పుడూ కూడా ప్రతికూల భావాలున్న వ్యక్తులు లేకుండా చూచుకోవాలి.అదేపనిగా ఫిర్యాదులు చేసేవాళ్ళు,ప్రతిపనికి విమర్శించే వాళ్ళు పక్కనే ఉండటం మంచిది కాదు. మనకు కూడా సానుకూలదృక్పధం అనేది లేకుండా పోతుంది.అందువల్ల సానుకూల దృక్పధం ఉన్నవాళ్ళతోనే ఎక్కువగా స్నేహం చేయటం,మాట్లాడటం మంచిది.

పుట్టగొడుగులు

                                                    పుట్టగొడుగులు కాగితం సంచుల్లో భద్రపరుచుకుంటే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.

కాఫీపొడి మంచిదో కాదో ?

                                            కాఫీపొడి మంచిదో కాదో తెలుసుకోవాలంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూను కాఫీపొడి వేసి కలపాలి.అడుగుకు చేరితే మంచిది.పైకి తేలితే కల్తీదన్నమాట.

Wednesday, 15 April 2015

అమ్మను కొట్టేస్తుంది

                                                                     జేత్ర తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు.గారాబంతో మొండిగా      తయారయింది.చిన్నప్పటినుండి ఏది కావాలంటే అది చేసిపెట్టటమో లేదా తెచ్చిఇవ్వటం వలనో బాగా ఒళ్ళు వచ్చేసింది.పెళ్ళి వయసు వచ్చిందని జేత్రకు పెళ్ళి చేశారు.ఒక అమ్మాయి పుట్టింది.ఇంకా ఒళ్ళు వచ్చేసి ముప్పై  సంవత్సరాలకే గుండెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.కూతురుకు ఆపరేషన్ చేశారని తల్లి వచ్చింది.తల్లి చేసే ప్రతి పనికి వంకలు పెట్టటం మొదలెట్టింది.ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకుని తల్లి మూతి మీద గట్టిగా కొట్టేసరికి వాచిపోయింది.తల్లి ఉన్నన్ని రోజులు చీటికీమాటికీ కొట్టేసేది.పిన్ని కొడుకు వస్తే వాడిని కొట్టింది.ఇంటికి వెళ్ళిన వాళ్ళకు తల్లీకూతుళ్ళుఇద్దరు చెరో పక్కా కూర్చుని చెప్పటం మొదలెట్టారు.ఒక్కగానొక్క కూతురని వస్తే కొడతందని తల్లి,నేను కొట్టలేదని కూతురు చెప్తుంటే దెబ్బ కనడుతుంది కనుక  తప్పు తల్లిని కొట్టకూడదు అని చెపితే మధ్యలో వెళ్ళిన వాళ్ళను కొట్టేస్తుందేమోనని భయపడి వెళ్ళటం మానేశారు.తల్లి కొట్టేకూతురు  దగ్గర నేను ఉండలేనని తన ఇంటికి  వెళ్ళిపోయింది.పనివాళ్ళతో,ఇరుగుపొరుగుతో జేత్ర బాగానే ఉంటుంది.తల్లి,ఆమె తరఫువాళ్ళతో మాత్రమే ఇలా ప్రవర్తిస్తుంది.తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఆమె విలువ తెలిసి వచ్చింది.అమ్మ ఎంతో ప్రేమగా అన్నీ చేసిపెడుతుంటే తెలియలేదు.అయ్యో!అమ్మ ఉన్నన్ని రోజులు వేపుకు తిని పిచ్చిపనులు చేశాను అని జేత్ర పశ్చాత్తాపపడింది.అమ్మ ఇక ఎప్పటికీ నీదగ్గరకు రాను అని విరక్తి పుట్టి వెళ్ళిపోయింతర్వాత ఇప్పుడు అనుకుని ఏమి ఉపయోగం? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఆపరేషన్ చేసినప్పుడు తేడా వచ్చి అతిప్రేమను భరించలేక పోయేదాన్నని,తన తప్పు కప్పిపెట్టుకోవటానికి కనిపించిన వాళ్ళందరికీ చెప్పటం మొదలెట్టింది.
     

వృద్ధాప్యఛాయలు కనపడకుండా ........

