Friday 20 November 2020

అనుభూతుల సమ్మేళనం

                                                                    మొన్నామధ్య ఒక పెద్దాయన కలిసినప్పుడు మాటల సందర్భంలో ఏమిటర్రా!ఇలా యంత్రాల్లా తయారయిపోతున్నారు.ఎంతసేపూ ప్రక్కన మనిషి ఉన్నా పట్టించుకోకుండా చరవాణి చూడడమో,బుల్లి తెర లో వచ్చే ధారావాహిక చూస్తూ దానిలో నటించే వాళ్ళు నవ్వితే  నవ్వడం,ఏడిస్తే మీరు ఏడవడం తప్ప నిజంగా ఏడుపు వస్తే ఏడవలేరు.నవ్వు వస్తే నవ్వలేరు.ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అనే భయం.యాంత్రికంగా జీవితం గడిపేస్తున్నార్రా! మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా.జీవితం అంటే మనకోసం మనం సంతోషంగా బ్రతకాలి.ఇరుగు పొరుగుతోనూ,నలుగురితో కలిసి మెలసి ఉండాలి.ఎవరికి ఏ ఆపద వచ్చినా సాధ్యమైనంత వరకు మాటసాయం కానీ ఆర్ధికంగా కానీ  సహాయం చేయాలి.చేయలేకపోతే చేసేవాళ్ళకు సమాచారం చెప్పాలి.ఇంతెందుకు?ఇంట్లో సభ్యులు అందరూ ఒకచోట కూర్చుని ఏనాడైనా  కబుర్లు చెప్పుకున్నారా ? అందరూ ప్రశాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు కదరా! మనసు విప్పి కబుర్లు చెప్పుకుని హాయిగా నవ్వుకుంటుంటే బంధాలు బలపడడమేకాక మానసికంగా మాటల్లో  చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది.ఆ అనుభూతి కలగాలంటే మీకు కొంచెం సమయం పడుతుందిలే .ప్రయత్నిస్తే సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు.ఇప్పటి నుండి అయినా ఈ యాంత్రిక జీవనానికి స్వస్తి పలికి ప్రకృతికి దగ్గరగా ఉండండి.జీవితం అంటే యాంత్రికం కాదు.అది ఒక అనుభూతుల సమ్మేళనం అని గుర్తించండి.ప్రతి చిన్న విషయాన్నీ మనసుతో ఆస్వాదిస్తూ,మమతతో ఉంటూ చిన్ననాడు ఎంత సంతోషంగా ఉన్నారో అంతే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి.మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఏ  అనారోగ్యాలు దరిచేరవు.ఇప్పటి నుండి మనకెందుకులే అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనండి.మానసికంగా శారీరకంగా చక్కటి ఆరోగ్యం స్వంతమవుతుంది.   

No comments:

Post a Comment