మోహనరావు కొడుకు అంతంత మాత్రం తెలివితేటలు కలవాడు.అందుకని వరుసకు మనవరాళ్ళు అయిన ఉమ,సుమ ఇద్దరిలో ఒకరిని కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నాడు.అసలే మోహనరావుకు మహా డబ్బు పిచ్చి.అందువలన బుద్దిమంతురాలైన ఉమను వదిలేసి డబ్బుతోపాటు మొండితనం జాస్తిగా ఉన్నసుమను ఎంచుకున్నాడు.తన గొయ్యి తనే తవ్వుకున్నట్లు ఇంట్లో అడుగు పెట్టిన నాటినుండి పిచ్చివేషాలు వేయడం మొదలెట్టింది.రోజూ మోహనరావు వడిలో కూర్చున్నట్లు కూర్చుని కోతి గారాలు పోతూ ఖరీదు గల బట్టలు,నగలు,చరవాణి ఒకటేమిటి?బజారులో ఏది క్రొత్తగా వస్తే అది కావాలని కొనకపోతే అలిగి ఇల్లు పీకి పందిరి వేయడం మొదలు పెట్టింది.మోహనరావు కోడలు గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక ఎక్కడ కొడుకును వదిలేస్తానంటుందోనని కాళ్ళబేరానికి వచ్చి బ్రతిమలాడుతుండేసరికి నెత్తికెక్కి కూర్చుంది.చివరకు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు వెళ్ళినా అలిగి మూతి ముడుచుకుంటుంది.చిన్న వయసు పోనీలే తనే తెలుసుకుంటుందని ఊరుకుంటే అర్ధం చేసుకోవటం లేదు.గోరంత దాన్ని కొండంత చేసి ఊరిలో అందరూ కథలు కథలుగా చెప్పుకోవటం విన్న మోహనరావు అమ్మకు చిర్రెత్తుకొచ్చింది.కొడుకు దగ్గరకు వెళ్ళి కుండ ముయ్ మూత(మట్టి మూకుడు) ఉంటుంది కానీ నోరు ముయ్య మూత ఏమి ఉంటుంది?ఎవరి నోరు అని ముయ్యగలం?సుమ పిచ్చి వేషాలు వేస్తుంటే కట్టడి చేయాల్సింది పోయి నువ్వు కూడా తానంటే తందాన అని బ్రతిమిలాటలు,వెర్రి వేషాలు ఏమిటి?అంటూ కోప్పడింది.మనవరాలు వరుస కదా!కాస్త అతి చనువుతో అలా చేస్తుంది.అదే తెలుసుకుంటుందిలే!అన్నాడు మోహనరావు.
No comments:
Post a Comment