                                         వాతావరణ కాలుష్యం వలన కానీ ఆహారంలో మార్పువలన కానీ వయసుతో పనిలేకుండానే  చర్మం తాజాగా,మెరుస్తూ ఉండటం లేదు.వృద్ధాప్యఛాయలు ముందుగా చర్మంపై ప్రభావం చూపిస్తాయి.చర్మంపై నల్లటి మచ్చలు,ముడతలు వంటివి ఇబ్బంది పెడతాయి.వృద్ధాప్యఛాయలు త్వరగా కనపడకుండా ఉండాలంటే చిన్నప్పటినుండి పిల్లలకు అన్నిరకాల పండ్లు తినడం అలవాటు చేయాలి. పాలు,పెరుగు,గుడ్లు,చేపలు తప్పనిసరిగా తినేట్లు చూడాలి.చేపలు తినని వాళ్ళు పిల్లలకు  కూరగాయలు తినటం నేర్పించాలి. 30 సంవత్సరాలు దాటుతున్నాయంటేనే ఆహారంలో మార్పుచేసుకోవాల్సిన అవసరంగా ఉంది.నిమ్మజాతి ఫలాలు రోజువారీ ఆహారంలోభాగం  చేసుకోవాలి.కారట్లు,పండు టొమాటోలు,చిలకడ దుంపలు,పాలకూర వంటివి చర్మాన్నినునుపుగా ఉంచుతాయి.పంచదార వాడకం తగ్గించుకోవాలి.ప్రత్యామ్నాయంగా తేనె వాడుకోవటం మంచిది.వారానికి రెండుసార్లు వీలయినప్పుడు గుడ్డులోని తెల్లసొన నిమ్మకాయ కలిపి ముఖానికి,చేతులకు,మెడకు పూతలా వేసి 15 ని.ల తర్వాత  గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.అప్పటికప్పుడు చర్మం బిగుతుగా,నునుపుగా,తాజాగా మారుతుంది. 

Tuesday, 14 April 2015

ఆదమరచి హాయిగా......

                                           కొందరు ఆహార నియమాలు,డైటింగ్ పేరుతో సరిగా ఆహరం తీసుకోరు.మధ్యలో ఆకలేసి నిద్రాభంగం అవుతుంది.దానితో నిద్రలేమి బాధిస్తుంది.అందుకే రాత్రిపూట ఏ ఆహారం తిన్నాతేలికగా వేళకు   తినటం అలవాటు చేసుకోవాలి.దానితోపాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం ద్వారా హాయిగా ఆదమరిచి    నిద్రపోవచ్చు.ఉదయం అల్పాహారంలో ఉడికించిన గుడ్లు తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండి రాత్రి నిద్ర బాగా పడుతుంది.ఎక్కువగా చిరుధాన్యాలతో చేసిన ఆహారం,చెర్రీలు,అరటిపండు,పాలకూర,గ్రీన్ టీ తీసుకుంటుంటే హాయిగా రాత్రి నిద్ర సొంతమవుతుంది.మనం ఎన్ని గంటలు నిద్రపోయామన్నది కాదు లెక్క ఎంత బాగా నిద్ర పట్టిందన్నది లెక్క.   

Monday, 13 April 2015

వేసవిలో మంచినీళ్ళు

                                          వేసవిలో మామూలు కన్నా ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి.చెమట ఎక్కువగా పడుతుంటుంది కనుక దాహం వేసినట్లనిపించకపోయినా అప్పుడప్పుడూ  నీళ్ళు తాగుతూ ఉండాలి .వేసవిలో నీళ్ళు తక్కువగా తాగితే మూత్రపిండాలలో రాళ్ళు,మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.అదీకాకుండా జీవక్రియల వేగం మందగించి కాలరీలు కూడా త్వరగా కరగవు.చర్మం పొడిబారి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది.వేసవికాలంలో మంచినీళ్ళు ఎక్కువ  తాగడంవల్ల పై ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

వాలుజడ వయ్యారం

                                                   ఇప్పటి పెళ్ళి సందడిలో సందడి చేస్తున్నకొత్త పోకడ పరికిణీ ఓణీ,వాలుజడ.
పరికిణీ ఓణీల అందం,వాలుజడ వయ్యారం తెలియాలంటే జడకుప్పెలు లేదా జడగంటలు పెట్టుకోవాల్సిందే.రాళ్ళు
కుందన్లు అమర్చి రకరకాల డిజైన్లతో,రంగుల హంగులతో చూడముచ్చటగా ఉంటున్నాయి.అన్ని దుస్తులకు నప్పేలా రకరకాల రంగులతో మాచయ్యేలా ఎంతో అందంగా మార్కెట్ లో లభిస్తున్నాయి.ఇప్పటి ఆడపిల్లలు కూడా పరికిణీ ఓణీతోపాటు,వాలుజడ,జడగంటలు,రకరకాల నగలు ధరించి వయ్యారి భామ వల్లంకి పిట్ట అన్నట్లు అచ్చు వయ్యారి భామల్ని తలపిస్తున్నారు.    

