Thursday, 8 October 2020

కోడలు వస్తోందోచ్

                                              ఇంద్ర నీల ఉన్నట్లుండి  ఒకరోజు స్నేహితురాళ్ళను,దగ్గర బంధువులను ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేసింది.ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇంత అకస్మాత్తుగా ఇంద్ర నీల అందరినీ ఎందుకు పిలిచి ఉంటుందబ్బా ! అని రకరకాల ఉహాగానాలు చెయ్యడం మొదలెట్టారు.వచ్చిన అతిధులందరికీ అల్పాహారం,పండ్ల రసాలు ఇచ్చిన తర్వాత కాసేపటికి ఇంద్ర నీల మాకు కోడలు వస్తోందోచ్ అని ప్రకటించింది.అంతకు ముందు వరకు గలగల మాట్లాడుతున్న వారందరూ ఒక్కసారిగా మాటలు ఆపేశారు.కాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.ఈ వార్త వినగానే కొంతమంది ముఖాలు నల్లగా అట్టు మాడినట్లు మాడిపోయాయి.స్నేహితుల్లో,బంధువుల్లో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ అమ్మాయిని  ఇంద్ర నీల ఇంటికి కోడలిగా పంపితే బాగుంటుంది అనే  ఆలోచనతో ఉండడంతో ఎవరికీ నోట మాట రాలేదు.కాసేపటికి కొంత మంది తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అభినందనలు తెలిపారు.కొంత మంది మూతి మూడు వంకరలు త్రిప్పుతూ కోడలు వస్తుందని సంబరపడడం కాదు.కోడలు వచ్చిన తర్వాత కానీ తెలియదు.ముక్కు ముఖం తెలియనిదాన్ని తెచ్చుకుంటే ఎలా ఉంటుందనేది? అని ఇంద్ర నీలకు వినిపించేలా చిన్నగా  గుసగుసలాడడం  మొదలు పెట్టారు.ఇవన్నీ విన్న ఇంద్ర నీల మనం మన పిల్లలతో పాటు వచ్చే కోడలితో కూడా అంతే ప్రేమగా ఉంటే కోడలు కూడా మనతో అంతకన్నా ఎక్కువ ప్రేమతో కూడిన గౌరవంతో ఉంటుంది.ఈ తర్కం తెలిసిన అత్తాకోడళ్ళ అనుబంధం అపురూపంగా ఉంటుంది.అత్త ఒక రాక్షసి,కోడలు ఒక గడసరి అనే అపోహలు తొలగించుకుని అందరూ ఒకరికొకరు ప్రేమభావంతో మెలగడం అందరికీ శ్రేయోదాయకం.అప్పుడు అందరి ఇళ్ళు ప్రశాంత నిలయాలే అవుతాయి అని చెప్పింది ఇంద్ర నీల.అవును ఇంద్ర నీల చెప్పిన తర్కం చాలా బాగుంది అంటూ చాలామంది తమ మద్దతు తెలిపారు.అందరూ ఒకరినొకరు అర్ధం చేసుకుని ఏ గొడవలు లేకుండా ఆనందంగా ఉంటే  మమతానురాగాలు పెరిగి అనుబంధాలు బలపడతాయి అనుకున్నారు.మొదటే ఈ విధంగా అనుకుని ఉంటే ఇంద్ర నీలకు ఇంతసేపు  చెప్పాల్సిన పని ఉండేది కాదు.పోనీలే ఇప్పటికయినా అర్ధం అయినందుకు సంతోషం అనుకుంది మనసులో ఇంద్రనీల.

No comments:

Post a Comment