లక్ష్మణ్,లక్షణ ఇద్దరు భార్యాభర్తలు.ఎక్కడకు వెళ్ళినా ఇద్దరూ ఎప్పుడూ జంట పక్షుల మాదిరిగా కలిసే వెళ్తారు.వాళ్ళకు ఇద్దరు పిల్లలు.పిల్లలు చిన్న వాళ్ళయినా అబ్బాయిని మంచి స్కూల్లో చదివించాలని ఊహ తెలిసినప్పటి నుండి హాస్టల్లో పెట్టారు.అమ్మాయిని అమ్మ దగ్గరో,అత్త దగ్గరో వదిలేసి ఎక్కడంటే అక్కడకు వెళ్ళిపోయేవాళ్ళు.అందుకే ఇద్దరు బాగానే చదువుకున్నాపిల్లలకు,పెద్దలకు ప్రేమాభిమానాలు ఉన్నా అంతగా బలపడలేదు.అబ్బాయి విదేశాలలో ఉన్నాడు.అనుకోకుండా అమ్మాయి విదేశాలకు వెళ్ళింది.ఇక్కడ ఉన్నప్పుడే ఒక బిడ్డ పుట్టాడు.అక్కడకు వెళ్ళాక ఇంకో బిడ్డకు జన్మనివ్వడంతో సమస్య మొదలయింది.నాన్నకు రావడానికి వీలుపడదు అని చెప్పినా సరే అమ్మను తన వద్దకు రావాల్సిందేనని పిల్లలతో ఇబ్బందిగా ఉందని ఆరు నెలలు తన దగ్గర ఉండాలని మంకు పట్టు పట్టుకుని కూర్చుంది.ఒకసారి వాయిదా వేసినా రెండోసారి లక్షణకు వెళ్ళక తప్పింది కాదు.వెళ్ళే సమయం దగ్గర పడుతున్న కొద్దీ భర్త తీరిక దొరకగానే వస్తానని ఎంతగా నచ్చచెప్పినా ఇటు భర్తను వదిలి ఉండలేక,ఒంటరిగా వెళ్ళడం ఇష్టంలేక దిగులుతో నాలుగురోజుల ముందు నుండి అన్నం కూడా తినడం మానేసింది.కాలం ఆగదు కదా!వెళ్ళే రోజు రానే వచ్చింది.విమానాశ్రయం లోపలకు వెళ్ళేవరకు భర్తను అంటిపెట్టుకుని అతని చేతిని వదలకుండా చివరకు ఏడ్చేసింది.భార్య ఏడుపు చూచి భర్తకు కూడా ఏడుపు వచ్చేసింది.మిగతా వాళ్ళకు విషయం అర్ధం కాకపోయినా వీళ్ళతో వచ్చిన వాళ్ళకు మాత్రం ఈ జంట పక్షులు నడివయసు వచ్చినా ప్రేమపక్షుల మాదిరిగా ఒకరినొకరు వదిలలేనట్లుగా వెళ్తుంటే వీళ్ళు విడివిడిగా అన్ని రోజులు ఎలా ఉండగలరో ఏంటో?అనిపించింది.పిల్లలు కూడా వాళ్ళ అవసరమే ముఖ్యం అనుకోకుండా పెద్దల మనోభావాలు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.పెద్దలు కూడా పిల్లల అవసరాలు గుర్తించి మసులుకుంటే సమస్యలు ఉండవు.సాధ్యమైనంత వరకు పెద్దలైనా,పిల్లలైనా ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోనేలా ఉంటే ఎవరి గౌరవం వాళ్ళు దక్కించుకున్నట్లు అవుతుంది.
No comments:
Post a Comment