Saturday, 11 April 2015

వేసవిలో పుదీనా రసం

                                                         వేసవిలోశరీరానికి తగినంత నీరు అందక జీర్ణక్రియ మందకొడిగా ఉంటుంది.గుప్పెడు పుదీనా ఆకుల్ని మిక్సీలోవేసి కొద్దిగా జీరా,కొంచెం నిమ్మరసం,ఇష్టమైతే కొద్దిగా బెల్లం       వేసుకోవచ్చు.ఈరసాన్నినిల్వ పెట్టకూడదు.పుదీనా రసం తాగటం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది.  

Friday, 10 April 2015

తాపత్రయం

                                              కామక్షమ్మగారికి ఎనభై సంవత్సరాలు.పనివాళ్ళ మీద అజమాయిషీ చేస్తూ అన్ని పనులు తనే దగ్గరుండి చేయిస్తుంటుంది.ఈమె ధాటికి తట్టుకోలేక పనివాళ్ళందరూ పారిపోతున్నారు.ఇంట్లోవాళ్ళు సరయిన పనివాళ్ళు దొరక్క లబోదిబో అంటున్నారు.ఇంటి ఆవరణలో ఒక మునగ చెట్టు,రెండుమామిడి చెట్లు, బయట ఒక మామిడి చెట్టు కాయలు విరగ కాసినాయి.ఈమధ్య కామక్షమ్మగారికి సుస్తీ చేసింది.పెద్దగాతిరగటంలేదు. కామాక్షమ్మగారి దగ్గర ఒక మనిషిని పెట్టి ఇంట్లో అందరూ ఒక పదిరోజులు ఊరు వెళ్లారు.ఈమె లోపల ఉంటే ఎవరో ఒకరు అందినంతవరకు కాయలన్నీ కోసుకెళ్ళటం మొదలు పెట్టారు.ఈ విషయం పనిమనిషి కామక్షమ్మగారి చెవిని వేసింది.అయ్యో!కాయలన్నీనన్నుఅడగకుండా దొంగతనంగా కోసుకెళ్ళటం ఏమిటి?ఎంతో కష్టపడి చెట్లను పెంచాను.నావాళ్ళు తినాలి లేదా నేనిస్తే తీసుకోవాలి కానీ అని హంగామా చేసి ఎక్కడో దూరాన ఉన్న మనవరాలికి ఫోను చేసి ములక్కాడల పచ్చడి, మామిడికాయ పచ్చడి పట్టాలి.రెండు రోజుల్లో నువ్వే వస్తావో?మనిషిని పంపించి కాయలు తీసుకెళ్తావో?నాకు తెలియదు.వెంటనే రావాల్సిందేనని పట్టు పట్టేసరికి మనుమరాలు అమ్మమ్మకు కోపం వస్తుందని మనిషిని తీసుకుని వచ్చింది.కాయలన్నీ కోయించి తలా నాలుగు ఇచ్చిమిగతావి తను సర్దుకుంది.అమ్మమ్మా! ఇంకా నీకెందుకు ఈ తాపత్రయం? ప్రశాంతంగా ఉండు అని ఆమె  నొచ్చుకోకుండా చెప్పింది.  
   

ఆమ్ కీ పన్నా

                                            పచ్చిమామిడి కాయను ఉడికించి దానికి సరిపడా నీళ్ళు పోసి కొద్దిగా నల్ల ఉప్పు,జీరా కొద్దిగా పంచదార,కలిపి తయారు చేయాలి.ఈ పానీయాన్ని ఆమ్ కీ పన్నాఅంటారు. వేసవిలో ఈ పానీయం తాగటం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది.

వేసవిలో మజ్జిగ

                                            వేసవిలో ఎండలకు తోడు పెళ్ళిళ్ళు,వేడుకలు ఎక్కువగా ఉంటాయి.విందు భోజనంలో ఎక్కువగా నూనె,మసాలాలు,నేతితో చేసిన తీపి పదార్ధాలు తింటాము.ఎంత తక్కువగా తిన్నాఆతర్వాత ఎంతో కొంత కడుపులో మంట వస్తుంటుంది.అటువంటప్పుడు ఉప్పు వేసిన మజ్జిగ తాగితే  తగ్గిపోతుంది.మాములుగా ఉప్పులేని మజ్జిగ తాగితే బి.పి అదుపులో ఉంటుంది.మజ్జిగ నేరుగా తాగే కన్నా కొంచెం కొత్తిమీర ,జీరా,అల్లం,పచ్చిమిర్చి,కొద్దిగా నిమ్మరసం వేసుకుని తాగితే రుచితో పాటు జీర్ణశక్తి మెరుగు పడటమేకాక  శరీరానికి చలువ చేస్తుంది. 

