Tuesday, 24 July 2018

మౌనమే మనకు శ్రీరామరక్ష

                                                        ఈమధ్య చదువుకున్న పిల్లలు కూడా చిన్నచిన్న వాటికి గొడవ పడి విడాకులు వరకు వెళ్లి కాపురాలు కూల్చేసుకుంటున్నారు.దానికి తోడు పెద్దల వత్తాసు.వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళను రెచ్చగొట్టడం అంత అవసరమా?మన కాపురం బాగుండాలి.మన స్వార్ధం కోసం పిల్లల కాపురం చెడిపోయినా ఫర్వాలేదు అన్నట్లుగా ఉంటున్నారు కొంతమంది.ఓపిక ఉండగానే కష్టపడకుండా పిల్లల మీద వాలిపోయి గొడవలు సృష్టిస్తున్నారు. మారోజుల్లో నేను మీఅమ్మను కొట్టాను.నువ్వు కూడా నీభార్యను కొట్టు అనడం సమంజసమా? ఇంత చేసి చెప్పిన వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు అరవై ఏళ్ళు వచ్చినా ఒక్కపూట కూడా విడిగా ఉండలేరు.వినేవాళ్ళు ఉంటే చెప్పుడు మాటలు కొంతమంది మంచిచెడు ఆలోచించకుండా చెప్తూనే ఉంటారు.పిల్లలు ఏదన్నా  తెలిసో తెలియకో గొడవ పడి  మాట మాట పెరిగి పోట్లాడుకుంటే సర్దిచెప్పి వాళ్ళ కాపురం చక్కదిద్దాల్సింది పోయి గొడవ పెద్దది చెయ్యడం సంస్కారమేనా?ఎంతవరకు సబబు?నేనే గొప్ప నాకన్నీ  తెలుసు అనుకోవటం తప్ప అక్కడ ఏమీలేదు.ఈరోజుల్లో కూడా బయట ఉద్యోగం చేసి,ఇంటెడు పని చేసి ఇంటిల్లిపాదికీ సపర్యలు చేయాలంటే కష్టం కదా!అందరూ కలసి మెలసి తలా ఒక పని చేసుకుంటేనే సంసారం చూడ ముచ్చటగా ఉంటుంది.కాపురం అన్న తర్వాత ఒకరికొకరు సర్దుకుని ఒకరిమాట ఒకరు వింటుంటే,భార్యాభర్తలు ఇద్దరి మధ్య వేలు కూడా పెట్టలేనంతగా వివాహబంధం గట్టిగా ఉన్నప్పుడు ఎవరెన్ని గొడవలు పెడదామనుకున్నా ఎవరూ ఏమీ చేయలేరు.అసలు చెప్పుడు మాటలు వినటమంత తెలివి తక్కువ తనం మరొకటి ఉండదని అర్ధం చేసుకోవాలి.వాటివల్ల లేనిపోని తలనొప్పి తెచ్చుకోవటమేకానీ,లాభం ఏమీ ఉండదని,మంచి మాటలు తప్ప ఏది ఎవరు చెప్పినా అందులో మంచి,చెడు ఆలోచించకుండా  చెప్పినవన్నీ విని గొడవలు పడకూడదని తెలుసుకోవాలి.తమ స్వంత తెలివితేటలను ఉపయోగించి  స్వతంత్రంగా ఆలోచించి తమ పండంటి సంసారాన్ని పచ్చగా ఎలా  నిలబెట్టుకోవాలో ఎవరికి వారే నేర్చుకోవాలి.భార్య,పిల్లలుతల్లిదండ్రులు,అత్తమామలు,అక్కచెల్లెళ్ళు,బావమరుదులు,అన్నవదినలు,ఎవరికిచ్చే ప్రాముఖ్యత వారికి ఇచ్చి గుడ్డిప్రేమతో ఎదుటి వారి మాటలు వినకుండా మన సూటీన మనం పోతే ఆ సంసారం హుందాగా,చూడ చక్కగా ఉంటుంది.మాటామాటా పెరిగినప్పుడు ఒకరి కొకరు వాదించుకుని ఆ మాటలు మనసును గాయపరిచి తర్వాత బాధపడేకన్నా ఆసమయంలో కాసేపు మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు.అప్పుడు ఆ మౌనమే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది.మౌనంగా ఉన్నంత మాత్రాన ఎదుటివారికి తలొగ్గినట్లు కాదు.మౌనంగా గుడ్లు మిటకరించి చూస్తావేమిటి?అనేవాళ్ళు ఉన్నారు.ఆవేశంలో మాట తూలడం సహజం.ఆ మాటను మరల వెనక్కు తీసుకోవడం కష్టం.కనుక ఒకరికొకరు అరుచుకుని గొడవ పెద్దది చేసుకుని నీదే తప్పు అంటే నీదే తప్పు అనుకునే కన్నామౌనంగా ఉండడంఇద్దరికీ,అందరికీ కూడా మంచిది.ఎవరి వారు ఎదుటి వాళ్ళదే తప్పుగా కనపడొచ్చు.కానీ ఇద్దరిలో ఎంతో కొంత తేడా ఉంటేనే గొడవ మొదలవుతుంది.వీరావేశం తగ్గిన తర్వాత గొడవ ఎందుకు వచ్చింది?ఎవరిదీ లోపం అనే దాని గురించి ఆలోచించి విపులంగా మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేసి విడాకుల వరకు వెళ్ళకుండా వాళ్ళవాళ్ళ లోపాలు సరిదిద్దుకుంటే సంసారాలు పచ్చగా ఉంటాయి.ఇల్లు,సంసారం,మనసు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి.ఇంతకీ చాలాసార్లు అసలు కారణం అంటూ ఏమీ లేకుండానే చిన్నచిన్న వాటినే పెద్దది చేసుకుంటారు.తీరిగ్గా ఆలోచిస్తే ఏమీ ఉండదు.వడ్ల గింజలో బియ్యపు గింజ తప్ప.ఇప్పటి తరం కాస్త కోపం,తొందరపాటుతనం తగ్గించుకుని  చెప్పుడు మాటలు వినకుండా ఉంటే సంసారాలు పచ్చగా బాగుంటాయి.

