Tuesday 9 October 2018

జాంపండు

                                                                        స్నిగ్ద కళాశాలలో డిగ్రీ చదువుకునే రోజుల్లో మొదటి సంవత్సరం సెలవుల అనంతరం కళాశాల తెరిచిన మొదటి రోజు అది.రెండవ సంవత్సరంలో ఒకళ్ళు ఇద్దరు కొత్త మొహాలు తప్ప అందరూ పాతవాళ్ళే.చాలా రోజుల విరామం తర్వాత అందరూ ఎవరి స్నేహితులతో వాళ్ళు సంబరంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా తెల్లగా,గుండ్రంగా,అందంగా అప్పుడే చెట్టు నుండి తెంపిన నిగనిగలాడే మగ్గిన జాంపండు లాగా ఉన్నఅమ్మాయి బెరుకుగా తరగతి గదిలోనికి ప్రవేశించింది.అందరూ ఒక్కసారిగా కబుర్లు ఆపి ఆశ్చర్యంగా ఆమెవైపు ఒకసారి చూసి మళ్ళీ ఎవరి మచ్చట్లలో వాళ్ళు మునిగిపోయారు.ఎవరితో కూర్చోవాలో,ఎక్కడ కూర్చోవాలో తెలియక ఆమె బెదురు చూపులు చూస్తుంది.ఇంతలో స్నిగ్ధ ఆమెను తన స్నేహబృందం లోనికి ఆహ్వానించింది.ఒకరికొకరు పరిచయాల అనంతరం తన పేరు అరుణ అని తనకు ఒక నెల రోజుల క్రితమే పెళ్ళి అయిందని,అత్తగారిల్లు కళాశాలకు దగ్గరలోనే కనుక ఇక్కడ చేరానని చెప్పింది.తనకు చదువు అంటే ఎంతో ఇష్టం అని చెప్పటంతో భర్త,అత్తమామలు చదువుకోమని ప్రోత్సహించారని ఆనందంగా చెప్పింది.పెళ్ళైపోయింది కనుక ఇంట్లోనే కూర్చో అంటారేమోనని తన చదువు ఎక్కడ ఆగిపోతుందోనని మొదట భయపడ్డానని కానీ ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళని సంతోషంగా చెప్పింది.అలా జాంపండు స్నిగ్దకి ప్రాణ స్నేహితురాలయింది. 

No comments:

Post a Comment