Thursday, 9 April 2015

చర్మానికి చల్లదనం

                                                  కొంచెం కీరదోస ముక్కల్ని మెత్తగా చేసి దానిలో కొంచెం తేనె,కొంచెం పాలు కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగేయాలి.ఈ విధంగా చేస్తే వేసవికాలంలో చర్మానికి చల్లదనం అందుతుంది. 

Wednesday, 8 April 2015

మంచి పద్ధతి

                                    తలుపు తెరిచి ఉంది కదా అని ఎంత తెలిసిన వాళ్ళ ఇల్లయినా నేరుగా లోపలికి వెళ్ళేకన్నా
కాలింగ్ బెల్ నొక్కడమో,పిలవడమో లేదా తలుపు కొట్టడమో చేయడం మంచి పద్ధతి.   

చర్మానికి మెరుపు

                                                         చెట్టున బాగా పండి రాలిపోయే దశలో ఉన్న బొప్పాయికాయ అయితే మరీ మంచిది.లేదంటే బాగా మెత్తగాఉన్న బొప్పాయి ముక్కలు మూడు,అనాస ముక్కలు మూడు,ఒకస్పూను తేనె కలిపి మెత్తగా చేయాలి.దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి.ఇలా చేస్తే చర్మానికి మంచి మెరుపు వస్తుంది.

Tuesday, 7 April 2015

బుడంకాయ

                                               కనకమ్మ చిన్నగా బుడంకాయ లాగా ఉంటుంది.భర్త ఆజానునుబాహుడి లాగా ఉంటాడు.కనకమ్మ చదువు తక్కువైనా తెలివిగలది.భర్తను చుట్టచుట్టి గుప్పెట్లో పెట్టుకుంది.భర్తనే కాక భర్త తరఫు
వారందరినీ తన అధీనంలో ఉంచుకోవాలని ఆమె కోరిక.ఒకళ్ళో,ఇద్దరో ఉన్నా అందరికీ ఆవిధంగా ఇష్టం ఉండదు కదా!అందుకోసం ఆమె తీవ్రంగా ప్రయత్నించేది.సంవత్సరానికొకసారి అత్తారింటికి వచ్చినప్పుడల్లా తను చేస్తున్నట్లుగా అందరూ అనుకోకుండా భర్తకు కీ ఇచ్చి వదిలేది.భర్త అందరితో మంచిగా మాట్లాడుతూనే నన్ను ఎవరూ లేక్కచేయడం లేదంటూ  ఏదోరకంగా తగువు పెట్టుకునేవాడు.ఆసమయంలో ఏనాడూ తిన్న పళ్ళెం కూడా కడగని కనకమ్మ వంటగదిలో కొచ్చి ఎక్కడలేని సంతోషంతో పచ్చడి చేస్తానని రోట్లోవేసి బండతో చకచకా నూరేది.మేనకోడలు కూతురు చిన్నది విచిత్రంగా చూస్తూ ఎదురుగా కూర్చుని పచ్చడి చేసేవిధానం ఆసక్తిగా చూస్తుండేది.ఒకటి,రెండుసార్లు గమనించి కనకమ్మ అందరూ  మాట్లాడేటప్పుడే ఎందుకు పచ్చడి చేస్తుంది?అని వాళ్ళమ్మను అడిగింది.కనకమ్మకు అదొక సరదా అని వాళ్ళమ్మ చెప్పింది.కనకమ్మ భర్త వెనకుండి ఇదంతా చేస్తుందని తెలిసినా,భార్య మాటవిని మాట్లాడుతున్నాడని తెలిసినా ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు.పాపం మనం కూడా మాట్లాడితే ఇద్దరి మధ్య నలిగిపోతాడని వదిలేసేవాళ్ళు.ఎవరూ ఎదురు మాట్లాడలేదు కనుక విజయం సాధించానని బుడంకాయ లాంటి కనకమ్మ,భర్తతోపాటు అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నానని  పరమానందపడేది.తర్వాత యధా రాజా తధా ప్రజా అన్నట్లు ఎవరి దోవ వాళ్ళదే.   

Monday, 6 April 2015

గ్రేవీ చిక్కగా .........

                                                        గ్రేవీ చిక్కగా,గుజ్జుగా ఉండటానికి సహజంగా కొబ్బరి లేదా కొబ్బరిపాలు కానీ 
ఉపయోగిస్తాము.సమయానికి అవి అందుబాటులో లేకపోతే పాలు,కొద్దిగా జీడిపప్పు కలిపి మెత్తగాచేసి వేస్తే గ్రేవీ చిక్కగా,రుచిగా ఉంటుంది.

