Monday, 1 April 2019

మరువం మధురం

                                                                      చిన్నప్పుడు వారిజ ఇంటి చుట్టూరా నలువైపులా అన్ని రకాల మొక్కలు ఉండేవి.మల్లె పందిరి ప్రక్కనే ఒక పెద్ద మడిలో మరువం,చిన్న మడిలో ధవనం ఉండేవి.ఆ రోజుల్లో మరువం,ధవనం మొక్కలు అందరి ఇళ్ళల్లో ఉండేవి కాదు.వారిజకు ధవనం కన్నా మరువం వాసన బాగుంటుంది.మరువం కొమ్మలు పెరిగి క్రిందికి వాలగానే ఆ కొమ్మలపై కొద్దిగా మట్టి పెడితే ఇంకో మొక్క అయ్యేది.అలా చెయ్యడం వారిజకు ఎంతో ఇష్టంగా  సరదాగా ఉండేది.ఇంటికి వాటిని చూడడానికి స్నేహితురాళ్ళు,ఇరుగుపొరుగు పిల్లలు వచ్చేవాళ్ళు.తన ఇంట్లో మాత్రమే మరువం ఉన్నందుకు వారిజకు ఒకింత గర్వంగా కూడా ఉండేది.అప్పట్లో వేసవి వచ్చిందంటే చాలు ఊరిలో ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా మేము ముందంటే మేము ముందనిమరువం,పువ్వుల కోసం పోటిపడి మరీ పూలజడ వేసుకునేవారు.పూలజడకు ప్రత్యేకంగా పొడుగు కదా ఉండే దొంతర మల్లెపువ్వులు,మరువం,కనకాంబరాలు వారిజ ఇంటి నుండే అందరూ తీసుకెళ్ళి వేసుకునేవాళ్ళు.వారిజకు మరువం గురించి చదవగానే ఆనాటి మధురస్మృతులు గుర్తొచ్చాయి.ఎటువంటి తలనొప్పి అయినా మరువం ఆకులు వాసన చూడగానే యిట్టె తగ్గిపోతుందని,తలలో పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదని పెద్దవాళ్ళు అనుకునేవారు.ఇది ఒక ఔషధ మొక్క అని, దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఈ మధ్యనే ఒక పుస్తకంలో వారిజ చదివి ఆశ్చర్యపోయింది.ఇప్పుడు వారిజ ఎన్నిసార్లు తెచ్చి పెట్టినా మరువం మొక్కని బ్రతికించలేకపోతుంది.ఆకు వాసనతో నిద్ర బాగా పడుతుందని ఒక కప్పు నీళ్ళల్లో కొద్దిగా మరువం ఆకులు వేసి మరిగించి త్రాగితే ఆడవాళ్ళ నెలసరి సమస్యలన్నీ తగ్గిపోతాయని, మధుమేహం,గుండె జబ్బులు వంటివి దరిచేరవని,రక్త ప్రసరణ వేగం అదుపులో ఉంటుందని వైద్యులు తెలియచేస్తున్నారు.వెంకటేశ్వరస్వామికి కూడా తులసిమాల,దళాలతో  పూజ చేసినట్లే మరువంతో కూడా  చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుందని పెద్దలు తెలియ చేస్తున్నారు.ఏదేమైనా తనకు ఎంతో ఇష్టమైన మరువం మధురం అంటుంది వారిజ.   

No comments:

Post a Comment