Wednesday 27 July 2016

బిచ్చగాళ్ళలో మార్పు

                                                               శ్రీవాత్సవ్ ఎంబిఎ చదివి ఎంఫిల్ చేస్తున్నాడు.దానిలో భాగంగా అతను బిచ్చగాళ్ళలో మార్పు తీసుకొచ్చి కష్టపడి పని చేసుకుని స్వతంత్రంగా బతికేలా చేయాలనే సంకల్పంతో స్వంత ఊరు వచ్చి చుట్టుపక్కల ఉండే ఒక ఇరవై మందిని ఒకచోట చేర్చాడు.మీరు అందరి ముందు చేయి చాచి డబ్బు అడగడం తప్పు.మీరు కష్టపడి పని చేసుకుని ఆడబ్బుతో తింటే ఆ సంతోషం వేరు.అందుకు నేను సహాయం చేస్తానని చెప్పినా ఒక నెల వరకు వాళ్ళల్లో మార్పు రాలేదు.ఇంట్లోవాళ్ళు,స్నేహితులు,చుట్టుపక్కలవాళ్ళు ఆఖరికి వాళ్ళ ప్రొఫెసర్ కూడా నీవల్ల కాదు వాళ్ళు మారరు అని నిరుత్సాహపరిచారు.అయినా ఇంత చదువు చదువుకుని ఉద్యోగం చేసుకోక వాళ్ళ చుట్టూ తిరగటం ఏమిటి?అని తల్లిదండ్రులు గొడవ చేయడం మొదలెట్టారు.అయినా పట్టు వదలని విక్రమార్కుడి లాగా ఓపికగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి తన మాటలతో ఎలాగైతే ఒక ఐదుగురిలో మార్పు తేగలిగాడు.ఒక చేయి లేకపోయినా వాళ్ళల్లో ఒకతను రిక్షా తొక్కి తన బ్రతుకు తను బ్రతుకుతూ సంతోషంగా ఉన్నాడు.అదే తన తొలి విజయంగా భావించి మిగతా అందరిలో కూడా మార్పు తేగలననే నమ్మకంతో తనే ఒక సంస్థను స్థాపించి వాళ్ళందరికీ పని ఇచ్చి,పునరావాసం కల్పించి ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించాలని తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి వాళ్ళ కోసం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు.అందరి ఛీత్కారాలు భరిస్తూ వచ్చే డబ్బుతో ఊరికే తిని తిరిగే కన్నా కష్టపడి సంపాదించిన డబ్బుతో వచ్చే విలువ,ఆనందం వాళ్ళకు తెలియచేసి బిచ్చాగాళ్ళలో  మార్పు తీసుకురావాలని తపన పడుతున్నాడు.ఈవిషయంలో కుటుంబ సహకారం కానీ,స్నేహితుల సహాయ సహకారాలు కానీ లేకపోయినా శ్రీవాత్సవ్ ఒంటరిగా పట్టుదలతో తను అనుకున్నది సాధించగలననే నమ్మకంతో తన వంతు కృషి చేస్తున్నాడు.

No comments:

Post a Comment