కుడుము పూర్ణాలు

పచ్చిశనగపప్పు - 1 కప్పు
పంచదార - 1 1/4 కప్పు
పచ్చి కొబ్బరి - 1 చిప్ప
యాలకులు - 5
  పై పూత పిండికి కావలసినవి :
మినప్పప్పు - 1 కప్పు
బియ్యం - 2 కప్పులు
                               పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి ఉడికించాలి.ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. కుడుముల్లా చేసి ఆవిరిపై 10 ని.లు ఇడ్లీ కుక్కర్లో ఉడికించాలి.ఒక పళ్ళెంలో వేసి వేడిగా ఉన్నప్పుడే  పంచదార,యాలకులపొడి,కొబ్బరి కలిపి ఉండలు చేయాలి.ముందే పప్పు,బియ్యం కలిపి మధ్యరకంగా  రుబ్బి 6 గం.లు నాననివ్వాలి.ఒక్కొక్క ఉండ పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి వేగనిచ్చి పేపర్ పై వేసి నూనె లేకుండా ఒక డబ్బాలో సర్దుకోవాలి.అంతే,కుడుము పూర్ణాలు రెడీ.ఇవి బయట ఉన్నా 3 రోజులు నిల్వ ఉంటాయి.ఇవి చాలా రుచిగా ఉంటాయి. 

సాధ్యమైనంతవరకు .......

                                కాలక్షేపానికి ఎలక్రానిక్ వస్తువుల వాడకం సాధ్యమైనంతవరకు తగ్గించుకోవటం మంచిది.
  ఎలక్రానిక్ తెరనుండి  వచ్చేసన్నని వెలుగు మెదడుపై ప్రభావం చూపించి నిద్రకు దూరం చేస్తుంది.సామాజిక  మాధ్యమాలతో తలమునకలైపోయే యువత నిద్ర గురించి అసలు పట్టించుకోవటం లేదు.నాలుగు గం.ల కన్నా
 ఎక్కువ సమయం వీటితో గడిపితే సగం నిద్రను కోల్పోయినట్లే.ముందుముందు నిద్రపట్టక ఇబ్బంది పడాల్సిన
 పరిస్థితి వస్తుంది.వద్దని చెప్పినా అర్ధం చేసుకోలేని వయసు.చెప్పకుండా ఉండలేని పరిస్థితి.వాటితో సమయాన్నివృధా చేసుకునే కన్నాకనీసం  కొంతసేపైనా మనకోసం,మన కుటుంబంకోసం వెచ్చిస్తే సమాజంలో  ఉన్నతస్థితిలో ఉండవచ్చు.   

ముఖంపై ముడతలు

                                   కోపం వచ్చినప్పుడు సహజంగా ముఖవైఖరి,ముఖకవళికలు రకరకాలుగా మార్చేస్తూ ఉంటాము.అవే భవిష్యత్తులో ముఖంపై ముడతల రూపంలో బయటపడతాయి.కాబట్టి మనకు కోపం వచ్చినా నోటితో మాట్లాడాలి కానీ,కోపాన్ని ముఖంపై కనపరచకూడదు.సాధ్యమైనంతవరకు చీటికీమాటికీ కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటం,ఆలోచించటం అలవాటుచేసుకుంటే ఆరోగ్యానికి,అందానికి కూడా మంచిది. 

నల్లని వలయాలు

                                                 ఒక స్పూను తాజా టొమాటో రసంలో,ఒక స్పూను నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ రాయాలి.పావుగంట తర్వాత చల్లటి నీటితో కడగాలి.వారంలో రెండుసార్లు ఈవిధంగా చేస్తే
కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తగ్గిపోతాయి. 

Sunday, 5 April 2015

ఆనందంగా జీవితం

                                              ఆనందంగా జీవితం గడపాలంటే శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.అలా
ఉండాలంటే ముందు ఈ చిట్కాలు పాటించాలి.హాయిగా నవ్వండి.ఎదుటివారిని పలకరించేటప్పుడు నవ్వుతూ పలకరిస్తే వాళ్ళు కూడా దాన్నే అనుసరిస్తారు.నవ్వడంవల్ల మానసిక ఆనందం కలుగుతుంది.ఉన్నంతలో తాజాగా,అందంగా కనిపించాలంటే సరిపడా నిద్ర పోవాలి.తక్కువనిద్ర పోవడంవల్ల వయసుకన్నా పెద్దగా కనిపిస్తారు.చిన్నవయసులోనే ముఖంపై ముడతలు,మచ్చలు వంటి సమస్యలు ఎదురవుతాయి.వేళకు నిద్రపోతే అలసిన మనసుకి హాయిగా ఉంటుంది.సహజ సౌందర్యంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పచ్చటి మొక్కల మధ్య కాసేపు తిరిగి వీలయితే తోటపని చేయండి.మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది.సానుకూల ధృక్పదంతో ఆలోచిస్తే సమస్యలు చాలావరకు తగ్గుతాయి.కుదిరినప్పుడల్లా సేవచేయండి.వీలయినప్పుడల్లా చేతనైనంతవరకు సేవ అంటే దైవసేవ కావచ్చు లేదా మానవ సేవ కావచ్చుఏదైనా సేవచేయడంవల్ల మనసుకుసంతోషంగా,సంతృప్తిగాఉండి ఆరోగ్యంగా,ఆనందంగా ఉంటారు.హాయిగా ఉన్నంతలో తృప్తిగా,సంతోషంగా ఉండటం అలవాటుచేసుకుంటే ఆనందకర జీవితం మన స్వంతమవుతుంది. 