Monday, 23 July 2018

బామ్మ చెప్పిన కాకర కాయ కబుర్లు

                                               కాకర కాయ పేరు చెప్పగానే చాలామంది ముఖం చిట్లించి చేదు పుట్ట మేము అసలు తినము అంటూ ఉంటారు.కాకరకాయ చేదు అన్నమాటే కానీ పోషక విలువల పరంగా ఎన్నో ప్రయోజనాలున్న అమృత తుల్యమైన కాయ.చాట భారతం ఎందుకని అన్నీ  చెప్పటం లేదు.వర్షాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే కాకర కాయ తప్పనిసరిగా తినాలి. కాకర కాయతో చేదు తెలియకుండా రకరకాల వంటలు చేయవచ్చు.కాకరకాయ అంటే నా కెంతో ఇష్టం అంటూ బామ్మ చెప్పిన కాకరకాయ కబుర్లు.అఖిల ఒకరోజు బామ్మ క్షేమ సమాచారాలు తెలుసుకుందామని టెలిఫోను చేసింది.కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఏమి కూరలు  వండావు మనవరాలా?అంది బామ్మ.నీకు ఇష్టమైన కాకరకాయ చేశాను బామ్మా!అనగానే ఎంతో సంతోషంగా తనకు ఎంత ఇష్టమో చెప్పడం మొదలుపెట్టింది బామ్మ.నా చిన్నప్పుడు మాకు కాకర తోటలు ఉండేవి.వాటితో మా అమ్మ కాకర కాయ బెల్లం వేసిన అంట(చిక్కటి)పులుసు,ఇగురు,కొద్దిగా ఉడికించి ఎండలో పెట్టి చేసిన వేపుడు,పప్పుల పొడులు దట్టించి చేసిన కాయ కూర,వెల్లుల్లి,ఎండు మిరపకాయలు నూరి చేసిన కూరలు ఇష్టం అని రోజూ కాకరకాయ కూర లేనిదే ముద్ద దిగేది కాదని చెప్పింది.ఆఖరికి ఆకుల మీద కూర్చున్నప్పుడు కూడా పేచీ పెట్టి కాకరకాయ కూర పెడితేనే ఏదైనా తింటానంటే తప్పక మా అమ్మ పెట్టింది.నాకు ఇష్టం అనే కాదమ్మా!ఎవరైనా కాకరకాయ సరిగ్గా వండుకుని తింటే ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి ఎంతో మంచిది.నేను ఈరోజు ఇంత గట్టిగా ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా,ఎనభై అయిదు ఏళ్ళు ఉన్నా నాపని నేను చేసుకుంటున్నానంటే అదే కారణం.అన్నట్లు మీ ఆయనకు,పిల్లలకు కూడా కాకరకాయ తినడం అలవాటు చెయ్యి అని బామ్మ అఖిలతో చెప్పింది.తప్పకుండా చేస్తాను.ఉంటాను బామ్మా అంటూ అఖిల ఫోను పెట్టేసింది.

