సబ్జా గింజలు రుద్ర జడ అనే మొక్క నుండి తీస్తారు.ఈ మొక్కలు ఇంతకు ముందు రోజుల్లో అందరి ఇళ్ళల్లో ఉండేవి.వీటి కంకులు ఎండిన తర్వాత గింజలు సేకరించి నిల్వ చేసుకునేవారు.ఇవే సబ్జా గింజలు.వేసవి రాగానే ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం ఇంట్లో అందరికీ అమ్మ,అమ్మమ్మ,నానమ్మలు రోజుకొక రకంగా నిమ్మరసంలో కానీ,సేమ్యా ,సగ్గుబియ్యం పాయసంలో కానీ,ఏదేని పండ్ల రసంలో కానీ ,పాల ఐస్ తయారీలో కానీ నానిన సబ్జా గింజలు ఒక చెంచా వేసి కలిపి ఇచ్చేవారు.ఇప్పుడు ఇంకా చాలా రకాల వాటిల్లో ఉపయోగిస్తున్నారు.ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాక వేసవిలో దేనిలో కలిపి తీసుకున్నా కూడా రుచితోపాటు చలువ చేస్తుంది.కొద్దిగా ఉప్పు,పటిక బెల్లం పొడి,ఒక చెంచా నానబెట్టిన సబ్జా గింజలు ఒక గ్లాసు చల్లటి నీటిలో కలిపి తీసుకున్నా రుచికరంగా ఉంటుంది.ఇది పిల్లలు అందరికీ ఎంతో ఇష్టమైన పానీయం.వేసవిలో తాటి ముంజెలు,మామిడి కాయలు,సీమ తుమ్మకాయల కోసం పిల్లలు,పెద్దలు ఎదురు చూచినట్లే చాలామంది ఈ పానీయం కోసం ఎదురు చూస్తుంటారు.
No comments:
Post a Comment