Saturday, 4 April 2015

నీ కొడుక్కి తెలియదా?

                                                 అవినాష్ కు ఐదు సంవత్సరాలు.కానీ మొద్దు పిల్లాడు.అక్కను చెలకొట్టనివ్వడు.
వాడి దగ్గరనుండి ఏమైనా తీసుకుందా?జుట్టు పట్టుకుని కొట్టేస్తాడు.వాడికి నచ్చనిది ఎవరైనా ఏమైనా ఇచ్చినా        నిర్మొహమాటంగా తిరిగి ఇచ్చేస్తాడు.ఒకరోజు వాళ్ళ అమ్మ స్నేహితురాలు చిన్న పిల్లాడు కదా ఒట్టి చేతులతో ఏమి వస్తాములే అని ఒక బొమ్మ తెచ్చింది.అది అవినాష్ కి నచ్చలేదు.అవినాష్ బొమ్మను తిరిగి ఆమెకు ఇచ్చేసి నీకంటే 
ఏమి బొమ్మ తీసుకురావాలో తెలియదనుకో?నీ కొడుక్కి తెలియదా?అన్నాడు. అమ్మ స్నేహితురాలు కొడుక్కి పది సంవత్సరాలు.అవినాష్ అలా మాట్లాడేసరికి ఆమెకు ఏమి మాట్లాడాలో అర్ధంకాలేదు.అలా చూస్తూ ఉండి పోయింది.  

మామిడికాయ పచ్చడి

మామిడికాయలు - 4
కారం - 4 టీ స్పూనులు
ఉప్పు - 3 టీ స్పూనులు
మెంతు పిండి - 2 1/2 టీ స్పూనులు
ఆవపిండి - 1 1/2 టీ స్పూను
పసుపు - 1 టీ స్పూను
వెల్లుల్లి పాయలు  - 2
నూనె - సరిపడా
                                    మామిడికాయలు చెక్కు తీసి సన్నగా చిన్న ముక్కలు కోసుకోవాలి.మెంతులు వేయించి పొడిచేసుకోవాలి.ఆవపిండిచేసుకోవాలి.మామిడికాయముక్కలు,ఉప్పు,కారం,మెంతుపిండి,ఆవపిండి,పసుపు,కొంచెం నూనె,వెల్లుల్లి  అన్నీ కలపాలి.వెల్లుల్లి దంచి వేయవచ్చులేదా కొంచెం దంచి,కొంచెం ముక్కలు వేసుకోవచ్చు.రెండు గం.ల తర్వాత ఒకసారి కలిపి సరిపడా నూనె కలిపితే రుచిగా ఉంటుంది.బయట పెట్టుకుంటే ఒక వారం రోజులు బాగుంటుంది.ఫ్రిజ్ లో అయితే ఒక 15 రోజులు బాగుంటుంది.
గమనిక:ఈ పచ్చడిలో వేయించిన వేరుశనగ పప్పుల పొడి కానీ,వేయించిన నువ్వులపొడి కానీ కలుపుకోవచ్చు.
విభిన్నంగా చేసుకోవాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రయత్నించవచ్చు.విభిన్న రుచులతో బాగుంటుంది.