Sunday, 22 July 2018

తొలి ఏకాదశి శుభాకాంక్షలు

                                           నా బ్లాగ్ వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు,మన తెలుగు వారందరికీ ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు,పాడిపంటలు సమృద్దిగా సమకూరాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.


                                             
డి విటమిన్ సమృద్దిగా .......

                                                                          ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ సరిపడా ఉండాలి.ఎముకలు విరగకుండా ఉండాలంటే ఉదయం,సాయంత్రం ఎండలో కాసేపు ఉండవోయ్!అంటూ మిత్రులు సలహాలు ఇచ్చేస్తుంటారు.సలహా ఇచ్చారని కాదుగానీ నిజంగానే లేలేత ఎండ మన శరీరానికి చాలా మంచిది.సూర్య కిరణాలు మన శరీరానికి తగలగానే చర్మం దానంతటదే డి  విటమిన్ తయారు చేసుకుంటుంది.దీనితోపాటు డి విటమిన్ సమృద్దిగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి.పాలు,చేపలు,గుడ్లు,పుట్టగొడుగులు,వెన్న మన  ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకోవాలి.విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండడమే కాక పేగుకాన్సర్ బారి నుండి కూడా తప్పించుకోవచ్చు. 

Tuesday, 17 July 2018

కాలక్షేపంతోపాటు ఆరోగ్యం

                                                                               బుల్లితెర చూస్తూ కాలక్షేపం చేసేటప్పుడు ఖాళీగా కూర్చోకుండా పనిలో పనిగా చిన్న చిన్న వ్యాయామాలు కాళ్ళు,చేతులు ఉపయోగించి చేసేవి చేసుకుంటే రెండు విధాలా వినోదం,ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.నవ్వుతున్నట్లుగా పెదవుల్ని సాగదీసి రెండు చేతులతో బుగ్గలను కింది నుండి పైకి కళ్ళ వైపు తోస్తున్నట్లుగా చేయాలి.ఇలా ఏడు,ఎనిమిది సార్లు చేస్తుంటే చర్మం బిగుతుగా మారి బుగ్గలపై ముడతలు రాకుండా ఉన్న వయసు కన్నా తక్కువగా కనిపిస్తారు.కుర్చీలోనో,సోఫాలోనో కూర్చునే కాళ్ళు,చేతులు ముందుకు చాపి వెనక్కు మడవటం,గుండ్రంగా తిప్పడం,గుప్పిట మూయడం,తెరవడం చేస్తుంటే చేతి వేళ్ళ కండరాలకు కూడా వ్యాయామం చేసినట్లవుతుంది.మెడ,కళ్ళు,నోరు ఇలా ఎవరి వీలుని బట్టి వాళ్ళు తోచిన విధంగా అన్ని రకాల వ్యాయామాలు చేయవచ్చు.కాలక్షేపంతోపాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

దంతాలు శుభ్రంగా......

                                                                   మనం రోజూ సబ్బుతో శుభ్రంగా స్నానం చేసినా సరే  అప్పుడప్పుడు నలుగు పెట్టుకోనిదే మురికి వదలనట్లుగా పళ్ళు,దంతాలు రోజు పేస్ట్ తో బాగా రుద్ది కడిగినా కానీ పళ్ళపై ఎంతో కొంత మనకు తెలియకుండానే పాచి ఉంటుంది.అందుకే రోజూ  పళ్ళు తోముకునేటప్పుడు పేస్ట్ తోపాటు కొంచెం కలబంద గుజ్జు వేసుకుని రుద్దుకుంటే పళ్ళు,దంతాలు శుభ్రంగా ఉంటాయి. 

