చిన్నప్పటి నుండి చూడచక్కగా,అందంగా ఉండే వామాకు అంటే బజ్జీలు వేసుకుంటారని అవి తినటానికి ఎంతో రుచిగా ఉంటాయని మాత్రమే తెలుసు.వామాకు వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని ఈమధ్యనే పెదమ్మ కూతురు అక్క ద్వారా తెలిసింది.ఇంటికి రాగానే ఎదురుగా కుండీలో నిండుగా వామాకు నిగనిగలాడుతూ పచ్చిదే తిలానని అనిపించేలా ఉంది.అక్క ఇంటికి వస్తూనే వామాకుని రోజూ వాడుకోవా ఏమిటి?అంది.రోజూ వామాకు బజ్జీలు ఏమి తింటాము?అనగానే అక్క భలేదానివే!దీన్ని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంది.నేరుగా పచ్చి ఆకు తింటే పైత్యం ఉండదు. నేను ఆకుల్ని సన్నగా ముక్కలు కోసి,ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి దోసె పిండిలో కలిపి అట్లు వేస్తాను.ఎంత రుచిగా బాగుంటాయో!అంటూ మాట్లాడుతూనే ఒక ఆకు గిల్లి నోట్లో వేసుకుని పరపరా నమిలేస్తూ చెప్పింది.అంతే కాదు కారట్,వామాకు,కొద్దిగా నీళ్ళు కలిపి మిక్సీ లో వేసి రసం తీసి వడకట్టి తాగితే కంటి చూపు మెరుగు పడుతుందని,కారట్,పాలకూర,వామాకు,కొంచెం నీళ్ళు కలిపి రసం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని,కారట్,దానిమ్మ,వామాకు,కొద్దిగా నీరు కలిపి రసం తీసుకుని తాగితే నరాల బలహీనత తగ్గుతుందని,ఇలా ఒక కూరగాయ,ఒక పండు,ఆకుకూర,వామాకు కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చాంతాడంత చిట్టా చెప్పింది.అన్ని రకాల పోషకాలు శరీరానికి అంది బరువు అదుపులో ఉండటంతో ఏ వ్యాధులు రాకుండా శారీరకంగా,మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని,శరీర సౌందర్యం కూడా పెరుగుతుందని అక్క చెప్పింది.కొమ్మ విరిచి గుచ్చినా వామాకు మొక్క వస్తుంది.కుండీలో తేలికగా పెంచుకోవచ్చు.పైగా దీని వాసనకు దోమలు కూడా పారిపోతాయని అక్క చెప్పింది.
No comments:
Post a Comment