Friday, 3 April 2015

ఇంటికి పట్టిన శని

                                        ప్రవీణ్ ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్తూ ఎంతో ముచ్చటపడి తనకు అనుకూలంగా అన్ని సౌకర్యాలతో కట్టుకున్న ఇంటిని ఖాళీగా ఉంచటం కన్నా ఎవరికైనా అద్దెకిస్తే శుభ్రంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అద్దెకి ఇచ్చాడు.ఇచ్చే ముందు ఇంటిని జాగ్రత్తగా,శుభ్రంగా ఉంచాలి అనే షరతుమీద తక్కువ అద్దెకు ఇచ్చాడు.మీరు ఎలా ఇచ్చారో అలాగే తిరిగి అప్పగిస్తానని మాట ఇచ్చాడు.సంవత్సరం తర్వాత ఒకసారి వెళ్తే ఇల్లు ఏమాత్రం శుభ్రంగా లేదు.ఇదేంటి?అంటే నావల్ల కాదండీ.వెళ్ళేటప్పుడు మీకు రంగు వేసిస్తానంటాడు.ఎవరికిచ్చినా అంతేలే చేయగలిగింది ఏమీ లేదు అని ప్రవీణ్ ఊరుకున్నాడు.కానీ ఆవీధిలోవాళ్ళు ప్రవీణ్ తో బంగారంలాంటి ఇంట్లో హోమాలు చేసి ఇల్లంతా పాడు చేస్తున్నాడు అని చెప్పారు.వెళ్ళి చూస్తే గచ్చు,గోడలు కూడా నల్లగా అయిపోయాయి.కోపంతో  ప్రవీణ్ ఇల్లు ఖాళీ చేయించాడు.రెండు లక్షలు ఖర్చుపెట్టి మళ్ళీ ఇంటికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు.ప్రక్క వీధిలోఉండే ఆయన కనిపించి మీ"ఇంటికి పట్టిన శని"వదిలింది.ఒట్టి దరిద్రుడికి ఇల్లు అప్పగించారు.హోమాలు చేసి ఇల్లు పాడు చేయటమే కాక చిన్నతుండుముక్క కట్టుకుని బయట అందరికీ కనిపించేలా స్నానం చేసేవాడు.ఆడవాళ్లు,పిల్లలకి చాలా ఇబ్బంది కలిగేది.ఖాళీ చేయించి మంచిపని చేశారు.మళ్ళీ ఇన్నాళ్ళకు పూర్వంలాగా ఇల్లు కళకళలాడుతుంది అని సంతోషంగా చెప్పాడు.      
    

కమలాతొక్కలు వృధాగా పడేయకుండా.....

                                       కమల ఫలం తిన్న తర్వాత పైతొక్కలు వృధాగా పడేయకుండా ఎండబెట్టి బాగాఎండిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడిచేసి ఒక డబ్బాలో పోసుకుని స్నానానికి ముందు కొంచెం పొడిలో పెరుగు కానీ,పాలుకానీ కలిపి ముఖానికి,మెడకు,చేతులకు రాసుకుని 10 ని.ల తర్వాత చల్లటి నీటితో కడిగితే శరీర ఛాయ మెరుగుపడి క్రమంగా చర్మం మృదువుగా తయారవుతుంది.ఎక్కువ సమయం ఉంటే శరీరమంతా వారానికి ఒకసారి పట్టించి చల్లటి నీటితో స్నానం చేయవచ్చు. 

అపోహ

                                            ఇడ్లీ పిండి మిక్సీలో వేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయని చాలామంది అపోహ.పిండి మెత్తగా రుబ్బే విధానంపై ఆధారపడి ఉంటుంది తప్ప దేనిలో రుబ్బినా ఒక్కటే.మినప్పప్పుగానీ,మినపగుళ్ళు కానీ 6 గం.లు
నానబెట్టాలి.నానబెట్టే ముందే శుభ్రంగా కడిగితే నిల్వఉండటానికి కలిపే మందుల ప్రభావం లేకుండా ఉంటుంది.నానిన తర్వాత రెండు,మూడు సార్లు కడిగితే సరిపోతుంది.మిక్సీలో వేసి సరిపడా ఉప్పు, నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
1:2 చొప్పున పప్పు,ఇడ్లీ రవ్వ వెయ్యాలి.మెత్తటి పిండిలో రవ్వ కడిగి కలపాలి.ఆ రెండు కలిపిన తర్వాత చేతితో 3,4 సార్లు పిండిని గుండ్రంగా,వేగంగా కలుపుతున్నట్లుగా చేస్తే త్వరగా పొంగుతుంది.10 -12 గం.లు బయటపెట్టినట్లయితే పిండి బాగా పొంగి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. 