Thursday, 12 July 2018

చుబుకం కింద కొవ్వు కరగాలంటే ......

                                                               మనలో చాలామందికి చుబుకం కింద కొవ్వు పేరుకుని మందంగా లేదా చర్మం వేలాడుతూ ఉంటుంది.ఈ కొవ్వు కరగాలంటే మనం నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించిన విధంగా నీళ్ళు లేకుండా గాలితోనే బుగ్గలను అటూ ఇటూమార్చిమార్చి ఒక నిమిషం పాటు చేసి కాస్త విరామంతో మళ్ళీ చేయాలి.ఇలా నాలుగైదు సార్లు చేయాలి.దీనితో పాటు మెడ దగ్గర రెండుచేతులు పెట్టి కింద నుండి పైకి  గడ్డం వరకు ఒకదాని తర్వాత ఒకటి పైకి అంటూ చేయగలిగినన్ని సార్లు చేస్తూ ఉంటే వేలాడే చర్మం బిగుతుగా మారుతుంది.చూడటానికి మెడ దగ్గర లావుగా కానీ గంగడోలు మాదిరిగా వేలాడుతూ కానీ లేకుండా ముఖం,మెడ  అందంగా ఉంటుంది.

Wednesday, 11 July 2018

ఘన నివాళి

                                                                                     ఆడపిల్ల అన్నాక కూసింత అక్షరజ్ఞానం ఉండాలి అనేది రామతులశమ్మ గారి వాదన.ఇది యాభై సంవత్సరాల క్రితం మాట.ఆశ్చర్యంగా ఉంది కదూ!ఇది నిజం.ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు,ఇద్దరు మగ పిల్లలు.ఆమెకు చదువంటే చాలా ఇష్టం.మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను కూడా చదివించాలని కోరిక.ఆ రోజుల్లో వాళ్ళ ఊరికి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు.బడికి పంపాలంటే చాలా దూరం నడిచి వెళ్ళాలి.లేదంటే నగరంలోని బడికి పంపి వసతిగృహాల్లో పెట్టాల్సిందే.రామతులశమ్మ గారు పిల్లలు నడిచి వెళ్ళడం కష్టం కనుక రెండో దానివైపు మొగ్గి భర్తను ఒప్పించి నగరంలో పేరుమోసిన పాఠశాలలో చేర్చారు.అప్పటికి ఒప్పుకుని పిల్లలను నగరంలోని బడిలో చేర్చినా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక భర్త తరపు కుటుంబీకులు ఆడపిల్లలను నగరంలో చదివించడం అవసరమా?అంటూ భర్తను ఒత్తిడి చేసేసరికి ఆయన కొంచెం మెత్తబడేవారు.తులసీ అంత డబ్బు ఖర్చు పెట్టి ఆడ పిల్లలను అంత దూరం పంపించడం ఎందుకు?ఇంటికి తీసుకొచ్చేద్దాము అనేవారు.రామతులశమ్మ గారు పిల్లలను ఎలాగైనా చదివించాలనే పట్టుదలతో తనకు పుట్టింటివారు ఇచ్చిన పొలం కౌలు డబ్బులు తనకోసం ఖర్చుపెట్టుకోకుండా పిల్లల చదువుల కోసం వెచ్చించి చదివించింది.అమ్మా!మీరు బాగా చదువుకుని మీకున్న అక్షరాజ్ఞానాన్ని నలుగురికీ పంచాలి అని తల్లి చెప్పటంతో పిల్లలు కష్టపడి చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు.చిన్నమ్మాయి బాగా తెలివి కలది, చురుకైనది.ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే బడికి వచ్చే వారికి మాత్రమే పాఠాలు చెప్పగలము అని సామాజిక సేవ చేయాలనే ఉద్దేశ్యంతో తన చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే వారికి చదువు ప్రాధాన్యతను వివరించి ప్రభుత్వం తరఫున ఉన్న పధకాల గురించి అనేకసార్లు తల్లిదండ్రులకు  చెప్పి ఒప్పించి ఎలాగైనా పిల్లలను చదివించేలా ప్రోత్సహిస్తుంది.ముఖ్యంగా ఆడవాళ్లకు పొదుపు పధకాల గురించి చెప్పి వాటివల్ల పొందే లాభాలు,వాటిని సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి అని వివరించి,వారికి చేతివృత్తులు నేర్పించి ఆదాయమార్గాన్ని సూచిస్తుంది.ఇంతటితో ఊరుకోక ప్రభుత్వం నుండి కూడా వారికి అన్నీ సక్రమంగా  అందేలాగా చూస్తుంది.ఇదంతా చెయ్యడానికి చాలా కష్టపడినా ఇప్పుడు అందరికీ ఆమె ఆరాధ్య దైవం.నేను ఈరకంగా మాట్లాడి ఇవన్నీ చేస్తున్నానంటే అమ్మ ప్రసాదించిన అక్షరజ్ఞానం.ఇదంతా అమ్మ చలవ అంటుంది చిన్నమ్మాయి సునీత.అమ్మ చనిపోయిన సందర్భంగా స్నేహితుల వద్ద బాధపడుతూ ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పాటు చదువుకుని ఉద్యోగం చేసి తమకంటూ ఆదాయం సమకూర్చుకోవాలన్న తపనను  గుర్తుచేసుకుని  కన్నీళ్ళు పెట్టుకుంది.అనుకోకుండా చిన్నకొడుకు విదేశాలకు వెళ్ళడంతో ఆ అవకాశం సునీతకు దక్కింది.తర్వాత కొడుకు అయ్యో అమ్మా!నేను సమయానికి దగ్గర లేకపోయనే అంటూ ఉన్నపళానా పరుగెత్తుకుని వచ్చాడు.ఎంతో బాగా చూసుకునే కొడుకు దగ్గర లేడనే బాధ తప్ప చివరి పదిరోజులు పనివాళ్ళు ఉన్నా చిన్నకూతురు సమక్షంలో,కూతురి సేవలతో తృప్తిగా కన్ను మూసింది.అదే అమ్మ ఆత్మకు శాంతి.అమ్మ ఋణం ఎవరూ తీర్చుకో  లేనిది.కూతురుగా సునీత అమ్మకు సేవచేసి అమ్మ ఋణం కొంతైనా తీర్చుకుంది.సునీత మాత్రమే కాదు.చివరి రోజుల్లో ఎంత మంది ఉన్నా పిల్లలు దగ్గర ఉన్న దారి వేరు.సాధ్యమైనంతవరకు మనమందరమూ కూడా తల్లిదండ్రుల ఋణం కొంతైనా తీర్చుకుంటే మనకు పెద్దవాళ్ళకు కూడా సంతృప్తిగా ఉంటుంది.అదే ఘన నివాళి.తర్వాతి కార్యక్రమాలు ఎంత ఘనంగా చేశామన్నది ముఖ్యం కాదు.

Monday, 9 July 2018

స్వల్ప ప్రయత్నం

                                                                  పునాది రాయి వేస్తేనే కదా!ఇల్లు కట్టగలిగేది.అలాగే ఏ పని చేయడానికైనా స్వంత ప్రయత్నం చేస్తేనే దేన్నైనా సాధించగలరు.అసలు ప్రయత్నమే చేయనప్పుడు ఎంత గొప్పవాడైనా,ఎన్ని తెలివితేటలు,ఎంత గొప్ప ఆలోచనలున్నా ఏమీ సాధించలేరు.ప్రయత్నానికి ఉన్న శక్తి చాలా గొప్పది.అమ్మో!ఈ పని మన వల్ల అవుతుందో లేదో? మనం చేయగలమో లేదో? అని ప్రతికూల ధృక్పదంతో ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పనీ చేయలేరు.ఏదీ అనుకున్నది సాధించలేరు.కనుక ధర్మబద్దమైన ఆలోచనలతో,సానుకూల దృక్పధంతో,పట్టుదలతో ప్రయత్నించి ఏ చిన్న పని తలపెట్టినా స్వల్ప ప్రయత్నంతో అది విజయవంతమై తాము కన్న కలల్ని సాకారం చేసుకుని అనుకున్నది సాధించగలరు. 