Thursday, 2 April 2015

పునశ్చరణ

                                          భూమిత శెలవులకు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళింది.మధ్యాహ్నం భోజనంచేసిన తర్వాత  అమ్మమ్మ స్నేహితురాళ్ళు అందరూ అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చి చీరలపై రకరకాల డిజైన్లు కుట్టుకుంటూ   కబుర్లు చెప్పుకునేవారు.ఈ కబుర్లన్నీ ప్రక్కింటివాళ్ళు పునశ్చరణ చేసేవాళ్ళు.పొరుగింటి కిటికీ దగ్గర ఇంట్లోవాళ్ళు  ఎవరో ఒకరు కూర్చుని వీళ్ళు మాట్లాడే ప్రతిచిన్నమాట వదలకుండా ఇంకొకరికి చెప్పేవాళ్ళు.వాళ్ళు ఇంకొకరికి చెప్పి ఇంట్లో అందరూ చెప్పుకునేవాళ్ళు.వాళ్లకు అదొక దురలవాటు.భూమిత తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటూ  ఏమిటి అమ్మమ్మా?మీరు మాట్లాడే ప్రతీమాట ప్రక్కింట్లో నుండి మళ్ళీ వినపడుతుంది అంది.ఔనమ్మా!వాళ్లకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు.అందుకే అలా ప్రవర్తిస్తుంటారు.ప్రక్కింటి విషయాలు వినటం తప్పు.మళ్ళీ పక్కవాళ్ళకు చెప్పటం ఇంకో తప్పు.సంస్కారం లేనివాళ్ళకు చెప్పినా అర్ధం కాదు అంది అమ్మమ్మ.ఇకమీదట రహస్యంగా పక్కింటి వాళ్ళకు వినిపించకుండా మాట్లాడుకోండి అమ్మమ్మా!అంది భూమిత.మనం కూడా ఈతరంలాగా చరవాణిలో సందేశాలు పెట్టుకోవాలేమో?హ్హ హ్హహ్హ అంటూ మేలమాడారు అమ్మమ్మ స్నేహితురాళ్ళు.

అల్పాహారం తినక ముందు

                                       రోజూ అల్పాహారం తినక ముందు వ్యాయామం చేస్తే కొవ్వు నిల్వలు కరిగి బరువు తగ్గటానికి ఆస్కారముంటుంది.చురుగ్గా శరీరం ఎటు అంటే అటు కదులుతుంది. అల్పాహారం తిన్న తర్వాత వ్యాయామం చేసిన కన్నా తినక ముందు చేయటమే అన్ని విధాలా శ్రేయస్కరం. 

నిద్రలేచే విధానం

                                              తెల్లవారుఝామున నిద్రలేస్తే మంచిది.ఆసమయంలో ధ్యానం,పూజ,యోగా,ఏపని చేసినా ఆతర్వాత చేసే పనికన్నా ఎక్కువ ఫలితం పొందవచ్చు.నిద్ర లేచేటప్పుడు ప్రశాంతంగా లేవాలి.కంగారుగా ఆందోళనతో లేవకూడదు.మనం నిద్రలేచే ముందు ఏవిధంగా లేస్తే ఆరోజంతా అదేవిధంగా ఉంటుంది.ప్రశాంతంగా నిద్రనుండి మేల్కొన్న తర్వాత రెండు అరచేతుల్ని చూచి కళ్ళపై పెట్టుకోవాలి.అరచేతుల్లో దేవతలుంటారు.తర్వాత  దేవుని ఫోటోచూడవచ్చు.క్రిందికి దిగే ముందు మనం కాళ్ళతో భూదేవిపై నడుస్తుంటాము కనుక రెండు చేతులతో భూదేవుని తాకి కళ్ళకద్దుకుని నమస్కరించుకుని అమ్మా!మాపాదస్పర్శను మన్నించమ్మా!అంటూ నిద్రలేవాలి.వస్తే శ్లోకాలు చదువుతూ చేసుకోవచ్చు.లేకపోయినా పైవిధంగా చేయవచ్చు.తర్వాత దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలి.

Wednesday, 1 April 2015

చీమల మందు

                                                        నీరజ స్కూల్లో చదువుకునే రోజుల్లో తోటి విద్యార్ధిని తరగతిలో అందరినీ నాకు కొంచెం చీమల మందు తెచ్చిపెట్టరా?అని అడిగేది.ఎందుకు?అని అడిగితే తిని చచ్చిపోతాను అనేది.చచ్చిపోవాల్సిన అవసరం ఏమిటి?అంటే ఆమె చెప్పినది వింటే మనకు చాలా చిన్న కారణంగా అనిపిస్తుంది.కానీ ఆమెకు చాలా బాధ కలిగించే పెద్ద కారణం.అదేమిటంటే ఆమె మోచేతులు గరుకుగా,నల్లగా ఉన్నాయట.అది ఎలా పోతుందో తెలియక దిగులుతో అందరినీ అలా అడుగుతుంది.అప్పుడు అందరూ చిన్నపిల్లలే.ఏమిచెప్పాలో తెలిసేది కాదు.ఆమె అడుగుతుంటే బాధగా ఉండి నీరజ వైద్యుని దగ్గరకు వెళ్ళు అని సలహా ఇచ్చింది.ఇప్పుడు నిమ్మకాయను చూచినప్పుడల్లా ఆమె గుర్తు వస్తుంటుంది.నిమ్మ చెక్కపై కొంచెం తేనె అద్ది మోచేతులపై రోజూ10 ని.లు రుద్దితే గరుకుదనం,నలుపుదనం పోయి చేతి చర్మం రంగులోకి వస్తుంది.