చిన్న సగ్గుబియ్యం పకోడి/బొండా

                                                             సగ్గుబియ్యం అనగానే సహజంగా సగ్గుబియ్యం పాయసం చటుక్కున గుర్తొస్తుంది.కానీ సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు.ప్రస్తుతం పకోడీ లేదా బొండా ఎలా తయారు చేసుకోవచ్చో,అందుకు ఏ పదార్ధాలు కావాలో  చూద్దాము.
         
               చిన్న సగ్గుబియ్యం - 1/2 కప్పు
                   చిక్కటి పెరుగు - 1/2 కప్పు
                   బొంబాయి రవ్వ - 1/2 కప్పు
                బియ్యప్పిండి - 1/2 కప్పు పైన 
                ఉల్లిపాయలు - 2 పెద్దవి
                అల్లం తురుము - 2  చెంచాలు
          పచ్చిమిర్చి తురుము - 4 చెంచాలు
                       ఉప్పు  - సరిపడా
          నూనె  -  వేయించడానికి సరిపడా
                                                                          ముందుగా పెరుగు గిలకొట్టి దానిలో సగ్గుబియ్యాన్ని  ఆరు గంటల పాటు నానబెట్టాలి.బాగా నానిన తర్వాత బియ్యప్పిండి,బొంబాయిరవ్వ,ఉల్లిపాయ
పకోడీకయితే పొడవుగా,బొండాలకయితే సన్నగా చిన్న ముక్కలు తరిగి అల్లం,పచ్చిమిర్చి తురుము,ఉప్పు వేసి పకోడీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.అవసరమయితే కొంచెం పెరుగు కలుపుకోవచ్చు.పొయ్యిమీద బాణలిలో తగినంత నూనె పోసి బాగా కాగిన తరాత దానిలో పిండిని పకోడీకయితే సన్నగా పొడవుగా బొండాలకయితే కొంచెం ఎక్కువ పిండితో గుండ్రంగా వేసుకోవాలి.బంగారు రంగు వచ్చేవరకు వేయించి వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ,టమోటా చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.

Thursday, 5 July 2018

మెదడు చురుగ్గా

                                                                 అల్పహరంతో పాటు చిన్న కప్పు హిమ క్రీము అదేనండీ ఐస్ క్రీమ్ తింటే మెదడు చురుగ్గా పని చేస్తుందట.హిమ క్రీము ఇష్టమైన వాళ్ళు పిల్లలు,పెద్దలుకూడా ఇప్పటి నుండి నిరభ్యంతరంగా తినవచ్చు.  

Tuesday, 3 July 2018

నమిలే జిగురు(చూయింగ్ గమ్)

                                                                              ఇంతకుముందు రోజుల్లో అయితే పిల్లలు,పెద్దలు కూడా కాలక్షేపం కోసం మధ్యాహ్నం,సాయంత్రం బఠాణీలు,వేయించిన శనగలు,మరమరాలు నములుతూ ఉండేవాళ్ళు.ఇప్పుడయితే పిల్లలు,పెద్దలు కూడా నమిలే జిగురు(చూయింగ్ గమ్)నములుతూ కనిపిస్తున్నారు.విదేశాలలో అయితే దాదాపు అందరూ చూయింగ్ గమ్ ఎప్పుడూ  నములుతూనే కనిపిస్తుంటారు.వాళ్ళు కాలక్షేపం కోసం నమిలినప్పటికీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు కూడా చెప్తున్నారు.నమిలేదేదో చక్కర లేని చూయింగ్ గమ్ నమలడం ఆరోగ్యానికి మంచిది.దీన్ని నమలడం వల్ల దంతాలపై ఉండే పాచి పోవడమే కాక ఒత్తిడి తగ్గి మెదడు నరాలకు రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.నడక వేగం పెంచితే గుండె వేగం పెరుగుతుంది.కనుక వృద్దులు మరీ వేగంగా నడవక పోవడమే మంచిది.ఏదైనా నమిలే జిగురు నములుతూ నడవడంతో నడక వేగం కూడా పెరిగి తెలియకుండానే ఎక్కువ దూరం నడవగలుగుతారు.దీనితో అదనపు బరువు అదుపులో ఉండి మానసికంగా,శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది.మధ్య వయస్కులు చక్కెర లేని నమిలే జిగురు నమలడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే

                                                            మన రోజువారీ ఆహారంలో భాగంగా తాజా కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మన స్వంతం అవుతుంది.కాలానుగుణంగా లభించే వాటిని తాజాగా వీలయితే ఇంట్లోనే పండించుకుని తినగలిగితే మనకు సరిపడా పోషక పదార్ధాలు సమకూరి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లో వుంటుంది.దీనికోసం మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు.మనకు ఉన్నంత స్థలంలోనే నేలమెడ కానీ కుండీలలో కానీ,సంచుల్లో కానీ ఎప్పటికప్పుడు ఆకుకూరల విత్తనాలు చల్లుకోవచ్చు.చిన్న కుండీలో కూరగాయల విత్తనాలు చల్లి కొద్దిగా పెద్ద అయిన తర్వాత పెద్ద కుండీలలో పెట్టుకోవచ్చు.పండ్ల మొక్కలు తక్కువ ఎత్తులో విరివిగా కాసేవి తెచ్చి పెంచుకోవచ్చు.సొర,బీర,పొట్ల,కాకర వంటి తీగ జాతి మొక్కలను తొట్టిలో విత్తనాలు పెట్టి కాస్త తీగ వచ్చిన తర్వాత తాడుకట్టి పైకి పాకించవచ్చు.తెగుళ్ళు రాకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న   వేప కాషాయం, వెల్లుల్లి కాషాయం,లవంగాల కషాయం వంటివి చల్లుకుంటే పురుగుల బెడద లేకుండా ఉంటుంది.రసాయనాలు చల్లకుండా రసాయన రహిత తాజా ఇంటి పంట మన స్వంతం అవుతుంది.రుచికరమైన ఆకుకూరలు,కాయగూరలు,పండ్లు వాడుకోవచ్చు.దీనితోపాటు రోజు ఉదయం,సాయంత్రం ఒక అరగంట మొక్కలలో తిరిగితే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.స్వంతంగా మన చేతి మీదుగా మొక్కలను పెంచి,పోషించి  అవి మనకు అందించిన ఆకులు,కాయలు,పండ్లు కోస్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషం.ఆ రుచి,ఆ సంతృప్తి ఎంతో విలువైనది.వీటితోపాటు పువ్వుల మొక్కలు వేసుకుంటే తోట అందంగా ఉంటుంది.సంవత్సరం పొడుగునా వాడుకోవటానికి వీలుగా  విత్తనాలు ఎప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.

దానిమ్మ తొక్కల ఉపయోగం

                                                                 మనం సహజంగా దానిమ్మకాయ వలిచినప్పుడు గింజలు తినేసి తొక్కలు పారేస్తుంటాము.ఇక ముందు అలా చెత్తలో పడేయకండి.దానిమ్మ తొక్కలను ఒక పళ్ళెంలో పలుచగా పేర్చి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వాలి.బాగా ఎండిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకుని మూత గట్టిగా ఉన్నసీసాలో పోసి పెట్టుకోవాలి.ఒక చెంచా పొడి లో కొద్దిగా నిమ్మ రసం పిండి ముఖానికి రాసుకుని 20 ని.ల తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం మీదున్న మొటిమలు,మచ్చలు మాయమైపోతాయి.మరికొంత మందికి చిన్న వయసులోనే ముఖంపై ముడుతలు వచ్చి ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తుంటారు.అలాంటప్పుడు ఒక చెంచా పొడిలో కొద్దిగా పాలు కలిపి ముఖానికి పట్టించి 20 ని.ల తర్వాత ముఖం కడగాలి.ఇలా తరచుగా చేస్తుంటే ముడతలు మాయమై దానితోపాటు ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది.దానిమ్మ పొడి వాడడం వలన ఎండ వేడి,కాలుష్యం వలన చర్మంపై వచ్చే ఇతర సమస్యల నుండి కూడా తప్పించుకోవచ్చు.